జానకి జలధితరంగం-4

-జానకి చామర్తి

సత్యభామ

మగువలు నేర్వని విద్య గలదే ముద్దారనేర్పించగన్ , యుద్ధవిద్య మాత్రం తక్కువా..ఆనాడే నిరూపించేసింది సత్య. ఆత్మాభిమానం , పట్టుదల , అనురాగం , చిటికెడు అతిశయం , గోరంత గర్వం (supiriority) , సమయస్పూర్తి, ధైర్యం ..ఈ కాలం ఆడవారికి ఆద్యురాలు కాదూ ఆ శ్రీకృష్ణుని ముద్దుల భార్య . 

సాక్షాత్తు కృష్ణ భగవానుడే మెచ్చాడు , ఆవిడ సహకారం పొందాడు , ఆవిడకి విలువ, గౌరవం ఇచ్చాడు. మగవారు ,   ఆడవారి లోని గొప్పదనం ,నేర్పు, ప్రత్యేక లక్షణాలు గుర్తించడం, గౌరవించడం శ్రీకృష్ణుని ద్వారా నేర్చుకోవచ్చును. సత్యభామా కృష్ణులే  తమ అనురాగం తో స్వయంగా దారి చూపారు. సత్యభామ తన తప్పులు తెలుసుకుిని సరిదిద్దుకోవడం లో కూడా మనకి ఆదర్శమే.

సత్యభామ అంటేనే ఒక కావ్యనాయిక  ప్రత్యేకంగా గుర్తు ఉంటుంది మనకు , బహుశా స్త్రీ కుండవలసిన అన్ని లక్షణాలు , అందం మే కాక బలహీనతలు వాటిని ఒప్పుకుని సరిదిద్దుకునే తెలివితేటలు ఉండటం వల్ల మనకి మరింత ఇష్టురాలయ్యింది. ముఖ్యముగా ఆమె ఒక ధీరవనితగా, భర్త పట్ల చూపిన అనురాగం , బాధ్యత ఎరిగిన ఇల్లాలు గా మనకి ఆదర్శం.

నరకుడనే నల్లని చీకటులు తొలగించి  , చల్లని దీపాల వెలుగులు ఇంటింటికి నింపిన ఆ సత్యాకృష్ణుల అనురాగం మనకి ఆదర్శం.

సత్య నేనూ వస్తానంది.. ముచ్చటపడతోందని సరే అన్నాడు , కృష్ణభగవానుడు. అయినా సత్య ఏవన్నా కృష్ణుడు కాదనడులెండి,  సత్యా ప్రియుడు , ఆమెకి అతను దేవుడు.కాని చెప్పాలి కాబట్టి చెప్పాడు, అదేమైనా ఉద్యానవనవిహారమా.. యుద్ధరంగం అని. 

కట్టింది ఎర్రచీర, పెట్టింది కొప్పున పింఛం తాను కూడా కృష్ణమ్మలా, 

కన్నుల ఎరుపు.. అది ఆడపిల్లల ఉసురు పోసుకున్న అసురుని మీద కోపపు గుర్తు, కాటుక చీకటి చీల్చుకు వచ్చే సూర్యుని రంగు

మాటకే రోషంతో  ఎర్రబడే ముక్కు, మెరిసే రత్నం లా ఉంది

దిద్దిన కాటుకరేఖ విల్లులా సాగింది, 

నుదుట తిలకం ఎక్కుపెట్టబోయే బాణంలా ఉంది

పట్టుదలతో బిగించిన పెదవులు , పంతపు చూపులు ,  

అవన్నీ చూసి రావద్దంటే యుద్ధం ఇక్కడే .. అసలు తమిద్దరకే.. 

జరిగేస్తుందేమో అనుకున్నాడు దేవదేవుడు.

కొండంత దేవుడు మీరు అండన ఉండగా.. నాకేం.. అంది సత్య.

చాలు ఆ మాట చాలు . బయల్దేరమన్నాడు..

ముద్దు ముచ్చటగా యుద్ధం చేసింది, విశ్రాంతి నాకంటూ , తలకింద చేయుపెట్టి వెనక్కి వాలి కూచుని, దొంగ చూపులు చూస్తూ మరీ మురిసిపోయాడు కన్నయ్య, ప్రియమైన చెలి రణరంగవిహారాన్ని, పూలబంతులు విసిరే ప్రణయ పందెము లోనే కాదు, ప్రాణ రక్షణకి, దుష్ట శిక్షణకు వెనుకంజ వేయనది నా భార్య అని.

భువి మీద జీవితాలను అల్లకల్లోలము చేసి, తిమిరము ను సృష్టించే తిమ్మిరి గల వారిని, దానవులను యుద్ధము లోఎదుర్కొనగల సత్య ధైర్యము , చొరవ , యుద్ధ నైపుణ్యము ..

.భార్యామణి గొప్పతనం ప్రపంచానికి తెలియచేసి ప్రోత్సాహించే, కృష్ణుడు లాటి మహానుభావుడికి వందనం వందనం. 

నరకుడు అంటే భయము ,చీకటి, అజ్ఞానము, అధైర్యము.

సత్య భామ అంటే నిర్భయ, వెలుగు, తెలివి మరియుధైర్యము.

సత్యభామ ధైర్యం , ముచ్చటైన దాంపత్య నైపుణ్యం .. , అలా అన్నిటినీ సమన్వయము చేయగలవారు ఇప్పటి చాలామంది ఆడపిల్లలు అని ఖచ్చితంగా చెప్పచ్చు  .సత్యభామ గడుసుదనం , సమయస్పూర్తి, భర్తతో అనురాగంగా నడుచుకోవడం , ఏదైనాసాధించుకోగలనేర్పు .. ఇప్పటి అమ్మాయిలకు ప్రత్యేకించి నేర్పనవసరం లేదు ,పరిస్థితులను అర్ధం చేసుకునే నేర్పు గల  వారు , ఇట్టే అల్లుకుపోగలరు. 

యుద్ధ విద్యలలో ఉత్సాహము చూపుతున్న ఆడపిల్లల సంఖ్య పెరుగుతోంది,  స్వయం రక్షణ విద్యలైన కరాటే , కుంగ్ఫూ తదితర విద్యలు నేర్చుకోవడం పట్ల కూడా ఆసక్తి , అవసరమనుకునే ఆలోచన పెరుగుతున్నాయి ఆడపిల్లలలో..ఈవిద్యలు నేర్చుకోవడమే కాక , తమ తతిమ్మావారి రక్షణకు ఉపయోగిస్తున్నారు వారు.

మిలటరీ లో చేరి దేశం రక్షించాలన్న తపన కలిగి ఉండటమే గాక , అవలీలగా పైలట్ విద్య నేర్చి విమానాలు నడుపుతున్న వనితలను చూస్తుంటే..కృష్ణుడికి రధ సారధ్యం చేసిన సత్య గుర్తుకురాదూ మనకి . 

శత్రువును అందునా  పదహారు వేల ఆడపిల్లలను బంధించి భూమికి భారమయ్యిన నరకాసురుని చంపడానికి ఆత్రపడిన సత్యభామ ల వంటివారే , ఇప్పటి వనితామణులు కూడా , నిస్సహాయులైన ఆడపిల్లల పట్ల జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడంలోనూ.. ఉద్యమాలు ద్వారా, తమ సహకారమూ వెల్లడించడము చూస్తుంటే..

సంసారజీవితంలో కూడా అనురాగమనే ఆయుధం ప్రయోగించి , భర్తలను జయించడంలో వారికి సత్యయే ఆదర్శం . తమ తెలివి ధైర్యం అవసరానికి సాయపడటం , అన్యాయన్ని ఎదుర్కోవాలనే ఆవేశం ప్రదర్శస్తూనే, ముచ్చటైన మమకారం కూడా తమ వారి పట్ల చూపించగలగడం.. వీరు సత్యభామలా ప్రత్యేకమైన స్త్రీలు.

ఆరోగ్యకరమైన పోటీ ప్రదర్శించడంలో కూడా సత్యభామలాగానే.. అది అసూయా అని అనుకోవక్కరలా.. తమ ప్రతిభ ను నిరూపించుకునే క్రమంలో , తమ తోటి వారితో పోటీ పడటమే అంతే. ఎదుగుదలకి కొద్దిపాటి అసూయ కలిగి ఉండటం , ఉన్నతిఖరాలకు చేర్చే దారే, అవును సత్యభామే చెప్పింది, చాలా కాలం క్రితం కదా!

అందమే కాదు , తెలివే కాదు , మనుషులను సామాజిక పరిస్ధితులను అర్ధం చేసుకోవడమే కాదు , జీవిత భాగస్వామిని తమ అనురాగంతో జయించడమే కాదు, తన వారిని రక్షించడానికి , దుర్మార్గాన్ని జయించడానికి ఆయుధాలు చేపట్టి రణరంగంలో దూకి, శత్రువులను జయుంచగల ధీర లు , తప్పకుండ , ఇప్పటి మన ఆడపిల్లలు .. సత్య భామలు..!

*****

Please follow and like us:

2 thoughts on “జానకి జలధితరంగం-4”

  1. కావ్యనాయకి అంటే సత్యభామే.. రుక్మిణీ కల్యాణం లో రుక్మిణి కంటె కూడ నరకాసుర వధలో సత్య పాత్ర ను పోతన అద్భుతంగా రమణీయంగా వీరనారిగా చిత్రించాడు..

    పరిస్థితులకు తగిన విధంగా జానకి చామర్తి గారు సత్యభామ పాత్రను విశ్లేషణ జరిపిన విధం చాల మనోహరంగా ఉంది.. నేటి కాలానికి అనుగుణ్యంగా తెలుగు నుడికారంతో వారు రాస్తున్న కావ్య నాయికల portraits చక్కగా చదివింప చేస్తున్నాయి. వారి నుండి మరిన్ని చక్కని రచనలకు ఎదురు చూస్తున్నాను..
    వారికి మనః పూర్వక అభినందనలు.

  2. చాలా చక్కటి రచన…. ఇప్పటి మన ఆడపిల్లలు సత్యభామలే …. అంటూ అమ్మాయిల మీద మరింత మక్కువ పెంచారు.. నాకు చాలా నచ్చింది జానకి గారు

Leave a Reply

Your email address will not be published.