వెనుతిరగని వెన్నెల(భాగం-8)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-8)

డా||కె.గీత

 

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)

——-

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని  చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికీ పరిచయమవుతుంది. ఇరు వైపులా పెద్ద వాళ్లు  ఒప్పుకుని పెళ్లి మాటల వరకు వస్తారు.

***

మర్నాడు ఉదయమే  పెళ్లి. తన్మయి ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పెళ్లి. 

శేఖర్ వాళ్లు ఇప్పటికే వచ్చేయాలి. కానీ దేనికో అలిగి ఉదయం వస్తామన్నారు.   

“వాళ్ల వైపు నుంచి నచ్చనివెన్నో  ఒప్పుకుని తనవాళ్లు పెళ్ళి జరిపిస్తున్నారు. ఇంకా ఏం కావాలి వాళ్లకి?” తన్మయికి అస్సలు నిద్ర పట్టడం లేదు. 

ఎటు ఒత్తిగిలినా ఇవే ఆలోచనలు. ఒక వైపు “పెళ్ళి” అనుకోగానే ఏదో తెలీని ఉద్వేగస్థితి గుండెని వేగవంతం చేస్తూంది. మరో వైపు అసలివన్నీ సక్రమంగా  జరుగుతాయో లేదో అని భయం పట్టుకుంది.    

డాబా మీద అందరితో కలిసి పడుకున్నా తెలీని భయం. పక్కనే ఉన్న అత్తయ్య తన అవస్థ గమనించినట్లు “పడుకోమ్మా! రేపు పెళ్లిలో ముఖం పీక్కుపోయినట్లవుతుంది” అంది. 

మృదువైన అత్తయ్య చేతిని ఆనుకుని దగ్గరగా జరిగి పడుకుంది తన్మయి. రాత్రి ఎలా గడిచిందో తెలియలేదు.

తెల్లారగట్ల జ్యోతి వచ్చి కూతురిని లేపింది.”తన్మయీ! పెళ్ళి వారొచ్చారు”.

వెలిగి పోతున్న తన్మయి నవ్వు ముఖం చూసి అత్తయ్యలు ఆట పట్టించడం మొదలుపెట్టేరు.

ముందు శేఖర్ తల్లి దేవి మరికొందరు ఆడవాళ్లు వచ్చేరు. అప్పటికీ శేఖర్ రాలేదు. 

పెళ్లి సమయానికి శేఖర్ తండ్రి తో కలిసి వస్తాడట. చుట్టాలు రహస్యంగా చెవులు కొరుక్కోవడం తన్మయి చెవిన పడింది. “ఇదేం విడ్డూరం! ఇప్పటికింకా పెళ్లి కొడుకు రాలేదూ!” 

ప్రదానం కార్యక్రమం మొదలయ్యింది. ఆడవాళ్లు మాత్రమే పాల్గొనే కార్యక్రమం అది. 

పక్కనేవో మంత్రాలు వినిపిస్తూండగా దేవి తన్మయి మెళ్లో పసుపు తాడు వేసి చెవిలో మూడు సార్లు “….. వారి కోడలు” అని చెప్పింది.

తన్మయి తల వంచుకుని  మనసులో ఆనందం పల్లవిస్తూండగా తనిక “వీరి కోడలు” అని  మెల్లగా తనలో తను అనుకుంది.

మరో గంటలో ముహూర్తం అనగా “పెళ్లి కొడుకు వాళ్లు ఊరి చివరి వరకూ వచ్చి ఆగి ఉన్నారు” అని కబురు వచ్చింది.

ఆఘమేఘాలతో మంగళ వాయిద్యాల వారు పరుగులు పెట్టారు. 

వీధి మలుపు చివర పూలతో అలంకరించిన కారు, ముందు మంగళ వాయిద్యాలు, తోడు నడుస్తూన్న పెళ్లి వారిని కిటికీలోంచి చూసింది తన్మయి.

తన్మయి గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలైంది.

ముహూర్తానికి ఎక్కువ సమయం లేనందున వస్తూనే పెళ్లి కొడుకుని బట్టలు మార్పించేసినట్లున్నారు. శేఖర్ తెల్ల బట్టల్లో లేడు. తనకూ పాత లంగా ఓణీ వేసారు. మంగళ స్నానాలు పక్క పక్కన కూచో బెట్టి మొదలు పెట్టేరు. ముందు కాలి గోళ్ళు తీసి, తర్వాత పసుపులు రాసి తల మీంచి నీళ్లు పోసేరు. 

ఒక పక్క ఎవరి మాట ఎవరికీ వినిపించని వాయిద్యాల గోల, చుట్టూ పెద్ద వాళ్ల హడావిడి మాటలు, పిల్లల గందరగోళం. వీటన్నిటిలో తన్మయికి శేఖర్ ముఖం వైపు ప్రశాంతంగా చూసే అవకాశమే కలుగలేదు. పక్కన కూచోబెట్టగానే “ఏవిటింత ఆలస్యం” అంది తల వంచుకుని.

తన మాట వినబడనట్లు అట్నించి సమాధానం ఇవ్వలేదు శేఖర్.

ఇద్దరినీ లేవదీసి చెరో వైపుకి లోపలికి తీసుకెళ్లారు. సమయం ఎంతో లేనందున పెళ్ళి చీర గబగబా చుట్ట బెట్టేరు. ఒకరు జడ వేస్తూంటే మరొకళ్ళు పారాణి పెట్టేరు. పది నిమిషాల్లో తన్మయిని పెళ్ళి పందిట్లోకి తీసుకొచ్చేరు. 

అసలు చీర ఎలా వచ్చిందో చూసుకోలేదు. పెళ్ళి బొట్టు, బుగ్గ చుక్కా సరిచూసుకోలేదు.  అసలే తనకు నచ్చని రంగు పట్టుచీర. అందులోనూ పది నిమిషాలు స్థిమితంగా తయారయ్యే అవకాశం లేదు. 

పెళ్ళి పీటల మీద శేఖర్ తెల్ల బట్టల్లో మిలమిలా మెరిసి పోతున్నాడు. తల ఎత్తి ఎక్కడా చూడొద్దని మేనత్త మరీ మరీ చెప్పింది. అందుకే క్రీగంట చూసింది తన్మయి.

తనకి పట్టు చీర మీద తెల్ల నూలు చీర ని క్రాస్ గా రెండు భుజాల మీద నుంచి కప్పేరు. 

తడి తలమీద జడ గంటలు, ఆపైన బరువైన చేమంతి పూల జడ. మెడ వెనక్కి లాగేస్తూంది తన్మయికి. వేసవిలో పెళ్లి కాబట్టి మల్లెపూల జడ తెప్పించమని చెప్పింది తన్మయి.  చేమంతిపూల జడైతే ఎక్కువ సేపు వాడిపోకుండా ఉంటుందని జ్యోతి అభిప్రాయం. చివరికి అదే తెచ్చేరు పూల జడకి వెళ్లిన వాళ్ళు.  

పెళ్ళి పీటల మీద ఒక వైపు తన్మయి, జ్యోతి, భానుమూర్తి; మరో వైపు  శేఖర్, అతని తల్లిదండ్రులు కూచున్నారు. మధ్య తెర అడ్డుగా పట్టుకున్నారు.  కన్యాదానం సమయంలో తెర కింద నుంచి ఇత్తడి పళ్ళెంలో శేఖర్ పారాణి పాదాలు తెల్లగా దృఢంగా కనిపించాయి. తల్లి నీళ్ళ చెంబుతో నీళ్లు పోస్తూండగా తండ్రి కాళ్లు కడుగుతున్నాడు. తన్మయికి మనసులో ఏదో ఇబ్బంది కలిగింది. “ఇదేం ఆచారం? చిన్న వాళ్ల కాళ్లు పెద్ద వాళ్లు కడగడం? ఎప్పుడూ ఎవరి దగ్గరా తల వంచని తండ్రి తన కోసం ఒక కుర్రాడి కాళ్లు పట్టుకుంటున్నాడు.” 

తెర తీయక ముందే జీల కర్రా బెల్లం ముద్దలు ఇద్దరి తలల మీదా ఇద్దరి చేతా పెట్టించారు. అప్పుడే తీసిన తెర వెనుక నుంచి పున్నమి చంద్రుడిలా అద్భుతంగా కనిపించాడు శేఖర్. అతని తలమీద తన చేయి, తన తల మీద అతని చేయి. “ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు కదూ” అని ప్రమాణాలు చేసుకుంటున్నట్లు. ఈ తతంగమంతా కొత్తగా, బెరుకుగా, ఆనందంగా, తమకంగా, అర్థమయీ, అర్థం కాకుండా ఉంది తన్మయికి. కళ్లెత్తి తను చూసిన తొలి క్షణం నవ్వే కళ్లతో కన్ను గీటాడు శేఖర్. సిగ్గుగా తల దించుకుంది మళ్లీ.

మాంగల్యం కట్టడం కోసం అతను లేచి నిల్చున్న క్షణం మనసు వశం తప్పినట్లయ్యింది. ఎవరో జడను ఎత్తి పట్టుకున్నారు. మెడలో అతి చిన్ని మాంగల్యాలు రెండు వైపుల నించీ రెండు కట్టి మూడు ముళ్ళు వేసాడు శేఖర్. అక్కడా నిరాశే. తనకు పెద్ద కాసులంతటి మాంగల్యాలు ఇష్టం. ఇవేవిటి కనీ కనబడకుండా. బహుశా: ఇరు పక్షాల బేరాల్లో ఇంతకే కుదిరేయన్న మాట. ఆ తలంపు రాగానే ఉత్సాహం పోయింది తన్మయికి.

తలంబ్రాల సందడి, బిందెల్లో ఉంగరాల ఆట బాగా నచ్చాయి తన్మయికి. కానీ అంత మంది మధ్యలో కూచుని పసిపిల్లల్లా ఈ వినోదవేమిటో అని అనిపించింది. 

 

చుట్టూ ఉన్న వాళ్లు వరసగా అక్షింతలు వేయడానికి రావడం డబ్బో, గిఫ్టో ఇచ్చి పక్కన నోటు పుస్తకాలు పుచ్చుకుని కూచున్న వాళ్లతో చెప్పి రాయించడం మరీ ఎబ్బెట్టుగా తోచింది తన్మయికి. అదేదో పద్దులు వసూలు చేస్తున్నట్లు.

ఒక పక్క పెళ్ళి తంతు పూర్తయీ కాగానే అంతా భోజనాల హడావిడిలో పడ్డారు. పెళ్ళి పీటల మీద నుంచి లేపి, పెళ్ళి పందిట్లో  రెండు కుర్చీల్లో కూచోబెట్టారు ఇద్దరినీ. కానీ ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకోవడానికి లేదు. నిమిషానికొకరు వచ్చి అక్షింతలు వేయడంతో సరిపోతూంది.

మొత్తానికి ఎలాగో శేఖర్ ని అడిగింది తన్మయి “ఎందుకు ఆలస్యమయిందని?”  

“అవన్నీ ఇప్పుడు అవసరమా?” అన్నాడు బదులుగా ఎటో చూస్తూ.

భోజనాలు కాగానే  అప్పటికప్పుడు పెళ్లికూతుర్ని తమతో పంపేయమని వెళ్లిపోతామన్నారు శేఖర్ వాళ్లు.

సాయంత్రం వరకూ ఆగమన్నా వినిపించుకోలేదు.

జ్యోతి ముఖం పెళ్లి సమయమంతా అప్రసన్నంగా ఉండడం చూసి “ఏం గొడవ పడ్తారో” అని తన్మయికి కొత్త టెన్షన్ మొదలైంది.

అదృష్టవశాత్తూ తన్మయి తరఫు నించి ఎటు వంటి గొడవా చెయ్యలేదు.

అమ్మాయిని అప్పటికప్పుడు పంపించమంటే సారె సర్దడానికి రెండు గంటల వ్యవధి ఇమ్మని అడిగేరు.

త్వరత్వరగా తనకి రెండు జతల బట్టలు సర్ది పెట్టేరు. మర్నాడు శేఖర్ వాళ్లింట్లో రిసెప్షన్. మూడో రోజుకి మళ్లీ తిరిగి రావాలి. 

కారు ఎక్కిన మరుక్షణం దు:ఖం పొంగుకొచ్చింది తన్మయికి. తల్లిని,  తండ్రిని, అమ్మమ్మని వదిలి తను ఒక్కతే ఎక్కడికో దూరానికి వెళ్లిపోతూందన్న సత్యం మొదటి సారి బోధ పడినట్లయ్యింది.

శేఖర్ భార్యగా జీవితం మొదలయ్యిందన్న సంతోషం మచ్చుకైనా లేదు. దు:ఖం… దు:ఖం .. అంతులేని దు:ఖం.

ప్రయాణం మొదలయ్యి అరగంట దాటినా తన్మయి ఏడుస్తూనే ఉంది.  పక్కనే కూచున్న శేఖర్ తన్మయి చెయ్యి పట్టుకుని, కారు ముందు సీట్లో కూచున్న అతని బాబాయితో కులాసాగా కబుర్లు చెప్తున్నాడు.

మధ్య మధ్యలో ఊరుకోమన్నట్టు చేతిని గట్టిగా ఒత్తేవాడు. కాస్సేపటికి ఇక ఓపిక పట్టనట్లు “ఒసేయ్, ఎందుకే ఇంత ఏడుస్తున్నావు మీ అమ్మానాన్నా రేపు రిసెప్షన్ కి  వస్తున్నారుగా” అన్నాడు. 

తన్మయి బిత్తరపోయి చూసింది  “శేఖర్ తనని “తనూ” అని ప్రేమగా పిలుస్తాడనుకుంటే “ఒసేయ్” అని చెత్త పిలుపు పిలిచినందుకూ, అమ్మానాన్నల్ని ఒదిలి రాలేని తన బాధ అతనికి కాస్త కూడా అర్థం కానందుకూ.”  

వనజ జ్ఞాపకం వచ్చింది. “పెళ్ళయ్యాక నలుగురం కలుద్దాం.” అన్న మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. “వనజ ఏం చేస్తూందో!  ఇంటికి తిరిగి రాగానే తనని ఎలాగైనా కలవాలి” అనుకుంది.

“ఏదీ తను అనుకున్నట్లు జరగని ఈ పెళ్ళి ఏవిటో” అన్న భ్రాంతిలో ఉన్న తన్మయి శేఖర్ మాటల్తో ఈ లోకంలోకి  వచ్చిపడ్డట్లయ్యింది.

ఇంకాస్త దు:ఖం పెరిగింది. దు:ఖాన్నయితే బలవంతంగా ఆపుకుంది కానీ, బాధ పదింతలయింది.

మెల్లిగా శేఖర్ చేతిలోనుంచి తన చేతిని పక్కకి తీసుకుని కళ్ళు మూసుకుని వెనక్కి జేరబడింది తన్మయి.

అది గమనించి తనూ కాస్త దూరం జరిగేడు శేఖర్. 

తన ఒళ్లంతా చేమంతి పూల వాసన చుట్టుముట్టి వికారం పెడుతూంది తన్మయికి. పట్టుచీర మీద వేసిన ఒడి గట్టు చీరలో కొంగున పోసి కట్టిన అయిదు కేజీల బియ్యం బరువు ఒకటి ఒళ్లో. తల మీద భారం, తల లోపల భారం.

కళ్లు మూసుకున్న తన్మయి మనస్సులోకి ఒక్కసారిగా అజ్ఞాత మిత్రుడి జ్ఞాపకం మెదిలింది.

“మిత్రమా! నాకు శక్తినివ్వు. ముందుకు అడుగువేసే చేయూతనివ్వు.” అనుకుంది.

కళ్లు విప్పి కారు బయట పరుగెడుతున్న చెట్ల వైపు చూసింది. అద్దాల తలుపుల్లోంచి రివ్వున వీస్తున్న వేడిగాలి ముక్కు పుటాల్లో మంట పుట్టిస్తూంది.

దాహం వేసి మంచి నీళ్ళు అడిగింది శేఖర్ని. డ్రెవరుతో చెప్పి త్రోవ పక్క కొబ్బరి బొండాల కొట్టు దగ్గిర ఆపేడు శేఖర్ బాబాయి.

తన్మయి శేఖర్ వైపు చూసింది. 

“నువ్వు దిగకు.” అంటూ శేఖర్ కారులోంచి దిగబోయేడు. కానీ ఇద్దరికీ  కలిపి కట్టిన బ్రహ్మ ముడి వల్ల కారు పక్కనే నిలబడాల్సి వచ్చింది.

అతనికి వీలయ్యేంత వరకూ తన కొంగుని జరిపి కళ్లు దించుకుంది తన్మయి. కొబ్బరి బొండాన్ని నిశ్శబ్దంగా తాగింది.

“హమ్మయ్య, ఏడుపు ఆపేవు మొత్తానికి” అన్నాడు మళ్లీ కారు బయలుదేరగానే.

“ఇదిగో మనిద్దరికీ కట్టిన ఈ చెంగు ఇవేల్టికి మాత్రమే, రోజూ నన్నిలా కొంగున కట్టేసుకుంటాననుకోకు” అన్నాడు మళ్లీ. కారులో ముందు సీట్లోంచి పకాలున నవ్వు వినబడింది.

తన్మయికి నవ్వు రాలేదు. నిస్తేజంగా మళ్లీ వెనక్కి జేరబడి కళ్లు మూసుకుంది.

“ఏవిటే బాబూ, రాత్రంతా నిద్రపోనట్లు ఇంత మొద్దు నిద్దర పోతున్నావు, అదుగో మా ఊరు వచ్చింది. ఇకలే” అన్నాడు శేఖర్ భుజాన తడుతూ.

“మిత్రమా! వెళ్ళి వస్తానూ, నాకోసం బెంగ పడకూ, రాలే పూల పందిరి దాపున వెక్కి వెక్కి పడకూ..” మనసులో అజ్ఞాత మిత్రునితో సంభాషిస్తూన్న తన్మయికి

“శేఖర్ తన తలని ఆప్యాయంగా హత్తుకుని, మనిద్దరి కలల ప్రపంచంలోకి కలిసి అడుగులేద్దాం రా నేస్తమా!” అంటే బావుణ్నని అనిపించింది.

మనసున జరుగుతూన్న సంభాషణకి, బయట జరుగుతూన్న సంభాషణకి పొంతన కుదరక అయోమయంగా చూసింది.

“ఆ ఎర్రని కళ్లేవిటి? మందు కొట్టినట్లు” అని పకాలున నవ్వేడు శేఖర్.

శేఖర్ తనని తల్లిదండ్రుల కంటే గారాబంగా చూస్తాడని ఆశించిన తన్మయికి అతనితో గడుపుతున్న మొదటి పూటే ఆశాభంగం అయ్యింది. 

సాయంత్రం అత్తవారింట్లో అడుగు పెట్టేటప్పుడు గుమ్మం దగ్గిర దిష్టి తీస్తూ ఎవరైనా పాటలు పాడతారేమోనని చూసింది తన్మయి. అటువంటి ఛాయలు ఏవీ కనిపించలేదు. 

“తమ బంధువుల్లో ఎవరింటికి కొత్త పెళ్లికూతురొచ్చినా గుమ్మంలోపలికి పెట్టే మొదటి అడుగు ఎంత విశిష్టంగా, గొప్ప అందంగా ఉండేది! ఆహ్వానం పలుకుతూ పాడే పాటలు, పారాణి పాదాలు, కాలికి మట్టెలు…ఓహ్! తనెన్ని కలలు కంది ఈ క్షణం కోసం!”

చీర కుచ్చెళ్లు పైకెత్తి కాలి మట్టెల వైపు, పిల్లేళ్ళ వైపు చూసుకుంది తన్మయి. అందమైన పొడవైన వేళ్లకి సరిగ్గా అమిరేయి.

అద్దంలో చూసుకుంది. పొద్దుటి నించీ జిడ్డు పట్టిన ముఖాన మెత్తిన కుంకుమ ముక్కు మీద కారుతూంది. నెత్తిన జీలకర్ర బెల్లంతో జుట్టు అట్టలు కట్టి  ఉంది. దారిలో కారు సీటుకి జేరబడేసరికి నలిగిపోయిన  పూలజడ ఒక పక్కగా జారి వేళ్లాడుతూంది. 

“త్వరగా మొహం కడుక్కోండి, పెద్ద నాన్న గారు, చిన్నాన్న గార్ల ఇళ్లకి ఒడి బియ్యం చల్లడానికి వెళ్లాలి” అంది దేవి హాలులో కూచోబెట్టిన కొత్త జంట తన్మయి, శేఖర్ లతో.

ఇంకా ఒకరికొకరికి కలిపి కట్టిన కొంగుముడి ఉండడంతో తన వైపు చెంగు పక్కన కుర్చీ మీదికి వేసి బాత్రూములోకి వెళ్లింది తన్మయి.

ఒక్క సారిగా ఏడుపు తన్నుకు వచ్చింది మళ్లీ. ఆ ఇల్లు, ఆ మనుషులు… అంతా కొత్త వాళ్ల మధ్య అస్సలు ఉండాలనిపించడం లేదు. తనతో బాటూ తోడు వచ్చిన పిన్ని, బాబాయిలతో ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాలనుకుంది.

ముఖం కడుక్కుని రాగానే పిన్ని “బంగారు తల్లి, ఎంత బాగున్నావో ఈ అలంకరణలో. ఏదీ బొట్టూ పెడతా” అని బుగ్గలు పుణికింది.

తన్మయి కళ్లలో నీళ్ళు చూసి” ఇలా చూడమ్మా, ఇక మీదట ఇదే నీ ఇల్లు. మొదట్లో ఇలాగే బాధ వేస్తుంది, తర్వాత అంతా మామూలయిపోతుంది” అంది పిన్ని.

బంధువుల ఇళ్లలో వడి బియ్యం చల్లి ఇంటికి వచ్చేసరికి నిస్సత్తువ వచ్చేసింది తన్మయికి.

శేఖర్ మంచి ఉత్సాహంగా కబుర్లు చెప్తున్నాడు. 

ఎందుకో శేఖర్ తండ్రి అప్రసన్నంగా కనిపించాడు తన్మయికి. ఆయనకు తనంటే బొత్తిగా ఇష్టం లేదు కాబోలు అనుకుంది.

అందరి ఎదుటా తనతో మాట్లాడొద్దని శేఖర్ ఆర్డరు వేశాడు. తన్మయికి అసలేమీ తోచడం లేదు. ముందు రోజంతా సరిగా నిద్రపోలేదేమో, ఎప్పుడు కాస్త తిని మంచాన పడదామా అని ఆత్రంగా చూసింది.

పిన్ని నవ్వుతూ వచ్చి “శోభనానికి ముహూర్తం పెట్టేరు. ఎల్లుండి మీ ఇంట్లో” అని చెవిలో గొణిగింది.

తన్మయికి సిగ్గు ముంచుకు వచ్చింది. అయినా తనకు అర్థం కానట్లు మొహం పెట్టి నిశ్శబ్దంగా చూసింది.

రాత్రి భోజనాలయ్యి కొంగు ముడి తీసెయ్యగానే తన దోవన తను పిన్ని పక్కకి చేరి మొద్దు నిద్దర పోయింది ఆదమరిచి.

మర్నాడు శేఖర్ ఇంట్లో రిసెప్షన్. రిసెప్షన్ చీర కాస్త నచ్చింది తన్మయికి. మరీ అంత ముదురు రంగూ, లేత రంగూ కాని చిలకాకు పచ్చని పట్టుచీరకి గులాబీ రంగు అంచు.

శేఖర్ ఏదో నప్పని రంగు పాంటు, చొక్కా వేసుకున్నాడు. “అయినా సహజంగా అందగాడు కాబట్టి ఏ రంగైనా నప్పుతుంది అనుకుంది” అనుకుంది తన్మయి.

వచ్చే పోయే వాళ్లతో ఆ రోజల్లా హడావిడిగా గడిచిపోయింది. శేఖర్ తో ముఖాముఖీ మాట్లాడే అవకాశమే కలగడం లేదు. రిసెప్షన్ లో పక్క పక్కన కూచున్నపుడు మాట్లాడుదామంటే “ఇప్పుడు కాదు, తర్వాత” అన్నాడు శేఖర్.

*****

(ఇంకా ఉంది)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.