ఆడియో కథలు
శివంగి (కథ) (ఆడియో)
రచన: కె.వరలక్ష్మి
పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి
“శివంగి కష్టాన్ని దుర్వ్యసనాలతో నోటికి అందకుండా నష్టపరుస్తున్న శివంగి భర్త, తిండి గింజలు కాజేయడమే కాకుండా, రాత్రంతా నిద్రలేకుండా చిరాకు పెడుతున్న ఎలుక ఇద్దరూ ఆమె నిస్సహాయతను ఆధారంగా చేసుకొని ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఈ రెండు దృశ్యాల్ని ‘శివంగి’ పాత్రలో సాదృశ్యం చేసింది రచయిత్రి. ఈ రెంటి నుంచి శివంగి విముక్తి కోరుకుంది. మొగుడి కంటే ముందు ఎలుక ఆమె కోపానికి గురైంది. ఆమె నిస్సహాయతతో ఆడుకొన్న ఎలుక, ప్రాణంపోయే సమయంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి, అది చూసిన చూపు సహజసిద్ధంగా ఆమెలోని జాలి, దయ, కరుణ గుణాలకు ప్రేరణగా పనిచేసింది. అందుకే అనుక్షణం పీడించే భర్తను (ఎలుక కోసం తెచ్చిన) ఎలకలమందుతో కాచిన టీతో చంపాలనుకుంది. కానీ భర్త క్రౌర్యం నిస్సహాయతలోకి పర్యవసించబోయే క్రమం ఆమెలో నిద్రానంగా వున్న ప్రేమ, బహిర్గతం కావడానికి దోహదకారి అయింది. ఫలితంగా ప్రాణాపాయ స్థితిలోకి పోబోతున్న భర్తను ఆ స్థితి నుండి తప్పించింది. అసహ్యంతో, అవమానంతో రగిలిపోయే ఆమె హృదయం స్థానంలో ఆర్ద్రత ప్రవేశించింది. అసహ్యించుకొన్న భర్తను ఆర్తితో హత్తుకో గలిగింది. స్త్రీల ప్రేమలోని ఔన్నత్యాన్ని ఉన్నతీకరించడమే వరలక్ష్మి కథా దృక్పథం.
సత్యం ఎప్పుడూ ఒక తీరుగా వుండదు. అది శకలాలు శకలాలుగా మార్పుకు గురవుతూ, విచ్ఛిన్నమౌతూ వుంటుంది. శివంగి భర్త ప్రాణాలు తీయాలనుకోవడం సత్యం. కానీ ఆ భావన విచ్ఛిన్నమవడానికి కారణభూతమైన అంశాలు శివంగి భవిష్యత్తు చిత్రపటాన్ని మార్చేవి కావు ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. ఎందుకంటే నోటి ముందున్న టీని కర్రతో తోసేసిన, ఆమె భర్త “నీయయ్య… అంటూ తిట్లకు లంకించుకుంటాడు. శివంగి అనుభవిస్తున్న హింసగానీ, ఆ హింసకు కారణపై భర్త ప్రవర్తనలో గానీ ఏ మార్పు వుండదు. విషయం తెలిసి కూడా ఆమె అలా ఎందుకు ప్రవర్తించింది? అనే ప్రశ్నలో హేతుబద్ధత వుందేమో గానీ మానవసంబంధాల అభిమాన వికసనక్రమంలో ఆ హేతుబద్ధతకు అవకాశం లేదు.”
– డా||కె.శ్రీదేవి
““శివంగి” కథంటే ప్రత్యేకమైన ఇష్టం నాకు. ఎంచుకున్న కథా వస్తువు, ఎత్తుగడ, ముగింపు, కథాశైలి అన్నిటా ప్రత్యేకమైన కథ అది. అసలే వ్యసనపరుడైన భర్తతో విసిగిపోయిన శివంగి కథలో చికాకు పెట్టే ఎలకని మధ్యమధ్య చొప్పించడం, ఎలుకల కోసం తెచ్చిన మందు భర్తకి కలిపిచ్చి వదిలించుకోవాలనుకున్నా చివరి నిమిషంలో స్త్రీ సహజమైన మానవీయత, బేలత్వం ఎలా పనిచేస్తాయో చెప్పిన అద్భుతమైన కథ. అంతర్జాతీయ స్థాయిలో గొప్పకథలు వేటికీ తీసిపోని కథ.”
– డా||కె.గీత