యదార్థ గాథలు
కష్టాలని అధిగమించిన వాసంతి
-దామరాజు నాగలక్ష్మి
అమాయకురాలు, తండ్రిచాటు బిడ్డ వాసంతి పెళ్ళి ఘనంగా చేశారు.
వాసంతి ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసయ్యింది. తండ్రి రాఘవయ్యతో నాన్నానేను డిగ్రీ చదువుతాను. మా స్నేహితులందరూ చదువుతున్నారు. నాకు తోడుగా వుంటారు అంది.
అప్పటికే ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి అప్పులపాలయిన రాఘవయ్య అమ్మా! వాసంతీ ! అక్కలిద్దరి పెళ్ళిళ్ళు అయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. నువ్వు చదువుకుంటానంటున్నావు బాగానే వుంది. కానీ ఇప్పుడు నువ్వు చదివి ఏం చేస్తావు? నీకు చదువు అంత అవసరమా? అన్నాడు.
వాసంతి తండ్రి మాటలకి ఏమీ చెప్పలేకపోయింది. చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది అక్కల లాగా అంత తొందరగా పెళ్ళి ఎందుకు అనుకుంది వాసంతి.
ఇలా ఆలోచనలలో వుండగానే… ఒకరోజు నాలుగు వీధులవతల వుండే వాసంతి బాబాయి అన్నయ్యా ఏం చేస్తున్నావు. నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అనుకుంటూ లోపలికి వచ్చాడు.
తమ్ముడి గొంతు వినగానే రాఘవయ్య ఏం రాముడు ఏమిటి సంగతి చెప్పు. ఇలా రా అని తను పడక కుర్చీలో చేరగిలపడ్డాడు. రాముడు ఏం లేదు అన్నా మాకు తెలిసిన వాళ్ళబ్బాయి హైదరాబాదులో గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటికి పెద్దవాడు. పెద్ద బాధ్యతలేమీ లేవు. బాగా ఆస్తిపరులు. మన వాసంతికి సరిగ్గా సరిపోతాడు అన్నాడు.
రాఘవయ్య ఆలోచిస్తూ ఇప్పుడే అంటే కొంచెం కష్టం పెద్ద పిల్లల పెళ్ళిళ్లు చేసే తేరుకోలేదు అన్నాడు.
అదికాదన్నా ఇలాంటి సంబంధం మళ్ళీ రాదు. డబ్బు సంగతి ఏదో చూద్దాంలే అన్నాడు.
రాఘవయ్య ఇంకేం అనలేకపోయాడు. ఇక ఆలస్యం చెయ్యకుండా అబ్బాయి సారధిని చూసి రావడం, వాళ్ళు వచ్చి అమ్మాయిని చూడ్డం అన్నీ వేగంగా జరిగిపోయాయి. రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ముహుర్తాలు పెట్టుకున్నారు.
వాసంతికి చదువుకోవాలని వున్నా తండ్రిమాట కాదనలేక పెళ్ళికి ఒప్పుకుంది. రాఘవయ్య పెళ్ళి వీలైనంత ఘనంగా చేశాడు.
వాసంతి అత్తవారి వూరు జనగాం వెళ్ళింది. అక్కడ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. సారధి హైదరాబాదులో ఉద్యోగం కాబట్టి పెళ్ళయిన వారానికి హైదరాబాదు వెళ్ళిపోయాడు. వచ్చి వెడుతూ వుండేవాడు. వుత్తరాలు రాస్తుండేవాడు. అక్కడ ఇల్లు చూసి వాసంతిని తీసుకెళతానని చెప్పాడు.
పెళ్ళయి నెలరోజులైంది. హైదరాబాదు ఎప్పుడు వెడతానో… సారధి, నేను కలిసి ఎప్పుడుంటామో అని ఆలోచిస్తోంది వాసంతి.
మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి కూచున్నారు. గుమ్మదగ్గిర అలికిడి అయితే అందరూ అటు చూశారు. వాసంతి ఆ టైములో వచ్చిన తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది. ఆనందంతో పరుగులు పెట్టింది. రాఘవయ్య నవ్వలేదు. ఏంటి నాన్నా అలా వున్నావు. ఏమైంది అని అడిగింది.
రాఘవయ్య ఒక్కసారి భోరుమన్నాడు. వాసంతి అత్తగారు లక్ష్మి, మామగారు శ్యామలరావు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళకి ఏం చెయ్యాలో తోచలేదు.
శ్యామలరావు రాఘవయ్యగారు ఏమయ్యిందండీ… అంటూ దగ్గిరకెళ్ళాడు. రాఘవయ్య ఆయనని పట్టుకుని సారధి మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. సారధి ఫ్రండ్ గోపి ఫోన్ చేసి చెప్పాడు. మీ ఫోన్ ఎంతకీ కలవట్లేదుట అన్నాడు.
సారధి అమ్మానాన్నా కుప్పకూలిపోయారు. ఇదేమిటి పెళ్ళయ్యిందన్న ఆనందం ఇంకా పోకముందే కొడుకు ఇలా అవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళని ఎవరూ ఓదార్చలేకపోయారు. వాసంతి శిలాప్రతిమలా వుండిపోయింది. ఈ సంగతి తెలిసి చుట్టుపక్కల అందరూ వచ్చి రకరకాల ప్రశ్నల వెయ్యసాగారు.
రాఘవయ్య వాసంతిని నాతో తీసుకెడతాను. మీరు ఏమయ్యిందో కనుక్కోండి అంటూ వాసంతిని కట్టుబట్టలతో తీసుకుని వెళ్ళిపోయాడు.
లక్ష్మికి పక్కింటి వాళ్ళని తోడు వుంచి, శ్యామలరావు కారులో హైదరాబాదు బయల్దేరి వెళ్ళాడు.
—-
హైదరాబాదు చేరాక కొడుకు సారధి గురించి అతని స్నేహితుల ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. సారధి ఆ రోజు ఉదయం వాసంతికి ఉత్తరం రాసి తను ఆఫీసుకి వెళ్ళినప్పుడు పోస్టు చేద్దామనుకున్నాడు. రాసిన ఉత్తరం చేత్తో పట్టుకుని ఊరికే మంచం మీద పడుకుని తన రూం మేట్స్ తో నేను ఆఫీసుకి కొంచెం లేటుగా వెడతాను. మీరు వెళ్ళిపొండి అని చెప్పాడు.
మధ్యాహ్నం పనిమనిషి వచ్చి పక్కింటి వాళ్ళని తాళం ఇవ్వండమ్మా పక్కన బాబులవి గిన్నెలు కడుగుతాను అంది. వాళ్ళింట్లోనే వున్నట్లున్నారు చూడమని చెప్పారు. పనిమనిషి వెళ్ళి చూస్తే తలుపులు తీసే వున్నాయి. బాబూ అంటూ లోపలికి వెళ్ళిన పనిమనిషి సారధి ఉలుకూ పలుకూ లేకుండా మంచం మీద పడి వుండటం చూసింది. ఎందుకో అనుమానం వచ్చి పక్కింటి వాళ్ళని పిలిచింది. వాళ్ళు వచ్చి సారధిని చూసి వెంటనే దగ్గరలో వున్న డాక్టరుని పిలుచుకుని వచ్చారు. డాక్టరు చెయ్యి పట్టుకుని చూసి హార్ట్ ఎటాక్ వచ్చింది. చనిపోయి నాలుగు గంటలు అయ్యింది. మనం చేసేది ఏమీలేదు అని చెప్పారు.
ఎంతో మంచి వ్యక్తి, పెళ్ళయి నెలరోజులైంది. ఇంతలోనే ఇలా అవడంతో అందరికీ కళ్ళనీళ్ళపర్యంతమయింది. వెంటనే వాళ్ళవాళ్ళకి ఫోన్లు చేశారు. ఇదీ సంగతి.
—
శ్యామలరావు సారధి స్నేహితుల సాయంతో బాధని దిగమింగుకుని నిర్జీవమైన కొడుకుని తీసుకుని ఊరికి బయల్దేరి వెళ్ళాడు. ఊరి జనమంతా అక్కడే వున్నారు. ఇంటిలోపలికి వెళ్ళి కొడుకు శరీరాన్ని అక్కడ వుంచి భోరుమన్నాడు. వాళ్ళని ఓదార్చడం ఎవరితరం కాలేదు. సారధి తమ్ముడు రమేష్ తను ఏడవాలో, తల్లితండ్రుల్ని ఓదార్చాలో అర్థం కాని పరిస్థితిలో వుండిపోయాడు.
సారధి బంధువులు కడసారి చూపులకి వాసంతిని తీసుకురమ్మని కబురు చేశారు. వాసంతితోబాటు వాసంతి అక్క శ్యామల కూడా వచ్చింది. కడసారి చూపించి వాసంతిని వెంటనే తీసుకుపోతుంటే అందరూ అదేమిటమ్మా అలా తీసుకుపోతున్నావు. జరగవలసిన కార్యక్రమాలు వుండగా అని అడ్డుపడ్డారు.
వెంటనే శ్యామల మా చెల్లెలు అతనితో కలిసి వున్న రోజులు తక్కువ. అతనితో కాపరం చెయ్యలేదు. ఏ కార్యక్రమాలు చెయ్యవలసిని అవసరం లేదు అంటూ వాసంతిని తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరూ ఏమీ అనలేకపోయారు.
చూస్తుండగా నెలలు గడిచిపోయాయి. తన జీవితం ఇలా అయిపోయిందని వాసంతి చాలాసార్లు బాధపడుతూనే వుంది. వాసంతి జీవితాన్ని గురించి అమ్మా, నాన్నా కూడా బాధపడుతున్నారు.
ఒకసారి రాఘవయ్య స్నేహితుడు రామారావుని కలిశాడు. మాటల మధ్యలో వాసంతి గురించి వచ్చింది. రామారావు వాసంతిని ఎన్నాళ్ళని అలా వుంచుతావు. రేపు మా ఆఫీసుకి తీసుకురా. అక్కడ నేను ఏదో ఒక పని నేర్పిస్తాను. కొంచెం మార్పువస్తుంది అన్నాడు.
రాఘవయ్యకి కొండంత బరువు దింపినట్టయింది. చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. మర్నాడు వాసంతిని రామారావు ఆఫీసుకి తీసుకెళ్ళాడు.
రామారావు కూచోమని చెప్పి ఆఫీసులో పనిచేసే ఇందుమతిని పిలిచి ఇందు వాసంతికి రేపటి నుంచీ మీరు కంప్యూటర్ మీద ఏ పనయితే చేస్తున్నారో అదంతా నేర్పించండి అన్నాడు.
సరే సర్ అలాగే నేర్పిస్తామని చెప్పింది.
మర్నాడు వాసంతి పొద్దున్నే ఇందు వుండే రూంకి వచ్చింది. పక్కన కూచుని ఇందులో మీరు ఏం చేస్తారు. ఇదంతా ఎందుకు అని అడిగింది.
వాసంతి చాలా అమాయకంగా, పల్లెటూరి అమ్మాయి భాష మాట్లాడుతూంటే ఇందుకి చాలా వింతగా అనిపించింది. ఒక్క ఇంగ్లీషు మాట కూడా రాదు.
ఇందుకి కొంచెం ఓపిక ఎక్కువేమో… ఇది కంప్యూటర్ దీంట్లో మనం 14 భాషలు చెయ్యచ్చు. ప్రస్తుతం ఇంగ్లీషు తెలుగు మాత్రమే చేస్తున్నాం. ఇందులో చేసిన మేటర్ ప్రింటింగ్ కి వాడతారు అని అన్నీ వివరంగా చెప్పింది.
వాసంతికి అర్థం అయ్యిందో లేదో కానీ సరే అని తల వూపింది. ఇందు ఒక గురువుగా వాసంతికి వర్కంతా నేర్పించింది.
ఎక్కడికన్నా బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం అంటే అమ్మో మా అత్తగారివైపు వాళ్ళు చూస్తే బావుండదు అనేది. మా మరిది ఆఫీసు పనిమీద తిరుగుతూనే వుంటాడు అని చాలా భయపడుతూ వుండేది. ఇల్లు, ఆఫీసు తప్ప వేరే లోకం వుండేది కాదు.
ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని వాసంతి భాష, తీరు అన్నీ మారిపోయాయి. వాళ్ళ అమ్మా, నాన్నా, బంధువులు ఆశ్చర్యపోయారు.
ఇంతలోనే ఇందు వేరే ఆఫీసు మారాల్సి వచ్చింది. వాసంతికి కూడా వేరే జాబ్ వచ్చింది. ఒకరోజు వాసంతి ఇందు ఆఫీసుకి వచ్చింది.
ఇందుకి వాసంతిని చూడగానే చాలా సంతోషమేసింది. అబ్బా ఎన్నిరోజులకి వచ్చావు వాసంతీ! ఏమిటి సంగతులు అంది. ఏమీలేదు మేడమ్ చాలా రోజులైంది కదా కలిసిపోదామని వచ్చాను. మా ఆఫీసులో పనిచేసే రాజు ఇటుగా వస్తుంటే అతని బండిమీద వచ్చాను.
ఇందు ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోకండి మేడమ్. ఇంకా వినండి – మీ దగ్గిర వర్కు నేర్చుకోవడం నాకు చాలా మంచిదైంది. ఇప్పుడు నేను మా ఆఫీసులో ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లమీద ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్నాను. మంచి జీతం, మంచి మనుషులు, మంచి మేనేజర్. చాలా సంతోషంగా వున్నాను అని చెప్పింది.
వాసంతిలో ఇంత మార్పు వచ్చినందుకు ఇందు చాలా ఆనందపడింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక వాసంతి వెళ్ళిపోయింది.
ఒక సంవత్సరం తర్వాత ఎగ్జిబిషన్ లో వాసంతి కలిసింది. హాయ్ మేడమ్ అంటూ పలకరించింది. ఇందు ఏమీ అడగకుండానే వాసంతే తన గురించి చెప్పడం మొదలు పెట్టింది.
మేడమ్ మా వూళ్ళో తెలిసిన వాళ్ళ అబ్బాయి నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. నేను సికింద్రాబాదు స్టేషన్ దగ్గర స్వంతంగా షాపు పెట్టుకుని, ఒక అసిస్టెంట్ తో రెండు కంప్యూటర్ల మీద వర్కు చేస్తున్నాను. ఇప్పుడు నాకు రు. 15,000 దాకా వస్తోంది. నా వర్కు నచ్చి చాలామంది కష్టమర్లు మా ఇంటికి కూడా వచ్చి చేయించుకుంటూ వుంటారు. మా ఆయన కార్పెంటర్. ఎప్పుడూ బిజీగా వుంటాడు. మాకు ఒక అబ్బాయి. నేను మా అత్త కూతురుతో ఎగ్జిబిషన్ కి వచ్చాను.
మీరు ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. మర్చిపోకండి అని అడ్రస్ ఒక పేపరు మీద రాసి ఇచ్చి వెళ్ళిపోయింది.
ఇందు వాసంతి కష్టాలని అధిగమించి తన జీవితం తనే చక్కదిద్దుకున్నందుకు చాలా సంతోషించింది. ఏదైనా కష్టపడితేనే అదృష్టం మన కాళ్ళముందుంటుంది అనుకుంది.
*****
నా పేరు దామరాజు నాగలక్ష్మి
నేను పుట్టినది వరంగల్ జిల్లా హనుమకొండ. పెరిగినది చదువుకున్నది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. ప్రస్తుతం హైదరాబాదు వాస్తవ్యులం.
దినపత్రికలకి వ్యాసాలు రాయడం, కవితలు రాయడం, కథలు రాయడం నా అభిరుచులు. మొక్కలు పెంచడం, ప్రకృతి ఆరాధన ప్రత్యేక అభిరుచులు. స్త్రీల సమస్యలలో పాలు పంచుకుని వారికి తగిన సలహాలు ఇచ్చి సహకరించడం నాకు నచ్చిన విషయం.