మా కథ (దొమితిలా చుంగారా)

-అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

గని కార్మికులెట్లా పనిచేస్తారు?

గనుల్లో రెండు రకాలైన పని ఉంటుంది. ఒకటేమో సాంకేతికులు చేసేది, మరొకటి గని – పనివాళ్ళు చేసేది. గని పని ఎప్పుడూ ఆగదు, పగలూ రాత్రీ నడుస్తూనే ఉంటుంది. గని పని వాళ్ళకు మూడు షిప్టులుంటాయి. షిఫ్ట్ కొందరికి నెలకోసారి, కొందరికి రెండు వారాలకోసారి, మరికొందరికి వారానికోసారి మారుతుంది. నా భర్తకు షిఫ్ట్ ప్రతి వారమూ మారుతుంది.

గని లోతులకు దిగడానికి, పైకి రావడానికి వచ్చే సమయం కూడా కలుపుకుంటే – మొదటి షిఫ్ట్ ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటిదాకా, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం రెండింటి నుంచి రాత్రి పదకొండింటిదాకా, మూడో షిఫ్ట్ రాత్రి పదింటినుంచి – ఉదయం ఏడింటిదాకా ఉంటాయి.

మా మగవాళ్ళు మొదటి షిఫ్ట్ లో పనిచేస్తున్నప్పుడు మేం నాలుగింటికే లేచి వాళ్ళు తినడానికేదైనా చేయాల్సి వస్తుంది. వాళ్ళు మధ్యాహ్నం మూడింటికి నకనక లాడుతూ గని నుంచి బయటికొస్తారు. గని లోపలికి ఆహారం తీసుకుపోవడం అనుమతించరు. ఒకవేళ – పట్టుకుపోయినా ఆ లోపలి వాతావరణానికీ, లోపల తిరగడానికి ఆ ఆహారం చెడిపోతుంది. గనిలోపల ఎంతో దుమ్ము ఉంటుంది. ఎంతో వేడి ఉంటుంది. డైనమైట్లు పేలుతూ ఉంటాయి కనుక అక్కడేమైనా తినడం కూడా మంచిది కాదు. ప్రతి సమస్యకూ ఏదో ఓ పరిష్కారం ఉంటుంది గదా! లోపల తినడం అసాధ్యం అనీ కంపెనీ అంటుంది. కాని కంపెనీ తలచుకుంటే గనిలోపల శుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనాల గదులు కట్టించగూడదూ? కాని వాళ్ళకందుకు శ్రద్ధలేదు. సాంకేతిక సిబ్బందికి మాత్రం కంపెనీ ఇలాంటి ప్రాధాన్యత ఇస్తుంది. ఉదాహరణకు ఇంజనీర్లు చాలా తక్కువ కాలమే పనిచేస్తారు. ఉదయం పదిన్నరకు వాళ్ళకు తిండివస్తుంది. ఆ ఆహారాన్ని వాళ్ళు పదకొండున్నరకల్లా గనిలోపలే తినే ఏర్పాటు ఉంది. కంపెనీ ఈ సౌకర్యాన్ని కార్మికులకు కూడా కల్పించొచ్చు. కాని ఆ పని చేయదు. కార్మికులు పొద్దున్నే ఆదరాబాదరాగా కడుపులో పడేసుకున్న ఉపాహారంతోనే గనిలోకెళ్ళి మధ్యాహ్నం మూడింటికి ఇళ్ళకు మళ్ళుతారు. గనికి దూరంగా, అనేసియా లాంటి చోట ఉండే వాళ్ళు ఉదయం మూడింటికే లేవాల్సి వస్తుంది. అప్పుడు బయల్దేరితే గాని వాళ్ళు ఎంతో దూరంలోని సొకావన్, పాటినో, మిరాఫోర్స్ లాంటి గని కేంద్రాల దగ్గరికి సమయానికి చేరుకోలేరు.

మరి వాళ్ళు ఇన్ని గంటలపాటు ఆకలి ఎట్లా తట్టుకోగలుగుతారు? కారపు ముద్దతో కలిపిన కోకా ఆకులు (కారా కిళ్ళీ లాంటిది – అను) నములుతూ ఉంటారు. కోకా ఆకు అదో రకమైన చేదు వాసన ఉండి ఆకలి మరచిపోయేట్టు చేస్తుంది. దాని వగరు రుచి తెలియకుండా ఉండడానికే కారపుముద్ద కలుపుతారు. ఈ కారపు ముద్దను ఎత్తు ప్రదేశాల్లో పండే క్వినో ధాన్యపు తొడిమలతోను, బియ్యంతోను, సోపు గింజలతోనూ తయారు చేస్తారు. పని తట్టుకోవడానికీ, ఉత్సాహం తెచ్చుకోవడానికి కార్మికులు ఇవి నముల్తూ ఉంటారు.

గనిపని మనిషి సారమంతా పీల్చివేస్తుంది. నా భర్త ఇంటికి రాగానే బట్టలు కూడా విప్పకుండా, ఆ మురికి బట్టలతోనే పడి నిద్రపోతాడు. రెండు మూడు గంటలు నిద్రపోయాకగాని మామూలు మనిషై తినడానికి లేవడు. రాత్రి షిఫ్టు ఇంకా కష్టమూ, ఇంకా హీనమూ. రాత్రంతా పనిచేసి కార్మికులు పడుకోవడానికి ఉదయం పూట ఇల్లు చేరతారు. కాని, ఇల్లు ఇరుకు గావడం వల్లా, శిబిరంలో ఇండ్లన్నీ గుదిగుచ్చి ఉండటంతో బయట ఆడుకోవటానికి స్థలం లేక పిల్లలు ఆ గదిలోనే ఏదో ఓటి చేస్తుంటారు. గోడలు కూడా ఎంత సన్నంగా ఉంటాయంటే పక్కింట్లో – వాళ్ళు మాట్లాడుకుంటుంటే మన పక్కనే మాట్లాడుతున్నట్టుంటుంది. ఈ గందరగోళంలో కార్మికుడు నిద్రపోలేకపోతాడు. విసుగేసి బయటికి వెళ్ళిపోతాడు. కనీసమైన విశ్రాంతి కూడా  దొరకనివ్వని షిఫ్ట్ ఇది. నా భర్తా, ఇతర కార్మికులూ కూడా ఈ షిఫ్ట్ నెంత అసహ్యించు కుంటారో! కానీ, ఈ షిఫ్ట్ కూడా చేయక తప్పదు. కంపెనీ చెప్పినట్టు వినకపోతే ఉద్యోగమే పోతుంది.

నా భర్త ఈ రకంగా ఇరవై ఏళ్ళు పనిచేశాడు. గని పని వాని సగటు ఆయుః ప్రమాణం ముప్పై సంవత్సరాలే. ఆ పాటికే అతను తప్పకుండా గనిరోగంతో బాధపడుతూ ఉంటాడు. గనుల్లోపల పేలుళ్ళు జరిగినప్పుడు దుమ్ము కణాలు కార్మికుల ముక్కులోంచి, నోట్లోంచీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పోతాయి. అక్కడ పేరుకుపోయి ఈ దుమ్ము ఊపిరితిత్తుల్ని చెడగొడుతుంది, వాళ్ళ నోరు నల్లబడిపోతుంది. రక్త వర్ణానికి మారిపోతుంది. చివరికి వాళ్ళు ఊపిరితిత్తులు ముక్కలు ముక్కలుగా రక్తంతో కక్కుకుని చనిపోతారు. గనుల్లో చాలా సహజంగా వచ్చే ఈ జబ్బును సిలికోసిస్ అంటారు.

జాతీయ ఆర్థిక వ్యవస్థకు తమ రక్తము చెమటలా వెచ్చించి తోడ్పడుతున్నప్పటికీ గని కార్మికుల్ని వాళ్ళ బతుకంతా ప్రతి ఒక్కరూ హేయంగా చూస్తారు. వాళ్ళ జబ్బు అందరికీ అంటిస్తారని ప్రతి ఒక్కరూ వాళ్ళని నీచంగా చూస్తారు. కాని అది నిజం కాదు. ఈ దురభిప్రాయం మాత్రం పల్లెల్లో, పట్నాల్లో విపరీతంగా ఉంది. ఇందువల్లనే మాకు ఇళ్ళు కిరాయికివ్వడానికి ఎవరూ ఇష్టపడరు. మా భర్తల జబ్బు గోడల నుంచి పాకి వాళ్ళకంటుకుంటుందని వాళ్ళ భయం. అంతేకాదు, పని కష్టం మరిచిపోవడానికి మా కార్మికులు దినమంతా కోకా నములుతుంటారని చెప్పానే, అందుకు జనం మా వాళ్ళను వ్యసనపరులంటారు. ఖోయాలోకస్ అని, అంటే గనుల పిచ్చివాళ్ళని పిలుస్తారు. మా బతుకెంత దుర్భరంగా ఉందో మీరర్థం చేసుకుంటారనుకుంటాను. ఆగని శిబిరాల్లో పనిచేసే వాళ్ళలో ఎక్కువ మంది రైతులు కొండల్లో తిండికి సరిపోయేంత కూడా సంపాదించుకోలేక ఇక్కడికి వచ్చినవాళ్ళు. ఆ కొండల్లో సాలుకి ఒక్క కారే ఒక్క పంటే పండుతుంది. అదీ బంగాళాదుంప మాత్రమే. అదికాక పండే ఇతర పంటలు చాలా తక్కువ. కొన్ని సంవత్సరాలు కాలం బాగుండి, బంగాళాదుంపలు బాగానే పండుతాయి. కొన్ని సంవత్సరాలు కాలం బాగులేక రైతులు కనీసం వేసిన గింజలు కూడా తిరిగి రాబట్టుకోలేరు. ఇక మొత్తం కుటుంబానికి కుటుంబం పట్నానికో, గనులకో తరలి వస్తుంది. ఎవరైనా ఓ – రైతు గనికి వచ్చాడంటే తప్పకుండా ఈ అనుభవం ఎదుర్కొని వచ్చాడన్న మాటే.

మేం చాలా సుఖంగా జీవితం గడుపుతున్నామనీ, గని పనివాళ్ళకు ఉచితంగా ఇళ్ళూ, తాగే నీళ్ళూ, విద్యుచ్ఛక్తి, విద్యా, తక్కువ ధరకు సరుకులు అందజేస్తున్నాననీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కాని ఒక్కసారి సైగ్లో 20కి వచ్చి చూస్తే ఎవరికైనా యదార్థ దృశ్యం తెలిసిపోతుంది. ఇళ్ళు ఘోరంగా ఉండడం మాత్రమే కాదు, అవీ దొరకడం లేదు, అద్దెకే ఇవ్వబడుతున్నాయి. తాగేనీళ్ళు బహిరంగ స్థలాల్లోనే ఉన్నాయి. స్నానాల గదులు బహిరంగంగానే ఉన్నాయి.

కంపెనీకి ఇష్టమైన పద్ధతిలోనే మాకు కరెంటు ఉంటుంది. మేం చదువు కొనడానికి దుస్తులు, బడికి కావాల్సిన వస్తువులూ, మరెన్నో కొనుక్కోవాలి. ఇక చౌక ధరల దుకాణాల్లో మా భర్తల జీతాల్లోంచి భాగం తీసుకుంటారు. ప్రభుత్వం ప్రచారం అర్థమైందా?

కార్మికులకు బతకడానికవసరమైనంత జీతం బిచ్చంగా వేస్తారు. గనిలో ఒక ప్రత్యేకశాఖలో పనిచేసే నా భర్తకు ‘రోజుకు ఇరవై ఎనిమిది పిసోలు అంటే నెలకు ఏడు వందల నలభై పిసోలు జీతం వస్తుంది. గత సంవత్సరం ఆయన జీతం రోజుకు పదిహేడు పిసోలే ఉండేది. మాకు మూడువందల నలబై ఏడు పిసోల కుటుంబరాయితీ ఉంది. విలువ తగ్గింపు ఫలితంగా ప్రభుత్వం నిర్ణయించిన జీవన వ్యయ భృతి మరొక నూట ముప్పైఐదు పిసోలు వస్తుంది. రాత్రిపూట పనిచేస్తే మరి కొంచెం ఎక్కువొస్తుంది. మొత్తం మీద అన్నీ కలిపి నా భర్త నెలకు పదిహేను, పదహారు వందల పిసోలు సంపాదిస్తాడు. కాని సాంఘిక భద్రతానిధి అనీ, నిత్యావసర వస్తువులకోసం అనీ, పాఠశాల భవనాల కోసం అనీ.. ఇంకా ఎన్నిటికోసమో కంపెనీ విధించే కోతలవల్ల మొత్తం డబ్బును మేమెన్నడూ కళ్ళజూడనే లేదు. మొత్తానికి ఇంటికి ఒక్కోసారి ఏడు వందల పిసోలూ, ఒక్కోసారి ఐదువందల పిసోలు వస్తాయి. మరికొన్ని సార్లు మేమే కంపెనీకి బాకీపడి ఉత్త చేతులతో మిగిలిపోవాల్సి వస్తుంది.

మేం తొమ్మిది మంది అలాగే బతకాల్సి వస్తుంది. ఐతే మాకన్నా కనాకష్టంగా బతికేవాళ్ళు కూడా ఉన్నారు. అమరుడైన మా మహానాయకుడొకాయన ఈ పరిస్థితికి కారణాలను చాలా సులభంగా మాకు వివరించి చెప్పాడు. “మిత్రులారా సైగ్లో-20లో ఉన్న పదివేల మంది కార్మికులు నెలకు మూడు నాలుగువందల టన్నుల తగరం ఉత్పత్తి చేస్తారు” అని చెప్తూ ఆయన ఒక కాగితం తీసుకున్నాడు. “ఈ కాగితం మనం చేసే మొత్తం ఉత్పత్తి అనుకోండి మనం సాధించి పెట్టే లాభాలన్నీ కూడ ఇందులో ఉంటాయి. అయితే ఈ కాగితం ఎట్లా పంపకం జరుగుతుంది?” అని అడిగి ఆ కాగితాన్ని ఐదు సమాన భాగాలుగా చించాడు. “ఈ ఐదు భాగాల్లో నాలుగు విదేశీ పెట్టుబడిదార్లకు పోతాయి. అది వాళ్ళ లాభాలవాటా. బొలీవియా ఆర్థిక వ్యవస్థకు ఒక భాగం మిగిలి ఉంటుంది. ఇక ఈ ఒక్క భాగం కూడా మనం బతుకుతున్న వ్యవస్థకు అనుగుణంగానే పంపిణీ జరుగుతుంది. అంతేగదా? కనుక ఈ భాగంలోంచి రవాణా, కస్టమ్స్, ఎగుమతి ఖర్చులు మొదలైన వాటికోసం ప్రభుత్వం సగం తీసుకుంటుంది. ఇది మరోరకంగా పెట్టుబడి దారులకు లాభాలందించడమే కాదూ? ఎందుకంటే మన విషయంలో చూస్తే – మనం మన ఖనిజాన్ని మన ట్రక్కుల్లోనే పెరూ దేశపు సరిహద్దుల్లో ఉన్న గువాకికి తీసుకెళ్ళాలి. పెరూలో ఉన్న ఓడరేవు నుంచి మన ఖనిజం ఒక ఓడలో ఇంగ్లండ్ లోని విలియం హార్వే కర్మాగారానికి చేరుతుంది. అక్కడి నుంచి అది పడవల్లో అమెరికాకు రవాణా అవుతుంది. అక్కడ మన ఖనిజంతో కొన్ని వస్తువుల్ని తయారు చేసి అమెరికా చాల ఎక్కువ ధరకు, బొలీవియాతో సహా ఇతర దేశాలకు అమ్ముతుంది. అంటే మన దేశంలో మిగిలిపోయే ఐదోవంతు లాభాల్లోని సగంలో కూడా మళ్ళీ చాల భాగం పెట్టుబడిదార్లకే పోతుంది.

ఇక మిగిలే సగంలో ప్రభుత్వం దాని స్వప్రయోజనాలకు, సాయుధ దళాలకు, మంత్రుల జీతాలకు, వాళ్ళ విదేశ యాత్రలకు, వాళ్ళు విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు కొంత మింగుతుంది. ఒకవేళ వాళ్ళు అధికారం నుంచి పడిపోతే ఈ విదేశీ పెట్టుబడులతో వేరే దేశాలకు వెళ్ళి కొత్త లక్షాధికారులుగా బతకొచ్చుగదా! మరికొంత భాగాన్ని సైన్యం కోసం, డిఐసి (నేర పరిశోధక శాఖ) కోసం, వాళ్ళ కిరాయి తొత్తులకోసం – అంటే అణచి వేత సాధనాల కోసం వాడుతారు. ఇంక మిగిలిపోయిన చిన్న ముక్కలో సాంఘిక భద్రతా శాఖలకు, ఆరోగ్యావసరాలకు, ఆస్పత్రులకు, విద్యుచ్ఛక్తికీ కొంత ఖర్చవుతుంది. ఇంకో చిన్న ముక్కను గని పనివాళ్ళను సంతోషపరచేందుకు, సంతృప్తిపరచేందుకు చౌకధరల దుకాణాలకు రాయితీగా ఇస్తారు. ఇలా ఇచ్చిన రాయితీతో ప్రభుత్వం మననేమని నమ్మిస్తుందంటే ‘ఏలినవారి దయ’ వల్లనే రొట్టె, మాంసం, బియ్యం, పంచదార ఈ నాలుగు వస్తువుల ధరలూ అలాగే నిలిచిపోయాయని, ఇంకా ఏమంటారో తెలుసునా? ఏలినవారు దయతో మనకీ కానుకలిస్తున్నారని నమ్మింపజూస్తారు. కాని, ప్రభుత్వం ఈ రాయితీలు ఎక్కడ్నుంచి సంపాదిస్తోంది? మనం చేసిన ఉత్పత్తిలోంచే కాదూ?

ఇంకా మిగిలిన చిన్న ముక్కలోంచి కార్మికుల పనిముట్లూ, పలుగులూ, పారలూ కొనడానికి తీసుకుంటుంది. ఇంకా వాళ్ళు వాళ్ళ భార్యల కోసమూ, వాళ్ళ మంత్రుల భార్యల కోసమూ కూడ తీసుకుంటూనే ఉంటారు. అట్లా తీసుకున్నదానితోనే వాళ్ళు మన కన్నీటి – తుడుపు కోసం మాతృదినంనాడూ, క్రిస్మస్ నాడూ బహుమతులిస్తారు. ఇట్లా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఇక చూడండి – మనం తగరం మీద సంపాదించే మొత్తం డబ్బులో ఇన్ని కోతలు పోయాక ఒక చిన్న ముక్క, అతి చిన్న ముక్క మిగులుతుంది. ఆ చిన్న ముక్కను తగరం ఉత్పత్తి చేసిన పదివేల మంది కార్మికులకు పంచుతారు. కనుక చివరికొచ్చే సరికి మన చేతుల్లో మిగిలేదేమీ ఉండదు. అర్థమైందా?” అని చెప్పాడాయన.

1974లో అనుకుంటాను ఒక సమావేశంలో నాకు దీన్ని వివరించే అవకాశం కలిగింది. ఆల్టో డి లాపాలో ఫెడరేషన్ ఆఫ్ మదర్స్ తరఫున మహిళా శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. అక్కడికి యూనివర్సిటీ నుంచి కొందరు విద్యార్థులు వచ్చారు. వాళ్ళు ఆర్థికశాస్త్రంలో ప్రవీణులు, వాళ్ళు ఒక నల్లబల్ల తీసుకుని దేశపు ఆర్థిక సమస్యల గురించీ, దేశం నుంచి డబ్బు బయటికి ప్రవహించడం గురించీ, బొలీవియాలో సంపద – పంపకం గురించి వివరిస్తూ ఒక ముఖ్యమైన ఉపన్యాసం చేశారు. ఐతే అక్కడ చదవడం రాని స్త్రీలెంతో మంది ఉన్నారు. వాళ్ళకు ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేదేమీ అర్థం కాలేదు. చంకలో బిడ్డనెత్తుకున్న ఒక మహిళ లేచి అడగనే అడిగింది. “అన్నా అక్కడ నువు చాలా గీతలు గీశావు కాని మాకవేమీ అర్థం కాలేదు. అంతేగాదు, నువు ఎల్ ముటున్ గురించేమీ చెప్పనే లేదు. ఎల్ ముటులో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఎలా ముటులో  ఏం చేయదలచుకుంది? సైన్యం నుంచి తిరిగొచ్చిన నా కొడుకు ఎల్ ముటున్లో ఇనుము దొరుకుతుందనీ, దానితో ట్రక్కులు చేస్తారనీ చెప్పాడు. మరి ప్రభుత్వం ఎల్ ముటును విదేశీయులకిచ్చేసే బదులు అక్కడ ఫ్యాక్టరీలెందుకు పెట్టడం లేదు? అట్లాచేస్తే మన పిల్లలకు పని దొరుకుతుంది గదా” అని.

నాకున్న కొద్దిపాటి చదువుతో ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఏం చెప్తోంది అర్థం చేసుకున్నాను. వాళ్ళు బల్లమీద రాసిన అంకెలనుంచి నేనర్థం చేసుకున్నదాన్ని సులభం చేసి చెప్పాలనుకున్నాను. అప్పుడు నేను మా స్త్రీలతో మా భాషలో మా నాయకుడు వివరించినట్టే వివరించాను.

ఈ విషయం విని ఆ స్త్రీలు కోపోద్రిక్తులయ్యారు. వాళ్ళ భర్తలకు కూడా ఈ విషయం తెలియదని, బొలీవియా ఆర్థిక వ్యవస్థ ఎలా కొల్లగొట్టబడుతున్నదో తమ భర్తలకు చెప్తామనీ వాళ్ళన్నారు. “వాళ్ళెందుకింత అన్యాయం చేస్తున్నారు?” అని వాళ్ళు అడిగారు. “అదే, సరిగ్గా అదే ప్రభుత్వాన్ని మీరడగవలసింది. ఎందుకు వాళ్ళింత అన్యాయం చేస్తున్నారు?” అని చెప్పాను.

ఇప్పుడు ఆలోచిస్తే – ప్రజలు అధికారంలోకి వచ్చి ఈ జీవన విధానాన్ని మార్చేస్తే, అప్పుడీ, దోపిడీ సాగదు. మనం ఎక్కువకాలం బతకవచ్చు. మొట్టమొదలు గనుల్లో జీవన పరిస్థితి బాగుచేస్తాం మనం. కొత్త యంత్రాలు కొంటాం, ఎక్కువ పనిచేస్తాం. మన భర్తలు పని పరిస్థితులు తట్టుకునేంత తిండి పెట్టొచ్చు. ప్రత్యేకంగా నేనాలోచించేదేమంటే మన భర్తలు అట్లా గనుల్లో చనిపోయే పరిస్థితి ఉండొద్దు. ఇప్పుడు పారో,పలుగో ఎత్తలేని పరిస్థితి వచ్చేవరకూ గనిలోపలికి పోవాల్సిందే. అప్పుడే పని మానుకునే హక్కూ కొంచెం పెన్షనూ దొరుకుతుంది. ఇంతదాకా పైసకూడా దొరకదు. దీని బదులు నేనేమనుకుంటానంటే, జనసంపదను జాగ్రత్తగా కాపాడుకునే రాజ్యం మొట్టమొదట చేయాల్సిన పని, మనం అధికారానికొస్తే చేసే మొదటిపని – ప్రతి గని పనిమనిషీ ఐదేళ్ళకన్నా ఎక్కువకాలం గనిలోపల పనిచేయగూడదని చట్టం చేయడం. అక్కడ పనిచేసే సమయంలోనే ఇంకో వృత్తిలో శిక్షణ ఇవ్వాలి. ఐదేళ్ళు గనిలో పని చేసి బయటికొచ్చాక అతను మంచి వడ్రంగిగానో, మంచి మోచీగానో పనిచేసే స్థితి ఉండాలి. ఏదైనా ఓ బతుకుదెరువు తప్పకుండా ఉండాలి. జీవిత శేషమంతా గనిలోనే గడిచిపోగూడదు.

మనం ఇప్పుడున్న దారిలోనే పోతూ ఉంటే ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థకు ఎప్పుడు చేరతాం? జనాన్ని ఉత్పత్తి మీద ఉత్పత్తిచేసి చనిపోయే మానవ యంత్రాలు గానే భావిస్తే, వాళ్ళు చచ్చిపోతే మరో యంత్రాన్ని, అంటే మళ్ళీ మరొక మనిషి ఆ స్థానంలోనే భర్తీ చేసుకొని… ఇలా మానవ సంపదనంతా వరసగా తోసేస్తూ పోతే ఎక్కడికి పోతాం మనం? సమాజానికి అత్యంత ముఖ్యమైనది ఈ మానవ సంపదేనని మీరొప్పుకోరూ?

 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.