యాత్రాగీతం(మెక్సికో)-8

కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-2

-డా||కె.గీత

భాగం-10

మర్నాడు  ఉదయం మేం తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్ వగైరా చూడడానికి టూరు  బుక్ చేసుకున్నాం. ఈ ఫుల్ డే టూరులో సెనోట్ అంటే నీళ్లలో స్నానం తప్పనిసరికాబట్టి స్విమ్మింగు బట్టలవీ బ్యాగుతో తెచ్చుకున్నాం. మధ్యాహ్న భోజనం దారిలోని మాయా విలేజ్ లో చేయడం టూరులోభాగం కాబట్టి భోజనానికి చూసుకోనవసరం లేదు. తాగడానికి మంచినీళ్ల బాటిళ్లు వ్యానులో ఎప్పుడంటే అప్పుడు అడిగి తీసుకోవచ్చు. 

ఇక ఇది మొన్నటిలాంటి పెద్ద బస్సు టూర్ కాదు.  పది మంది కూర్చొనగలిగే చిన్న సైజు వేన్ లో మా డ్రైవరే గైడుగా అన్నీ తిప్పి చూపిస్తాడన్న మాట. మాతో బాటూ మరొక నలుగురు వేరే రిసార్టుల నించి ఈ  టూరుకి వచ్చేరు. అందులో ఇద్దరు అమ్మాయిల జంట, ఒక వృద్ధ జంట. అంతా అమెరికన్లే. ఇక ఇద్దరు పిల్లల్తో మేం నలుగురం. వెరసి డ్రైవరుతో కలిపి తొమ్మండుగురం రోజంతా కలిసి ప్రయాణం చేసేం. మేం మొదటి సీట్లలో కూర్చోవడం వల్ల మా  డ్రైవరు కం గైడుని నేను అక్కడి జీవన విధానం గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాను. కాన్ కూన్ లో డ్రగ్ ట్రాఫికింగ్, అభద్రత గురించి నేను ప్రశ్నించినపుడు “అమెరికాలో భద్రతారాహిత్యం ఎంత ఉన్నా పైకి తేలనివ్వరు. ఇక్కడి చిన్న సంఘటనల్ని కూడా భూతద్దంలో చూపిస్తారు.” అన్నాడు. నిజమేనేమో అనిపించింది. ఇక కాన్ కూన్ పర్యాటక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో యువత ప్రత్యేకించి హోటలు మేనేజ్ మెంటు వంటి కోర్సులు పూర్తిచేసి, ఇంగ్లీషులో కొద్దో గొప్పో ప్రావీణ్యం సంపాదించి రిసార్టు ఉద్యోగాలలో చేరడమే ప్రధాన జీవనోపాధి అనీ, అతనూ కొద్ది సంవత్సరాలు అదే వృత్తిలో గడిపి ఇప్పుడు ఈ వేను టూరు సంస్థలో డ్రైవరుగా చేస్తున్నానని చెప్పేడు. కుర్రవాడే అయినా ఇద్దరు పిల్లల తండ్రి అతడు. ఆ చుట్టుపక్కలే పుట్టి పెరిగిన మాయా సంతతికి చెందిన వాడు. మేం చేసిన ఆ ప్రయాణం అన్నిటికంటే ఉత్తమమైనదని చెప్పుకోవాలి. నిజమైన మాయా సంతతికి చెందిన మనుషుల్ని, వారి ఊళ్లని, సంస్కృతిని చూడాలంటే ఈ టూరుకి తప్పకుండా వెళ్ళిరావాలి. 

కాన్ కూన్  నించి దాదాపు 90 మైళ్ల దూరంలో ఉంది తులుమ్. దాదాపు రెండుగంటల ప్రయాణం. మెక్సికోలో యూకతాన్ ద్వీపకల్పంలోని “క్వింటానా రూ” రాష్ట్రానికి చెందినదే. సముద్రతీరంలో చుట్టూ ప్రహరీ గోడ తో ఉన్న మాయా సంస్కృతి కి చెందిన నగరం తులుమ్. 15 వ శతాబ్దిలో స్పానిషు ఆక్రమణదారులు రాక పూర్వం గొప్పగా విలసిల్లిన ఈ నగరం తరువాత తరువాత ఊకుమ్మడిగా విస్తరించిన రోగాల వల్ల జనసమ్మర్దం కరువై  18 వశతాబ్దం నాటికి పూర్తిగా నిర్మానుష్యమైపోయిందట.

చిచెన్ ఇట్జా లాగే ఇక్కడ కూడా కట్టడాలన్నీ ఒక రకమైన సున్నపురాయితో  నిర్మించబడ్డవే. 

 తులుమ్ నగరంలో సామాన్యమైన గృహాలతో బాటూ మూడు ప్రధాన కట్టడాలున్నాయి. ఎల్ కాస్తిలో (El Castillo) కోట, టెంపుల్ ఆఫ్ ఫ్రెస్కోస్ (the Temple of the Frescoes), టెంపుల్ ఆఫ్ డిసెండింగ్ గాడ్ (the Temple of the Descending God).

కానీ కట్టడాల పరిరక్షణలో భాగంగా ఇక్కడి ప్రతీ కట్టడం చుట్టూ తాడు కట్టి ఎవరినీ లోపలికి అనుమతించనందున బయటి నించే నడిచి తిరగగలిగేం. 

 తులుమ్ నగరం సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న చిన్నపాటి ఎత్తైన కొండమీద ఉన్నా తీరప్రాంతపు ఇసుక మేటలు వేసి ఉంది.

ఒకప్పుడు ఇది ప్రధాన ఓడరేవుగా  విలసిల్లి వర్తకవాణిజ్యాలు విరివిగా సాగుతూ ఉండేవట.ఎల్ కాస్తిలోకి సముద్ర వైపున ఉన్న  రెండు ప్రధాన కిటికీల నుంచి బహుదూరపు నౌకలు కనిపించేవట, ఇక్కడ వెలిగించే దీప కాంతి వల్లే  రాత్రిపూట నౌకలు తీరాన్ని గుర్తించగలిగేవట. 

అసలే యూకతాన్ ద్వీపకల్పంలో ఎక్కడా ఎత్తైన చెట్లు ఉండవు. ఇక్కడ మరీ నేలబారుకి ఉన్న సముద్ర తీరపు తుప్పలు తప్ప ఏవీలేవు. ఇక సముద్ర తీరంలో ఇక్కడ ఇలా నగరం విలసిల్లడానికి దగ్గర్లో ఉన్న మంచినీటి భూగర్భ సెనేట్ తాగునీరే ప్రధాన ఆధారమట. 

మా బస్సు డ్రైవరే మా గైడు కావడంతో విశేషాలన్నీ వివరించి,  కట్టడాల్ని దగ్గరనించి మా అంతట మేం చూసి రావడానికి వెళ్లేటపుడు నడవనని పేచీ పెడుతున్న సిరిని అతని దగ్గరున్న టాబ్లెట్ ఆడుకోవటానికి ఇచ్చి కూచోబెట్టుకుంటూ ఉండడంతో నేను కూడా ప్రశాంతంగా అన్నీ తిరిగి చూడగలిగేను.

అక్కడి రాతికట్టడాల్ని కళ్ల నింపుకుంటూ శిథిలాల మధ్య తిరుగాడుతూ ఉంటే అప్పటి ప్రజల జీవన విధానం కళ్లకి కట్టసాగింది. అక్కడ అన్నిటి కన్నా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే అందమైన లేత నీలి రంగు సముద్ర తీరం, చుట్టూ తెల్లని ఇసుక. అక్కడ వెన్నెల రాత్రి ఎంత మనోహరంగా ఉంటుందో అని అనిపించింది. అలల మనోహర గీతాలతో అత్యంత సుందరమైన ఆ ప్రదేశంలో నగరాన్ని నిర్మించుకోవడంలోనే మాయా ప్రజలు ఎంతటి సౌందర్యారాధకులో అర్థం చేసుకోవచ్చు అనిపించింది.

దాదాపు గంటన్నర తర్వాత ఆప్రదేశాన్ని వదిలి వెళ్లలేక వెళ్లలేక వెళ్ళేం. 

అయితే ఆ తర్వాత మరో గంటలోమేం చూసిన “కోబా”  శిథిలాలు చూసేసరికి ఆశ్చర్యంతో మతిపోయింది. ప్రధాన కట్టడం అత్యంత ఎత్తైనది.అంత గొప్ప ఎత్తైన కట్టడాన్ని  ఇటీవల ఎక్కడా చూసినట్టు జ్ఞాపకం లేదు. 

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి – 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.