కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ –  తోడబుట్టువు 

-ఆర్.దమయంతి

జీవితం లో ఎవరిని పోగొట్టుకున్నా,  ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే అవకాశం వుంటుంది. కానీ, అమ్మ లేని శూన్యం మాత్రం – ఎప్పటికీ ఖాళీ గానే వుండిపోతుంది. 

కారణం? – అమ్మనీ, అమ్మ లేని లోటుని తీర్చగల ప్రత్యామ్నాయ శక్తి   మరొకటి ఈ సృష్టిలోనే లేదు. అమ్మ అమ్మే. అమ్మ ప్రేమ అమృతభాండమే.

 ఆడపిల్లలకి అమ్మతో గల ప్రేమానుబంధాలు ప్రత్యేకం గా వుంటాయి. అమ్మ చేతుల్లోంచి ప్రవహించే ప్రేమనది-  వొంట్లోకి ప్రవహిస్తుంటుంది. అందుకే అమ్మని చూస్తే సంతోషం, పరవశం కలుగుతుంది. కష్టాలలో అమ్మే గుండె ధైర్యం.  అమ్మే- నిలకడకు స్థైర్యం.

అమ్మ రూపం అద్భుతం. అమ్మ చేసే గారం,  అమ్మ పెట్టె గోరుముద్దుల అన్నం, అమ్మ పాడే గానం..అన్ని  మమకారాలూ అపురూపాలే. అలా అనుక్షణం నీడలా, వెన్నంటి నడిచే  అమ్మ హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ బిడ్డ గుండె ఎంత ఘొల్లుమంటుంది?  

పైగా,  పుండు మీద కారం జల్లినట్టు, అమ్మ స్థానంలోకి ఓ స్త్రీ వచ్చి కుర్చుంటే ఆ చిన్న మనసు కి ఇంకెంత నరకం గా వుంటుంది?  

నాన్న తీసుకొచ్చిన ఆమె ఒకర్తే రాలేదు. ఆమె వెంట ఆవిడగారి ఐదేళ్ళ కూతురు కూడా!

ఇప్పుడెటు వెళ్తుంది ఆ అమ్మాయి కథ?

ఆ కథే – ‘ తోడబుట్టువు

 

***** 

  కథేమిటంటే :

 టెంత్ చదువుతున్న పదిహేనేళ్ళ శ్రావణి కి తల్లి మరణిస్తుంది. ఆ విషాదం నించి ఆమె ఇంకా కోలుకోకముందే, తండ్రి మరొక స్త్రీని, ఆమె తోబాటు  ఐదేళ్ళ పిల్ల -వర్షనీ ఇంట్లోకి తీసుకొస్తాడు. 

‘ఆవిడ – అమ్మ స్థానం లో నా? ‘ శ్రావణి గుండె వొణుకుతుంది. ఆ నిజాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు.  ఆ ఇంటి వాతావరణం భయంకరమౌతుంది. మనసు వికలమౌతుంది.  

కాలం అందరకీ మారింది. కానీ శ్రావణి కి మాత్రం అమ్మ తో గడిపిన కాలమే నిలిచిపోయింది.   ప్రతి క్షణం అమ్మ జ్ఞాపకాలే వెంటాడుతుంటాయి. ఒంటరిగా కుర్చుని, జ్ఞాపకాల సెగ రాజేసుకుంటూ, కన్నీళ్లతో చల్లార్చుకుంటూ బ్రతికేస్తుంటుంది. 

తండ్రి మీదా, సవతి తల్లి రంజిత మీద, చెల్లి కాని చెల్లి – వర్ష మీద తీవ్రమైన  వ్యతిరేకతా భావాలతో రగిలిపోతుంటుంది. 

ఎవరేం చెప్పినా తాను మారే ప్రశ్నే లేదనుకుంటుంది.  తానిలాగే మొండికేసి వుండాలనీ నిర్ణయించుకుంటుంది.  

 కానీ కాలం ఎంత చిత్రమైన ది.   ప్రతి మనిషి కథకీ ఒక మెరుపు లాటి మలుపునిచ్చి పోతుంది. మరి శ్రావణి కథకి ఎలాటి మలుపునిచ్చి పోయింది? –  

తెలుసు కోవాలీ అంటే, తోడబుట్టువు కథ చదవాల్సిందే!    

****

కథలో స్త్రీ పాత్రలు, ఆకట్టుకునే స్వభావాలు : 

శ్రావణి :  పదిహేనేళ్ళ ప్రాయం లో బంగారు కలలు కనే కళ్ళల్లో కన్నీటి ఉప్పెనలు ప్రవహించడం ఎంతైనా దయనీయం! విధి విలాసం అంటె అంతేనేమో! చిన్న వయసులోనే పెద్ద దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ లేత హృదయం పడే బాధ ఎలా వుంటుందో,  అమ్మ లేని లోటుని, ఆ శూన్యాన్ని ఎలా పూరించుకోవాలో తెలీక పడే యాతన ఎంత దయనీయం గా వుంటుందో – శ్రావణి పాత్ర లో చూస్తాం.

 తల్లి దూరమై, బాధపెడుతున్న మనోవ్యధ  ఒక వైపు, తండ్రి – మరో స్త్రీని పెళ్ళాడటం మరో వైపు.  రెండు రకాల బాధలూ కలిసి ఒక్కసారిగా ఆమె పై దాడి చేస్తాయి.  ప్రాణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.  

సవతి తల్లిని  అంగీకరించలేని మనసు, తండ్రిని వ్యతిరేకించలేని వయసు, అయిష్టం గా ఆ కుటుంబంతో కలిసి  బ్రతకాల్సి రావడం ఇంకోవైపు, విముఖత ని వ్యక్తపరచి బయటపడలేని అసహాయత లో వున్న ఒక అమ్మాయి మానసిక పరిస్థితి ఎలావుంటుందో – అద్దం పట్టి చూపిన పాత్ర – శ్రావణి. 

  శ్రావణి పాత్రకు జీవం పోసారు రచయిత్రి. – ఎంత లా సజీవమై కదులుతుందంటే, ‘పాపం! పిచ్చి పిల్ల. ఎలా నలిగిపోతోంది?’ అని పాఠకుడు జాలి పడి, కరుణ చూపేలా,  పాత్ర ని సృజించారు.   

‘అసలు ఇలాటి  దుస్థితి తనకెందుకు కలగాలి?’ –  అని తన దురదృష్టాన్ని మరో సారి గుర్తుచేసుకుంటూ  ‘అసలు అమ్మ ఎందుకు వెళ్ళిపోవాలి?’ అని, గుండె కరిగిపోయే లా   దుఃఖించే శ్రావణిని – పాఠకులెవరూ మరచిపోలేరు.   

ఇంటి ఇల్లాలి ని బట్టే  ఆ ఇంటి వాతావరణమూ మారుతుంది.  శ్రావణి కీ ఆ తేడా స్పష్టంగా తెలుస్తోంది.  ఇప్పుడా ఇంటి మీద తన తల్లి – ప్రేమ సంతకం లేదు. ఆ వాతావరణం తన తల్లి వున్నప్పటి ఇంటి వాతావరణం కాదు. అందుకే ఆమెకి ఇంటికెళ్ళబుధ్ధి కావట్లేదు.

 తనకిష్టమైన వంటలు చేసి, తను స్కూల్ నించి రావడం కోసం ఎదురుచూసే  తల్లి లేని ఆ ఇంటికి వెళ్ళాలంటే..?

 ‘అయ్యో! శ్రావణీ !!’ అని పాఠకుని హృదయం ద్రవిస్తుంది! 

కొన్ని దుఃఖాలు ఎలా వుంటాయంటే, ఇతరులతో  చెప్పుకుని ఓదార్పు పొందలేనంత తీవ్రం గా వుంటాయి.  గుండె లేని మనిషి లా బ్రతకాల్సి వస్తే ? – అందుకు నిలువెత్తు సాక్షి లా  నిలుస్తుంది శ్రావణి కారెక్టర్!

జీవితంలో  ఇలాటి విషాదాన్ని.. ఎప్పుడో ఒకప్పుడు.. ఎంతో కొంత అనుభవించిన ప్రతి మదికీ  – శ్రావణి బాధ అర్ధమౌతుంది. ఆ పాత్ర పాఠకుల హృదయానికి హత్తుకు పోయేలా అద్భుతం చిత్రీకరణ జరిగింది.   

ఆ రోజు  – అమ్మ వెళ్ళిపోయిన తిథిరోజు. తండ్రి మీద కోపం గా వుంటుంది. ఎందుకంటే,  వర్షని ఇంట్లో వదిలేసి ఇద్దరూ కలిసి వూరెళ్ళారని.  

స్వభావ రీత్యా – శ్రావణి కి చెల్లి కాని చెల్లి  – వర్ష అంటే వొళ్ళు మంట. కానీ ఇప్పుడు తనే ఆమెని చూసుకోవాలి.   అంతలోనే ఒక పెద్ద తరహా స్త్రీలా ఆలోచిస్తుంది. ‘ పోన్లే , నాతో బాటే అదీను. ఇంత నూడుల్స్ చేసి పెడతా దానికి కూడా’   అని అనుకునే శ్రావణి సాఫ్ట్ కార్నర్ కి నవ్వొస్తుంది.

ఆడ మనసు పైకెంత కఠినమో, లోన అంత వెన్నతనము వుంటుందనే  స్వభావ చిత్రీకరణ ఈ పాత్రలో దాగుండటం – ఎంతైనా గమనించదగినది.

 ఏ వయసు వారు కానీండీ, స్త్రీ లో  ఒక గొప్ప సహజ స్వభావం వుంతుంది. అదే  బాధ్యత! కమిట్మెంట్. కుటుంబంలో ఎన్ని పొరపొచ్హ్చాలుండనీండీ,  స్త్రీలు తమ బాధ్యతని మాత్రం మరచిపోరు. తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తారు.  ఎంత కోపం వున్నా, ఎంత మొండి పట్టుదల వున్నా, ఇంట్లో ఒక జీవి తన మీద ఆధారపడి వుందీ అంటే ఎలెర్ట్ అవుతారు. తను  వండి పెట్టడం కోసం ఎదురుచూస్తోందీ అంటే, అయిష్టం గా అయినా సరే ముందు ఆ పని పూర్తి చేస్తారు. శ్రావణి లో – ఈ సహజ సుగుణం పుష్కలం గా నింపడం తో ఆ పాత్ర ఔన్నత్యం మరింత వన్నె తేలింది.  

అలా.. ఆలోచనలతో ఇల్లు చేరుతుంది. కానీ ఇంట్లో  వర్ష కనిపించదు. 

గుండె గుభేల్మంటుంది. తన మీద వదిలి వెళ్ళినందుకు  తండ్రినీ పిన్నీనీ ఇంత సేపూ తిట్టుకున్న- శ్రావణి,  మనసు మనసులో లెనిదైపోయింది.   

ఏమైంది పిచ్చిది? 

వొళ్లంతా కళ్ళు చేసుకుని ఆత్రం గా వెదుకుతున్న ఆమెకి చెల్లెలు కనిపిస్తుంది. కానీ ఎలాటి స్థితిలో అంటే,  చూసీ చూడటం తోనే భయంతో వెర్రి కేకపెట్టేంత దీన స్థితిలో కనిపిస్తుంది. 

అప్పుడేం చేసింది శ్రావణి ?

చెబితే కథ తెలిసిపోతుందని పాత్ర వివరణ ఇక ఇక్కడితో ఆపేయాల్సి వస్తోంది.  

 స్త్రీ హృదయాన్ని  కొలవడం కష్టమే. చిన్న చిన్న అంచనాలకు అందదు మరి! 

శ్రావణి పాత్ర ఔన్నత్యం కూడా మాటలకందనంత అద్భుతం గా సృష్టించారు. 

***

 వర్ష  పాత్ర : ఈ పాత్ర  సృష్టి ఎంతో అపురూపంగా వుంటుంది కథలో!

శ్రావణి కంటే చిన్నదే అయినా ఎంత గొప్ప మనసు గల అమ్మాయో – ఈ చిన్నది!

ఈమెకి తన పూర్వం తండ్రి  – గుర్తుంటాడు. తల్లి అతనితో కంటె, శ్రావణి తండ్రి తో వున్నప్పుడే సంతోషం గా వుందని చెబుతుంది. ఆ మాటల్లో ఎన్ని అర్ధాలు కనిపిస్తాయో మనకి. ఎంత జాలేస్తుందో వర్ష చెప్పే మాటలకి.

అక్కకి తనంటే ఎందుకు కోపమో తండ్రి వివరించి చెప్పాడంటుంది. 

‘పాపం. అక్కకి అమ్మ లేదు. తనకుంది. అందుకే తనే సర్దుకుపోవాలీ అని మనసులో నిర్ధారించుకునే  వర్ష – పాఠకుల మనసుని అమాంతం దోచేసుకుంటుంది. ‘ఎంత ఎదిగిపోయావ్ రా వర్షా! ‘ అంటూ, ఈ పాత్ర పట్ల    పాఠకులు ముగ్ధులౌతారు. అంతలా ఆకట్టుకుంటుంది – వర్ష పాత్ర చిత్రీకరణ.

అక్కకి తనంటే కోపం వున్నా, మాట్లాడకపోయినా, వెంట వెంట తిరగడం వల్ల శ్రావణి మనసు కరిగిందని ఈ ఒక్క రోజు అనుభవం లో  తెలుసుకుంటుంది. ఎలా అంటే, పాలు కాసి, గ్లాసులో పోసివ్వడంతో అక్క మారిపోయిందని సంబరపడిపోతుంది. ఇలా.. ఇంకొన్నాళ్లకు అక్క  పూర్తిగా మారిపోయి, తనతో ఎంతో ప్రేమగా వుంటుందనే ఆశపడుతుంది. తన మనసులోని ఈ మాటని మనతో పంచుకుంటూ, అందమైన బొమ్మగా మార్చడంలో  నిమగ్నమైపోతుంది.  

అంతలో – కాలింగ్ బెల్ మోగితే,  అక్కే అని అని ఆశగా తలుపు తీస్తుంది. కాదు. పక్కింటి ఆంటీ, ఫ్రూట్ కేక్ ఇచ్చి వెళ్ళింది. 

మళ్లా వొచ్చి బొమ్మ వేయడానికి నించుందా, మరో సారి బెల్ మోగింది. – వెళ్ళి తలుపు తీస్తుంది. 

??     ??     ???

ఇక్కడి దాకా చెపుతూ, ఆగిపోతుంది వర్ష. 

వర్ష  – పదిహేనేళ్ళ శ్రావణి కంటెనూ గొప్ప పరిపక్వత గల దానిలా ఆలోచిస్తుంది వర్ష. 

తల్లి జీవితం లో ఎదురైన ఇద్దరి మగాళ్ళలో – మొదటి వాడు తండ్రే అయినా తలచుకోవడం ఇష్టం లేదంటుంది. కారణం – తల్లి అతని ప్రవర్తనతో సంతోషం గా లేదని చెబుతుంది. ఆ వయసుకి అంత వరకే గ్రహించినా అది చాలు తండ్రి పట్ల పిల్లలలకి విరక్తి కలగడానికి.- రంజిత జీవితం లో అనుభవించిన నరకం ఎలాటిదో 

ఆ పసిదాని మాటలలో  అర్ధమైపోతుంది.

 ఇక్కడికి వచ్చాక అమ్మ సంతోషం గా వుందని చెబుతుంది.   కారణం ఈ కొత్త తండ్రి మంచి వాడని, నెమ్మది గా మాట్లాడతాడని తనకు నచ్చాడని  ఇంతింత కళ్ళేసుకుని చెబుతుంది. 

రచయిత్రి, వృత్తి రీత్యా వైద్యురాలు కూడా కావడం మూలాన కామోసు – పసి మనసు భాషని ఇట్టె పట్టేసి తెలుగులోకి అందంగా అనువదించారనిపించింది.  

పదేళ్ళ పసి దానికేం తెలుస్తుందనుకోలేం. ఇల్లు నరకమో కాదో చెప్పడానికి – అమ్మ ముఖ బింబం వారికి అద్దం లాటిది.  అమ్మ నగుమోము లో తాము కనే భావాలను ఆధారం గా చేసుకునే, నాన్న మంచి వాడో, కాడో చెప్పేయగలరు. – అని ఈ కథ లో వర్ష పాత్ర ద్వారా ఒక గొప్ప నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు రచయిత్రి.  అద్భుతమైన వ్యక్తీకరణ!

అమ్మ మనసుని అర్ధం చేసుకోడానికి ఆడపిల్లలు పెద్దగా చదువుకోనవసరంలేదు. ఐదోక్లాసు లోకి రాకముందే వర్ష కి అమ్మ కష్టాలు, కన్నీళ్ళు అర్ధమైపోయాయి. 

తల్లీ కూతుళ్ళ అనుబంధం విడదీయరానిది అంటారు అందుకే మరి.  

ఒక స్త్రీ ని –   కేవలం మరో స్త్రీ మాత్రమే చదివి అర్ధం చేసుకోగలదనే  సత్యాన్ని – ఈ కథలో ని స్త్రీ పాత్రలు అడుగడుగునా రుజువు చేస్తాయి.

మరి ఇంత తెలివి గల మంచి అమ్మాయి, పదేళ్ళ వర్ష – ఇంట్లో కనిపించకుండా  ఏమైంది? ఎక్కడికెళ్ళిపోయింది?

 కథ చదివితే –  ఆ సస్పెన్స్ వీడిపోతుంది.

****

రంజిత : వర్షకి సొంత తల్లి. శ్రావణి కి సవితి తల్లి. కథలో  ఈ పాత్ర ఎక్కడా, ఎవరితో నూ మాట్లాడదు. ఈమె రూపు రేఖలు ఎలా వుంటాయో,  శ్రావణి బాగా వివరించి చెబుతుంది. అఫ్ కోర్స్ – సెటైరికల్ గా నే! రంజిత అందగత్తె కాదు. సన్నగా, పీలగా, నల్ల గా, పొట్టిగా వుంటుంది.  ఆవిడ ఆర్టిస్ట్ కూడా.

 బొమ్మలేస్తుందిట కానీ. ఒక్కటీ అర్ధం కావు .  ఇవన్నీ శ్రావణీ నే చెబుతుంది మనకి.

మరి ఈమెని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు- శ్రావణి తండ్రీ? అని అనుమానం కలుగుతుంది – మనకి.

శ్రావణి అమ్ముమ్మ మాటల్లో ఈమె డైవోర్సీ అనీ, విడాకులిచ్చాక అతను విదేశాలకెళ్లిపోయాడని, పిల్లని ఈమే వుంచేసుకుందని అర్ధమౌతుంది. 

భార్య పోయాక, శ్రావణి తండ్రి ఈమెని, వర్షని ఇంటికి తీసుకొచ్చాడు. అంటే, రెండో వివాహం చేసుకున్నాడు. – ఇదీ రంజిత స్టేటస్. అయితే,  ఇప్పుడు రంజిత సంతోషం గా వుంది. సవితి కూతురు శ్రావణి ఎడమొహం పెడమొహం గా వున్నా, కాలం మార్పు తీసుకొస్తుందని నమ్ముతోంది. తనని అమ్మా అని పిలవకపోయినా, కనీసం  పిన్నీ అని అయినా పిలుస్తుందనే ఆశ పడుతోంది. – 

 

వర్ష పట్ల అంటే తన కూతురి పట్ల శ్రావణికి ఎలాటి ప్రేమా లేదని తెలిసినా  సరే, వర్షని ఆమె మీద వదిలేసి భర్తతో కలిసి వూరెళ్ళిందంటే – గ్రేట్ వుమన్!   తల్లి పాత్ర లో వున్న ఆమెకి ఆ మాత్రం నమ్మకం, సహనం, చాలా అవసరం!- ఇలా అయినా, అక్క చెల్లెళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారనో,  కలిసి ఆడుకుంటారనో, అసలేమౌతుందో చూద్దామనో – అలా భరోసా గా – వర్షని వదిలివెళ్లడం లో ఆ స్త్రీ ఆంతర్యం గోచరమౌతుంది. పాత్ర విశిష్టత సరిగ్గా ఇక్కడే వెల్లువౌతుంది.

ఒక ఇల్లు వెలుగొందాలంటే, ఇలాలికి దీపం వంటి మనసుండాలిట. 

రంజిత లో ఆ  ఇల్లాలి చాయలు చూడొచ్చు మనం  ఈ కథలో.

***

శ్రావణి తల్లి పాత్ర : కథ ప్రారంభం లోనే ఈమె మరణించి కనిపిస్తుంది.  కానీ శ్రావణి దుఃఖం లో, మనతో కలిసి పంచుకునే జ్ఞాపకాలలో ఆవిడ చిరస్మరణీయురాలిగా పాఠకుల హృదిలో నిలిచిపోతుంది. 

అమ్మ – దేవతలా ఎలా వుంటుందో, అచ్చు అలానే ఈ పాత్ర చిత్రీకరణ జరిగింది.  

ఆవిడ బ్రతికున్నప్పుడు ఇల్లెలా వుండెదటా అంటే, ‘ఇల్లంతా ! పువ్వులు, అగరువత్తులు, దేవుడిముందర దీపాలు – గుళ్ళోకి వచ్చినట్లుండేది. ‘ అని తల్లి గురించి శ్రావణి చెప్పడంతో – ఈమెకి ఇల్లు తీర్చి దిద్దుకోవడం లో, దైవభక్తి కలిగి వుంటంలో గల అభిరుచి  అర్ధమౌతుంది. అంతే కాదు, శ్రావణి కి ఇష్టమైన వంటకాలు చేసిపెట్టేది. అమ్మ అంటే నే అన్నపూrNaa దేవి. 

 అమ్మ కమ్మని రూపాన్ని, కళ్లక్కట్టినట్టు శ్రావణి తో చెప్పిస్తారు రచయిత్రి. ఎంత అద్భుతమైన వర్ణన అంటే – ‘అమ్మ చక్కగా, బొద్దుగా చామంతులదండలా ఉండేది. దగ్గరికి తీసుకుంటే ఎంత హాయిగా ఉండేది …’ అనే ఈ ఒక్క వాక్యం చాలు. అమ్మ స్పర్శలో ని  హాయిదనాన్ని నిర్వచించడానికి!

అద్భుతమైన అమ్మ పాత్ర sRshTi,  స్వభావం – పాఠకులను అమితం గా ఆకట్టుకుంటాయనడంలో ఎలాటి సందేహం లేదు.

 

శ్రావణి అమ్మమ్మ పాత్ర : కూతురు మరణించిన కొత్తల్లో, తరచూ శ్రావణి ని చూసేందుకు వచ్చేదని తెలుస్తుంది.

కాపురం చేసుకుంటున్న కూతురు హఠాత్తు గా కాలం చేస్తె, ఇక ఆ ఇంటితో సంబంధం లేదని అనుకోలేరు అమ్ముమ్మలు. ముఖ్యం గా మనవలు మనవరాళ్ళు వుంటే, కొన్నాళ్ళైనా అల్లుడింటికి రాకపోకలు సాగిస్తారు. పాశం – అలా ఆ ఇంటి కి గుంజుతుంది. శ్రావణి అదే చెబుతుంది. అమ్ముమ్మ వచ్చి అన్ని రకాల వంటలు చేసి పెట్టేదనీ, ‘ అమ్మ కబుర్లు’ చెప్పుకుంటూ దుః ఖించే వాళ్లం అనీ!

అమ్ముమ్మ, అమ్మ, కూతురు…ముగ్గురూ స్త్రీలకూ ఒకరితో ఒకరికి గల అనుబంధాలు, మమతానురాగాలు ఎంతో అపురూపం గా వుంటాయి. రచయిత్రి  సునిశితమైన గమనికకకు జేజేలు. అతి సూక్ష్మమైన అంశానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, సన్నివేశాన్ని కేవలం ఒక పేరాలో వర్ణించి చెప్పడం తో ఈ పాత్ర ని మనకు దగ్గర చేసిన ఘనత ఈ రచయిత్రికే దక్కుతుంది.  

ఈ సన్నివేశాలన్నీ మన కుటుంబాలలో జరిగే వే! కానీ రైటర్స్  ఈ అతి చిన్న విషయాన్ని దృష్టిలోకి తీసుకోరు. కథలో ప్రాధాన్యతని  ఇవ్వరు. అసలు జోడించనైనా జోడించరు. కానీ ఈ కథలో అమ్మమ్మ – మనవరాలి పట్ల చూపే  కన్సర్న్ పాఠకుల కన్ను దాటిపోదు. కట్టిపడేస్తుంది. కష్టం లో వున్న మనవరాలికి అమ్మమ్మ –  ఇలా ఓదార్చకపోతే, పిల్లలు మరింత బెంగపడిపోరూ? అని ఒక బాధ్యతనీ గుర్తుచేస్తారు – రచయిత్రి. 

 

 *** 

ముగింపు:

ఈ కథలో స్త్రీ పాత్రలన్నీ అభూత కల్పనలు కావు.   మన కుటుంబాలలో చూసే స్త్రీ మూర్తులే – వీళ్ళూను.  అందుకే ఈ కథ లోని పాత్రలు సజీవ చిత్రాలై నిలిచి, చదువరులని ఆకట్టుకుంటాయి. 

కథా  రచన- కరుణరస ప్రధానం గా సాగినా, ఒక గొప్ప మలుపుతో, కంటి కొసల మెరిసే కన్నీటి చుక్క  మెరుపుతో..కథని ముగించడం – ఒక గొప్ప విశేషం గా పేర్కొనాలి. కథ పూరి చేసాక, అవ్యక్తమైన అనుభూతి తో మనసు మూగపోతుంది. – సందేహం లేదు.  

రచయిత్రి గొప్ప చదువరి. అందుకే వీరి కథలు మరి మరి చదివింపచేస్తాయి.  మనసుని ఆకట్టుకుంటాయి. 

ఇంత మంచి కథని అందించిన రచయిత్రి డా. మైథిలి అబ్బరాజు గారికి  ‘నెచ్చెలి ‘తరపున అభినందనలు అందచేస్తుnnaaను. 

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో..

-ఆర్.దమయంతి. 

 ******

 రచయిత్రి   డా.మైథిలి అబ్బరాజు గారి   పరిచయం :

 నాన్నగారు : డా. అబ్బరాజు శ్రీమన్నారాయణ మూర్తి.  ప్రభుత్వ వైద్యులు. అమ్మ – శ్రీ మతి రాధ. 

 భర్త –  డా. చీమలమర్రి శ్రీ నివాస్

డా.మైథిలి అబ్బరాజు గారు గుంటూరు లో పుట్టారు. చదువు అంతా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సాగింది. 

గుంటూరు మెడికల్ కాలేజ్ లో  Mbbs,Dgo చేశాక, తాడేపల్లిగూడెం లో 20 ఏళ్ళ కు పైన సొంత ప్రాక్టీస్ అనంతరం, ప్రస్తుతం నాలుగేళ్ళుగా బెంగళూరు లో కార్పొరేట్ ఉద్యోగం లో సెటిల్ అయారు.

రచయిత్రి గా :

* 2001 లో తమ తొలి కథ  ‘ నియతి ‘తో సాహిత్య లోకానికి కథా రచయిత్రి గా సాహితీ ప్రస్థానం మొదలైంది.   ఇప్పటి దాకా 14 కథలు మాత్రమే రాసినా, రాసి కంటెనూ వాసి లో మిన్న అయిన ఈ కథలన్నీ   పాఠకాదరణ పొందాయి. రచయిత్రి కి ‘క్లాసిక్ రైటర్ ‘ ప్రత్యేక గుర్తింపుని, పాపులారిటీని  తెచ్చిపెట్టాయి.

అవార్డ్స్: ‘ క్షీరసాగరం’ కథ కి ప్రతిష్టాంక యద్దనపూడి సులోచనారాణి గారి అవార్డ్, 

‘ స్వాధీన ‘ కథ కి ‘కెనడా తెలుగు తల్లి ‘  అవార్డ్స్ పొందాయి.

లెక్కలేనన్ని సాహిత్య వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అవి – వాకిలి, సారంగ ఆన్లైన్ పత్రికలలో పబ్లిష్ అయి,  పాఠకుల మన్ననలు పొంది ఎన్నో ప్రశంసలను అందుకున్నాయి. మరి కొన్ని – ‘ నిమగ్న ‘ అనే సంపుటంగా వచ్చాయి.

ఇవే కాకుండా, సంచిక, ఈ మాట , ఆంధ్ర జ్యోతి లలో కూడా వీరి రచనలు పబ్లిష్ అయ్యాయి.

అనువాదాలు : 

డా. మైథిలి గారు – అనువాద రచనలు చేయడం లో అందె వేసిన చేయి అని చెప్పాలి.  ఈ రచన అనువాదం అని చెబితే తప్ప గుర్తుపట్టలేనంత అందంగా అనువదించగల ప్రతిభావంతులు.  

* She by Rider Haggard ని , Anne of Green gables ని పూర్తి నవలలని,

* చాలా fairy tales ని ‘గాజుకెరటాల వెన్నెల ‘శీర్షిక పేరిట తమ అనువాదాలను పాఠకులకు అందించారు. 

 

 అభిమాన  రచయితలు :

తెలుగులో – విశ్వనాథ, చలం, కొకు, జలంధర, యద్దనపూడి సులోచనారాణి, ఇచ్ఛాపురపు జగన్నాథరావు, మునిపల్లె రాజు , కల్యాణసుందరీ జగన్నాథ్, మాలతీ చందూర్, అరవింద గార్లు! 

ఆంగ్లంలో :  Jane Austen, George Elliott, Wilkie Collins, Emily Bronte,Agatha Christie, L M Montgomery ,F.H. Burnett, Eva Ibbotson.

Patricia A Mckillip –  నావలిస్ట్ అంటే తనకు ఎనలేని  ప్రత్యేక అభిమానం, ప్రీతి అని అంటారు.

హాబీలు : సంగీతంలో ప్రావీణ్యం వుంది. వీరు గాయని కూడా!

**

 

తోడబుట్టువు

– మైథిలి అబ్బరాజు

శ్రావణికి ఇంటికి వెళ్ళాలని లేదు.గార్డెన్ లో – చల్లగా ఉందని తీగలు అల్లించిన పందిరికింద కూర్చుంది. అక్కడ గాలి ఆడటం లేదు, అయినా కదలాలని లేదు.  స్తబ్దత. మొన్న మొన్నటిదాకా కోపం తన్నుకొచ్చేది, కదిలిస్తే ఏడుపొచ్చేది – ఇప్పుడేమీ లేవు. చేసేందుకేం లేదు. అసలిట్లా అంతా ఎందుకు మారిపోవాలి ? ఇంట్లోకి ఎవరెవరో ఎందుకొచ్చి పడాలి ? అమ్మ లేకపోతే మాత్రం ?

 అమ్మ.

 చెరుకు మిషన్ లో తిప్పినట్లైంది.

 అమ్మ లేక రేపటికి రెండేళ్ళు. నాన్నకసలు గుర్తుందో లేదో.  మొన్నెప్పుడో మఠం లో పూజ చేసొచ్చారులే , సరిపోతుందా ? ఇవాళ తనతో ఉండక్కర్లేదా ?  కాన్ ఫరెన్స్ అట కాన్ ఫరెన్స్. వెళ్ళకపోతే ఏమైపోతుందో ? రంజిత పోదామంటే చాలు ఎటోకటు పడిపోవటమేనా ? పోయేవాళ్ళు ఆ వర్షని కూడా తీసుకుపోకపోయారా – అదీ దాని బోడి చదువూనూ …తనమీద పడేసి …  ఇంతకీ నిన్ననే దాని అసైన్ మెంట్ ఐపోయింది, ఇవాళ స్కూలే లేదు.

స్కూల్ లేకపోతే ఇదివరకెంత బావుండేది !  అప్పటికప్పుడు జీడిపప్పు పాయసమో పాలకోవానో  చేసేసేది. అమ్మ- ఉద్యోగం చేసేదికాదు. ఇంట్లోనే, తనెప్పుడు ఏ వేళకి చేరినా బళ్ళోంచో ఆటల్లోంచో. ఎంత చక్కగా సర్దిఉంచేది.

ఇల్లంతా ! పువ్వులు, అగరువత్తులు, దేవుడిముందర దీపాలు – గుళ్ళోకి వచ్చినట్లుండేది. ఇప్పుడేదీ వొద్దుట. అగరువత్తులకి ఆ చిన్న రాణిగారికి అలెర్జీట. తుమ్ములొస్తాయట. పూలు కోసి  తల్లోపెట్టుకోవటం రంజిత కి నచ్చదట. తననేంపెట్టుకోవద్దనలేదులేగాని , అది కాదుగా కావలసింది అసలు ? దేవుడి గదిలోకే ఎవరూ వెళ్ళరిప్పుడు- ఉందంటే ఉందంతే. ఇంటిగోడలంతా ఏవేవో వింత పెయింటింగ్ లు.రంజితే వేసిందట.. వేటిగురించో నాన్నకి చెబుతూంటే వింది గానీ అవేవీ అక్కడేం కనబడనేలేదు.  వర్ష బొమ్మలే కొంచెం నయం -అర్థమవుతాయి.కళ్ళూ ముక్కులూ ఉంటాయి.

  అమ్మ వెళ్ళిపోయాక ఆ ఏడాదంతా అమ్మమ్మ వచ్చిఉంది . ఇద్దరూ కూర్చుని అమ్మని తల్చుకునేవాళ్ళు. ఏడ్చేవాళ్ళు.   అమ్మకిష్టమైనవి చేసేవాళ్ళు. యూనివర్సిటీ నుంచీ వచ్చి నాన్నా తమతో కలిసేవాడు. అమ్మేదో బయటికెళ్ళినట్టూ ఇహనో ఇప్పుడో వచ్చేస్తుందన్నట్టూ ఉండేది. అట్లాగే ఉంటే పోయేది కదా ? ఏమయేదట ??

   అసలా రంజిత ఎలా నచ్చిందో నాన్నకి ?సరిగ్గా వంట చేయటం కూడా రాదు.  సన్న- గా, ఇంత పొట్టిగా చిన్నపిల్లలా ఉంటుంది . అమ్మ చక్కగా బొద్దుగా చామంతులదండలా ఉండేది. దగ్గరికి తీసుకుంటే ఎంత హాయిగా ఉండేది …ఆ రంజిత , ఇలా అని అనుకున్నాక వచ్చి చెప్పి తనని కావలించుకోబోయింది – చీ చీ.   ఆమెకి తోడు వర్ష. ఇంత కళ్ళేసుకుని తనవైపు చూస్తూనే ఉంటుంది . ఏం మాటలుంటాయి ఇద్దరికీ – అది మరీ అయిదోక్లాసయితే. అక్కా అని పిలిస్తే పలకదు శ్రావణి – అది చెల్లెలేమిటి ? క్లాస్ లో ఆ దరిద్రుడు సాగర్ అననే అన్నాడు – ‘ రెడీమేడ్ చెల్లెలు దొరికిందిరోయ్ ‘ అని. కర్మగాకపోతే అదీ కాంపస్ స్కూల్లోనే ఉండాలా ?? రంజితని  పిన్నీ అని పిలుస్తావా అని నాన్న అడిగినప్పుడు తనేం జవాబు చెప్పలేదు. పిలవదు. అసలేమనీ పిలవదు. తప్పనిసరైతే, ఎదురుగ్గా ఉంటే – ఏదో మాట్లాడాలి కాబట్టి అంతే.

   వర్షా వాళ్ళ నాన్న అమ్మ లాగా చచ్చిపోలేదు- అదింకా ఘోరం…అమ్మమ్మ అనలేదూ ? విడాకులు తీసుకున్నారుట – ఆయన అమెరికా పోయాట్ట.అదేమిటో మరి- ఫోన్ లూ స్కైప్ లూ ఏం ఉండవు. వర్ష ఇక్కడ  నాన్న కి అతుక్కుపోయింది. నాన్న అంతకన్నా …పాపా పాపా అని దాన్ని ఏం ముద్దు చేస్తాడో – తనక్కడ ఉండగానే … బావుంటుందిలే అది , తెల్లగా బుగ్గలేసుకుని ! శ్రావణికి దిగులు ముంచుకొచ్చింది. తను ముద్దుగా ఉండదు. చిన్నగా ఉండదు. పోనీ పెద్దదా అంటే పదో క్లాస్ అంతే.  ఆ…తన క్లాస్ లో మాత్రం ఆ రమ్యా అనూషా ఎంత ప్రెటీ గా ఉంటారో- అబ్బాయిలు వాళ్ళ వెనకే తిరుగుతుంటారు . తను – తనెవరికీ అక్కర్లా. అది తనకి కొంచెం ఫ్రెండ్ కాబట్టి, వినీత అంటూ ఉండేది – ” నీ కళ్ళు భలే ఉంటాయి శ్రావ్స్- ముక్కెంత సూదిగా ఉంటుందో ” అని. వాళ్ళమ్మ అనేవారు – ” పెద్దయితే అందంగా అవుతావమ్మా ” అని. వినీత లేదిప్పుడు, వాళ్ళ నాన్న యు కె వెళ్ళారు, అది వాళ్ళ అమ్మమ్మ గారి ఊరెళ్ళిపోయింది.  ఎప్పుడన్నా వాట్సాప్ చేస్తుంది.

   మామయ్యా అత్తయ్యా ఈ వూరొచ్చాక కొంచెం నయం . మామయ్య అమ్మకి బాబాయి కొడుకు. తనకి మటుకే చుట్టం. వాళ్ళెవరికీ ఏం కాడు. తననే పిలిచి ఇంటికి తీసుకెళుతుంటారు వాళ్ళు – అప్పుడప్పుడూ. వర్ష ని పిలవరు. అసలు దాన్ని పలకరించరు.

   ఉక్క పెరిగిపోతోంది – ఇంటికిపోతేనో ? ఫాన్ వేసుకుని టీవీ పెట్టుకోవచ్చు , లేకపోతే వైఫై చూసుకోవచ్చు. మొబైల్ ఏదీ ? ఇంట్లోనే మర్చిపోయి వచ్చింది…రాత్రికొస్తారు కాబోలు వీళ్ళు.ఈ పాటికి ఫ్లైట్ ఎక్కిఉంటారు. నిన్నా మధ్యాహ్నమూ  కాంటీన్ అబ్బాయి భోజనం తెచ్చిపెట్టాడు- ఈ పూట సెలవు వాళ్ళకి. ” వచ్చేప్పటికి కొంచెం రైస్ కుకర్ పెట్టి ఉంచు శ్రావణీ ” అని చెప్పివెళ్ళింది రంజిత. పెట్టదు. అస్సలు పెట్టదు. కప్ ఓ నూడుల్స్ చేసుకు తిని నిద్రపోతుంది. వర్ష ఏం తింటుందో దానిష్టం. 

సరేలే. దానికి స్టవ్ వెలిగించటం రాదుగా, ఇంకో కప్ లో కూడా నీళ్ళు పోస్తే సరి.                                                               

***

డ్రాయింగ్ బోర్డ్  ముందు నిలుచుని బొమ్మ  గీస్తోంది – వర్ష. మమ్మీ, నాన్న వెనకాల నిలుచున్నారు. ముందు అక్క, తను – ఇద్దరూ ..  అక్క మొహాన్ని అతి శ్రద్ధగా దిద్దుతోంది – పోలికలు టక్కున తెలిసేంతగా. కాకపోతే, బొమ్మ లో అక్క నవ్వుతోంది. తనని దగ్గరగా హత్తుకుని నిలుచుంది. వర్ష మొహం మీదికీ తెలియకుండానే నవ్వు వచ్చింది. ఆ పూట సంతోషం గా అనిపిస్తోంది. నిన్నటినుంచీ ఇంట్లో వాళ్ళిద్దరే. అక్క పాలు కాచింది, తన గ్లాస్ లో పోసింది, బోర్న్ విటాకూడా వేసింది. పిలిచి చేతికివ్వలేదులే – అయినా కూడా , తనకోసమే కదా. మెస్ అబ్బాయి కారియర్ తెస్తే ఇద్దరికీ కంచాల్లోవడ్డించింది – ఇంకా ఏం కావాలీ అని అడిగి కనుక్కుంది… ఇట్లాగే ఇంకా ఇంకా ప్రేమగా అయిపోతే ఎంత బావుండు !! 

తనూ, మమ్మీ – ఈ కొత్త ఇంటికొచ్చి ఆరేడు నెలలవుతోంది . అంతకుముందు ఇద్దరే ఉండేవాళ్ళు. ఇంకా ముందైతే – తలచుకోబుద్ధి కాలేదు . చాలా చాలా రోజుల కిందట డాడీ తో కలిసి ఉండేవాళ్ళు. సరిగ్గా గుర్తులేదు -రోజూ కేకలేసేవాడని తప్పించి.  ఒకోసారి మమ్మీ కూడా అరుస్తుండేది. ఎందుకో ఏమిటో తెలీదు. అమ్మా తనూ ఇంట్లో ఉండటం డాడీకి ఇష్టం లేదనిపించేది. ఆఖరికి బయటికి వచ్చేశారు.

  ఇక్కడికొచ్చాక  మమ్మీ హాయిగా ఉంటోంది. నాన్న చాలా మంచివాడు. ఎంత  నెమ్మదిగా మాట్లాడతాడో ! మమ్మీ పిలిచినట్టే పాపా అని పిలుస్తాడు తనని …ఇంకా బాగా కూడా చూసుకుంటాడు కొన్నిసార్లు. 

చెప్పాడు తనతో – ” పాపా  ! అక్క వాళ్ళమ్మ చచ్చిపోయిందమ్మా…అందుకని ఇంకాబెంగపడుతూనే ఉంది. నీతో సరిగ్గా ఉండకపోతే ఏమనుకోకు, నువ్వే ఇంకొంచెం కల్పించుకుని మాట్లాడు ” అని చెప్పాడు. బతిమాలుతున్నట్లు! –  తనకైతే అమ్మ ఉంది , అక్కకి లేదుగా పాపం ! తను మంచి పిల్ల అని మెల్లి మెల్లిగా అర్థమైపోతుంది…ఇప్పుడు కొంచెం అవుతున్నట్లే ఉంది, కదా ?

 బెల్ మోగింది. పక్కింటి ఆంటీ.  ఫ్రూట్ కేక్ చేశారట , వర్షకి ఇష్టమని తెచ్చారట.  సూపర్ మార్కెట్ కి వెళ్ళొచ్చేస్తారట , ఒక్కతీ ఉండగలదా అని అడిగారు.  కాసేపట్లో అక్క వచ్చేస్తుందిగా- ఆ మాటే చెప్పింది. కేక్ ని డైనింగ్ టేబిల్ మీద  పెట్టింది , తర్వాత ఇద్దరూ తినచ్చు…వెళ్ళి బొమ్మ పూర్తి చేసుకుంటోంది.

 మళ్ళీ బెల్ మోగింది.

  *****

డూప్లికేట్ తాళం తో తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది శ్రావణి. మూడు బెడ్ రూమ్ ల క్వార్టర్స్ అవి – తన గది తలుపే హాల్ లోంచి మొదట. మొబైల్ అక్కడే ఉంది బల్ల మీద. చూస్తే మూడు మిస్డ్ కాల్స్.

 ఇంటి నంబర్ నుంచి . వర్ష ఎందుకు చేస్తుంది ? ఎందుకు చేసింది ?

 పక్కనే దాని గది. లేదు అక్కడ. డ్రాయింగ్ బోర్డ్ మీద ఫామిలీ స్కెచ్. తనని తను  గుర్తు పట్టింది …అంత బావున్నట్లు వేసిందే …పక్కన వర్ష బొమ్మ మరీ చిన్నగా , ఇంచుమించు తనని పట్టుకు వేలాడుతూ.

ఎక్కడ ఇది ?  బాత్ రూమ్ లో ఉందా ?

పిలిచింది.

పలకలేదు. లోపల లేదు.

నాన్నా వాళ్ళ గది  ఆ చివరన, వంటింటికి అవతలి వైపు. అక్కడేం చేస్తుంటుంది ?

 నడుస్తోంది.

ఏడుపు. నోటికేదో అడ్డంగా ఉంటే అడుగునుంచి , వెక్కిళ్ళు పెట్టినట్టు.

పరుగెత్తింది.

తలుపు నెడితే – వర్ష కాదు అక్కడెవరో ఉన్నారు మంచం మీద అడ్డంగా. దేంతోనో పెనుగులాడుతున్నారు. ఆ పక్క నుంచి- అయ్యో. అదేమిటి ??? వర్ష చెయ్యి.

ఠారెత్తింది. వెళ్ళి ఆ ఆకారాన్ని లాగింది. అతను లేవటం లేదు.

” లే. లే. వదిలిపెట్టు. వదిలిపెట్టు ”

లాభం లేదు.

పేపర్ వెయిట్ తీసుకుని తలమీద గట్టిగా మోదింది. దెబ్బకి ఇవతలికొచ్చాడు.

 ఎవరు ? ఎవరది ?

మామయ్య.

శ్రావణికి ఏడుపొచ్చేసింది. బిగబట్టుకుంది. ఏడవకూడదు. వర్ష ఇంకా భయపడుతుంది.

” వర్షా వర్షా ఏమైందే ఏమైందే ”

ఒక్క ఉదుటున దాన్ని పైకి లాగి కావలించుకుంది. ఏడ్చేడ్చి దాని మొహం వాచిపోయింది. బుగ్గలంతా గాట్లు.

 ” అయ్యో ఏమైందే ”

‘ మామయ్య ‘ చెప్పాడు – ” ఏం లేదు శ్రావణీ. వర్ష అల్లరి చేస్తుంటేనూ …కొంచెం – ”

” మాట్లాడకు. అది అల్లరి చెయ్యదు. నాకు తెలుసు. మాట్లాడకు ” – శ్రావణి గొంతు వడవడ వణికిపోయింది. నిలువెల్లా శివమెత్తింది. వెళ్ళి చొక్కా పట్టుకుని దబా దబా బాదింది.

 ” అరె. చెప్తే వినవే ” – వదిలించుకుని అవతలికిపోయాడు.

” ఫో. బయటికి పో. మళ్ళీ రాకు. అస్సలెప్పుడూ రాకు ”

ఎలాగూ వెళుతూన్నవాడిని ఇంకొక్క గెంటు గెంటి తలుపు తాళం పెట్టి కిందా పైనా గొళ్ళాలు బిగించి వచ్చింది.

ఏమయింది ? ఏం చేయాలి ?

వర్ష  ఆపకుండా ఏడుస్తోంది.

” లేదు. లేదులే. ఊరుకో. మా అమ్మ కదూ ” – పొదువుకుని కూర్చుంది.

కాసేపటికి – దాని ఏడుపు ఊపు తగ్గాక , ఏమడగాలో తెలీకుండానే ఏదో అడిగింది. అది చెప్పినదానికి ఊపిరి పీల్చుకుంది.

 ” ఏం పర్వాలేదమ్మా.  ఏం కంగార్లేదు. ఏడవకూడదు . నేనున్నాగా ” అంటూనే శ్రావణి గొల్లుమంది.

బయట చల్లగాలితో వాన మొదలైంది.  

*****

Please follow and like us:

One thought on “కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ – తోడబుట్టువు”

  1. మైథిలి గారు వ్రాసిన ఈ కథంటే నాకు చాలా ఇష్టం. చక్కటి కథ మరోసారి గుర్తు చేసావు దమయంతీ. నీకూ, వారికీ అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.