పూనాచ్చి- ఒక మేకపిల్ల కథ
తమిళ మూలం :పెరుమాళ్ మురుగన్.
తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్.
-వసుధారాణి
ముందుమాటతో మొదలు పెడితే పెరుమాళ్ మురుగన్ రాసుకున్న ముందుమాటే ‘నిద్రాణస్థితి’ కొంచెం వింతగా అనిపించింది.
మొదటి పేరానే ఇలా ఉంది,
“ బయటకి చెప్పని కథలు ఎంతకాలమని నిద్రాణంగా ఉండిపోతాయి?
మనుషులగురించి రాయాలంటే భయం.దేవుళ్ళగురించి రాయాలంటే విపరీతమైన భయం.రాక్షషులగురించి రాయవచ్చు.రాక్షసుల జీవితం గురించి కొంచెం పరిచయం ఉంది.ఇప్పటికీ కాస్త ప్రయత్నించవచ్చు.సరే,జంతువుల గురించి రాద్దాం.”
పుస్తకం అట్టమీద ‘భారతదేశంలో వివాదాస్పదుడైన రచయిత కలం నుంచి…అని మేకపిల్ల తల కింద రాసివుంది.
‘పూనాచ్చి’ ఆపకుండా చదివించే 132 పేజీల బుజ్జి బుజ్జిమేక కథ చెప్పిన నవల. ఈ నవల చదివాక మురుగన్ గారి వివాదాస్పదమైన నవల ‘అర్ధనారీశ్వరుడు ‘మీద ఆసక్తి కలిగి అదికూడా చదివాను.అప్పుడు నాకు అర్ధమైంది , ఆయన రాసిన ముందుమాట మొదటి పేరా ఎంత అర్ధవంతమైనదో.ఇప్పుడు అర్ధనారీశ్వరుడు జోలికి నేను వెళ్లటం లేదు,అయితే పూనాచ్చి నవల రాసి ఆయన ఓ సమర్ధవంతమైన రచయిత సమాజానికి ఏదయినా రచనా రూపంలో చెప్పాలనుకున్నప్పుడు ,జాగృతం చేయటం కర్తవ్యం అనుకున్నప్పుడు మనుషులు,దేవుళ్ళు,రాక్షసులు లేకుండానే రచన చేయగలడు అని చేసి చూపారు అనిపించింది.అంతే కాదు కటువైన సత్యాలను,చరిత్ర మిగిల్చిన మరకలను ఒప్పుకోవాలి,వాటి నుంచి పాఠాలను నేర్చుకోవాలి కానీ వ్యతిరేకిస్తే సత్యం మాసిపోదు కదా?
ఈ పుస్తకం గురించి రాయవలసి వచ్చినప్పుడు తప్పకుండా చెప్పవలసిన వ్యక్తి అనువాదకురాలు గౌరీ కృపానందన్ గురించి.గత రెండు దశాబ్దాలుగా తమిళం నుంచి తెలుగుకు , తెలుగు నుంచి తమిళంలోకి అనువాదం చేస్తూ ఉన్నారు.ఇంతవరకు డెభైకి పైగా తమిళంలో అనువాద నవలలు వెలువడి ఉన్నాయి .యాభైకి పైగా తమిళం నుంచి తెలుగుకు కథలు పత్రికలలో ప్రచురించబడ్డాయి.ఓల్గా గారి విముక్త కథల సంపుటి అనువాదానికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.
నవల చివరలో ‘పూనాచ్చితో నా ప్రయాణం’ అంటూ ఈ నవలని అనువాదం చేసేటప్పుడు తనకు కలిగిన అనుభూతులను, అనుభవాలను ఆవిడ పంచుకున్న తీరు కొత్తగా అనిపించింది. రచయిత పెరుమాళ్ మురుగన్ యొక్క భావప్రకటనా స్వేచ్ఛను హైకోర్టు గౌరవించిన తీరును ఆవిడ చక్కగా వివరిస్తూ , పూనాచ్చి పాత్రని రచయిత ఎంత సున్నితంగా మలిచారో చెప్పారు.
కరువు ప్రాంతంలో రాక రాక వచ్చిన వానని విసుక్కుంటున్న గొర్రెల కాపరుల పిల్లలను చూస్తూ ” శత్రువు అయినా కూడా వస్తే చేతులు జోడించి స్వాగతం చెప్పాలి.సంపదను తీసుకు వచ్చే వర్షాన్ని తిట్టి బైటికి తరిమేస్తే అది ఇంకోసారి వస్తుందా?”.
ఇలా ఆలోచించే అతను అసుర తెగకి చెందిన ముసలి సేద్యగాడు.
ప్రదేశం తొండల గుట్ట అని పిలిచే మెట్టప్రాంతం. ముసలిది నువ్వు మేకలు తోలుకు పోయే వంకతో గుట్టనెక్కి ఆకాశం చూస్తూ కూర్చోవటానికే అని ముసలాడిని ఏడిపిస్తుంటుంది.ఒక అరఎకరం మడిచెక్క,రెండుమేకలు ,ఓ ఆవు ,ఓ తాటిపాక ఆస్తులుగా ఉన్న ముసలిజంట వాళ్ళు .నవలలో ఏ మనిషికీ పేరు లేదు .పేర్లు ఉండేది కేవలం మేకలకి ,పొట్టేళ్లకే. రచయితకు మనుషులకన్నా వాటి కథ ముఖ్యం ఇక్కడ.
అలా ఏడాది తర్వాత వాన సాగిన సాయంత్రం ముసలాడు మేకల్ని ఇంటికి తోలుకు వచ్చే సమయంలో కేవలం గోచీపాత మాత్రమే ధరించిన ఓ పొడవాటి రాక్షసుడు లాంటి మనిషి నీడలా సాగి భీతిగొలిపేలా కనిపిస్తాడు.పల్లెటూరి ప్రజలలో ఉండే సాధారణ ఉత్సుకతతో ముసలాడు అతనిని పలకరిస్తాడు.ఒక్కచేతిలో ఇమిడే ,తళ తళ మెరిసే కుమ్మరిపురుగు రంగు నల్లని బుజ్జి మేకపిల్లని ముసలాడి చేతిలో పెట్టి ఇది సాధారణ మేకపిల్ల కాదు దీని తల్లి ఒక్కఈతలో ఏడు పిల్లల్ని కన్నది. ఇది ఆఖరుది,దీన్ని అమ్మడానికి సంతకి వెళ్ళాను మనసున్న మారాజుకే ఇది సొంతం అంటూ, ఓయ్ డబ్బులు కూడా వద్దా అంటూ ముసలాడు కేకేస్తున్నా వినకుండా వెళ్ళిపోతాడు.
బకాసురుడు లాంటి మనిషి తన చేతిలో పెట్టిన మేకపిల్లని గడ్డి గంపలో పెట్టుకుని ముసలాడు మిగిలిన మేకల్ని తోలుకుంటూ వస్తుంటే నలుదిక్కులా మిగిలిన కాపరులు హోయ్ హోయ్ అని అరుస్తూ వస్తే అతనికి వాళ్ళెందుకు అరుస్తున్నారో అర్ధకాదు.తలపైన బుట్టలోని మేకపిల్లకోసం గద్దలు వెంటాడుతున్నాయని ఒక గద్ద మేకపిల్లని తడితే ఇందాక వినపడిన హీనమైయిన అరుపు దానిదేనని అర్ధం అవుతుంది.ఈ మేకపిల్లని ఎలా పెంచటం అని దిగులుతో ఇంటికి వెళతాడు ముసలాడు.
కాపరులు అందించిన మేకపొదుగును పట్టుకుని పాలు తాగిన ఆ బుజ్జిమేక అనుభవం ఓ పసికూన తల్లిపాలు తాగిన అనుభవం ఒకటే అనిపిస్తుంది.రచయిత మేకపిల్లరూపంలో కథ చెపుతున్నా అది ఓ మనిషిరూపం ముఖ్యముగా ఓ ఆడపిల్ల రూపం సంతరించుకుంటుంది ఇక్కడి నుంచి.నాకయితే ఓ నిరుపేద ఆడపిల్ల జీవిత చక్రం అనిపించింది .అలాగే మనుషులు ఆడయినా ,మగాయినా బలహీనులు,నిరాధారులైన వారి పట్ల ఒకేలా ప్రవర్తిస్తారని ముసలిదాని ప్రవర్తన ద్వారా చూపిస్తారు.
ముసలిదానికి మేకపిల్ల అస్సలు నచ్చదు.ఈ పిల్లికూనను ఎక్కడినుంచి తెచ్చావు అంటుంది.ముసలాడు మేకపిల్ల అన్నాక కళ్ళు చిట్లించుకుని చూసి అవును మేకపిల్లే అంటుంది.ఇదివరలో పెంచిన పిల్లికి గుర్తుగా దాని పేరు “పూనాచ్చి” అని పెడుతుంది.చీకటి పడేలోపే ముసలాడికి ఓముద్దపెట్టి, తానూ కొంచెం గతికి చీకట్లో పడుకునే ముసలిది.ఆ రోజు పూనాచ్చి కోసం మట్టి ప్రమీదలో చమురు వేసి ముసలాడి పంచె అంచు చించి దీపం వెలిగిస్తుంది.చాలా ఏళ్ళ తరువాత పూనాచ్చి వలన ఆ గుడిసెలో దీపం వెలిగింది.
ఇంట్లో ఉన్న మిగిలిన మేకలు పూనాచ్చిని ఏడిపించటం , ముసలిది పూనాచ్చికి పాలు అలవాటు చెయ్యటానికి పడిన తిప్పలు ,సంతలో పాల పీక తెచ్చి పూనాచ్చికి గంజి తాగించటం మనమూ పడుతూ లేస్తూ పూనాచ్చి తో పాటు నానాయాతనలు పడతాము.ఒకజీవి తన అస్తిత్వాన్ని , మనుగడను నిలుపు కోవటం కోసం చేసే పోరాటం సహజమే అయినా సామాన్యం మాత్రం కాదు అనిపిస్తుంది అడుగడునా పూనాచ్చికి ఎదురయ్యే కడగళ్ళు చూసి.
ఇక పూనాచ్చికి చెవ్వు కుట్టించే ప్రహసనం ఎంత సరళంగా,సులువుగా వ్యవస్థలోని ,ప్రభుత్వంలోని లోపాలను,నిజాలను ,సామాన్యుల కష్టాలను రచయిత చెప్పారు అంటే ఇంత చిన్న సంఘటనలో మొత్తం మన కళ్ళముందు ఉండేలా.అప్పుడు నిజంగా ముసలిదాని మీద ఆమె పేదరికం,అమాయకత్వం మీద జాలి కలుగుతుంది.ఇలాంటి ఎందరో సమాజంలో కదా అనిపిస్తుంది.
ముసలిదాని కాళ్ళమధ్య ,చీరెకొంగు వెనుక తిరిగిన పూనాచ్చి మిగిలిన మేకలతో ముసలాడి వెంట మేతకి బయటికి వెళ్లటం ఇంకెవ్వరూ అలా రాయలేరు అనిపించింది.తాటాకుపాక ,ముసలిది,ఇంట్లో ఉన్న మేకలు,బర్రెలు ఇదే అప్పటిదాకా పూనాచ్చికి తెలిసిన ప్రపంచం . ఒక్కసారిగా విశాల ప్రపంచం చూసి ఆశ్చర్యపోతుంది.తన చుట్టూ తిరిగే పొట్టేళ్లని చూసి భయపడి ముడుచుకు పోతుంది,తనని అలరించే స్నేహితులని చూసి మురిసిపోతుంది. ఓ పడుచు పల్లెటూరి ఆడపిల్ల హఠాత్తుగా తనకి ఏమాత్రం పరిచయం లేని జనసంద్రంలోకి వస్తే ఎలా ఉంటుంది?
పూనాచ్చికి ఇంకో వింత అనుభవం ముసలిదంపతుల కూతురు ఇంటికి వేరే ఊరు అడవి గుండా ప్రయాణించటం.ఆ ప్రయాణంలో తప్పిపోయిన పూనాచ్చి ముసలిదానితో పాటు మనకూ కంటనీరు తెప్పిస్తుంది.పూనాచ్చి ఎక్కడా ఓ మేకపిల్ల అన్న అనుభూతి మనకు కలగక పోవటం రచన యొక్క గొప్పతనం.
ముసలివారి కూతురింట పూనాచ్చి అమాయకపు ప్రేమకథ ఏ తొలిప్రేమ కథలకూ తీసిపోని విధంగా అందంగా ,హృద్యంగా మనసులో ముద్రవేస్తుంది.ఉళుంబన్, ఊత్తన్,కడువాయన్,పీత్తన్ కూతురింటి మేకపిల్లలు.ఆ ఇంటి మేకపోతు పూవన్ పూనాచ్చికి తెగ నచ్చేస్తాడు.అతని తెల్లటి మేని రంగు ,చుబుకం కింద నల్లటి మచ్చ,గుండ్రని ముఖం,దారుఢ్యమైన శరీరం, జోరుగా మొలిచిన కొమ్ములు చూసి తన నల్లని రూపం,బాన పొట్ట ,బలహీనమైన కాళ్ళు అతనికి నచ్చుతాయా అనుకుంటుంది.ఐతే పూవన్ ఇవేమీ పట్టించుకోకుండా ఆమెతో చెలిమి చేస్తాడు.పూనాచ్చి అక్కడ ఆడుకున్న ఆటలు,పొందిన ఆనందం అంతా శాశ్వతం అనుకుంటుంది .అయితే ముసలిది కూతురుతో మాట్లాడిన మాటలు విని తెల్లవారి వెళ్లిపోవాలని తెలుసుకుంటుంది.అప్పుడు పూనాచ్చి,పూవన్ లకు కలిగిన విరహబాధ,వెళ్లాల్సి వస్తుందని తెలిసినాక పెరిగిన ప్రేమ ఏ అమరప్రేమ గాథకు తీసిపోని విధంగా ఉంటుంది.
వెనక్కి తిరిగి వచ్చిన పూనాచ్చి అసలే పూవన్ విరహంలో ఉండగా ఎదకి వస్తుంది ముసలిది ముసలాడు ఏమిచేయాలా అని ఆలోచించి,పసి పూనాచ్చిని ఓ ముసలి పోతు దగ్గరికి ముసలాడు తీసుకువెళతాడు.పూనాచ్చికి జరిగిన అన్యాయానికి, అవమానానికీ మనమూ రగిలిపోతాము.సూడిదైన పూనాచ్చిని ముసలిది బహుజాగ్రత్తగా చూసుకుంటుంది.అసలే బలహీనమైన పూనాచ్చి పొట్టలోకి బరువుతో కాళ్ళ మీద నిలబడటానికి కూడా కష్ట పడుతుంది.
మొదటలో బకాసురుడు చెప్పిన మాట నిజం చేస్తూ పూనాచ్చి నిజంగానే ఒక్క ఈతలో ఏడు పిల్లల్ని ఈనుతుంది.ఈ వింత చూడటానికి అందరూ రావటంతో పూనాచ్చికి ప్రముఖుల హోదా వచ్చేస్తుంది.పిల్లను పెంచటానికి పూనాచ్చి,ముసలిది పడే కష్టం అప్పుడే మన పిల్ల ఎదిగి పురిటికి వచ్చిన అనుభూతి కలిగిస్తుంది.సంతలో పిల్లల్ని అమ్మటానికి పూనాచ్చి నుంచి వాటిని దూరం చేసిన తీరు చాలా సున్నితంగా మలచబడింది.రచయిత స్త్రీ హృదయం ఎంత తెలుసుకున్నారు అనిపిస్తుంది.
సంతలో పిల్లల్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో ముసలిదాని చెవులకు కమ్మలు,మెడకు గొలుసు,కూతురుకు గాజులు మనవరాళ్లకు గొలుసులు,మనవడికి మొలతాడు కొంటాడు ముసలాడు.ఇంకా కూడా చేతిలో డబ్బు మిగులుతుంది.అప్పుడు పూనాచ్చిని ఇచ్చిన బకాసురుని తలుచుకుని అతనికి గుడి కట్టాలి అనుకుంటాడు.
ఇక్కడ రచయిత రాసిన మాటలు యధాతధంగా” అతను కొని తీసుకు వచ్చిన వాటిని అన్నింటినీ ముసలిది పెట్టుకుంటుంది.చెవికి కమ్మలు,చేతికి గాజులు ,మెడలో గొలుసు అన్నీ పెట్టుకుని చూసుకుని కొత్తపెళ్లి కూతురులాగా సిగ్గుపడింది. పూనాచ్చి ఇచ్చింది వీటి అన్నింటినీ అనుకుని ఆ రోజు పూనాచ్చిని మరీ ముద్దు చేసింది.వల్లమాలిన సంతోషంతో ముసలాడు,ముసలిది నిద్రపోనే లేదు.పిల్లలను ధారాదత్తం చేసిన దుఃఖంతో పూనాచ్చి కూడా నిద్రపోలేదు”.
మళ్లీ ఏడాది తిరిగి ముసలోళ్ళ కూతురింటికి యాత్ర మొదలైంది.పూనాచ్చికి పూవన్ జ్ఞాపకాలకు అంతే లేదు.నీవు మా కుల దైవమే అంటూ ముసలిది పూనాచ్చి పై ముద్దులు కురిపిస్తూనే ఉంటుంది.
పూవన్ ని చూసి “నువ్వు ఉంటావని అనుకోలేదు” అంటుంది పూనాచ్చి.
“నేను ఉంటానని నేనే అనుకోలేదు .మేకపోతుకు ఎప్పుడు కావాలన్నా చావు వస్తుంది.కూరకోసం చస్తాం, బలికోసం చస్తాం.అయినా కూడా ఇప్పుడు నీతో వున్నాను కదా, ఈ విధంగా దొరికే తరుణంలో జీవించే క్షణాల బతుకే నాది”. అంటాడు పూవన్.
ఆ రాత్రి ఇద్దరి అదృష్టం పక్క పక్కనే కట్టేస్తారు.తన శరీరంలో వచ్చిన మార్పులకు పూనాచ్చి ఆనంద పడుతుంది.పూవన్ కి తనను తాను మైమరచి సమర్పించుకుంటుంది పూనాచ్చి.తెల్లవారు జామున చిమ్నీతో వచ్చి పూవన్ ని తీసుకెళ్లి బలి ఇస్తారు .పూనాచ్చి ఒక్క గడ్డి పరక ముట్టలేకపోతుంది.ఉడుకుతున్న పూవన్ శరీరం కొత్త వాసన దానికి అంతులేని దుఃఖాన్ని ఇస్తుంది.
తిరిగి వచ్చిన పూనాచ్చి సూడిది అవ్వటం, కరువు రావటం,ఒక్క గడ్డిపరక కూడా లేకుండా పోవటం వరుసగా జరిగిపోతాయి.అసుర లోకంలో ఏ ఇంట్లోనూ ఆవులు,మేకలు,కోడిపిల్లలు,కుక్కా, పిల్లీ ఏవీ మిగలలేదు ఉప్పులో ఊరవేసుకుని తిన్నారు అన్నిటినీ.ఒక్కో ఇంటికి అంబలి కాచుకుని తాగటానికి ఓ సోలెడు పిండి ప్రభుత్వం వారు ఇస్తే కొంత తిండి ప్రజలకు .
చివరకు పూనాచ్చి ఈనితే దానికి పెట్టటానికి దాచి ఉంచిన సజ్జలతో ముసలిది గంజి కాచింది . అదే ఇంత తాగి పడుకున్నారు.ముసలిది తనని ముద్దుచేయటం,పాలు తాగటానికి తను కష్టపడటం,తన పిల్లలు,పూవన్ తో తన ప్రేమ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ గడపమీద తలవాల్చి నిద్రపోతుంది పూనాచ్చి.అంతే ఇంక దానికి తెల్లారలేదు.
జంతువుల మాటున మనిషి మనస్సును నిల్పిన పెరుమాళ్ మురుగన్ రచయితగా శాశ్వతంగా ఉండి పోతారు ఈ ఒక్క పూనాచ్చి నవలతో .చక్కటి అనువాదం చేసిన గౌరీ కృపానందన్ కి అభినందనలు.
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.
పూనాచ్చి ఒక మేకపిల్ల కధను సమీక్షించినందుకు ముందస్తుగా వసుధారాణి గారికి కృతజ్ఞతలు. కళ్ళకు కట్టినట్లుగా సన్నివేశాలను తనదైన భాషలో చక్కగా వ్యక్తీకరించారు. పూనాచ్చి మరింతగా పాఠకులకు చేరువ అవడానికి ఇలాంటి సమీక్షలు ఎంతో దోహద పడతాయి. once again thanks to Vasudha Rani.