చోముని డప్పు
కన్నడ మూలం : శివరామ కారంత
తెలుగు అనువాదం: శర్వాణి.
-వసుధారాణి
నేలదీ నీటిదీ ఏనాటి బంధమో కాని ,అదే వానచుక్క ,అదే మట్టి వాసన వేల ఏళ్లుగా ఉండివుంటుంది .కొన్ని రచనలు ,కొంత మంది రచయితలు కూడా అలానే మట్టిని ,నీటిని ,బతుకుని అంటుకుని ,పెనవేసుకుని ఎన్ని ఏళ్ళయినా పురాతనమైన మట్టి పాత్రల్లాగా ఆకర్షిస్తూంటారు .జ్ఞానపీఠ్ అవార్డు పొందిన కన్నడ రచయిత శివరామ కారంత అలాంటివారు .అలాగే అనువాదకురాలు “శర్వాణి “గారు కూడా .మూల రచనలు నిలిచినంతకాలం నిలిచిపోయేలాంటి అనువాదాలు అందించిన శర్వాణి నిజ నామధేయం నీలారంభం శారదమ్మ .త్రివేణి -శర్వాణి జంట పదాలుగా 1960 తర్వాత కొన్ని దశాబ్దాలు తెలుగు పాఠకులకు పరిచితమే .త్రివేణి గారి నవలలు మాత్రమే కాక శివరామ కారంత ,ఈశ్వరచంద్ర ,నిరంజన ,మాస్తి మొదలైన వారి రచనలు తెలుగు వారికి అందించడంతో బాటు తెలుగు లో సుప్రసిద్ధమైన రచయితల రచనలు కన్నడంలోకి అనువదించారు.
ఇప్పుడు పరిచయం చేస్తున్న కారంతగారి నవల “చోముని డప్పు ” పుస్తకానికి వస్తే ఈ పుస్తకానికి అన్నీ విశేషాలే .
బాపు కవర్ డిజైన్ మొదటి ప్రచురణ 1978 ,వెల 3.50 రూపాయలు ,పబ్లిషర్స్ :ఎం .శేషాచలం అండ్ కో ,మచిలీపట్నం ,సికింద్రాబాద్ ,మద్రాస్ .ఎమెస్కో పాకెట్ బుక్స్ లో వచ్చిన మొదటి తరం నవలల్లో ఇదీ ఒకటి .కన్నడ లో ఈ నవల1933 లో వచ్చింది.
ఇవన్నీ ఇప్పటికి వింత ,పాతబడిన సంగతులు .ఐతే నవలలో వెన్ను జలదరించే సత్యం అప్పటికీ ఇప్పటికీ ,బహుశా ఎప్పటికీ పాతబడనిది .
“చోముని మనస్సు ఉద్విగ్నమయింది .పన్లోకి వెళుతూనే ఉన్నాడు ,వస్తూనే ఉన్నాడు. పెదవుల మీద లేని నవ్వు తెచ్చుకుంటూనే ఉన్నాడు. కానీ అంతరంగంలో ఎనలేని మత్సరం చోటు చేసుకుంది .మొత్తం పల్లెలోని రైతుల మీదే అతనికి అసూయగా వుంది .ఒకే ఒక్క కారణం కోసం -తనని బతుకంతా కూలీగా బ్రతకమని నిర్దేశించి , వాళ్ళంతా వ్యవసాయదారులుగా ఉన్నందుకు. వ్యవసాయం చేస్తున్న వారికి దొరికే స్వర్గసౌఖ్యాలేమిటన్న ఆలోచన లేదతనికి .అది స్వర్గం కానీ ,నరకం కానీ తనకీ ఎందుకు దొరకకూడదన్నదే అతని వాదన .”
శివరామ కారంత శర్వాణి ఎటువంటి ముందుమాట లేకుండా నవలలోని సారమంతా రచయిత ఈ ఒక్క పేరాలో గుప్పించి మొదలుపెట్టిన నవల .పై పేరాలో నవలేంటో ,పోరాటమేంటో ,నిమ్నవర్గం ఆరాటాలేంటో తెలిసిపోయే విధంగా రచయిత “చోముని డప్పు” నవలలో ఓ శంఖనాదం చేసినట్లు అనిపించింది నాకు.
కథ :- గట్టిగా అరవై గడపలు దాటని చిన్న పల్లె భోగన పల్లె ,నిశ్శబ్ద నిశీధి సమయాన ఆ ఊరందరికీ అలవాటయిన శబ్దం చోముని డప్పు .సారాయి తాగి వాడు డప్పు వాయిస్తూంటాడని అనుకుంటారు అందరూ .అయితే చోముడు తన డప్పును తన ఉద్వేగాలకు ప్రతిరూపంలా వాయిస్తూంటాడు. ఆనందం ,దుఃఖం ,ఉక్రోషం ,కసి ,కోపం ఏ ఉద్వేగం కలిగినా అతడు వాయించేది డప్పే !అతనిలోని తిరుగుబాటుకు సంకేతం ఆ డప్పు .
ఊరివారికి చోముని డప్పులో పెద్ద విశేషమేమీ లేదు .అతడి బ్రతుకులో విశేషం ఉంటే కదా ? చోముడు నిమ్నజాతివాడు .భోగనపల్లె అడవిప్రాంతంలో అతనికి ఓ “కొప్ప ” ఉంది. కొప్ప అంటే ఓ చుట్టు గుడిసెలాంటిది .అక్కడున్నది అయడూ అతని ఐదుగురు పిల్లలూనూ ,ఇంకా చెప్పాలంటే ఓ నల్ల కుక్క ,రెండు ఆవు దూడలు .ఇవే అతడి బలగం .అతని వయసు అతనికే తెలియదు.’
గుళిక (ఓ క్షుద్ర దేవత )ఉపద్రవంతో అతని ఇంటిది చనిపోయి ఐదేళ్లు అవుతోంది .చనియ చోముడి పెద్ద కొడుకు ,గురవడు రెండో కొడుకు .బెళ్ళి అతని కూతురు ,ఆమె అంటే ప్రాణం చోముడికి .ఆమెకంటే చిన్నవారు ఎనిమిదేళ్ల కాళ ,అతనికంటే రెండేళ్ళు చిన్నవాడు నీల .ఇదీ అతని సంసారం. ఇక్కడ శర్వాణిగారు ఓ చక్కని ,లలితమైన పదం వాడారు. “చోముడి కుటుంబంలో పూరేకుల్లో ఉన్నంత అన్యోన్యత ఉంది “అని .ఓ కుటుంబాన్ని ఇలా పోల్చడం నేనెక్కడా చూడలేదు .
చోముడు ఆ ఊళ్ళోని పెదకాపు సంకప్పయ్యగారింట మూలపు పాలేరు. మూలపువాడంటే ఆ ఇంటి యజమాని అనుమతి లేకుండా ,ఇతడుగానీ ఇతడితరంవారు కానీ మరో యజమాని ఆశ్రయాన్ని లాభానికైనా ,నష్టానికైనా పొందకూడదు . యజమాని కూడా ఏ పరిస్థితి లోనైనా (అప్పూ సొప్పూ ఉన్నా సరే ) చోముడ్నీ ,అతని సంతతివారినీ కనిపెట్టి పోషించవలసిందే.
వారి వర్గంలోవారికి సర్వ సాధారణమైన కల్లు అలవాటు చోమునికీ వుంది .కుటుంబంలో కాళ ,నీల ఇద్దరూ రోగిష్టి పిల్లలు .చనియ ,గురవ ఇద్దరూ తండ్రి చేసిన నాలుగు రూపాయల అప్పు ముప్పై ఐదు రూపాయలుగా పెరగడంతో (నవల రచనాకాలం 1930 దశాబ్దమని గమనంలో పెట్టుకోవాలి పాఠకులు) , కాఫీ తోటల్లో కూలికి వెళతారు ఆ అప్పు చెల్లించేందుకు .గురవడు అక్కడ కూలికి వచ్చిన మరో పిల్లతో ప్రేమలో పడి వారితో వెళ్ళిపోతాడు.
చనియ ఆ విషయం తండ్రికి తెలియజేసి జ్వరంతో చనిపోతాడు ,కొండప్రాంతాల్లో చలిజ్వరాలు సహజమే కదా ?.చోముడు తొలిసారిగా చేతికందివచ్చిన ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకుని కుంగిపోతాడు .యజమాని పొలంలో చాకిరికిచ్చే సోలెడు వడ్లు తెచ్చి ,దంచుకుని గంజి కాచుకుంటే అదే ఆ కుటుంబానికి ఆధారం .ఇక అప్పు ఎలా తీర్చడం ?
చిన్నవిగా దొరికిన ఎడ్లజతను పెంచి పెద్ద చేస్తాడు చోముడు. వాటిని ఎప్పటికైనా అరకకు కట్టి స్వంతంగా వ్యవసాయం చేయాలని అతడి కోరిక .యజమానిని కౌలుకి భూమి ఇమ్మని అడుగుతాడు .నిమ్నజాతివాడికి స్వంత భూమి దున్నుకునే హక్కు లేదని వొప్పుకోదు యజమాని తల్లి .
పక్క ఊరి పాద్రిని కలిసి భూమి ఇమ్మని అడుగుతాడు చోముడు .మతం మారితే ఇస్తానంటాడు పాద్రి .ఆ పని చేయడం ఇష్టం లేక నిరాశతో ,కొడుకు పోయిన దుఃఖంతో డప్పు వాయించుకుంటాడు .ఏదైనా మర్చిపోవడానికి అతడికున్న మార్గం అదొక్కటే .
కాఫీ తోటల అప్పు తీర్చమని మన్వేలుడు మళ్లీ వస్తాడు .తండ్రి అప్పు తీర్చడానికి సిద్ధపడి బెళ్ళి ,నీలడ్ని తీసుకుని కాఫీ తోటల్లో పనికి వెళ్తుంది .కాఫీతోటల యజమాని కన్ను బెళ్ళి అందంపై పడుతుంది. ఆమె కూడా వయసు కోరికలకు లొంగి పోతుంది .త్వరితగతిన అప్పు తీరిపోయి ,బెళ్ళి తమ్ముడితో వెనక్కి వస్తుంది .చోముడు అప్పు తీర్చేసినందుకు సంబరపడి ఆమెకు పెళ్లి చేయాలనుకుంటాడు .కానీ దానికీ అడ్డంకులు వస్తాయి .
ఓరోజు చోముడు కాళ ,నీలల్ని దగ్గర్లోని ఏటికి స్నానానికి తీసుకుని వెళ్తాడు .వారి తల జిడ్డుని రుద్దడానికి ఏదో ఆకూ అలమూ తీసుకురావడానికి పొదల్లోకి వెళ్తాడు .ఆలోగా నీళ్ళలోకి దిగుతారు ఇద్దరు పిల్లలు .ఈత వచ్చిన పిల్లలు కేరింతలు కొడుతూంటే , అగ్రవర్ణాల వారు పై ఎత్తున బట్టలు ఉతుక్కుంటూంటారు .దురదృష్టవశాత్తు నీలడు నీళ్ళలో జారి మునిగిపోతాడు. కాళ వొడ్డెక్కి భయంతో వేసిన కేకలు విని చోముడు పరుగులు పెడుతూ వస్తాడు ,కానీ అతడికీ ఈత రాదు .అక్కడే వున్న ఓ బ్రాహ్మణ యువకుడు నీళ్లలో దిగబోతే వాడి పెద్దవారు అడ్డుకుంటారు ,నిమ్నజాతివాడిని తాకరాదని .చోముని కళ్ళెదురుగానే నీలడు నిస్సహాయంగా మరణిస్తాడు .తమ బ్రతుకు ఎంత నికృష్టమైనదో చోముడికి అర్థమవుతుంది నీలడి శవం మట్టిలో కలిపి వేశాక .మర్నాడు ఉదయమే చోముని డప్పు మోగుతుంది .వయసు మీదపడుతున్నకొద్దీ చోముడు సంసారభారాన్ని మోయలేడని ,ఓటమి ,చావులు అతడి బరువును తగ్గిస్తున్నాయి .
బెళ్ళి కోలుకుని ఏడుపునుండి బయట పడుతుంది .చోముడికి మళ్లీ వ్యవసాయం చేయాలనే కోరిక తొలుస్తుంది .సంకప్పయ్యగారి ఇంటిముందు ప్రాణాలు తీసుకున్నా తన కోరిక తీరడం కష్టం అనుకుంటాడు .బెళ్ళి కూడా తండ్రిని ప్రేరేపిస్తుంది :”మనమిక పాద్రీ మతానికి చేరితేనేం ?అప్పుడైనా నీకు నాగలి పట్టే యోగం పట్టవచ్చు “అని.
గురవన్నని తీసుకు రమ్మని తండ్రిని అడుగుతుంది బెళ్ళి .చోముడు బయటకు వెళ్ళడం గమనించిన మన్వేలుడు ఇంట్లోకి చొరబడుతాడు .ఊరి బయటకు వెళ్ళే త్రోవలో గ్రామ దేవతకు అలవాటు చొప్పున దండం పెట్టుకున్న చోముడికి మతం మారడానికి భయవేసి వెనుతిరుగుతాడు .ఇంట్లోకి వచ్చేసరికి మన్వేలుడు ,బెళ్ళి చనువుగా ఉండడం కనిపించేసరికి చోముడు కోపంతో ఊగిపోతాడు. కూతురి జుత్తు పట్టుకుని గుడిసె బయటకు లాగి పారేస్తాడు .కానీ బెళ్ళి ఇలాంటి తప్పు ఎందుకు చేసింది ,త్వరత్వరగా ఆమె తీర్చేసిన అప్పు ,పెళ్ళీడుకు వచ్చినా తను కూతురికి పెళ్లి చేయకపోవడం గుర్తొచ్చి లోపల్లోపల కోపం ,నైరాశ్యం అన్నీ చేరి డప్పు తీసుకుని ఎన్నడూ వాయించనంత గొప్పగా వాయిస్తాడు.అలాగే నేలకొరుగుతాడు. బెళ్ళి ,కాళ అతడి చుట్టు చేరతారు.
కారంతగారు రాసిన నవలల్లో ,నాకు తెలిసి ఇది చిన్ని నవల ,120 పేజీలు .ఐతే ఇది లేవదీసే ప్రశ్నలు,
పూరించలేని సమాధానాలు వేల పేజీల పైమాటే !
పేదరికం ,సారా వ్యసనం ,చుట్టాల ఎదుట ఉత్తుత్తి మర్యాదలు ,నిమ్నకులంలో పుట్టామన్న కించ .
ఐతేనేం అన్న తిరుగుబాటు ధోరణి .
రచయిత దీనిని ఓ నవలలా కాక ఓ దృశ్యకావ్యంలా చిత్రించారు .ముఖ్యంగా వారి ఇంటి పరిస్థితులు వర్ణించేటప్పుడు ,చనియ గురవలు కాఫీతోటలకు చేసిన మూడు రోజుల నడక ప్రయాణ చిత్రణ ,మనుష్యుల క్రూరత్వం నిస్సహాయత ఆవశ్యకత దోపిడీ దౌర్జన్యం దైన్యం అన్నింటినీ కేవలం అక్షరాలతో చూపడం అద్భుతం .
ఇక్కడ శర్వాణిగారి గురించి చెప్పుకోవాల్సిన విషయం :చోముని డప్పు సరాసరి తెలుగు నవలేమో
అన్నంత సరళంగా లలితంగా అనువాదం చేశారు.
తెలుగు ఆవిడ మాతృభాష కాకున్నా ,మెట్టినిల్లు తెలుగునాట కావడం వల్ల చక్కని తెలుగు నేర్చుకుని
ఎన్నో రచనలను మాతృభాష కన్నడం నుండి తెలుగుకూ , తెలుగునుండి కన్నడంలోకి చేయడం సంతోషకరం .
నవలలోని కొన్ని సంఘటనలను యథాతథంగా ఇస్తున్నాను ,చూడండి :-
” చోమా ,మా ఇంటి గేదె చచ్చిపోయింది ,వచ్చి తీసుకుని వెళతావా ? “అన్నాడు వ్యవసాయదారుడు
లోలోన చోముడు సంతోషించాడు .పైకి మాత్రం అదేం చూపించకుండా “ఇంటినుండా చుట్టాలు, ఎలా రావడం ?” అన్నాడు .
“మంచిదే కదా ,విందు చేసుకోవచ్చు “
“నిజమే ,ఉట్టి మాంసంతో పని జరగదే ,మిగతా వస్తువులకేం చేయను ?చేతిలో పైసా లేదు .”
“సరే ,నాలుగణాలు ఇస్తానురా “
ఎగిరి గెంతేశాడు చోముడు .చుట్టాలనీ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాడు .వెంటనే గేదెను మోసుకొచ్చి ,చర్మం వొలిచి మాంసం రాశి వేశారు ,ఎనిమిది మంది కాదు ,ఇంకా ఏభై మంది వచ్చినా చాలు ఆ మాంసం . “
వారి ఇంటి పరిస్థితి చెబుతూ :- “ఇంట్లో అందరూ వొళ్ళు దాచుకోకుండా పని చేస్తే శేరుసోలెడు వడ్లు దొరుకుతాయి .వడ్లు దంచి ,చెరిగితే అర్దశేరుకన్నా ఎక్కువ బియ్యం రావు .అర్దశేరు బియ్యంతో ఆరుగురి
కడుపులు నిండాలి.అంతా సరిగ్గా ఉన్న రోజున బెళ్ళి అర్దశేరు బియ్యాన్ని ఉడికించి గిన్నెనిండా గంజి కాస్తుంది .దాన్ని తాగి పన్లోకి వెడితే రెండో భోజనం సాయంత్రం పొద్దుగూకే ముందే .చీకటి పడ్డాక గుడిసెలో దీపం వెలిగించడమన్న మాటే లేదు .దీపం వెలిగించడానికి వాళ్ళేమీ శ్రీమంతులు కారుగా !
ఈ సంపాదనలోనే చోముడికి కల్లూ కావాలి . “
పై రెండు సంఘటనలు చాలు వారి దుర్భర జీవన చిత్రం అర్థం అవ్వడానికి .1933 లో కారంతగారు రాసిన నవల ,1978 లో శర్వాణిగారు తెలుగులోకి అనువదించిన ఈ నవల పాత వాసన రాలేదు కాని నాకు మట్టి వాసన ,చోముడు మంటపై కాల్చుకున్న డప్పు వాసన వచ్చింది .ఆకలిని అక్షర రూపంలో ,తిరుగుబాటుని డప్పు రూపంలో చూపిన విధానానికి ఓ పూట నా ఆకలి నశించి బాధ మిగిలింది.
అందుకే మొదటే చెప్పాను ,ఇది అప్పటికీ ,ఇప్పటికీ ,బహుశా ఎప్పటికీ నిలిచిపోయే నవల అని .
“చోముడు ఉద్రేకంతో,బాధతో నాగలిని ముక్కలు చేసి కాల్చివేయటం,డప్పు పగలగొట్టి మంటల్లో వేయటం.అతను ఏభూమి తనది అనిపించుకొని కనీసం నాలుగు శేర్ల వడ్లు సొంతంగా పండిద్దాం అనుకున్నాడో పండిచలేకపోవటం వల్ల బాధ.కొన్ని హక్కులు,ఫలాలు కొందరికే అందటం మీద సంధించిన ప్రశ్న.ఇపుడు భూమి సాగు చేయటం అన్న హక్కు అందరికీ వచ్చి ఉండవచ్చు.కానీ ఇప్పటికీ కొన్ని కొందరి గుత్తాధిపత్యంలోనే ఉన్నాయి.అతను వదిలివేసిన ఎడ్లు వచ్చి అతని వాకిట్లో నిలబడటం.డప్పు ఆగిపోగానే బెళ్ళి పరుగున వెళ్లటం.ఎడ్లు,కుక్క ,బెళ్ళి వీరి మీదనే చోముని చావు ప్రభావం చూపినట్లు రచయిత సృష్టిస్తారు.”
1975 లో కన్నడలో సినిమాగా వచ్చిన ఈ నవల.B. V. కారంత్ కు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది.చోమునిగా నటించిన M. V వాసుదేవరావు ఉత్తమ జాతీయ నటునిగా ఎన్నిక అయ్యారు.శివరామ కారంత స్ర్రీన్ ప్లే రాశారు.ఈ చిత్రం ఎన్నో కన్నడ ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకుంది.
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.
చోముని డప్పు కథ, బాగుంది, సమీక్ష అంతకన్నా బాగుంది.. మొదటిసారి ఈ కథ మేము చదవడం, అభివందనలు.💐
థాంక్యూ పద్మావతి గారు..నిజంగానే అన్ని కాలాలకు పనికి వచ్చే నవల్స్
Your review is accurate Vasudha garu. When Sarvani aunty was translating this book, she happened to be with us for some time. Along with my mother, I too had the privilege of writing few pages in telugu for her. 😊
థాంక్యూ శ్యామల గారు
మరింతమంది కి చదవాలనే ఆసక్తి పుట్టించేలా రాసిన అద్భుతమైన సమీక్ష. మీరు చెప్పినట్టు ఎన్ని దశాబ్దాలయినా మనసుని మథించే కథావస్తువు… కథనం… శైలికూడా.
అభినందనలు వసుధగారూ!
ఉమగారు మీరు ఈ అనువాదం తో ప్రత్యక్ష సంబంధం కలిగిన వ్యక్తిగా ఈ సమీక్షను మెచ్చుకోవటం నాకు మరింత సంతోషం కలిగిస్తోంది
మర్చిపోయిన నవలనీ ,దాంతో నాకున్న జ్ఞాపకాలను పైకి తీశారు వసుధా రాణిగారూ .రచయిత సమాజంలో ఉన్న అసమానతల్నీ ,దుఃఖాలనూ విస్మరించి జీవించలేడన్నదానికి తార్కాణం ఈ నవల .మంచి పరిశీలనాత్మకమైన సమీక్షకు అభినందనలు.
అవును కల్యాణిగారు కొన్ని కథలు,కొన్ని సమస్యలు ఎప్పటికీ అలానే ఉండి పోతాయి.చదువుతున్నంత సేపూ ఆ రోజుల్లోకి, ఆ పరిస్థితులకి వెళ్లి పోయాను నేనయితే