నా జీవన యానంలో- (రెండవభాగం)- 6

-కె.వరలక్ష్మి 

ఇల్లూ స్కూలూ ఒకటే కావడం వల్ల మా పిల్లలు సెలవు రోజొస్తే స్కూలాటే ఆడుకునే వాళ్లు. ఒక్కళ్ళు టీచరు ఇద్దరు విద్యార్థులు. బైట పిల్లలొచ్చిన అదే ఆట. వాళ్లకెప్పుడూ టీచర్ స్థానం ఇచ్చేవాళ్లు కాదు.

ఊళ్లో ఒకటో రెండో బట్టల కోట్లు ఉండేవి. రెడీమేడ్ షాపులనేవి లేవు. ఊళ్లోకి మూటల వాళ్ళు తెచ్చిన మంచి రంగులూ, డిజైన్స్ ఉన్న కట్ పీసెస్ కొని పిల్లలకి బట్టలు కుట్టించేదాన్ని. మసీదు దగ్గరున్న టైలరు జానీ కొత్త కొత్త మోడల్స్ లో డ్రెస్సులు కుట్టే వాడు. ఎక్కువగా నడుం దగ్గర్నుంచి బుట్టలాజూలు వచ్చే డ్రెస్సులు కుట్టించేదాన్ని. మగ పిల్లలకేమో ‘పాపం పసివాడు’ సినిమాలో లా పొట్టి నిక్కర్లు, పొడువు చేతుల చొక్కాలు ఫేషన్. ఆ డ్రెస్సులు వేసి, సాక్స్ – షూ వేసి తయారుచేస్తే పిల్లలు చక్కగా కనిపించేవారు. పిల్లలకి బూట్లు – సాక్స్ మాత్రం రాజమండ్రి నుంచి మోహన్ కొనుక్కొచ్చే వాడు. సాయంకాలాలు వాళ్లని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని సెంటర్లో కి తీసుకెళ్లే వాడు. అందరూ వీళ్ళనే చూసేవారట. అప్పుడప్పుడు మా నాన్న నన్ను కోప్పడే వారు. ”ఎందుకమ్మా పిల్లల్ని అంత బాగా తయారు చేస్తావు ?దిష్టి తగిలేస్తుంది” అంటూ. పిల్లల్ని ముస్తాబు చేస్తుంటే చాలు నాకు ఆ మాటే గుర్తుకొచ్చేది.

మోహన్ సైకిల్ ని రెడ్డి గారి పిల్లలు విరగ్గొట్టేసాక అది సెకండ్ హేండ్ సైకిల్ కావడం వల్ల రిపేరుకి కూడా పనికి రాలేదరాలేదు. ఆ సంవత్సరం మోహన్ పుట్టినరోజు కి అప్పటికి కొత్తగా వస్తున్న హీరో సైకిల్ ప్రెజెంట్ చేశాను. అంతకుముందంతా హెర్క్యులస్ సైకిళ్ళు ఉండేవి. హీరో సైకిల్ తేలికగా ఉండడం, తొక్కడానికి ఈజీ గా ఉండడం వల్ల జనం దానిమీద మొగ్గు చూపించడం మొదలయైంది. అది జగ్గంపేటలో దొరకదు కాబట్టి కొన్న తెచ్చుకోమని డబ్బులిచ్చేను. మోహన్ బైట కరెక్ట్ గా ఉండేవాడు కానీ నా దగ్గర మాత్రం అబద్ధాలాడి డబ్బులు చెక్కేసేవాడు. సైకిల్ రేటు కన్నా రెట్టింపు తీసుకున్నాడని తర్వాత తెలిసింది.

నా హైస్కూల్ క్లాస్మేట్ మురళి వాళ్ళ అమ్మ ఒకసారి నేను వాళ్లింటికి వెళ్లి నప్పుడు ”నువ్వు అతనికి సైకిల్ కొనిచ్చేవు సరే, అతను నీ పుట్టినరోజుకి ఏమిచ్చేడు అని అడిగింది. ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదని చెప్తే ”ఓసి పిచ్చి పిల్ల అతనూ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఇంటి బాధ్యత లేకుండా తన జీతం తను ఖర్చు పెడుతూనే వాడికి నువ్వు ఇవ్వడం ఏమిటి, ఆడ పిల్లలున్నారు జాగ్రత్త. వాళ్లకి గాజులో, గొలుసులో కొను. లేదా ఏ బ్యాంకులోనో వెయ్యి” అంది. మేం కొత్త వారి ఇంట్లో ఉన్న ఆ రోజుల్లోనే మా ఇంటికి రెండిళ్లకవతల ఊళ్లో మొదటి బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ప్రారంభించారు. బ్యాంక్ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి ఎకౌంట్లు ఓపెన్ చేయించేవారు. నేను కూడా నా పేరుతో ఎకౌంట్ తీసుకుని నెలకి వంద రూపాయలు దాచడం మొదలుపెట్టాను.

మా అత్తగారు రాజమండ్రి అన్నపూర్ణమ్మ పేట లో ఓ పెద్ద తాటాకిల్లు అద్దెకు తీసుకుని చివరి ముగ్గురు కూతుళ్లనీ, అల్లుళ్లనీ తన దగ్గరే ఉంచుకుని చూస్తున్నారని తెలిసింది. ఆవిడకి ఫేమిలీ పెన్షన్ రెండు వందలు కాబోలు వచ్చేది. నేను మోహన్ కి చెప్పేను “ఆవిడ మీ తల్లి కదా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, మీ జీతం నుంచి ఇదివరకటి లాగా ఏమైనా ఇవ్వోచ్చు కదా” అని. “ఆవిడను వచ్చి ఇక్కడ ఉండమను అంతేకాని, నేను వేరుగా డబ్బులు ఇవ్వలేను” అన్నాడు. ఇక నేనే ఆ బాధ్యత వహించి నెలకు 500 రూపాయలు పంపించడం మొదలు పెట్టేను. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి కాదు. అది బాధ్యతగా అనుకొని. ఒక సారి ఏదో అనుకుని ఖర్చు పడి ఆ నెల M.O చేయలేకపోయాను. ఆవిడ వచ్చి “డబ్బులు పంపలేదేం?”అని అడిగారు చాలా కోపంగా. సంగతి చెప్పాను. అంతే ఆవిడ గొప్ప ఇరిటేషన్ తో “సర్వ నాశనం అయిపోవాలి” అని శపించారు. ఆవిడ శపించిన కుటుంబంలో తన కొడుకు కూడా ఉన్నాడని మర్చిపోయారో ఏమో! నాకు చాలా బాధ కలిగింది. కోపం కూడా వచ్చింది. ఇక పంపడం అప్పటికి ఆపేసేను. ఆ తర్వాతి రోజుల్లో ఎప్పుడు ఎన్ని వేలిచ్చిన

ఆవిడ గప్ చుప్ న జాకెట్లో పెట్టేసుకునేవారు. ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు.

ఆరో తరగతి నుంచి పదకొండో తరగతి పరీక్షలు రాసే వరకూ నాకు ప్రియమైన నేస్తం రేడియో. నేను మా అత్తవారింటికెళ్లేక దూరమైపోయింది. ఎంత మంచి కర్ణాటక సంగీత కార్యక్రమాలు, ఎంత మంచి లలితగీతాలు, ఎంత గొప్ప సాహిత్య కార్యక్రమాలు; అన్నిటినీ మించి వివిధ భారతి రేడియో సిలోన్ లలో అద్భుతమైన హిందీ పాటలు. అన్నిటిని మిస్ అయిపోయాను.  నేను అడగగా అడగగా మోహన్ వంద రూపాయలు పెట్టి అరచెయ్యంత ట్రాన్సిస్టర్ కొనుక్కొచ్చాడు. మా నాన్న కొన్న రేడియో పాత టీవీ ఎంత ఉండేది. సౌండ్ చాలా క్లియర్ గా ఉండేది. మా ట్రాన్సిస్టర్ సౌండ్ లో గరగలు ఎక్కువుండేవి. ఒక్కోసారి దాని వీపున రెండు బాదితే గాని పని చేసేది కాదు. మోహన్ రేడియో రిపేరుకు సంబంధించిన పుస్తకం, టూల్స్ కొని తెచ్చుకున్నాడు. కొంచెం తీరిక దొరికితే చాలు దాన్ని ఏ పార్టీకి ఆ పార్టీ ఊడా పీకి తిరిగి మళ్ళీ పెట్టేవాడు.

ఉన్నట్టుండి మా గరగల రేడియోలు 1977 నవంబర్ 19న విషాద సంగీతం తో అత్యంత విషాదకరమైన వార్తలు రాసాగాయి. దివిసీమ ఉప్పెన గురించి. అప్పటికి టీవీలు లేవు కాబట్టి పత్రికలలో ఫోటోలు చూసి తెలుసుకోవాల్సిందే. మనుషులు నోరులేని జీవాలు ప్రాణాలు కోల్పోయి నీటిలో తేలుతున్న, బురదలో కూరుకుపోయిన దృశ్యాలు. మనసును కలచివేసే వార్తా కథనాలు. అప్పటికి నాకు గోదావరి నది వరదల గురించి తెలుసు కానీ, సముద్రం ఉప్పొంగి అలా కబళించేస్తుందని తెలీదు. అప్పటి ప్రధానమంత్రి మొరార్జీదేశాయ్, ముఖ్యమంత్రి జలగం వెంగళ్రావుల గొంతులు తరచుగా రేడియోలో విన్పించేవి. ఒక ఆర్తితో, ఆవేశంతో తుఫాను బాధితులకి సాయపడాలని చాలా అన్పించింది. కొంత అభ్యుదయభావాలున్నట్టుఅన్పించిన కొత్తవారికోడలు రజనిని కలిసేరు. వాళ్లింట్లోంచి నలుగురు పిల్లలు వచ్చేవాళ్లు మా స్కూలుకి. ఫీజుకట్టడానికి, పిల్లలకి తినిపించడానికి వచ్చినప్పుడల్లా స్నేహంగా మాట్లాడేది. చందాలు, పాతబట్టలు సేకరిద్దాం అన్న నా కాన్సెప్ట్ విని అత్తింటికోడలుకావడం వల్ల భయపడింది. ఊళ్లో లాంటి సమాయాలు కోమట్ల కమ్యూనిటీ నుంచే లభిస్తాయి.  అమ్మాయి వెనక్కి తగ్గేసరికి నాకు చెయ్యాలో తోచలేదు. పిల్లల యూనిఫామ్స్ విషయంలో నా ఎక్స్ పీరియన్స్ గుర్తొచ్చింది. క నాకు సాధ్యమైనంత డబ్బులు పంపించడం తప్ప మరేం చెయ్యలేకపోయేను.

మోహన్ కి సినిమాల్లో నటించాలనే కాంక్ష క్రమంగా పెరగసాగింది. అప్పటికే తరచుగా మద్రాస్ వెళ్లివస్తూచాలా డబ్బు వృధా చేసేసాడు. అతనికి ఉద్యోగం ది కాబట్టి ఎవరు పడితేవాళ్లు నోటురాయించుకుని అప్పు ఇచ్చేసేవారు. ఓ ఇరవైవేలు అప్పుచేసుకోవడం మద్రాసెళ్లి అవి అయిపోయేవరకూ ఉండి రావడం. ఫోటోషూట్స్, హెయిర్ కర్లింగ్, మేకప్ కిట్స్ అంటూ ఏవేవో చెప్పేవాడు. అప్పటికి డిజైన్ షర్టులు ఫేషన్, రకరకాల చొక్కాలు, మొదట్లో గొట్టం పేంట్లు,  తర్వాత బెల్ ఫేంట్లు, మూడు నెలలకొక కొత్త బూట్లు, రకరకాల చెప్పుల జతలు –తాహతును మించి ఖర్చులు అలవాటు చేసుకున్నాడు. హైస్కూలు పిల్లలు అతనికి గొట్టంపేంటు అని నిక్ నేమ్ పెట్టేరట.

తాగితే బుగ్గలు (చెంపలు) నిండుగా వస్తాయి అని సినిమా వాళ్ల నమ్మకం అట. నెమ్మదిగా తాగుడు మొదలు పెట్టేడు. ‘‘ఉన్న వ్యసనాలు చాలవా’’ అని నేను గొడవపెట్టుకున్నాను. మానేసేడనుకున్నాను కాని, వీకెండ్కి రాజమండ్రి వెళ్లి కొనసాగిస్తున్నాడని తర్వాతెప్పుడో తెలిసింది. తర్వాతి కాలంలో రెండుమూడు సినిమాల్లో మనం చూసేలోపల మాయమైపోయే కేరెక్టర్స్లో నటించాడు కాని, తాగుడు అలవాటు మాత్రం అతన్ని అంటిపెట్టుకుని ఉండిపోయింది.

మోహన్ తో జీవితం నడిసముద్రంలో పడవ ప్రయాణం అని పూర్తిగా అర్ధమైంది. ఇక నాకాళ్లమీద నేనే నిలబడి సంసారనౌకను నడిపించుకోవాలని తెలుసుకున్నాను.

మా చిన్నచెల్లి అత్తవారిది రాజమండ్రిలో ఫర్నిచర్ వ్యాపారం. నిరామయంగా ఉన్నిఇంట్లోకి అంచెలంచెలుగా డబ్బులు కడుతూ డబుల్ కాట్, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ కొన్నాను.

ఇప్పటి శ్రీరామ్నగర్ కాలనీ అప్పటికి చెరకుతోట. రోళ్లరామకృష్ణారావు నాయుడు గారొక్కరే మళ్లమధ్య డాబాఇల్లు కట్టుకున్నారు. వాళ్ల చిన్నపాప కాంత మాస్కూల్లో చదువుతూండేది. ఒక సారి ఫీజ్ కట్టడానికి వచ్చినప్పుడు ఆయన చెరకుతోటను ఇల్లస్థలాలుగా చేస్తున్నారనీ, అన్నీ బుక్ అయిపోయాయనీ, ఒక్క వెంకట్రత్నం థియేటర్ వెనక ఉన్న 570 చ.గజాల స్థలం మిగిలి ఉందనీ, గజం డున్నర రూపాయలనీ చెప్పేరు. నేను మీ ఆలోచించకుండా యనిచ్చిన పదిరూపాయల్లో మరో తొంభైవేసి వందరూపాయలు ఆయన చేతిలో పెట్టి అడ్వాన్స్ గా ఇమ్మని చెప్పేను. మూడు నెలలన్నది ఆరునెలలు పట్టింది రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి, చెవి రింగుల్తో సహా అన్నీ తాకట్టుపెట్టి, బేంకులో దాస్తున్న డబ్బులు తీసేసి ఎలాగో రిజిస్ట్టేషన్ చేయించేను. అదే ఇప్పుడు నేనుంటున్న ఇల్లు. ఆ సలహా ఇచ్చినందుకు నాయుడుగారికి మనసులో ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకొంటుంటాను.

నాతో చదువుకున్న స్నేహితురాళ్లు అందరూ వేరేవేరే టౌన్స్ కి, నగరాలకి వెళ్లిపోయారు. ఒకసారి వాళ్లనుంచీ, ఊళ్లోని నా అజ్ఞాత అభిమానులనుంచీ వరసగా ఉత్తరాలు వచ్చేయి. అంతులేనికథఅనే సినిమా వచ్చిందని, ఆ సినిమా చూస్తుంటే నేనే గుర్తుకొచ్చేనని, తప్పకుండా చూడమనీ. జగ్గంపేటకు కొత్తసినిమాలు వచ్చేవికావు. మోహన్ అప్పటికే రాజమండ్రిలో చూసేసేడట. సినిమాలకోసమైతే తనని బతిమాలక్కర్లేదు. తనతో కాకినాడ వెళ్లి చూసొచ్చేను. అంతే, బాలచందర్ గారికి అభిమానినైపోయాను. మన్మథలీలలాంటి ఆయన డబ్బింగ్ సినిమాలు కూడా వదలకుండా చూసేసేను, మరోచరిత్రతో కమల్ హాసన్కి అభిమానినై పోయేను. కాని విషాదాంతాలు చూడలేను.

*****

(ఇంకా ఉంది )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.