యాత్రాగీతం(మెక్సికో)-6
కాన్ కూన్ -ఐలా మొహారీస్
-డా|కె.గీత
భాగం-8
కాన్ కూన్ లో మొదటిరోజు చిచెన్ ఇట్జా సందర్శనం, ఆ తర్వాత ఒళ్లు గగుర్పొడిచే సెనోట్ అనుభవం తర్వాత తిరిగి రిసార్టుకి వచ్చే దారిలో “వేలొదొలీద్” (Valladolid) అనే పట్టణ సందర్శనానికి ఆపేరు మా బస్సు.
స్పెయిన్ లో అదే పేరుతో ఉన్న గొప్ప నగరం పేరే ఈ “వేలొదొలీద్”. దక్షిణ అమెరికా భూభాగంలోని స్పానిషు ఆక్రమణదారుల గుత్తాధిపత్యానికి గుర్తుగా అప్పటి క్రైస్తవ చర్చిలు, ఆవాసాలు పెద్ద పెద్ద కట్టడాలుగా ఇక్కడ గోచరమిస్తాయి. ప్రసిద్ధి గాంచిన సేన్ బెర్నార్డినో చర్చి కి కూతవేటు దూరంలో బస్సు ఆపి గంటలో మళ్లీ అక్కడే కలవమని చెప్పేడు మా గైడు.
ఆ రోజు చర్చిని మూసి ఉండడం వల్ల బయటి నుంచే చూసి, మార్కెట్ లో ఇతర విశేషాలు చూడడానికి మిగతా సమయాన్ని వినియోగించుకున్నాం. ముఖ్యంగా మాయా సంతతికి చెందిన వారు, స్థానికులు ఇక్కడ కనిపిస్తూండడంతో అటూ, ఇటూ నడిచి వారి వద్ద నుంచి స్థానికంగా తయారు చేసిన వస్తువులు బేరమాడకుండా కొన్నాం.
ప్రతీ చోటా లక్ష బేరాలాడే నేను ఇలా నిశ్శబ్దంగా కొంటూంటే వరు, సత్య ఆశ్చర్యంగా చూసేరు. “పాపం రోజల్లా కూచున్నా వీళ్లకు ఏం వస్తాయిలే” అని ముందుకు నడిచేను.
దారి పొడవునా ఇళ్లూ, వీథులూ, బళ్లూ, కార్లూ అన్నీ ఇండియాలో ఉన్నట్టే ఉండడాన్ని ఆశ్చర్యంగా చూసేం. అంతే కాదు, ఇక్కడి సంస్కృతి, నమ్మకాలు కూడా భారతదేశాన్ని పోలి ఉండడం విశేషం.
సాయంత్రానికి తిరిగి రిసార్టుకి చేరుకున్నాం. రిసార్టులో రాత్రిపూట డిన్నర్లకు ప్రత్యేకమైన రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో ముందుగా జాపనీస్ క్విసీన్ కు వెళ్లాం. రిస్సర్టుల్కో ఏ రెస్టారెంటుకెళ్లినా బిల్లు ఉండదు. కాకపోతే రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల, సీట్లు పరిమితిగా ఉండడం వల్ల ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తుంది. తాగడానికి జ్యూసుల సెక్షన్ లో ఉన్న వేవో ఆర్డర్ చేసేం. తీరా తెచ్చేక గ్లాసుల వాలకం చూసి అనుమానం వచ్చి అడిగితే ఆల్కహాల్ కలిపిన జ్యూసు ఆర్డరు చేసేమని తేలింది. అక్కడ నాన్ ఆల్కహాలిక్ జ్యూసు కావాలని ప్రత్యేకంగా చెప్పాలని అప్పుడు అర్థమయ్యింది.
ఇక ఏ రెస్టారెంటు లో నైనా ఫుడ్ చాలా రుచికరంగా ఉంది. ప్లేట్లలో తక్కువ పోర్షన్లు ఉన్నా పగటి పూట బఫేలాగా వేస్ట్ చెయ్యకుండా ఈ పద్ధతి బానే ఉందనిపించింది.
మెక్సికోలో ఉన్నంతసేపూ నా మనసంతా ఒక రకమైన బాధ నిండింది. ఒక వైపు అత్యంత పేదరికంలో ప్రజలు మగ్గుతూ ఉంటే ఈ రిసార్టుల వంటివి వనరుల్ని విపరీతంగా వృథా చేస్తూ ఉన్నాయి. మా వంటి వారి వద్ద డబ్బు గుంజినా వనరుల్ని వృథా చెయ్యకుండా పేదలకు పంచితే బావుణ్ణని అనిపించింది.
ఇక రాత్రి భోజనం కాగానే సముద్రం వైపు ఆరుబయట స్విమ్మింగు పూల్స్ ఉన్న ఏరియాలో మధ్య ఉన్న స్టేజీ మీద డాన్స్ కార్యక్రమం లో కాస్సేపు సేద తీరేం.
ఇండియన్ డాన్సుకు పిలవగానే స్టేజీ మీద నాలుగు స్టెప్పులేసి రమ్మని సత్య నన్ను ముందుకు తోసేడు.
నేను వెళ్లి ఊరిల్కే సర్దాకి పాదం కలిపి వచ్చేను.
రాత్రి పూట ఆరుబయట హాయిగా గోరు వెచ్చగా, హాయిగా ఉంది. సముద్ర తీరాన నడవాలని అనిపీంచింది. కానీ అందరం అలిసిపోయి ఉండడం వల్ల ఆ కోరికను ఉదయం సమయానికి వాయిదా వేసేం.
మా గది ఉన్న పదో అంతస్తు నించి చూస్తే దిగంతాలకి పరుచుకున్న నల్లని సముద్రం మీద తళత్తళల కాంతిని నిలువుగా ప్రసరింజేస్తూ చందమామ అత్యద్భుతంగా గోచరించింది.
ఆ రోజు అక్కడ కెమేరాలో బంధించిన ఆ క్షణం ఎంత అపురూపమైనదంటే నా నవల “వెనుతిరగని వెన్నెల” ఆడియోకి ముఖ చిత్రంగా మారిందది.
బాల్కనీ లో నుంచి లోపలికి వచ్చేసరికి సిరి రూములోనే ఉన్న జకూజీ టబ్బులో స్నానమని ఆట మొదలు పెట్టి ఒక పట్టాన రాదే!
మళ్లీ పొద్దున్నే మరో టూరుకి వెళ్లాల్సి రావడంతో ఆ పిల్లని బయటికి లాగి పడుకోబెట్టేసరికి తల ప్రాణం తోకకొచ్చింది.
***
మర్నాడు ఐలా మొహరీస్ (Isla maharis) ఐలాండ్ టూరుకు బుక్ చేసుకున్నాం.
మా రిసార్టు నుంచి మొదటి రోజు సాయంత్రం పైరేట్ షిప్పు విహారానికి వెళ్లిన వైపే వెళ్లేం కానీ చిన్న హార్బర్ ని దాటి పెద్ద హార్బర్ అనే చోట నీళ్ల లోపలి వరకు సాగి ఉన్న డెక్ మీద లోపలికి నడిచి, టిక్కెట్లు తీసుకుని మధ్యస్థంగా ఉన్న షిప్పు ఎక్కి దాదాపు గంట సేపు ప్రయాణం చేసి ఐలాండ్ చేరుకున్నాం.
సత్య, వరు డాల్ఫిన్స్ తో ఈత కోసం ప్రత్యేకించిన టూరుకి బుక్ చేసుకోవడంతో ద్వీపానికి అటు వైపు ఉన్న ఒడ్డునే ఆగింది మా షిప్పు.
సముద్ర తీరంలోనే నీళ్లలో పెద్ద పెద్ద మళ్లు చేసి అందులో డాల్ఫిన్స్ ని స్వేచ్ఛగా వదిలేరు. ఈత టూరు బుక్ చేసుకున్న వాళ్లకి ఇన్ స్ట్రక్టర్లు క్రమపద్ధతిలో ఒక తర్వాత ఒకరిని నీళ్లలోకి డాల్ఫిన్స్ తో బాటూ వదులుతున్నారు. ఇలా ప్రాణుల్ని స్వేచ్ఛగా వదిలడం హర్షణీయం అయినా మనుషుల్ని అందువల్ల మనుషుల్ని గంటల తరబడి నీళ్లలో నానబెట్టడం ఏమీ బాలేదనిపించింది.
పైగా ఈ మళ్లలో లోతేమీ తక్కువ లేదు. దాదాపు రెండు మూడు గంటలపాటు లైప్జాకెట్లతో వెళ్లిన వాళ్లు అలా నీళ్లలో తేలుతూ ఒక పక్కగా ఉండవలిసిందే. అన్నిటి కంటే చాలా ముఖ్యంగా డాల్ఫిన్ మూపురం మీదున్న రెక్క ని పట్టుకుని దానితో బాటూ ఈత కొట్టడం చూడడానికి బానే ఉన్నా దాని కోసం నీళ్లలో వరసలో వేచి ఉండి నానుతూ వారికి ఏమంత సరదా కాదనీ ర్థమయ్యింది వాళ్ల మొహాలు చూస్తే.
సత్య, వరు అడ్వంచరస్ మనుషులు. నేను, సిరి సున్నితమైన వాళ్లం, భయస్థులమూ. సత్య పిరికిపందలమని అంటాడనుకోండి, అది వేరే సంగతి.
ఇక వీళ్లిద్దరూ మాకు బాగా దూరపు మడిలో ఉండడం వల్ల, మాలా కూడా వచ్చిన సందర్శకులని నిర్వాకహులు దగ్గరకు రానివ్వకపోవడం వల్లా దూరం నుంచే చూడడం తప్పలేదు. కానీ దగ్గర మళ్ల లో ఉన్న డాల్ఫిన్స్ ని, వాటి విన్యాసాల్ని చూడగలిగేం.
ఇక నీళ్లంటే అత్యంత భయమైన సిరి నాతో ఉండడం వల్ల కాస్సేపటిలోనే నీళ్ల వైపు నుంచి థీం పార్కు లోపలికి నడిచేం. ఒడ్డునే వరసగా ఉన్న పెద్ద పెద్ద హట్స్ ని ఆనుకుని ఉన్న గిఫ్ట్ షాపు దాటి లోపలికి వెళ్తే స్విమ్మింగు సంబంధిత దుస్తులు అద్దెకు ఇచ్చే దుకాణం, రెస్త్ రూములు, దాటీ మరో పక్కగా వెళ్తే ఆరుబయటే చిన్న చిన్న గొడుగుల కింద ఇసుక నిండి ఉన్న చోట స్విమ్మిగు పూల్ చెయిర్లు, చిన్న స్విమ్మింగు పూల్ ఉన్నాయి.
బయట ఎండ తీవ్రంగా ఉన్నా గొడుగులు గడ్డితో నేసినవి కావడం వల్ల చల్లగా ఉంది. అందులో ఒక మాంఛి చోటు చూసుకుని సిరి, నేను చతికిల బడ్డాం. అయిదే అయిదు నిమిషాల్లో కుర్చీ మీంచి కిందికి చేపపిల్ల నీటిలోకి దుమికినట్టు ఇసుకలోకి దూకి ఆట మొదలు పెట్టింది సిరి.
మా పక్కనే కూచున్న ఇద్దరు ఆడవాళ్లలో ఒకామె నీటిలోకి వెళ్లింది. మరో ఫామిలోలో తాత, అమ్మమ్మ దగ్గిర మనవరాళ్లని వదిలి భార్యా, భర్తా ఈతకు వెళ్లేరు.
వాళ్లంతా కెనడా నించి వచ్చిన వారు కావడంతో అంతా కబుర్లలో పడ్డారు.
ఇక సిరి వెళ్లి అందులో చిన్న అమ్మాయితో ఆడడం మొదలు పెట్టడమే కాకుండా వాళ్ల కుర్చీల దగ్గిర తనూ మకాం వేసేసింది. సిరికి తన్మ ఈడు వాళ్లకన్నా, తన కంటే పెద్దవాళ్లకన్నా చిన్న పిల్లంటే బాగా ఇష్టం. “బేబీ, బేబీ” అని వాళ్ల వెనకాల పడుతుంది.
వాళ్లు అలా పరిచయమయ్యి నాతోనూ మాట్లాడం మొదలు పెట్టేరు.
ఇంతకీ ఇద్దర్మాయిలూ లెస్బియన్లు. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని హనీమూన్ కి వచ్చేరట.
ఇక తాత, అమ్మమ్మలని నేను పొరబడ్డ వాళ్లు ఫామిలీ ఫ్రెండ్స్ అట.
అదీ సంగతి.
ఇక వాళ్లకి సిరిని అప్పగించి నేను కాస్సేపు దూరం నించే సత్య, వరులకు ఫోటోలు తియ్యడానికి పదినిమిషాల పాటూ వెళ్లేను.
కాస్సేపట్లో వాళ్లంతా వెళ్తుంటే సిరి కూడా వాళ్లతో వెళ్లిపోదామని పేచీ మొదలు పెట్టింది.
ఇక తన దృష్టి మరల్చడానికి సెల్ ఫోను ఇచ్చి గేమ్సు ఆడుకోమని కూచోబెట్టేను.
నిజానికి సిరి ఐపాడు లేకుండా ఎక్కడికీ కదలదు. కానీ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతుంది. ఈ ఉదయం ప్రయాణంలో బయటెక్కడా మర్చిపోకూడదని అసలు తేవడమే మానేసాం.
ఏమైతేనేం మధ్యాన భోజన సమయానికి సత్య, వరు వచ్చేరు.
అప్పటికే భోజననాలు ప్రారంభయ్యి చాలసేపే అయ్యింది. అన్నీ బఫే సిస్టంలో అనేక రకాలున్నా ఏవీ తినబుద్ధి కాలేదు ఎందుకో.
ఐలాండు స్టయిల్ కుకింగ్ ఒక కారణం కాగా తింటుంటే ముసురుతున్న పెద్ద ఈగలు మరో కారణం. ఏదో తిన్నామనిపించి బయట పడ్డాం.
అక్కణ్ణించి పదిహేను నిమిషల వ్యవధిలో మరో తీరాన ఉన్న అసలైన ఐలాండుకు బోట్ బయలుదేరుతున్న సమయాన జ్ఞాపకం వచ్చింది సత్య, వరు లకు నిర్వాహకులే తీసిన ఫోటోలకు డబ్బులు కట్టేము కానీ ఫోటోలు తీసుకోలేదని.
మళ్లీ వెళ్లేందుకు సమయం 10 నిమిషాలే ఉన్నా నేను పరుగెత్తుకెళ్లి తీసుకొచ్చేను.
అలాంటి సాహసాలు చెయ్యొద్దని సత్య ఎప్పుడూ మొత్తుకుంటూ ఉంటాడు.
నేను ఈ బోట్ తప్పిపోతే తర్వాత బోట్ లో వాళ్లని కలుస్తానన్న ధీమాతో వెళ్లేని గానీ ఆరోజుకి ఐలాండులోపలికి అదే ఆఖరు బోటన్న విషయం నాకు తెలియదు.
అప్పుడు నేను బోటును సమ్యానికి ఎక్కలేకపోయి ఉంటే, సత్య తప్పక కిదికి దిగిపోతాడు. మేం ఇక తిన్నగా రిస్సర్టు ఉన్న ఆవలి ఒడ్డుకి థీం పార్కు స్టాఫ్ తో బాటు తిరిగి వెళ్లాల్సి ఉండేది.
మొత్తానికి నేను చివరి నిమిషంలో రావడంతో కథ సుఖాంతమయ్యిందన్నమాట.
ఇక అసలు ఐలాండు దగ్గిర షిప్పు దిగి లోపలికి నడిస్తే అదొక చిన్న సైజు పట్టణమే అనిపించింది.
కానీ ఐలాండు మొత్తం చుట్టి రావాలంటే స్వంతంగా నడుపుకునే గోల్ఫ్ కార్టు వంటిది అద్దెకు తీసుకుని తిరగాలి. దానికి కనీసం రెండు గంటల సమయం కావాలి.
మాకున్న సమయం దాదాపు గంటన్నర మాత్రమే.
అందుకే ఊరికే ఒక గంట అలా వీధులు తిరిగొద్దాం అని బయలుదేరేం.
కానీ అప్పటికే నడిచే ఓపికలు ఎవరికీ లేకపోవడం వల్ల సముద్రతీరాన ఉన్న మొదటి వీథి మాత్రమే చుట్టి రాగలిగేం.
ద్వీపంలో అత్యధికంగా లభించే కొబ్బరి బొండాలు తాగడం వంటి వాటితో బాటూ రోడ్డు పక్కన పల్లీలమ్ముతున్నట్లు చిన్న స్టాండ్ల మీద అమ్ముతున్న బజ్జీల వంటివి కొనుక్కు తిన్నాం.
ఐస్క్రీములు తిని, చిన్న చిన్న కీ ఛెయిన్ల వంటి బహుమతులేవో కొన్నాం.
ఒక చోట రోడ్డు పక్కన ఏదో టాప్ లీక్ అయ్యి నీళ్లు వీథికి ధార కట్టడంతో బురద మయమైన వీథిని, పట్టించుకోని స్థానిక పాలక వ్యవస్థని చూసి ఇదీ ఇండియా లా ఉందని నవ్వుకున్నాం.
షిప్పు ఎక్కడానికి వెనక్కి వచ్చి లైనులో నిలబడ్డ చోట మన వేరుశనపప్పు అచ్చుల వంటి వేవో అమ్ముతూంటే కొని, ఆమెతో కాస్సేపు మాట్లాడేను.
ప్రధానంగా ఈ ద్వీపవాసులకి ఏం కావాలన్నా దగ్గర్లోని కాన్ కూన్ కి వెళ్లవలిసిందే. ఆమెకూడా రోజూ అక్కణ్ణించే వాచి వెళ్తుండట.
ఇక మన బెల్లాన్ని పోలిన పొడి వంటి బ్రౌన్ సుగర్ ఆ తీపి అచ్చుల్లో వాడడం విశేషం.
తిరిగి షిప్పు పట్టుకుని కాన్ కూన్ వచ్చి రిసార్టుకిఒ టాక్సిలో చేరుకునే సరికి సాంయత్రం ఆరుగంటలయ్యింది.
ఇంతకీ ఐలా మొహారీస్ అంటే జలకన్య ద్వీపం అని అర్థం.
జల కన్య ఆకారంలో ఆ ద్వీపం ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది.
ఇక్కడే అండర్ వాటర్ మ్యూజియం కూడా ఉంది. కానీ దానికి పూర్తిగా అండర్ వాటర్ డైవింగులో శిక్షణ తీసుకుని ఉండాలి. పైగా అదొక రోజు కార్యక్రమం కూడా.
కాన్ కూన్ వెళ్లిన వాళ్లు ఒక సారైనా చూసి రాదగిన ప్రదేశం ఈ ఐలా మొహారీస్.
*****
(ఇంకా ఉంది)
ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి –