కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)

                                                                –  ప్రొ. కె. శ్రీదేవి

గీతాంజలి కథలు

”As with class system, gender differences are socially constructed though usually presented as natural. There is a distinction to be made between sex and gender. Sex is a term which can be used to indicate the biological differences between man and woman, but gender signifies the socially constructed differences which operate in most societies and which lead to forms of inequality, oppression and exploitation between   the sexes”! 

                                                                                       -Roger Webster 

’స్త్రీలైంగికత’ అనేది లేక దాని ప్రాతినిధ్యాలు(Representations) అనేవి మొత్తం మానవ లైంగికత     ( human sexuality) కలసివుంటూ వచ్చింది. లైంగికత అనేది స్త్రీ లైంగిక గుర్తింపు ( female sexual identity) లైంగిక ప్రవర్తన (sexual behaviour) లతో పాటు సెక్స్ కున్న అన్ని శారీరక మానసిక , సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆత్మిక, కోణాలన్నింటిని సూచిస్తుంది. లైంగికత విషయంలో ఒక సంస్కృతి నుంచి మరొక సంస్కృతి భిన్నంగా ఉండి, చరిత్ర క్రమంలో మారుతూ ఉన్నప్పటికీ, ప్రతి సంస్కృతిలో, చారిత్రక సందర్భంలో స్త్రీల లైంగికత మీద ఆంక్షలు, నిషేధాలు, నియంత్రణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విషయాన్ని అలా ఉంచితే స్త్రీ లైంగికతతో శరీర శృంగారం ( biological sex) శరీర ఆకృతి (body image ) మూర్తిమత్వం, లైంగిక విలువలు, జండర్ పాత్రలు (gender roles) అన్నీ కలగలసి ఉంటాయి. స్త్రీ లైంగికతకు సంబంధించిన ఈ అంశాలన్నీ సునాయాసంగా అమోదించేట్లు చేస్తోంది. 

సంస్కృతిలోని, భాష, సాంప్రదాయం లాంటి అంశాలు ప్రతిమనిషిని పురుషుడిగానో స్త్రీగానో వర్గీకరించి, నిర్దారించటం జరుగుతోంది. బాల్యంలోనే జరిగే ఈ నిర్మాణం క్రమంగా స్త్రీలుగా మారిన తరువాత వారిలో స్థిరంగా ఉండిపోతుంది. నిరంతరం సంస్కృతి, భాష, చైతన్యం లాంటి అంశాలు దాన్ని బలపరుస్తూ వస్తాయి. సారంశంలో జండర్ విభిన్నతను సామాజిక నిర్మితిగా మనం గుర్తించాల్సిన ఈ సందర్భంలో గీతాంజలి పేరుతో (డా.భారతి) తెలుగు సాహిత్య లోకానికి స్త్రీవాద కథకురాలిగా, కవయిత్రిగా, నవలాకారిణిగా  పరిచయం. ఒక స్త్రీవాద రచయిత్రిగా మత్రమే గీతాంజలిని పరిమితం చేయలేం. ఒక సామాజిక కార్యకర్తగా, మానసికవేత్తగా ఆమె మానవ జీవితంలోని బహుముఖీనమైన సంక్షోభాలను, పార్శ్వాలను తనదైన మర్కిస్టు ప్రాపంచిక దృక్పథంతో సృజించింది. మనుషుల సమస్యల మూలాలను సామాజిక చలన సూత్రాల నేపథ్యంలో అన్వయించి,రాజకీయ ఆర్థిక కోణాల్లో విష్లేశిస్తే వచ్చినవే కథలు. ప్రపంచాన్నిమింగేస్తున్న ప్రపంచీకరణ మొదలు దండకారణ్యంలో ఆదివాసీలపై అమలవుతున్న రాజ్యహింస వరకు స్త్రీలపై పీడితవర్గ ప్రజలపై జరుగుతున్న కౄరహింసల వ్యక్తీకరణలే గీతాంజలి కథలు. “బచ్చేదాన్”, ముస్లీం స్త్రీల బాధల ప్రతిరూపమే “పెహచాన్”., పాలమూరు వలస బతుకు చిత్రాలు.   ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షలను వ్యక్తపరిచే ఇతర కథలు, (ఆమె అడవిని జయించింది, పాదముద్రలు నవలలు) ఇటీవల ఆమె కేంద్రికరించిన వస్తువు స్త్రీల శరీర కేంద్రంగా సాగుతున్న, వ్యవస్థీకృత దాంపత్యం పేరిట స్త్రీ శరీరాలపై జరుగుతున్న భయంకరమైన పురుష లైంగిక రాజకీయాలు. స్త్రీలపైనే కాదు పసిపిల్లలపై జరుగుతున్న లైంగికదాడుల, హింసారూపాల విధ్వంస చిత్రపటాలు ఈమె కథలు. 

పురుషుల పైశాచిక లైంగిక విధానాలకు అనుగుణంగా , వైద్యపరంగా  స్త్రీల శరీరాలను ప్రయోగశాలలుగా మారుస్తున్న సామ్రాజ్యవాద వైద్య వినియోగ సంస్కృతి సామాన్య స్త్రీలకు  తెలిసే అవకాశం తక్కువ. స్త్రీలకు తమ దేహం మీద తమకి అధికారం లేదు. తమ దేహంలోంచి కృత్రిమంగా మొలుచుకొచ్చిన రాతి ద్రవపు సంచులు తమను తమ అస్తిత్వాలను వెక్కిరిస్తూ, రోతకలిగిస్తూ, భరించలేని నరకం చూపిస్తున్న క్రమాన్ని గీతాంజలి తన కథల్లో పొందుపరచ గలిగారు. తమ దేహంలో, తమ రక్తంలో, కండరాలలో కలవని, తమవికాని వక్షోజాల స్థానంలో సిలికాన్ రాళ్ళద్రవాన్ని గుండెపై మోస్తున్న దుర్భరత్వాన్ని ’శిలకానిశిల’ కథలో స్త్రీ దృక్కోణంతో రచయిత్రి మలిచారు. స్త్రీలు వాటిని మోస్తున్న క్రమంలో  బ్రెస్ట్ కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి గురవుతారన్న వాస్తవం తెలిసి కూడా భర్తలు భార్యలను తమ కామోద్రేక ఉత్ప్రేరకాలుగా మాత్రమే చూస్తూ,  తమ లైంగిక ప్రాధాన్యతా క్రమంలో నిలపటంలోని దుర్మార్గాన్ని, పితృస్వామిక అనువంశిక లక్షణాన్ని ’శిల కాని శిల’ కథ బహిర్గతం చేస్తుంది.  

స్త్రీల అభ్యున్నతి గురించి సమాజం మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. కానీ లోలోపల జరిగే అమానవీయ చర్యల్ని, స్త్రీలు  తమ దేహాన్ని తామే ఐచ్చికంగా పరిత్యజించేలా చేస్తున్న   ధోరణిని  గీతాంజలి ఒక స్త్రీ సంబంధిత శస్త్ర చికిత్స నిపుణురాలిగానూ (డాక్టరుగా) జండర్ ధృక్పథం కలిగిన రచయితగానూ ఆమె ఈ కథల్ని చిత్రించి, వ్యాఖ్యానించారు. మామూలుగా స్త్రీలకు తెలియని, అని అనడం కంటే తెలియకుండా చేస్తున్న, భర్తల కాముక ప్రవృత్తిని ఒకవైపు చిత్రిస్తూ మరో వైపు ధనార్జనే లక్ష్యంగా ప్రవర్తిస్తున్న కాస్మటిక్ కార్పొరేట్ హాస్పెటల్స్ దుర్మార్గాన్ని, పితృస్వామిక అవలణాలు  రెడింటిని ఒకే వస్తువుగా చేసి, ఈకథను నడిపించడం ద్వారా తాననుకున్న కథా లక్ష్యాన్నిగీతాంజలి సాధించగలిగారు. 

అక్షరాస్యులు సైతం నిరక్షరాస్యులౌతున్న సంధర్భం ఒక డాక్టర్ గా, గీతాంజలి మురికివాడల్లో నివసించే అట్టడుగువర్గస్త్రీల జీవితాల్లో క్రమక్రమంగా విస్తరిస్తున్న చీకట్లను తన కథల ద్వారా చేధించే ప్రయత్నం చేస్తుంది. గీతాంజలే రాయాల్సిన ఒకానొక కథా సంధర్భాన్ని టైమ్ అండ్ స్పేస్ డిమాండ్ చేసిన క్రమంలో వచ్చిన  సమస్యాత్మక కథలు మొదట అంతర్జాలంలోనూ ఆ తరువాత ’హస్బెండ్ స్టిచ్’ కథాసంకలనంలోనూ చోటుచేసుకున్నాయి. సాధారణంగా శస్త్రచికిత్సల పరంగా వైద్యరంగంలో వచ్చిన సాంకేతిక, శాస్త్రీయ అభివృద్ధి సమాజానికి ఎంతో మేలు చేసింది. కాని స్త్రీల విషయం వచ్చేసరికి అత్యంత సహజంగానే ఆ సమాజ హితం కాస్తా వాళ్ళకు ప్రాణాంతకంగా మారటంలో పెద్ద ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే, ఏదైనా సమాజంలో బలహీనులపైన ఆభారంగానీ, బాద్యతగానీ, దుష్ప్రభావాలుగానీ అన్ని కట్టకట్టుకొచ్చి పడటం, దాన్ని ప్రగతిశీల కాముకులుగా పేర్కొనబడిన వాళ్ళు సైతం  వ్యతిరేకించటం ఒక రివాజుగా జరిగిపోయే అంశమే.

        వైద్య సౌకర్యాల పేరుతోనూ సేవల పేరుతోనూ అందుబాటులో కొచ్చి అరాచకంగా జరుగుతున్న హింస, భర్తలలో పెట్రేగుతున్న కాముక మూర్ఖత్వం స్త్రీలను మృత్యుకుహరంలోకి తోస్తున్న క్రమాన్ని గీతాంజలి చాలా శక్తివంతంగా ఆవిష్కరించిన కథలలో ఒకటి  ’శిల కాని శిల.’ అయితే రెండవది ’హజ్బండ్ స్టిచ్’. భద్ర సమాజపు మూలాల్ని విస్మయపరిచి, గగుర్పాటుకు లోనుచేసే కథావస్తువులివి.

 స్త్రీ రొమ్ముల్ని సెక్స్సింబల్స్గా, పురుషుల కామాన్ని తీర్చే మాంసపు ముద్దలుగా మాత్రమే చూసే  పురుషులున్న సమాజంలో  మాంసపు ముద్దలు భర్త లైంగికత్వాన్ని రెచ్చగొట్టేంత పెద్దవిగా లేవని రొమ్ముల స్థానంలో సిలికాన్ ద్రవపు సంచుల్ని (కృత్రిమ రొమ్ముల్ని) అమర్చుకోమని నిర్బంధించడంతో ఆమె అనుభవించిన మానసిక సంఘర్షణ ’శిలకానిశిల’ కథా వస్తువు. గోడకు అలంకార వస్తువుల్ని అమర్చినట్లు కృత్రిమ రొమ్ముల్ని అమర్చుకోమన్న  భర్తలు, ఎనాడైనా ఆ స్త్రీల గుండె చప్పుడుని, ఆ  గుండెల వెనక ఒలికే వేదనని  విన్నారా ? అని ఈ కథలో  గీతాంజలి పురుషాహంకారాన్ని కాలర్ పట్టుకొని నిలదీస్తుంది.  కానీ మిగిలిన కథల్లో పురుష పాత్రల పట్ల కనిపించే కసి, విద్వేషం  ఈ కథలో కనిపించవు. 

భర్తల అనుగ్రహం కోసమో, వాళ్ళ ఆనందంకొసమో,  అందంకోసమో, అమాయకంగా వెంపర్లాడకుండా స్త్రీలుగా తమ ఔన్నత్యాన్నికాపాడుకోవడానికి, పురుషుల వేలంవెర్రి లైంగిక వాంచలను నిలవరించగలిగేందుకు ‘శిల కాని శిల’ కథ దోహదపడుతుంది.

“శిలకానిశిల” లాగే “హస్బండ్ స్టిచ్” కథ కూడా దాదాపు ఇదే కృత్రిమ విధానాల ద్వారా పునరుత్పత్తి క్రమంలో జరిగే మార్పుల్ని భర్త లైంగిక వాంఛలకనుగుణంగా మార్చుకొనే ఇతివృత్తంతో, అందుకు అనుగుణమైన కథాసంవిధానంతో “హస్బండ్ స్టిచ్” కథ నడుస్తుంది. భర్తల అదుపులేని లైంగికవాంఛలను సంతృప్తి పరచేందుకు యోని కండరాల వైశాల్యాన్ని తగ్గించే ఆపరేషన్ కోసం వేలకు వేలు ఖర్చుచేస్తూ, మానసిక శాంతిలేక అలమటించే స్త్రీల లైంగిక కడగండ్ల చిత్రాన్ని గీతాంజలి ఈకథలో రూపు కట్టించారు. తెలుగు కథాసాహిత్యానికి ఇంతకు మించిన ప్రయోజనముంటుందని నేననుకోను. 

అయితే ఈ చికిత్స కోసం పేద స్త్రీలు అప్పులు చేసి మరీ కుట్లు వేయించుకుంటున్నట్లుగా చెప్పడం వలన సమస్య తీవ్రత తగ్గినట్లనిపిస్తుంది. అప్పుల పాలవటం వలన ఆపాత్ర అయ్యో పాపం! అనే సానుభూతిని పొందటంతో, పాఠకుల దృష్టి అక్కడే ఆగిపోతుంది. సాహిత్య భాషలో శాస్త్రీయంగా చెప్పాలంటే రసభంగం అవుతుంది. మర్మాంగాలను కొంచెం కత్తిరించి, కుట్లువేసే ప్రక్రియ. ఒక భాదాకరమైన, జుగుప్సాకరమైన చర్య. జుగుప్సతోనో, భయంతోనో దాన్ని వ్యతిరేకించాల్సిన వాళ్ళ సానుభూతి ప్రకటన వలన సిద్ధించే ప్రయోజనం శూన్యం. ఇది కొంత నాటకీయంగా కూడా అనిపిస్తుంది. మరోవైపు అప్పులు చేయాల్సిన అవసరం లేని వాళ్ళు “హస్బెండ్ స్టిచ్” వేయించుకోవచ్చనే అపార్థం కూడా  తొంగిచూస్తూంది. రచయిత్రి ఉద్దేశించిన కథాలక్ష్యం అది కాదు కదా!. 

స్త్రీలపై అమలయ్యే హింసకి సమాజం యేదో వొక రూపంలో ఆమోదం ప్రకటిస్తుంది. చాలా సహజంగా జరిగే విషయంగా భావిస్తుంది.”రాయి” కథలో అత్యాచారానికి గురైన అస్రా పోలీస్ కంప్లెట్ యిచ్చినందుకు, ’ఇంట్ల దాచిపెట్టవలసిన విషయం వీధిల’ పెట్టినందుకు ఆమెనూ, ఆమెతల్లినీ చుట్టుపక్కల వారు రాళ్ళతో కొడతారు. 

’నింఫోమానియా’ కథలో ప్రేమరాహిత్యంలో కొట్టుమిట్టాడుతూ తోటి మనిషి నుంచి వొక్క సాంత్వన వచనం కోసం, వొక మానవీయ స్పర్శ కోసం తల్లడిల్లిన తల్లి (రుద్రా)ని ఆమె బిడ్డలే అర్థం చేసుకోరు. ఆమెను కామోన్మాదినిగా చిత్రించిన తండ్రి పక్షమే మాట్లాడి అతని పట్ల సానుభూతి చూపుతారు. 

’ఫ్రిజిడ్’ లో రాత్రంతా భార్యని శారీరకంగా పీడించి రాక్షసంగా బలవంతంగా అనుభవించిన కామేశ్వరరావు తెల్లారి పక్కింటి పిన్నిగారి నుంచి మహారసికుడు అన్న బిరుదు పొందుతాడు.

 ’ఉయ్యాల’ లో తల్లిదండ్రులే తమ కూతుర్ని జోగినిగా చేసి ఆమెపై వూరుమ్మడి హక్కులు దాఖాలా చేస్తారు. ’హజ్బెండ్ స్టిచ్’ లో సుశీలా, సుమతి… భర్తల భావప్రాప్తి కోసం యెప్పటికప్పుడు తమను బిగుతుగా సన్నద్ధం చేసుకుంటారు. భర్తల్ని సుఖపెట్టడానికి, మగవాళ్ళు పక్కదారులు పట్టకుండా దాంపత్య బంధాన్ని నిలుపుకోవడానికి ఎక్స్ ట్రా నాట్ బలమైన సాధనం అని స్త్రీలు స్వయంగా నమ్మేట్లుగా  వాళ్ళు చేస్తారు.

అత్యాచారాల ఇతివృత్తంతో నడిచిన కథలు “ప్రశ్న”, “రాయి”. ఆరేండ్ల రమ్యపై జరిగిన అత్యాచారంతో పసిపిల్లలు, స్త్తీలు పడిన నరకయాతనను ఇందులో చిత్రించారు.లైంగిక స్పృహ లేని చిన్నారుల భయ,సందేహాలు “ప్రశ్న”లుగా ఎదురైతే, ఎవరుమాత్రం ఎలా సమాధాన పరచగలరన్న ప్రశ్న పాఠకుల మనసులను తొలిచేస్తుంది. అయితే రచయిత్రే ఈ కథలో అమ్మాయిలకు మగవాళ్ళ నుండి ఎదురయ్యే అత్యాచారాలను ఎదుర్కొనేందుకు  కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చిన పరిష్కారం వల్ల అరోగ్యవంతమైన లైంగిక, సామాజిక వాతావరణం భవిష్యత్ (స్త్రీ)తరాలు పొందగలవా అన్న ప్రశ్న పాఠకులను చిత్రవధకు గురిచేస్తుందేమోనన్న అనుమాన, సందిగ్దాలు కలుగక మానవు. ఇందుకు రచయిత్రి కూడా మినహాయింపు కాదనడానికి సాక్ష్యం ఈకథలోనే రచయిత్రి వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఇక్కడ గమనించవచ్చు.

“పరోక్షంగా ఆ పసి మనసులో … భయం విత్తనాలను…. పురుషున్ని… పురుషుడిగా అంటే బలం కల దృడమైన వ్యక్తిగా చూసే సజెషన్ని తనని స్త్రీగా బలహీనురాలిగా, శరీరంగా మాత్రమే చూస్కుంటూ… శరీరాన్ని రక్షించుకునే భావజాలాన్ని ఆ పసి మనసులోని అంతశ్చేతనంపై అన్యాపదేశంగా ముద్రించింది”.

అత్యాచారం అనేది కేవలం బలవంతపు లైంగిక క్రియ మాత్రమే కాదు ఒక వ్యక్తిగా, మనిషిగా స్త్రీని పురుషుడు గుర్తించ నిరాకరించే చర్య అది. ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా పుట్టినందుకు పురుషాదిపత్య సమాజం వేసే శిక్ష. (ఒక మనిషిని హీనపరచి, హేయంగా చూసి, నువ్వు ఆడదానివి అని చెప్పటానికి మగవాళ్ళు చేసే దౌర్జన్యం, ఆడవాళ్ళను అదుపులో వుంచటానికి, తమ కోర్కెలు తీర్చే సాధనంగా మార్చటానికి చేసుకునే ప్రయత్నం) ఇది ఒక వ్యక్తి తనకిష్టమైన మరోవ్యక్తి మీద దౌర్జన్యం చేసే చర్యేకాదు. అధికారంలో వున్న వ్యక్తిని అణచివేసే రాజకీయ చర్య. భార్యను సొంత ఆస్తిగా చూస్తూ తన ఆస్తిని తాను అనుభవించటంలో మరొకరి ప్రమేయం అక్కర్లేదనే అవగాహన పురుషస్వామ్య సమాజం పురుషులకిచ్చింది. అత్యాచారం విషయంలో భార్యయినా, మరొకరైనా వారి ఇష్టానికి వ్యతిరేఖంగా జరిపే అణచివేత చర్యగా అత్యాచారాలను స్త్రీవాదులు గుర్తించినారు.

స్త్రీలపై అమలయ్యే హింసకి సమాజం యేదో వొక రూపంలో ఆమోదం ప్రకటిస్తుంది. చాలా సహజంగా జరిగే విషయంగా భావిస్తుంది. అత్యాచారానికి గురైన అస్రో పోలీస్ కంప్లెట్ యిచ్చినందుకు, ’ఇంట్ల దాచిపెట్టవలసిన విషయం వీధిల’ పెట్టినందుకు ఆమెనూ ఆమెతల్లినీ చుట్టుపక్కల వాళ్ళు రాళ్ళతో కొడతారు. ’నింఫోమానియా’ లో ప్రేమరాహిత్యంలో కొట్టుమిట్టాడుతూ తోటి మనిషి నుంచి వొక్క సాంత్వన వచనం కోసం, వొక మానవీయ స్పర్శ కోసం తల్లడిల్లిన తల్లి (రుద్రా)ని ఆమె బిడ్డలే అర్థం చేసుకోరు. ఆమెను కామోన్మాదినిగా చిత్రించిన తండ్రి పక్షమే మాట్లాడి అతని పట్ల సానుభూతి చూపుతారు. ’ఫ్రిజిడ్’ లో రాత్రంతా భార్యని శారీరకంగా పీడించి రాక్షసంగా బలవంతంగా అనుభవించిన కామేశ్వరరావు తెల్లారి పక్కింటి పిన్నిగారి నుంచి మహారసికుడు అన్న బిరుదు పొందుతాడు. ’ఉయ్యాల’ లో తల్లిదండ్రులే తమ కూతుర్ని జోగినిగా చేసి ఆమెపై వూరుమ్మడి హక్కులు దాఖాలా చేస్తారు. ’హజ్బెండ్ స్టిచ్’ లో సుశీలా సుమతి… భర్తల భావప్రాప్తి కోసం యెప్పటికప్పుడు తమను బిగుతుగా సన్నద్ధం చేసుకుంటారు. భర్తల్ని సుఖపెట్టడానికి, మగవాళ్ళు పక్కదారులు పట్టకుండా దాంపత్య బంధాన్ని నిలుపుకోవడానికి ఎక్స్ ట్రా నాట్ బలమైన సాధనం అని వాళ్ళు స్వయంగా నమ్ముతారు.

మాతృత్వం చుట్టూ అల్లబడిన అందమైన భావజాలాన్నే స్తీలకు సమాజం చూపిస్తుంది. కానీ ఆ మాతృత్వాన్ని సాధించడంలో వాళ్ళు పడుతున్న శ్రమ, భయం మాత్రం చర్చలోకి రాకపోవటం లోని పురుష రాజకీయాల్ని గమనించాలి. స్త్రీలను స్త్రీలుగా తయారు చేయడంలో వున్న శ్రద్ద, శిక్షణ వారి శ్రమను అర్థంచేసుకోవటంలోగానీ, వారి భయాలను పోగొట్టే ప్రయత్నంలో గానీ ఈ సమాజం విఫలమైన తీరు “హత్య”, “మొక్కు” కథల్లో గీతాంజలి బట్టబయలు చేశారు.

అంతేకాదు మన సమాజంలో స్త్రీ పురుషుల మధ్య శృంగారం అనేది గుట్టు. చాటుమాటు వ్యవహారం. చీకటి కార్యం. దాని గురించి మాట్లాడటం నిషిద్ధం. అసభ్యం. తెగించి యెవరైనా మాట్లాడితే బరితెగించినట్టు, నైతిక విలువలు లేనట్లు చిత్రించడం,  . అందుకే నాల్గుగోడల వెనక జరిగే హింస అంత తొందరగా బయటికి రాదు. నోట్లో గుడ్డలు కుక్కుకొని మౌనంగా భరించే స్త్రీల వేదనికు వాగ్రూమివ్వడం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ వొక రచయిత్రి మాట్లాడడానికి చాలా సాహసం కావాలి. “శృంగారమంటే రెండు స్త్రీ పురుష జననాంగాల మధ్య జరిగే రాపిడి మాత్రమే కాదు”. దంపతులు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమను స్పర్శ ద్వారా వ్యక్త పరచుకొనే దైహిక, అంతర్గత బాధలను సాహిత్యంలో చెప్పడానికి, సమర్థించడానికి, ఆ పాత్రలకు రచయిత్రి తన కంఠస్వరాన్నిఇవ్వడం జరిగింది. బాధితులతో పాటు కంఠం కలపడం కోసం అందరూ ఆమోదించదగిన, అవగాహన కల్పించే క్రమంలో  ముఖ్యంగా పాత్రోచిత భాష,లో చెప్పడానికి చాలా గుండె ధైర్యం కావాలి. అలాంటి గుండె దైర్యంతో పాటు మనోనిబ్బరం కలిగిన ధీరోదాత్త కథకురాలు గీతాంజలి.

స్త్రీల లైంగిక జీవితంలో ఎదురయ్యే అపసవ్యతలనుండి తనభర్త తనకు విముక్తి కలిగించాలనే వెర్రి తాపత్రయం. తమబాధలను పురుషులు అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష “బచ్చేదాని”, “శిలకాని శిల”, “నాభర్త నన్ను రేప్ చేశాడు”, “రాయి”, “నింఫొమేనియా” కథల్లో చిత్రించడాన్ని ఇక్కడ గమనించ వచ్చు…

“శిలకాని శిల” కథలో 

“నీకేంకాదు నేనున్నా, పాడు పీడా సంచుల్ని తీసేద్దాం. నీవు ముఖ్యం నాకు” అంటే ఎంత బాగుండు?. అనడు, అనడు గాక అనడు”.

 ’మొక్కు’కథలో    “మాలన్ తేరి జాన్ సె జ్యాదా నై హై మరద్ అచ్చా, ఆప్రేషన్ కర్ వాలె…మై దూస్ రీ నిఖా నహీ కరూంగా” (మాలన్ నీ పానంకంటె ఎక్కువకాదు మగబిడ్డ, ఆప్రేషన్ చేపిచ్చుకో నేను ఇంకో నిఖా చేసుకోను) అని ప్యార్, మొహబ్బత్ ల తోని అంటడేమోనని రంజాన్ నెలల చాంద్ కోసం ఎదురుచూసినట్లెదురుచూసింది…మాలన్. ఈమె కథల్లోని స్త్రీపాత్రలన్నీ కూడా భర్తల వల్ల ఎన్ని హింసల నెదుర్కొంటున్నా వాళ్ళ భర్తల ప్రవర్తనలో తాము కోరుకుంటున్న మార్పు కోసం అలుపెరుగని ఆశలతో ఎదురుచూస్తూనే ఉన్నారు. గీతాంజలి స్త్రీపాత్రలు అలా ఎదురుచూడడంలో వాళ్ళజీవితాలలో మార్పు రావాలనే రచయిత్రి దృడసంకల్పం కనబడుతుంది. మార్పు అనివార్యం అన్న రచయిత్రి అవగాహనా స్పృహలే ఆపాత్రల ఆకాంక్ష రూపంలో వ్యక్తమయ్యాయని పాఠకులకు అర్థమవుతుంది.

’ఫ్రిజిడ్’ కథలోని కథకురాలి మాటల్లోనే గమనిస్తే, “ఒద్దండీ ఈరోజు మూడ్ లేదన్నా – నొప్పులన్నాఒంటిపై చేయి కూడా వేయ్యట్ట. పోనీలే అని దగ్గరికి తీసుకొని తన హృదయంపై ఆమె తలను గాఢంగా అదుముకొని, గాఢంగా హత్తుకొని పడుకుంటాట్ట’. స్నేహితురాలు సృజన భర్త అబ్బ తన మొగుడూ అలా ఉంటే, పగలంతా హూంకరిస్తూ పనులు చేయించుకుంటాడు. అతను తన యజమాని అయినట్లు రాత్రంతా సెక్స్ కోసం వేధిస్తాడు. అని “ఫ్రిజిడ్”,కథలోని పాత్ర భావిస్తుంది. 

“నింఫోమేనియా” కథలోనూ భర్తకు ఇతర స్త్రీలతో గల వెగటు సంబంధాలు, ప్రేమరాహిత్యం స్త్రీలను వివశులను చేస్తున్నక్రమంలో స్త్రీలను వాళ్ళ లైంగిక సమస్యలను వాళ్ళ దృష్టికోణం నుండి అర్థంచేసుకోవాల్సిన అవసరాన్ని డిమాండ్ చేస్తాయి.

 “ఖడ్గచాలనం” కథలో ఫాంటసీ ఉన్నా అలా స్త్రీ మర్మాంగం స్థానంలో పదునైన కత్తిలాంటి, ఖడ్గమృగం కొమ్ములాంటి సరికొత్త అవయవంతో పుట్టాలని ఒక గర్భస్థ శిశువు కోరుకోవడంలో, స్త్రీలు ప్రతినిత్యం ఎదుర్కుంటున్న  లైంగిక హింసలోని అమానుషత్వ వ్యక్తీకరణకు, నిరసనకు నిదర్శనం. ఇందులో గర్భస్థ శిశువును ఎన్నుకోవడంలో రచయిత్రి ఎత్తుగడ తెలుస్తుంది. ఎందుకంటే, భార్యలుగా స్త్రీలు ఈకోరిక కోరుకున్నాఅసాధ్యం. హింసాత్మక రతిని బలవంతంగా భరిస్తున్న వాళ్ళ ఘోషకు ప్రతిరూపంగా ఈకథను భావించవచ్చు.

’ఖడ్గచాలనం’ కథ గర్భస్థ శిశువు మోనొలాగ్ రూపంలో సాగుతుంది. ఓల్గా ’అయోని’ కథ రాసినపుడు (తొమ్మిది సం.)అంత చిన్నపిల్ల పురుషాంగాన్ని ఖడ్గమృగం కొమ్ములా, కాళ్ళమధ్య వేలాడే తోకలా మాట్లాడటం  శిల్ప లోపం అని విమర్శకాగ్రేసరులు పెదవి విరిస్తే, పురుష పాఠక ప్రపంచం గగ్గోలెత్తింది. గీతాంజలి ప్రశ్న, రాయి, ఉయ్యాల,ఖడ్గచాలనం కథల్లో వాడిన పురుష మర్మాంగాన్ని వర్ణించిన భాషపట్ల రకరకాల కామెంట్స్ వచ్చినమాట నిజమే. కాని పత్రికలకెక్కి రాద్ధాంతాలు చేయలేదు. ఇందుకు కారణం ఓల్గా అయోని రాసినప్పటికి సమాజం అలాంటి నిరసనను,ఎగతాళిని మొదటిసారిగా విని భరించలేకపోయింది. సామజిక అనుమతి (సొసైటల్ ఆక్సెప్టెన్స్) అనేది మొట్టమొదటి ప్రతిపాదనతోనే రాదు. రాస్తున్నకొద్దీ అవగాహన మెరుగుపడుతుంది. అలాగే గీతాంజలి తీసుకున్న కథావస్తువులొ స్త్రీల అనుభవ విభిన్నత చర్చోప చర్చలకు గురయినప్పటికీ, స్త్రీల మౌనరోదనలకు లిఖిత రూపమిచ్చి సాహిత్యం చేసిన గీతాంజలి కృషి అభినందనీయం.

 “రాయి” కథలో ఏడేండ్ల పిల్లలు సహితం తండ్రి, చిన్నాన్న, అత్యాచారాలకు బలవుతున్న దారుణ వాస్తవ సంఘటనలను రచయిత్రి కథలుగా మలిచారు. మురికివాడల్లోని స్త్రీల,బాలికల  బ్రతుకు చిత్రాలను కథలుగా మలిచిన అరుదైన కథకురాలు. ఇలా అనడం కంటే పితృస్వామ్య లైంగిక రాజకీయాలపై భధ్రకాళిలా విరుచుకుపడిన కథాకాహళి గీతాంజలి అనడం సమంజసం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.