రమణీయం
సఖులతో సరదాగా-2
-సి.రమణ
కొడైకెనాల్ వెళ్తున్నాం అంటేనే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది నాకు. సాయంకాలం 5.30 కి చేరుకున్నాము, మేము book చేసుకున్న rewsorts కు. కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు దాటుకుని, మధ్య మధ్యలో చల్లని కొండ గాలులు శ్వాసిస్తూ, road పక్కన అక్కడక్కడ పెట్టిన పండ్ల దుకాణాలలో, మాకు ఇష్టమైన పళ్ళు కొనుక్కుంటూ, కొండల ఎత్తు పల్లాలలో, ఉయ్యాలలూగుతున్నట్లున్న పండ్ల చెట్లని, వాటి నిండా విరగ కాసిన పండ్లనూ చూస్తూ, పేరు తెలియని రంగు రంగుల పూల చెట్లతో నిండి వున్న పరిసరాలను గమనిస్తూ , మా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. సాయంకాలం 5.30 నిమిషాలకే సూర్యాస్తమయం అయ్యింది. చల్లని గాలి, కారు దిగగానే పలుకరించింది, చిన్న పులకింతను ప్రసాదిస్తూ. మా చేతి సంచీలనుంచి శాలువా తీసి కప్పుకుంటూ, అబ్బో, చలిగానే వుంది అనుకున్నాము.
మాకు కేటాయించిన గదులలో మా సామాను పెట్టి, refresh అయి వచ్చేసరికి మా కోసం ఉపాహారం మరియు వేడి తేనీరు సిద్ధంగా వున్నాయి. బయటకు వచ్చి resort అంతా తిరిగి చూడాలనుకున్నాము. కాని మసక వెలుతురులో, ఏమంత బాగా కనపడదులే అని, రేపటికి వాయిదా వేసుకున్నాము. వారాంతపు రోజులు అవటం వలన resort వారు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. వాటిలో మాకు camp-fire, quiz, పాటలు, నృత్యాలు నచ్చాయి. మేము కూడా అన్నిటిలో పాల్గొన్నాము. ముందు రాజ్యలక్ష్మి, మణి మేము నృత్యం చెయ్యం, చూస్తాం అన్నారు. నిర్వాహకులు అందరిని పాల్గొనేలా వుత్తేజ పరుస్తూ, రక రకాల ఆటలు నేర్పిస్తూ సందడి చేసారు. అలసిపోయే దాక, ఆరుబయట, నెగడు చుట్టూ ఆడుతూనే వున్నాము. రాత్రి భోజన సమయానికి మిద్దె పైన వున్న భోజనశాలకు వెళ్ళి వివిధరకాల ఆహారపదార్ధాలను రుచి చూసాము.
రాత్రి 9 గంటలకు మా గదులకు చేరుకుని, heaters on చేసి చల్లగా అయిపోయిన మా శాలువాలను, shoes లను ఆరబెట్టాక, సరదాగా కాసేపు పేకాట ఆడదామా అన్నది పద్మ. కిందటి సంవత్సరం శ్రీలంక పర్యటనలో కష్టపడి నేర్చుకున్న నేను, సరే అన్నాను. పందెం ఏమిటంటే, రేపొద్దున కొడైకెనాల్ సరస్సులో boating, సరస్సు చుట్టూ cycling కు అయ్యే ఖర్చు ఓడినవాళ్ళదే. పడుకునేప్పటికి బాగా పొద్దుపోయింది. నిద్ర ముంచుకొచ్చేసింది. సగం నిద్రలో మెలకువ వచ్చి చూస్తే, బయట వర్షం పడుతున్న శబ్దం వినిపించింది, వినసొంపుగా. ఆ నీరవ నిశీధిలో, వర్షపు చినుకులు పై కప్పు మీద పడినప్పుడు, క్రింద ఎండుటాకుల మీద పడినప్పుడు, చెట్ల ఆకులమీద పడినప్పుడు వేరు వేరు తీరులుగా వస్తున్న శబ్ద తరంగాలు, ఒక నేర్పరి చేస్తున్న గాన కచ్చేరీలా అనిపించింది. నిజమే కదా! ఒక మహా అద్భుత నేర్పరి చేస్తున్న లయ విన్యాసం కాదా ఇది? ఎంతో హాయిగా ప్రశాంతంగా నిద్రించాను ఆ రాత్రి.
రోజులాగానే తెల్లవారుఝామునే మెలకువ వచ్చింది. మృదువుగా, తేలిపోతున్నట్లుగా అనుభూతి కలిగింది. కొద్దిసేపటి తర్వాత సూర్యకిరణాలు కిటికీలకి వున్న తెరలగుండా ప్రసరించటం చూసి, చేస్తున్న యోగా కార్యక్రమాలను ముగించి, స్నానాదికాలు పూర్తి చేసి, భోజనశాలకు బయలు దేరాము. ఈ రోజు ఏ కార్యక్రమం లేదు. అలా అలా నడవటం, తిరగడం, ఆకలి అనిపించినప్పుడు తినడం. ఇక్కడ resorts లో పెట్టిన Continental అల్పాహారం మాకు బాగా నచ్చింది. తరువాత filter decoction తో చేసిన కాఫీ కొసమెరుపు. ఉదయం 9 గంటలకు resorts అంతా తిరుగుతూ యూకలిప్టస్ చెట్ల అందాలు, చిన్న చిన్న పూల తోటల చక్కదనాన్ని చూస్తూ అక్కడక్కడ ఛాయాచిత్రాలు తీసుకుంటూ నడుస్తూ, ఒక కి.మీ దూరంలో వున్న Boats Club కు చేరుకున్నాము. Pedal boating చెయ్యాలనుకున్నాము. అరగంటకు 70 రూ||- ఇద్దరు కూచోగలిగిన boat కి. నలుగురు కూర్చునే boat కి రూ.140/- మేము నలుగురం ఇద్దరు కూర్చోగలిగిన రెండు boats తీసుకున్నాము. Life Jackets ధరించి boat లోకి ఎక్కేసాము. భయం భయంగా pedalling మొదలెట్టాము. నెమ్మదిగా ముందుకు కదిలింది. ఒకళ్ళ కొకళ్ళం ఉత్తేజ పరుచుకుంటూ, లాహిరి లాహిరి లో అని పాడుకుంటూ వుండగా, మేఘాలు కమ్ముకొచ్చాయి. నిజానికదంతా పెద్ద మంచుతెర. జివ్వుమనిపించే చల్లని గాలి మమ్మల్ని చుట్టుముట్టేసింది. చేతులు, కాళ్ళు చల్లగా అయి, pedalling సాగలేదు. కొద్దిసేపటికే మంచుతెరలు వీడి, వెలుతురొచ్చింది. చుట్టూ వున్న ఎత్తైన కొండలు, పెద్ద పెద్ద చెట్లు, మంచులో స్నానమాడిన గాలి, మేనును తాకుతూ మైమరిపిస్తుంది. దాదాపు గంటసేపు సరస్సులో స్వేచ్ఛా విహారం చేసి ఒడ్డుకు చేరుకున్నాము.
నడక, తరువాత తొక్కుడు పడవ వల్ల, మంచి వ్యాయామం జరిగి ఆకలి వెయ్యటం మొదలయ్యింది. దగ్గరలోనే వున్న పంజాబీ ధాబా కు వెళ్ళి కొన్ని పచ్చి కూరగాయల ముక్కలు, పుల్కా, దాల్ మఖని మరియు కోడి కూరతో పగలు భోజనం చేశాం. మాలో ఇద్దరు శాఖాహారులు, ఇద్దరు మాంసాహారులు మరి. అక్కడనుండి బయటకు వచ్చి సరస్సును చుట్టిరావాలనుకున్నాం. అక్కడక్కడ సైకిళ్ళు, మొటార్ సైకిళ్ళు అద్దెకిచ్చే దుకాణాలున్నాయి. కాస్త తక్కువ జనం వున్న చోట ఆగి, అద్దె సైకిళ్ళు తీసుని, సైకిల్ తొక్కటానికి ప్రయత్నించాము. ఎప్పుడో చిన్ననాట తొక్కటమే తప్ప, ఎవరమూ సాధనలో లేము. కాని కొంతకాలం క్రితం వరకు, స్కూటర్లు నడిపి వుండటం వలన ఐదు నిమిషాలలోనే balance చేస్తూ తొక్కగలిగాము. మాకు ఎదురైన యువతీ, యువకులు కొందరు ఏంటి ఈ ఆంటీలు మరీను అన్నట్లు విస్తుపోయి చూస్తుంటే, మేము మాత్రం ఆనందంగా చిన్ననాటి జ్ఞాపకాలను (సైకిల్ నేర్చుకుంటూ కిందపడి దెబ్బలు తగిలిన రోజులు, అమ్మతో దెబ్బలు తిన్న రోజులు) గుర్తు చేసుకుంటూ, మొక్కజొన్నపొత్తుల బండి దగ్గర ఆగి, నిప్పుల మీద కాల్పించుకుని తింటుంటే, చిరుజల్లులు మొదలయ్యాయి. గబ గబా చెట్టు కిందకు చేరాము. ఒక చేతిలో సైకిల్, మరో చేతిలో మొక్కజొన్న కండి, అచ్చూ పాఠశాలలో చదువుకునే పిల్లల్లాగా. ఈ కొండ ప్రాంతాలలో వర్షం మీద పడితే, కడుపులోంచి తన్నుకొస్తుంది వణుకు, విపరీతమైన చలివల్ల. మేము గొడుగులతో సిద్ధంగా వున్నాము కాబట్టి ఇబ్బంది పడలేదు. జల్లులు తగ్గుముఖం పడగానే, సైకిళ్ళు దుకాణం లో అప్పగించి, మా భుజాన వున్న చేతిసంచిలోని గొడుగులు వేసుకుని resorts కు వచ్చాము. మా కోసం వేడి వేడి పకోడి, మసాలా తేనీరు సిద్ధంగా వున్నాయి. అవి ఆరగించి, మా గదులకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుండగా ఫోన్ మోగింది. చిరుజల్లులు పడుతూ వుండటం మూలంగా, ఈరోజు కొన్ని Indore Games మరియు భోజనానంతరం Tamboalaa, అంత్యాక్షరి కార్యక్రమాలున్నాయని సమాచారం.
చక్కగా తయారయి, ఏడు గంటలకు, ప్రధాన భవనంలో, Indoor games జరుగుతున్న క్రింద అంతస్తుకు వెళ్ళాము. Chess, Carrom Board, Table Tennis, Jenga మొదలైన ఆటలు వున్నాయక్కడ. పద్మ Carrom board champion. మణి Table Tennis, రాజ్యలక్ష్మి నేను Chess బాగా ఆడతాము. ఒక గంట ఆటల తరువాత, భోజనం చేసి, మరల కిందకు వచ్చేసాము. చలిగా వుండటం వలన కొంతమంది భోజనం అవగానే వారి వారి Cottages కు వెళ్ళారు. మిగిలినవారితో, ఆట ఉత్సాహంగా మొదలయ్యింది.Ticket ధర వంద రూపాయలు. మామూలుగా, తంబోలా ఆటలో వుండే, బహుమతులు కన్నా, కొన్ని భిన్నమైన కొత్తవి చేర్చారు నిర్వాహకులు. ఆట మొదలైన కొద్దిసేపటికే ఆపి, ఇప్పుడు మా వద్ద జమ ఐన మొత్తం డబ్బు, ఎంత అని ఆడిగారు. Tickets అమ్మే సమయంలో ఎవరో ఇద్దరు, రెండు, రెండు Tickets కావాలి అని అడగటం విన్నాను. నేను పద్మ చెరో రెండు Tickets కొన్నాము. మొత్తం 38 మందిని లెక్కించాను. వెంటనే సరైన సమాధానం చెప్పి, ఆటలో తొలి బహుమతి పొందాను. అక్కడున్న వారంతా, మీరు super aunty అని చప్పట్లు కొడుతూ, ఈలలు వేసారు. తంబోలా ఆటలో మొత్తం 15 బహుమతులుంటే, మేము నలుగురమే 9 బహుమతులు సాధించటం గొప్ప సరదాగా అనిపించింది. ఇక అంత్యాక్షరి, పాటలతో మొదలయి, నృత్యాలతో అంతమయింది. మొగుడు, పిల్లలు, ఇల్లు, ఇంటిపనులు, వంట, వార్పు ఏవీ గుర్తుకు రానంతగా సమయం పరుగులు తీసింది. చిన్న పిల్లలవలే వుత్సాహంగా, వుల్లాసంగా గడిపేసాము ఆరోజంతా.
మరుసటి రోజు బెరిజాం సరస్సు కు వెళ్ళాలని, దారిలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలని అనుకున్నాము. అలవాటుగా ఆరోజు కూడా పొద్దున్నే లేచినా, నింపాదిగా 10 గంటలకు బాడుగ కారు తీసుకుని బెరిజాం సరస్సుకు బయలుదేరాము. అక్కడకు వెళ్ళటానికి ఆటవీ శాఖ నుండి, అనుమతి తీసుకోవాలి, కొంత రుసుము చెల్లించి. ఆ పని ముందురోజే మా Travel వాళ్ళు చేసి వుంచారు, మా కోసం. రోజూ పరిమిత వాహనాలకు మాత్రమే, అనుమతి లభిస్తుంది. Checkpost లో రసీదు చూపించి, ముందుకు కదిలాము. కొడైకెనాల్ శీతోష్ణస్థితులు, కొండలు, లోయలు, పచ్చని పరిసరాలు, ఎత్తైన యూకలిప్టస్ చెట్లనుంచి వచ్చే సుగంధభరితమైన గాలి, సహజమైన, పరిశుభ్రమైన నీరు, అక్కడ మాత్రమే లభించే కొన్ని పండ్ల రకాలు, కూరగాయలు అన్నీ మొత్తంగా అనుభవించాలి, అనుభూతి చెందాలి, లీనమై జీవించాలి. అప్పుడే కొడైకెనాల్ చూసినట్లవుతుంది.
Checkpost నుండి దాదాపు 13 కి.మీ. వెళ్ళాక, సరస్సు కనపడింది. పరిపూర్ణమైన నిశ్శబ్దం ఆవరించి వున్న ఆ ప్రదేశం, ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా అనిపించింది. నిజానికి అది ఒక వన్యప్రాణి అభయారణ్యం. బెరిజాం సరస్సు అనేది ఒక reservoir. Micro watershed project లో ఇది ఒక భాగం. సరస్సు దగ్గర కొన్ని చిన్నవి, పెద్దవి నడక మార్గాలు వున్నాయి.
మేము ఒక చిన్న నడక మార్గం ఎంచుకుని, అలా అడవిలోకి నడుచుకుంటూ, పిట్టల కూతలు, చల్లగాలులు మోసుకొచ్చే, గాలి ఊసులు వింటూ, అడవిపూల అందాలు చూస్తూ ఒక కి.మీ. దూరం నడిచి వెనక్కు వచ్చాము. దారిలో మాకు ముళ్ళపంది, కొన్ని కోతులు తప్ప మరేమీ జంతువులు కనపడలేదు. కాని అక్కడ మంచి జీవ వైవిధ్యం వున్నదని విన్నాను. ప్రకృతి, సహజ స్థితిని కోల్పోని, ఆ సరస్సు వద్ద, విశ్రాంతిగా కూర్చోవటానికి కొన్ని బల్లలు కూడా వున్నాయి. ఎటు చూసిన పచ్చని చెట్లు, సరస్సు మీదనుంచి వచ్చే చల్లని గాలి, నిశ్శబ్దాన్ని మోస్తున్న పరిసరాలలో లీనమై, చాలా సేపు అలా ధ్యానముద్ర లో వుండిపోయాం.
*****
సి.వి.రమణ: గృహిణి. హైదరాబాదు నివాసం. సంగీతం, పర్యావరణం, సాహిత్యం ఇష్టం. రక రకాల మొక్కలను పెంచటంలో ఆనందం. స్త్రీల సమస్యలపై ఆకాశవాణిలో పలు ఉపన్యాసాలిచ్చారు. కొన్ని కథలు, వ్యాసాలు వనితాజ్యోతి, విపుల వగైరా పత్రికలలో ప్రచురితమయ్యాయి.