క’వన’ కోకిలలు -సారా టెస్ డేల్
-నాగరాజు రామస్వామి
ప్రేమ కవితల అమెరికన్ అధునిక గేయ కవిత్రి : సారా టెస్ డేల్
” Under the Leaf of many a Fable lies the Truth for those who look for it “- Jami.
ఈ తాత్విక వాక్యం సారా టెస్ డేల్ ఏకాంకిక రచన ‘On the Tower’కు నాందీ వాచకం. జామి 15 వ శతాబ్ది ప్రసిద్ధ సూఫీ కవి . సారా ట్రెవర్ టెస్ డేల్ 20 వ శతాబ్దపు అమెరికన్ గేయ కవయిత్రి; సమకాలీన ఆధ్యాత్మిక మతచింతన లోనూ, సాంప్రదాయ సాహిత్యాలలోనూ కొత్తరీతులను అపేక్షించిన అధునిక భావుక రచయిత్రి.
Sara Trevor Teasdale -( 1844 – 1933 )- సేంట్ లూయిస్ , మిస్సోరీ లోని సాంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఇద్దరు అన్నలు, ఒక ఒక్క. అందలోకి చిన్నదైనందున అల్లారుముద్దుగా పెరిగింది. పనిపాటలకు దూరంగా ఉండేది. అందుకే ఆమెను ” A flower in a toiling world ” అనే వారు. ఆమె చురుకుగా లేక పోవడానికి మరో కారణం ఆమె అనారోగ్యం. బక్కపలుచని శరీరం. మెడికల్ నర్స్ పర్యవేక్షణలో ఉంటూ 9 ఏళ్ల దాకా ఇంట్లోనే చదువుకుంది. ఇంటికి చేరువలో ఉన్న ఓ ప్రైవేట్ బడిలో చదివి 18 వ ఏట డిగ్రీ పుచ్చుకుంది. ఆర్థిక భవిష్యత్తును ఎంచుకొని, ప్రేమించినతన్ని కాదని 30 వ ఏట ఎర్నెస్ట్ ఫిల్సింగర్ ను పెళ్లిచేసుకొని న్యూ యార్క్ లో కాపురం పెట్టింది. 15 ఏళ్లకే విడిపోయి, సొంత ఊరుకొచ్చిందే కాని పాత ప్రియుని భార్య కాలేక పోయింది. శేష జీవితాన్ని ఒంటరిగా గడపింది. సంక్రమించిన నిమోనియా ఆమెను మరింత కుంగదీసింది. 48వ ఏట ఆత్మ హత్య చేసుకొని తనువు చాలించింది.
సారా జీవితమంతా జీవన ద్వంద్వాల సంఘర్షణలోనే సాగిపోయింది. ప్రేమ ఆకాంక్ష- ఏకాంత అభిలాష, కవితా పిపాస- అనారోగ్య జీవిత వాస్తవికత; ఈ వైరుధ్యాల మధ్య ఆమె బతుకు కొట్టుమిట్టాడింది. తన నైర్మల్య సహజాతానికీ, తనలోని క్రైస్తవ సంబంధ ‘Pagan’ కవిత్వానికీ మధ్య అంతర్యుద్ఢం ఆమె జీవిత పర్యంతం కొనసాగింది. అయినా, ఆమె నిరంతర పఠనాన్ని వీడ లేదు. క్లాసిక్ గ్రీకు కవులను చదివింది. ఆంగ్ల సాహిత్యాన్ని, ముఖ్యంగా కీట్స్, షెల్లీ, బైరన్ల రొమాంటిక్ కవిత్వాలను అవపోసన పట్టింది. ఆమెకు సనాతన గ్రీకు కవిత్రి సాఫో ( Soppho ) అతిలోక సుందరి వీనస్ డి మెల్లో తో సరితూగగల ఆరాధ్య దేవత. వాగ్నెర్ కావ్యం ” Tristan and Isolde ” ఆమె దృష్టిలో master piece of the century. అర్వాచీన ఇటలియన్ నటి Eleonora Duse అంటే ఎనలేని అభిమానం. ఆమెను కీర్తిస్తూ ” Sonnets to Dues and Other Poems ” రాసింది. ‘ Silence ‘ అనే కవితా సంకలనాన్ని ఆమెకు అంకిత మిచ్చింది. Eleonora ఆమెకు ప్రమాదవశాత్తు పునర్జన్మించిన ప్రాచీన గ్రీకు సాహితీ కళల సౌదర్యవారాశి. Sara కొన్నాళ్లు ‘ Potter’s Wheel ‘ అనే లిఖిత పత్రిక నడిపింది. పలు కవిత్వ గ్రంథాలను వెలువరించింది. ” The Answering Voice ” వంటి వర్థమాన రచయిత్రుల ప్రణయ కవితల సంకలనాలకు సంపాదకీయం వహించింది. పిల్లల కోసం Rainbow Gold గేయ సంపుటిని ప్రచురించింది. యవ్వనదశలో యూరప్ సందర్శించి ట్రావెలాగ్ డైరీ రాసింది. ఆ టూర్ ఆమెకు ఒక సౌందర్య తీర్థయాత్ర, ఒక భావావేశ సాహస ప్రయాణం. ‘Poetry Society of America’ సభ్యత్వం పొందింది. కొలంబియా పొయెట్రీ 1918 ( ఇప్పటి Pulitzer Prize ) అవార్డ్ గెలుచుకుంది.
సారా టెస్ డేల్ ది సున్నిత భావాల సుందర గీతికల ప్రేమ కవిత్వం. సరళత, క్లుప్తత, నిశ్శబ్ద తీవ్రత, సుకుమార శిల్ప రమణీయత, శ్రావ్య పద నియతులతో అలరారే గీతాలు ఆమె కవితలు. ఆమెది హృదయాన్ని హత్తుకొనే కవిత్వం, ఊహలకు రెక్కలను మొలిపించే భావుకత్వం. గ్రీకు లిరిక్ ప్రధాన అంశాలైన ప్రణయం, మరణం ఆమె గీతాలలో తరచుగా కనిపిస్తుంటవి. ఆమె శ్రావ్య కవితల వెనుక భగ్న ప్రణయ స్త్రీ మనోగత భావ గీతికలు వినిపిస్తుంటవి. కొన్ని confessional poems లలో స్త్రీవాద భావఛాయలు పొడగట్టుతుంటవి. ఆమెది లౌకికాలౌకిక ఆత్మసౌందర్య కవిత్వం. ప్రాకృతిక సామరస్యం మేళవించిన రసరమ్య అభివ్యక్తి. ఆమె కవితలు చాలా వరకు ఒంటరి స్త్రీ లోని నిష్ఫల సంవేదనలు. లఘుకవితలు. కాల్పనికవాదానంతర అధునిక రచనలు. సమకాలీన సాహిత్యాకాశంలో నవీన శైలీ శిల్పాలు రూపాలు రూపు దిద్దుకుంటున్న పరిణామదశలో వికసించిన కొత్త పాటలు. ఆమె కవితలు అలసిన సాంప్రదాయం లోకి, బిగుసుకు పోయిన ప్రాచీన కవితా హృదయంలోకి నవ జీవన ప్రాణ వాయువులను ఊదుతుంటవి. ఇవి సారా టెస్ డల్ రాసిన కొన్ని అధునిక కవితలకు నా అనువాదాలు:
- : సాటా బేరం :
( Barter ).
రాత్రి గుర్తుకొచ్చింది రమణీయ సౌందర్యం;
నిశ్శబ్దాల తెరలు తొలగించి నిదుర లేచేసరికి
ఇటలీ సుందర పీఠ భూముల మీద
కలలు కంటున్న పచ్చని రావెల్లో తోట మీద
సూర్య కిరణాలు వర్షిస్తున్నవి.
రాత్రి గుర్తుకొచ్చింది రసమయ రాగ గీతం ;
రాళ్లమీద రవళిస్తున్న సలిలధారల సంగీతం,
స్వరశిల్పి బాష్ కల్పనల స్వచ్ఛ స్రవంతీ తేజం,
అలనాడు ఆంగ్ల అరణ్యాలలో విన్న కలకంఠ స్వనం.
కాని, ఇవన్నీ నిన్ను గూర్చిన అక్షరాలోచనలకు
కేవలం పేలవమైన ఉపోద్ఘాతాలే సుమా —
నీవు అరుదైన సౌందర్యారాధకుడవు, నా ఆత్మవు;
నిన్ను కలిసేందుకు తపిస్తుంటవి నా ఆలోచనలు
తీరాన్ని చేరేందుకు తహతహలాడే కడలి తరగల్లా.
- : మెత్తని వర్షం :
(There will come Soft Rains).
వచ్చేస్తున్న మెత్తని వర్షాన్ని స్వాగతిస్తూ
పిచ్చుకలు మెరపు పాటలు పాడుతున్నవి,
పుడమి తడి పరిమళాలు పంచుతున్నది,
రేయిలో కప్పల సంగీతం సాగుతున్నది,
రెల్లుపొద తెల్లగా జలదరిస్తున్నది,
మంటల రెక్కలను తొడుక్కున్న రెడ్ రాబిన్
కంచె తీగ మీద కూనిరాగం తీస్తున్నది.
సాగుతున్న యుద్ధం ఎవరికీ పట్టినట్టు లేదు !
మానవజాతి అంతరించినా
చెట్టు గాని పిట్ట గాని ఇక పట్టించు కోబోదు,
శిథిల ఉదయం లో మేల్కొన్న వసంతం సైతం
మనం కనుమరుగయ్యామని గ్రహించ లేదు !
- : నేను నీ దాన్ని కాలేదు :
(I am not yours)
నేను నీ దాన్ని కాదు, నీ ప్రేమలో పడలేదు –
పడలేదు – పడిపోవాలనుకున్నా;
పగటి వెలుగులో కాలిన కొవ్వొత్తి నయ్యాను,
కడలిలో కరిగిన మంచు రేకు నయ్యాను.
అందమైందే వెలుగొందే నీ అనురాగ హృదయం –
కాంతిలో కాంతిలా కలసి పోవడం నా అభీష్టం .
రా! వచ్చేయ్
నన్ను ప్రేమ లోతుల్లో ముంచేసేందుకు,
నా ఙ్జానేంద్రియాలను
నీ ప్రేమ తుఫానులో ఊడ్చేసేందుకు,
రా! వచ్చేసేయ్ ప్రణయ ఝంఝవై
చిరు దీపికనై వేచిన నున్ను చుట్టేసేందుకు!
- : నిన్నేమీ ఖాతరు చెయ్యను :
( I Shall Not Care )
నేను మరణించాక ఎప్రిల్ నెల నా పై
తడసిన తన తల నీలాలను దులుపుతుంది,
అప్పుడు నీవొచ్చి నా మీద వంగి రోదించినా
నిన్నేమీ నేను ఖాతరు చేయను .
వర్షానికి పూల పొద నా మీదికి వంగుతుంది,
అప్పుడు నేను నీ కన్న నిశ్శబ్దంగా
ఇప్పటి నీ ఉదాసీన ఎద కన్నా
మృత్యు శీతలంగా ఉండి పోతాను .
- : శాంతి :
( Peace )
సాగర తీరం లోని సరస్సును నేను ;
వెనుతిరుగని సాగర కెరటంలా
ప్రశాంతత నాలోకి వచ్చి చేరుతుంటుంది.
నేను విస్తృతాకాశాన్ని ప్రస్తుతించే నీలి కొలనును ;
నాక లోకాలను అంటే నా ఆశలన్నీ
నేడు నీలో ఫలిస్తున్నవి.
నేనో స్వర్ణ సరోవరాన్ని ;
మలిసంధ్య మండిపోయి మరణించాక
నీవు నా నింగి లోతులను పెంచే అగాధానివి –
అపుడు నాకివ్వాలి నీవు నీ నక్షత్ర గుచ్ఛాన్ని.
- : చలికారు రాత్రి :
( A Winter Night )
Sara Teasdale
నా గాజు కిటికీ రెక్క
మంచు నక్షత్రాలను అద్దుకున్నది,
గడ్డకట్టే చలి
లోకాన్ని గజగజ వణికిస్తున్నది,
క్రూరమైంది చందమామ,
ఈదురు గాలి
రెండంచుల పదును కత్తిలా కోస్తున్నది.
దయ తలచాలి దేవుడు
ఇళ్లులేని బిచ్చగాళ్లను,
చలి రాత్రిలో వీధిదీపాల కింద
తచ్చాడే నిరుపేదలను.
నా గది
మడత మీద మడతేసి కుట్టిన పరదా కప్పిన
వెచ్చని చైత్రంలా వున్నది;
కాని,
ఎక్కడో నా హృదయం
నెత్తిమీద కప్పులేని బీద బిడ్డలా
వెక్కివెక్కి ఏడుస్తున్నది.
- : గుప్త ప్రణయం :
( Hidden Love )
Sara Teasdale
నా ప్రణయాన్ని నా గుండెల్లో దాచిపెట్టుకొని
కన్నుల్లో నవ్వులను వెలిగించుకున్నాను;
మేము కలుసుకున్నప్పుడు
నా అమర ప్రేమ అతనికి తెలియొద్దని.
కాని,
కొన్ని పచ్చని అస్పష్ట పరిమళాల రాత్రులను
అతడు స్వప్నిస్తున్నప్పుడు
నా వలపు పైకి పాకి
అతని కలను నిదుర లేపొచ్చు.
కొన్నిసార్లు
దిగులు క్రుంగ దీస్తున్న అతని హృదయం
హఠాత్తుగా హుషారై పోయినప్పుడు
అక్కడ నా ప్రేమ ఉండే ఉంటుంది
ఆతని విషాద జీవితాన్ని
బాధల నుండి విముక్తి చేసేందుకు.
సారా టెస్ డేల్ రచించిన పలు కవిత్వ గ్రంథాలలో Flame and Shadow, River to the Sea, Helen of Troy and other Poems, Sonnets to Duse, Dark of the Moon కొన్ని. అత్యంత ఆత్మాశ్రయ వ్యక్తిగత కవిత్వమని ఆమె ప్రచురణకు నిరాకరించి దాచుకున్న 51 కవితల సంకలనం ఆమె శతాబ్ది ఉత్సవాలలో ఆవిష్కరింప బడింది. ‘A 20 th Century American Lyric Poet’ అని ప్రస్తుతింపబడిన అధునిక కవితాత్మ
సారా ట్రెవర్ టెస్ డేల్.
రైమ్ స్కీమ్ కవితల మేటి, నవ శతాబ్ధి గేయకవన వధూటి సారా టెస్ డేల్.
*****
వీరు కరీంనగర్ జిల్లా ( తెలంగాణ) లోని ఎలగందుల గ్రామం లో జవ్మించారు. వయస్సు 82 సంవత్సరాలు. పుట్టిన తేదీ, సెప్టెంబర్ 9,1939. ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైన్స్ & ఇంజనీరింగ్ లో డిగ్రీలు తీసుకొని, పదిహేనేళ్ళుఇండియాలో పనిచేసి, శాంతినికేతన్ లో ఆరు నెలల పాటు సాంఘిక విద్యలో శిక్షణ పొంది, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘనా, ఓమాన్, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు చేసి, పలు ప్రపంచ దేశాలు సందర్శించి, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రస్తుత నివాసం యు.యస్ సిటిజన్ గా ఆస్టిన్, డాలస్. వీరు ప్రచురించిన పుస్తకాలు 16 ( 4 స్వీయ కవితా సంపుటాలు – ఓనమాలు, గూటికి చేరిన పాట, ఎదపదనిసలు, విచ్చుకున్న అక్షరం, 8 అనువాద సంపుటాలు – అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, పురివిప్పిన పొరుగు స్వరం, రవీంద్రగీత గీతాంజలి, జాన్ కీట్స్ పుడమి కవిత్వం ఆగదు, ఆక్టేవియా పాజ్ సూర్యశిల, కల్యాణ గోద – తిరుప్పావై, 1 వచనం – అనువాదం అనుభవాలు, ఆంగ్లంలో The great Void, Wings of Musings, Blue Pleasance. వీరి విచ్చుకున్న అక్షరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ఉత్తమ కవితా సంపుటి బహుమతి లభించింది.