ఉనికి పాట
అరటిపడవలొచ్చాయ్ పదండ్రోయ్!
కలిప్సో మహారాజు : హ్యారీ బెలఫాంటే
– చంద్రలత
పంతొమ్మిదివందల యాభైదశకం ఆరంభం.ఒక ఉత్తేజ సంగీతకెరటం అమెరికన్ యువసంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూపింది.ఉక్కిరిబిక్కిరి చేసింది.
అదే సమయాన, ఆ స్వరానికి సమాంతరంగా, చెప్పాపెట్టకుండా, ఊహాతీతంగా,సముద్రగర్భం నుండి ఉవ్వెత్తున ఎగిసిపడింది ఒక ద్వీపరాగాల పెనుతూఫాను. అన్ని అమెరికన్ సంగీత కొలమానాలలో మొదటి స్థానంలో నిలబడుతూ.మొట్టమొదటిసారిగా,మిల్లియన్ సోలో LP రికార్డులు అమ్ముడుపోయాయి.దాదాపు 37 వారాల పైగా అన్ని జాబితాలలో ప్రప్రథమస్థానంలో నిలబడింది.సవినయంగా.సహజంగా.
మొదటి కళాకారుడు, రాక్ ‘న్’ రోల్ మహారాజు, ఎల్విస్ ప్రిన్స్లీ.
రెండవ కళాకారుడు, కలిప్సో మహారాజు, హ్యారీ బెలఫాంటే.
ఆనాటి సమకాలీన సంగీత ప్రపంచంలో,ఇద్దరికీ అందిన అపారమైన శ్రోతాదరణను దృష్టిలో పెట్టుకొని, ఇద్దరికీ
చేరో కిరీటం పెట్టిన ఘనత లేదా నిర్వాకం ఆనాటి మీడియాది. సొమ్ము చేసుకొంది మాత్రం వారిద్దరి రికార్డులను అమ్మిన RCA Victor సంస్థదే. లాభపడింది కొత్త సంగీతం తో పాటు కొత్త భావాలకు తలుపులు తెరిచిన అమెరికన్ సమాజం.
నిజానికి , రాక్ ‘న్ ‘రోల్, కలిప్సో వేటికవే,భిన్నమైన సంగీతధోరణులు.ఏ శైలికి ఆ శ్రోతలున్నారు.ఏ కళాకారుడికి వారి అభిమానులున్నారు.
ఆ ప్రపంచ యుద్ధానంతర కాలంలో,కోరి మరీ, తాజాగాలిని ఆస్వాదిస్తున్న నవశ్రోతల తరం అది.
రేడియోకి తోడైన సాంకేతికవిప్లవం టెలివిజన్ ఇంటింటికీ,దేశం నలుమూలలకు చేరుతున్న తొలిరోజులవి.
రేడియోప్రసారాలలో,వినైల్ రికార్డులలో వినడమే కాక, చిన్నితెరలపై తమ అభిమాన కళాకారులను, తమ ఇంటి గడప దాటకుండానే స్వయాన చూడగలిగే అవకాశానికి తెరలేచిన సమయం అది.
ఆ 1956-57 ఏడాదిలో అమ్మినరికార్డులలో ,37 వారాలపాటు మొదటిస్థానంలో నిలబడిన బెలఫాంటే, 26 వారాల మొదటిస్థానపు ఎల్విస్ కన్నా,నిర్ద్వంద్వంగా చాలాముందే ఉన్నట్టులెక్క. కానీ,ఒక సున్నితాంశంలోనుంచే, అమ్మకాలచిట్టాలు రెండు సంగీత శైలులుగా విడదీయబడి, ఇద్దరు మహారాజులు ప్రకటించ బడ్డారు.
“ఎవరిది పైచేయి’ అన్న పోటీ అంతా, ఉత్తుత్తి వ్యాపార ప్రచారజ్ఞానంలా తోచినా,ఈ వ్యవహారమంతా, ఆనాటి వర్ణవివక్ష ప్రధాన సామాజిక పరిస్థితికి, పెట్టుబడిదారీ వ్యవహారధోరణికి మధ్యన కుదిరిన సయోధ్యలా, సర్దుబాటులా కనబడుతుంది. అందుకు ఒక అనివార్యపరిస్థితిని కల్పించిన బెలఫాంటే పాట,”అరటిపడవలొస్తున్నాయ్!”
హ్యారీ బెలఫాంటే కేవలం సంగీతప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గాయక కళాకారుడు మాత్రమే కాదు. బెలఫాంటే పాటలు ఎంత ప్రసిద్ధమైనవో, జంకుగొంకు లేని అతని మాటలు,రాజీపడని అతని చేతలు అంతకన్నా సుప్రసిద్ధమైనవి. అతని భావాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా.
“మనం బడులకన్నా జైళ్లను ఎక్కువగా నిర్మిస్తున్నాం.ఆ జైళ్ళ నిండా,దాదాపు రెండు మిలియన్ల, బడిలో ఉండవలసిన పేదరికం బాధితులయిన, యువ నల్లఅమెరికన్లు ఉన్నారు.” ఒబామా ,హిల్లరి చెరోపక్కన కూర్చుని ఉండగా, బెలఫాంటే ప్రసంగం కొనసాగించినా,
“ఈ దేశ అధ్యక్షుడు ఒక నియంత.ఒక తీవ్రవాది.” ఆనాటి దేశాధ్యక్షుడు బుష్ గురించి అన్నా,
“ఇరాన్ యుద్ధంలో అసువులు బాసిన వారు, జంట శిఖరాల భవనాలపై తీవ్రవాదులదాడిలో క్షణాల్లో కోల్పోయిన అమెరికన్లకన్నా ఎక్కువ మంది. వారిలో ఎక్కువమంది నల్ల యువత, పేదయువత. యుద్ధాలను ప్రోత్సహించిన వారెవరు? ఎవరు ఈ దేశంలో పెద్ద తీవ్రవాది?” అని ప్రశ్నించినా,
“అయ్యా, దొరవారు, నాలుగో సర్వజ్ఞ చక్రవర్తీ, సుస్వాగతం! వెల్ కం ఫోర్త్ రీక్! ” ప్రస్తుత దేశాధ్యక్షున్ని ఆహ్వానించినా,
” పిల్లలకు కూడా అందుబాటులోఉండేలా, తుపాకులు పెడుతున్నారు.ఎక్కడ తుపాకీ మోగినా, నల్ల ఆమెరికా ఉలిక్కిపడుతుంది. పేదరికం బారినపడి, జైళ్ళలో మగ్గుతుంది. అయ్యా, నల్లనాయకులారా,నల్ల పాలకుల్లారా,నల్ల యువకుల్లారా ఎక్కడున్నారు మీరంతా? అనేకమంది నల్లపిల్లలు అనవసరంగా జైళ్ళలో మగ్గుతోంటే, మీరు ఏమి చేస్తున్నారు? మార్టిన్ కింగ్ తరం చూపిన , మనలోని నాయకత్వ ప్రతిభ, ధైర్యం, చొరవ అంతా ఎటుపోయాయి?”
అంటూ నిలదీసినా,
“మనం ఆగ్రహంలో ఉన్నాం. మనం విషాదంలో ఉన్నాం. ఏదైనా స్వాంతన దొరుకుతుందా ని చుట్టూ వెతుకున్నాం. ఏ ఉపశమనం మనకు దొరకడం లేదు. మంచిది. మనం మన లోలోపల వెతుకుదాం. ఎందుకంటే,ఈ దేశాన సత్యానికి నమ్మకానికి మిగిలిన ఆఖరి ఆశ ఈ దేశ ప్రజలే!” అని నిర్దేశించినా,
బెలఫాంటే ధర్మాగ్రహం , సాటి మనుషుల పట్ల ఆర్ద్రత, తన దేశం పట్ల అతని నిబద్దతా, ప్రజాస్వామ్యం పట్ల, వైవిధ్య ప్రధాన తన దేశసంస్కృతి పట్లా అపారమైన ప్రేమ,విశ్వాసం, గౌరవం వ్యక్తమవుతుంది.
అమెరికా తడబడినపుడల్లా, ఒక్క మాటతో కుదుపునివ్వగల సత్తాఉన్నవాడు బెలఫాంటే.
సమయానికి తగ్గట్టుగా, ఆయా సందర్భాలలో,సామాజిక స్పృహతో, స్పష్టతతో స్పందిస్తూ, ప్రజాస్వామ్యవిలువలకై నిలబడ్డ తొంభై మూడేళ్ళ సజీవ చైతన్యమూర్తి , బెలఫాంటే, తన తదుపరివాక్యం కూడా ఎప్పుడో ప్రకటించేసాడు. “బెలఫాంటే, దేశభక్తుడు”అని.
బెలఫాంటే 1927 సంవత్సరం, మార్చ్1న, హెరాల్డ్ జార్జ్ బెలఫాంటే జూనియర్, గా న్యూయార్క్ లో జన్మించాడు. అతని అమ్మానాన్నలు జమైకా దేశం నుంచి నూయార్క్ లో జీవనం కోసం వచ్చిన వారు.అతని తల్లి,మెలవిన్, పనిమనిషి, తండ్రి హెరాల్డ్ జార్జ్ బెలఫాంటే సీనియర్,వంట మనిషి. అమ్మమ్మ స్కాట్ దేశీయ శ్వేతవర్ణీయురాలు. తాతయ్య(తల్లితండ్రి) నల్లజాతి నీగ్రో.నాయనమ్మ నల్లజాతి నీగ్రో.తాతయ్య(నాన్నతండ్రి) డచ్ యూదు శ్వేతజాతీయుడు.బెలఫాంటే పాటల్లో తరుచూ పలకరించే,జాత్యాంతర,వర్ణాంతర మిశ్రమ గోధుమవన్నెవారి జీవితమే బెల్లఫాంటే కుటుంబజీవితం.
బెలఫాంటే తన అయిదో ఏటి నుంచి పదమూడేళ్ళు వచ్చే దాకా అమ్మమ్మ నాయనమ్మల నడుమ, జమైకాలో పెరిగాడు.అతని తల్లి ఎలాగైనా సరే,పిల్లలను చదివించాలని పట్టుదలతో ఉండేది. బెలఫాంటే డిస్లెక్సియా చేత చదువు కొనసాగించకపోయాడు.అమెరికా నావికాదళాల్లో చేరాడు.రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు.
అతని మూడు వివాహాల జీవితం. మొదటి భార్య తప్పించి,తరువాతి వివాహాల్లోని సతీమణులు శ్వేతవర్ణీయులు. నలుగురు పిల్లలు. అతని కుమర్తె షారీ బెలఫాంటే, కుమారుడు డేవిడ్ బెలఫాంటే తండ్రిలాగానే గాయకులు,నటులు. డేవిడ్ ‘ ఐలాండ్ ఇన్ ద సన్‘వంటి బెలఫాంటే కలిప్సో పాటలను, ఈనాటి భావాలను ప్రతిఫలించేలా కొత్తగా వైవిధ్యప్రధాన నవతరపు అమెరికన్ పిల్లలతో పాడించి, “వెన్ కలర్స్ కం టు గెదర్”(2017) ఆల్బం విడుదల చేశారు.
1949 నుంచి 2003 వరకు గాయకుడిగాను, 1950 నుంచి ఇప్పటి వరకూ సంఘసేవికుడిగాను,1953 నుంచి ఇప్పటి వరకూ సినిమాలలోనూ బెలఫాంటే రాణించాడు. బ్రాడ్వే నటుడు.సంగీతంలో కలిప్సో మహరాజు గా, మొదటి నల్ల వెండితెర సూపర్ స్టార్ గాను, సంఘసేవ లో ఆనాటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ , వర్ణవివక్ష వ్యతిరేక పోరాటం నుంచి ఈనాటి విచక్షణారహిత తూపాకుల వినియోగ వ్యతిరేకత వరకూ, బెలఫాంటే గళమెత్తని సంధర్భం లేదు.
మార్లిన్ బ్రాండో ,టోనీ కర్టిస్ లతో నటనలో సహాధ్యాయి .సిడ్నీ పొయిటర్ తో బ్రాడ్వే నాటకరంగలో తొలి అడుగు.
‘మమ్మాఆఫ్రికా’ మిరియం మకీబను , గ్రీకు గాయని నానా మౌష్కారీ ని సంగీత ప్రపంచానికి పరిచయం చేసినది బెలఫాంటే. కరేబియన్ సంగీతాన్నే కాక ఆఫ్రికన్,ఐరిష్, గ్రీక్, జర్మన్ మొదలయిన అనేక జానపదాలను తన శ్రోతలకు పరిచయం చేశాడు.
ఎమ్మి, గామీ, టొనీ, ఆస్కార్ అకాడెమీ, ప్రెసిడెన్షియల్ మెడల్, కెన్నెడీ సెంటర్ హానర్, అటు గాయకుడిగా ,ఇటు నటుడిగా, సంఘసేవకుడిగా బెలఫాంటే పొందని గౌరవం లేదు.అందని శిఖరం లేదు.
బెలఫాంటే తొలిదశ నుండి, వర్ణవివక్ష వ్యతిరేక పోరాటాల్లో, పౌరహక్కుల ఉద్యమాల్లో మడమ తిప్పని నాయకుడు. వర్ణవివక్షవ్యతిరేక ఉద్యమంలో, పౌరహక్కులనాయకుడు,మార్టిన్ లూథర్ కింగ్ కు వెన్నుదన్నుగా ఉండి,అన్నిందాలా కింగ్ కు సహవాసిగా తోడయ్యాడు.అటు ఉద్యమానికి, ఇటు కింగ్ కుటుంబానికి ఆర్ధికంగా కొండంత అండగా నిలబడ్డాడు. మార్టీన్ లూథర్ కింగ్ చేసిన సుప్రసిద్ధ ప్రసంగం, ” నాకొక కల ఉంది !” నాటి ‘వాషింగ్టన్ పై స్వేచ్ఛాకవాతు’(1963) కు బెలఫాంటే సారధ్యం వహించాడు.
వాషింగ్టన్ పై స్వేచ్ఛాకవాతు 1963 మార్టీన్ లూథర్ కింగ్ తో
ఆనాటి నుంచి, ఆఫ్రికాలోని ఒక్కో దేశం ప్రజాస్వామికంగా మారడంలోనూ, తన సహాయాన్ని విస్తృతంగా అందించాడు. కెన్నడీ అధ్యక్ష ఎన్నికలో కీలకపాత్ర పోషించాడు. నెల్సన్ మండేలాతో పాటు ఆఫ్రికాలో, గళమెత్తిన అనేక గళమెత్తిన స్వేచ్ఛాస్వరాలకు తన గొంతు కలిపాడు. బాసటగా నిలబడ్డాడు. ఐక్యరాజ్యసమితి సుహృద్భావ రాయబారిగా ప్రపంచ శాంతికి కృషిచేస్తున్నాడు. మైఖేల్ జాక్సన్ యొక్క సుప్రసిద్ధ “యూ ఎస్ ఏ ఫర్ ఆఫ్రికా” కార్యక్రమానికి, “వి ఆర్ ద వరల్డ్ “పాటకు మూల సూత్రధారి బెలఫాంటే.
రాజకీయ వేదికైనా, సంగీతకచ్చేరీ అయినా, అదే నిలకడ, నిబద్దత,నిజాయితీ బెలఫాంటే ను సుధీర్ఘ కాలం ఒక అమోఘమైన వ్యక్తిగా నిలబెట్టాయి.వందనీయుడిని చేసాయి.అతనితో ఎంత విభేదించే వాళ్ళనయినా ,ఆలోచించేలా చేస్తాయి. అతని వ్యాఖ్యానాలు ఎంత కరుకుగా ఉన్నా గరుకుగా ఉన్నా.
వ్యక్తిగా నటుడిగా , బెలఫాంటే అడుగడుగునా ఎదుర్కొన్న వర్ణవివక్షత అతని జీవితానికి ఒక దిశానిర్దేశాన్ని చూపింది.తెర మీద సహ శ్వేతవర్ణ నటి చెంపను స్పృశించినందుకే, ‘కు- క్లక్ష్- క్లాన్’ నుంచి ప్రాణగండంలో పడ్డాడు. ఒక టివీ కార్య క్రమంలో అనుకోకుండా, శ్వేతనటి చేయి తాకినందుకే, బెలఫాంటే పై దాడులు ,నిరసనలు వెల్లువెత్తాయి. కనిపించీ కనిపించని సున్నితమైన వివక్ష గురించి బెలఫాంటే ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటాడు.
హాలీవుడ్ లో వెల్లువెత్తిన నల్లజాతీయుల మూసపాత్రలకు నిరసన ప్రకటిస్తూ, ఉన్నతదశలో ఉన్న తన హాలీవుడ్ నటనాజీవితానికి విశ్రాంతి పలికి, తన స్వేచ్చాస్వరాన్ని ప్రకటించే వీలున్న సంగీతం పట్ల శ్రద్ధ పెట్టాడు.
ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి ఉండడం, కమ్యూనిస్ట్ భావస్వేచ్చను ప్రకటించడం చేత, ఎల్లప్పుడూ దేశభద్రతా వ్యవస్థ బెలఫాంటే కదలికలపై పూర్తి నిఘాఉంచింది. తన సుధీర్ఘ జీవితకాలంలో, ఆయా సమయాలలో తలెత్తిన ఏ సామాజిక ఉద్యమాలలోనైనా,పాల్గొనకుండా ఏనాడు బెలఫాంటే వెనకడుగు వేసింది లేదు. ప్రజాస్వామ్య భావనలను మార్చుకొన్నదీ లేదు. తన వామపక్షభావాలున్న స్నేహితులను దూరం చేసింది లేదు.
పేదరికం, అవిద్యల బాధితులై , జైళ్ళపాలవుతున్న మిలియన్ల కొద్దీ నల్ల అమెరికన్ల తరుపున గళమెత్తుతూనే ఉన్నాడు. వారిలో అశాంతిని,అభద్రతతను పోగొట్టడానికి అతను చేయని సాయం లేదు.అన్నిటికీ మించి, తనను తానే ఒక సజీవ ఉదాహరణగా నిలిపాడు, ప్రపంచప్రజ ముందు బెలఫాంటే.
ఇంతటి ప్రాచుర్యాన్ని పొంది, తరతరాల అభిమానాన్ని మూటకట్టుకొన్న బెలఫాంటే,
తొలి సంతకం “అరటి పడవలొచ్చాయ్!” (బోట్ ఓ).మొట్టమొదటి మిలియన్ ఎల్ పి రికార్డ్ అమ్ముడుపోయిన ఘనమైన ఈ కలిప్సో పాట ,అమెరికా పిన్నాపెద్దల పాటలలో ప్రముఖంగా ఉన్నది.
నిత్యసంఘర్షణలో మునిగితేలే బెలఫాంటే, పిల్లలకోసంపాడిన “బోట్ ఓ” , ” బక్కెట్లో చిల్లుంది డియర్ లీసా” ఇంకా ఎన్నెన్నో పాటలు, మఫ్ఫెట్,సేసేమం స్ట్రీట్ వంటి టీవీ పిల్లల కార్యక్రమాలు,బెలఫాంటే ను ఒక భిన్నమైన కళాకారుడిగా నిలబడతాయి.పిల్లలకు చేరువ అయిన కళాకారుడిగానే, అల్లరి పిల్లల కొంటె ప్రవర్తనను సరిచేసికానీ వదలలేదు,
” అమ్మా, అడుగడుగో బూచాడు!”
“అరటి పడవలొచ్చాయ్!” పాట మూలాల్లోనే , బెలఫాంటే 93 యేళ్ళ సుధీర్ఘ జీవితం ముడిపడిఉందనిపిస్తుంది.
అతని మొదటి ప్రసిద్ధగీతం “మెటిల్డా”(1953) కలిప్సో ఆల్బం (1956) సంగీత ప్రపంచానికి కరేబియన్ సంగీతాన్ని పరిచయం చేసింది .
“మగవారు కలిప్సో పాడుకొంటూ పనిచేసుకొంటారు”అని కరేబియన్ దీవుల్లో నానుడి. కలిప్సో పనిపాటల సంగీతం. కలిప్సో మొదట ట్రినిడాడ్ -టొబాగోలలో రూపుదిద్దుకొంది.ఇది ఆఫ్రికా ఖండం నుంచి, మూలాలను సమూలంగా చెరిపివేసి, పడవలలో కుక్కుకొని తెచ్చిన అసంఖ్యాక బానిసల హృదయస్పందనల ధ్వని కలిప్సో పాట. వాళ్ళ సంస్కృతి భాషా ఆచారవ్యవహారాలన్నిటిని,ఒక్క వేటున తుడిచిపెట్టి అరటితోటల్లో,చెరుకు పొలాల్లో వెట్టిచాకిరీ చేయించిన కాలాలలో , పుట్టిన పాటలశైలి కలిప్సో.
పక్కనున్న మనిషితో మంచీచెడూ చెప్పుకొనేందుకైనా నోరు విప్పకూడదు.కానీ, పని చేస్తున్నంతసేపూ పాటలు పాడుకోవచ్చు. అలా, పాటలో మడిచి తమ మాటలను ఒకరితొ ఒకరు పంచుకొవడంతో, కలిప్సో సజీవశైలి అయింది. పాడుతున్నక్రమంలో ఆయా సమయానికి సంధర్భానికి తగినమాటలు జతపరుచుకొంటూ పోవడమే కలిప్సో ప్రత్యేకత. పశ్చిమఆఫ్రికా సంగీత వాయిద్యాలతో, లయధ్వనులతో ఈ పాటలు ముడిపడ్డాయి.
గాఢ సంకేతాల,మౌన సంఘర్షణల పాట.విడిచివచ్చిన జీవితాలను, మానవసంబధాలను,సంస్కృతీసాంప్రదాయలను, తమ వారిని,ఇంటినీ ఊరినీ..ఒక్కటేమిటి.. వారి అణువణువునానిండిన కన్నీటిని, ఓడలేక బతికాల్సిన క్షణాన, కాస్త ఓదార్పు ఇచ్చే స్వాంతనకూ, మనిషికి మాటతోడుగా చెప్పకనే చెప్పుకొనే ధైర్యానికి, ఊరటకు ఇలా ఎన్నెన్ని అనుభూతుల మూటో,ఎన్నెన్నిటికి ప్రతీకో ఈ కలిప్సో.
నవ్వుతూ ,నడుం కదిలిస్తూ, నాట్యంచేస్తూ, అడుగుకు పదాన్ని కలిపిన సరదాపాటల్లా ఉండే, కలిప్సో లో , కొంటెతనం ఉంది. జాణతనం ఉంది. విషాదం ఉంది. సంతోషం ఉంది అమాయకత్వం ఉంది. బతకనేర్చిన తెలివి ఉంది. కొంటెచేష్టలున్నయి. కోపతాపాలున్నాయి. ఇసుకలో,మట్టితో,బురదలో,ఎండలో తడిచిన పదాలున్నాయి. నిత్యజీవితంలో తారసిల్లే చిన్న చిన్న అంశాలన్నీ ఉన్నాయి. నిత్యవ్యవహారంలో పలకరించే చిన్నచిన్న మనుషులు ఉన్నారు. కన్నీళ్ళను కనురెప్పల్లో దాచి, సంబరంగా సాగే కలిప్సో పాటలో జీవితం పట్ల అంతులేని ప్రేమ ఉంది. గాఢానురక్తి ఉంది. సాటి మనిషి పై సహానుభూతి ఉంది. జీవితం పట్ల నమ్మకం ఉంది.
ఈ పాటల్లోని భాష సామాన్యుల ఇంగ్లీషు. వివిధ నేపథ్యాల నుంచి, పొరుగునున్న ద్వీపాల నుంచి అమెరికాకు వచ్చిన అనేకమంది మాట్లాడు కొనే భాష. మట్టి లో అబ్బిన ఆ మాటల విరుపు మెరుపు ను అందిపుచ్చుకొన్న పదాలతో, పలుకుబళ్ళతో ,లయతో, ధ్వనులతో నిండిన పాటలెన్నో బెలఫాంటే పరిచయం చేశాడు.
బెలఫాంటే ఒక పాటలో అన్నట్లుగా, ఆడుతూపాడుతూ నవ్వుతూ నాట్యంచేస్తూ,అలవోకగా ఎంత తాత్వికతను పంచుతుందో కలిప్సో. అది, మానవ స్పర్ష . అందుకే, కాలాలకు అతీతంగా, పిన్నలను పెద్దలను అలరించగలిగింది ఈ కలిప్సో.
ఇక, “అరటిపడవలోచ్చాయ్” కలిప్సో పాట ఎవరు మొదట పాడారో తెలియదు కానీ, చాలా ప్రాచుర్యం లో ఉన్న పాట. అమెరికన్ పండ్లవ్యాపారవేత్తలు , కరేబియన్ దీవులలో విస్తారంగా అరటి తోటలు పండించారు. ఆ పంటలకు చెమటోడ్చింది నల్లబానిసలే.
ఒక్కో పడవలోకి , అరటి గెలలను నింపుతూ, దింపుతూ పాడుకొనేపాటలా ఉంటుంది. కాస్తా, తరిచి చూస్తే, దాని మూలాలు బానిసవ్యాపారనౌకల్లోకి వెళతాయి.అరటికాయను అడ్డంగా కోసిన ఆకారంలో ఉన్న పడవ, అరటిపడవ. దాని ఆకారం మూలంగా, సాధ్యమైనంత ఎక్కువమంది బానిసలను రవాణాచేయడానికి వీలుండేది. కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి, ఒకరిపక్కన ఒకరిని ఎంతమందిని కుదించి, పడవ నింపగలిగితే, బానిసవ్యాపారులకు అంత లాభం. కలిప్సో మూలాలు ఆ అరటిపడవల్లోనే ఉండిఉంటాయి.భుజానికి భుజం ఒరుసుకుంటున్నా, సాటిమనిషిని పలకరించలేని ఆ దుర్భర ఘడియల సుధీర్ఘ సముద్రయానాలలో , వారిని సజీవం ఉంచగలింది ఇలాంటి పాటల మాటలేగా!
అరంగుళమయినా వదలక బానిసలను అమర్చిన ఈ అరటిపడవను చూస్తే, ఆనాటి బానిసలరవాణా తీరు అర్థమవుతుంది.పాటలోని ఆరడగుల,ఏడడుగుల,ఎనిమిదడుగుల అరటిగెలల అతిశయోక్తికి, సుదూర మూలం ఈ ఆరడుగుల ఏడడుగుల అరటిపడవలోని నిజ బానిసపురుషుల్లో లేదూ?
బెలఫాంటే తన సుధీర్ఘ జీవితంలో మొక్కబోని దీక్షతో పోరాడుతోన్న ఆ స్వేచ్చా,సమతా సౌభ్రాతృత్వాల ప్రజాసౌమ్యాలకు , ప్రేరణ ఈ అరటిపడవ పాటలో ఉండడం సహజం. ‘కలిప్సో మహరాజని, చక్రవర్తని’ లోకమంతా వేనోళ్ళ పొగిడినా, బెలఫాంటే, సవినయంగా ‘ఆ మూలకర్తలే ఆ మహరాజులు, చక్రవర్తులు’ అని భావించడం, ప్రకటించడం బెలఫాంటే సంస్కారానికి,ఔన్నత్యానికి ఒక మచ్చుతునక.
అరటిపడవలొచ్చాయ్ పదండ్రోయ్!
గానం : హ్యారీ బెలఫాంటే
పాట, స్వరం : జమైకా జానపదం , ఇంగ్లీషు , Day –O / Banana Boat 1955
రచన : డేవ్ టానెర్ / విల్లియం ఆటవే / హ్యారీ బెలఫాంటె / లార్డ్ బర్జెస్
తెలుగు సేత : చంద్రలత
పగలో ఓ….. పగలో ఓ….!
తెల్లారిపోతోంది . నేనిక ఇంటికి వెళ్ళాలి.
పగలు …నేననేదదే … పగలు , పగలో- ఓ!
తెల్లారి పోతొంది . నేనిక ఇంటికి వెళ్ళాలి.
ఒక చుక్క వేసుకొని రాత్రంతా పనిచేసాం.
తెల్లారిపోతోంది . నేనిక ఇంటికి వెళ్ళాలి.
పగలు … నేననేదదే …పగలో , పగలో – ఓ!
తెల్లారేదాకా, అరటిగెలలు గుట్టలెయ్యి.
తెల్లారిపోతోంది . నేనిక ఇంటికి వెళ్ళాలి
అయ్యా తూకాలబ్బీ, అరటిగెలలు తూకాలేయి.
తెల్లారిపోతోంది . నేనిక ఇంటికి వెళ్ళాలి.
అయ్యా తూకాలబ్బీ, అరటిగెలలు తూకాలేయి.
తెల్లారిపోతోంది . నేనిక ఇంటికి వెళ్ళాలి.
తెల్లారేదాకా, అరటిగెలలు గుట్టలెయ్యి.
తెల్లారిపోతోంది . నేనిక ఇంటికి వెళ్ళాలి.
బాగా పండిన అందమైన అరటిగెలలు.
తెల్లారిపోతోంది . నేనిక ఇంటికి వెళ్ళాలి.
నల్ల ‘టారంటులా’ సాలీళ్ళను దాచేసాయ్.
తెల్లారిపోతోంది . నేనిక ఇంటికి వెళ్ళాలి
ఆరడుగులు, ఏడడుగులు ఎనిమిదడుగులు, ఎత్తైన గెలలు
తెల్లారిపోతోంది, నేనిక ఇంటికి వెళ్లాలి.
ఆరడుగులు, ఏడడుగులు ఎనిమిదడుగులు, అరటిగెలలు
తెల్లారిపోతోంది, నేనిక ఇంటికి వెళ్లాలి.
పగలో …ఓ ….. పగలో… ఓ…!
తెల్లారిపోతోంది, నేనిక ఇంటికి వెళ్లాలి.
పగలు ,నేనన్నా పగలు, నేనన్నా పగలు, నేనన్నా పగలు,
నేనన్నా పగలు, నేనన్నా పగలో – ఓ !
టారంటులా సాలీడు
ఎండలో తడిచిముద్దయ్యే నా దీవి !
గానం : హ్యారీ బెలఫాంటే
పాట : ఇంగ్లీషు , My Island in the Sun 1957
రచన : హ్యారీ బెలఫాంటె ,ఇర్వింగ్ బర్జీ తెలుగు సేత : చంద్ర లత
పల్లవి : ఇదే సూర్యరశ్మిలో పరవశమయ్యే నా దీవి
కాలాలనుంచి మావాళ్ళు పొలాలుదున్నింది ఇక్కడే.
నేను ఎన్నెన్ని సముద్రయానాలు చేసినా,
ఈ ద్వీపతీరమే ఎప్పటికీ నా ఇల్లు.
ఓ! సూర్యరశ్మిలో పరవశమయ్యే దీవి,
మా నాన్న వీలునామాలో నాకు రాసిచ్చిన దీవి
నాకు తెలిసినంతవరకూ పొగుడుతూ పాడుతా
నీ అడవి గురించి. నీ నీటి గురించి.
నీ మెరిసే ఇసుకతిన్నెల గురించి.
తెల్లారగానే స్వర్గలోకాలు తెరుచుకొంటాయి
నా భారాన్ని ఆకాశానికి ఎత్తి చూపుతాను
భగభగ వెలుగుతో సూరీడు దిగివస్తాడు.
నా వంటి చెమటను కిందిమట్టితో కలిపేస్తాడు.
తన కుటుంబానికై చెరుకునరుకుతూ
నడుంవంచిన ఆమె కనబడుతోంది.
పోటెత్తిన కడలిఅలలపై వలలు
విసురుతోన్న అతనిని చూస్తున్నాను.
ఎన్నటికీ ఆ రోజు నాకు రాకూడదు…
ఏ పూట నాకు డప్పుధ్వనులతో మెలుకువ రాదో.
కార్నివాల్ ఊరేగింపుల సంబరాల్లో
కలిప్సో పాటలు నాలో తాత్వికతను నింపవో.
ఎన్నటికీ ఆ రోజు నాకు రాకూడదు…
సెలవిక జమైకా !
గానం : హ్యారీ బెలఫాంటే
పాట, స్వరం : జమైకా జానపదం, ఇంగ్లీషు, Farewell Jamaica 1957
రచన : ఇర్వింగ్ బర్జీ తెలుగు సేత : చంద్ర లత
*
దారంట మెరిసే రాత్రిళ్ళున్న చోట
కొండలమీదుగా ప్రతిపొద్దున్నే సూరీడు ఉదయించే వైపు
నేనొక పడవమీద బయలుదేరాను.
సరిగ్గా, జమైకాతీరం చేరగానే ఆగాను.
అంతలోనే తిరిగెళ్ళాలి, ఎంత దిగులుగా ఉందో.
ఇప్పుడిప్పుడే ఇక్కడికి రాలేను
నా గుండె లయ తప్పుతోంది.
కింగ్ స్టన్ టౌన్ లో చిన్నదాన్ని వదిలివెళ్ళాలి
ఎటుచూసినా కిలకిలారావాలు
నాట్యమాడే యువతుల సోయగాలు
నా గుండె ఇక్కడే కొట్టుకొంటొంది
నేను ‘మెయిన్’ నుంచి ‘మెక్సికో’ దాక తిరిగినా
మార్కెట్ నిండా వినబడుతున్నాయ్
తలపై బరువులెత్తిన ఆడవాళ్ళ పిలుపులు.
ఆకీ బియ్యం ,ఉప్పుచేపల రుచే వేరు
ఏడాది పొడవునా కమ్మని రం రుచే రుచి
గోధుమవన్నె చిన్నదానా!
గానం : హ్యారీ బెలఫాంటే
పాట, స్వరం : జమైకా జానపదం, ఇంగ్లీషు, The Brown skin Girl, 1956
రచన : నార్మన్ స్పాన్ తెలుగు సేత : చంద్ర లత
ప్రతిఒక్కటీ నాకు నిద్రపట్టనివ్వడం లేదు
చాలామంది పడవసరంగులు తిరిగెళుతున్నారు
అక్కడ చేరినవారంతా గెంతులువేస్తున్నారు
సరంగుల పాటలకు కేరింతలు వేస్తున్నారు
గోధుమనవన్నె చిన్న దానా,
ఇంట్లో ఉండు.పిల్లలను చూసుకో.
నేను పడవలో బయలుదేరుతున్నా
తిరిగి వస్తానో లేదో తెలియదు
ఇంట్లో ఉండు.పిల్లలను చూసుకో.
ఇప్పుడు అమెరికన్లు ఆక్రమించేసారు.
మా దీవికి ఎంతో మేలనుకొన్నాం
సెలవలు గడిపి వస్తామని వెళ్ళారు
ఇళ్ళను, ఇళ్ళలోని పిల్లలను
స్థానిక యువకులకు అప్పజెప్పారు
ఇప్పుడు మీకు మిల్లీ కథ చెపుతాను
ఆమెకు ఒ చక్కటి నీలికళ్ళ పాప పుట్టింది
అమ్మను మురిపిస్తోంది ఆ ముద్దుగుమ్మ
కానీ, ఆ నీలికళ్ళ పాపకు
నాన్నెవరో ఎప్పటికీ తెలియదు.
ఇప్పుడిక అమెరికన్లు సరదాగా గడుపుతున్నారు
సంగీతం వారికి నచ్చేట్టుగా సాగుతోంది
అక్కడ చేరినవారంతా కేరింతలు కొడుతున్నారు
పడవసరంగులు పాటలు పాడుతున్నారు
గోధుమ వన్నె చిన్నదానా,
ఇంట్లో ఉండు.పిల్లలను చూసుకో.
నేనేమో పడవెక్కి వెళుతున్నా
తిరిగి రాగలనో లేదో తెలియదు.
కొబ్బరి బోండాల అమ్మి
గానం : హ్యారీ బెలఫాంటే
పాట : ఇంగ్లీషు , Coconut Woman 1956
రచన : హ్యారీ బెలఫాంటె ,ఇర్వింగ్ బర్జీ తెలుగు సేత : చంద్ర లత
కొబ్బరిబోండాం! కొబ్బరిబోండాం! కొబ్బరిబోండాం!
కొబ్బరిబోండాల అమ్మి కేకేస్తోంది.
ఆమె అరుపులు ప్రతిపూటా విబడతాయి.
కొబ్బరిబోండాం! కొబ్బరిబోండాం! కొబ్బరిబోండాం!
కొబ్బరిబోండాలు తీసుకెళ్ళు నాలుగో అయిదో
అయ్యా, మీ కూతురికి మంచిది నాలుగో అయిదో
నీకేమో సిం హం అంత బలాన్నిస్తుంది నాలుగో అయిదో
ఒకావిడ మొన్న నాతో అన్నది
‘మావారిని ఎవరూ తనకు దూరం చేయలేరని.’
ఆ రహస్యం ఏంటని ఆమెను అడిగితే,
ఆమె అంది. ‘కొబ్బరినీళ్ళ అన్నంకూరా..
ఓ కుండనిండా వండొచ్చు నాలుగో అయిదో
వేడి వేడిగా వడ్డిస్తే చాలు నాలుగో అయిదో
2 . కొబ్బరిబోండాలమ్మి చెపితే నమ్మాలి
కొబ్బరితో తియ్యటి లౌజుచేయచ్చు
దిగులును పోగొట్టడానికి విరుగుడు
3 కొబ్బరి నీళ్ళలో కొద్దిగా రం
కొంచెం మైకం కమ్మిందా నాలుగో అయిదో
నేనొక జిప్సీనే ఇక నాలుగో అయిదో
కొబ్బరినిండా ఇనుముంది నాలుగోఅయిదో
నీకేమో సింహం అంత బలమొస్తుంది నాలుగోఅయిదో
కొబ్బరిబోండాం! కొబ్బరిబోండాం! కొబ్బరిబోండాం!
పిల్లల పాటల బెలఫాంటే
ఇంత వైవిధ్యభరితమైన పాటలను పాడిన గాయకుడు, పిల్లలకోసం పాడడం అరుదు.అతని “బోట్ ఓఅ” పాటతో సహా, ఎన్నో కలిప్సో పాటలు బాలాగీతాలయిపోయాయి. బెలఫాంటె ఆఫ్రికన్, జర్మన్,ఐరిష్, అమెరికన్ మరెన్నో జానపద బాలల గీతాలను సేకరిచి పిల్లల కోసం పాడాడు.అప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోన్న, మఫ్ఫెట్ షో, సిసేమం స్ట్రీట్ పిల్లల టీవీ కార్యక్రామాలతో పిల్లలకు మరింత చేరువయ్యాడు. తన కలిప్సో సంగీతం సహా. ‘జంప్ ఇన్ ద లైన్’ అంటూ.
మఫెట్ షో కూతురు, నటి, షారి తో
బక్కెట్లో చిల్లుపడిండి, డియర్ లైజా, డియర్ లైజా
చిల్లును పూడ్చేయి, డియర్ హెన్రీ ,డియర్ హెన్రీ
దేనితో పూడ్చేయను, డియర్ లైజా ,డియర్ లైజా
గడ్డితో పూడ్చేయి, డియర్ హెన్రీ, డియర్ హెన్రీ
గడ్డి పొడవుగా ఉంది, డియర్ లైజా, డియర్ లైజా
గడ్డిని కోసేయి డియర్ హెన్రీ, డియర్ హెన్రీ
దేనితో కోయను, డియర్ లైజా, డియర్ లైజా
గొడ్డలితో కోసేయి, డియర్ హెన్రీ, డియర్ హెన్రీ
గొడ్డలి మొద్దుబారింది, డియర్ లైజా, డియర్ లైజా
గొడ్డలిని పదును పెట్టుకో, డియర్ హెన్రీ, డియర్ హెన్రీ
దేనితో పదును పెట్టను, డియర్ లైజా, డియర్ లైజా
రాయి మీద సానపెట్టు, డియర్ హెన్రీ, డియర్ హెన్రీ
రాయి చాలా పొడిగా ఉంది, డియర్ లైజా, డియర్ లైజా
రాయిని తడి చేయి, డియర్ హెన్రీ, డియర్ హెన్రీ
దేనితో తడపను, డియర్ లైజా, డియర్ లైజా
నీటితో తడుపు, డియర్ హెన్రీ, డియర్ హెన్రీ
నీటిని ఎలా తేను, డియర్ లైజా, డియర్ లైజా
బక్కెట్ లో తీసుకురా, డియర్ హెన్రీ, డియర్ హెన్రీ
బక్కెట్ కు చిల్లుపడింది, డియర్ లైజా, డియర్ లైజా.
అమ్మా, అడుగడుగో బూచాడు!
నేనంటే ఎవరికీ ఇష్టం లేదేందుకని?
నేనొక అనాకారినన్నమాట నిజమా?
నేను నాఇంటిని వదిలి ఎటైనా వెళతా.
నా పిల్లలకి ఇక నా అవసరం లేదిక.
నేను మాట్లాడడం మొదలెట్టగానే ,
వాళ్ళు పాడడం మొదలెడతారు.
“అమ్మా, అడుగడుగో బూ బూ బూచాడు!”
వాళ్ళమ్మ కసురుతుంది,”నోరు ముయ్యండి!”
“ఆయన మీ నాన్న!” పోండి అవతలకి!”
నాకు రాత్రిళ్ళు భోజనం కూడాసహించడం లేదు,
ఈ ముగ్గురుపిల్లల ప్రవర్తనకి.
“జాన్!” “ఏంటి నాన్నా?”
“ఒకసారి రా ఇక్కడికి!”
“నా బెల్టు తీసుకురా! మరీ కొంటెవాళ్ళలా తయారయ్యారు!”
జాన్ అమాయకంగా అన్నాడు “ఇదంతా జేంస్ మొదలెట్టాడు!”
జేంస్ సరిగ్గా అదే మాటని తిరగేసి చెపుతాడు.
నా బెల్టు నా నడుం మీద నుంచి తీసాను.
ఇక అక్కడంతా అల్లరిపిల్లల అరుపులే.
“అమ్మా, అడుగడుగో బూ బూ బూచాడు!”
వాళ్ళమ్మ కసురుతుంది,”నోరు ముయ్యండి!”
“ఆయన మీ నాన్న!” పోండి అవతలకి!”
*11.4.2019*
References :
Day- O
https://genius.com/Harry-belafonte-day-o-the-banana-boat-song-lyrics
Slave Boat
https://theblackhistorymonthproject.wordpress.com/
2.Jamica Farewell
https://genius.com/Harry-belafonte-jamaica-farewell-lyrics
3.Brown skin girl
https://genius.com/Harry-belafonte-brown-skin-girl-lyrics
4.Coconut girl
https://genius.com/Harry-belafonte-coconut-woman-lyrics
Photos:
https://www.dw.com/en/legendary-singer-harry-belafonte-turns-90/g-37742567
5.https://en.wikipedia.org/wiki/List_of_people_who_have_won_Academy,_Emmy,_Grammy,_and_Tony_Awards
6.Elvis and Belafonte
http://www.elvisechoesofthepast.com/rock-n-roll-king-vs-calypso-king-1956-1957/
7.RCA records https://en.wikipedia.org/wiki/RCA_Records
8.Island in the sun
Songwriters: Harry Belafonte and Irving Burgie 1957
Day –O / Banana Boat 1955
Jamican folksong
Songwriters: Dave Tanner / William Attaway / Harry Belafonte / Lord Burgess
10.Fairwell Jamaica 1957
Jamaican Folksong
Songwriters: Irving Burgie
Brown skin girl
Songwriters: Norman Span 1956
http://lyrics.wikia.com/wiki/Harry_Belafonte:Brown_Skin_Girl
12.mama boo boo
Harry Belafonte, Lord Burgess, and Lord Melody
https://genius.com/Harry-belafonte-mama-look-a-boo-boo-lyrics
Coconut woman
Lord Burgess, Belafonte
There is a hole in the bucket
German folk song,recorded in 1960
*****
చంద్రలత రచయిత్రి, అధ్యాపకురాలు. ప్రస్తుత నివాసం నెల్లూరు. 1997 లో వీరి “రేగడి విత్తులు” నవలకు తానా వారి బహుమతి లభించింది. వర్థని (1996), దృశ్యాదృశ్యం (2003) ఇతర నవలలు.
నేనూ నాన్ననవుతా (1996), ఇదం శరీరం (2004), వివర్ణం (2007) కథా సంపుటాలు. “ప్రభవ” అనే చిన్న పిల్లల బడి నిర్వహిస్తున్నారు.