నా జీవన యానంలో- రెండవభాగం- 8
-కె.వరలక్ష్మి
గ్రంథాలయంలో పుస్తకాలన్నీ పాతవైపోయాయి. కొత్త పుస్తకాలేవీ రావడం లేవు. అమ్మాయిలంతా కొత్తనవలల కోసం అడుగుతున్నారట. అందుకని శివాజీగారు పుస్తకాలు చదివే అందర్నీ కొంతకొంత వేసుకోమని, ఆడబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేరు. వాటిని విడిగా ఓ బీరువాలో సర్ది, ప్రత్యేకంగా ఓ రిజిస్టరు పెట్టేరు. నా చిన్నప్పటితో పోల్చుకుంటే పాఠకులు బాగా పెరిగేరు. ముఖ్యంగా ఆడవాళ్లు, కొత్త పుస్తకాలకి రోజుకి అర్ధరూపాయి రెంట్ అని గుర్తు. అప్పుడప్పుడే యండమూరి, మల్లాదిల నవలలు వస్తున్న రోజులు. నేనేమో రంగనాయకమ్మగారివి, వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచనల నవలలు అడిగేదాన్ని. ‘‘మీరొక్కరే వాటిని అడుగుతారండి, కాని, మెజారిటీ పాఠకులు చదివే పుస్తకాలైతేనే వెళ్తాయి’’ అనేవాడాయన.
మొదలు పెట్టగానే అది చదవదగిందో కాదో తెలిసిపోయేది. అమ్మాయిల దృష్టి సులోచనారాణిగారి మీదినుంచి యండమూరి మీదికి మళ్లింది. నేనొకటి గమనించేను, ఇదివరకు రచయితల రచనలు పత్రికల్లో వచ్చిన చాన్నాళ్లకు గాని పుస్తకాలుగా వచ్చేవికావు. కానీ, కొత్త రచయితల రచనలు పత్రికలో ఆఖరి ఎపిసోడ్ అచ్చయ్యేసరికి మార్కెట్లో పుస్తకం రెడీగా ఉండేది.
ఒక పక్క ఎం.ఎ. చదువు, మరోపక్క స్కూలు వర్క్ బిజీ, పిల్లల్ని చదివించడం, అన్నిటికన్నా ముఖ్యమైన ఆకర్షణ గ్రంథాలయంలోని పుస్తకాలు, మరోపక్క స్కూలు పిల్లలకి వీణపాఠాలు, నా సంగీత సాధన –రోజుకి 24 గంటలు కాక మరికొన్ని గంటలుంటే బావుండునన్పించేది. ఒక కలల ప్రపంచంలో మునిగితేలుతున్నట్టుండేది. ఒక భావుకత ఏదో నన్నావరించుకుని ఉండేది. కష్టాలు కష్టాలుగా అన్పించేవి కావు. నా కన్నీళ్లు నేనే తుడుచుకోవడం నేర్చుకున్నాను. నా కన్నా పెద్దవాళ్లంతా ఎంతో అభిమానంగా చూసేవాళ్లు. ‘‘మీకేంటండి, అదృష్టవంతులు’’ అనేవాళ్లు. నాకు తెలీకుండానే నాలో ఆత్మస్థైర్యం ఏర్పడింది. నాతో బాటు కొందరికి జీవికను కల్పించడం నాకెంతో నచ్చింది. రంగురంగుల పూలలాంటి లలిత లలితమైన చిన్నారుల మధ్య రోజంతా ఆహ్లాదంగా గడిచేది.
నేనూ రాస్తే… అన్పించి ‘ఉషోదయం’ నవలిక ప్రారంభించేను, అంతకు ముందు రాసిన కథల్లోంచి ‘రిక్షా’ కథ ఫెయిర్ చేసి ‘స్వాతి’కి పంపించేను. అక్కడినుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం. ఏమైపోయిందోకాని, ఆ కథ పత్రికలో రాలేదు. తిరిగి రానూ లేదు.
మోహన్ ఎప్పుడూ ‘‘సినిమా యాక్టర్లు రాజమండ్రిలో హోటల్స్ లో ఉన్నారు, చూస్తావా, కోనసీమలో షూటింగ్ జరుగుతోంది, చూడ్డానికి వస్తావా’’ అని అడుగుతూండేవాడు. ‘‘నాకంత తీరికా లేదు, ఆసక్తీలేదు’’ అంటూండేదాన్ని.
ఒకసారి రాజమండ్రిలో మా చిన్నచెల్లెలి ఇంట్లో ఏదో ఫంక్షన్ కి వెళ్ళేం. కోదండరామిరెడ్డి గారి సినిమా షూటింగ్ జరుగుతోందట. ‘‘దగ్గర్లోనే హోటల్లో సినిమా టీమ్ ఉన్నారు. చిరంజీవిని చూస్తారా’’ అన్నాడు మోహన్. ‘‘స్క్రీన్ మీద చూస్తాంకదా, అక్కడికెళ్లి చూడ్డమెందుకు?’’ అన్నాను నిరాసక్తంగా. ‘‘పోనీ, యండమూరిని చూస్తారా’’ అన్నాడు. అంతకుముందే ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల చదివి ఉన్నాను. వెంటనే వొప్పేసుకున్నాను.
హోటల్లో అడుగుపెడుతూంటే కాళ్లు వణికాయి, ఆడవాళ్లు హోటల్స్ కి వెళ్లడం పెద్దతప్పు అనే భావమేదో నాలో ఉండేది. మోహన్ చేతిని గట్టిగా పట్టకున్నాను. యండమూరి ఉన్నగదిలో అడుగుపెట్టేం, అదే నేను మొదటిసారి హోటల్ రూం చూడడం. పెద్దబెడ్ మీద పిల్లోస్ కి చేరబడి కూర్చుని ఉన్నాడాయన. గోల్డుకలర్ సిల్కులాల్చీ, లుంగీ ధరించి ఉన్నాడు. ఒళ్లో ప్లాంక్ మీద తెల్ల కాయితాలు. కొన్ని రాసిన కాయితాలు పక్కన ఉన్నాయి. ఆయన సన్నగా నవ్వుతూ ‘‘కూర్చోండి’’ అని సోఫా చూపించేడు. కాఫీ తెప్పించేడు. నా దృష్టంతా ఆయన రాసిన కాయితాల మీద ఉంది. వాటిని చేతిలోకి తీసుకుని కొంత చదివి ఫలానా పత్రికలో వస్తున్న సీరియల్ కదా ఇది అన్నాను. ‘అవును’ అన్నాడాయన నవ్వుతూ. ఆ కాయితాల్ని చూసేక నాకొకదారి దొరికినట్టయ్యింది, చక్కని చేతిరాత ఆయనది. అంత నీట్ గా కాగితానికి అటూ ఇటూ స్పేస్ వదుల్తూ రాయాలన్నమాట. రాసిన కథల్ని పత్రికలకి పంపించడం గురించి నేనడిగిన ప్రశ్నలకి ఓపికగా సమాధానాలు చెప్పేడు. అప్పటికింకా జెరాక్స్ మిషన్లు రాలేదు. ఇంకో కాపీ కావాలనుకుంటే అడుగున కార్బన్ పేపరు పెట్టి రాయాలట. ఆయన మాత్రం ఒక్క కాపీనే రాసి పంపేస్తాడట.
పావుగంటలో చూడ్డం, మాట్లాడ్డం అయిపోయింది. ఆయన వేపు డైరెక్టుగా చూస్తే ఏమనుకుంటాడో అనే నా పల్లెటూరి భయం కొంత. రాసుకుంటున్న ఆయన టైం వేస్ట్ చెయ్యడం భావ్యం కాదనిపించింది. వెళ్లొస్తామని సెలవు తీసుకుని వచ్చేసేం. ఇంటికి రాగానే ‘రిక్షా’ కథని జాగ్రత్తగా ఫెయిర్ చేసి ఈసారి ‘జ్యోతి’ మంత్లీకి పంపేను, వాళ్లు వేసుకున్నారు అంతే, ఇంక ఏమాత్రం టైం దొరికినా ఏదో ఒకటి రాస్తూనే ఉండేదాన్ని. ఒకోసారి కొత్తకథ తడితే అర్ధరాత్రి నిద్రలేచి రాసేదాన్ని, అప్పట్లోనే శ్రీరమణ గారి ‘బంగారుమురుగు’ కథ వచ్చింది. మా పెరట్లో ఉన్న పెద్దబాదంచెట్టుని చూస్తూ, ‘అయ్యో, ఆ కథ ను రాయలేకపోయానే’ అని అనుకున్నాను.
ఆంధ్రజ్యోతిలో నండూరి రామమోహనరావుగారి విశ్వరూపం, వడ్డెరచండీదాస్ అనుక్షణికం ఆ పత్రికకొక ప్రత్యేకస్థానాన్నిచ్చాయి. నేనైతే విశ్వరూపం కోసం పత్రిక ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేదాన్ని.
హఠాత్తుగా ఓ రోజు ఆంధ్రజ్యోతి డైలీలో ఓల్గా “మూడుతరాలు” చదివి షాకైపోయాను. ‘రష్యాకి చెందిన అలాంటి రచనని ఆవిడెందుకు తెలుగులోకి అనువదించాలి, ఆవిడకి భయం వెయ్య లేదా? అంటూ మథనపడ్డాను, అప్పటివరకూ సాఫీగా సాగుతున్న కథా ప్రపంచంలోకి కల్లోలమేదో వచ్చినట్టు ఉలిక్కిపడ్డాను. క్రమంగా త్రిపురనేని శ్రీనివాస్ ఎడిటర్ గా స్త్రీవాద కవిత్వం రావడం ప్రారంభమైంది. వాటిని మెచ్చుకునే వాళ్ల కన్నా నొచ్చుకునేవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు. పొగడ్తలకన్నా తెగడ్తలే ఎక్కువగా కన్పించేవి. మా స్కూలు కోసం నేను ఇంగ్లీషు పుస్తకాలు తెప్పించే స్టాల్ వాళ్లు ఒకసారి కృష్ణశాస్త్రిగారి కవిత్వం, మరో ఏడాది పాలగుమ్మిపద్మ రాజుగారి కథల పుస్తకాల సెట్టు గిఫ్ట్ గా పంపించేరు. అప్పటికి ఎం.ఏ చదువుకోసం శ్రీ శ్రీ, తిలక్ల కవిత్వాన్ని పదేపదే చదువుతూండేదాన్ని. ముద్దుకృష్ణ సంకలీకరించిన కవిత్వం కూడా నా దగ్గరుండేది. భావకవిత్వం, అభ్యుదయకవిత్వం, విప్లవకవిత్వం- దేని ప్రత్యేకత దానిదే అన్పించేది. అన్నిటినీ అనుభూతి చెంది చదవడమొకటే మార్గం అన్పించేది.
పాలగుమ్మివారి కథలు నాకు కథరాసే మార్గాన్ని తేటతెల్లంచేసాయి. ‘గాలివాన’ కన్నా ‘పడవప్రయాణం’ నన్నెక్కువ ఆకట్టుకుంది. నాకప్పుడే అర్థమైంది. పల్లెజనాల, బడుగువర్గాల కథలు నేను బాగా రాయగలుగుతానని అంతకు ముందు పత్రికలో పేరు చూసుకునే చాపల్యంతో చిన్న చిన్న జోక్స్ లాంటివి రాసేను. గ్రంథాలయానికి ‘మయూరి’ పత్రిక వచ్చేది. దానికి ఒకసారి ఏదో వంటకం తయారు చేసే పద్ధతి గురించి రాసేను. వెంటనే నవీన్ గారి నుంచి ఉత్తరం వచ్చింది – ‘ఇదేంటి, నువ్వు కథలు రాస్తావనుకుంటే ఇలాంటివి రాస్తున్నావు? వంటలు, బ్యూటీటిప్స్ రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. నువ్వు కథారచనను సీరియస్ గా తీసుకుంటావని భావిస్తున్నాను. మరోసారి ఇలాంటి శీర్షికల్లో నీపేరు కన్పిస్తే నేనూరుకోను’ అంటూ. ఆ ఆత్మీయమైన మందలింపు నామీద చాలా ప్రభావం చూపింది. రచనను సీరియస్ గా తీసుకొనేలా చేసింది. నవీన్ గారి భార్య అనసూయగారు కూడా మంచి ఫ్రెండైపోయారు. ఆవిడ చాలా సహృదయులు. అప్పటికి వారమ్మాయి స్వప్న చిన్నది. తనకీ నేను ఆత్మీయురాలినైపోయాను.
మా ఇంట్లో నాకూ పిల్లలకీ కాఫీ అలవాటుండేది కాదు. మోహన్ కి మా అత్తవారింట్లోలాగే మరుగుతున్న పాలలో చిక్కటి కాఫీ డికాక్షన్, పంచదార కలిపి ఇచ్చేదాన్ని. అది ఫిల్టర్ డికాషన్ కాదు, మరుగుతున్న నీళ్లలో చారెడు కాఫీ పొడి వేసి వడకట్టినది. నేనెప్పుడూ తాగి చూడక అది ఎలా ఉంటుందో తెలీదు. ఒకసారి ఉదయాన్నే యండమూరి మా ఇంటికి వచ్చినప్పుడు అదే కాఫీని ఇచ్చేను. ఒక్క సిప్ చేసి వదిలేసాడాయన. అందరికీ నచ్చే కాఫీ అది కాదేమో అని డౌటొచ్చింది నాకు. పత్రికల్లో యాడ్స్ చూసి బ్రూ ఇన్స్టెంట్ తెప్పించాను. పాలల్లో కలిపి తాగిచూస్తే బావున్నట్టన్పించింది. అలా అప్పటివరకూ లేని కాఫీ అలవాటు నాకూ అయ్యింది. తర్వాతెప్పుడో యండమూరితో బాటు సత్యానంద్ గారూ వాళ్లూ షూటింగ్ పనిమీద ఇటువైపు వెళ్తూ మా ఇంటికి వచ్చినప్పుడు నా కాఫీని చాలా మెచ్చుకున్నారు.
ఒకరోజు ఉదయాన్నే వీథి గుమ్మం ముందు నిలబడి ఎవరో వేదపఠన చేయడం గమనించి బైటకెళ్లేను. ఓ పాతికేళ్ల బ్రాహ్మణ యువకుడు ఒంటికాలిమీద నిలబడి రాగయుక్తంగా గడగడా పఠించేస్తున్నాడు. గమనిస్తే అతనికి లేని శారీరకలోపం లేదు. ఒక కాలూ, చెయ్యీపొట్టివి. కళ్లు పూర్తి మెల్లకళ్లు. వినికిడి లోపం. ఎత్తుపళ్లు, నోట్లోంచి లాలాజలం నీటితుంపరల్లా కురుస్తోంది. గొంతుమాత్రం ఖంగున మోగుతోంది. మాసిపోయిన నిక్కరు, చిరిగి వేళ్లాడుతున్న ఎవరిదో పెద్దచొక్కా. నన్ను చూసి పనిచేస్తున్న చేతిని గాలిలోకి లేపి దించాడు. నేనడిగితే అతను చెప్పిన వివరాలప్రకారం కోనసీమకు చెందిన బ్రాహ్మల అబ్బాయి. ఏ ఘనాపాఠీల కుటుంబానికి చెందినవాడో. కొంత బుద్ధి మాంద్యం కూడా ఉండడం వల్ల సమాధానాలు అడిగినవాటికి కాకుండా వేరేవో చెప్తున్నాడు. ఎవరో నేర్పిన ఆ కొన్ని పనసలూ పాడి యాచనతో బతుకు వెళ్లదీస్తున్నాడు. అంతదూరం లోని కోనసీమ నుంచి ఈ మెట్టప్రాంతానికి ఎలా చేరుకున్నాడో. కొంత చిల్లర తెచ్చి ఇవ్వబోయాను. తీసుకోలేదు. పొట్టచూపించి ఏమైనా పెట్టమని అడిగేడు. తనపేరు మూర్తి అట. చుట్టూ బ్రాహ్మల ఇల్లు. నేనేమైనా పెట్టొచ్చొ లేదో. మా ఇంట్లో తినకూడదు, ఆ ఇళ్లకెళ్లమని చెప్పేను. ఎంతకీ కదలడే. వెళ్లనని తల అడ్డంగా ఊపేడు. టిఫినుకి ఫర్వాలేదేమోలే అని కొంత టిఫిన్ తెచ్చిపెట్టేను. తిని, నీళ్లుతాగి వెళ్లిపోయి మధ్యాహ్నం భోజనం వేళకి మళ్లీ వచ్చేడు. టీచరు ఉద్యోగం కావాలట. రెండోతరగతి చదివేడట. నేను నవ్వేసేను. లోపలి పనులు చక్కబెట్టుకుని వచ్చేసరికి స్కూలు పిల్లల భోజనాల దగ్గర చేతిలో చిన్న కర్రపుల్ల పట్టుకుని అజమాయిషీ చేస్తున్నాడు. మేం తినడానికి కూర్చోగానే ఆకలని కడుపు చూపించేడు. ఏమైతే అయిందని మేం వండుకున్న అన్నాన్ని పెట్టేసాను. అలా మూర్తి మా ఇంట్లో సభ్యుడై పోయేడు. రోజూ మధ్యాహ్నం లీజరు టైంలో పిచ్చి బొమ్మ ఒకటిగీసి ఆవు వ్యాసం అని ఏదేదో రాసి పిల్లల్ని నవ్విస్తూ ఉండేవాడు. సాయంకాలం మా పిల్లలకి హోమ్ వర్క్ చేయిస్తాననీ, డ్రిల్లు చెప్తాననీ తయారయ్యేవాడు. మా చిన్నమ్మాయి బాగా పెంకితనం చేసి మూర్తి వీపు మీదెక్కి ఆడుతుండేది. ఒకో సారి ఇంటికెళ్లొస్తానని డబ్బులడిగి తీసుకునీ, ఒకోసారి చెప్పకుండానూ వెళ్లిపోయి కొన్నాళ్ల తర్వాత తిరిగొచ్చేవాడు. చాలా ఏళ్లున్నాడు. ఒకసారి అలా వెళ్లినవాడు తిరిగిరాలేదు. ఇప్పుడెక్కడైనా ఉన్నాడో లేడో?
*****
(ఇంకా ఉంది )
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.