వెనుతిరగని వెన్నెల(భాగం-7)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-7)

-డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

——-

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని  చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది.  ఇద్దరికీ పరిచయమవుతుంది. ఇరు వైపులా పెద్ద వాళ్లు ఒప్పుకుని పెళ్లి మాటల వరకు వస్తారు.

***

“అమ్మమ్మకి అతనెందుకో మొదట్నించీ బాగా నచ్చేసేడు, కానీ అమ్మకి అతనంటే ఇష్టం  ఉండదు.” అంది తన్మయి ఎటో చూస్తూ సాలోచనగా వనజతో.

“అదేం కాదులే, మీ అమ్మ నీ మంచి కోరే వ్యక్తి. పైగా నువ్వు ఒక్కగానొక్క కూతురివి, నీ బాగోగులు ఆవిడకంటే ఎవరికి ఎక్కువగా తెలుస్తాయి? అయినా ఒక సారి మాట్లాడి చూడు, శేఖర్ నీకు సరైన జోడీ కాడని ఆవిడ నమ్మకమేమో” అంది వనజ.

“అమ్మో, ఇంకేవైనా ఉందా… అమ్మతో శేఖర్ గురించి మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. అయినా నాకెందుకో ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆలోచించుకోవడం ఇష్టం ఉండదు.”

“అదే పని వాళ్లు చేస్తున్నారుగా, కట్నపు బేరసారాలతో” అంది వనజ నవ్వుతూ.

“నాకేమీ నవ్వు రావడం లేదు” అంది తన్మయి బుంగమూతి పెడుతూ.”నిన్న మా వాళ్లని మళ్లీ మాట్లాడడానికి కబురు చేసేరుగా, వెళ్లొచ్చేరు”.

“ఊ…ఏవైంది, ఏవైంది అమ్మ దొంగా ఇందాకట్నించీ చెప్పవేం, అంది”వనజ సంతోషంగా.

“కట్నం మరికాస్త పెంచేరు, ఆడపడుచు లాంఛనాలు ఇవ్వమని మా అమ్మ పట్టుబట్టిందట. కానీ చివరికి అదీ ఒప్పుకోక తప్పింది కాదు. ఇక మా వాళ్లు నాకు పెట్టే బంగారం తగ్గించుకోమందట శేఖర్ వాళ్ల అమ్మ. అంతా డబ్బు రూపేణా ఇచ్చెయ్యమని వాళ్లు, కాదు మా పిల్లకి భవిష్యత్తులో ఉపయోగపడాలని వీళ్లు…. అమ్మమ్మ చెప్తుంటే నాకు కళ్ల నీళ్లు ఆగలేదు” అని… కొంచెం ఆగి “మొత్తానికి పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకొచ్చేరు.” అంది.

“ఆ… ఇలాగా చెప్పేది పెళ్లి విషయం, మొన్నటిదాకా పెళ్లోయ్ అని గోల చేసి, ఇప్పుడిలా బుంగమూతి ఏవిటి” అని తలమీద మెల్లగా మొట్టికాయ వేసింది వనజ.

ఊ.. అని దీర్ఘంగా ఊపిరి పీల్చి, “పెళ్లి మాటలు మొదలెట్టిన దగ్గర్నించీ జరుగుతున్న ఆర్థిక లావాదేవీల మాటలు నాకెందుకో విసుగ్గా అనిపిస్తున్నాయి. ఇద్దరు మనుషులు కలిసి బతకడానికి ఇవన్నీ తప్పని సరి అంటావా?” అంది తన్మయి సంధ్య వెలుగుని తదేకంగా చూస్తూ.

“ఇలా చూడు, మనకి పూర్తిగా ప్రేమ వివాహాలు చేసుకునే ధైర్యాలు లేవు,  పెద్దవాళ్లు చేయాల్సి వచ్చినపుడు ఇవన్నీ మామూలుగా జరిగేవే. ఇంత వరకూ ఎన్ని పెళ్లిళ్లు చూడలేదు మనం. పెళ్లంటే బయటి నించి చూసే వాళ్లకి ఆర్భాటాలు మాత్రమే కనిపిస్తాయి. అందులో ఉన్న వాళ్లకి మాత్రమే ఈ కష్ట నష్టాలు అర్థమయ్యేది.” అని

“అదే పనిగా ఇదే విషయం ఆలోచించుకోకు, అన్నీ సక్రమంగా జరుగుతాయిలే, ఇంతకీ ముహూర్తం ఎప్పుడు?” అంది.  

“అదీ నాకు నచ్చనిదే, నీ పెళ్ళికి మర్నాడు ఉదయం.” అంది తన్మయి బెంగగా.

“ఊ.. నువ్వు నా పెళ్లికి రావు, నేను నీ పెళ్లికి రానన్న మాట.  పోనీలే. ఏం చేస్తాం. అంతా అయ్యాక మనందరం కలుసుకుందాం. నేను రాయచూర్ వెళ్లేక నన్ను మర్చిపోవుగా ” అని

“ఇప్పుడైనా కాస్త నవ్వవోయ్. ఆర్థిక విషయాలు పెద్దవాళ్లకి వదిలెయ్. తేలికగా తీసుకో. లేకపోతే నీకు స్థిమితం ఉండదు, నీ చుట్టుపక్కల వాళ్లకి స్థిమితం ఉండదు.” అంది వనజ.

***

“మేమిద్దరం  రెండు మొక్కలం

ఒక వృక్షంగా మారాలనుకుంటున్నాం

ఎన్నో శాఖలతో

ఎన్నో ఆశీస్సులతో”

ఉదయం నించీ ఆలోచించి రాసుకొచ్చిన లైన్లని మళ్లీ మళ్లీ చదువుకుంది తన్మయి.

“ఆ టైముకి బానే వచ్చేవు. నాన్న గారు పెళ్లికి ఇన్విటేషన్సు వేయించేరు. చూడు” అంది జ్యోతి.

“ఇన్విటేషన్సు అప్పుడే ప్రింటింగు కూడా అయిపోయాయా, అందుకోసమే తను ఉదయం నించీ పదాలు పేరుస్తూంది.”

పుస్తకాన్ని వెనక్కు దాచి ముభావంగా అందుకుంది ఇన్విటేషన్ ని.

 “చి||ల||సౌ|| తన్మయి”…. “చి|| శేఖర్” ….

అతి మామూలు పెళ్లి పత్రిక అది. తన చిన్నప్పటి నుంచీ ఎవరి పెళ్లికైనా అవే అక్షరాలు. పేర్లు మాత్రమే మారతాయి అంతే.

కార్డు కలరు తో సహా ఎక్కడా కొత్తదనం లేదు.

తనేదో గొంతు విప్పి అనేలోగా “ఊ…పెళ్లి పత్రికలకీ రేటు బాగా పెంచేసేరన్నమాట. ఏం చేస్తాం, మనింట్లో పెళ్లి వచ్చే సమయానికే అన్నీ ఖరీదులయ్యి కూచున్నాయి. అవతల కట్నాలూ పెంచేసేరు.” అని రాగం తీసింది జ్యోతి.

తల్లి మాటిమాటికీ విసుక్కుంటూ పెళ్లి పనులు చేయడం చూస్తే తన్మయికి బాధ తన్నుకు వస్తూంది.

“తన వల్లే వీళ్లకి ఇలా మనస్తాపం కలుగుతూంది. అదేదో వీళ్లకి వీళ్లు సంబంధం చూసి పెళ్లి  చేసి ఉంటే ఇవన్నీ జరిగేవి కావేమో” అని అపరాధ భావన మొదలైంది.

నోట్ బుక్ తో డాబా మీదికి నడిచింది తన్మయి.

“ఈ సంవత్సరం సంక్రాంతి పండగ ఇలా వెళ్లగానే అలా ఎండలు బాగా మొదలయ్యి పోయేయి. ఇంక మే నెల వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో”

ఎదురింటి వాకిటి ముందు ముగ్గు పెడ్తూ ఇంటావిడ దారిన పోయే వాళ్లతో మాట్లాడుతూంది.

తనకి ఇష్టమైన సన్నజాజి పందిరి గూడు వైపు నడిచి చతికిలబడింది తన్మయి.

“శేఖర్ తో ఆ నాలుగు లైన్లు మాట్లాడితే బావుణ్ణు. వాళ్ల వైపు నించి పెళ్లి పత్రికలోనైనా  వేస్తే” అనుకుని మళ్లీ తన ఆలోచనకి తనే నవ్వుకుంది.

 “వైజాగులో ఉన్న శేఖర్ కి ఉత్తరం చేరేదెప్పుడు? పెళ్లి పత్రిక గురించి అతను వాళ్ల వాళ్లతో మాటాడేదెప్పుడు? ఇవన్నీ జరిగే పనులు కావులే.” అని సరిపెట్టుకుంది.

సాయంత్రపు వెలుగులో చిన్ని నక్షత్రాల్లాంటి పూల పందిరి మధ్య కూచుని రాసుకోవడమంటే తన్మయికి ప్రాణం.

చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరిచి “ప్రియమైన అజ్ఞాత మిత్రునికి-” అని రాసింది.

“ఆ ఊహే ఎంతో బావుందసలు! ఎవ్వరితో ఏవీ చెప్పలేని విషయాలు ఇలా అజ్ఞాత మిత్రునికి చెప్పుకోవచ్చు కదూ.”

“మిత్రమా! నువ్వెలా ఉంటావో, ఎక్కడ ఉంటావో తెలీదు. అసలు నువ్వు నా రాతలన్నీ చదవవనీ నాకు తెలుసు. అయినా ఇవన్నీ నీకు చెప్పాలనే ఉంది. నేనిక్కడ ఒక చిన్న ప్రాణిని. సన్నజాజి పొదలో ఉద్భవించిన జాజి పూవుని….. రాస్తూ ఉంటే తన్మయికి తెలీని తన్మయం కలగడం మొదలు పెట్టింది.

చకచకా నాలుగు పేజీలు రాసింది. ప్రతీ అక్షరంలోనూ  అజ్ఞాత మిత్రుడు తనతో సంభాషిస్తూన్నట్లే తన వ్యథంతా చెప్పుకుంది. చివరికి పెళ్లి పత్రికలో ఉండాలని ఊహించుకున్న లైన్లు రాసి, సెలవు మిత్రమా! ఇవేళ్టికి చాలు” అని రాసింది.

ఆ మరసటి వారం నించి డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు  ప్రారంభమయ్యాయి.

జాగ్రత్త, పెళ్లి ఆలోచనల్లో పడి పరీక్షలు వెళ్లగొట్టకుఅని

 నీలో ఒక గొప్ప క్వాలిటీ ఉంది, తెలుసా! ఎన్ని ఆలోచనల్లో ఉన్నా చదువు దగ్గిర వేరే తలతో ఆలోచిస్తున్నట్లు తేలికగా రాసేసి మార్కులు కొట్టేస్తావ్అంది వనజ నవ్వుతూ.

నాకు పుస్తకాలు, చదువు ఇచ్చే ఊరట ఇంకేవీ కల్పించలేకపోవడం కారణమేమో“. అంది చిరునవ్వుతో తన్మయి.

పుస్తకాల ముందు కూచుంటే తనకు నిజంగానే మరో విషయం జ్ఞాపకం రాదు. ఒక విధంగా తనకది వరం.

***

పెళ్లి బట్టలకి వెళ్ళే రోజు వచ్చింది. పెళ్లి కొడుకు బట్టలకి రెట్టింపు డబ్బులతో పెళ్లికూతురి బట్టలు కొనుక్కోవాలి.

వాళ్ళకి వీళ్లు, వీళ్లకి వాళ్లు బట్టలైనా కొనివ్వాలి, లేదా డబ్బులైనా ఇవ్వాలి.

అంతా కలిసి షాపింగుకి వెళ్లాలని అనుకున్నారు ముందు.

కానీ వెళ్ళే ముందురోజు “మా బట్టలు మేం తర్వాత కొనుక్కుంటాం. మీరు ఇంతే బడ్జెట్ లో కొనుక్కోండి.” అని కబురు చేసారు.

జ్యోతి బట్టలు కొంటున్నంత సేపూ చికాకు పడుతూనే ఉంది.

“వీళ్ల బడ్జెట్టు లో మంచి చీరలే రావడం లేదు.” అంటూ.

తన్మయికి బంగారం రంగు పట్టు చీరంటే చాలా ఇష్టం.

“అంటే, చీరంతా జరీ ఉండాలంటారు”  అన్నాడు సేల్స్ మేన్.

“ఊ… చీరంతా జరీతో కొంటే మేమెక్కడ ఇవ్వగలం అందులో సగం అబ్బాయికి” నిష్టూరంగా అంటున్న తల్లి వైపు, ముసి ముసి నవ్వులు నవ్వుతున్న సేల్స్ మేన్ వైపు నిశ్శబ్దంగా చూసింది తన్మయి.

బడ్జెట్ చీరల్లో చీర మొత్తం జరీ కాదు కదా,  కనీసం అరచేయి అంచున్న జరీ చీర కూడా రాలేదు.

ఇక చీర సెలక్షను జ్యోతికే అప్పగించి, ప్రేక్షకురాలిగా కూచుంది తన్మయి.

జ్యోతికి ముదురు రంగులంటే ఇష్టం. ఎప్పటిలానే ముదురు ఆకుపచ్చ రంగు చీరొకటి, ముదురు ఎరుపు రంగు చీరొకటి కొంది.

తన్మయికి లేత రంగులంటే ఇష్టం. గంధం రంగు చీర తియ్యమని అడగాలని నోటి చివరి వరకూ వచ్చినా అప్పటికే బాధపడ్తూన్న తల్లి మనస్సు ఇంకా బాధ పెట్టడం  ఇష్టం లేక ఊరుకుంది.

***

పెళ్ళి దగ్గర పడ్తూంది.  

తన్మయికి పెళ్లై మరో ఇంటికి వెళ్లాలన్న దిగులు ఒక వైపు, శేఖర్ తో కొత్త జీవితం తాలూకు పులకరింత మరో వైపు కలుగుతున్నాయి.

ఎవరేం మాట్లాడినా తలూపుతుంది. కానీ తలలోకి ఏవీ ఎక్కినట్లు ఉండదు. మళ్లీ అడిగితే

“ఆ? ఏవిటి?” అంటుంది.

భోజనం దగ్గర కూచుని అన్యాపదేశంగా నవ్వుకుంటుంది. అటూ ఇటూ కలిపి సరిగా తినకుండా వదిలేస్తుంది.

పెళ్లికి పదకొండు రోజుల ముందు పెళ్లి పనుల రాట వేసినప్పటి నుంచీ ఇంకాస్త మనసు గాల్లో విహరించసాగింది తన్మయికి.

అదే సమయంలో వనజకీ పెళ్లి పనులు ప్రారంభించడంతో ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం రావడం లేదు.

అజ్ఞాత మిత్రునికి రాసిన ఉత్తరాల పుస్తకం నిండిపోవస్తూంది.

అజ్ఞాత మిత్రుణ్ణి తలచుకోగానే తన్మయికి పెదాల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది.

పుస్తకాన్ని తెరిచింది. నల్లని ఇంకు పెన్నుతో బాపూ గారి అక్షరాల్ని అనుకరిస్తూ తను నేర్చుకున్న రాతను మురిసిపోతూ చూస్తూ కూచుంది. ఇంకు పెన్ను కావడంతో పేజీకి ఒక్క వైపే రాసింది. బాల్ పాయింటు పెన్నులు అస్సలు నచ్చవు తన్మయికెందుకో.

“ఈ రాతలకు అనుగుణంగా కవితలో, బొమ్మలో ఇటు వైపు అతికిస్తేనో…. “

ఎదురుగా కనిపించిన ఆంధ్రజ్యోతి వీక్లీ చేతిలోకి తీసుకుని పేజీ తిప్పింది. రెండో పేజీలో కనబడ్డ ఈ వారం కవిత, కవితతో బాటూ ఉన్న బొమ్మ విపరీతంగా ఆకర్షించాయి.

బొమ్మతో బాటూ కవితని జాగ్రత్తగా కత్తిరించి మొదటి పేజీలో అతికించింది.

పుస్తకం లో అక్కడక్కడా ఒక్కో పేరా చదువుతూ, జ్ఞాపకాలు తలచుకోవడం ఎంతో హాయిగా, ఊరటగా ఉంది తన్మయికి.

“మిత్రమా! నీతో మాట్లాడకపోతే క్షణం మనసు ఊరట పడదు. ఆకాశం లో మాయమయ్యే సంధ్య వెలుగులో నా చెవిలో నువ్వు చెప్పే మాటలు వింటూ ఇలా రాయడం ఎంత బావుందో తెలుసా!!”

“నేస్తం! నా మాటలు నీకు విసుగనిపించడం లేదు కదూ!! ఎంతకీ పొద్దుపోని రోజులెన్ని గడపాలో….సముద్రమూ, ఆకాశమూ కలిసే చోట మళ్లీ నీతో మాట్లాడుతానూ!”

“నా చుట్టూ  గాలి స్తంభించినట్లు ఉక్కగా ఉంది. అయినా నీతో మాట్లాడుతూంటే గట్టు దిగువన పారే సెలయేటిలో కాళ్లు ముంచినంత హాయిగా ఉంది సుమా!.. నా మనసులో అల్లకల్లోలాలు నీకెందుకులే. మంచి కబుర్లు చెప్పు వింటాను.”

***

పెళ్ళికి మూడు రోజుల ముందు పెళ్ళికూతుర్నిచేసేరు. పసుపు రాసి, తలారా స్నానం చేయించి, కొత్త చీర కట్టించేరు వరసకి అత్తలైన వాళ్లు.

కళ్లకి కాటుక పెట్టి, తిలకం సీసాతో కళ్యాణ తిలకం చేతికి వచ్చినట్లు పెట్టేరు. బుగ్గన కాటుక తో బుగ్గ చుక్క పెట్టేరు. అద్దంలో తనను తాను చూసుకుంది తన్మయి. ఆ అలంకారంలో పొందికతనం లేదు. అయినా ఎంత బావుంది తన ముఖం!

పొడవు జుట్టుకి జడగంటలు వేసి, ఆపైన పూల జడ కుట్టేరు అమ్మలక్కలు.

నరసమ్మ ఆనందంగా దగ్గరికి వచ్చి మనవరాలికి మెటికలు విరిచింది.

జ్యోతి వంట హడావిడిలో ఉండి “అంతా తయారు చేసేక పిలవండి” అని వంట పైపు వెళ్లిపోయింది.

పెద్దత్తయ్య తను తెచ్చిన చీరతోనే పెళ్ళికూతుర్ని చేయించింది. ముదురు నారింజ రంగు చీరమీద

చెమ్కీల మెరుపుల ప్రింటు. “ఈ చీర బంగారు రంగైతే ఎంత బావుణ్ణు!!! ఇవేళ్టి ఈ తయారీకి సరిగ్గా అతికినట్లు ఉండేది.” అనుకుంది మనస్సులో తన్మయి.

తన్మయికి అప్పటివరకూ చీరలు కట్టుకునే అలవాటు లేక కొంత, ఫాన్సీ చీర కావడం వల్ల కొంతా, చీర కట్టుకున్న దగ్గర్నించీ సర్దుకోవడమే సరిపోయింది.

బంధువులు ఒకటో రెండో తెచ్చిన కొత్త చీరలన్నీ ముదురు రంగులే.

తన్మయి అసంతృప్తిగా చూసింది వాటి వైపు.

దగ్గర బంధువులు, చుట్టుపక్కల వాళ్లు వచ్చి అక్షింతలు వేసెళ్లారు. దూరపు బంధువులు ఒకరూ, ఒకరూ రావడం మొదలెట్టారు.

 సాయంత్రానికి ఇల్లంతా సందడిగా తయారైంది. చీటికీ మాటికీ ఏడుపు లంకించుకునే పసిపిల్లలు, వంటల దగ్గిర అలిసిపోతూ ఆడవాళ్లు, పేకాటల్లో మునిగి తేలుతూ మగవాళ్లు.

ఇందులో ఎందులో చేరని వాళ్లు అయిన దానికీ కాని దానికీ హడావిడిగా తిరుగుతూనూ.

ఊర్లో ఉన్న ఒక్కగానొక్క ఫోటో గ్రాఫరు స్థిమితంగా పదకొండు గంటలకు వచ్చేడు. అక్షింతలు వేస్తూన్న వాళ్లని పక్కకి నిలబడమని రెండు ఫోటోలు తీసేడు. అప్పటికే వచ్చిన వాళ్లు పెట్టిన కుంకం బొట్ల వల్ల తన్మయికి  పెద్ద బొట్టు తయారైంది. ఎండ తీవ్రతకి అది కారి ముక్కంతా ఎర్రగానూ తయారైంది.

“ఎలా వచ్చిందో ఏవిటో ఫోటోలో. వనజ పక్కన ఉంటే ఇవన్నీ తుడిచి చక్కగా సర్దేది.”

తన పక్కన “తోడు” కూచోబెట్టిన ఎనిమిదేళ్ళ  తోడపెళ్లికూతురి వైపు చూసింది.

తనకంటే బాగా ఆనందంగా అక్షింతలు వేయించుకుంటూంది.

కాస్సేపాగి, “నువ్వొకసారి వనజ ఇంటికి వెళ్లి చూసొస్తావా!” అంది తన్మయి.

బదులుగా “వనజక్క ని ఇవేళే పెళ్లికూతుర్ని చేసేరు, తెలుసా!” అంది ఆ పిల్ల.

తెలుసన్నట్టు తలూపింది. “అందుకే నిన్ను వెళ్లమంటున్నాను. నన్నెలాగూ వెళ్లనివ్వరు.” అని నవ్వింది తన్మయి.

 ఆ పక్కనే ఎవరెవరు ఏం బహుమానంగా  ఇస్తున్నారో రాస్తున్న పిన్ని వరసావిడ లేవబోతున్న తోడపెళ్ళికూతుర్ని రెక్క పుచ్చుకుని కూచోబెట్టింది మళ్లీ.

“అక్కడ శేఖర్ ని కూడా పెళ్లి కొడుకుని చేసి ఉంటారు. ఒక్కసారి చూస్తే బావుణ్ణు” అనుకుంది తన్మయి.  

సాధారణంగా పెళ్లి కొడుక్కి తెల్ల బట్టలు తొడిగిస్తారు. తనకి పుల్ వైటు ఇష్టం ఉండదని అనేవాడు శేఖర్. మరి ఇప్పుడు ఎలా ఒప్పుకున్నాడో చూడాలి.

శేఖర్ తెల్లబట్టల్లో ఎలా ఉండి ఉంటాడో ఊహించుకోవడానికే ఎంతో బావుంది.

కాగితం తీసుకుని ఒక పక్కగా కూచుని రాసుకుందామంటే లేదు. రోజంతా కుర్చీలో కూచోవడమే పనైంది. పొరబాటున లేస్తే, నిమిషానికోసారి “తన్మయీ” అంటూ ఎవరో ఒకరు పిలవడం, మళ్లీ కుర్చీలో కూర్చోవడం అక్షింతలు వేయించుకోవడం పనిగా మారింది. ఉదయానే తడి తలతో బిగించి జడ వేసినందుకు, పైగా అస్సలు అలవాటు లేని చీర భారం, పూల జడ భారంతో సాయంత్రానికి తన్మయికి తలపోటు పట్టుకుంది.

ఇంటి నిండా చుట్టాలే. పడుకోవడానికి చోట్లు లేక అన్ని గదుల్లోనూ ఒకళ్ళ పక్కన ఒకళ్ళు వరసగా పడకలేసేరు.

తన్మయి అత్తయ్యలతో బాటూ డాబా మీద పడుకుంది. ఆకాశంలోకి చూస్తూ తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూండగా తెలీని తమకం చుట్టుకుంది తన్మయికి. కళ్లు మూసుకుంటే తన్మయికి సముద్రం ఒడ్డున నింగి, నేలా సాక్షిగా మెత్తని ఇసుకలో శేఖర్తో తన పెళ్లి మండపం కనిపించింది. కానీ ఎందుకో ఉదయం నించీ  తన గుండె చప్పుడు తనకి గట్టిగా వినిపిస్తూ ఒక రకమైన టెన్షన్ గా ఉంది.

తనకి చిన్నప్పటి నించీ  బాజాలూ, పెద్ద శబ్దాలూ విన్నప్పుడు అలాగే ఉండేది. ఉదయం నించీ చుట్టూ అంతా హడావిడిగా తిరుతుగూన్నందువల్లనేమో అనుకుంది.    

ఆ మర్నాడూ అదే స్థితి కొనసాగింది.

“ఈ రోజే వనజ పెళ్లి. కనీసం పెళ్లి ఊర్లోనే అయితే అమ్మ వాళ్లయినా వెళ్లేవారు.  యాభై కిలోమీటర్లకవతల గుళ్లో పెళ్లి. ప్చ్..ఎలా జరుగుతూందో, ఏమో” అని నిట్టూర్చింది తన్మయి.

శేఖర్ తరఫున రావలిసిన పెళ్ళి వాళ్లు కొందరు ఆ రోజు సాయంత్రం వచ్చేరు. దగ్గర వాళ్లెవరూ రాలేదు. మర్నాడు ఉదయం పెళ్లి.

“అబ్బాయి వాళ్లు మర్నాడు ఉదయమే ఏకంగా పెళ్లి సమయానికి వస్తారని” కబురు తెచ్చేరు.

జ్యోతి గాభరాగా మాట్లాడుతూంది. “ఇదేవిటీ, అన్నిటికీ ఒప్పుకున్నాం కదా, విడిదిళ్లు, భోజనాలు సిద్ధం చేసేక, ఇప్పుడు రేపే వస్తావని కబురు చేస్తే ఎలా?”

ఏదైతే వినకూడదని తన్మయి ఇన్నాళ్లూ భయపడిందో అదే జరుగుతూంది. శేఖర్ ఆ రోజు రాలేదు.

రాత్రి భోజనాలయ్యినా ఎక్కడా ఎవరూ పడుకునే ఛాయలు కనిపించడం లేదు. చిన్న పిల్లలు ఎక్కడికక్కడ నిద్రపోతూ ఉన్నా, ఎవరో ఒకచంటి పిల్ల లేచి ఏడుస్తూనే ఉంది.

కింద పెళ్లి కోసం స్వీట్ల తయారీ వంట నడుస్తూంది.

తన్మయికి కళ్లు గట్టిగా మూసుకున్నా నిద్రరాని ఒక విచిత్రమైన, తెలీని ఉద్వేగ స్థితి మొదలైంది.

“ఏదీ ఊహించుకోవద్దు, భయపడొద్దు, అన్నీ సక్రమంగా జరుగుతాయి..అన్నీ..అన్నీ సక్రమంగా జరుగుతాయి…”అని తనకు తాను సర్ది చెప్పుకోవడం మొదలు పెట్టింది.

 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.