ఇట్లు మీ వసుధా రాణి
అన్నింటిలోనూ పెద్ద
-వసుధారాణి
విజయలక్ష్మీ సరస్వతి అనే మా పెద్దక్కయ్య మా అమ్మకు పదహారవ ఏట పుట్టింది .అక్కయ్య పుట్టినప్పుడు దేచవరం అనే చిన్న పల్లెటూరిలో ఉండేవారు .మొత్తం ఊరు ఊరంతా అక్కయ్యను చూడడానికి వచ్చారట .వచ్చిన వారంతా పిల్లను చూడడం ,మాడున ఓ చుక్క ఆముదం అద్దడం ,నోట్లో ఓ చుక్క ఆముదం వేయడం ఇలా ఊరిలో జనం అంతా చేసేసరికి పిల్లకు విరోచనాలు పట్టుకున్నాయట .చిన్నప్పుడు నవ్వు వచ్చినా, ఊరంతా పిల్లను ఆశీర్వదించిన అదృష్టం మాత్రం మా పెద్దక్కకు దక్కింది కదా అనిపిస్తుంది .సాధారణంగా చిన్న పిల్లలను ముద్దు చేస్తారంటారు గానీ ఫస్ట్ ఈజ్ ఫస్ట్ లాగా పెద్దవాళ్ళకు కొన్ని హంగులు అమరుతాయి .
అమ్మమ్మ ,తాతయ్య, అమ్మ అందరూ అక్కయ్యను పెద్దమ్మాయ్ అనేవాళ్ళు .అత్తగారింటి వైపు వారంతా విజయా అని పిలిచే వారు .అక్కడ కూడా అక్కయ్య ఐదుగురు అన్నదమ్ములున్న ఇంట్లో పెద్ద కోడలు .మేమందరం సరస్వతక్కయ్య లేదా పెద్దక్కయ్యా అని పిలిచివాళ్ళం .మా అక్కచెల్లెళ్ళ పిల్లలందరికీ నిర్మల్ ఆమ్మ .ఎందుకంటే మా పెద్దక్కయ్యా వాళ్ళు అదిలాబాద్ జిల్లా నిర్మల్ లో వుండేవారు .
అప్పట్లో ఇక్కడినుంచి నిర్మల్ వెళ్ళడం అంటే ఓ పేద్ద ప్రయాణం .తక్కువ వెళ్ళే వాళ్ళం .మా అక్కయ్యకు పుట్టింటి దిగులు ఎక్కువ .తనే తరచూ వస్తూండేది .వచ్చిన ప్రతీ సారీ వెళ్ళేటప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని వెళ్ళేది .నా పెళ్లి అయ్యేవరకూ కూడా ఇదే తంతు .
మా అక్కయ్యకు అన్నీ చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉండేవి . హాస్యంగా అనిపించేవి తన చేష్టలన్నీ , కానీ నిధానంగా చూస్తే వాటిలో ఎంతో మానవత్వం ,జీవనకళ ,ఓ మంచి ఉద్దేశ్యం కూడి వుండేది .చిన్నప్పుడు శెలవులకు నిర్మల్ వెళ్తే ,ఉదయాన్నే మాకు కాఫీలు ,పాలు ఏమీ ఇవ్వకుండా, ఓ కొడవలి పట్టుకుని తోటపని చేసుకుంటూ ఉండేది. వాళ్ళ ఇంటి పెరడు చాలా పెద్దగా ఉండేది .ఇంట్లో లేని మొక్క లేదు ,అన్నీ చాలా శ్రద్ధగా పెంచేది .మా చేత కూడా ఎండ పడేవరకూ ఏదో ఒక పని చేయించేది .ఇంట్లో మోటర్ ఉన్నా సరే నీరు చేదతో తోడించేది .చిన్న చిన్న కథలు ,కబుర్లు చెపుతూ ,తాను పనిచేస్తూ ,మొక్క మొక్కనూ పలకరిస్తూ ,మా చేత పలకరింపజేస్తూ తోటపని తొమ్మిదింటివరకూ చేసేది .బాగా ఆకలి కరకరలాడినప్పుడు (రోజూ ఉదయాన్నే చాలా వరకూ పెసరపప్పు వేసి వండిన కిచిడీనే టిఫిన్ )కిచిడీ పెట్టేది ఆవకాయ వేసి .బతుకుజీవుడా అని టిఫిన్ తిని ఆడుకోబోతే ,సంవత్సరానికి సరిపడాచింతపండు (చింత గుల్లలు)కొట్టించి ,పైన చెక్కు ,గింజలు తీయించేది .మధ్యాహ్నమెప్పుడో బాగా ఆకలి వేశాక అన్నం పెట్టేది. అన్నం తరువాత తను పడుకునేది కనుక మాకు ఆటలు. నాలుగు గంటలకు లేచి టీ పెట్టి ,మరమరాలలో ఆవకాయ కలిపి ,ఉల్లిపాయ ముక్కలు చేయకుండా అలాగే కొరుక్కోవడానికి ఇచ్చేది .ఇది సాయంకాలం స్నాక్ చాలావరకు .
ఇంటి కాంపౌండ్ చుట్టూ వున్న కొబ్బరిమట్టలు కొట్టించి ,వాటి ఆకుల ఈనెలు తీసి చీపురు పుల్లలు తీయడం ఓ పని .అలా కనీసం ఓ వంద చీపుర్లు చేయించింది .
మా బావగారు ఇన్కంమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ .డబ్బుకు కొదవలేదు .కానీ మా మా పెద్దక్క చేసే ఈ పొదుపు పనులు మాకు సరదాగానూ ,నవ్వుగానూ ఉండేది .
సంవత్సరానికి సరిపడాకందిపప్పు ,పెసరపప్పు ,
మిరపకాయలు ,చింతపండు కొనిపెట్టేసేది .మామిడి కాయ ముక్కలు ఉప్పులో వేసి పెట్టి ,అందరికీ ఏడాదికి సరిపడా తెచ్చి ఇచ్చేది .
ఓరోజు చీపురు పుల్లలు గీస్తూ నేను చెయ్యి కోసుకున్నాను .అప్పుడు మా అక్కయ్య చిన్న కొడుకు అనంద్ బాబుకు వాళ్ళ అమ్మ మీద భలే కోపం వచ్చింది .పిన్ని మనింటికి శెలవులకు వస్తే నువ్వు పిన్ని చేత పని చేయిస్తావా అని వాళ్ళ అమ్మ మీదే కోప్పడ్డాడు .అప్పుడు నాకు 14ఏళ్ళు ,వాడికి 11 ఏళ్ళు .మా అక్కయ్య అప్పటికి నవ్వేసి ఊరుకుని ,మర్నాడు ఆ వంద చీపురు కట్టలు వాడిచేతనే కారు డిక్కీలో పెట్టించి ,మమ్మల్ని తీసుకుని అడవిలో ఓ చిన్న పల్లెటూరిలో ఓ సాయిబాబా మందిరానికి తీసుకు వెళ్ళింది .ఆ ఊరి పేరు బీరెల్లి.అక్కడ ఓ సాయిబాబా మందిరం ,ఓ అనాథాశ్రమం ఓ పెద్దాయన నడుపుతున్నారు .ఈ చీపుర్లు,చింతపండు పప్పుదినుసులు అన్నీ ఆ ఆశ్రమానికి మా చేత ఇప్పించింది .
మా పిల్లలు తయారు చేశారు ఈ చీపుర్లు అని అక్కయ్య చెబుతూ అనంద్ బాబు కేసి చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేను .
పెద్దవారు చేసే ప్రతీ పని వెనుక ఓ మంచి కారణం వుంటుంది అన్న విషయం మాకు అప్పుడు అర్థం అయింది .అక్కడంతా మట్టినేల ,అది శుభ్రం చేసుకోవడానికి పుల్లల చీపుర్లు ఎంతో అవసరం. వారి చిన్న అవసరానికి అక్కయ్య పెద్ద డొనేషన్ ఇవ్వడం నాకు భలే అనిపించింది. అప్పట్నుంచీ మా పెద్దక్కయ్య చేసే పనులలో పరమార్థం వేరే వుంటుంది అని తెలుసుకొని దాన్ని వెతికే ప్రయత్నం చేసేదాన్ని.
అప్పట్లో అదిలాబాద్ జిల్లాలో సరైన స్కూల్స్ లేవు .తన ముగ్గురు కొడుకుల చదువుకోసం అక్కయ్యే ఓ స్కూల్ పెట్టింది .తను బీఏ స్పెషల్ తెలుగు కనుక తెలుగు ,సోషల్ చెప్పేది .ఆంధ్రా నుంచి టీచర్లను జంటలుగా పిలిపించి తమ స్కూల్లో టీచర్లుగా పెట్టుకునేవారట .వారందరి బాగోగులు తనే చూసుకునేది . స్కూల్ చాలా ఏళ్ళు విజయవంతంగా నడిపింది .తమ పిల్లలతో బాటు ఎంతో మందికి విద్యాదానం చేసింది .తెలుగు పాఠం ఎంత బాగా చెప్పేదంటే ఒకసారి వింటే ఇక మర్చిపోలేనట్టు వుండేది.
నిర్మల్ చుట్టూ చిట్టడవులూ ,జలపాతాలు వుండేవి .ఓసారి పిల్లలందర్నీ పిక్నిక్ గా గాడిద గుండం వాటర్ ఫాల్స్ కి తీసుకుని వెళ్ళింది. వంటపాత్రలు ,సరుకులు అన్నీ తీసుకుని వెళ్లి అడవిలో పొయ్యి పెట్టి వందమందికి తనే వంట చేసింది .అక్కయ్య చేతి వంట రుచి ఒక్కసారి తింటే మర్చిపోలేని విధంగా వుండేది ఏమి వండినా .తాను పని చేయడం ,అందరిచేత పని చేయించడం ,అందర్నీ కలుపుకుని వెళ్ళడం నాయకత్వ లక్షణాలు .మా పెద్దక్కయ్యలో అవి మెండుగా ఉండేవి. పసిపిల్లలంటే భలే ఇష్టం తనకు ,ఒక్క క్షణంలో వారికి చేరిక ఐపోయేది .
మా అమ్మనుంచి నేర్చుకుందేమో పూలమాలలు చక్కగా అల్లేది .కొన్ని పనులు ఎంత సుకుమారంగా చేసేదంటే ,ఆ పనులు తనే చేయాలి ,ఇంకెవరికీ చేతకాదు అన్నట్లు వుండేది .పైకి గంభీరంగా కనపడేది కాని ,చాలా సున్నితమనస్కురాలు .సూర్యోదయాలు ,సూర్యాస్తమయాలు ,వర్షం కమ్మిన మబ్బులు , అడవి అందాలు అన్నీ అక్కయ్య కళ్ళతో చూసి తెలుసుకున్నవే .ఒకసారి తనను చూసినవారెవరైనా మర్చిపోలేని విధంగా ఉండేది .
ఐతే మా కుటుంబం మొత్తం ఇప్పటికీ నవ్వుకుంటూండే సరదా పనులు కొన్ని తన కబుర్లలో చాలా వున్నాయి .మళ్ళీ వచ్చే నెచ్చెలిలో మరింత వివరంగా అన్నింటిలో పెద్ద మా పెద్దక్కయ్య .
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.
అన్నింటిలోనూ పెద్ద అంటే అర్థం కావటం లేదు
Vummadi Kutumbala jeevana Sahili anubhavykavedyam.Makara Sankranthi shubhakanxalu