జగదానందతరంగాలు-1

ఎంత బెంగనిపిస్తుంది?

-జగదీశ్ కొచ్చెర్లకోట

 

ఎంత బెంగనిపిస్తుంది? నీగది రేపట్నుంచి నీదికాదు. 

అక్కడికి తాతగారి సామాన్లవీ వచ్చి చేరతాయి. 

ప్రయాణం ఖరారైన తరవాత నీపుస్తకాల గూడొకసారి తెరుస్తావు. 

వ్యాపకానికి కాదు. జ్ఞాపకాలకోసం!  లెక్కల పుస్తకం తెరిస్తే లెక్కలేనన్ని మధురానుభూతులు!

స్నేహితులతో అరకు వెళ్ళినపుడు కొన్న నెమలీకల విసనకర్ర మొత్తం పాడైపోయినా ఒక పింఛాన్ని అత్యంత శ్రద్ధగా దాచుకున్నావు.

గుర్తుందా? దానికోసం తాటాకుల్లోంచి మేతకూడా తెచ్చిపెట్టావు. 

నీపేరు కనుక్కోమని మొదటి పేజీ నుంచి ముప్ఫయ్యారో పేజీ దాకా 

నడిపించి ఏడిపించి చివరికి అట్టమీదే వుందని ప్రింటింగ్ ప్రెస్ వాడి పేరేదో చూపించావు. అదిప్పుడు చూస్తే అంత ఏడుపులోనూ నవ్వొస్తుంది. 

స్నానాల గదిలో అద్దంనిండా నువ్వంటించిన బొట్టు బిళ్ళలు కన్నీటిబొట్లవుతాయి…నువ్వెళిపోతున్నావని!

నువ్వేసుకున్న ఓణీలన్నీ దండెం మీద దండన అనుభవిస్తున్నట్టు వేలాడుతుంటాయి.

ఉయ్యాలూగిన చెట్టుకొమ్మల్ని చూస్తే మనసు డోలాయమానమౌతుంది..

‘పోనీ వుండిపోతే?’ అనిపించేస్తుంది!

తెల్లారే బామ్మకోసం నువుకోసే నందివర్ధనాలు రేపట్నుంచి ఎవరొస్తారని నిలదీస్తాయి.

పనిపిల్లతో కలిసి బీడీకాల్చిన పంపరపనస చెట్టుకింద దొంగచాటు 

అల్లరికి నువ్వేసిన శంకుస్థాపన రాయి కనబడుతూంటుంది.

టైలరు మంగరాజు ఇంటికెళుతూ పలకరిస్తే నీకేడుపొచ్చేస్తుంది. 

అక్కడికి ఇకనించి నీకెవరూ బట్టలు కుట్టరేమో అన్నట్టుగా!

నీసైకిలుకి డైనమో వేయించుకుని నెలన్నా తొక్కకుండానే 

మెళ్ళో డైనమోలా ఈతాళిబొట్టు!

గుంభనంగా తిరుగుతున్న అమ్మకళ్ళు తాటిముంజల్లా వుంటాయి. 

ఏమాత్రం కదిల్చినా నీళ్ళొచ్చేస్తాయి.

ఎంత ప్రయత్నించినా నాన్న మొహంలో గాంభీర్యం రావట్లేదు. 

ఎవరూ చూడకుండా తడిసిపోయిన కండువాల్ని మార్చేస్తున్నాడు.

ఏమీ ఎరగని పిల్లిపిల్లమాత్రం పాలకోసం నీవైపు తలెత్తిచూస్తుంది. 

దానికి నీ కన్నీళ్ళు కూడా ఆనందబాష్పాల్లానే అనిపిస్తాయి.

ఇంట్లో ఏమూలకెళ్ళినా పెళ్ళివాసన! 

మర్చిపోదామన్నా వదలని పరిమళం! 

కర్పూరదండలు, నేతిలడ్డూలు, విస్తరాకుల వాసనలన్నీ 

నిన్ను వెంటాడి నీకు పెళ్ళయిపోయిందంటూ 

అనుక్షణం గుర్తుచేస్తుంటాయి. 

నిద్రలోకూడా సూత్రాల శబ్దానికి ఉలిక్కిపడి లేచిపోతావు!

కొంపలంటుకు పోతున్నట్టు ఇంటి ముందాగిన రిక్షాని చూస్తే 

ఆ రామూగాణ్ణి చంపెయ్యాలనిపిస్తుంది. 

‘అంత తొందరేం?’ అనిపిస్తుంది! 

ఆలస్యమవుతోందని ఎవరన్నా అంటే కస్సుమనే నీ అరుపు

నీకే అసహ్యంగా వుండి, తెలిసిపోతుంటుంది.

గుమ్మాలకున్న మావిడాకులు మూడోరోజుకే మొహం వేలాడేస్తాయి. 

నీ నవ్వుతోనే అవి తాజాదనాన్ని పులుముకునేది!

నీచేత ఏపెట్టీ మోయించనివ్వని ‘ఆ’ ప్రత్యేకత 

ఒళ్ళుమండిపోయేలా చేస్తుంది. ఎవరినైనా కొట్టాలనిపిస్తుంది.

‘అప్పుడే వేరుపెట్టేసారా?’ అంటూ కడుపారా ఏడవాలనిపిస్తుంది.

రిక్షాలో పెట్టిన అడుగు నీకే భారంగా తోస్తుంది. 

‘వచ్చే ఏడాదికల్లా పండంటి….’ అన్న దీవెన 

పూర్తిగా వినాలనికూడా అనిపించదు.

‘వద్దులే! ఉండిపో!’ అనెవరైనా అనకపోతారా 

అనే ఎదురుచూస్తుంది వెర్రిమనసు!

అదిగో….ఆక్షణం నీచేతిమీద ఒకచెయ్యి మృదువుగా పడుతుంది. 

నీకిక అమ్మా, నాన్న, పిల్లిపిల్లా, నందివర్ధనం చెట్టూ నేనే అంటూ!

ఆ ధైర్యం నీకు కన్నీళ్ళని ఎండిపోయేలా చేస్తుంది. 

ఆ భుజమ్మీద వాల్చిన తల తియ్యాలనికూడా 

మర్చిపోయేలా నిదరొచ్చేస్తుంది.

మనిషినైతే అప్పగించేస్తారు!

మనసుని అప్పగించాలంటే మమకారం అడ్డొస్తుంది.

అది అవతలివాడి సహకారంతోనే సాధ్యమవుతుంది!

వెన్నెలా, గోదారీ…పడవా, పాటా…తనూ, నువ్వూ…

‘నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో?

నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు!’

అనేస్తే నీకిక మనసూ అప్పగించెయ్యాలనిపిస్తుంది!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.