చిత్రం-8
-గణేశ్వరరావు
అమెరికాలో తరచూ చిత్రకళా ప్రదర్శనలు జరుగుతుంటాయి. అలాటి ఒక ప్రదర్శనకు నిర్వాహకులు పెట్టిన పేరు: ‘మాయా జీవుల చిత్ర ప్రదర్శన’. దీనిలో పాల్గొన్న లిబ్బీ స్మిత్ వికలాంగురాలు. ఆమెను ఒక విలేకరి ‘ఇదే మీ ఆఖరి చిత్రం అవుతుంది అని మీకు తెలిసినప్పుడు, మీరు ఏ బొమ్మ వేయడానికి ఇష్టపడతారు?’ అని ప్రశ్నించినప్పుడు, తడుముకోకుండా ఆమె ఇచ్చిన సమాధానం: ‘ఏముంది, దేవుళ్ళ బొమ్మలు గీస్తాను!’.
దృష్టి లోపం వున్న లిబ్బీ ఎప్పుడూ ఏదో మాయలోకం లోనే వుంటుంది, తనకు చూపు పూర్తిగా పోయే రోజు ఎంతో దూరంలో లేదు అని తెలుసు, అందుకేనేమో – ఆమె తను వేస్తున్న ప్రతీ చిత్రం అదే ఆఖరుదన్నట్టు, ఎంతో ఉధృతంగా చిత్రిస్తూ ఉంటుంది! నిజానికి ఆమె చిత్రాలు అన్నీ మాయాజాలం తో నిండినట్లు ఉంటాయి, మనం రోజూ చూసే మనుషులు ఆమె చిత్రాల్లో వింతగా కనిపిస్తారు, నిజానికి ఆమె ఏ ప్రకృతి దృశ్యాన్ని పూర్తిగా చూడలేదు, అయినా తన మనసు కన్ను తో వీక్షించిన అందాలను రంగులనూ తనకు వీలైనంత వరకూ కాన్వాస్ పైన పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆమె వేసిన చిత్రాలు భిన్నంగా వుంటాయి, ఎందుకంటే సృష్టిలో వున్న ప్రతీ రూపాన్ని తనదైన కళ్ళతో చూస్తూ తనదైన రీతిలో ఆమె చిత్రించడమే కారణం! అన్నిటినీ ఆమె అబ్బురంగా చూడటమే కాకుండా, వాటికి పరవశించడమే కాకుండా … వాటిని అద్భుతంగా తన చిత్రాల్లో ప్రదర్శిస్తుంది. ‘కురూపి’ అన్న పదం ఆమె నిఘంటువులో లేదు, ఆమె కున్న కంటి చూపు లోపం, ఆమె విషయంలో ఒక వరం అయి కూర్చుంది.
ఇంకో విషయం, తన చిత్రాలు అమ్మగా వచ్చిన ధనాన్ని ఆమె తనకోసం ఉంచుకోదు, వాటిని తోటి కళాకారులకి బహూకరిస్తుంటుంది.
సాహిత్యంలో ‘magic realism’ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ‘మాయాద్వీపం’ సీరియల్ రచయిత ‘చందమామ’ దాసరి సుబ్రహ్మణ్యం ను ‘కథా మాంత్రికుడు’ అని పిలిచే వారు, హాలీవుడ్ సినిమా ‘avatar’ ఆదరగోట్టింది. చిత్రకళా రంగంలో లిబ్బీ చిత్రాలను, ఆమె చేపట్టిన ప్రక్రియను ఎలా పిలవాలి? ఆమె చిత్రాల్లో ఉన్నది ‘మాయా వాస్తవిత’ అని అనొచ్చా ?
*****