బెట్టు విడిచిన చెట్టు

-అనసూయ కన్నెగంటి 

          ఎక్కడి నుండో ఎగురుకుంటూ వచ్చి అక్కడున్న వేప చెట్టు మీద వాలింది గోరింక.

దాంతో చాల కోపం వచ్చేసింది చెట్టుకు. దానిని ఎలాగైనా తన మీద నుండి ఎగిరిపోయేలా చేయాలనుకుని  గట్టిగా అటూ ఇటూ ఊగసాగింది వేప చెట్టు.  

      కొమ్మపై కూర్చున్న  గోరింకకు ఉన్నట్టుండి  ఆ చెట్టు ఎందుకు ఇలా ఊగుతుందో అర్ధం కాక కంగారు పడుతూ చుట్టూ చూసింది. ఆ సమయంలో  గాలీ,వానా ఏదీ రావటం లేదు. చుట్టు పక్కలా అంతా ప్రశాంతంగా ఉంది. తాను కూర్చున్న చెట్టు ఒక్కటే ఎందుకు అలా ఊగిపోతూందో గోరింకకు అర్ధం కాక అయోమయంగా చూసింది. అలా చూస్తూ  చుట్టు పక్కలా చెట్ల మీదున్న రకరకాల పక్షులన్నీ తననే చూస్తూ ఉండటం అది గమనించింది. అంతే కాదు తన కంగారు, భయం చూసి అవన్నీ నవ్వుతున్నట్టు గోరింకకు అనిపించింది. 

    దాంతో “ నేససలే …అన్ని చెట్లూ బాగానే ఉన్నాయి. ఈ ఒక్క చెట్టూ ఇలా ఎందుకు ఊగుతుందా?” అని భయపడుతుంటే మీరంతా ఎందుకు నవ్వుతున్నారు?”  అని కోపంగా వాటిని ప్రశ్నించింది.

    అవన్నీ మరింత బిగ్గరగా నవ్వుతూ..” నీ ధైర్యాన్ని చూసి ..” అన్నాయి.

         “ నా ధైర్యమా? అదేంటి? “ అంది తనని తాను చూసుకుంటూ..

      “ ధైర్యం కాక మరేమిటి?  తన మీద ఏ పక్షి వాలినా ఆ చెట్టుకి ఇష్టం ఉండదు. అందుకే ఆ చెట్టు అలా ప్రవర్తిస్తుంది.  ఆ విషయం నీకు తెలియదా ? ” అన్నాయి ఆ పక్షులన్నీ ఏక కంఠంతో..

        “ అవునా? నాకు తెలియదు. అయినా ఎందుకు ఇష్టం ఉండదు? చెట్లన్నీ  మనం వాలితేనే చాలు అనుకుంటాయి. ఇదేమి చెట్టు? అన్ని రకాల పక్షులూ గూళ్ళు కట్టుకోవు. కొన్నే కట్టుకుంటాయి. గూళ్ళు కట్టుకోని పక్షులకు చెట్లే ఇళ్ళు. వాలవద్దు అనటానికి చెట్టు ఎవరు? “ అంటూ ఆ చెట్టు కొమ్మ మీద నుండి కదలకుండానే గట్టిగా బదులిచ్చింది  గోరింక. జాలిగా చూసాయి పక్షులన్నీ దానివంక.

    అయితే గోరింక మాటలకి చెట్టుకి చాల కోపం వచ్చింది. దాంతో రెచ్చిపోయి గోరింకని ఎలాగైనా వెళ్లగొట్తాలని మరింత గట్టిగా ఊగసాగింది. అది అలా ఊగటంతో ఒక కొమ్మ విరిగిపోయి కింద తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడి మీద పడింది.

   దాంతో అతనికి కోపం వచ్చి చెట్టు వైపు చూసి కన్నెర్ర చేస్తూ..

     ” ఎందుకలా కొమ్మలు విరిగిపోయేటట్టు ఊగిపోతున్నావు? నీకేమైంది?”  అని అడిగాడు. మునీశ్వరుడు అలా అడిగేసరికి గోరింకను ఎలాగైనా తన మీద నుండి వెళ్లగొట్తలేనా అన్న ఆలోచనలో ఉన్న చెట్టుకి  మంచి అవకాశం దొరికినట్టు అయ్యింది. దాంతో.. 

    “మునీశ్వరా! ఎంతో కాలం నుండీ మీరు ఈ చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నారు. మీ తపస్సు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమైతే నా పేరు నిలిచిపోతుంది. అందుకని మీ తపస్సుకి భంగం కలగకుండా నా మీద ఎవ్వరు వచ్చి వాలినా ఇలా ఊగిపోతూ వాటిని వెళ్ళగొట్టివేస్తున్నా మునీశ్వరా! పైగా అవి నా మీద వాలితే అవి వేసిన రెట్టలు మీ మీద  పడతాయేమోనని నా భయం. మిగతా పక్షులన్నీ కొద్దిసేపు ఊగగానే వెళ్ళిపోయేవి. కానీ ఈ గోరింక మాత్రం ఎంత గా కొమ్మల్ని ఊపినా వెళ్ళటం లేదు చూడండి మునీశ్వరా? మీ తపస్సుకి భంగం కలగనే కలిగింది. ఇదిగో..దీని వల్లే! ” అంది బాధగా ముఖం పెట్టి.

     ఆ మాటలకి మునీశ్వరుడు తెల్లబోయి చూశాడు చెట్టు వైపు. ఇంతలో..గోరింక

          ”మునీశ్వరా,,!  చెట్టు పిట్టలను  తనపై వాలనీయకపోతే ఎక్కడ నివశిస్తాయి? మీరే చెప్పండి? అన్ని పక్షులూ గూళ్ళు కట్టుకోవు. కొన్నే కట్టుకుంటాయి. అవైనా చెట్టు పైనే కదా కట్టుకోవాలి. ఈ చెట్టుని చూసి అన్ని చెట్లూ ఇలాగే మాకు  ఆశ్రయం ఇవ్వకపోతే మా జాతి అంతా ఏమై పోవాలి? మీరే చెప్పండి “ అంది.  

    ఈ సంభాషణ అంతా చుట్టుపక్కలా చెట్లపై కూర్చుని  వింటున్న మిగతా పక్షులు గబుక్కున ఆయా చెట్ల మీద నుండి ఎగిరి మునీశ్వరుడి దగ్గరకంటా వచ్చి,,……

    “ ఈ చెట్టు అబద్ధం చెపుతుంది మునీశ్వరా?  మీరు ఈ మధ్యే కదా స్వామీ తపస్సు మొదలు పెట్టింది. కానీ ఈ చెట్టు ఎప్పటి నుండో మమ్మల్ని దానిపై వాలనీయటం లేదు” అని మొరపెట్టుకున్నాయి.

    “ అవునా? “ అని చెట్టు వైపు తిరిగి..

   “ ఎందుకు అబద్ధం చెప్పావు?  నీకు ఎందుకు ఇష్టం లేదు అవి నీ పై వాలటం? ఇప్పుడైనా నిజం చెప్పు “ అని మునీశ్వరుడు కోపంగా చెట్టుని ప్రశ్నించాడు. అతని కోపాన్ని చూసి భయపడిపోయిన చెట్టు..                    

       “ రెట్టలు వేస్తాయని మునీశ్వరా! నా అందం చెడిపోతుందని, పైగా దుర్వాసన వస్తుందని “ అంది బెట్టు చేస్తూ . ఆ మాటలకి నవ్వుకున్నాడు మునీశ్వరుడు.

     “ పిచ్చిదానా? పక్షులు, చెట్లు పరస్పర ఆధారాలు. మీ చెట్లపై అవి నివశించి, మీరు కాసిన పండ్లు తిని  కృతజ్ఞతగా మీ విత్తనాలను ఎక్కడెక్కడో విసిరి మరిన్ని చెట్ల పుట్టుకకు కారణమవుతున్నాయి. ఇక్కడే ఇలాగే నిలబడి ఎవరినీ వాలనీయకుండా  నీ కుటుంబాన్ని విస్తరించుకోగలవా? గట్టిగా ఊగితే నీ విత్తనాలు ఇక్కడిక్కడే పడతాయి. అది సరిపోతుందా నీకు అమాయకురాలా? పక్షులకు ఇళ్ళు మీ చెట్టు కొమ్మలే? రెట్టలు వేస్తాయని వాసన వస్తుందని వాలవద్దంటే ఎలా?  అవి అలా వాలాలి. ఎక్కడెక్కడో తిన్న పండ్ల విత్తనాలు రెట్టల ద్వారా ఇక్కడ వదలాలి. అలాగే నీవు కాసిన కాయలు తిని ఎక్కడెక్కడో నీ వంశాన్ని వ్యాప్తి చేయాలి. అంతే కానీ శుభ్రత కోసమని వాటిని దరిచేరనీయవా? వర్షాలు వచ్చి  నిన్ను స్నానమాడించేది ఎందుకు? నిన్ను శుభ్రపరచటానికే? అర్ధం చేసుకో.

            కాయలు కాయని చెట్టుకే కాదు పిట్తలు వాలని చెట్టుకీ విలువ తక్కువ. అంతేకాదు..

              నిండా పక్షులతో కళకళలాడే  చెట్టునే అందరూ ఇష్టపడతారు.  “

             అనేసరికి బెట్టు విడిచిన చెట్టు నవ్వుతూ పక్షులవైపు చూసింది చెట్టు రమ్మని ఆహ్వానిస్తూ.. 

                   పక్షులన్నీ చెట్టు ఆహ్వానాన్ని మన్నిస్తూనే గోరింకను చుట్టుముట్టాయి అభినందిస్తూ.

                                          *****                                            

Please follow and like us:

One thought on “బెట్టు విడిచిన చెట్టు (బాల నెచ్చెలి-తాయిలం)”

Leave a Reply

Your email address will not be published.