జెండర్(కథ)
పద్మజ.కె.ఎస్
ఆ పద్మవ్యూహం నించైనా తప్పుకోవచ్చు గానీ హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి బయటపడటం చాలాకష్టం. ఓ పక్క బస్ కి టైం అవుతొంది. పదిగంటలకే బస్. రాత్రిపూట బయలుదేరేవి ,అందులో కూకట్ పల్లినుంచి బయలుదేరేవి సరిగ్గా సమయానికే బయల్దేరతాయి. అసలే సంక్రాంతి రోజులు. …ఇంకో వారంలో పండగ. బస్సుల్లో రిజర్వేషన్ దొరకటమే కష్టంగా ఉంది. ఎలాగోలా సూపర్ లగ్జరీ లో దొరికింది సీటు. వెళ్ళకుండా ఆగిపోదమన్నా పండగ రోజులు. ప్రయాణం తప్పనిసరి ..అందుకని చలిరోజులే కనుక ఇందులో సర్దుకోక తప్పిందికాదు. ఎలాగోలా ఈట్రాఫిక్ సముద్రం ఈది బస్సులో పడ్డాను.
హమ్మయ్య అనుకోని సెటిలయ్యానోలేదో ..”ఆక్కో ..ఆ విండోసీటు నాదీ .కుంచెం ఇటేపు సరుదుకో..”అన్న గొంతు కర్ణ కఠోరంగా వినిపించింది. విండోలోంచి దృష్టిమరల్చి చూసే సరికి ..నుదుటున పెద్ద బొట్టూ …ముతకచీరా ..నోటినిండా తమలపాకు కిళ్ళీ తో ఒకావిడ సూటిగా నన్నే చూస్తున్నది. “ఈ విండో సీటు నీదా ?”అంటూలేవబోయిన నన్ను …”కూసేపు కూసో అక్కా …ఏంలే ..కిళ్ళీ వుయ్యాలి అందుకే ..”నన్ను మొహమాటపెట్టేసింది .”బాబోయ్ తెల్లార్లూ నామీదుగా ఒంగి కిళ్ళీ ఉమ్మేస్తుందేమో…”కాస్త భయపడి ఒద్దులే నువ్వేకూచో అన్నా ..”కూసో అక్కా …పెద్దబస్ స్టాండులో మారతాలే ..”అని నాకు కాస్త టైం ఇచ్చింది.
బస్సు కదలబోతుంటే బైట నిలబడివున్న లావు కళ్ళద్దాల కుర్రాడితో “ఇంకనువ్వు వెళ్ళయ్యా …నేను పోయొస్త …డబ్బులు జాగర్త …ఇగో ఇయ్యికూడా వుంచు…”అని జాకెట్ లో దోపుకున్న పర్సునుంచి ఒక యాభై రూపాయలు తీసి బస్ విండోలోంచి ఆ అబ్బాయి చేతిలో పెడుతోంది …అప్పటిదాకా వెలుతురు సరిగాలేక గమనించలేదు గానీ …ఆవిడ వాలకం చూస్తుంటే ఏదో తేడా ..అనిపించింది నాకు.
విండోలోనించి తల లోపలికి తీసుకుని నామీదుగా వెనక్కి వచ్చి సీట్లో కూర్చుంది …ఆవిడ !!కాదు కాదు ఆయన ..కాదు ఆవిడ వేషం లో వున్న ఆయన. అవును స్త్రీ …పురుషుడూ కాని వ్యక్తి !నా వెన్నులో ఏదో అసహ్యకరమైన జలదరింత !!మొహమంతా ఏదో చేదు మందు తిన్న అసహ్యం .”అయ్యబాబోయ్ ..తెల్లవార్లూ ఒంగోలు చేరేదాకా ..తనపక్కన కూర్చొని ప్రయాణం చెయ్యాలా” .అసలు ఈ బస్సుబుక్ చేసిన మావారిమీద పీకల్దాకా కోపమొచ్చింది. పూర్తిగా జరిగి విండోకు గట్టిగా ఆనుకుని కూర్చున్నాను.
వద్దన్నా ఆచేయి తగులుతోంది. గరుగ్గా ..మనం ఆడాళ్ళం కూడా అన్ని గాజులు వేసుకోం .చేతులకి …ఆణువణువునా తాను స్త్రీ నేనని తెలియజేయాలన్న భావనో ఏమో !!రెండుచేతులనిండుగా …రెండుడజన్ల ఎర్రని మట్టిగాజులు .ముఖం మీద బాగా దట్టంగా పూసుకున్న పౌడర్ .రూపాయి కాసంత కుంకుమ బొట్టూ ..కిళ్ళీతో ఎర్రగా పండిన బండ పెదాలూ …ముక్కున ఒక తెల్లరాయి ముక్కుపుడకా ..చీకట్లో మెరుస్తోంది!! నా చూపు గమనించనట్లుగా చిన్నగా నవ్వింది.
ఇంతలో కండక్టర్ టికెట్ చెక్ చేయడానికి వచ్చాడు. నేను సెల్ లో మెసేజ్ చూపించాను. ఆమె ?టికెట్ తీసి చూపించింది .కండక్టర్ అదోరకంగా చుస్తూ అనవసరం గా చెయ్యి తగిలించి …”ఎక్కడకొన్నా టిక్కెట్టూ”అని వెకిలిగా ఏదో అన్నాడు .ఆమె మొహం లో రంగులు మారడం గమనించాను .పళ్ళబిగువున. కోపాన్ని అదిమిపెట్టడం గమనించాను. ఇంతలో వెనకేవున్న క్లీనరో ,హెల్పరో ఎవరోగానీ ఏదో వాడకూడనిమాట వాడటం …నా కొడకా!! అంటూ చొక్కాపట్టుకుని చెవులు భరించలేని బూతులు అవిడ నోటివెంట. వాడూ పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా నవ్వుకుంటూ …ముందుకు డ్రైవర్ దగ్గరకు వెళ్ళి కూచున్నాడు.
నాకైతే …జీవితం మీద విరక్తి కలిగింది ఈ బస్ ఎక్కినందుకు .తెల్లవార్లూ ఇంక ఈ గోల ఎలాభరించాలో దేవుడా అనుకుంటూ ,పమిటచెంగు ముక్కుచుట్టూ తిప్పుకుని బైటకు చూస్తూ కూర్చున్నాను. ఇంతలో ఫోనేదో వచ్చినట్లుంది తనకు ,ఫొన్లోనే గట్టిగట్టిగా అరుస్తూ …వినలేని బూతులు తిడుతోంది. తనమాటలవల్ల నాకేమి అర్ధమయిందంటే …ఎవరోగాని తను చాలాకాలం క్రితం అతన్ని ప్రేమించో పెళ్ళిచేసుకునో మోసపోయింది. చాలా కాలం తర్వాత వాడు మళ్ళీ ఈవిడ దగ్గరికి వస్తానంటున్నాడు. వాణ్ణి వాళ్ళ ఆవిడనీకలిపిసభ్య సమాజం వినలేని భాషలో తిడుతోంది.
తలపగిలి పోతోంది నాకు ,నెహ్రూ బస్ స్టేషన్ కి వెళ్ళగానే కండక్టర్ నడిగి ఎలాగైనా సీటు మార్చుకోవాలి. దేవుడా !!!!అనుకుంటూ తలపట్టుకుని కూర్చున్నాను. ఈలో గా ఇంకోసారి పలకరింపుగా చూసి నవ్వింది తను ,తిరిగి నవ్వడానికి మనసురాక విండో వైపు దృష్టి మళ్ళించాను. ఇంతలో నెహ్రూ బస్ స్టేషన్ రానేవచ్చింది. తను గబగబా దిగివెళ్ళటం చూసాను .చిన్నగా కండక్టర్ ను సీటు మారతానని అడుగుదాం అనే లోపే జనం గబగబా తోసుకుని బస్ లోకి వచ్చేసారు .సీట్లు నిండిపోయి ఇంకా నిలబడ్డారు కూడా !!ఇంక ఆ ఆశకూడా అడుగంటి పోవడంతో చెసేదేమీలేక కూచుండి పోయాను.
నిజంగా సంక్రాంతి పండుగకు బస్సులకు ఇంత ఇబ్బంది అని తెలీదు నాకు.బయలుదేరటమే ..తప్పు .పైగా హాయిగా గరుడాలోనో ..అమరావతి లోనో వెళ్ళడం అలవాటయిన దాన్ని ఈ బస్ లో ఎక్కడం నాదే బుద్ధి తక్కువ అనుకుంటూ విండోనించి బయటకు చూసాను. తను బాత్ రూంస్ బైట నిలబడి ఉంది.స్త్రీ ల వాష్ రూం వైపు వెళ్ళనీటం లేదు అక్కడి కేర్ టేకర్ ..తను బతిమాలుతోంది అయినా అతను నెట్టేస్తున్నాడు .పురుషుల దాంట్లోకి వెళ్ళలేక.కాసేపు నిలబడి …వెనగ్గా ఎటో వెళ్ళింది .మొదటి సారిగా ….అసహ్యం స్థానంలో జాలి కలిగింది నాకు.
నిజం గానే ఎంత కష్టం …అటు పురుషునిగా జీవించలేక …ఇటుస్త్రీగాజీవితాన్ని వెళ్ళదీయలేక తను పడుతున్న ఇబ్బంది ఏదో ఇలాంటి విషయం దగ్గరే ఇంత కష్టం గా వుంటే ఇంక జీవితం!! బస్సు కదిలింది .గబగబా వచ్చి బస్సెక్కింది తను.మళ్ళీ ఏదో వెకిలి మాట !!బూతులు తిడుతూనే ఆయాసపడుతూ వచ్చి సీట్లో కూచుంది.
నేను లేవబోయాను. “వద్దులేఅక్కా …కిళ్ళీ ఉమ్మేశాలే ..”అంది. కాస్త మొహమాటంగా అడిగా,సీటిచ్చింది కదా …ఏమీ మాట్లాడకపోతే బాగోదనీ ఎక్కడిదాకా ?అని అంతమాత్రానికే ఇదైపోయి ఆపకుండా చెప్పడం మొదలెట్టింది . “మాది ఒంగోలు దగ్గరి కందుకూరక్కా ..పదోక్లాసు వరకూ చదువుకున్నా ..ఆ తరవాత నా మనసు దెబ్బతింది .మానాయిన పాంటూ సొక్కాలూ కొని కాలేజీకి బోయి సదువుకోమంటే ,నాకేమో లంగాలూ ఓణీలూ ఏసుకోవాలని మనసు.అప్పటికీ రహస్యంగా వాళ్ళవీ వీళ్ళవీ తెచ్చి వేసుకుంటుంటే …అమ్మానాన్న కట్టేసి కోట్టేవాళ్ళు .కొన్నాళ్ళకి మొండిగా నేను అమ్మాయినే అని ఎదురుతిరిగా.కొడుతున్నారని ఇంటోంచి పారిపోయా .
ఒకడు పెళ్ళిచెసుకుంటానని మోసం జేసాడక్కా …ఆ డికి వాళ్ళ అమ్మానాన్నా ఆడపిల్లనిచ్చి పెళ్ళిజేశారు. ఆ మద్దెలో నేను కుట్టునేర్చుకున్నా …ఎట్టాగో జీవితం ఎల్లిపోతోంది .కళ్ళులేవని ఒకపిలగాణ్ణి రైలుపట్టాల కాడ పారేశారెవురో .వాణ్ణి. తెచ్చుకోని పెంచుకున్నా …నాలాగ ఇంకో అమ్మాయి బస్టాండ్లో తిరగతావుంటే. తెచ్చి చదివించుకుంటున్నా …ఒకబ్బాయికి కాళ్ళు లేవు పోలియో వాడికి నేనే ఇంత కూడెస్తన్నా …నాకు మొత్తం ముగ్గురు పిలకాయలు .”అంటూ కిళ్ళీలు తినీ తినీ గారపట్టిన పళ్ళన్నీకనిపించేలా నవ్వింది. “నువ్విందాక బస్సుకాడ చుశావోలేదో లావుపాటి కళ్ళద్దాలు ఉన్నాయ్ సూడు …వాడే…డాక్టరుకు సూపిత్తే కళ్ళజోడు పెడితే కొద్దిగా చూపు అవుపడుద్ది ,పెద్దయ్యాక ఆపరేసను చేత్తే సూపొచ్చుద్ది అన్నాడు. ఆడు ఇక్కడే డిగ్రీ జదువుకోని కంప్యూటరు నేర్సుకుంటున్నాడు .అమ్మాయిని చదివిత్తన్నా ఇంటర్లో ఉంది .కుంటోడికే ఏదో జూడాల.”అని గుక్కతిప్పుకోకుండా చెప్పింది.
నాకు చిరాకేసింది.కొంచెం జాలి చూపిస్తే చాలు జీవిత కధలు చెబుతోంది. ఆ …ఇవన్నీ కహానీలు. పదో పరకో అడుక్కోవడం కోసం చెప్పే అబద్ధాలు.ఇలాంటివాళ్ళను ఈ హైదరాబాదులో ఎందర్ని చుడటం లేదు …అయినా తెల్లార్లూ జాగ్రత్తగా వుండాలి. పర్సులో కాషూ ,కాస్తో కూస్తో బంగారం …ఇలాంటి బస్సులో ప్రయాణం.కాస్త జాగ్రత్త తప్పదు .
బస్సు చీకట్లో వెళుతూనే వుంది. ఇంతకీ తన పేరు అడగలేదు …అప్పుడు గుర్తొచ్చింది.నాకే నవ్వొచ్చింది. తనపేరు తెలుసుకున్నందువల్ల ఏమి ఉపయోగం నాకు. ఎక్కడికి అన్నందుకే ఇంత కధ చెప్పింది. ఇంక పేరడిగితే ఇంకేమన్నావుందా. ?పిల్లాడికో, పిల్లకో స్కూలు ఫీజుకు డబ్బులు తక్కువయ్యాయి ఒక వెయ్యి ఇమ్మంటుంది. నాకెందులే …అని వురుకున్నాను. పక్కకు తిరిగి చూసాను.అలసిపోయినట్లు నిద్రపోతోంది.
నిజంగానే కాస్త జాలి కలిగింది. భగవంతుడిచ్చిన జీవితం “జెండర్ “అనేది ఎవరూఎవరికి వాళ్ళు నిర్ణయించు కునేది కాదు .కానీ …హార్మోన్ల అసమతుల్యత వల్ల ,తెలిసో తెలియకో ,ఇలా జీవితం ఎటూ కాకుండా …పురుషునిలా శరీరం స్త్రీ లాంటి మనసూ ,భగవంతుడా!!! …ఎంత కష్టం …తను బాత్రూం ముందు సందిగ్ధంగా నిలబడటం,వెకిలి మాటలూ,మొండిబారి బండబారిన బతుకులూ,తమనితాము రక్షించుకోవడానికి…మొడితనం ,బూతులూ …చాలాకష్టం ..ఇలాంటి వాళ్ళకి సాయం ఎవరు .???ఆఖరికి పరువుతక్కువని తల్లిదండ్రులు కూడా కనీసం డాక్టర్కి కూడా చూపించకుండా ఇళ్ళలోంచి తరిమేస్తే పాపం ఎలా బ్రతుకుతారో …ఇలా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి .ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు.
మెలకువ వచ్చేసరికి తెలతెల వారుతోంది. పక్కకు తిరిగాను ఆమె లేచేవుంది. చెతిలో బరువులెక్కువగాఉన్నాయని, ఎవరినో బస్టాండుకు రమ్మనీ చెబుతోంది. అప్పుడు చూసు కున్నాను. చేతిలో హాండ్ బాగ్ ఏదీ ?..కంగారుగా చూసుకున్నాను. కాళ్ళదగ్గర ఉంది. రాత్రి నిద్దర్లో జారి పడిందేమో,హమ్మో!!! అన్నీ ఉన్నాయా ?నా అనుమానపు చూపు వెంటనే ఆమెవైపు తిరిగింది. గమనించిందోలేదో ….”ఒంగోలు దగ్గరికొచ్చింది అక్కా ..”అంది నవ్వుతూ .నేను నవ్వలేదు!ముందు బ్యాగు చూసుకున్నాను .అన్నీ క్షేమంగా ఉన్నాయని కన్ ఫాం చేసు కున్నాను .అప్పుడు,ఒక నవ్వు పడేశాను.
బస్ స్టాండ్ లో దిగాం. మూడు చక్రాల సైకిల్ మీద అవిటి పిల్లాడూ,ఆ సైకిల్ పట్టుకుని ఈమెలాంటి పిల్లా వున్నారక్కడ. నాలో ..జాలో ..పశ్చాత్తాపమో …ఏదన్నాగానీ కాస్త దానం చేయాలి అనిపించింది. ఒక చిరునవ్వు నవ్వి పర్స్ లోనించి ఐదొందలు తీసిచ్చాను. తను వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ,”వద్దక్కా …ఇక్కడ నాకు టైలరింగ్ షాపుంది. మోడల్ జాకెట్లకి సామాను కోసం రెణ్ణల్ల కోసారి హైదరాబాదు వస్తా.జాకిట్లు మంచిగా కుడతా.అంజియ్య రోడ్లో షాపు …కావాలంటే కుట్టిచ్చుకో ..”అని వెనుదిరిగింది.ఇన్ని కష్టాల్లోనూ,విపరీతాల్లోనూ తను హుందాగా బ్రతుకుతూ ఇంకొందర్ని ఆదుకుంటోంది. నాకు చెంప చెళ్ళున చరిచినట్లయింది!!నా తల వంగిపోయింది భూమిలోకి,తమాయించుకుని …ఆటో …అని కేకేసాను.
*****
నాపేరు స్వరాజ్యపద్మజ. ఈమధ్యనేరచనలుచేస్తున్నరచయిత్రిని. శ్రీవారుఎల్ఐసీలోఅధికారి. నేనుప్రస్తుతంగృహిణిని. పిల్లలవివాహాలుఅయిపోయాయి. పాపటీసీయస్లో, బాబు ఎలెక్రికల్ఇంజనీరుగా చికాగోలో పనిచేస్తున్నారు. దాదాపు డజను కధల వరకూ వివిధ వెబ్మాగ్జైన్స్లో ప్రచురితమయ్యాయి. ఒక ప్రసిద్ధ వెబ్మాగ్జైన్లో నాకధల సీరీస్సీరియల్గా నడుస్తున్నది. సమాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొనటం, రచనలుచేయటం హాబీలు.
చాలా మంచి అంశాన్ని తీసుకున్నారు పద్మజగారూ ,ఎన్నో మార్లు మనకే ఓ సందిగ్దత ఉంటుంది ,ఎలా స్పందించాలో తెలియదు. మన అభిప్రాయాలు అపోహలు అని మనకర్థమయ్యే ప్రాసెస్ ఇది