షర్మిలాం”తరంగం”

అత్తా కోడళ్ల అంతర్యుద్ధాలు

-షర్మిల కోనేరు 

“పెళ్లైంది మొదలు మా అబ్బాయి మారిపోయాడేంటో !” అంటా నిట్టూర్చే తల్లులూ ఒకప్పటి కోడళ్లే !

పెళ్లైన కొత్తల్లో”అమ్మ అమ్మ ” అని తిరిగే మొగుడ్ని చూస్తే మండిపోతుందంటూ సణుక్కునే ఆమె కాస్తా తాను అత్తయ్యాకా ” ఏంటో నాతో అబ్బాయి కాస్త మాట్లాడుతుంటే మా కోడలు భరించలేదమ్మా !” అని దీర్ఘాలు తీస్తుంది .

ఎంతో ప్రాణంగా పెంచుకున్న కొడుకును అప్పనంగా కోడలు చేజిక్కించుకుందే అన్న బాధ చాలా మంది అత్తల్లో కనిపిస్తుంది .

అదేంటో విచిత్రంగా ఈ అంతర్యుద్ధాలు ఆడాళ్ల మధ్యనే జరుగుతాయి .

మామలు మాత్రం చాలా మట్టుకు సైలెంట్ ఈ గొడవల్లో !

ఇంతకుముందు సూర్యాకాంతం లాంటి గయ్యాళి అత్తలుండేవారు . కోడళ్లు గుడ్లనీరుకక్కుకుంటూ దీనంగా వుండేవారు .

ఇప్పుడు కాలం మారినట్టే కనిపిస్తోంది. కోడళ్ల సామ్రాజ్యం వచ్చేసింది .

అదే అమ్మాయిల తల్లి అయితే పోన్లే మా అమ్మాయిని అల్లుడు అపురూపంగా చూసుకుంటున్నాడు అని మురిసిపోతుంది .

ఇద్దరూ అమ్మలే ! ఒకరు అబ్బాయి అమ్మ , ఇంకొకరు అమ్మాయి తల్లి .

మరి ఈ తేడా ఎందుకో అంతుబట్టదు .

” అంతా దాని పెత్తనమే వీడో వాజెమ్మ !” అని గొణుక్కునే అబ్బాయిల అమ్మలు కూతురి కాపురం గురించి చెప్తూ ” అల్లుడు జీతం తెచ్చి పొయ్యడమే ! అన్నీ ఇదే చక్కబెట్టుకోవాలి , ఏం పట్టించుకోడు ” అని వాపోతారు.

అందరూ ఇలాగే వుండకపోవచ్చు గానీ ఎక్కువ శాతం ఇదే ఆలోచనా ధోరణిలో వుంటారు .

కూతురి విషయంలో లేని అసూయ కోడలి విషయం లో ఎందుకుండాలి అని అత్తలు ప్రశ్నించుకోవాలి .

ఇప్పుడిప్పుడూ అత్తలకు కొత్త గండం వచ్చిపడుతోంది .

అదీ కోడలి అమ్మరూపంలో …

ఈ సందర్భంగా వాస్తవ సంఘటన ఒకటి ప్రస్తావించాలి .

ఒక దంపతులకు ఇద్దరు కొడుకులు.

వాళ్లని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశారు .

అలసిన ఆ వృద్ధ జంట ఒక కొడుకు దగ్గర వుంటున్నారు . ఇంకో కొడుకు వారికి డబ్బు పంపిస్తాడు .

కొడుకూ కోడలూ వుద్యోగాలు చేసుకుంటూ వుంటారు .

వీరు ఇంటిని కనిపెట్టుకుని మంచి చెడ్డా చూస్తూ వాళ్లపనులు వాళ్లు చేసుకుంటూ బతుకుతున్నారు .

ఒక రోజు కోడలి అమ్మ, కోడలు కలిసి వారితో ” ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఎందుకుండాలి ? మీ ఇంకో కొడుకు దగ్గరికి వెళ్లి ఓ ఆర్నెల్లు వుండి ఇక్కడ ఓ ఆర్నెల్లు వుండండి ” అని చెప్పేశారు . అక్కడే కూర్చున్న కొడుకు మౌనంగా వుండిపోయాడు .

తల్లి మనసు గాయపడింది . వాళ్లు తమను వెళ్లిపొమ్మనందుకు కాదు … కోడలి తల్లి సమక్షంలో తమకు అవమానం జరిగినందుకు .

ఆమె కంటికీ మింటికీ ఏక ధారగా ఏడుస్తూ మూడురోజులు అన్నం కూడా ముట్టుకోలేదు .

ఇక్కడ కోడలిదీ తప్పు కాదు కొడుకు అంగీకారంలేందే ఆమె ఆ పని చేయలేదు .

కోడలి సమస్యలు కోడలికి వుండొచ్చు .

వీళ్ల చాదస్తంతో విసిగిపోయి కొన్నాళ్లు బ్రేక్ కావాలనుకుందేమో .

కానీ ఆ విషయం తమ కుటుంబానికి సంబంధించినది . అత్తామామలు , తాము కలిసి అదే విషయాన్ని సున్నితంగా చెప్పి ఒప్పించవచ్చు .

కానీ ఈ సంఘటనకు సూత్రధారి కోడలి తల్లి కావడమే సమస్యకు మూలం.

అత్తా ఒకింటి కోడలే తానూ అన్ని దశలు దాటుకుని వచ్చానని అత్తలు గుర్తుంచుకోవాలి .

కోడళ్లు కూడా అత్తగారు తన భర్తకు తల్లేనని తన తల్లి తనకి ఎంత ముఖ్యమో ఆయన తల్లి ఆయనకు అంతే ముఖ్యమని గ్రహిస్తే చాలు .

కోడళ్లు కట్నాలు తేలేదని వేధించే అత్తమామలకు కొదవలేనట్టే అత్తమామల్ని అంటీముట్టకుండా అల్లంత దూరాన నిలబెట్టే కోడళ్లూ తక్కువేం లేరు .

*****

Please follow and like us:

One thought on “షర్మిలాం“తరంగం”-5”

  1. ఇది ఆడవాళ్ళలోనే కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రాయిడ్ సిద్ధాంతం.sons and lovers అనే నవల లో చక్కగా వర్ణిస్తారు

Leave a Reply

Your email address will not be published.