ఉత్తరాలు-ఉపన్యాసాలు-1
ఉత్తరం-1: మా అమ్మ కోసం (జే.ఎన్.సాల్టర్స్)
రచయిత: జే.ఎన్.సాల్టర్స్
స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి
మూలం: ఇంగ్లీష్
నేపథ్యం:
అమెరికాలో….. ఈస్ట్ కోస్ట్ లో పుట్టి, వెస్ట్ కోస్ట్ లో జీవిస్తున్న జే.ఎన్.సాల్టర్స్ స్త్రీవాద రచయిత, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పీ.హెచ్.డీ విద్యార్థిని. జాతి, లింగ, లైంగికత, మీడియా, రాజకీయాల పైన రచనలు చేస్తున్నారు. మదర్స్ డే ను పురస్కరించుకొని వ్రాసిన ఈ ఉత్తరం “A Love Note to Black Mothers on Mother’s Day” అనే టైటిల్ తో “హఫ్ పోస్ట్” వెబ్సైట్ లో 5 మే, 2013 లో పబ్లిష్ చేయబడింది.
ఎందరో నల్లజాతి స్త్రీ పోరాట యోధులను, బానిసల కష్టాలు కడగండ్లు మళ్ళీ ఒకసారి గుర్తుకుతెచ్చే ఈ ఓపెన్ లెటర్ ….. అమెరికాలోని పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది.
***
(ఉత్తరం)
మా అమ్మ కోసం-
మన తల్లులు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, అత్త, పిన్ని, సోదరి కోసం; ఇంకా, అమెరికా అనే ఈ యుద్ధభూమిలో నలుపు, గోధుమ వన్నె యోధుల్ని పెంచుతున్న అందరు నల్ల స్త్రీల కోసం; మీ విలువను, మీ అందాన్ని తృణీకరించి, కేవలం మన ముఖాలపై చిరునవ్వు దివ్వెలు వెలిగించడానికి కూడా నిరాకరించిన ఈ ప్రపంచంలో బ్రతుకుదెరువు దారులు వెతికే మాతృమూర్తుల కోసం; కాంక్రీటు దిమ్మెలపైన రోజాపూలు పూయించగలిగే ….. స్త్రీల కోసం;
మిగిలిపోయిన అన్నం నుండి విందుభోజనం సృష్టించగలిగే ….. తల్లుల కోసం; మీ ఆనందాలను దొంగిలించే ప్రయత్నం చేస్తున్న ఈ జగత్తులో కూడా ….. మిమ్మల్ని గాఢంగా, హృదయపూర్వకంగా ప్రేమించే అమ్మల కోసం ….. నేను ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. ఇంకనూ, మీరు ఉవ్వెత్తున ఉదయిస్తున్నారు.
నేను కేవలం మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు అందమైనవాళ్ళు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కావాలి ….. నాకు మీరు కావాలి. మాకు మీరు కావాలి. నిజానికి ఈ పేజీలోని పదాలకన్నా చాలా ఎక్కువ పదాలతో మిమ్మల్ని అభినందించాలి. మీ జీవితంలోని ఒడిదుడుకులకన్నా; మీ ఆనందాన్ని, వైభవాన్ని వక్రీకరించిన మీడియా కన్నా; మీ పరిస్థితులను వెక్కిరించిన గణాంకాల కన్నా; కానరాని బొమ్మ యోధుల్ని ….. గాబి డగ్లెస్ లు, క్యూ వాంజెన్ వాలిస్ ల లాగ పెంచిన ….. మీ సృజనాత్మక ప్రతిభను పట్టించుకోని; “మరచిపోయిన కండ” లను మండుతున్న ఆత్మలుగా మార్చిన ….. మిమ్మల్ని అభినందించాలి.
మీ ముఖాలను పర్వతాలపై చెక్కడానికి మీకు యోగ్యత ఉన్నది. మిమ్మల్ని దోచుకొన్న ప్రెసిడెంట్ల ముఖాలు డాలర్ నోట్లపై కనపడకుండా మీ ముఖాలు అతికించడానికి; మీ చిత్తరువును మీకు వ్యతిరేకంగా వాడి, మీకు అబద్ధాలు చెప్పి, మీ దుస్థితిని మరుగు పరచి ….. మీలాగా మీ పిల్లల్లాగా కనిపించని గోధుమ వర్ణ చిత్రాలు ….. మీకు లేని నిమ్నత్వాన్ని అంటగట్టి ….. మీ ఫోటోలను, మీ అస్తిత్వాలను, ఓ మూలనో ….. ఏ చివర్లోనో, వెనుక వైపునో వేసి ….. మీపైన కట్టుకథల్ని కవర్ పేజిలో వేసే ప్రతి వార్తాపత్రిక, పాలడబ్బాలపైన మరియు “కనిపించుట లేదు” అని ప్రచురించబడే వార్తా కథనాలలో మీ గోధుమ వన్నె కనపడడానికి మీకు యోగ్యత ఉన్నది. మనం రోజా పార్క్స్ ము.
సంపన్నమైన మీ శరీర వర్ణంలో నిక్షిప్తమై ఉన్న చరిత్రను; విల్లులాగ వంగిన మీ వెన్ను చెప్పే రహస్యాలను; సారా బార్ట్ మన్ లాగా వయ్యారంగా నడిచినప్పుడు మలయమారుతంలో మీ పిరుదులు సృష్టించే బృహత్తర చిత్రాలను; మీ లావాటి పెదాలనుండి ప్రతిధ్వనించే సోజోర్నర్ ట్రూథ్, ఇడా.బి.వెల్స్, విల్మా రుడాల్ఫ్, హరియెట్ టబ్ మన్ భరించిన కష్టాలను; అంతంలేని ఉత్తుంగ తరంగం లాగ లేచి, విచ్చిన్నం కావడానికి నిరాకరించే మీ ఆత్మ శక్తిని అందరూ నా కళ్ళతో మిమ్మల్ని దర్శించగలిగితే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. నెలవంకలా వంగిన మీ కళ్ళనుండి మెరిసే చిన్న చిన్న ధ్రువ నక్షత్రాలు ….. దారి తప్పి పోయిన మమ్మల్ని….. పోగొట్టుకొన్న స్వేచ్ఛ వైపు నడిపిస్తాయి; నలుమూలల నుండి దూసుకు వచ్చే బుల్లెట్లను తప్పించుకునే సత్తానిస్తాయి. స్వప్నం చెదిరింది. విశాలమైన దారులు కుంచించుకుపోయి, నౌకల్లో బానిసలను కుక్కి తరలించిన రోజులను తలపింపజేస్తున్నాయి.
ఏదో ఒక రోజు, వాళ్ళు మిమ్మల్ని చూస్తారని ….. నాలో, మాలో మిమ్మల్ని చూస్తారని ప్రార్థిస్తూ,
ప్రేమతో,
మీ బిడ్డల్లో ఒకర్తెను.
(https://www.huffpost.com/entry/an-open-letter-to-black-m_b_3259243)
***
ముగింపు:
అత్యంత ధనిక దేశం, అక్షరాస్యత అధికంగా వున్న దేశంలో, నాలుగు శతాబ్దాల తరువాత కూడా బానిసత్వపు చిహ్నాలు బతికివుండడం ఆశ్చర్యం గొలిపే విషయం.
జన్మతః సంక్రమించిన అవలక్షణాలు లేదా మనుషుల్లో అరుదుగా కనిపించే జైవిక లక్షణాలను ….. “ఫ్రీక్ షో” పేరుతో ప్రదర్శనకు పెట్ట్టేవారు, ఆ ప్రదర్శనలను చూడడానికి ఇష్టపడేవారు ….. వారి వెకిలితనానికి వారే ప్రతీకలు. ఈ ఉత్తరంలో పేర్కొనబడిన “సారా బార్ట్ మన్” ఉదంతం ఇందుకు ఓ తార్కాణం. అంతటి నిర్దయనీయమైన ఉదంతాన్ని ఉదాత్తంగా ఉటంకించిన ఈ రచయిత్రి అభినందనీయురాలు.
ఉపన్యాసం -1
నెపోలియన్ బోనపార్టే ఉపన్యాసం
నేపథ్యం:
చతుష్షష్ఠి కళలు ….. అంటే 64 కళలు!
అందులో యుద్ధవిద్య కూడా ఒక కళనే అట!
సాధారణ సైనికుడి హోదాలో సైన్యంలో చేరిన నెపోలియన్ అంచెలంచెలుగా ఎదిగి, ఓ దశలో ఫ్రెంచ్ చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు!
సుమారు 50 యుద్దాల్లో మునిగితేలిన నెపోలియన్ యుద్ధకౌశలాన్ని గొప్పగా చెప్పుకుంటూ, ఇప్పటికీ మిలిటరి శిక్షణలో అతని వ్యూహాలను భోదిస్తుంటారట!
ఆ సమయంలో, “ప్రజలకు కావాల్సింది సమానత్వం కానీ స్వేచ్చ కాదు.” అని వ్యాఖ్యానించిన నెపోలియన్ ఫ్రాన్స్ ను ఒక బలమైన రాజ్యంగా చేయడానికి శ్రమించాడు. అతని సాంఘిక, ఆర్ధిక సంస్కరణలు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినవి.
5 లక్షల మంది సైనికులను సిద్దం చేసుకుని యూరప్ దేశాలను గడగడలాడించిన నెపోలియన్ సరియైన అంచనావేయకుండా 1812 లో రష్యాపై దండెత్తాడు. రష్యాలోని చలిని తట్టుకోలేక, ఫ్రెంచ్ సైన్యాలకు ఆహారం దొరకకుండా చేయడానికి రష్యన్లు పంటలను తగులబెట్టడం వల్ల, తిండి దొరకక లక్షాలాది మంది సైనికులు చనిపోయారు. చేసేదిలేక నెపోలియన్ సైన్యాలను వెనక్కి పిలిచాడు. తర్వాత మళ్ళీ సైన్యాన్ని పునర్నిర్మించుకుని కొన్ని చిన్న విజయాలు సాధించినప్పటికీ అతన్ని ఒక్కణ్ణి ఎదుర్కొనేందుకు రష్యా, ఇంగ్లాండ్, ఆస్ట్రియా, స్వీడన్ దేశాలు ఒక్కటై 1813 లో “లీప్జిగ్ యుద్ధం” లో అతన్ని ఓడించారు. ఫలితంగా, నెపోలియన్ ను చక్రవర్తి బిరుదుతో ఎల్బా అను చిన్న దీవికి పాలకునిగా పంపివేశారు.
“ఓల్డ్ గార్డ్” అనేది నెపోలియన్ సైన్యంలో ఒక ప్రత్యెక హోదా వున్న సైనిక విభాగం. ‘అసంభవం’ అనేది ఫ్రెంచ్ డిక్షనరిలోనే లేదు అని ప్రకటించిన నెపోలియన్ ఎల్బా దీవికి పంపబడేముందు ఓటమి అనేది ‘సంభవమే’ అని భావించి తన “ఓల్డ్ గార్డ్” సైనికులకు ఇచ్చిన సందేశం ఇది.
***
(ప్రసంగ పాఠం)
ఏప్రిల్ 20, 1814
నా ఓల్డ్ గార్డ్ సైనికులారా,
నేను మీకు వీడ్కోలు చెప్తున్నాను. ఇరవై సంవత్సరాల పాటు మన విజయాల బాటలో నేను మీతో వున్నాను. మన భాగ్యవంతంగా వున్న రోజుల్లోలాగానే, ఇటీవలి రోజుల్లో కూడా అచంచలమైన ధైర్యానికి, విశ్వాసానికి ప్రతీకలుగా నిలిచారు. మీలాంటివాళ్ళుంటే, మనం నమ్మినదాన్ని సాధించకపోవడమనేది వుండదు; కానీ ఈ యుద్దం ఎడతెగకపోవచ్చు; ఇది అంతర్యుద్ధంగా మారవచ్చు. అది ఫ్రాన్స్ దేశానికి శాశ్వతవిపత్తును కొనితేవచ్చు.
నేను నా సర్వసాన్ని దేశ ప్రయోజానాలకు ధారపోశాను.
నేను వెళ్ళిపోతాను, కానీ స్నేహితులారా, మీరు ఫ్రాన్స్ దేశానికి సేవలను అందిస్తూనేవుంటారు. నేను కేవలం ఆమె సంతోషాన్ని మాత్రమే కోరుకొన్నాను. ఇంకనూ అదే నా ధ్యేయంగా వుంటుంది. నా దురదృష్టం గురించి చింతించకండి ఒకవేళ నేను జీవించిఉండడానికి ఒప్పుకున్నానంటే, అది మీ విజయాలకు నివాళులు అర్పించడానికే. మనము కలిసి సాధించిన ఘన విజయాల చరిత్రను వ్రాయాలని నేను అభిలషిస్తున్నాను. సెలవు, మిత్రులారా, మిమ్మల్నందరినీ నా గుండెకు హత్తుకోవాలని వున్నది. కనీసం మీ సైనిక చిహ్నాన్ని ముద్దిడనివ్వండి.
***
ముగింపు:
నెపోలియన్ సందేశం విన్న సైనికులు ఉద్వేగంతో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారట! పెటిట్ అనే జనరల్ ముందుకు రాగా అతణ్ణి హత్తుకుని, సైనిక చిహ్నాన్ని ముద్దాడట!
మరికొంతకాలం తర్వాత, ఎల్బా దీవి నుండి పారిపోయి వచ్చి, నెపోలియన్ తననుతాను తిరిగి రాజుగా ప్రకటించుకున్నాడు. కానీ, ఆ తర్వాత అతని పాలన 100 రోజులు మాత్రమే కొనసాగింది. సంయుక్త సైన్యాలు మళ్ళీ ఒక్కటై “వాటర్ లూ” అనే చోట 1815 లో జూన్ 18 న జరిగిన యుద్దంలో అతణ్ణి ఓడించారు. పరాజితుడైన నెపోలియన్ ను ఈసారి సెయింట్ హెలీనా లో రాకీ దీవి కి పంపించారు. తీవ్ర అనారోగ్యంతో అతను అక్కడే మరణించాడు.
*****
ఘనపూర్ (స్టేషన్)–వరంగల్ జిల్లా, తెలంగాణ వ్యవసాయదారుల కుటుంబంలో జననం. ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లీష్), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ నుండి ఇంగ్లీష్ బోధనలో సర్టిఫికెట్కోర్స్ –32 సంవత్సరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ఇంగ్లీష్ బోధన. 2011 లో ‘హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్’ గా ఉద్యోగ విరమణ. ఇంగ్లీష్ ఎడిటర్ గా; ఇంగ్లీష్ రైటింగ్, స్పీకింగ్, IELTS శిక్షకుడిగా అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, పాలిటెక్నిక్ పిల్లల కోసం ఇంగ్లీష్ పుస్తకాల రూపకల్పన చేసి, వాటికి అనుగుణంగా టీచర్ బుక్స్ వ్రాశారు. ‘టీచ్ ద టీచర్’ శిక్షణనిచ్చారు. 2014 లో “ఇంగ్లీష్ గ్రామర్ ఫండాస్” అనే టైటిల్ తో పుస్తకం (విశాలాంద్ర ప్రచురణ) వ్రాశారు. ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి.