కొత్త అడుగులు-5

దారిలో లాంతరు

– శిలాలోలిత

అనగనగా ఓ రక్షితసుమ. ఆ పాపకు పదమూడేళ్ళు. కవిత్వమంటే ఇష్టం. రక్షితసుమ అమ్మ పేరు లక్ష్మి డిగ్రీ చదివేరోజుల్లో హైకూ కవిత్వం రాసేవారు. నాన్న పేరు కట్టా శ్రీనివాస్, కవి, ‘మూడుబిందువులు’, ‘మట్టివేళ్ళు’ కవితా సంపుటులతో సాహిత్య ప్రపంచంలో తనదైన స్థానాన్ని స్థిరపరచుకున్న వ్యక్తి. వీళ్ళిద్దరి సాహిత్య వారసత్వ సంపదను రక్షిత కైవసం చేసుకుంది. నానమ్మ కట్టా లీలావతి చెప్పే కథలతో మౌఖిక సంపదనూ సమకూర్చుకుంది. ఇదీ క్లుప్తంగా రక్షితసుమ నేపథ్యం.

ఈ “దారిలో లాంతరు’ కవితా సంపుటిలో మొత్తం 12 కవితలున్నాయి. సంవత్సరపు వృక్షానికి 12 కొమ్మలుంటే, ఈ రక్షిత పుస్తకంలో 12 కవితలు. ఎండా, వానా, చలి మూడు కాలాలున్నట్లే – సున్నితత్వం, విషయపరిజ్ఞానం, భావోద్వేగం ముప్పేటలా రక్షితను అలుముకొని ఉన్నాయి. అందుకేనేమో ఇంత చిన్న వయస్సులోనే తాత్త్వికత నిండిన కవిత్వాన్ని రాసింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా కవి ఊహతోనే రాణిస్తాడు. ‘అశాశ్వతం’ అనే కవితలో “ఆకు రాలుతూ చెపుతుంది / జీవితం శాశ్వతం కాదని / నీటి బుడగ పగులుతూ తలూపుతుంది / అవును అది నిజమేనని!” అంటూ తన చుట్టూ వున్న వాటినే ప్రతీకలుగా మలచి మామూలు మాటల్లోనే జీవన సత్యాల్ని చెప్పేసింది సుమ.

ఒకసారి వినాయక చవితి, రంజాన్ పండుగలు ఒకేరోజున వచ్చాయి. ఒకరేమో చంద్రుడ్ని చూడకూడదు, నీలాపనిందలనీ తలవొంచుకుంటుంటే, ఇంకొకరు చంద్రుడెప్పుడొస్తాడా చూస్తేనే పండుగ సంబరం ప్రారంభించుకోవాలని నమ్ముతూ ఎదురు చూడడం… ఈ రెంటినీ గమనించిన చిన్నారి, ‘పండుగవెన్నెలల మామ’ అనే మంచి కవితను రాసింది. ‘పగల సెగల నెరుగని, వెన్నెల సహనాన్ని మాకివ్వుమామా’ అని అభ్యర్ధించింది.

‘ధ్యానభంగిని’ వ్యంగంతో నిండిన, హస్యస్ఫోరకమైన కవిత. తను చిన్నప్పుడు విన్న కథల ప్రభావం ఉందందులోమనం పాడుదమ / పోయిన జన్మలో / అప్సరసేమో / నాట్యం గానంతో పాటు / ధ్యానభంగ విద్యకూడా / వచ్చేసిందేమో / అంటూ మొదలైన ఈ కవిత ధ్యానభంగమైన రీతిని చమత్కారంగా వర్ణించింది.

పర్యావరణ కాలుష్యం వల్ల ఋతువులన్నీ ముఖాలు మార్చుకొని ఇష్టమొచ్చినప్పుడు రావడం పోవడం వల్ల ‘కొలిమి’ లాంటి పరిస్థితులేర్పడ్డాయని భావించింది ఒకప్పుడు / కాలాలు బడికెళ్ళే పిల్లల్లా / సమయానికి వస్తుండేవి / ప్లాస్టిక్ చిక్కుముడుల మధ్య / తల కూడా బయట పెట్టలేక పోతోంది. చెట్టు అని బాధపడ్తూ, విషవాయువుల పొగల ఆవిర్లలో చిక్కి, ఒక చుక్కగానైనా రాలేక పోతోంది చినుకు అంటోంది. భూమి పంట పొలాలు, చెట్లు, పిట్టలనూ కోల్పోయాక, ఓజోన్ పొరకే చిల్లుపడిపోయాక సూర్యతాపాన్ని అరికట్టేదెలా? అంటూనే ఇంకొక సూటి ప్రశ్నతో ముగిస్తుంది. ‘కూర్చున్న కొమ్మనే నరుక్కుంటే / చెట్టు మళ్ళా చిగురిస్తుందేమో గానీ / విరిగిన నడుము అతుక్కుంటుందా?

ఒక విద్యార్థి బతికున్న స్వరం నుంచి ఉబికి వచ్చిన ఝరీప్రవాహం ‘ఒకప్పుడు’ కవిత.

బాల్యాన్నీ, ఆటల్నీ, స్వేచ్ఛనూ, సంతోషాన్ని కోల్పోయిన పిల్లలు సహజమైన వేదనల ప్రతిబింబమిది. మొళ్ళు అరిగిపోయినా / పుస్తకాలు చిరిగి పోయినా / చదువొక ముక్కయినా ఎక్కిందో లేదో ? … LKG, UKGల నుండే కేజీలకు కేజీలు బరువులు మోస్తు భారంగా అడుగులేస్తున్నాం / క్లాస్ బోర్డ్ అనే TV లో / పాఠాలు అనే అర్ధం కాని విచిత్ర సినిమా చూస్తూ అయోమయం అయిపోతున్నాం / పుస్తకాల్లో వున్నది చదివి / బట్టీలు పట్టడమే కాదు / కాస్త ప్రపంచంతో కుస్తీలు పట్టడం కూడా నేర్పండయ్యా సార్లూ.

ఇప్పుడున్న విద్యావిధానంలోని లోపాలు, బోధనా పద్ధతుల్లోని వైఫల్యాలు, ఐటీ చదువులు, మార్కుల రేసులే గానీ జీవితం, జీవన విలువల ప్రస్తావనే ఉండదు. మేం చదువుకునే రోజుల్లో ‘మోరల్ సైన్సు (నైతిక విద్య)’ క్లాసులుండేవి. గురుశిష్యుల ఆత్మీయ బంధాలుండేవి. విద్వత్తు వున్న, వృత్తిపట్ల గౌరవం వున్న ఉపాధ్యాయులుండేవారు. ఇప్పుడలాలేదు. కేవలం జీతం రాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళు, విషయావగాహనలేని వాళ్ళు, బోధనా పద్ధతుల విలువలు తెలియనివాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనివల్లనేనేమో రక్షితసుమ లాంటి విద్యార్థుల్లో ఈ నిరసనగళం వినిపిస్తోంది. ప్రపంచపు తీరుతెన్నులను వివరిస్తూ, నేటి సామాజిక సమస్యలపై అవగాహనను కల్పించే బాధ్యత గురువులదే పేరుకే గురువులు కానీ, బుద్ధిలో లఘువులవడం వల్లనే ఇన్ని విపరీతాలేమో! సిలబస్ లలోని లోపాలు, హోంవర్క్ ల పెనుభారాలు, ట్యూషన్లు 7 నుంచి 7 వరకూ లేదా అంతకంటే ఎక్కువగానో స్కూలు సమయాలు, విపరీతమైన ఫీజులు బలవంతంగా తల్లిదండ్రులపై మోపుతున్న భారాలు, వీటన్నింటి మధ్యా లేగదూడల్లా, బయటి ప్రపంచపు కిటీకీ మూసేస్తే బిక్కుబిక్కుమంటున్న లేగదూడల్లా వున్న పిల్లలు. వాళ్ళ భావాల్ని కవిత్వంలో చెప్పమంటే ఇలాగే రాస్తారేమో!

‘చెకుముకి రాయి’లో ‘ఏ స్పందన లేకుండా హృదయమెలా బతుకుతుంది / చదవనిదే మనిషికెలా జ్ఞానం మదికెక్కుతుంది / చైతన్యం, కదలికా లేనిదే ఫలితమెలా వస్తుందని’ ప్రశ్నిస్తుంది. వేమన ‘బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయా?’ అన్నది గుర్తొచ్చింది, ఈ కవితా పాదం చదవగానే ‘చెడునడతను ఆపేందుకు ఒక్క చరుపు మేలు’ అనడంలో ఈ కవితలో ‘కాళ్ళకు పని చెప్పు, నడిపించు, వెలిగించు, సాగించు’ లాంటి పదాలను చేర్చడం వల్ల సందేశాత్మకంగా ఉండటంతో పాటు రక్షితకున్న ఆశావహదృక్పథం వ్యక్తమవుతోంది.

‘అడుగులు’ కవిత మీద ఎం.నారాయణ శర్మ గారు మంచి విశ్లేషణ చేశారు. పుస్తక పఠనావశ్యకతను ఈ కవితలో అద్భుతంగా చెపుతుంది. ‘పోగుబడ్డ ప్రపంచ విషయాల పరిశీలనకు పుస్తకాన్నడుగు’- తండ్రి, తల్లి, గురువు, పుస్తకం, జ్ఞాన సముపార్జనా సాధనాలని నిజాయితీగా చెప్పింది.

‘తోకతెగిన పిట్ట’ , ‘అవిజ్ఞులు’ , ‘గడ్డిపోచ’, ‘కొత్త చీకట్లు’, ‘ఒక్క సమిధ వెలిగినా చాలు’ లాంటి మరికొన్ని చిక్కని కవితలున్నాయి. ‘కొత్తచీకట్లు’లో ‘అన్నీ అల్లావుద్దీన్ లాంతర్లే కాదు ! కొన్ని బిన్ లాడెన్ లాంతర్లూ / మందు పాతర్లూ కూడా వున్నాయి’ – ఇలా చెబ్తూపోతే మీరు చదువుకోవడానికేం మిగలదేమో. అందుకే చివరగా ‘ధైర్యం ఆరిపోతేనే / పిరికితనపు చీకటి ఆవరిస్తుంది / చేపకు జీవం లేనప్పుడే / ప్రవాహం ఈడ్చుకు పోతుంది. మనిషికి ఆశ శ్వాసగా లేనప్పుడే / చీకటి గుహలు మింగేస్తుంటాయి….

భవిష్యత్తును చూడగలిగిన కవే నిజమైన కవి. గత వర్తమానాలను పర్యవేక్షిస్తూ భవిష్యత్ పథాన్ని నిర్మించగల వారి, చూడగలిగిన వారి కవిత్వం నిలబడిపోతుంది. రక్షిత సుమలో అలాంటి లక్షణాలున్నాయి. ఈ చిన్నిచిన్న అడుగులతో రేపు గొప్ప కవిత్వప్రయాణాన్ని సునాయాసంగా చేయగలదని నా నమ్మకం.

‘భారత కోకిల’ సరోజినీ నాయుడు కూడా తన 13 ఏళ్ళ వయస్సులోనే కవిత్వం ప్రారంభించింది. కవిత్వపు విత్తనాలతో మొక్కదశకు చేరిన రక్షితసుమ కవిత్వావరణంలో మహావృక్షంలా ఎదగాలని నా ఆకాంక్ష.

జీవన రహదారిలో వెలుగునూ, వెన్నెలనూ ఇచ్చే జ్ఞానలాంతరు ఈ కవిత్వం.

***

గడ్డిపోచ

అహంకారంతో

ఉప్పొంగిపోకు

స్వర్ణపతకమే లభించినా

నిలకడలేక జారిపడే ప్రమాదముంది 

ఒద్దికగా

తలేవంచితే

ఏ హారమైనా

ఆర్భాటం లేకుండా వచ్చి

ఒదిగిపోతుంది. 

పండుగ వెన్నెలల మామ

చందమామ కోసం

పండుగ ఎదురు చూడటం

ఎంత బాగుంది!

చవితి రోజు

నెలవంకతో

దొంగా పోలీసాట

భలే బాగుంది!

వేషం, భాష వేరేమో కాని

అందరం భూమి తల్లి పిల్లలమే

ఈ అమ్మ తమ్ముడివేగా

ఓ చందమామ

అందుకే నీవంటే మాకంత ప్రేమ.

ఎవరింట పండగైనా

తొలి అతిధివి నువ్వే!

చల్లదనమేగాని

పగలసెగ నెరుగవు. 

కాకెంగిలితో చాక్లెట్ ముక్కలు పంచినట్లు

వెన్నెల సహనం మాక్కూడా ఇవ్వు

అందాల మామ

మా చందమామ!

అదే నేను

మనిషికి జ్ఞానం రుద్దగల నీకు

మనసుకు మౌనం అద్దటం రాదాయె! 

ముసల్మానుననే ముసుగులో నీవొచ్చుంటే

అల్లా అనేది నేనే అనే వెలుగు నీ కళ్ళలో పడనిచ్చేదాన్ని

కిరస్తానీననుకుంటూ మనసు ప్రార్ధిస్తే

అజ్ఞానపు వెతల శిలువ భారాన్ని పడనీకుండా

మోస్తున్న జీసస్ నేనేననిచెప్పుండేదాన్ని.

హిందువుగా నిన్ను నీవు భావించుకుని ఉంటే

రాముడో, కృష్ణుడో లేదా జగన్మాతనో నేనేనని

‘ప్రత్యక్షం’ నీకుగా కల్పించేదాన్ని.

మానవత్వమే నా మతమని పనిచేసుకుంటూపోయేవాడివైతే

సాటి మనిషిలో నిలిచే దైవమై నీ మదిలో గూడుకట్టుకునే దాన్ని

కనీసం నాస్తికుడిగా నీ గురించి నీవు నమ్మినా

శాస్త్ర విజ్ఞానపు ఫలం నేననే నిజం చెప్పకుండానే నీకు తెలిసుండేది. 

కళ్ళకు రంగుల్ని చూపడం తెలిసిన నీకు

నిశీధిది కూడా వర్ణమేనని తెలియదాయె!

అయ్యో! తలుపులు బిడాయించుకున్న చీకట్లో

తడుముకునే నీకు, ఇక పైనయినా నేనెలా కనిపిస్తాను?

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.