నారి సారించిన నవల 

-కాత్యాయనీ విద్మహే 

5

1929 లో ప్రచురించబడిన ‘చంపకమాలిని’ నవల వ్రాసిన  ఆ. రాజమ్మ అప్పటికే తిరువళిక్కేణి లేడీ వెల్డింగ్ డన్ ట్రైనింగ్ కాలేజీలో  సంస్కృత అధ్యాపకురాలు. సంస్కృత కన్నడ భాషలలో చంద్రమౌళి, మధువన ప్రాసాదము మొదలైన రచనలను చేసింది. ‘చంపకమాలిని’ చారిత్రక నవల. జనమంచి సుబ్రహ్మణ్య శర్మ ఈ నవలను  పరిష్క రించారు. ఆంధ్రనారీమణులకు ఈ నవల అంకితం చేయబడింది. గొప్ప కుటుంబంలో పుట్టినవారు గానీ, మరేవరుగానీ స్త్రీలు వాళ్ళకుగల స్వాతంత్య్రాన్ని చతురతతో ఉపయోగించుకొనాలన్నది  ఈ నవల రచనోద్దేశం. అలా ఉపయోగించుకొని విజయం సాధించిన ఇద్దరు స్త్రీల కథ ఈ నవల. వాళ్ళు తల్లీ కూతుళ్లే కావటం విశేషం. 

ఈ నవల లో కథ ప్రవర్తించే స్థలం ఉదయపూర్. కథాకాలం మేవార్ అధిపతి పృథ్వి రాజ్ చౌహాన్ రాజస్థాన్ లోని చిన్నరాష్టాలను జయిస్తూ అక్కడి నుండి గుజరాత్,తూర్పు పంజాబ్ వరకు ఆక్రమించి అజ్మీర్ , ఢిల్లీ రాజధానులుగా పరిపాలించిన కాలం.అంటే పన్నెండవ శతాబ్ది రెండవ అర్ధభాగం. అజ్మీర్,ఢిల్లీ అతనికి మాతామహుని నుండి వారసత్వంగా వచ్చాయి అని ఒక కథనం, లేదు అతని తండ్రి సోమేశ్వరుడినుండే వారసత్వంగా వచ్చిందని మరొక కథనం చరిత్రలో ప్రచారంలో ఉన్నాయి. రాజమ్మ  మాతామహుడి నుండి సంక్రమించింది అన్న వాదాన్ని స్వీకరించి కథ నడిపింది. ఆ మాతామహుడు అర్కపాలుడు లేదా మూడవ అనంగపాలుడు. అతను ఢిల్లీని పరిపాలిస్తున్న కాలంలోనే ఈ నవలేతివృత్తపు పూర్వకథ ప్రవర్తిస్తుంది. ఈ కథ ఏమిటో మిత్రానందుడి ముఖంగా తెలియచేసింది రచయిత్రి. 

అనంగపాలుడి సమకాలికుడు, సన్నిహితమిత్రుడు ప్రతాపసింహదేవుడు ఉదయపూర్ రాజు. అతనికి రత్నదేవి వలన జన్మించిన కొడుకు విక్రమసింహదేవుడు. ఆరేళ్లవయసులో తల్లిని కోల్పోయాడు. అనంగపాలుడు ప్రతాపుడిపై వత్తిడి తెచ్చి మురళాదేవి తో వివాహం జరిపించాడు. ఆమెతోపాటు ఆమె తమ్ముడు మదనపాలుడు కూడా ఉదయపూర్ వచ్చాడు. విక్రమసింహదేవుడి ఈడువాడే కావటంవల్ల ఇద్దరికీ స్నేహం ,సహ విద్యాభ్యాసం కూడా సమకూడాయి. విక్రమసింహుడికి గ్వాలియర్ రాజపుత్రిక హేమప్రభతో పెళ్లి అయింది. యువరాజ పదవి లభించింది. ఒక కూతురు కూడా జన్మించింది. అప్పుడు వచ్చింది ఒక పెద్ద ప్రమాదం. తండ్రిని హత్యచేశాడన్న నేరం మోపబడి డిల్లీ రాజుల విచారణలో అది ధృవీకరించబడి మరణశిక్ష విధించబడింది. అతనిని ఎవరో చెరనుండి తప్పించటం, బిడ్డను తీసుకొని అతను రత్నద్వీపం చేరి అక్కడివారికి సన్నిహితుడై  భూములు సంపాదించి పూలతోటలు,పండ్లతోటలు పెట్టి నౌకా వ్యాపారంలోకి దిగి సంపదను అభివృద్ధి చేసుకొని స్థిరపడటం పూర్వకథ. అది అట్లాగే స్థిరంగా ఉంటే అసలు అది కథ ఎట్లా అవుతుంది? దానిలో చలనం కలిగించటానికే మాళవ దేశ రాజపుత్రుడు లలితకుమారుడుని తీర్థయాత్రల నెపంగా కాశీ గయ ప్రయాగాల మీదుగా నౌకా యానం ద్వారా రత్నదీవిలో ప్రవేశపెట్టింది రాజమ్మ. 

  సముద్రపు బందిపోటు ముఠా నుండి రక్షించి ఇందిర, ఇంట్లో వుంచుకొని   వైద్యం చేసి ఆమె తండ్రి మిత్రానందుడు అతనికి ప్రేమాస్పదులు కావటం అటుంచి, తన గురించి పరిచయంచేసుకొనే క్రమంలో చెప్పిన ఉదయపూర్ సంగతులు ,హేమప్రభాదేవి సంగతులు, ఇందిరను ప్రేమిస్తున్నానని పెళ్లాడటానికి అనుమతించమని కోరిన కోరిక  మిత్రానందుడిలో కలిగించిన కలవరం కథలో తొలి కదలికను నమోదుచేశాయి. ఆమెకు ఉన్న ఒక కళంకం తొలగనిదే పెళ్లి సాధ్యంకాదని తండ్రి చెప్పటం,తొలగించుకొన్న తరువాతే పెళ్లి అని విశ్వాసాన్ని ప్రకటించి లలితకుమారుడు రత్నద్వీపం వదలటం, ఆ తరువాత                                                                                                                                                                      దొంగల నాయకుడు చంద్రసేనుడు ఇందిరను పెళ్లిచేసుకొందామని కోరటంతో ఇక అక్కడ ఉండటం తమకు శ్రేయోదాయకం కాదని తండ్రీ కూతుళ్లు రహస్యంగా అక్కడనుండి బయటపడటం – మొదలైనవి కథలో చలనానికి కావలసిన బీజాన్నివేశాయి. ఇక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. 

లలితుడితో పెళ్ళికి అభ్యంతర పెడుతూ తండ్రి  కళంకిత అని తన గురించి చెప్పిన మాట లోలోపల కలిగించిన సంఘర్షణ నుండి ఇందిర దానికి కారణాలు వెతుక్కొంటూ , కానని నిరూపించుకొనటానికి ఆచరణ రంగంలోకి దిగటానికి సిద్ధపడుతూ తండ్రితో చేసిన సంభాషణ వల్ల, అతను చెప్పిన పూర్వకథవల్ల ఆమెకు అర్ధమైంది ఏమిటంటే తన కళంకం తొలగటం  తన తల్లిదండ్రుల కళంకాలు తొలగటం తో ముడిపడి ఉన్నదని. వాటిని తొలగించ వలసిన బాధ్యత తనదే అని. ఉదయపూర్ కు మారువేషంలో వెళ్లి అసలు రహస్యం కనిపెట్టడానికి కృత నిశ్చయురాలై తండ్రిని ఒప్పించటం తో నవలలో కథ ఒక ఉత్కంఠా పూరితమైన మలుపు తిరుగుతుంది. 

హేమప్రభ భర్త జాడ తెలియకుండా పోయినతరువాత ఉదయపూర్ లోనే అంతకు ముందే తన తండ్రి కట్టించిపెట్టిన రాజభవనం వంటి భవనంలోకి మారిపోయి ఉండటం, మురళాదేవి తమ్ముడు మదనపాలుడిని దత్తు తీసుకొని రాజును చేయటం, విక్రమాంకదేవుడు రాజశిక్షకు వెరచి ఎటూ వెళ్ళిపోయాడు కనుక, ఆమె కూతురు కూడా పులివాత పడి మరణించింది కనుక మదనపాలుడితో ఆమెకు వివాహం జరిపితే ఆమె సంపదలు కూడా మదనపాలుడి సంపదలో కలిసిపోతాయన్న ఊహతో మదనపాలుడిని అందుకు ప్రోత్సహించటం- అతను తరచు ఆమె భవనానికి వచ్చి వెళుతుండటం, ఆమె అలంకరణలు, మృదుభాషణలు – ఇవన్నీ మదన పాలుడికి హేమప్రభకు ఇవ్వాళో రేపో పెళ్లి అన్న అభిప్రాయవ్యాప్తికి కారణం అయ్యాయి. భర్త దేశాంతరగతుడైన స్త్రీ మరొక పెళ్ళికి సిద్ధపడటం సమాజంలో  కళంకిత లక్షణమే. తల్లి ఆ రకంగా కళంకిత. పితృహంతకుడన్న కళంకం తండ్రిది. ఈ రెండిని శోధించి సత్యం బయటపెట్టటానికి ఇందిర పురుషుడివేషంలో ఒక వ్యాపారబృందం తో కలిసి వెళ్లి, హేమప్రభ అంతఃపురానికి పూలదండలు తీసుకొనివెళ్లే వృద్ధురాలి ఆశ్రయం పొంది, అక్కడి నుండి హేమప్రభకు సేవకురాలిగా అంతఃపుర ప్రవేశం చేసి, ప్రత్యక్షం గా భర్త కోసం, బిడ్డకోసం ఆమె ఎంత పరితపిస్తున్నదో తెలుసుకొని, మదనపాలుడితో మంచిగా ఉండటం అనేది రాజా గ్రహానికి గురికాకుండా ఏనాటికైనా భర్తను కలుసుకోలేకపోతానా అన్న ఆశతో ఎదురుచూసే వ్యూహమే తప్ప మరొకటి కాదని గ్రహిస్తుంది. తాను ఆమె కూతురిని అన్న విషయం తల్లి గ్రహిస్తున్నదని తెలిసినా కార్యనిర్వహణ పర్యంతం రహస్యాన్ని కాపాడుతూ తల్లిని ధైర్యంగా ఉండమని హెచ్చరిస్తూ వచ్చిన వ్యక్తిత్వం ఆమెది.   

అక్కడినుండి మురళాదేవి సేవకురాలిగా అసలు రాజభవనం చేరి తండ్రి హంతకుడు కాదన టానికి కావలసిన ఆధారాలు సేకరించడంలోనూ , మురళాదేవి ,ఆమె అంతరంగికుడు ఫల్గుణుడు తనను ఎంత అనుమానిస్తూ వున్నా ,వాళ్ళ కళ్ళు గప్పుతూ,  కల్పించిన ప్రమాదాల నుండి బయటపడుతూ తార వంటి సేవకులను ఆంతరంగికులుగా చేసుకొంటూ, లలితకుమారుడి సహాయంతో ఢిల్లీ పాలకుడు పృధ్వి రాజు ను ఉదయపూర్ రప్పించి తండ్రి నిరపరాధి అని నిరూపించటంలో ఆమె చాతుర్యం చక్కగా చిత్రించబడింది ఈ నవలలో. తల్లితండ్రులను కలిపి పూర్వపు సుఖస్థితిలో వాళ్ళను నిలిపిన ఆదర్శ తనయ ఆమె. పుట్టినప్పుడు తాత ప్రతాపసింహుడు ఆమెకు  పెట్టిన పేరు చంపకమాలిని. తన కొడుకు తరువాత ఆమె రాజ్యాధికారిణి కావాలన్నది కూడా ఆ తాత అభిలాష. ఆమె బుద్ధిబలం , కుట్రను భగ్నం చేయటంలో చూపిన పట్టుదల దానికి తగినట్లుగానే ఉన్నాయి.

  భార్య మదనపాలుడిని పెళ్లాడుతుందన్న వదంతులు విని,  పులి ఎత్తుకుపోయినట్లు నమ్మించే ఆధారాలు వదలి రెండేళ్ల చిన్న బిడ్డను తనతో తీసుకొని వెళ్లిన విక్రమసింహదేవుడు శరీరపు రంగు మార్చే మూలికల రసం పూసుకొని, తనపేరు మిత్రానందుడు అని , కూతురి పేరు ఇందిర అని మార్చి అజ్ఞాతంలో జీవితం గడిపిన కాలం ఇక గతం అయిపొయింది. కుట్రదారుడు ఫల్గుణునికి ఢిల్లీశ్వరుడు ఉరిశిక్ష అంటే విక్రమ సింహదేవుడు దానిని యావజ్జీవ  జైలుశిక్షగా మార్పించి, కుట్రకు మూలమైన సవతితల్లి మురళాదేవిని, ఆమె చెప్పినట్లల్లా చేసిన మదనపాలుడిని కూడా క్షమించి ఆదరించటం తోనూ హేమప్రభాదేవి మేనగోడలు విమలతో మదనపాలుడికి, చంపకమాలినికి లలితకుమారుడితో పెళ్లిళ్లు జరిపించటం తోనూ ఈ నవలను సుఖాంతం చేసింది రాజమ్మ. 

ఈ నవలలో పృథ్విరాజు తప్ప మరెవరు చరిత్రక వ్యక్తులుగా తోచదు. ప్రతాప సింహుడు అనే రాజు 16 వ శతాబ్దివాడు కానీ పృథ్విరాజు సమకాలికుడు కాదు. అతనికి విక్రమాంక దేవుడనే కొడుకూ లేడు. కూతురికి ఉదయపూర్ గురించి చెప్తూ మిత్రానందుడు ఆ రాజులకు మొదట్లో రాజధాని చిత్తోడ్ అనీ , ఉదయపూర్ కు మార్చుకున్నారని అందుకు కారణాలు అనేకం అనీ  చెప్తాడు. ఆయన చెప్పని అసలు కారణం మొఘలుల దండయాత్రల నుండి రక్షణ. ప్రతాపసింహుడి తండ్రి ఉదయసింహుడు 1558 లో ఆరావళీ పర్వతాల మధ్య బాణ నది ఒడ్డున ఆ నగరాన్ని నిర్మించాడు. పిబోలి చెరువును ఆనుకొని రాజభవనం ఉంటుంది. ఇవి చారిత్రక సత్యాలు. ఈ వివరాలు ఇతివృత్త గమనంలో మనకు తెలుస్తూనే ఉంటాయి. ఆ రకంగానైతే నవలలో కథాకాలం 16 వ శతాబ్ది కావాలి. ఆ కాలమైతే ఢిల్లీ పాలకులు మొఘలులు అవుతారు కానీ పృథ్విరాజు కాదు. 

అయితే ప్రతాపసింహుడికి మురళాదేవితో రెండవ వివాహం చేయించిన, మురళాదేవి పంపిన వర్తమానం, సాక్ష్యాధారాలు చూసి పితృహంతకుడు అని విక్రమ సింహదేవుడుకి శిక్ష విధించిన అనంగపాలుడు ని తాతగారిగా ప్రస్తావిస్తూ ఆయన చేసిన తప్పును మనుమడు పృథ్విరాజు సరిదిద్దినట్లు ఈ నవలలో చెప్పబడింది. ఢిల్లీ హిందూరాజుల అధీనంలో ఉండటం, చరిత్రలో ప్రతాపసింహుడి శౌర్యం తనను ఆకర్షించగా  ఆరెండింటికీ మధ్య ఉన్న రెండువందల సంవత్సరాల కాలవ్యవధిని విస్మరించి కథాకాలంగా స్వీకరించిందని అనుకోవాలి. సింహాసనం కోసం కుట్రలు మధ్యయుగ రాచరికాలలో సర్వసామాన్యం కావటం వల్లనేమో దానిని వస్తువుగా చేసుకొన్నఈ నవలకు చరిత్ర ఒక నేపధ్యమే అయింది కానీ ఇతివృత్తంలో విడదీయరాని భాగం కాలేకపోయింది. అందువల్ల చరిత్రకు వ్యాఖ్యానం కూడా కాలేకపోయింది.   

చారిత్రక నవలలు అంటే సన్యాసులు, మారువేషాలు అన్నట్లుగా రచనలు చేస్తున్న సమకాలీకుల ధోరణిని ప్రస్తావిస్తూ చరిత్ర మనవాళ్లకు తాళం వేసిన పెట్టె వంటిది అన్నాడు గురజాడ అప్పారావు ఒక వ్యాసంలో.  1915 నాటికే ఉన్న ఈ స్థితి కి స్త్రీల నవలలు భిన్నంగా ఉంటాయని ఊహించటం కష్టం.

దుర్గాబాయ్ దేశముఖ్ గా తరువాతికాలంలో ప్రసిద్ధి చెందిన గుమ్మిడిదల దుర్గాబాయి కథలతో పాటు నవలారచనకు కూడా ప్రయత్నించింది. ఆమె వ్రాసిన నవల పేరు లక్ష్మి. 1930 అక్టోబర్ నుండి 1931 జనవరి వరకు నాలుగు నెలలపాటు గృహలక్ష్మి పత్రికలో అది సీరియల్ గా ప్రచురించబడింది. కాన్పూరుజిల్లా గంగానదీ తీరగ్రామం కథాప్రదేశం. అందు వల్ల   స్వతంత్ర నవల కాదనిపిస్తుంది. కానీ మూల రచన ఏదో రచయిత్రి పేర్కొనలేదు. ఆలోచనా శక్తి, అనుకున్నది ఆచరించగల సంకల్ప శక్తి సమృద్ధిగా ఉన్న లక్ష్మి ఈ నవలకు కేంద్రబిందువు. చదువు ఆమె చైతన్యానికి మూల శక్తి. ఆంగ్ల పాలనాఫలితంగా తమ వూళ్ళో ఏర్పడిన బాలికా పాఠశాలలో చదువుకొన్నది. మొదట్లో ఆ పాఠశాలకు ఆడపిల్లలను అంతగా పంపక పోయినా లక్ష్మి వంటి  నలుగురైదుగురు పిల్లలు విద్యావంతులు కావటంతో అది ఉత్సాహ కారణమై ఇతరులు కూడా తమ పిల్లలను బడికి పంపారు. అట్లా చదువుకొన్న ఆడపిల్లలు రామాయణాది సాహిత్య రచనలు చదివి పాత్రల గుణాగుణాలను చర్చించ గలిగిన చైతన్య స్థాయికి వచ్చారు. వాళ్లకు నాయకురాలు లక్ష్మి. 

విద్యవల్ల లభించే వివేకం, వితరణజ్ఞానం స్త్రీకి జీవితాన్ని నిర్మించుకొనే ధైర్యో త్సాహాలను ఇస్తాయని లక్ష్మి జీవితేతి వృత్త గమనంలో నిరూపించింది దుర్గాబాయమ్మ. విద్య స్వంత ఆలోచనలకు, అభిప్రాయాలకు కూడా కారణం అవుతుంది. పెళ్ళిలో డబ్బు ప్రమేయం ఉండరాదని లక్ష్మి అభిప్రాయం. కట్నాలిచ్చి గొప్పింటి సంబంధాలు చేసుకొనటం కంటే సామాన్యుల సంబంధమే మేలు అని చెప్పిన మాటలన్నీ విద్య వల్ల  వికసించిన స్వీయ అస్తిత్వ చైతన్యం నుండి వచ్చినవే. అయితే తండ్రికి ఆ విషయం చెప్పి తన నిర్ణయాన్ని ప్రకటించగల స్థితి ఆమెకు లేదు. స్త్రీకి ఒకవైపు విద్యావకాశాలు లభించి పబ్లిక్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నా కుటుంబ సంస్కృతిని కాపాడే బాధ్యత తిరగి తిరిగిస్త్రీ మీదనే మోపబడటం ఆధునికతలోని ఒక వైచిత్రి. దాని ప్రతిఫలనమే పౌరాణిక పాత్రల గుణాగుణాల చర్చ సందర్భంలో లక్ష్మి తల్లి దండ్రులనవమానించి మనంత మనమే యితరుల సొమ్మగుట మిక్కిలి చెడ్డ పని అని అభిప్రాయ పడటం. “తల్లిదండ్రులాలోచించి ఎవరికి ( కన్యా దానము చేసిన వారినే మనము దేవతలగ భావించి సేవఁ జేయవలయును” అని నిష్కర్షగా చెప్పటం.

చదువుకొన్న స్త్రీ ఎంత సహనం తో ఇల్లు చక్కదిద్దుకోగలదో , ఇంట్లో తోడికోడళ్లు మొదలైన స్త్రీలతో ,బంధుజనంతో ఎంత చక్కటి స్నేహ సంబంధాలు అభివృద్ధి చేసుకోగలదో, పనిపాటలవారి పట్ల ఎంత సమభావంతో ప్రవర్తించగలదో లక్ష్మివ్యక్తిత్వం లో భాగంగా నిరూపించింది దుర్గాబాయమ్మ. చదువు వల్ల స్త్రీలు సతీ సావిత్రి వంటి వారి పుణ్య కథలు చదివి పతివ్రతలు అవుతారని కందుకూరి వీరేశలింగం చెప్పిన మాటకు అనుగుణంగా ‘పతియే సతికి పరమ దైవము’ అని నమ్మి జీవించిన స్త్రీగా లక్ష్మి పాత్రను నిర్మించబడింది.  చదువుకొన్న స్త్రీ గృహాన్ని వెలిగింప చేయటమే కాక ఇరుగుపొరుగు వారిలో విద్యా చైతన్యం కలిగించగలదని , బాలికా విద్యా వ్యాప్తికి దోహదకారి కాగలదని 1930 లో ఈ చిన్న నవల ద్వారా ఒక ఆశయాన్ని, ఒక ఆశను సముజ్వలంగా నిలబెట్టింది దుర్గాబాయమ్మ.

1931 లో ఆచంట సత్యవతి నవల ‘సునందిని’ వచ్చింది. ఇది అలభ్యం. కానీ 1931 ఆగస్ట్ గృహలక్ష్మి పత్రికలో దీనిపై సమీక్ష వచ్చింది. ఆధునిక సాహిత్య విమర్శకు ఆద్యుడైన కట్టమంచి రామలింగా రెడ్డి దీనికి ముందుమాట వ్రాయటం విశేషం. ఈ పీఠికను బట్టి సత్యవతి రాజమండ్రి  వాస్తవ్యురాలు అని, విద్యావంతురాలు అని తెలుస్తున్నది. అద్భుత రస ప్రధానములైన ఆఖ్యానాల ప్రభావంతో వ్రాసిన నవల అని ,సంపూర్ణ స్వతంత్ర రచన కాదని చెప్తూనే కట్టమంచి ఈ నవలలో రచయిత ప్రతిభా విశేషం కనబడుతున్నదని భవిష్యత్తులో “ సమకాలీనమైన వృత్తమేదైనా( గైకొని సహజమును ,సాధారణములును నయిన సంగతుల గూర్చి “ జీవిత ప్రదర్శనం చేయగల రచన ఆమె చేయగలదన్న నమ్మకం కలుగుతున్నదని అన్నారు.అద్భుత లోకముల కంటె సత్యలోకములు ప్రౌఢ జనామోదకములు” అని హితవు చెప్పారు. హిందూస్త్రీల భావములను,పరమార్ధములను సత్యవతీ దేవి నిండు జ్ఞానంతోను పూర్ణ హృదయంతోనుచిత్రించారని మెచ్చుకున్నారు. ఇతివృత్తం గొప్ప తలంపులకు ప్రబోధకం గానూ, మంచినడవడికి ఉత్సాహ కారిగానూ వున్నదని ,ఇది అందరును చదివి ఆమోదింప దగిన నిర్మల నీతి కథ వంటిదని కట్టమంచి తన ముందుమాటలో అభిప్రాయపడ్డారు. 

1932 లో వచ్చిన జ్ఞానాంబ నవల ‘మైత్రేయి’ అలభ్యం. 1933లో దామెర్ల భ్రమరాంబ, కొండ విజయలక్ష్మీ బాయి అనే ఇద్దరు స్నేహితులు  కలిసి సేవాశ్రమం అనే నవలను రెండు భాగాలుగా ప్రచురించారు. ఇది ప్రేమ్ చంద్ సేవాసదనం నవలకు అనువాదం.దీనికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం ముందుమాట వ్రాసారు. “ ఆంధ్రదేశ నారీమణులు పురుషులవలెనే నవీన పద్ధతులమీద నాంధ్ర భాషనభ్యసించి ,పాండిత్యము సంపాదించి, దేశోపకారకములై భావౌన్నత్యము గలిగించునట్టి సద్గ్రంథముల వ్రాయునట్టి మహాపర్వదినము లెప్పుడు వచ్చునా యని ఆ సుదినముల నిమిత్తమై ఎదురుచూచుచున్న” తనకు ఈ పుస్తకాన్ని చూడటం ,ముందుమాట వ్రాయటం సంతోష కారణాలని  చెప్పుకొన్నాడాయన. ఈ గ్రంధం రసపుష్టి కలిగి ,స్వకపోల కల్పితమైన గ్రంథమువలెనే హృదయంగమమై యున్నదని పేర్కొన్నాడు. గ్రంధమంతా గ్రాంధిక శైలినే వ్రాసారని అభినందనపూర్వకంగా అంటూనే మధ్యమధ్య సంధులు కలపకపోవటం వంటి దోషాలున్నాయని అన్నారు. ఈ నవల 1949 లో రెండవముద్రణ కూడా వచ్చింది. 

విద్యుత్ప్రభ, శారదా విజయం అనే రెండు నవలలు  1934 ,1935 సంవత్సరాలలో వరుసగా ప్రచురించబడ్డాయి. ఇవి రెండూ  చారిత్రక నవలలు. రెండూ ద్వితీయముద్రణలే. రెండింటికీ మొదటిప్రచురణ  వివరాలు తెలియరావడం లేదు. 

విద్యుత్ర్పభ నవల  రచయిత భాగవతుల చెన్నకృష్ణమ్మ. ఆమె  ప్రభత్వ శిక్షణా పాఠశాలలో అధ్యాపకురాలిగా పని చేసి రిటైర్ అయింది. అనంతపురం ప్రభుత్వ శిక్షణా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.  ఆర్. రీ. వై. ఎస్. హనుమంతరావు విద్యుత్ప్రభ చక్కగా వ్రాయబడిన రాజపుత్రాస్థానానికి సంబంధించిన చారిత్రక నవల అని, ఉత్తమ కవితాత్మక భాష, నైతిక సౌందర్యం ఈ నవలలో పుష్కలంగా ఉన్నాయని మూడు నాలుగు ఫారాలు చదివే విద్యార్థుల అధ్యయనానికి ‘నాన్ డిటైల్’  పుస్తకంగా పెట్టటానికి అర్హమైనదని పేర్కొన్న అభిప్రాయం ఈ నవలకు పీఠికగా సమకూర్చబడింది. ఎనిమిది లేదా తొమ్మిదవ శతాబ్దిలో మేవార్ రాజ్యం స్థాపించిన ‘బప్పారావల్’ కు సంబంధించి ప్రచారంలో వున్న జానపద పౌరాణిక గాధలు, చారిత్రక ఆధారాలు అన్నిటినీ కలుపుకొని వాటికి  తన కాల్పనిక శక్తిని జోడించి చెన్నకృష్ణమ్మ ఈ నవల వ్రాసింది. 

బప్పారావల్ 728 లో మేవార్ రాజ్యాన్ని స్థాపిస్తూ ఏకలింగజి గుడిని కట్టించాడు. 15 వశతాబ్ది నాటి ఏకలింగ మహత్యం అనే పురాణం,శాసనాలు మొదలైన ఆధారాలతో అతని కాలాన్ని, వంశ  చరిత్రను నిరూపించటంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి.ఈదూరు అనే భిల్ల రాజ్యాన్ని పాలించి ,బిల్లుల తిరుగుబాటులో చంపివేయబడిన గుహలోటువంశస్థుడైన నాగదిత్యుడి కొడుకు ఇతను. గుహలోటు వంశం వల్లభి ని పరిపాలించి శత్రురాజులతో యుద్ధంలో మరణించిన శిలాదిత్యుడి కొడుకు గౌహలుడితో ప్రారంభం అయిందని, అతనికి ఎనిమిదవ తరం వాడు నాగాదిత్యుడు అని మరొక కథనం వుంది. నవలలో కథ ఈ కథనం మీదనే ఆధారపడింది.  వల్లభి పతనం 770 లో జరిగిందని కొన్ని ఆధారాలవల్ల తెలుస్తున్నది. తరానికి కనిష్ఠం 15 సంవత్సరాలు వేసుకున్నా 120 సంవత్సరాలు . అది కలుపుకుని చూస్తే నాగదిత్యుడి కాలం 890 అవుతుంది. దానిని బట్టి అతని కొడుకు బప్పారావల్ కాలం1020 కావాలి.ఈ నేపథ్యంలో బప్పారావల్ 728 లోనే మేవార్ రాజ్యం స్థాపించటం పొసగదు. ఇంతకూ బప్పారావల్ 8వ శతాబ్దికి చెందినవాడా? 11 వ శతాబ్ది ప్రారంభంలో జీవించినవాడా? అన్న ప్రశ్నలు అటుంచితే  ఆ బప్పారావల్ ఈ నవలలో అప్పాజీ అయినాడు అన్నది మాత్రం వాస్తవం.  

బిల్లులు రాజును చంపగా  ఒక బిల్లు సేవకుడు ఆయన భార్యను  పసిపిల్లవాడిని కాపాడటానికి ప్రయత్నించాడు.  విష్ణుశర్మ అనే నాగేంద్ర పట్టణ బ్రాహ్మడు అతనికి  సహాయంగా వచ్చి తల్లీ బిడ్డలను కాపాడి ఆశ్రయం ఇచ్చాడు. ఆ తల్లి పేరు కుంతి. కొడుకు పేరు అప్పడు.అది నవలలో మొదటి ఘట్టం . ఆ తరువాత అసలు కథ  అప్పడు 16 ఏండ్లవాడై గోవులను కాస్తున్న కాలంలో ప్రారంభం అవుతుంది. శౌర్య సాహస కృత్యాలతో ప్రత్యేక వ్యక్తిత్వం తో పెరిగిన అతనికి ఏకలింగస్వామి ఆలయం లోని ఒక సిద్ధుడి వలన తనది రాజవంశం అని తెలుస్తుంది. తల్లిని అడిగి తమ వంశచరిత్ర అంతా తెలుసు కొంటాడు.  ఆ తల్లి కథనం దాదాపుగా బప్పారావల్ చరిత్ర విషయసంబంధి. కనుక బప్పారావల్ ఈ నవలలో అప్పడు అయినాడన్నది స్పష్టం.

నాగేంద్ర పట్టణ అధిపతి కూతురు శంపకు  పెళ్ళిచేయాలని సంకల్పించి జాతకం చూపించినప్పుడు ఇప్పటికే ఆమెకు పెళ్లి అయిందని సిద్ధాంతి చెప్పటంతో అప్పడు బాల్య విచేష్టతో ఉయ్యాల తాళ్లు అడగవచ్చిన శంపను ‘పెళ్లి ఆట’ కు ఒప్పించి కొంగుముడేసుకొని కరగ్రహణం చేసి చెట్టుకు ప్రదక్షిణ చేసిన విషయం బయటపడుతుంది. ఆ దుస్సాహసానికి అతనిని దండించాలని పట్టణాధిపతి ఆలోచనచేయటం పసికట్టి విష్ణుశర్మ అతనిని తల్లితో సహా వూరు దాటించటంతో నవలలో  కథ మలుపు తిరుగుతుంది.అక్కడినుండి అతను మేవార్ రాజధాని చిత్తోడ్ చేరుకొనటం, రాజమంత్రి అయిన భూతివర్మ – జాలవధానులు అనే పురోహితుడితో కలిసి చేస్తున్న అకృత్యాలను, రాజు ప్రమారుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను కనిపెట్టి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ చిత్తుచేసి రాజుకు విజయం సంపాదించి పెట్టడటం, ఆ రాజు అసమర్ధత కారణంగా దుష్టుల విజృభణ పూర్వం వలే కొనసాగే అవకాశమా వుంది కనుక సర్దారులందరూ అప్పాజీని ప్రోత్సహించి ప్రమారుని రాజ్య భ్రష్ఠుడిని చేయటం ,అప్పాజీ రాజై కుట్రదారులను శిక్షించి రాజ్యాన్ని విస్తరింపచేయటం వరకు జరిగిన మొత్తం కథకు వెనుక వున్నది  విష్ణుశర్మ వ్యూహమే. నవల ప్రారంభంలో పరిచయమయ్యే మొదటి పాత్ర విష్ణుశర్మ. ప్రమారుడి చేత , విభూతివర్మ చేత రాజాస్థానంలో జరిగిన అవమానానికి మనస్థాపం చెందుతూ చిత్తోడ్ నుండి నాగేంద్ర పట్టణ మార్గంగా వెళుతున్న విష్ణు శర్మ ,ఈ అవమానానికి వూరు వదిలి వెళ్లిపోదామా అని అనుకున్నవాడు వెళ్ళటం కాదు, భూపతి రాజ్యము దుష్టజన పరిభూతమైనచో రాష్ట్రపు జనులకు బతుకెక్కడిది అని విచారించి ఈ రాష్ట్రాన్ని , రాష్ట్ర ప్రజలను ఈ బాధనుండి రక్షించటం కర్తవ్యము అని నిర్ణయానికి వస్తున్న సమయంలోనే దైవమా రక్షింపుము, రక్షింపుము అన్న మాటలు వినవచ్చి ఆ వైపు వెళ్లి తల్లీ బిడ్డలను రక్షించాడు. కనుక అతనే తన నిర్ణయాన్ని అమలుచేయటానికి వీలుగా గోకాపరిగా వుంచుతూనే  అప్పడిని ఆ మార్గంలో సుశిక్షితుడిని చేసాడనుకోవచ్చు. అప్పారావల్ జీవిత క్రమం ఇలాగే సాగిందని చెప్పే చారిత్రక ఆధారాలు కనబడవు. 

ఈ నవలేతివృత్తంలో ‘ విద్యుత్ప్రభ’ ఉదంతం మరొక అందమైన కల్పన. అప్పడు బాల్య విచేష్టతో ఆటల పెళ్లి చేసుకొన్నశంప, నీట కొట్టుకుపోతున్నప్పుడు కాపాడిన శంప యే విద్యుత్ప్రభ. తండ్రి ధీరసింగు మంచి సంబంధం చూసి పెళ్ళిచేయాలనుకొంటుంటే సవతితల్లి ఆపిల్ల మీద మోజు పడిన భూతివర్మకు ఇచ్చి పెళ్లి చేయటానికి సిద్ధపడటం, ఇంటి నుండి తప్పించుకు పోతూ ఆ భూతివర్మకే పట్టుబడి బందీ కావటం, జాలవధానుల రహస్యాలు తెలుసుకొనటానికి వెంబడించిన అరిభీషణుడు అతని ఇంట  ఆమెను చూసి ఆకర్షితుడు కావటం ,ఆమె ద్వారా భూతివర్మ జాలవధానుల కుట్ర నుండి రక్షించటానికి వ్యూహాలు పన్నటం మొదలైన కథ ప్రధాన స్రవంతి ఈనవలలో. అరిభీషణుడు అనే పేరుతో ప్రచ్ఛన్నంగా తిరుగుతూ మేవార్ ను అంతర్గత శత్రువులనుండి, బయటి శత్రువుల నుండి కూడా కాపాడి చివరకు మేవారు రాజైన అప్పాజీ విద్యుత్ప్రభను పెళ్లాడటంతో ఈ నవల ముగుస్తుంది. ఉత్కంఠను రేకెత్తించే ఘటనల క్రమంలో కల్పనే ప్రధానం. జాతీయోద్యమ కాలంలో వలసపాలనకు వ్యతిరేకమైన ఉత్సాహ శక్తిని ఉద్దీపింపచేయటానికి రాజపుత్ర చరిత్ర  తరచు ఉపయోగించబడింది. చెన్న కృష్ణమ్మ కూడా ఆ రకంగానే రాజ్యాలు పొంది, కోల్పోయి మళ్ళీ పొందే క్రమంలో దేశీయ చరిత్ర ఎలా రూపొందిందో నిరూపించి చూపటానికి మేవారు రాజ్య స్థాపన అనే చరిత్రను ఆధారంగా చేసుకొని ఈ నవల వ్రాసిందిఅనుకోవచ్చు.         

 *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.