ఇట్లు మీ వసుధారాణి.
అన్నింటిలోనూ పెద్ద -2
-వసుధారాణి
నాకప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయేమో మా పెద్దక్కయ్యా వాళ్ళింటికి నిర్మల్ వెళ్ళాను.చిన్నపిల్లవి కాదంటూ బోలెడు విషయాలు చెప్పింది.ఉదయాన్నే ఇంట్లో హాల్లోని సోఫాలు,నిర్మల్ బొమ్మలు,నిర్మల్ పెయింటింగ్స్ తుడవటంతో నా దినచర్య మొదలు. తర్వాత టీ (అపుడు మాకు ఇంట్లో కాఫీ అలవాటు ఉండేది.కానీ నిర్మల్ లో పాలు పల్చగా వుంటాయని అక్కయ్య టీ కాచేది),తర్వాత ఉదయం పూట ఉపాహారం నువ్వే తయారు చేయి అని ఏమి చెయ్యాలో కూడా చెప్పకుండా వంటింట్లోకి పంపేది. ఎలాగో టిఫిన్లు చేయటం సొంతగా నేర్చుకున్నాక, మధ్యాహ్నం వంట చేయటం నేర్పించింది.ఆ టైములో మొట్టికాయలు బాగానే పడ్డాయి నాకు . మనకి కొంచెం కోతి బుద్ధికదా కాస్త అటూఇటూ వెళ్ళేది .చిక్కుడు కాయలు ఎలా ఒలవాలి, బీన్స్ ఈజీగా ఎలా తరుక్కోవాలి టిప్స్ దగ్గరనుంచీ అన్నీ నేర్పింది.
ఇక ట్రైనింగ్ చాలు అనుకుందేమో ఓ రోజు హఠాత్తుగా మా బావగారిని ఏమండీ భద్రాచలం వెళ్లి కళ్యాణం చేయిద్దామండి రాణీ కూడా ఉంది కదా దాన్ని కూడా తీసుకెళదాం అంది.మా అక్కయ్య ఏది అడిగినా కాదనని మా బావగారు సరే అన్నారు.నిజానికి అప్పటికే మా అక్కయ్య ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూ ఉంది.ఎడమ భుజం పైకి లేవటం మానేసింది ముంజేతి నుంచి మాత్రం చెయ్యి ఎత్త గలిగేది.షుగర్ ఇన్సులిన్ తీసుకున్నా కంట్రోల్ అయ్యేది కాదు.అప్పుడు చిన్న పిల్లని అవ్వటం వల్ల నాకు తెలియలేదు కానీ ఇప్పుడు అర్ధం అవుతుంది.
మా అక్కయ్య చాలా సున్నితమనస్కురాలు అందుచేత మనుషుల్ని,వాళ్ళ బాధల్ని,ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తనలని ఎక్కువగా మనసుకు తీసుకుని బాధపడేది.షుగరు,దిగులు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి, అందుకు తనకు షుగర్ కంట్రోల్ లో ఉండేది కాదు.అది ఆమె శరీరం మీద త్వరత్వరగా తన ప్రభావం చూపించటం మొదలు పెట్టింది.అలా డయాబెటిక్ న్యూరోపతితో చెయ్యి అలా అయ్యింది.అయినా సులువుగా, తెలివిగా పనులు చేసుకునేది.
ముగ్గురు మగపిల్లలు పెద్ద వాడయిన మా రాజు బాబు ఆ సమయంలో వాళ్ళ అమ్మకు చేసిన సేవ,సాయం ఏవయసు వచ్చిన ఆడపిల్ల తల్లికి చేసే సాయం ముందు తీసిపోనిది.మా పెద్దక్కయ్యది ,పెద్దకొడుకు రాజుబాబుది పుట్టినరోజు ఒకే రోజు కావటం అప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు బాధగా ఉంటుంది.
సరే కథలోకి వస్తే అలా హఠాత్తుగా భద్రాచలం బయలుదేర తీసింది.నిర్మల్ నుంచి హైద్రాబాద్ వచ్చాం.మా అక్కయ్యావాళ్ళకి హిమాయత్ నగర్ లో ఓ ఇల్లు ఉండేది.వాళ్ళ మామగారు కొని దాన్నిగెస్ట్ హవుస్ లా ఉంచారు.వాళ్ళ కుటుంబంలో ఎవరు హైదరాబాద్ వెళ్లినా ఆయింట్లో వుండే వారు రెండు బెడ్ రూంలు,కిచెను,ఫర్నిచర్ తో ,వంట సామాన్లతో ,వంట సరుకులతో కూడా ఉండేది ఆ ఇల్లు.నిర్మల్ నుండి ఆటవిడుపు అంటే హైదరాబాద్ ఆ ఇంట్లో ఉండటం సినిమాలకి,షికార్లకి తిరగటం ఒక్కోసారి మా బావగారి తమ్ముళ్ళ కుటుంబాలు కూడా కలుస్తుండేవి. పిల్లలందరం ఆటలు,తెగ గోల చేసేవాళ్ళం.
ఆ రోజు పున్నమి , జూన్ నెల మధ్యాహ్నం హైదరాబాద్ లో బయలుదేరి సూర్యాపేట మీదగా ఖమ్మం ,హైవే మీద ఉన్న సూర్యాపేట వరకూ నాకు తెలుసు .ఆ తర్వాత ఖమ్మం వచ్చే ముందనుకుంటాను శ్రీరామదాసు జన్మించిన నేలకొండపల్లి వచ్చింది.అక్కయ్య ముందు నుంచే నాకు చెప్పింది ఆ ఊర్లో ఆయన ఆనవాళ్లు ఏమీ లేవు కానీ ఆ ఊరు రాగానే ఓ పులకింత, మా నాన్న పేరు కూడా రామదాసేమో బాగా కనెక్ట్ అయ్యాను.
అది విరాటపర్వం జరిగిన స్థలం అని కీచకుని దిబ్బని చూపించింది .అంతేకాక అక్కడ ఉన్న బౌద్ధ స్తూపం కూడా చూపించి దాని గురించి తనకు తెలిసిన చరిత్ర అంతా చెప్పింది మా అక్కయ్య. తన దగ్గరి నుంచే నేను చారిత్రక ప్రదేశాలని ఎలా చూడాలి ,వాటి వెనుక గల చరిత్రను ఎలా తెలుసుకోవాలి అన్న విషయం నేర్చుకున్నాను.
కొత్తగూడెం దాటిన దగ్గరి నుంచి నిండు వెన్నెల అడవి బాట అక్కడక్కడా వెన్నెల్లో తళుక్కున మెరుస్తూ మురుస్తూ పారుతున్న కిన్నెరసాని ఆ వంక,వాగు,ఏరు అది ఏమన్నా కానీయండి ఆమె హొయలు ఆ వెన్నెల్లో మాటల్లో చెప్పనలవి కాని అందం .కారు నడుపుతున్న మా బావగారి చిన్నతమ్ముడు గోపిబావగారు,మా బావగారు చాలా మామూలుగా వున్నారు కానీ ,నేనూ, మా అక్కయ్యా ఓ అలౌకిక స్థితిలోకి వెళ్లి పోయాము.
ఓ చోట రోడ్డుకు దగ్గరగా కిన్నెరసాని పారే దగ్గర మా అక్కయ్య కారాపమని మరిదికి ఆర్డర్ వేసింది,రాణీ కారుదిగు అని నన్ను పిలిచింది. ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా నా చేయిపట్టుకుని కారుదిగి రోడ్డు దాటి వెన్నెలలో కిన్నెరసాని దగ్గరకు నన్ను లాక్కున్నట్టే తీసుకు వెళ్ళింది.వెనక నుంచి మా బావగారు విజయా అని,మా గోపి బావగారు వదినా అని పిలుస్తూనే ఉన్నారు. అదేమీ పట్టించుకోకుండా వంకలోపక్కగా ఉన్న కొంచెం వెడల్పు రాతి మీద కూర్చుని నా చెయ్యిలాగి నన్ను కూడా కూర్చోపెట్టింది.వాళ్ళు అలా పిలుస్తూనే వుంటారు పట్టించుకోకు చూడు ఈ అడవి,వెన్నెల,ఈ ఏరు ఇప్పటికి మనకి కలిసి ఇలా దొరికాయి.ఈ క్షణంలో దీన్ని మాత్రమే చూడాలి అంటూ నిశ్శబ్దంగా ఓ ఐదు నిమిషాలు కూర్చుని నెమ్మదిగా అనునయమైన స్వరంలో రాణీ అనిపిలిచింది .నీళ్ళ మీద వెన్నెల వాయిస్తున్న జలతరంగిణి వింటున్న నేను ఊ అన్నా మత్తుగా.ఓ పాట పాడు అంది కొత్తగా తనకు నేను పాటలు పాడలేనని తెలిసికూడా.నేను ఆశ్చర్యంగా నేనా పాడనా పాట అన్న స్టైల్లో చూసాను .ఈలోగా తనే అంది నీకు పాటలు పాడి వినిపించే మొగుడొస్తాడే అని.16 వ ఏటనుంచి పెళ్లి పేరు(అప్పటి నుంచే సంబంధాలు వచ్చాయి మరి) చెపితే గయ్యిమనే నేను కిన్నెరసాని, వెన్నెల మత్తులో ఏమీ మాట్లాడలేదు ఊ అన్నాను మళ్లీ.
అమ్మ ఒక్కతీ అయిపోతుందని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే అమ్మమ్మ మంచంలో ఉంది కదా ఆవిడకి నీకు పెళ్లి కాలేదే అని దిగులు,అమ్మ కూడా నిన్ను ఎదురుగా పెట్టుకుని ఈ పిల్లకి పెళ్లి చేయగలనా ?అని దిగులు పడుతూ ఉంటుంది . నువ్వు పెళ్లి చేసుకున్నా అప్పుడప్పుడు వచ్చి అమ్మను చూసుకోవచ్చు.
పద్మక్క కూడా దగ్గర్లోనే ఉంది కనుక అది కూడా అమ్మని చూసుకుంటుంది అని చాలా ప్రేమగా నా చేయి సుతిమెత్తగా నొక్కి చెప్పింది. నేను ఊ ,ఊహూ ఏమీ చెప్పకుండా ఊరుకుండి పోయాను.అక్కయ్య కూడా ఇంకేమీ మాట్లాడలేదు .ఇద్దరం కిన్నెరసాని,వెన్నెల ,చెట్ల నీడల సయ్యటలని చూస్తూ కాసేపు అలా ఉండి పోయాము.
పెళ్లి సంగతి ఎలా ఉన్నా ఎప్పుడూ బావగారి మాట జవదాటాని అక్కయ్య బావగారు పిలుస్తున్నా వినకుండా వెన్నెల్లోకి అలా వచ్చేయటం నాకు ఆశ్చర్యమూ ,ఆలోచనా కలిగించింది.మనకి మనం మిగిలి ఉండాలి అన్న సత్యం ఏదో బోధపడింది.ఇంక వెళదాం దా బావగారు వాళ్ళు పాపం కార్లో కూర్చుని మన గురించి కంగారు పడతారు అంటూ లేచి రెండు అడుగులు వేసి ఆగి గట్టిగా వాసన పీల్చి ఏదో గ్రహించిన దానిలా తల పంకించి ఉడికించిన బంగాళ దుంపల వాసన వస్తోంది అంటే దగ్గర్లో ఇక్కడ తాచుపాములు ఎక్కువ ఉంటాయన్న మాట అంది.
ఓ సౌందర్యాన్ని అనుభూతి చెందటం కోసం ఇలా లైఫ్ రిస్క్ తీసుకోవచ్చు అన్న మొండితనం తనలో చూసి నాకు నోట మాట రాలేదు.కిన్నెరసాని కన్నా ఆ వెన్నెల వెలుగులో అసలే తెల్లగా వుండే మా అక్కయ్య ఇంకా వెలుగువేలుపు లాగా కనపడింది నా కంటికి.
తరువాత పెద్దయ్యాక విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెరసాని ,తాచుపాములు గురించి రాసింది చదువుకుని భావుకత స్థాయి అర్ధం చేసుకున్నాను.
వచ్చే నెచ్చెలిలో మా పెద్దక్కయ్యతో భద్రాచలం యాత్ర ముగిద్దాం. అప్పటిదాకా ఇట్లు మీ వసుధారాణి.
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.