కనక నారాయణీయం -6
–పుట్టపర్తి నాగపద్మిని
ఎవరికొరకూ ఆగని కాలం, పరుగులు పెడుతూనే ఉంది. ఈ లోగా మెట్రిక్ పరీక్షలొచ్చాయి. లెక్కలంటే ఇప్పటి తరుణ నారాయణునికి సిం హ స్వప్నమే!! అందువల్ల మెట్రిక్ లో లెక్కల్లో తప్పారు. పరీక్ష తప్పినందుకు అయ్యగారి నుండీ దండన బాగానే అందింది. కారణం, ‘నాట్యమూ, సంగీతాభ్యాసం తో పాటూ, ఆకతాయి పనుల బదులు గణితాభ్యాసం చేసి ఉంటే, మెట్రిక్ గట్టెక్కి ఉండేవాడివి కదా!!’ అని వారి వాదన. కానీ..గణితమంటే, భూతం లాగే అనిపించేదెప్పుడూ తరగతి గదిలో!! (జీవితాంతమూ గణితమంటే..ఇదే భయమూ, ఏవగింపే మా అయ్యగారికి..) ఎక్కడికి వెళ్ళినా యీ లెక్కల బాధ తప్పేట్టు లేదు !! తప్పించుకునే మార్గమేది?? తెలుగు సాహిత్యంలో శిరోమణి గురించి తాను ఆనోటా ఆనోటా విన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ చదువు తిరుపతిలోని ఓరియెంటల్ కళాశాలలో మాత్రమే ఉంది. గురుకుల వాసం వంటిదే!! పైగా అక్కడ వాల్మీకి, కాళిదాసు, భవభూతీ, భారవీలతో చక్కగా స్నేహం చేయవచ్చు. అలంకార, వ్యాకరణ శాస్త్రాలతో గాఢ పరిచయమూ కలుగ వచ్చు. ముఖ్యంగా తిరుమల నే ఇంటి పేరుగా కలిగిన తనకు ఆ తిరుమల మరో ఇల్లుగా రూపొందవచ్చు. ఇవీ ఇప్పటి తరుణ నారాయణుని ఆలోచనలు. కానీ ఊరు వదిలి వెళ్ళాలంటే తండ్రిగారి అనుమతి కావాలి కదా!! ఎలా?? మథనం మొదలైంది.
ఒంటి చేతి సంపాదన తండ్రిగారిది!! మునిసిపల్ స్కూల్ లో తెలుగు ఉపాధ్యాయునిగా ఉద్యోగం. మైసూరు పరకాలమఠంలో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారూ, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారూ (మా పితామహులు) సహాధ్యాయులు. అక్కడి వాతావరణం పడని కారణంగా, మా పితామహుల చదువు అక్కడ పూర్తి కాలేదట!! అనంత కృష్ణ శర్మగారు చదువు పూర్తి చేశారక్కడే!! తరువాత, ఇద్దరు స్నేహితులూ బెంగుళూరులో ఒకే పాఠశాలలో ఉద్యోగం చేసేవారు. అక్కడే శ్రీమాన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారూ పనిచేసేవారట!! వీళ్ళు ముగ్గురిమధ్యా సాహిత్య చర్చలు బాగానే జరిగేవట!! ఇక్కడో ముచ్చట చెప్పుకోవాలి. బాల పుట్టపర్తి ఓ నాడు, పట్టుచీరొకటి మొలకు చుట్టుకుని వీధిలో ఆడుకుంటూ..ఎక్కడో బెంగుళూరు వీధుల్లో తప్పిపోయారట!! మాటలు రావు. పిల్లాణ్ణి పట్టుకోవటం గగనమైపోయిందట!! మళ్ళీ ఇటువంటి తులువ(అల్లరి) పని చేసి ఎటైనా వెళ్ళిపోతే పట్టుకోవటం కష్టమని , మా తాతగారు, మా అయ్య పట్ల ప్రేమతో కళ్యాణ దుర్గం వచ్చేసి, తన బావమరిది సహాయంతో పెనుగొండ మునిసిపల్ స్కూల్ లో ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడ్డారట!! ఇక్కడ జీతం తక్కువ. ఇల్లు గడవటానికి పురాణ ప్రవచనాలూ, హరికథలూ కూడా చెప్పుకుంటూ సంసార రధం నడుపుకొస్తున్నారు. 1914లో మొదటి సంతానం పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు కాగా, 1917లో మరో మగబిడ్డ. పుట్టపర్తి తిరుమల నరసిం హాచార్యులు. తరువాత మూడేల్లకు కాబోలు ఆడపిల్ల. ఆ చిన్నారి పురిట్లోనే గతించింది. ఆ తరువాత క్షయ కారణంగా ప్రేమమయి, సాహిత్యోపాసకురాలైన ఇల్లాలూ గతించటంతో, పితామహులు పదేళ్ళు వివాహప్రసక్తి లేకుండా గడిపి, తరువాత, బంధువుల ఒత్తిడి వల్ల రెండో వివాహం 1926 లో చేసుకున్నారని ముందే చెప్పుకున్నాం కదా!! ద్వితీయ కళత్రం పేరు లక్ష్మీదేవమ్మ. గొప్ప సంస్కారవంతురాలు. సంగీతం ప్రావీణ్యం కూడ ఉండేది ఆమెకు!! ఆమె ద్వారా మొట్టమొదట 1927లో పుట్టపర్తి తిరుమల రాజగోపాల్, 1930 లలో ఇందిర అనే కుమార్తె కలిగారు. ఇప్పుడు మొత్తం ఇంటిలో సభ్యులు ఆరు మంది.
తండ్రిగారికి పురాణ ప్రవచనాల్లోనూ, హరికథల్లోనూ చేదోడువాదోడు బాలపుట్టపర్తే!! పనిలో పనిగా తానూ హరికథలు సొంతంగా వ్రాసుకుని చెప్పేవాళ్ళట తరుణ పుట్టపర్తి కూడా!! మరి ఇప్పుడు తాను తిరుపతికి వెళ్తానంటే..ఒప్పుకుంటారా అయ్యగారు అని సందేహం పీడిస్తున్నది కూడా!! ఈ పరిస్థితుల్లో నారాయణాచార్యులవారికి తండ్రిగారితో తన తిరుపతి ప్రయాణం గురించి చర్చించే ధైర్యం లేదు. కిం కర్తవ్యం????
ఈ మథనం ఇలా సాగుతూనే ఉంది.ఈ లోగా పుట్టపర్తి ఎదురుగా ఆంగ్ల సాహిత్య గవాక్షం హఠాత్తుగా తెరచుకుని, ఝంఝానిలం వలె చుట్టుముట్టేసింది. ఆ ఝంఝానిలం పేరు పిట్ దొరసాని. ఆమె భర్త పెనుగొండ సబ్ కలెక్టర్ గా ఉండేవాడు. పిట్ గారికి పెనుగొండ ప్రకృతి సౌందర్యమూ, ప్రజల సామరస్య సహజీవనమూ నచ్చి..అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడట!! కానీ అనారోగ్యంతో అసువులు బాశాడట అక్కడే!! సమాధి కూడా అక్కడే చేశారట ఆయన్ని!! (ఇప్పటికీ ఉందట ఆ సమాధి..) భర్త జ్ఞాపకాలను వదిలి వెళ్ళలేక, అతని భార్య పిట్ దొరసాని అక్కడే ఉండి పోయిందట!! ఆమె కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బ్రౌనింగ్ మీద పరిశోధన చేసి డాక్టరాట్ తీసుకున్న ఉన్నత విద్యావంతురాలు. పిల్లలంటే ఆమెకు చాలా ఇష్టమట!! అలా ఆమె దగ్గర తీసిన పిల్లల్లో చురుకైన పిల్లాడు పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు. మెల్లిగా మాటా మాటా కలిసిన తరువాత, తనకు ఆంగ్లం చెప్పించమన్నారట పుట్టపర్తి. ఆమె తెలుగు సాహిత్య పరిచయం చేయమంది – బదులుగా!! అలా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఫలితమే – పుట్టపర్తి ఆంగ్ల సాహిత్యాధ్యయన శుభారంభం. అప్పట్లో టీ.శంకర రావుగారు అనే పేరుమోసిన లాయర్ ఉండేవారు. శంకర రావుగారూ నారాయణాచార్యుల గురించో మంచి ముక్క ఆమె చెవిన వేశారు. వీ.జే.పిట్ తో పరిచయం, పుట్టపర్తికి అద్భుతమైన అనుభవం. భావి లో మరో నూతనోధ్యాయానికి వలసిన వనరులు సమకూర్చుకునే ఫలవంతమైన సమయం.
ఇన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రాంతంలో ఉండటం వల్ల పెనుగొండ ప్రాంతాల్లోని తెలుగు కాస్త వచ్చు ఆమెకు!! కానీ సాహిత్య పరిచయం లేదు. ఈ కొరత తీర్చేందుకు తరుణ పుట్టపర్తి తారసపడటంతో, ఆమెకు అమితానందమైంది. పారిజాతాపహరణం, వసుచరిత్ర, మనుచరిత్రాది ప్రబంధాలు పాఠం చెప్పేవారాయన!! ఇటు , పిట్ దొరసాని అధ్యాపకత్వంలో, షేక్స్పియర్ విషాదాంత నాటకాలన్నీ తరుణ పుట్టపర్తి మస్తిష్కంలోకి చేరిపోయాయి. దానికి తోడు బైరనూ, బ్రౌనింగూ, కీట్స్, షెల్లీలూ కొలువుతీరారు. ఇంకేముంది?? పెనుగొండలక్ష్మి ప్రాభవాన్ని ఖండకావ్యంగా అప్పటికే మలచిన తరుణ నారాయణుని కలం, ఆంగ్ల భాషా వీధుల్లోనూ ‘లీవ్స్ ఇన్ ది విండ్’ గా నర్తించింది.
I read the sacredbooks days and nights,
And lost my sleep over them.
The words were good ut where is God?
I turned to my heart and saw in it.
A sharp ray of light, flickering.
I was ecstatic. I said to myself.
‘You are the light, the others a fantasy.’
తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం
తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్..
అనగా హృదయమంతా ఆవృతమైనదాని చివరలో సూక్ష్మాంశం ఉంది. అందులో సర్వం ప్రతిష్ఠితమై ఉన్నది. వంటి వేదవాక్యాలు ఆ లేత కలంలో ఆంగ్ల భాషా మాధ్యమంగా ఆవిష్కరింపబడ్డాయి!!
జీవితం మొదటిమెట్టుపైనే ఉన్నా, ఆలోచనల్లో అంతులేని చిక్కదనం వెల్లివిరిసిందా కవితా సంపుటిలో!! దారిద్ర్యాన్ని తన నెచ్చెలిగా చేరదీయటం, సాగరంతోనూ తారాపథంతోనూ సంభాషించి మీ మతమేమిటో చెప్పమనటం, ‘ఎదగడానికెందుకు తొందర..’ అంటూ లాలిలోని పాపాయిని ఊరడించటం, నామ రూప రహితుడైన పరమాత్మను అన్వేషించటం.. ఇలాంటి వైవిధ్యభరితమైన ఖండికల్లో పుట్టపర్తి భావి దర్శనీయమైంది – అప్పుడే!! అంతేనా ?? దేశ జన్మ కాలాతీతమైన ప్రేమ తత్వాన్ని అలవరచుకోమనే పరిణత వాణి కూడ ఆ లేత గొంతులో అప్పట్లోనే వినిపించటం ఆశ్చర్యమే కదా!!
ఇంతటి గంభీర భావజాలం మధ్య, ప్రకృతి రామణీయకతలోనూ తుళ్ళిపడిందా రసవాహిని ఇలా!!
Fields play with impish words,
And birds twitter gaily,
Moon, the mischievous child,
Showers her silver childhood
On the lap of mother world,
Vernal beauties carol,
Through flowers and thickets,
And streamlets flow
In their inevitable curves,
At girls with naked limbs
The stars wink with vague ideas
In that Paradise of Gods,
A man beats alone his drum of despair.’
అల్లరి పవనాలతో ఆడుకునే చేలు, కువకువలాడుతున్న పిట్టలు, పుడమి తల్లిపై అల్లరి చంద్రుడు చిత్రిస్తున్న బాల్యపు అందాలు, పువ్వులు, చెట్ల పొదలనుండి విస్తరిస్తున్న కొత్త ఆకర్షణలు, మెలికలు తిరుగుతూ ప్రవహిస్తున్న నదీ సుందరి, ఆచ్చాదనలేని ఆడపిల్లల భుజాలను చూసి కన్నుకొడుతున్న నక్షత్రాలు..ఓహ్…అద్భుతం కదా..కానీ ..ఇక్కడే ఉందొక ఊహించని మెలిక!! ఓ వ్యక్తి నిరాశ నగారాని మ్రోగిస్తుండటమేమిటి వీటన్నిటి మధ్యా?? అంతసేపూ ప్రకృతి సోయగాలలో తన్మయీభూతమైన యీ కవి మనసు, నిరాశ నగారాను మ్రోగించటం లోనే ఉంది..ఆ కవి భావి సాహితీ గంభీర జలధి తాలూకు ఆచూకీ!!
తన మనసున సందడించిన తలపోతలను పిట్ దొరసానిముందుంచగా, ఆమె తల పంకించింది. కొన్ని రోజులపాటు ఆ భావధారను పరికించింది. తరుణ కవి హృదయంతో తత్తరపాటు!! తన వ్రాతలో తప్పులున్నాయేమో!! భాషా పరమైన వ్యాకరణ సంబంధమైన దోషాలు దొర్లాయా?? నా భావాలు ఆంగ్ల సాహితీ ప్రపంచ పటంలో స్థానం సంపాదించటం అసాధ్యమా ?? ఇన్ని విచికిత్సలూ మదిలో తీవ్ర అశాంతిని కలిగిస్తున్నాయి. అనుకున్న రోజు రానే వచ్చింది. ‘నీ కవితావేశమూ, భావాలూ బాగానే ఉన్నాయి. కానీ..ఒక్కటి గుర్తుంచుకో..ఆంగ్ల సాహిత్యాన్ని బాగా చదువు.ఆకళింపు చేసుకో. నీ భాషలో ప్రయోగాలు బోలెడు చేయి. కానీ ఆంగ్లంలో నీవే వ్రాయకు. తప్పుపట్టేవాళ్ళు చాలామంది ఉంటారు..” తరుణ పుట్టపర్తి ఉరకలెత్తే ఉత్సాహానికి యీ మాటలే అడ్డుకట్ట వేసేశాయి. ఇంకేముంది?? నిస్తేజం!!
ఇటు తండ్రిగారు, తన చదువు గురించి పడుతున్న ఆరాటం గమనించాడు తరుణ నారాయణుడు!! ఆంగ్ల సాహిత్య పాఠాల గురించి తెలిసినా, తండ్రి గారి మనసులో, సాంప్రదాయక విద్య కుమారునికి అబ్బటంలేదనే బాధ ఇంకా ఉండనే ఉంది. దానికి తోడు పిట్ దొరసాని ఆంగ్ల సాహిత్య వ్యవసాయానికి వేసిన కళ్ళెం!! నిజానికి ఆమె అలా అనకుండా ఉండి వుంటే, ఆ రోజుల్లోనే అదే తరహా కృషిని కొనసాగించి ఉంటే, నారాయణాచార్యులవారు అంతర్జాతీయ స్థ్యాయిని అందుకుని ఉండేవారు కొద్ది రోజులకే!! కానీ..ప్రతి జీవి జీవితమూ విధిలిఖిత కథే కదా మరి!! పుట్టపర్తి జీవనది కూడా, దారి మళ్ళించుకుని మరీ విశాల క్షేత్రంలోకి ఉధృతంగా మళ్ళవలసిన తరుణం ఆసన్నమైంది.
ఈ పరిస్థితుల్లో, శిరోమణి చదువే తరుణోపాయంగా తోచింది పుట్టపర్తి కి!! ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు వారు. శిరోమణిలో ప్రవేశాలు జరుగుతున్నట్టుగా మిత్ర బృందం ద్వారా సమాచారమందుకున్న మరు క్షణమే, తిరుపతికి వెళ్ళాలన్న తపన మొదలైంది.
(సశేషం)
*****
ఫోటో: పుట్టపర్తి వారి తల్లిదండ్రులు