రమణీయం
సఖులతో సరదాగా -4
-సి.రమణ
నాకు చిన్ననాటినుండి వున్న అలవాటు ఏమిటంటే, ఏ వాహనం లో కూర్చుని ప్రాయాణిస్తున్నా, కిటికీ లోంచి, వెనక్కు పరుగెడుతున్నట్లు కనిపించే చెట్లను చూడటం. అలసిపోయేవరకు అలా చూడటం, ఎంతో అనందాన్నిచ్చేది. ఇప్పుడు కూడా, అలా చూస్తూ వుండగానే, దట్టమైన చెట్లు తరిగిపోతూ, కొండలన్నీ కరిగిపోతూ, మైదాన ప్రాంతంగా రూపాంతరం చెందాయి పరిసరాలు. మంచు తెరలు మాయమయ్యాయి, సూర్యకిరణాలు సోకి. శీతలస్థితి నుంచి, సమశీతోష్ణ స్థితికి వచ్చేశాము. పళని కొండలు దిగి, పళని చేరే లోగా ఒక ఆశ్రమం దగ్గర ఆగి, మా ఉపాహార కార్యక్రమాలు ముగించుకుని, సుబ్రమణ్యస్వామి ఆలయానికి బయలుదేరాము. కోవెల, కొండ మీద వుంటుంది. అక్కడికి Rope Car లో వెళ్ళవచ్చు. 700 దాకా వున్న మెట్లెక్కి వెళ్ళవచ్చు. కారులో కూడా వెళ్ళవచ్చును. ఆదివారం అవటం వలన, విపరీతమైన రద్దీగా వుంది. ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకున్నా కూడా, రెండు గంటల సమయం పడ్తుంది స్వామి దర్శనానికి, అని అన్నారు అక్కడివాళ్ళు. అప్పటికే ఎండ చురుక్కు మంటుంది. ఆ సమయంలో, ఆ తొక్కిసలాటలో, అంతసేపు Q లో నిలపడటం, కష్టమనిపించింది. అందువలన వున్నచోటునుండే, దేవుని స్మరించి, నమస్కరించి, అక్కడనుండి బయలుదేరి, Indian Manchester గా పేరు పొందిన కోయంబత్తూర్ పట్టణానికి చేరేసరికి మధ్యాహ్నం రెండు దాటింది.
సామానంతా గదికి చేర్పించి, మేము భోజనం చేసి వచ్చి, విశ్రాంతి తీసుకొంటూ, పళని మురుగన్ దర్శనం చేసుకోలేకపోయాము, కనీసం ఇక్కడైనా వెళ్ళాలి, మురుగన్ అలయానికి అని అనుకున్నాము. సాయంత్రం సరదాగా వీధుల్లో తిరుగుతూ బట్టల, నగల దుకాణాలు చూస్తూ ఒక చోట ఒక గ్రాము బంగారం పూతతో నగలున్న దుకాణం లోకి వెళ్ళాము, చూద్దామని. అసలు బంగారు నగలకి, ఇక్కడ వున్న నగలకి, తేడా కనిపెట్టలేనంత, అందంగా మెరిసి పోతున్నాయి. ప్రయణాలలో వాడుకోవచ్చని గాజులు, పనివాళ్ళకిద్దామని చెవిపోగులు వంటివి కొనుక్కొని బయటకొచ్చాము. కోయంబత్తూర్ లో ప్రసిద్ధి చెందిన భోజన హోటళ్ళు ప్రధానంగా రెండున్నాయి, 16 శాఖలతో. అవి శ్రీ అన్నపూర్ణ, శ్రీ గౌరి శంకర్. ఇక్కడ కూడా నలుగురు కూర్చోగలిగిన పెద్ద ఆటోలున్నాయి. ఆటోలో మా Hotel గదులకు చేరుకుని, కొడైకెనాల్ నుంచి తీసుకువచ్చిన మొక్కలకు కొంచం నీరుపోసి, మేము fresh అయి, నిద్ర వచ్చేంతవరకు కబుర్లు చెప్పుకుంటూ, పేకాడుతూ గడిపాము.
మర్నాడు పొద్దున్నే సుబ్రమణ్యస్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడి Hotel వారు చాల శ్రద్ధ తీసుకున్నారు మా గురించి. మంచి ప్రయాణపు ఏర్పాట్లు చేసారు. వారి పర్యవేక్షణలో ఏ విధమైన ఇబ్బంది పడకుండా, కొత్త ప్రాంతం అనే ఆలోచన లేకుండా, ఆ రోజు రాత్రి 10 గంటల దాకా తిరిగాము. చిన్న కొండ మీద వున్న సుబ్రమణ్య స్వామి (ఇక్కడ మరుద్‌మలై అంటారు) గుడికి, 8 గంటలకు వెళ్ళాము. దాదాపు 150 మెట్లు ఎక్కాలి. కొంచం ఎత్తు ఎక్కువున్న, పెద్ద పెద్ద మెట్లకి అటు, ఇటు Railing వున్నా కష్టమనిపించింది, ఎక్కటానికి. అసలు దేవుళ్ళంతా ఇలా కొండల మీద ఎందుకుంటారు? అని మరోసారి విసుక్కుంది పద్మ. అలాగే ఆయాస పడుతూ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్తే, అక్కడ పొడగాటి queue line ఎదురయ్యింది. దాని పక్కనే మరో పెద్ద వరుసలో ప్రత్యేక దర్శనం కోసం వేచివున్నారు. సరేనని రెండు వరసలలో నుంచున్నాము మణీ, నేను ; ఏది ముందయితే, దానిలో వెళ్ళవచ్చని. రాజ్యలక్ష్మి దూరంగా కనిపిస్తున్న పట్టణాన్ని చూస్తూ, గుడి చుట్టూ తిరుగుతుంది. అరగంట నిలబడ్డా కదలిక లేదు queue లో. ఇంతలో పద్మ ఒక పూజారి గారితో అతిప్రత్యేక దర్శనం గురించి మాట్లాడి వచ్చింది. అలా, దేవుడి దర్శనం మరియు పూజాది కార్యక్రమాలు శీఘ్రము గానే పూర్తి చేసుకున్నాము.
తరువాత పెరూర్ పట్టీశ్వర్ (ఆనంద తాండవ నటరాజు) ఆలయానికి వెళ్ళాము. పురాతన దేవాలయమైనా, అందమైన శిల్ప సంపదతో కళ కళ లాడుతూ వుంది. ఎత్తైన స్థంభాలు, పొడవాటి నడవాలు, విశాలమైన ఎత్తైన ద్వార బంధాలతో చాల అందమైన శిల్ప ఆకృతులు, తోరణాలతో చెక్కబడిన ఈ ఆలయం 10 వ శతాబ్దం నుండి అనేక రాజ వంశీయుల పాలనలో పలు గోపురాలు, మండపాలతో ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. లోపల పై కప్పంతా, శివుని మహిమల గురించి, అందంగా చిత్రించారు. ఇక్కడి ప్రత్యేకతలేమిటంటే, కామధేను పాదముద్ర, గర్భగుడిలో వున్న శివలింగం మీద కనిపిస్తుందట. ఆనంద తాండవ నటరాజు బంగారు విగ్రహం, మరో ప్రత్యేకత. ఇంకా చాలా దేవి, దేవతల విగ్రహలు ప్రతిష్టించబడివున్నాయి. అక్కడ రకరకాల పూజలు, ఉత్సవాలతో కోలాహలంగా వుంది. ప్రధాన ద్వారం దగ్గర ఏనుగుతో ఆశీర్వాదం కూడా వుంది. దేవాలయంలో భోజన సదుపాయం వుంది కాని, మేము శ్రీ గౌరి శంకర్ hotel కే వెళ్ళాము.
అక్కడినుండి 28 కి.మీ. దూరంలో వున్న ఈశా ఫౌండేషన్ సెంటర్ కు ప్రయాణమయ్యాము. చాల రోజులుగా అనుకుంటున్నదే, అక్కడికి వెళ్ళాలని, అన్నీ చూడాలని, `experience`అవ్వాలని. ఏదో ఒక కారణంగా కుదరలేదు. ఇప్పుడు కూడా, ఇక్కడ మేము వుండే సమయంలో ఒక ఆరోగ్య సంబంధిత కార్యక్రమంలో, పాల్గొనవలెనని 20 రోజుల క్రిందట ఫౌండేషన్ వారిని సంప్రదించాము. కాని మాకు అవకాశం లభించలేదు. చాల ముందుగానే అన్ని seats నిండి పోయాయి. ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరుగుతూనే వుంటాయి. ప్రతి శివరాత్రికి అత్యంత భారీగా జరిగే వుత్సవం లో పాల్గొనవలెనని దూర ప్రాంతాలు, విదేశాలనుండి ఎందరో ప్రముఖులు వస్తారు. సంగీత నృత్యాలతో, భజనలు, ప్రార్థనలతో శివుడుని రాత్రంతా ధ్యానిస్తారు. అత్యంత వుత్సాహంతో, ఆద్యంతం, సద్గురు పాల్గొంటారు.
మా కారుని దూరంగా వున్న parking place కు పంపించి, మేము ఈశా సెంటర్ లోనికి అడుగు పెట్టాము. కొంచం దూరం నడిచాక, మాతో వున్న చేతిసంచి, సెల్ఫోన్, చెప్పులు భద్ర పరచటానికి, అక్కడ వున్న విశాలమైన hall లో ఇచ్చాము. అనేక మంది స్వచ్ఛంద సేవకులు, సందర్శకులకు సహాయకరంగా వున్నారు. అక్కడ సామాను ఇచ్చి , token తీసుకొని, ఇంకొంచం ముందుకు నడిస్తే, విశాలమైన ప్రాంగణము, బాటకు అటూ ఇటూ చిన్న చిన్న దుకాణాలు, అక్కడక్కడా పెద్ద వృక్షాలు, క్రమశిక్షణతో పెరుగుతున్న ప్రహరీ మొక్కలుతో చూడటానికి ఎంతో ఆహ్లదకరంగా వుంది. ఇక్కడ ముఖ్యంగా ధ్యాన లింగం, లింగ భైరవి, సూర్యతీర్థకుండ్, చంద్రతీర్థకుండ్ మరియు ఆదియోగి తప్పక చూడవలసినవి. 112 అడుగుల ఎత్తుతో, గిన్నీస్ బుక్ లో చోటు చేసుకున్న, Bust size శివుని విగ్రహమే ఆదియోగి. అన్నిచోట్ల గంట, గంటన్నర సమయం కేటాయించుకున్నాము. కాని చాల దూరాలు నడవటము, ఎత్తైన పెద్ద పెద్ద మెట్లు ఎక్కడం వలన, ఎక్కువ సమయం పట్టింది. బహుశా మొదటి సారి అవటం వలన, అన్నీ చూస్తూ, దారి తెలుసుకుంటూ ఎక్కువ సమయం తీసుకున్నాము. ముందుగా తీర్థకుండ్ వైపుకు నడిచాము. మొదట పురుషులకోసం కేటాయించిన సూర్యతీర్థకుండ్ వస్తుంది. దానిని దాటుకుని పక్కనుంచి, వెనుకకు వెళితే స్త్రీలకు ప్రత్యేకించిన చంద్రకుండ్ వస్తుంది. ప్రవేశద్వారం పక్కన వున్న `counter` లో, మాతో వున్న నగలు, మనీపర్సులు వారికిస్తే, అన్నీ ఒక లాకర్ లో పెట్టి తాళం చెవి మా కిచ్చారు. లోపలకు వెళ్ళిన తరువాత స్వచ్ఛంద సేవికలిచ్చిన, మందపాటి వస్త్రం తో తయారు చేసిన, రాత్రిపూట ధరించే గౌను వంటిది ధరించాలి. బట్టలు మార్చుకోవటానికి వీలుగా, స్నానపు గదులు చాలా వున్నాయి. తరువాత shower తీసుకుని, తడిబట్టలతో దాదాపు 30 మెట్లు దిగాలి కిందకు. అక్కడ చిన్న తటాకము, ఎత్తైన గోడలు, పైకప్పుతో వుంది. మధ్యలో శివలింగం, ఒక పక్క గోడపైనుండి పడుతున్న జలపాతంతో, చల్లగా వున్న వాతావరణం లో, నీళ్ళలోకి దిగాలంటే, ముందు కొంచం సంశయం కలిగింది. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టూ దిగుతూ, నీటి చల్లదనం లోకి అలవాటు పడుతూ, పూర్తిగా దిగి శివలింగం చుట్టూ తిరుగుతూ, శివుని స్పర్శిస్తూ , జలపాతం కిందకు చేరినాక, ఇహ బయటకు రాబుద్ధి కాలేదు. ఆ ప్రశాంతతను, చల్లదనాన్ని అనుభవిస్తూ చాల సేపు వుండిపోయామక్కడే. నీటినుంచి బయటకు రాగానే, శరీరం తేలికైనట్లు, బడలిక అంతా పోయి, ఎంతో హాయిగా, శక్తివంతంగా, అనిపించింది.
తీర్థకుండ్ చిత్రాలు ఈ కింది లంకె లో చూడవచ్చును.
https://isha.sadhguru.org/in/en/center/consecrated-spaces/theerthakund
అక్కడినుండి ధ్యానమందిరం వైపు కదిలాము. దారిలో శివుని అర్చనకోసం, ఆవునెయ్యి వేసిన దీపాలు మరియు తామరపూలు అమ్ముతున్నారు. అవి తీసుకుని Dome ఆకారం లో వున్న చాలా పెద్దదైన ధ్యానమందిరం లోకి అడుగుపెడుతూనే ఎదో ఒక శక్తి తరంగం తాకినట్లనిపించింది. మనకిష్టమయినంతసేపు అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ప్రతి 15 నిమిషాలకు చిన్న గంట శబ్దం వినిపిస్తుంది. అప్పుడు బయటకు వెళ్ళవచ్చు. కొత్తవారు లోనికి రావచ్చు. మధ్యలో శబ్దం చెయ్యటం కాని, కదలికలు కాని వుండరాదు. ధ్యానమందిరం మధ్యలో, మహాశక్తివంతమైన శివలింగం ప్రతిష్టించారు, సద్గురు 1999 లో. శివలింగం చుట్టూ చదరంగా వున్న నీటికొలను గట్టుమీద దీపాల అలంకరణ, Dome లోపలి భాగంలో, వలయాకారంలో అమర్చిన దీపాల అలంకరణ, శివలింగం చుట్టూ వున్న నీటిలోని తామరపూలు, శివలింగాన్ని అలంకరించిన పూలు, అన్నీ కలిసి, ఒక దివ్య సుగంధాన్నిస్తూ, ప్రశాంతమైన ఆధ్యాత్మిక భావనను కలుగచేస్తుంది. చాల త్వరగా ధ్యానం లోకి వెళ్ళిపోతాము, ఆ పరిసరాలలో.
అక్కడినుండి లింగభైరవ ఆలయానికి వెళ్ళి, కొంచంసేపు కూర్చుని, హారతి చూసి, బయటకు వచ్చి, ప్రసాదంగా ఇస్తున్న పాయసం తీసుకుని, పక్కనే వున్న విశాలమైన సావనీర్ షాప్ కు వెళ్ళాము. అక్కడ దుస్తులు, గృహ అలంకరణ వస్తువులు, గృహొపకరణ వస్తువులు చాల అందమైనవి, సాంప్రదాయబద్ధమైనవి, ఇంకా అనేకమైన ఇతర వస్తువులు,అన్నీ కొనేయాలనిపించేంత బాగున్నాయి. అక్కడ కొన్ని పుస్తకాలు, సావనీర్లు కొని బయటకు వచ్చాము. నెమ్మదిగా నడుచుకుంటూ రహదారికి అటూ, ఇటూ వున్న చెట్లను పరిసరాలను చూస్తూ ఆదియోగిని ప్రతిష్టించిన ప్రాంతానికి చేరుకున్నాము. కొన్ని వేలమంది సౌకర్యంగా కూర్చోగలిగినంత పెద్దగా వున్నదాప్రదేశం. 112 అడుగుల ఎత్తున్న, ఆదియోగి Bust size విగ్రహం యొక్క గంభీరమైన ముఖకవళికలలో, అలోకికమైన చిద్విలాసం గోచరిస్తుంది. నిజంగా శివుడు దిగివస్తే ఇలాగే వుంటాడేమో అనిపించింది. విగ్రహనికి ముందు వైపు చిన్నపాటి మండపం నిర్మించబడి వుంది. మండపం లోపల ప్రతిష్టించిన శివలింగం చుట్టూ కొందరు ధ్యానం చేస్తూ కూర్చున్నారు. మైకు లో సద్గురు గానం చేస్తున్న శివ స్త్రోత్రం, నెమ్మదిగా వినిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న కలశాలలో, నీరు అమ్ముతున్నారు. పద్మ, మణి పూజలు బాగానే చేస్తారు. నేను, రాజ్యలక్ష్మి వాళ్ళని అనుసరిస్తాము. తలా ఒక నీటి కలశం తీసుకొచ్చి శివలింగాన్ని అభిషేకించాము. ప్రశాంతమైన ఆ ప్రదేశంలో ఎంతసేపు కూర్చున్నా, ఇంకాసేపు వుండాలనే వుంటుంది. ఆ రోజు సద్గురు, enlighten అయిన రోజట. ఆ సందర్భంగా రాత్రి 7 గంటలకు Laser Show వుంది. చాలా బాగుంటుంది, చూసి వెళ్ళండి అని అక్కడి Volunteers అన్నారు. మామూలుగ, అక్కడ శని, ఆదివారాలు, కొన్ని ప్రత్యేక దినాలలో, Laser show వుంటుందట. ఏవో కొన్ని అనివార్య కారణాలవలన, ఆ రోజు show రద్దయింది. అక్కడి ఫలహారశాలలో తేలికపాటి ఆహారం తీసుకుని, మా హోటల్ గదికి చేరేసరికి సమయం 10 గంటలు దాటింది. మరుసటి రోజు సాయంకాలమే మా తిరుగు ప్రయాణం. ఈ వారం రోజుల, మా ప్రయాణపు అనుభవాలను నెమరువేసుకుంటూ, రాత్రి పొద్దు పోయేవరకు మేలుకోవటం వలన, తెల్లవారి ఆలస్యంగా నిద్ర లేచాము.
కొయంబత్తూర్ లో Car Museum, 20,000 మంది కూర్చుని ప్రార్థన చేసుకొనగలిగినంత పెద్ద దర్గా, మరియు పెద్ద పూల మార్కెట్ చూడతగినవి. ఈ రోజే ఆఖరి రోజు మా విహారానికి. అందువలన, ఇక్కడ ప్రసిద్ధి గాంచిన Textiles shop కు వెళ్ళాలనుకున్నాము. బయటకు మాత్రమే షాపు. లోపలికి వెళుతున్న కొద్దీ, చాలా విభాగాలతో, ఎటు వెళ్తున్నామో కూడా తెలియనంత, పెద్దదిగా వుంది. దానిని షాపు అనలేము. Factory sheds వలె వున్న పెద్ద shed లో పాకింగ్, డెలివరి, వేచి వుండు గది వగైరా అన్ని సదుపాయాలున్నాయి. అక్కడొక Board చూసాను. దాని మీద No Credit, No return, No exchange అని వ్రాసివుంది. అయినా, తండోప, తండాలుగా, కొనుగోలుదారులు వస్తున్నారు. దూరంగా వున్న మేనేజర్ ను కలిసి అడిగాను ” Board మీద అన్ని షరతులున్నా, ఇంతమంది వస్తున్నారు. మీ రహస్యం ఏమిటి?” చిన్న నవ్వుతో, “నాణ్యత మరియు అందుబాటు ధరలు” అని జవాబిచ్చాడు. మాకు కావలసిన చీరలెంచుకుని, డబ్బులు కట్టి, చీరల పాకెట్ తీసుకుని హోటల్ కు చేరుకున్నాము. మా హోటల్ విమానాశ్రయానికి దగ్గరలోనే వుంది. మా వస్తువులన్నీ పాక్ చేసుకుని, నా పూల మొక్కలతో సహా, కారు లోకి ఎక్కించాము. మా కారు విమానాశ్రయం వైపు ప్రయాణిస్తుండగా, ఇల్లు, ఇంటిలోని సభ్యుల గురించిన అలోచనలు చుట్టుముట్టాయి. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటామా అని తొందర పడింది మనసు. కోయంబత్తూర్ లో బయలుదేరిన విమానం గంటా 10 నిమిషాల తరువాత హైదరాబాదు చేరుకుంది. సఖులతో సరదాగా, విహారం పూర్తిచేసుకుని, వారివద్ద సెలవు తీసుకొని, ఇంటికి బయలుదేరాను.
*****
సి.వి.రమణ: గృహిణి. హైదరాబాదు నివాసం. సంగీతం, పర్యావరణం, సాహిత్యం ఇష్టం. రక రకాల మొక్కలను పెంచటంలో ఆనందం. స్త్రీల సమస్యలపై ఆకాశవాణిలో పలు ఉపన్యాసాలిచ్చారు. కొన్ని కథలు, వ్యాసాలు వనితాజ్యోతి, విపుల వగైరా పత్రికలలో ప్రచురితమయ్యాయి.