ఉనికి పాట
కదిలిందొక కాండోర్…!
ఎల్ కాండోర్ పాసా…!
-చంద్ర లత
***
కొండమీద “కో” అంటే, “కో… కో… కో…” అని అంటుంటాం. వింటుంటాం.
కొండగాలి వాటున గిరికీలుకొడుతూ, ప్రతిధ్వనించే ప్రతి పలకరింపును ప్రస్తావిస్తూ.
కొండైనా కోనైనా, మాటకి మాట తోడు. మనిషికి మనిషి తోడు. అది ప్రకృతిసహజంగా అబ్బిన మానవనైజం.
పలుకు పలుకులో ఉలికిపాటును నింపుకొని,
చెక్కిన వెదురుముక్కలను వరుసగా కట్టి, తమ ఊపిరితో ఆయువుపాటకు ప్రాణం పోస్తూ, పర్వతసానువుల్లో,లోయల్లో,కనుమల్లో, సతతహరితారణ్యాల్లో, కొండకొమ్ము నుంచి చెంగున దూకే పాలనురుగుల జలపాతాల తుంపరల వాలుగా, అలవోకగా సాగే,
ఆ అనామక ఒంటరి గొర్రెలకాపరుల వేణుగానపు తియ్యందనాల గురించి – ఇక చెప్పేదేముంది!
స్పానిష్ ఆక్రమణల ధాటికి ఎదురొడ్డ లేక, రాజ్యాన్ని వదిలి కకావికలయిన, ఆ “ఇన్కా” నాగరీకుల పరాజయానికి,
మౌనసాక్షి అయిన “మచ్చు పిచ్చు” పర్వతశిఖర సామ్రాజ్య శిధిలాల మీదుగా సాగి, “ పెరు” దేశీయుల నిస్సహాయ, నిరాడంబర జీవితాల్లో ఉత్తేజగీతమై, ప్రపంచ వ్యాప్తమయ్యింది. “పెరు” దేశ జాతీయగీతాల్లో ఒకటయిన, “ఎల్ కాండోర్ పాసా !”
ఆ కొండప్రాంతం ఈ భూమండలమ్మీదే పొడవైన ఆండీస్ పర్వతశ్రేణి. ఆ వెదురుముక్కలపాట జాలువారేది ఆండియన్ వేణువు, ప్యాన్ ఫ్లూట్, నుంచి. ఆ వేణుగానానికి ఊపిరిపోసే గుండెలు మానవనాగరికత ఎరిగిన ఒకానొక పురాతన సమాజ ఉనికికి ప్రతిధ్వనుల స్వరాలు.
పదాలు లేని ఆ స్వరాలపాట, పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు సుమారు నాలుగువందల సంగీతరాగాలు గా ప్రకటించబడింది. అనేక దేశాల్లో వివిధభాషలలో మాటలు అద్దుకొని, సుమారు 300రకాల పాటలు గా పదరచనను దిద్దుకొంది. మొట్టమొదట అమెరికన్ అమెరికన్ జానపద జంటకళాకారులు, “సైమన్ మరియు గార్-ఫంకెల్” లు తమ “ఎల్ కాండోర్ పాసా
(ఇఫ్ ఐ కుడ్, 1970)” ఇంగ్లీషు పాటతో, దీనిని ప్రపంచవ్యాప్తం చేశారు.
ఇక, బాలీవుడ్ సంగీతదర్శకుడు,అనుసరణలదిట్ట, అనుమాలిక్, అటూ ఇటుగా ఒకే సమయంలో, జనరంజకమైన మూడు పాటలకు, ఈ స్వరాన్ని అలవోకగా వినియోగించాడు. “తేరే చాహత్ కె సివా” (జానం,1992) “రాజా కో రాణీ సే (అఖేలే హం అఖేలే తుం,1995)”తారే హై బారాతీ” (విరాసత్,1997).
ఈ రూపేణా, ప్రేమకు, గాఢానురక్తికీ, విరహానికి, వివాహానికి కూడా అందివచ్చిన చిరపరిచిత రాగంగా, భారతీయులను తరతరాలుగా అలరిస్తూనే ఉన్న స్వరకల్పన ఇది సుమా అని చెప్పకనే చెపుతున్న, “ఎల్ కాండోర్ పాసా”, వాస్తవానికి ఒక బాధావిముక్తి గానం. ఒక ఉత్తేజ కెరటం. ఒక ఉద్యమ గీతం. ఒక జీవన సందేశం. ఒక స్వేచ్ఛా స్వరం. ఒక పచ్చటి పాట.
పెరు, వెనిజులా,కొలంబియా, ఈక్విడార్, బొలీవియా,అర్జంటీనా,చిలీ మొదలయిన ఏడు దేశాల మీదుగా సాగుతూ, దక్షిణ అమెరికాఖండం ఉత్తరాది నుంచి దక్షిణం వరకు వ్యాపించిన ఖండాంతర పర్వతశ్రేణి ఆండీస్. భూమండలాన అత్యంత పొడవైన ఈ ఖండాంతర పర్వతశ్రేణి ఏడువేల కిలోమీటర్ల పైగా విస్తరించి వుంది.
ఆండియన్ సంస్కృతిలో అంతర్భాగమైన ఆండియన్ కాండోర్ రాబందు జాతి పక్షి.రెండున్నర వేలఏళ్ళ ప్రాచీన ఆండియన్ నాగరికతల్లో,కాండోర్ అంతర్లీనమై పోయింది. ఆండియన్ పురాణాల్లో జానపదకథల్లో తరుచు పలకరించే , కాండోర్ సూర్యభగవానుడికి దూతలా గా గౌరవించబడింది. అనేక ప్రాచీన సమాజాల్లాగానే, ఆండియన్ సమాజంలోను సూర్యుడిని ఊర్ధ్వ లోకాధిపతిగా, ఆదిత్యునిగా భావిస్తారు.
ఆండియన్ కాండోర్ ను సర్వశక్తిసంపన్నమైనదిగా, ఆరోగ్యచిహ్నంగా భావిస్తారు. కాండోర్ అవయవాలు,ఎముకలు ఔషధగుణాలు కలిగిఉన్నాయని విశ్వసిస్తారు. వాటి కోసం కాండోర్ ను వేటాడం కూడా సంభవమే. పెరు సంస్కృతిలో , కాండోర్ ను పవిత్రంగా కాపాడుకొంటారు. పెరువియన్ వృషభపందాల్లో, కాండోర్ పాత్ర కీలకమైనది.ఆ ఆదిత్యుని దూతగా మతపరంగాను, సాంస్కృతికంగాను గౌరవించుకొంటారు. ఆండియన్ పర్వతశ్రేణిలోని ఏడు దేశాలకు కాండోర్ జాతీయ చిహ్నం.జాతీయ పక్షి. వైమానికదళాల చిహ్నం. బలానికి, శక్తికి ,ధారుడ్యానికి అన్నిటీకి మించి, స్వేచ్చకు, జీవితేచ్ఛకు కాండోర్ మూర్తీభవించిన ప్రతిరూపం.
( పెరు దేశ మొట్టమొదటి సైనిక చిహ్నం , First Coat of arms of Peru )
ప్రతి ఏడాది, పెరు లో వైభవంగా జరిగే “యవార్ ఉత్సవం “(The Yawar Fiesta ) లో ఎడ్లపోరాటాలు
(బుల్ ఫైట్స్), వారి స్వేచ్చాకాంక్షకు ఒక బలమైన ప్రకటన. స్పానిష్ సామ్రాజ్య సంస్కృతికి ఎద్దు ఒక ప్రతీక అయితే, ఎద్దు తల మీదకెక్కి , కొమ్ముల మధ్యన, మూపురమ్మీద కట్టివేయబడి,ఆ ఎద్దును పొడిచి పోరాటాన్ని నిర్దేశించే కాండోర్, ఆండియన్ స్వేచ్చాస్పృహ. ఫలితం ఏదైనా,చివరికి, కాండోర్ సజీవంగా స్వేచ్చగా ఆకాశంలోకి వదిలి వేయబడుతుంది. నిరంకుశ సామ్రాజ్య ధోరణికి ధిక్కారస్వరాలు ఈ పర్వతప్రాంత పండుగలు పబ్బాలు.
అటు పురాణగాథల్లో ఇటు జానపదకథల్లో ఆండియన్ కాండోర్ కీలకమైన పాత్ర పోషించింది.
మన గరుత్మంతుడిలాగా. గండభేరుండంలాగా.
కళాఖండాలు,చేనేతలు, దుస్తులు, గృహాలంకరణలలో కాండోర్ స్పూర్తి మూర్తిమత్వం పొందింది. సైనికదళ చిహ్నాలుగా,రూపాయల కాగితాలపై, స్టాంపులపై ,పతాకాలపై, విమానాలపై, అనేనేకానేక రూపాలుగా అలంకరించబడి, ఆప్యాయంగా పలకరించే ఈ ఆండియన్ కాండోర్, ఆండియన్ పర్వతశ్రేణి పై నుంచి అదృశ్యమైపోబోయే ఒకానొక అత్యంత ప్రమాదకర సందర్భంలో, ఈ పాట ఊపిరి పోసుకొంది. ఈ పాట కదిలింది. కదిలించింది. పెనునిద్దరను వదిలించింది. శృంఖలాలను బద్దలుకొట్టింది. స్వేచ్ఛగా, బలంగా, సర్వశక్తి సంపన్నంగా. ఒక ఆండియన్ కాండోర్ లా. ***
ఈ దుర్గమ ఆండీస్ పర్వతశ్రేణులు విస్తృత సుసంపన్న సహజవనరులకు మూలకేంద్రాలు. చిలీ తరువాత, ప్రపంచంలోనే మూడవ”రాగి” నిల్వలు ఇక్కడ ఉన్నాయి. వెండి, బంగారం గనులు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. స్థానిక క్యుయొచా ప్రజలు ఇక్కడి నదిని పిలిచే పేరు,“ కొరిమాయో (బంగారు నది).”
1859 నాటి రామండి, యనకొచా ప్రాంత జియోలాజికల్ సర్వేవిశేషాలను ప్రస్తావిస్తూ టీల్ లూయి, ఈ “కారాచుగో” బంగారుగనుల ప్రస్తావన తెచ్చాడు.అవి పారదర్శకమైన క్వార్ట్జ్ రాళ్ళు పరుచుకొన్న పర్వతసానువుల్లో, అరణ్యాల్లో, లోయల్లో, పొడవాటి గుహాంతర్భాలలో నిక్షిప్తమై ఉన్నాయని, స్థానికులకు ఆ దుర్గమమార్గాల రహస్యాలన్నీ తెలుసునని రాశాడు.
సుసంపన్న ఖనిజాల నిల్వలను గుర్తించిన ప్రపంచం సహజంగానే , ఆండీస్ పర్వతాల పై గని యాజమాన్యాలు వాలి పోయాయి. స్థానిక ప్రభుత్వాలు తమకు అనుకూలంగా వ్యవహరించేలా, గనుల యాజమాన్యాలు పరోక్ష, అరాచక రాజకీయపెత్తనం మొదలుపట్టాయి. స్థానికులు గని కార్మికులుగా మార్చబడ్డారు. మలచబడ్డారు. వారి ఇష్టాఇష్టాలతో ప్రమేయంలేకుండా. తొలినాటి స్పానిష్ సామ్రాజ్యాలకు, ఇరవై శతాబ్దపు యూరోప్, ఉత్తర అమెరికా ఖండాల యాజమాన్యాలు తోడయ్యాయి. ఆండియన్ జీవనసంస్కృతిలో కొత్త పెత్తందారీవిధానాలు మొదలయ్యాయి. దోపిడీ, దౌర్జన్యం, అణిచివేతలు ఆ ప్రకృతిబిడ్డలపై వాలిపోయాయి. ఆనాటికీ ఈనాటికీ, దక్షిణ అమెరికాలో పెరు అభివృద్ధి చెందవలసిన దేశాల జాబితాలోనే మిగిలి ఉన్నది. పెరు దేశస్తులలో అధిక శాతం కనీసవసతులకు నోచుకోని, కడు బీద జీవితాలను గడుపుతూనే ఉన్నారు. వేలాది సంవత్సారాలుగా వాళ్ళు నడిచిన ఆ పచ్చటినేల కింద, సుసంపన్న వెండి,బంగారం,రాగి నిల్వల ఖనిజసంపద బయటకు తవ్వితీస్తుకొద్దీ, వారు ఆ భూమి లోలోపలి పొరల, సొరంగాల లోలోతుల్లోకి కూరుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలో, ఒక స్వేచ్చాస్వరం వారిని పలకరించింది “ఎల్ కాండోర్ పాసా” అనే జార్- జువేలా రూపంలో.
జార్ – జువేలా స్పానిష్ సంగీతనాటకం. మాటలకు, పాటలకు విడివిడిగా మలిచిన సన్నివేశాలతో , అటు సంభాషణలకు ఇటు గీత సంగీతాలకు సమపాళ్ళలో ప్రాధాన్యతను ఇచ్చే నాటకరూపం. సాధారణంగా, ఈ జార్-జువేలా సంగీతనాటకం లోని పాట క్రియాశీలకంగాను, జనరంజకంగాను ఉండి, తరుచు నృత్యాన్ని కూడా తోడుచేసుకొంటుంది.
పదిహేడో శతాబ్దం ఆరంభంలో , మాడ్రిడ్ సమీపంలోని విలాసమందిరాల్లో మొదలయ్యి, ఆనాటి రాజుల మృగయావినోదాలలో ,ఆటవిడుపుకోసం అలరించిన ఈ జార్- జువేలా, క్రమేపీ జనసామాన్యంలోకి చొచ్చుకు పోయింది. ఈ విలక్షణ సంగీతనాటక ప్రక్రియ స్పానిష్ సామ్రాజ్యంతో పాటుగా విస్తరిస్తూ పోయింది. ఇరవై శతాబ్దంనాటికి, ఆధునికమై అనేకానేకులకు ఉద్యమ మాధ్యమంగా అంది వచ్చింది.
“వందేళ్ళ క్రితం కదిలిందొక కాండోర్ ” అన్న శీర్షిక తో 2013 లో పునరుద్ధరించబడిన, ఎల్ కాండోర్ పాసా , ఒక పెరువియన్ జార్ – జ్యువేలా(zarzuela).
దానియెలా లోమియా రోబ్లిస్(1871-1942) (Daniel Alomía Robles)
పెరువియన్ స్వరకర్త దానియెలా లోమియా రోబ్లిస్ 1913 లో స్వరపరిచిన ఈ స్వరం, ఆ జార్-జ్యువేలా పతాకశీర్షికలోని, ఆఖరి అంకంలో జరిగే ఊరేగింపు ప్రదర్షనకు ముగింపుగీతంగా ప్రదర్షించబడుతుంది.పాట పూర్తి అవ్వగానే, వేదిక మీదున్నవారు, వేదిక ముందున్న వారు ముక్తకంఠంతో, “మేమందరమూ ఆండియన్ కాండోర్ లమే”అని ఉవ్వెత్తున గర్జింజడం కేవలం క్షణికోద్రేకం కాదు.యాదృచ్చికం అంతకన్నా కాదు. ఆ పాట వేదిక మీదున్న ప్రదర్షనకారుల, వేదిక ముందున్న ప్రేక్షకుల, పేగులు మెలిమెట్టి, గుండెలని చిక్కబట్టి, గొంతుల్లోంచి పెల్లుబికిన ఆక్రందన, ఆక్రోశం. ఆ ఆకాశం దద్దరిల్లేంత స్పందన.
ఆ ఆండియన్ అడవిబిడ్డల జీవితాల్లోంచి పుట్టిన ఈ స్వరం, చెట్టు, పుట్ట, గుట్టలపై వారు అల్లుకున్న అవ్యాజ్యమైన ఆప్యాయతా అనుబంధాలకు ప్రతీక.ప్రపంచవ్యాప్తంగ పర్యావరణపరిరక్షకుల ప్రయత్నాలకు సహజంగానే ముడిపడిన బంధువు ఈ పచ్చటిస్వరం.
శతాబ్దానికి పైగా, ఆండియన్ స్థానికులను పెరువియన్ దేశస్తులకు ఆయువుపాట అయిన “ఎల్ కాండోర్ పాసా (కదిలిందొక కాండోర్) ”, మొట్టమొదటి సారిగా,19 డిసెంబరు, 1913 నాడు, “ పెరు” దేశరాజధాని, “లీమా” నందలి “థియెట్రో మాఝి” లో ప్రదర్షించబడింది.
ఎల్ కాండోర్ పాసా, తొలి ప్రదర్షన బృందంతో దానియెలా లోమియా రోబ్లిస్ (లీమా,1913)
ఈ పాటలోని మకుటాన్నే శీర్షికగా చేసుకొన్న స్పానిష్ జార్-జ్యువేలా, పెరువియన్ సెర్రో-డి-పాస్కో వెండిగని కార్మీకులకు, ఆ స్పానిష్ మైనింగ్ కంపెనీ కి మధ్య ఉన్న సంబంధాలను మొట్టమొదటి సారిగా ప్రశ్నించిన బలమైన సాంఘిక నాటకం. పెరువియన్ అడవిబిడ్డల సంఘర్షణల తొలి సంతకం. గుండెల్నిమెలిపెట్టే పొలికేక. “ఎల్ కాండోర్ పాసా”
ఈ జార్ జ్యువేలాను -ఒక సంగీతరూపకం, రెండు సన్నివేశాలుగా- రచించిన వారు, జూలియో-డి-లా-పాజ్ అన్న కలంపేరుతో రాసిన జూలియో బొదొవిన్ (1888-1925), అనే లీమానియన్ నాటక రచయిత.
జార్- జ్యువేలా మొట్టమొదటి పాఠ్యాంతరం నుంచి సేకరించిన, తొలినాటి ఏడు సంగీత ఖండికల పునరుద్ధరణ 2013 లో జరిగింది. “కలెక్టీవో కల్చరల్ సెంటెనారియో -ఎల్ కాండోర్ పాసా” అసోసియేషన్ వారు ఈ బృహత్కార్యానికి పూనుకొన్నారు. ఈ స్వరపరిచిన సంగీతపర్వాలన్నీ, ఆర్కెస్ట్రా దృష్ట్యా స్వరపరిచినవి. ఆండియన్ సంగీతపరికరాల పై కాకుండా, పియానో సంగీతస్వరాలపై స్వరపరచి , భద్రపరచబడ్డాయి. ది -ఎడ్వర్డ్ B. మార్క్స్ మ్యూజిక్ కార్పొరషన్ పేరిట, 1933 లో న్యూయార్క్ లో రోబెల్స్ పేటెంట్ పొందాడు. ఆనాటి పియానో స్వరాలను, అసలుసిసలు ఆండియన్ సంగీత పరికరాలపై, ఈ అసోసియేషన్ వారు తిరిగి రికార్డ్ చేశారు.
ఈ జార్-జ్యువేలా లోని ప్రసిద్ధమైన, నాంది (prelude), ఊరేగింపు (parade),క్యాచ్యువా( cachua ) వలయాకార బృందనాట్యం మొదలయిన ప్రధానఘట్టాల సంగీతస్వరాలను తిరిగి, తొలినాటి ప్రదర్షనలశైలిలో పునర్నిర్మించారు.
పెరువియన్ ఆండీస్ ప్రాంతంలో, “యపాక్” ఖనిజగని చుట్టూ సాగే ,ఈ జార్-జ్యుయేలా కథ 20 వ శతాబ్ద ఆరంభకాలంలో సాగుతుంది. ఫ్రాంక్ ఒక యువ గని కార్మీకుడు. ఎప్పటి లాగానే, ఆ పొద్దున్నే గని పనికోసం బయలుదేరుతాడు. గనికి వెళ్ళేదారిలో, కొండకొమ్మున కూర్చుని, ఆండియన్ మురళి వాయిస్తున్న ఒక గొర్రెలకాపరి,
ఆ మురళి పాటతో పాటూ, మేఘాల్లోకి హాయిగా నడుచుకొంటూ వెళ్ళడం, పరవశుడై చూస్తాడు.
గని కలుగుల్లో, చీకటి చెమ్మల్లో మగ్గుతూ, బతికే తమ జీవితానికి, వేణువూదుతూ కొండల్లో స్వేచ్చగా తిరిగే ఆ గొర్రెలకాపరి జీవనానికి నడుమ ఉన్న తారతమ్యం అతడిని విస్మయుణ్ణి చేస్తుంది. అతని స్నేహితులు అతనిని ‘ కొత్త ఆలోచనలను కట్టి పెట్టి, గని లోకి దిగమని’ బతిమిలాడుతారు. ఆ నాంది (prelude) పాట కలిగించిన పారవశ్యము,
ఆ రగిలించిన ఆలోచనల ఉద్విగ్దత తో ఉక్కిరిబిక్కిరి అవుతూ, ఒక రాయి మీద కూలబడ్డ ఫ్రాంక్ ను, ఆ గని యజమానులు గమనించడం తో, కథ పక్వాన పడుతుంది.
ఫ్రాంక్ కథకు సమాంతరంగా రుపెర్టో అనే యువ గొర్రెలకాపరి కథ సాగుతుంది. రుపెర్టో ,జ్యువానచానా ప్రేమికులుగా పరిచయం అవుతారు. వారిద్దరి చిలిపి ఆటలుపాటల నేపథ్యంలో, విషాదంలో కూరుకుపోయిన ఫ్రాంక్ లోని అంతర్మథనం చిత్రిస్తారు. “దయనీయమైన నా ఆత్మ బంధీ కాబడింది” అన్న పాట ఫ్రాంక్ పాడుతోండగా.
రుపెర్టో పెళ్ళికి ఊరు ఊరంతా సంబరంగా మునిగి తేలుతున్నా, గని కార్మీకులను మాత్రం వారి పని వదిలి వెళ్లనివ్వరు. అప్పటికే, గనిలోకి దిగని ఫ్రాంక్ మీద చర్య తీసుకోవడానికి, గని యజమానులు Mr.కింగ్ ,Mr. కప్ లు తుపాకులు పట్టుకొస్తారు. విషయం తెలిసిన ఫ్రాంక్ తల్లి,మరియా, కింగ్ దగ్గరికి పరిగెత్తుకు వస్తుంది. కింగ్ కు, తనకు పుట్టినబిడ్డ ఫ్రాంక్ అని చెపుతుంది. ఫ్రాంక్ కి ప్రాణ భిక్ష పెట్టమని వేడుకొంటూంది. మరియా పట్ల కింగ్ కు గల సానుకూలభావం చేత, కింగ్ ఆమెకు అభయం ఇస్తాడు. ఇద్దరూ కలిసి, ఫ్రాంక్ ను మన్నించమని ప్రార్థన చేస్తారు.
ఈ అక్రమసంబంధం రూపేణా, తన భార్యమీద జరిగిన కింగ్ అకృత్యాన్ని గ్రహించిన, మరియా భర్త, హీజినియో, తన నిస్సహాయ స్థితికి లోలోన రగిలి పోతుంటాడు.
రుపెర్టో పెళ్ళిసందర్భంగా, ఆ గని ఉపరితలాన ఒక విందు ఏర్పాటు చేస్తారు. ఊరు ఊరంతా అక్కడికి తరిలివచ్చి, వేడుకల్లో మునుగుతుంది. వారికి అతీతంగా, భూమి లోలోపలి కలుగుల్లోని గని కార్మీకులు , తమ పని తాము చేసుకొంటూ, మంచీ చెడులకు అతీతంగా సాగుతోన్న తమ బందీ బతుకులను తలుచుకొంటూ , లోలోపల కుమిలి పోతుంటారు.
పెళ్ళివారందరూ వలాయాకారంలో నిలబడి, పాటలు పాడుకొంటూ, “క్యాచ్యువా” నాట్యం చేస్తుంటారు. అనుకోకుండా కారుమబ్బులు కమ్ముకు వచ్చి, ఫెళ ఫెళ ఉరుములు మెరుపులతో, జడివాన కురవడం మొదలుపెడుతుంది. ముహుర్తానికి పెళ్ళి జరగాలని కోరుతూ, ఊరి వారందరు తమ ఆదిశక్తి, “పాన్శమామ, ఇమ్తీ“ ని ప్రార్థిస్తారు. విచిత్రంగా, మబ్బులు విచ్చిపోయి, సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు.
పెళ్ళివిందులో తప్పతాగిన కింగ్, ఫ్రాంక్ తండ్రిని దుర్భాషలాడుతూ, ఊరందరి ముందు ఘోరంగా అవమానిస్తాడు. దెబ్బతిన్న, హీజినియో, విందు అనంతరం కింగ్ ను అనుసరిస్తాడు. కొండకొమ్ము మీద నుంచి కింగ్ ను హీజినియో తోసేయడం ఒక గొర్రెలకాపరి కంట పడుతుంది. కింగ్ మృతి విషయం ఊరంతా తెలిసి, తదుపరి పరిణామాల గురించి , ఊరంతా భయభ్రాంతులవుతారు. తమ కుటుంబం పై విరుచుకుపడిన, ఈ విపత్కర పరిస్థితికి , ఫ్రాంక్ తల్లి, మరియా, కుప్పకూలిపోతుంది.
ఈ విషయం తెలిసిన “కప్”, తుపాకీ తీసుకొనివస్తాడు. ఫ్రాంక్ తండ్రి , హీజినియో, పక్షాన నిలబడి, “కప్” కి ఎదిరొడ్డి, పోరాడుతాడు.”కప్” ప్రాణం కోల్పోతాడు. వేగంగా జరిగిన ఈ పరిమాణాలకు, అందరు దిగ్భ్రాంతులవుతారు. ఇంతలో, లోయ మీదుగా,ఒక ఆండియన్ కాండోర్ కదిలివస్తుంది. చాలాకాలం తరువాత.
ఆ శుభవార్తను, కొండ మీది గొర్రెలకాపరి వేణువు మోసుకొస్తుంది. అన్ని అడ్డంకులు తొలగిన ఆనందంతో, సాగే ఆ పెళ్ళి ఊరేగింపు పాటే, ” కదిలిందొక కాండోర్.”
ఒక కొత్త జీవితానికి, మార్పుకు, ఆశకు, స్వేచ్ఛకు ప్రతీకగా ఈ స్వరం సాగుతుంది. పాట పూర్తయ్యాక వేదిక మీదున్న వారందరూ, “మనమందరమూ కాండోర్ లమే” అని పెద్ద పెట్టున నినాదించడంతో జార్ -జ్యువేలా ముగుస్తుంది.
జూలియో బొదొవిన్ ( 1888 -1925)
బొదొవిన్ తన జీవితకాలంలో, సుప్రసిద్ధమైన నాటకరచయిత, నవలాకారుడు,కథకుడు.అన్నిటీకీ మించి, పాత్రికేయుడు.
“ఎల్ కాండోర్ పాసా” ప్రభావవంతమైనదైనా, “పెరు” దేశ ఆలోచనలపై ఇంకెంతో బలమైన ప్రభావాన్ని కలిగించిన బొదొవిన్ ఉత్తమ గ్రంథం, “ఓపియం కల లేదా ఆసియన్ ప్రమాదం” (Dream of Opium or The Asian Danger)
స్పానిష్ సామ్రాజ్యవాదపు చేతిలో చేయి వేసుకొని, ఆనాటి చైనా నుంచి దిగుమతి చేయబడుతోన్న నల్లమందు దృష్ట్యా , ఆండియన్ సంస్కృతిని మూలాలను కబళించేది ఆసియనిజం అని బొదొవిన్ భావించాడు. ఓపీయం దురాక్రమణపై, దాని చుట్టూ అల్లుకొన్న విషసంస్కృతి పై తీవ్రస్థాయిలో పోరాటానికి పిలుపునిచ్చాడు.
“పెరు” భవిష్యత్తును కళ్ళకు కట్టినట్లు బొదొవిన్ ఆనాడే హెచ్చరించడం, జాగ్రత్తపడమని ప్రమాదఘంటిక మోగించడం, ఈనాటికీ “పెరు” ఆ ఊబిలోనుంచి బయటకు రాకపోవడం గమనిస్తే, వందేళ్ళ భవిష్యత్తును ఊహించిన ఆ మేధావి దూరదృష్టి విస్మయపరుస్తుంది.
బొదొవిన్ “సెర్రో -డి -పాస్కో” గనుల ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, అక్కడి దుర్భర పరిస్థితులపై “లా నేసన్” వార్తాపత్రికలో (“La Nación”), వరుస వార్తాకథనాలను ప్రచురించాడు. గని కార్మీకుల క్షేమం కోసం పనిచేసే ఉద్యకారులతో, సంస్థలతో అతనికి సన్నిహిత, సానుకూల సంబంధాలు ఉండేవి. అప్పుడే, ఒక సమావేశంలో రోబ్లిస్ తో బొదొవిన్ కు పరిచయం అయ్యింది. కాలక్రమేణా, గనికార్మికుల జీవితాలతో ముడి పడిన వారిరువురి ఆలోచనల్లోంచి, “ఎల్ కాండోర్ పాసా” రూపుదిద్దుకొంది.
“ఎల్ కాండోర్ పాసా” స్వరమే, లేకుంటే, బొదొవిన్, చరిత్రపుటల్లోంచి ఏనాడో మలిగిపోయే వాడు. పిన్నవయస్సులో, రచయితగా, ఉద్యమకారుడిగా, ఉవ్వెత్తున పోరాటం చేస్తోన్న ఉచ్చదశలో, విషాహారం బారిన పడి, అర్ధాంతరంగా, ఆకస్మాత్తుగా మరణించాడు. కారణం తెలియని రహస్యంగా మిగిలిపోయిన ఈ ఆకస్మికమరణంతో పాటూ, అతని నిజాయితీ ప్రయత్నాలు, పోరాటాలు, పెరు దేశచరిత్ర మడతల్లో అణిగిపోయాయి. పెరువియన్ జ్ఞాపకాల్లో నుంచి అతను తొలగిపోయాడు.
అలా, ఆనాటి నిరంకుశ ,నియంతృత్వ , సామ్రాజ్య పాలనలలో, ఒక స్వేచ్చాస్వరం నిశ్శబ్దంగా అణిచి వేయబడింది,తొలగించబడింది, అని గ్రహించాడానికి పెద్ద పరిశోధన అక్కరలేదు. అయితే, బొదొవిన్ ఆలోచనకు, ఆక్రందనకు ఆయువుపోసి ,వందేళ్ళకు పైగా సజీవపరిచి ,మన తరం దాకా మోసుకు వచ్చింది, ప్రపంచ ప్రసిద్ధమై, అత్యంత జనాదరణ పొందిన ” ఎల్ కాండోర్ పాసా ” స్వరమే.
పెరువియన్ పర్వతాలలో ఊపిరిపోసుకొన్న కొండపాట, ఇంతై ,అంతింతై, విశ్వవ్యాప్తం కావడం కూడా ఆసక్తికరంగానే సాగింది. బహుశా సంగీతచరిత్రలోనే , అత్యంత గౌరవంగా సర్దుబాటయిన, హక్కులవివాదం కూడా ఈ స్వరం హక్కుల విషయంలోనే జరిగింది.
“ లాస్ ఇంకాస్” బ్యాండ్ వారి ప్యారిస్ ప్రదర్షనలో మొదటి సారి, 1965లో ,పాల్ సైమన్ ,ఈ స్వరాన్ని విన్నాడు.
పాల్ సైమన్, లాస్ ఇంకాస్ బ్యాండ్ వారి అనుమతితో, ఈ స్వరానికి ఇంగ్లీషు పదాలను అద్ది , తమ కొత్త ఆల్బం లో జతపరిచారు.లాస్ ఇంకాస్ వారు “ఇది పెరువియన్ జానపదం” అని తెలియపరచినా, ఆ బ్యాండ్ వారిని సహ రచయితలుగా ప్రకటించారు. పాల్ సైమన్ , గార్ ఫంకెల్ జానపదాలను సేకరిoచి ,భద్రపరుస్తున్న సంధర్భం అది.
మొట్టమొదట అమెరికన్ జానపద జంటకళాకారులు, “సైమన్ మరియు గార్ ఫంకెల్”లు విడుదల చేసిన “ఎల్ కాండోర్ పాసా (ఇఫ్ ఐ కుడ్, (1970)” ఇంగ్లీషు పాట సంగీత ప్రపంచంలో మారుమ్రోగిపోయింది. ఈ పాట ప్రపంచవ్యాప్తం అవ్వడం తో పాటు అత్యంత జనాదరణ పొందింది.
“లాస్ ఇంకాస్” బ్యాండ్ స్థాపకుడు “జార్జ్ మిల్చ్ బర్గ్” రాయల్టీని అందుకొంటున్నాడు. ‘పాల్ సైమన్ పాటలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ స్వరరచయిత తన తండ్రి’ అని రోబ్లిస్ కుమారుడు, అర్మాండొ రోబ్లిస్ గొడొయ్, లా సూట్ వేశాడు. విషయం తేటతెల్లం అవ్వగానే, అత్యంత గౌరవంగా రొబెల్స్ ను స్వరరచయితగా ప్రకటించారు పాల్ సైమన్, గార్ ఫంకెల్ ద్వయం. రాయల్టీ తో పాటుగా.
అలా, ఆ పాటతో పాటుగానే, ఆ స్వరరచయిత, ఆ జార్-జ్యువేలా రచయిత, ఆ రచనా సంధర్భము, పెరు చరిత్ర పై ఆ రచనా ప్రభావమూ, ప్రపంచం దృష్టికి వచ్చాయి. ఒకానొక ఆలోచనను, ఒక బలమైన ప్రయత్నాన్ని, ఒక మౌలిక హక్కును, మానవమర్యాదను, ఒక సంస్కృతినీ, ప్రకృతితో పేగుబంధాన్ని, పరిచయంచేసే ఈ పాట, గుండె తడిమి, వెన్నుచరిచి, కార్యాచరణకు పూనుకోమన్నట్టూగా లేదూ? కొండకొమ్ము మీదనుంచి రెక్కలల్లార్చుకొంటూ, మేఘాలను చీల్చేస్తూ, సూరీడి కిరణాలపై సాగి వచ్చి, ఆనాటికి ఈనాటికి, పర్యావరణ ఉద్యమాలకు వెన్నుదన్నై, లక్ష్యం వైపు దూసుకుపొమ్మని, ఎలుగెత్తి చాటే ఆయువుపాట,”ఎల్ కాండోర్ పాసా” (కదిలిందొక కాండోర్ !” )
***
ఆండియన్ వేణువు, ప్యాన్ ఫ్లూట్ లియో రోజెస్, (ఎల్ కాండోర్ పాసా,2012)
- స్పానిష్ పాఠ్యాంతరం
స్వరకర్త: దానియెలా లోమియా రోబ్లిస్ (1913)
జార్ జ్యువేలా: జూలియో-డి-లా-పాజ్ (1913)
స్పానిష్ పదాల కూర్పు : ప్లాసిడొ డొమింగో
తెలుగు సేత : చంద్ర లత
ఆండియన్ కాండోర్ మేలుకొంది.
మరొక ఆనందపు వేకువ వెలుతురులో.
నెమ్మదిగా తన రెక్కలను విప్పార్చింది.
లోతైన లోయలోకి రివ్వున ఎగిరి వెళ్ళి,
సుళ్ళు తిరిగే నీలినది నీటిని పుక్కిట బట్టింది.
రివ్వున సాగే కాండోర్ వెనుకగా,
భూమంతా విస్తరించి ఉంది,
పచ్చదనంతో. ప్రేమతో.
ఇంకా, అంతులేని శాంతితో.
రివ్వున సాగే కాండోర్ వెనుకగా,
ఒక కొమ్మ చివురించింది ,
సూరీడు ఉదయించాడు.
గోధుమ పొలాల లోనుంచి,
గోధుమ పొలాల మీదుగా.
ఆండియన్ కాండోర్ నేలపై వాలింది.
ఆనందపు సూర్యకాంతి తాకగానే.
కాండోర్ కవాతును చూస్తున్న ఆకాశం,
సంభ్రమంతో సన్నగా వెక్కిళ్ళు పెట్టింది.
కనుమ దారంట కాండోర్ దాటిపోగానే,
తన కారుమేఘపు దుఃఖంతో గుక్కపట్టింది.
రివ్వున సాగే కాండోర్ వెనుకగా,
భూమంతా విస్తరించి ఉంది,
పచ్చదనంతో. ప్రేమతో.
ఇంకా, అంతులేని శాంతితో.
రివ్వున సాగే కాండోర్ వెనుకగా,
ఒక కొమ్మ చివురించింది ,
సూరీడు ఉదయించాడు.
గోధుమ పొలాల లో నుంచి,
గోధుమ పొలాల మీదుగా.
“క్యాచ్యువా” నాట్యం
- ఇంగ్లీషు పాఠ్యాంతరం
ఇంగ్లీషు పాట : పాల్ సైమన్ (1970) (If I could )
స్వరకర్త: దానియెలా లోమియా రోబ్లిస్ , జార్ జ్యువేలా: జూలియో-డి-లా-పాజ్ (1913)
“లాస్ ఇంకాస్” బ్యాండ్ : జార్జ్ మిల్చ్ బర్గ్(1965)
తెలుగు సేత : చంద్ర లత
ఒక నత్తనవ్వడం కన్నా, నేనొక చిన్నారి పిచ్చుకనవుతాను.
అవును. నేనవుతాను. అనుకొంటే, తప్పక అవుతాను.
ఒక మరనవ్వడం కన్నా, నేనొక బలమైన సుత్తినవుతాను.
అవును. నేనవుతాను. అనుకొంటే, తప్పక అవుతాను.
సుదూరంగా నేను తేలిపోతాను
ఇప్పుడిక్కడే కనబడి, టక్కున
పడవలా తేలిపోయిన హంసలా .
ఒక మనిషిని ఎటూ కదలనీయకుండా,
ఈ భూమి తో ముడివేశారు.
అతను ఈ లోకాన్ని
తన దిగులుపాటలతో ముంచేస్తాడు.
అవన్నీ విషాద ధ్వనులే.
ఒక వీధినవ్వడం కన్నా, నేనొక పచ్చని అడవినవుతాను.
అవును. నేను అవుతాను. అనుకొంటే, తప్పక అవుతాను.
నా పాదాల అడుగున, మెత్తని అడవి మట్టిని స్పృశిస్తాను .
అవును. నేను స్పృశిస్తాను. స్పృశించగలిగితే,తప్పక స్పృశిస్తాను.
*****
References:
- Spanish lyrics :
Placido Domingo – El Condor Pasa Lyrics | MetroLyrics
http://lyricstranslate.com/en/el-c%C3%B3ndor-pasa-condor-passes.html#ixzz57AZ50F8R
- Placido Domingo: https://www.youtube.com/watch?v=YSY3zPluWCk
- Paul Simon : https://www.youtube.com/watch?v=9BCLb21Y7Z8
If I could lyrics. Songwriters: Paul Simon / Jorge Milchberg / Daniel Alomia Robles
El Cóndor Pasa lyrics © Universal Music Publishing Group
https://www.azlyrics.com/lyrics/simongarfunkel/elcondorpasaificould.html
- El candor pasaa : Zarzeuela :
One hundered years ago….. Play in Spanish
https://www.youtube.com/watch?v=kx9aeKS8V1M
https://www.youtube.com/watch?v=i-Fvq85MTZM
- Leo Rojas : https://www.youtube.com/watch?v=8kQZHYbZkLs
- Cerro de Pasco (https://news.nationalgeographic.com/2015/12/151202-Cerro-de-Pasco-Peru-Volcan-mine-eats-city-environment/#/01perumine.jpg)
- Teal, Lewis; Benavides, Alberto (2010). “History and Geologic Overview of the Yanacocha Mining District, Cajamarca, Peru”. Economic Geology. 105(7): 1173–1190. doi:10.2113/econgeo.105.7.1173.
చంద్రలత రచయిత్రి, అధ్యాపకురాలు. ప్రస్తుత నివాసం నెల్లూరు. 1997 లో వీరి “రేగడి విత్తులు” నవలకు తానా వారి బహుమతి లభించింది. వర్థని (1996), దృశ్యాదృశ్యం (2003) ఇతర నవలలు.
నేనూ నాన్ననవుతా (1996), ఇదం శరీరం (2004), వివర్ణం (2007) కథా సంపుటాలు. “ప్రభవ” అనే చిన్న పిల్లల బడి నిర్వహిస్తున్నారు.