రమణీయం
సఖులతో సరదాగా-3
-సి.రమణ
కొద్దిసేపటి తరువాత, బెరిజాం సరస్సునుండి వీడ్కోలు తీసుకొని, అడవినుండి బయలుదేరాము. దారిలో కనిపించిన Silent Valley దగ్గర ఆగాము. Car ను కొంచం దూరంలోనే ఆపి, మేము దిగి, నెమ్మదిగా నడుచుకుంటూ, Valley View దగ్గరకు వస్తుంటే, కింద ఎండుటాకుల చప్పుడు, పైన మా గుండె చప్పుడు తప్ప మరే ఇతర శబ్దం లేని, నిశ్శబ్దం లో, పద్మ అన్నది ” ఎండుటాకుల మీద కాలువేయకుండా నడవండి అని”. ఇక మా పని చూస్తే, కొత్తగా అడుగులేస్తున్న పాపలా నడుస్తుంటే, నవ్వు తన్నుకొస్తుంది. కాని, నిశ్శబ్దాన్ని గౌరవిస్తూ నెమ్మదిగా నడిచి, View Point కు చేరాము. పచ్చని, ఒత్తైన చెట్లతో నిండిన లోయ నుండి, చల్లని గాలి విసురుగా వచ్చి, మమ్మల్ని చుంబించింది. ఇక్కడి గాలి, కొత్తరాగాలను వినిపిస్తోంది మనస్సుకు . ఎంతబాగుందో, ఈ ప్రదేశం! నిశ్శబ్దం లోంచి జనించే శబ్దం, మనస్సును స్వాంతన పరుస్తూ , శరీరాన్ని, మనస్సును లయంచేస్తూ , విశ్వమంతా ఆవరిస్తూ , ఏది నేను, ఏది ప్రకృతి అన్న తేడా తెలియని ఏకత్వాన్ని ప్రసాదిస్తుంది. అలాగే హాయిగా వుండిపోవాలనిపిస్తుంది. దూరంగా మాటల చప్పుడయ్యింది. కొంతమంది యువతీ, యువకులు వస్తున్నారు మావైపే. నిశ్శబ్దం అన్నట్లుగా సైగ చేసి, వారు దగ్గరగా వచ్చాక, ఈ నిశ్శబ్దాన్ని బ్రతకనివ్వండి. మాటలలో చెప్పలేని భావాలను నిశ్శబ్దంగా వుండి, మనస్సుతో విని, ఆనందించండి, అన్నాను.
వెనుదిరిగి Car దగ్గరకు వస్తూ , Eucalyptus చెట్ల కింద రాలిన, తెల్లగా మెరుస్తున్న కాయలను చూసాము. మన వాక్కాలయంత పరిమాణం లో, కోలగా చివరలు కొంచం మొనదేలి, అందంగా కనిపించాయి. తరువాత దగ్గరలోనే వున్న Caps Fly Valley కి వెళ్ళాము. ఇక్కడ, లోయలోకి మనం విసిరేసిన వస్తువు, వెనక్కు వచ్చేస్తుంది వెంటనే. బహుశా, గాలి వత్తిడి వలన, అలా జరుగుతుండవచ్చు. చాల మంది టోపీలు, చేతి రుమాళ్ళు, కాగితాల వుండలు వంటివి విసురుతూ కనిపించారు. అవి వెంటనే వెనక్కు వస్తుంటే, సరదాగా అనిపించింది.
అక్కడనుండి Pillar Rocks చూడటానికి వెళ్ళాము. దూరంగా కనిపించే, Pillar Rocks చూడటానికి వీలుగా, పెద్ద పెద్ద మెట్లతో, చిన్న పూలతోట, ఏర్పాటు చెయ్యబడివుందక్కడ. Pillar Rocks అంటే, PIllars లాగా కనిపించే, 400 అడుగుల ఎత్తుతో, చెక్కినట్లున్న అద్భుతమైన Granite రాతి అమరిక. వర్షాకాలం చాల సార్లు, మబ్బుల మధ్యలో దాకుంటాయి ఈ Pillar Rocks. వేడి, వేడి పల్లీలు తింటూ, మనం కాస్త ఓపికగా వేచివుంటే, మేఘాలు తొలగి, మనకు Pillar Rocks దర్శనమిస్తాయి. విశ్రాంతిగా కూర్చోవటానికి, అక్కడి రాతి మెట్లు అనువుగా వున్నాయి. ఒకప్పుడు అక్కడికి trekking అనుమతి వుండేది. భద్రతా కారణంగా అది నిలిపివేసారు. ఆవలిపక్క కొద్దిమంది సాహసికులు trekking చేస్తారు. అటుపక్క దానిని Devil’s Kitchen అంటారు. అక్కడ గుణ అనే తమిళ సినిమా, చిత్రీకరణ తరువాత, దానిని Guna Caves అంటున్నారు. నేలంతా ఎగుడు, దిగుడు కొండ రాళ్ళతో, అక్కడక్కడా చీకటిగా, వర్షాకాలంలో ఐతే తేమగా వుండి, Trekking చెయ్యడం కష్టం. ఏ చోటికి వెళ్ళినా, రక, రకాల దుకాణాలు వుంటాయి, shopping చెయ్యటానికి. ఐతే అన్ని వస్తువులు, వెరే ప్రాంతాలనుంచి రావలసినదే. ఇక్కడ పరిశ్రమలు కాని, కుటీర పరిశ్రమలు కాని, దాదాపు లేనట్లే.
ఇక మిగిలింది Pine Forest. ఈ ఒక్కటి చూస్తే, ఈ దారిలో అన్నీ అయినట్లే. చాల సినిమాలలో పాటలు, కొట్లాటలు ఇక్కడే చిత్రీకరించారు. Bryant అనే ఆంగ్లేయుడు నాటించిన, Pine మొక్కలు పెరిగి, ఈనాడు ఆ ప్రాంతం ఒక అడవిలా మారింది. కారు దిగి, చుట్టూ చూస్తుంటే, ఆ చెట్లన్నీ చేతులు చాచి, మమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది, వారి లోగిలిలోనికి. ఈ ప్రదేశం, గుర్రపు స్వారి, Nature walk, Photo shoot కి చాల అనువుగా వుంది. అన్నిటికీ మించి. ఎంత నడిచినా అలసట లేకుండా, సంతోషకరమైన అనుభూతి, మిగిలింది.
అక్కడనుండి మా బసకు వచ్చేసరికి, పొద్దుకుంగుతుంది. మేమంతా fresh అయి, నింపాదిగా తేనీరు తాగుతూ, ఈ రోజు రాత్రి భోజనం చేయకుండా, మేము కొని వుంచిన పళ్ళు మాత్రమే తినాలి అని అనుకున్నాము. మాలో ఒకరికి Diabetes వుండటం వలన, Garlic Bread మరియు Soup కూడా తీసుకుందాము అని అనుకున్నాము. రేపు ఏమి చెయ్యాలో, ఎక్కడకు వెళ్ళాలో ఆలోచించుకుని, ఆరోజు చూసిన ప్రదేశాల గురించి కబుర్లు చెప్పుకుంటూ, తీసిన Photos చూసుకుంటూ,హయిగా నిద్రకుపక్రమించాము.
ఉదయం నిద్రలేవగానే, త్వర త్వరగా, వుదయపు కార్యక్రమాలు ముగించుకుని, Resorts బయటవున్న Taxi ని పిలిచి, మేము చూడాలనుకున్న ప్రదేశాలు చెప్పాము. Dolphins Nose గా ప్రసిద్ధి చెందిన, ఒక రాతి అమరిక కు దూరంగా Car ఆపి, కొంచం సేపు, Trekking చేసాము. ఆ రోజు, ఆకాశం మబ్బులు లేకుండా ప్రకాశవంతంగా వుంది. చెట్ల ఆకుల మధ్యనుండి, ఎండ నేలను తాకుతుంది. ఐతే,దారి అంతా పెద్ద వృక్షాలకు చెందిన పెద్ద పెద్ద వేర్లు , నేలపైన, వల లాంటి అల్లికతో పెనవేసుకుని, నడకకు ఇబ్బంది కలిగించాయి. ఎత్తుపల్లాలుగా వున్న రాళ్ళతో, వర్షం పది జారుడుగా వున్న దారిగుండా, నడక సాగటం కష్టమయింది. ఐతే, Dolphin’s Nose దగ్గరికి వెళ్ళాక, పడ్డ శ్రమంతా మర్చిపోతాము. బ్రహ్మాండమైన లోయ, నిండుగా చెట్లు, దూరంగా పళని కొండల వరుస, అక్కడక్కడా మబ్బుతునకలు, అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యింది.
సమయం మధ్యాహ్నం 12 కావొస్తుంది. అక్కడినుంచి, కురంజి ఆండవార్ కొయిలకు వెళ్ళాము. కొడైకెనాల్ లో 12 ఏళ్ళకొకసారి మాత్రమే పూచే పూలు, కురంజి పూలు. అవి నీలిరంగులో వుంటాయి. కొండలలో యువరాణిగా పేర్గాంచిన కొడైకెనాల్ కొండలు, కురంజి పూలు పూచినప్పుడు, నీలి రంగు మేలిముసుగు వేసుకున్నట్లు మెరిసిపోతూ అందంగా కనిపిస్తాయి. ఆండవారంటే సుబ్రమణ్యేశ్వర స్వామి. గుడి పూజారి, కిందటి ఏడాది, నీల కురంజి పూసినప్పుడు, తన Cellphone లో తీసిన Photos, videos మాకు చూపించారు. కొండ సానువులు మొత్తం, నీలిరంగు పూలతో, సూర్యకాంతి వెలుగులో, నీలిరంగు ముఖమల్ దుప్పటి పరిచినట్లు, ఎంతో అందంగా కనిపించాయి. భోజన సమయం కాబట్టి మమ్మల్ని భోజనం చెయ్యమని, ఆలయానికి చెందిన భోజనశాలకు, తీసుకువెళ్ళారు పూజారిగారు. రోజూ వంద మందికి, భోజన సౌకర్యం ఉందక్కడ. పరిశుభ్రమైన వాతావరణంలో, రుచికరమైన భోజనం శ్రద్ధగా వడ్డించారు. గుడి భోజనం బాగుంది. మనం మనకు తోచినంత దానం ఇవ్వవచ్చు. వెంటనే, పద్మ ఒక 100 మంది భోజనానికి డబ్బు కట్టింది. మేము కూడా మరో వంద మందికి డబ్బు కట్టి, రసీదులు తీసుకున్నాము. గుడి బయటకు వచ్చి సుదూరంగా కనిపిస్తున్న పళని సుబ్రమణ్యస్వామి కొండలను చూసాము.
Indian Institute of Astro Physics వారి Solar Observatory కి వెళ్ళాము, తరువాత. ఉదయం 10 గంటలనుండి, సాయంత్రం 4 గంటల వరకు చూడటానికి అనుమతి వుంటుంది, వేసవిలో. మిగతాకాలంలో శుక్రవారం మాత్రమే, ఉదయం 10 నుంచి 12 వరకు చూడవఛ్ఛును. ఊటీ నుండి కొడైకెనాల్ వరకు వ్యాపించి వున్న కొండలలో ఇది ఎత్తైన, దక్షిణ శిఖరం పై వున్నది. ప్రపంచంలోని పురాతన Solar Observatories ల లో ఇది ఒకటి. 1787లో East India Company ప్రారంభించిన ఈ Observatory మద్రాస్ లో వుండేది. 115 సంవత్సరాల తరువాత, 1903 లో, ఇది కొడైకెనాల్ కు మార్చబడినది. అప్పటినుండి సూర్యునికి సంబంధించి అనేక పరిశోధనలు, అన్వేషణలు జరిగాయి, జరుగుతున్నాయి. ప్రపంచం లో మరెక్కడా లేని ఎంతో సమాచారం ఇక్కడ భద్రపరిచారు. మంచి విషయాలు తెలుసుకుని ఆనందంగా వెనుతిరిగాము.
Room కు చేరుకుని Refresh అయి, తేనీరు తాగుతూ, పక్కనే వున్న Lawns లో కూర్చున్నాము, లోయలోకి మాయమవుతున్న సూర్యుడిని, చూస్తూ . మా Resorts లోనే మరో పక్క Grill & Kabab చేస్తున్న Gazebo దగ్గరకు వెళ్ళి, మాకు కావలసినవి ఎంచుకుని, ఒక గంటలో Room కు పంపమని చెప్పి వచ్చేశాము. నలుగురికి రెండు గదులు తీసుకున్నా, నిద్రపోని సమయమంతా ఒక్క గదిలోనే కలిసి వుంటాము. రాత్రి పొద్దు పోయే దాకా, కబాబులు తింటూ, కబుర్లు చెప్పుకుంటూ, పేకాట ఆడుతూ, స్వేచ్ఛగా, ఆనందంగా గడిపేశాము.
తెల్లవారి దగ్గరలోనే వున్న Bear Shola Falls కి Picnic కి వెళ్దామనుకున్నాము. మాకు కావలసిన ఆహారము, నీరు, ఇతర సామగ్రి అంతా కారులో సర్దుకుని వుదయం 11 గంటలకు బయలుదేరి వెళ్ళాము. ఇంకా అర్ధ కి.మీ దూరం వుందనగా, మేము కారు దిగి నడక ప్రారంభించాము. కారు ముందుకు వెళ్ళింది సామానుతో. అప్పుడప్పుడు వినిపించె పిట్టల కూతలు, మా Boots కింద గులకరాళ్ళ శబ్దం తప్ప మరేమి వినిపించటంలేదు. నీళ్ళ శబ్దం కూడా రావటం లేదు. ఇక్కడ జలపాతం ఉన్నదంటావా!, రహస్యంగా అడిగింది రాజ్యలక్ష్మి నా చెవిలో. ఇంకొంచం దూరం నడిచాక, అడవిపూల వాసనతో పాటు, జలపాతపు నీటి చప్పుడు వినవచ్చింది. జలపాతం దగ్గర పెద్దపెద్ద బండలు చదునుగా వుండటంతో మాతో తెచ్చుకున్న జంపకానా తీసి పరిచాము. రెండు చేతులు బార్లా చాపి, ఆహా ఎంత బాగుందో, ఎంతబాగుందో ఇక్కడ అంటూ, పద్మ, రాజ్యలక్ష్మి గంతులు వేస్తూ, ఆనందించారు. ప్రకృతిలో మమైకమైతే ఆనందమే మరి! తోటలో నా రాజు అంటూ, మణి కూనిరాగం తీస్తుంటే, కూనిరాగం కాదు, సుస్వరరాగమే పాడు అని కొన్ని సినిమా పాటలు, లలితగీతాలు పాడించుకున్నాము. అడపా, దడపా కొందరు వచ్చివెళ్ళారు కాని, మాలాగ వుండిపోలేదు. Driver కు భోజనం ఇచ్చి, మేము కూడా భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నాము. నీటి లో పాదాలు వుంచి, వుల్లాసంగా, దోసిళ్ళలో నీళ్ళు ఒడిసి పట్టుకుంటూ Photos తీసుకున్నాము. చాలా సమయం గడిచింది. సూర్యాస్తమయం కావస్తుంది. వర్షం పడవొచ్చు, ఇక బయలుదేరుదాము అని అనుకుంటూ వుండగా, అది నా కంటబడింది. ఒక్క సారిగా వెన్ను జలదరించింది. సన్నగా, పొడవుగా, వానపాము కన్నా చిన్నదిగా వుంది. గబుక్కున నేను లేచి, అందరిని నిదానంగా లేపి, చుట్టూ అంతా పరికించి చూస్తుంటే, ఏమిటి అంది పద్మ అనుమానంగా. “జలగ” అని నేను అనగానే కెవ్వు మని, బాబోయ్ అని కేకలు.
అంతా వెతికాము. మా శరీరం మీద కాని, దుస్తులమీదకాని, Boots అడుగున ఏమీ లేవు అని నిర్ధారణ చేసుకున్నాక, సామాను అంతా దులిపి, సర్దుకున్నాము, కారులోనికి. జలగ కుడితే నొప్పి తెలియదు. తన కడుపు నిండే దాకా, మన రక్తం పీలుస్తుంది. జలగను వదిలించుకోవాలంటే, దాని మీద ఉప్పు చల్లాలి; లేదా నిప్పు శెగ చూపించాలి. అంతే కాని, బలవంతంగా లాగరాదు. అలా లాగితే, జలగ వూడివచ్చినా, దాని నోటి తాలూకు సూదివంటి ములుకు మన శరీరంలో మిగిలి, దాని నుండి రక్తం స్రవిస్తూనే వుంటుంది. తరువాత ములుకు తీయటానికి చాల కష్టపడాలి. ఏమైతేనే నేమి, జలగ బారిన పడకుండా తప్పించుకుని, నిశ్చింతగా, ఊపిరి తీసుకున్నాము. కాని దానివలన కలిగిన చిన్న అలజడి, రాత్రి దాకా తగ్గలేదు; ఎక్కడైనా, జలగ వున్నదేమో అన్న సందేహంతో. Room కి రాగానే, Heater on చేసి, దుస్తులు, Boots, శాలువాలు ఆరపెట్టేశాము. లేకుంటే, దమ్ముకుని, వాసనొస్తాయి. రాత్రి భోజనం వేడి soup తో room కే తెప్పించుకున్నాము. T.V. on చేసి Channels మారుస్తుంటే, శ్రీదేవి కనపడింది. అబ్బ, ఎంతకలమయ్యిందో, శ్రీదేవిని చూసి అని అనుకుంటూ, ప్రసారమవుతున్న, “Moondram Pirai” అనే తమిళ చిత్రం చూసాము. చాల బాగా అర్థమయ్యింది. (తెలుగులో వసంతకోకిల గా అనువాదమై వచ్చిన చిత్రం చూశాం కాబట్టి.)
తరువాత రోజు, కొడైకెనాల్ లో పట్టణ మధ్యలో వున్న Coakers Walk అనే ప్రదేశానికి వెళ్ళాము. అది దాదాపు ఒక కి.మీ. వున్న నడక దారి; కేవలం నడవటానికి, నడుస్తూ లోయ అందాలను, దూరంగా కనిపించే కొండ శిఖరాలను చూడటానికే. చాలా సన్నగా, కొండ అంచున, చిన్న Railing తో వుండేది ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని, వెడల్పు చేసి Cement మార్గం వేయడం వలన ఇబ్బంది లేకుండా నలుగురు కలిసి నడవవచ్చు. అక్కడక్కడా పండ్లు , మొక్కజొన్నపొత్తులు అమ్ముతున్నారు. View Point వద్ద చిన్నపాటి Telescopes అమర్చివున్నాయి. లోయవంక చూస్తూ, నడుస్తూ, మొక్కజొన్నపొత్తులు తింటూ, అటునుంచి ఇటువచ్చి ఎదురుగా వున్న Bryant Park కు వెళ్ళాము
Bryant అనే ఆంగ్లేయుడి పేరు మీద ఏర్పడిన ఈ park వున్న ప్రాంతమంతా ఒకప్పుడు ఆంగ్లేయుల వేసవి విడిదిగాను, ఆరోగ్యకేంద్రం గాను వుండేది. ఇక్కడ Horticulture Exhibition, Flower Exhibition వంటివి జరుగుతాయి. ఇక్కడి Greenhouse లో పెంచుతున్న కొన్ని అరుదైన మొక్కలు మాకు బాగా నచ్చాయి. కాని లోపల Photography కి అనుమతి లేదు. Park మొత్తం, మంచి నిర్వహణ వలన, పరిశుభ్రంగా, పచ్చిక మైదానాలతో, పలురంగుల పూలతో, నిండుగా, అందంగా వుంది. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, అక్కడినుండి, పూల మొక్కలకు చెందిన గింజలు, దుంపలు, కొన్నిసార్లు మొక్కలు కూడ, తీసుకు వచ్చి పెంచుతుంటాను.
Park దగ్గరలో వున్న Restaurant కి వెళ్ళి భోజనం చేసి, మా అబ్బాయి చదువుకున్న Bharatiya Vidya Bhavan’s Gandhi Vidyashram కు వెళ్ళాము. Principal ను కలిసి పరిచయం చేసుకున్నాను. ఆయన కుశల ప్రశ్నలు వేసి, సాదరంగా భోజనానికి ఆహ్వానించారు. మేము చేసి వచ్చామని చెప్పి, School Campus చూస్తామని అడిగాను. ఆయన ఒక Teacher ను మాకు తోడుగా పంపారు. 32 ఎకరాల విస్తీర్ణం లో వున్న, ఒక Pears తోటలో నిర్మించబడిన School, Hostel భవనాలు, ఆట స్థలాలు, విద్యార్ధుల Arts & Crafts Hall, Library Hall, Laboratories, మరియు Auditorium చూసి పాత జ్ఞాపకాలలోకి వెళ్ళాను. ఆ కొండ కోనల్లో, విద్యార్ధులు సీతాకోక చిలుకలులాగా ఎగురుతూ, స్వేచ్ఛ గా ఆడుతూ, పాడుతూ, చెట్ల నీడల్లో, ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలు చర్చిస్తూ , నయనానందకరంగా కనిపించారు.
ఆ రాత్రి విశ్రమించాక, ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, అన్నీ మరిచి, మరోసారి చిన్ననాటి ఆనందాలు చవిచూసాము. ఐదు రోజులు, ఐదు క్షణాలుగా గడిపేసాము. కొత్త వుత్సాహం తో చైతన్యవంతంగా వున్నాము. కొడైకెనాల్ వదిలిరావడం, విచారంగా అనిపించింది. కాని, ఎక్కడ ఎంత సంతోషంగా వున్నా, మన గూటికి మనం చేరటం ఇంకా అనందంగా వుంటుంది. ఉదయం 7 గంటలకు సామానంతా సర్దుకున్నాము. భోజనశాలకు వెళ్ళి, పద్మ దగ్గరుండి, మా నలుగురికి, ఉదయపు ఉపాహారం, ఉపయోగించి, పారవేసే అట్టపెట్టెలలో సర్దించి, సిద్ధంగా వుంది. మేమంతా మంచి Filter Coffee తాగి బయటకు వచ్చేసరికి, ముందురోజు Book చేసిన సవారి.కాం వారి Innova మాకోసం ఎదురుచూస్తుంది. సామానంతా car లో పెట్టేసి, కొడైకెనాల్ కి ఆది, అంతము ఐన Silver Cascade జలపాతం వద్ద ఆగి, నీటిలో చేతులుంచి, మరోసారి రావాలని కోరుకుని, కొండ కోనలకు, మంచు మబ్బులకు, చెట్లకు, అడవికి, సరస్సుకు, వీడ్కోలు చెప్పి, కొయంబత్తూర్ వైపుకు సాగిపోయాము.
*****
సి.వి.రమణ: గృహిణి. హైదరాబాదు నివాసం. సంగీతం, పర్యావరణం, సాహిత్యం ఇష్టం. రక రకాల మొక్కలను పెంచటంలో ఆనందం. స్త్రీల సమస్యలపై ఆకాశవాణిలో పలు ఉపన్యాసాలిచ్చారు. కొన్ని కథలు, వ్యాసాలు వనితాజ్యోతి, విపుల వగైరా పత్రికలలో ప్రచురితమయ్యాయి.