నేనెరిగిన వాసా ప్రభావతి
-గణేశ్వరరావు
మా కుటుంబానికి ఎంతో ఆత్మీయురాలు, ప్రముఖ రచయిత్రి, సాహితీవేత్త వాసా ప్రభావతి 2019, డిసెంబర్ 18వ తేదీ ఉదయం హైదరాబాదులో మరణించారు. ఆమె మరణం దారుణంగా మమ్మల్ని బాధిస్తోంది.’80 వ దశకంలో ఢిల్లీ కందుకూరి మహాలక్ష్మి ఇంట్లో వారితో అయిన పరిచయం అయింది ఇటీవల దాకా కొనసాగుతూ వచ్చింది. మా ఢిల్లీ తెలుగు అకాడమీ వారిని ఉత్తమ సాహితీవేత్త అవార్డ్ నిచ్చి సత్కరించింది.
తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రి పురస్కారం, గృహలక్ష్మి స్వర్ణకంకణము,సుశీలా నారాయణరెడ్డి అవార్డు మొదలైన వాటి తో పాటు సాహితీ శిరోమణి, అక్షర కంఠీరవ బిరుదులన్ అందుకున్నారు. ప్రభావతి
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కాశీచయనుల సూర్యనారాయణ-లక్ష్మీ దేవమ్మ దంపతులకు 1940 లో జనిమించారు. ‘ 1958లో వీవీజే శాస్త్రితో వివాహం జరిగిన తర్వాత హైదరాబాద్ వచ్చాక ఉన్నత విద్యను అభ్యసించారు. భర్త ప్రోత్సాహంతో రచయిత్రిగా 70 వ దశకంలో తమ సాహితీ ప్రస్థానం ప్రారంభించారు, ఆమె బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె చేపట్టని ప్రక్రియ లేదు. కవితలు, వ్యాసాలూ విస్తృతంగా రాసారు, ఆమె మొదటి కవితా సంకలనం ‘ఆలాపన’. ఆమె కవితల్లో ప్రధాన పాత్ర ‘స్త్రీ’, ఆమె అమ్మగారికి జబ్బు చేసినప్పుడు అమ్మ మీద ‘అమ్మ’ కవితా సంకలనం ప్రచురించారు. 500 ప్రతులు ఉచితంగా పంచి పెట్టారు. బోయి భీమన్న ఆమెను ‘మహా కవయిత్రి’ గా పేర్కొన్నారు. ఉపాధ్యాయనిగా వృత్తి జీవితం మొదలెట్టారు. ‘ఆంద్ర సాహిత్యంలో హరిశ్చంద్రో పాఖ్యానం’ పై పి హెచ్ డి చేసారు. సరోజినీనాయుడు వనితా మాహావిద్యాలయం ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసారు.’8 2 లో కాలేజీ లో హక్కుల కోసం సమ్మె జరిగినప్పుడు అందులో పాల్గొన్నారు, ‘జగతి-ప్రగతి’ ఆనే వారి కావ్యం ఇలా మొదలవుతుంది: ‘రగిలింది ప్రజా శక్తి / మ్రోగింది విజయభేరీ / ఎగిరింది త్రివర్ణ పతాకం / అర్థ రాత్రి తూర్పు కొండపై / సూర్యోదయం’ఇది కాళోజీ అభినందనలు అందుకుంది. స్త్రీల సమస్యలను ప్రాతిపదికలుగా తీసుకొని ‘మంజీరనాదాలు’, మళ్ళీ మళ్ళీ పుడతా’ రాసారు. కవయిత్రిగా ‘మళ్ళీ మళ్ళీ పుడుతా’ ఆమె స్థానాన్ని పదిలం చేసింది. ’78 నుంచి కథలు రాస్తూ వచ్చారు, ఆమె మొట్టమొదటి కథ ‘బిచ్చగత్తె’. వందకి పైగా రాసిన ఆమె కథలు వివిధ పత్రికల్లో పడ్డాయి. తన కథల్లో ఆమె వాస్తవ సంఘటనలకు నేపథ్యం, వాటిలో ‘అంగడి వినోదం, మొగిలి, పాడగా విప్పిన నేల తల్లి, ‘పట్టుదల ఉంటే..’ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ’80 తర్వాత నవలలు రాయడం మొదలెట్టారు, వాటిలో చెప్పుకో దగ్గవి: ‘వెండి వెలుగులు’, సీతా లక్ష్మి’, ఆకాశ దీపం’. ఆ తర్వాత ఆమె నాటకం వైపు దృష్టి పెట్టారు. ఆకాశవాణి వాటిని ప్రసారం చేసింది. ఆమెకి ఎంతో పేరు తెచ్చిన నాతం ‘సంఘం చేసిన బిక్షుకి’. భారత స్వర్ణోత్సవాల సందర్భంగా స్వాతంత్రోద్యమం లో ముఖ్య భూమికను వహించిన దువ్వూరి సుబ్బమ్మ గారి ఉద్యమ చరిత్ర ఆధారంగా రచించిన ‘దేశాబాంధవి’ ని మహా కవి సి. నారాయణ రెడ్డి ‘ఉద్యమచరిత్ర మీద వీర రసభరితంగా ‘ వచ్చిన నాటకమని అభినందిచారు. ‘4 కథా సంపుటాలు, 13 కవితా సంకలనాలు వెలువరించారు. 5 నవలలు, 4 నాటకాలు, పాటలు కూడా రాసారు. ప్రముఖ రచయిత రావూరి వెంకట సత్యనారాయణ రావు తన జీవిత చరిత్రను ఆమె చేతే రాయించి ప్రచురించారు, వచన రచనలో ఆమెకోక స్థానం కల్పించింది ఇది. ‘భారత స్వాతంత్రోద్యమం లో తెలుగు మహిళల పాత్ర’ అన్న ఆమె పరిశోధక గ్రంథం కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందింది. అన్నిటికన్నా ఆమె గురించి అందరూ గొప్పగా చెప్పుకొనేది ఆమె ‘నాయకత్వ లక్షణం’.సఖ్యసాహితి, లేఖినీ మహిళాచైతన్య సాహితీ సంస్థల ద్వారా సేవలను అందించారు. సుప్రసిద్ధ రచయిత్రుల సాహిత్య, జీవిత స్వీయ పరిచయాలతో ‘నేనూ నా రచనలు’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. అంతేకాక కొందరి తెలుగు మహిళల కవితలను హిందీ లోకి, కథలను ఆంగ్లం లోకి అనువదింపజేసి ‘లేఖిని’ సంస్థ ద్వారా ప్రచురించారు. . ‘లేఖిని’ అనే మహిళా సంస్థకు ఆమె కర్త, కర్మ, క్రియ. ‘మాతృదేవో భవ’ అవార్డ్ కింద ఎందఱో రచయిత్రులకి వారి వారి మాతృమూర్తుల పేర్లన ప్రముఖులను సత్కరించుకునే సంప్రదాయాన్ని నెలకొల్పారు.ఆమె కథల్లో ‘గెద్ద’ విమర్శకుల గుర్తింపు పొందింది. బడుగు జీవి జీవనసమరం మూడు దశల్లో చూపిస్తుంది. మొదటి దశలో ఆమె సోదె చెబుతూ తన నైపుణ్యంతో ఆదరణ పొందుతుంది, కన్నెపిల్లలకు మంచి మొగుడు దొరుకుతాడని కోరికలు ఊరిస్తుంది, వచ్చే బియ్యం, కూరా నారా, చిల్లర నాణేలతో కుటుంబం పొట్టలు నింపుతుంది. రెండో దశలో పనిపాటా లేని కొడుకు, పనిమంతురాలైన కోడలుతో మంత్రసానిగా దినాల్ని అతి కష్టంతో వెళ్ళ దీస్తుంటుంది. మూడో దశలో వృద్ధాప్యంతో మంచానికి అతుక్కు పోతుంది, ఊరి పెద్ద కూతురు కాన్పు చేయమని కబురొస్తుంది, అసహాయ స్థితిలో తన దగ్గర కొంత నేర్చుకున్న కోడలు ని పంపి పురుడు పోయిస్తుంది, కోడలు తెచ్చిన ఇనాం చూసి ‘ఇలా కాన్పులకి పిలుస్తుంటే మన బతుకులు బాగుపడతాయి’ అని సంతృప్తి చెందుతుంది, గుండె పోటు వచ్చి ఆ సాయంత్రమే చనిపోతుంది, కథ ముగుస్తుంది.ఇలాటి కథలు రాయడానికి ప్రభావతి ఇక లేరు. సాహితీలోకం, ‘లేఖిని’ తమ పెద్ద దిక్కును కోల్పోయింది.
*****
గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.