కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)
– ప్రొ|| కె. శ్రీదేవి
అబ్బూరి ఛాయాదేవి కథలు
అబ్బూరి ఛాయదేవి 1933 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. ఉస్మానియావర్సిటీ నుండి ఎం.ఎ.,(పొలిటికల్ సైన్స్) పట్టాపొందారు. ఆంధ్రాయూనివర్సిటీ నుండి లైబ్రరీసైన్స్ లో డిప్లొమా తీసుకున్నారు. న్యూడిల్లీలో 1959 నుంచి 1961 వరకూ యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లైబ్రేరియన్ గా పని చేశారు. తరువాత జవహర్ లాల్ నెహ్రూ యునివర్సిటీలో డిప్యూటీ లైబ్రేరియన్ గా వున్నారు. 1976-77 లో డాక్యుమెంటేషన్ స్టడీ నిమిత్తం యూనివర్సిటి తరపున ఫ్రాన్స్ దేశ పర్యటన కూడా చేశారు. 1954-58 లో హైదరాబాద్ లోని ఆంధ్ర యువతీమండలి సహాయ కార్యదర్శిగా ‘వనిత’ మాస పత్రిక సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొన్ని కథలకు తెలుగు అనుసరణలూ, ఆధునిక తెలుగు కవితలకు అనువాదాలూ చేశారు.1988-90 సంవత్సరంలో ఉదయం, నవతరం వారపత్రికల్లో, ‘ఉదయిని’ మహిళా శీర్షిక నిర్వహించారు. 1954 నుంచి కథారచన కొనసాగిస్తున్నారు. ఈమె రాసిన కథలకు కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి పురస్కారాన్ని పొందారు.
కుటుంబ జీవితంలో స్త్రీ ఎదుర్కొంటున్న సున్నితమైన సమస్యలకు స్పందించి కథలు రాస్తున్న రచయిత్రి అబ్బూరి ఛాయదేవి అంతో ఇంతో చదువుకొని సంసారిక జీవితం సాగిస్తున్న, స్త్రీలు కుటుంబ పరిధిలో పడే మదనలనూ, వ్యధలనూ, మూగ వేదనలనూ రచయిత తన కథలలో వినిపిస్తారు.
ఛాయదేవి చిత్రించిన స్త్రీ పాత్రలు తాము అనుభవిస్తున్న బాధలేమిటో గుర్తిస్తాయిగానీ, వాటికి గల కారణాల కోసం సమస్య పునాదులలోకి వెళ్ళి ఆలోచనాన్వేషణ సాగిస్తున్నట్లు అనిపించవు. అందువల్లే ఆమె కథలలోని స్త్రీ పాత్రలు తెలిసి తెలిసి బాధలు భరిస్తాయేగాని వాటి పరిష్కారం తెలుసుకుందామని తెగించవు. అట్లని పిరికిగా జీవితాన్ని అంతం చేసుకోవాలనే అతివలూ కాదు.
అబ్బూరి ఛాయదేవి వ్యక్తిత్వం మూర్తీభవించిన స్త్రీల జోలికి వెళ్ళలేదు. కానీ సాధరణ స్త్రీ సమస్యలనూ వారి మదనాన్ని తన కథలలో బాగా పట్టించుకున్నారు. నేటి సమాజంలో స్త్రీలు మగవాడి నీడలాగా ఉంటూ అస్తిత్వాన్ని కోల్పోయి వారి నిర్ణయాలు అమలు పరిచే మరమనుషులుగా బ్రతుకుతున్న వైనాన్ని “ఉపగ్రహం”, బోనసాయ్ బ్రతుకు” మొదలగు కథలలో చిత్రించారు.
ఉపగ్రహం స్వయం ప్రకాశిక శక్తి లేక గ్రహాల చుట్టూ ఏ విధంగా పరిభ్రమిస్తుందో అలాగే స్త్రీ కూడా స్వయం నిర్ణాయకశక్తిని సంపాదించుకోక తన ఆలోచనలను మగవాడి చుట్టూ పరిభ్రమింపజేస్తుంటుందనే సూచనతో వ్యక్తిత్వం లేని స్త్రీని ఉపగ్రహంతో పోలుస్తూ చిత్రించిన కథ ‘ఉపగ్రహం’
భర్త మెప్పుకోసం అతి శ్రద్ధగా వంట చేసి అతని కిష్టమైన విధంగా అలంకరించుకొని ఎదురుచూస్తుంటుంది భార్య. ఆమెను ఏ మాత్రం పట్టించు కోకుండా తన పనులను మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఆ పనులకు ఆటంకం లేకుండా అన్నీ అమర్చి పెట్టే యంత్రంలాగా ప్రవర్తిస్తుంటాడు భర్త.
“భోజనం అయిపొయాక ఆయన వక్కపొడి వేసుకుంటున్నపుడైనా నా వంటకాల గురించి రెండు ముక్కలు ఏమైన అంటారేమో అని ఎదురు చూసాను. నేను కొత్తచీర కట్టుకున్నట్టుగానీ. గుండ్రని కుంకుమ బొట్టు వల్ల నా మోహంలో వింత అందం వచ్చినట్టుగానీ ఆయన గమనించినట్టు లేదు. ఆరుగంటల వరకూ ఒంటరిగా గడిపిన నాకు ఆయనెఫ్ఫుడొస్తారా? ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ గడుపుదామా? అనే తహతహ కలుగుతుంది. నేను పడుకొగానే నా భుజం చుట్టూ చెయ్యివేస్తే ఆ ఆప్యాయత కోసమే అలమటించి పోతున్నట్టు అమాంతంగా ఆయన్ని పెనవేసుకుపోయాను” అంటూ ఆలోచించే స్త్రీలు ఇలాంటి ఆలోచనలతో అలమటించి పోవడానికి కారణం తమకంటూ ఒక ‘సొంత ప్రపంచం లేకపోవడమే ’,‘ ఆయనే కదాజీవిత సర్వస్వం’ అని భావించి ‘మామిడిచెట్టును అల్లుకున్నది మాధవీలతొకటి” అంటూ కూనిరాగాలు తీస్తూ, సొంత ఆలోచనలూ, వ్యాపకాలూ లేక భర్త చుట్టూ తన జీవితాన్ని అల్లుకొని తామే పని చేసినా అతడు సంతోషించి మెచ్చుకొని గుర్తించాలని ఇలా.. భర్త చుట్టూ తిరిగే సొంత వ్యక్తిత్వం లేని “ఉపగ్రహం” లాంటి భార్యలకు ఈ కథ చిన్న చురకవంటిది.
‘బోనసాయ్ బ్రతుకు’ అనే కథలో ఎంతో ఎత్తుగా, ఉన్నంతగా బలిష్టంగా ఎదగాల్సిన ఆడవారిని ఈ సమాజం పూలకుండీలలో పెంచే బోనసాయ్ మెక్కల్లా (మరగుజ్జు మహావృక్షాలు) ఏ మాత్రం ఎదగనివ్వకుండా, ఎదిగినా, తాము కోరుకున్న మేరకే ఎదగనిచ్చి ఆపైన ఒక్క అంగుళం మేరైనా పెరుగుదల కనిపిస్తే అందం పేరుతో వాటిని కత్తిరిస్తూ ఎలా తమ అభిరుచికి, స్టేటస్ కు అనుగుణంగా మలచుకుంటారో అలాగ ఆడవారిని కూడా పురుషాధిక్య ప్రపంచం తమ అభీష్టాలకు అనుగుణంగా మలచుకొనేక్రమంలో అదే దృష్టికోణంతో చూస్తుందనే అంతరార్థం”బోనసాయ్ బ్రతుకు” కథలో వుందన్న గ్రహింపు ఈవాక్యాలలో గమనించవచ్చు.
‘అపురూపంగా పెంచిన నీ బోనసాయ్ చూడు, చుట్టానికి కుదురుగా ముచ్చటగానే వుంది. సంసారపు స్త్రీలలాగా కానీ ఎంత సుకుమారమో చూడు. నువ్వు వెయ్యికళ్ళతో కాపాడాలి. అది కాస్త పెద్దగాలికి కూడా తట్టుకోలేదు. తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడకూడా ఏమివ్వగలదు? మగవాడికి, ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే ఆడదాని బ్రతుక్కూడా బోనసాయ్ మాదిరి అయింది అని తన తోటి స్త్రీతో ఈ మాటలంటుంది.
“తల్లి పెంపకంలోనే వివక్ష వుంది. తల్లి తనకు తెలియకుండానే అందరికీ అన్నిటికీ ఒదిగి వుండాలనే మనస్తత్వాన్ని చిన్నప్పటి నుండి ఆదపిల్లలకు కలుగజేస్తుంది. మగపిల్లకు తిండి,నిద్ర, ఆటలు, మాటలు ఏ విషయాలలోనూ పరిమితులుండవు. అందుకనే సహజంగానే అమ్మాయి కంటే అబ్బాయిలే ఎక్కువ శాతం ఎదగడానికి మన సమాజంలో అవకాశం ఉంది. ఉదాహరణకు ఆటల కోసం పదిహేను ఏండ్లొచ్చిన ఏ మగపిల్లవాడు ఇంట్లోనో, ఇంటి ప్రక్కనో ఆడుకోవటం అనేది జరుగదు. ఆటలాడే ప్రదేశాలకే వెళ్ళి జన సందోహంలో కలుస్తాడు. ఇదెంత సహజమో అంతే సహజంగా పదిహేనేళ్లొచ్చినా ఏ ఆడపిల్ల అదే పనిగా (పాఠశాల సమయాలలో కాక) ఆటస్థలాలకు వెళ్ళి ఆడే అవకాశం వుండదు. కొంత మంది వెళ్ళినా పై వర్గానికి చెందినపిల్లలకే ఆ అవకాశాలు పరిమితం. అందుకే సహజంగానే చిన్నప్పటి నుండి స్త్రీ వెనుకబడే వాతావరణమే మన సమాజంలో మెండు. సంకుచితమౌతున్న పురుషస్వామ్య భావజాలంలో ఆడదాని బ్రతుకు ఎంతగా కుచించుకుపోతుందో, అలా కుదించుకుపోతున్న స్త్రీలపై రచయిత్రికి గల సానుభూతికి, అర్ద్రతకు ఈ కథ సాక్ష్యం.
ఆ “తురాయిచెట్టు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడు. బయట విశాలంగా ఉన్న చోట విస్తారంగా పెరిగింది కదూ. ఎంతటి గాలి దుమారం వచ్చినా అది కించిత్తు కూడా చలించలేదు. పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఆసరాగా నిలిచింది” అంటూ స్వేచ్చయుత వాతావరణంలో పెరిగిన ఆడపిల్లలు ఉన్నతమైన విలువలు కలిగి
తమ కాళ్ళపై తాము నిలబడడమే కాకుండా మరొకరికి కూడా అండగా నిలువగలరన్న సత్యాన్ని ఈ కథలో అబ్బూరి ఛాయదేవి అనుభూతం చేస్తున్నారు. ఈ కథ చదువుతుంటే పరిమళాసోమేశ్వర్ ‘కుండీలో మొక్కలు’ కథ గుర్తుకొస్తుంది.
చిన్నతనం నుండి నిద్రపోవాలనే కోరిక తీరిక వయసుతో పాటు అది పెరిగి పెద్దదై జీవితాంతం నిద్రకోసం తపించిన ఇల్లాలి కథే ‘సుఖాంతం’, చిన్నతనంలో నిద్రపోవాలనుకుంటే చదువు పేరుతో నిద్రపోవడానికి కుదరదు ఆమెకు. పెళ్ళి చేసుకుంటే సుఖంగా నిద్రపోవచ్చని కలలుగంటుంది. కానీ అప్పుడు కూడా నిరాశే మిగులుతుంది. పెళ్ళవగానే పిల్లలు పుట్టుకరావడం. వాళ్ల చదువుల పేరా, ర్యాంకుల పేరా తన పిల్లల చదువుల వ్యాసంగంలో పడిపోతుంది. వాళ్ళు పెద్దవాళ్లయి పెళ్లిళ్లయిన తర్వాత వాళ్ల గురించి వాళ్ల పిల్లల గురించి ఆలోచిస్తుంటుంది. ఇలా ఎడతెగని ఆలోచనతో, పనితో ఆమె జీవితం నిద్రకు దూరమౌతుంది. రోజు వేసుకునే నిద్రమాత్రతో కూడా నిద్రరాని దశ వచ్చేస్తుంది. ఒక రోజు పిలిచినా పలుకలేనంత గాఢంగా నిద్రపోవాలనేపిచ్చి కోరికను ఆపుకోలేక నిద్ర మాత్రలన్నీ మింగేస్తుంది.( ఆమె జీవితంలో నిద్ర అవసరం కాదు, కోరిక మరి) నిద్రపోవాలనే కోరికతో తపించిన ఆమె జీవితం శాశ్వత నిద్రతో మాత్రమే సుఖాంతమవుతుందన్న ఆవేదన “సుఖాంతం” కథలో వ్యక్తమవుతుంది.
స్త్రీలు-పెళ్ళీ, పిల్లలు చదువులు, ఉద్యోగం మళ్లీ వాళ్ల పెళ్లిళ్లు, పిల్లలూ అలా తీరికలేని తనంతో పనిలో యంత్రంలాగా కుటుంబం గురించినా ఆవేదనతో సతమతమవటం ఈ కథలో చిత్రించారు. రచయిత ప్రతిస్త్రీ ఇంటిచాకిరిలో సతమతమయ్యే క్రమంలో తన అస్తిత్వాన్నే కోల్పోతున్న వైనాన్ని అబ్బూరి ఛాయదేవి ప్రతిభావంతంగా చిత్రించారు. ఈకథలోని పేరులేని స్త్రీ పాత్ర, ఎంతసేపు నిద్రపోవాలని తపనపడుతుంది తప్ప ఇలా తీరిక లేకుండా తనను కట్టిపడేసిన వారి గురించిగానీ, వ్యవస్థ గురించిగానీ దూషణతో కూడిన ఒక్క పురుష వాక్యమైనా మాట్లాడదు. తను చనిపోయే ముందు భర్తకు తన మరణకారణాన్ని మాత్రం ఒక చిన్న చీటిలో ఇలా రాస్తుంది.
“ఏమండీ!కంగారు పడకండి! నిద్రపోతున్నానంతే. ఆత్మహత్య చేసుకున్నాననుకుని అపార్థం చేసుకోకండి. కేవలం నిద్ర కోసం నిద్రపోతున్నాను” అని అంటుంది. ఆ రెండు వాక్యాలు చాలు. కుటుంబ జీవితంలో స్త్రీలకు చనిపోయినప్పుడు తప్ప వారి జీవితంలో సుఖంగా నిద్రించే పరిస్థితులు ఉండవనే విషయం పాఠకులకు తట్టడానికి. దానితో పాటు స్త్రీలు చేసే పనిపాటల పట్ల పాఠకులకు సానుభూతి కలుగక మానదు. ఇలా పాఠకుల సానుభూతికి పాత్రమైనప్పుడు ఈ కథ విజయవంతమైనట్లే. అన్ని కథలలోను తిరగబడి, తమ హక్కుల సాధించుకున్నట్లు చూపనక్కరలేదు. కేవలం మామూలు వాక్యాలతోనే రచయిత తనాశించిన ప్రయోజనాన్ని ఇక్కడ పొందగలుగుతారు. ఈ కథ చదివిన తరువాత ఆడవారి జీవితంలో తీరికలేని తనాన్ని ఇంతకన్నా సమర్థవంతంగా చెప్పే అవకాశం లేదనిపిస్తుంది.అదీకాక స్త్రీవాద ఉద్యమం ముందుకు రానపుడే స్త్రీ అస్తిత్వస్పృహతో అబ్బూరి ఛాయదేవి బోనసాయ్ బ్రతుకు, ఉపగ్రహం, సుఖాంతం కథలను రచయించారు. స్త్రీవాద ఉద్యమం పాశ్చాత్యదేశాలనుండి దిగుమతి చేసుకున్న ధోరణిగా, ఉద్యమంగా చెప్పేవారికి ఈ కథలు స్త్రీవాద ఉద్యమ సాహిత్యం తెలుగు నేలలో కాలూనకముందే, తెలుగువారి సామాజిక భూమిక నుండి పొటమరించిన అసలుసిసలైన స్త్రీవాద తెలుగుకథలని ఢంకా బజాయించి మరీ చెప్పవచ్చు.
పాతికేళ్ల వివాహసంబందానికి గుర్తుగా ఇంకొద్ది రోజులలో “వెండి పండుగ”(ఇరవై ఐదు ఏళ్ళ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్) జరుపుకోబోయే సమయంలో తన భర్త పరాయి స్త్రీలతో కులుకుతున్నాడని తెలిసి విలపించిన స్త్రీ కథ. “వెండి పండుగ”. ఈ కథలోనిస్త్రీ “పాతికేళ్లు వచ్చినా పటిష్టత లేదా వైవాహిక జీవన సౌదానికి?” అన్న మూగరోదన ఈ కథలో వినిపిస్తుంది. స్త్రీ విద్యను, ఆర్థిక స్థోమతను పరోక్షంగా తెలియచెప్పిన కథ ఇది.
“మనిషికి మనిషికి మధ్య మమత తీగలా పెరగకూడదేమో, అలా పెరిగితే పిల్లలైతే పెకలించి వేయగలరు. తల్లికి అల్లుకపోవడమేతెలుసు” అంటూ మనుషుల మధ్య సంబంధాలు, యాంత్రికమైపోతున్నాయన్న బాధ, రాను రాను పాతతరానికి , కొత్త తరానికి మధ్య ప్రేమానురాగాలు లుప్తమై పోతున్నాయన్న ఆవేదనను ప్రతిధ్వనించే కథ ‘ఉడ్ రోజ్’.
దాదాపుగా అబ్బూరి ఛాయదేవి కథలన్నింటిలోనూ స్త్రీ సమస్యలనే వస్తువుగా స్వీకరించినారు. ఇది స్త్రీల సమస్యల పట్ల ఆమెకు గల ప్రాపంచిక దృష్టికోణానికి నిదర్శనం. అన్ని కథలలోనూ కుటుంబ చట్రంలో స్త్రీలు కంటికి కనబడని మానసిక హింసకు ఎంతగా గురవుతుంటారో చాలా సున్నితంగా ఎత్తి చూపగలిగినారు. “విమర్శకులు”, “గోదావరి” కథలలో మాత్రం శిల్పపరమైన దోషం కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది. కథనంలో పటుత్వం లేకపోవడం వల్లనే కథాలక్ష్యం సూటిగా పాఠకుల మనసుకు తగలదు. తత్ఫలితంగానే భావస్పష్టత కూడా ఈ కథలలో లోపించింది.
అయితే రచయిత్రి ప్రేమికుల పక్షంలో నిలబడి ముగ్గురు విమర్శకుల జీవితాలను బట్టబయలు చేయగలిగింది. అంటే ప్రేమవివాహాలను వ్యతిరేకించే పక్షంలో విమర్శకులు శ్యామల. ప్రమీల, విమల నిలబడతారు. కులాలకు, అందానికి, అంతస్తుకు అతీతంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నవారే జీవితాన్ని సరైన అవగాహనతో చూడగలరని ఛాయదేవి భావించారు.
1954 నాటికి ఎంతో అభ్యుదయకరంగా ఆదర్శవంతంగా ఆలోచించగలిగారు. ఆనాటికే ప్రగతిశీల భావాలు కలిగిన ‘ప్రయాణం’ కథ ఆమె రాసిన కథలలో ఆణిముత్యం లాంటిది. స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం అలమటించే మనుషులను, ఆదర్శాలకు నిలబడే మనిషిని ప్రధాన పాత్రలుగా చేసుకుని చెప్పిన ఈ కథ ఎంతో గొప్పగా ఉంది. ఎందుకంటే స్త్రీవాద భావాలు విస్తరించిన తరువాత స్త్రీలపై జరిగే అత్యాచారాలను, అన్యాయాలను పాజిటివ్ గా, పొసెసివ్ గా అర్థం చేసుకునే క్రమంలో వెల్లివిరిసిన భావ చైతన్యం 1954 నాటికే ఈ కథలో చర్చించారు. స్త్రీలు తమ ప్రమేయం ఏ మాత్రం లేకుండా తమపై జరిగిన అత్యాచారాన్నికి తామే ఆత్మత్యాగాలకు సిద్ధపడుతున్న ధోరణి నుండి స్త్రీలను చైతన్యవంతం చేస్తూ, ఈ కథ అవగాహన కల్పిస్తూంది.
మనం సరైన పద్దతిలోనే ప్రయాణం చేస్తున్నప్పటికి రాంగ్ రూట్ లో వచ్చిన వాహన దారుల తప్పిదాలకు అవతలి వ్యక్తి కూడా ఆ తప్పు వలన నష్టాన్ని ఏ విధంగా భరించాల్సి వస్తోందో అదే విధంగా స్త్రీలపై జరిగే అత్యాచారాలు కూడా స్త్రీలు, వారి ప్రమేయం లేకుండా జరిగే అత్యాచారాలను “ఆక్సిడెంట్” గా భావించాలే తప్ప “శీలభంగం”గా భావించి ఆత్మహత్యలకు పాల్పడరాదనే అవగాహన ఈకథలో వ్యక్తమవుతుంది. ఇక్కడ రచయిత శిల్పనైపుణ్యాన్ని అభినందించి తీరాలి. కథనంలో ఏ మాత్రం జాగ్రత్త లేకపోయినా, రచయితకి స్త్రీలపై జరిగే అత్యాచారాలను ఉదాసీనంగా తీసుకోవాలనే అర్థం స్ఫురించగలదు. అలాంటీ శిల్ప ప్రమాదం ఈ కథలో జరుగలేదు. అబ్బూరి ఛాయాదేవి కథాపరిధి “కుటుంబ జీవితం” అందుకే ఈమె కథలలో కనిపించే స్త్రీవాద చైతన్యం కూడా కుటుంబ జీవితానికే పరిమితమైనది.
రచయితకు కుటుంబ జీవితం పట్ల నమ్మకం. వైవాహిక వ్యవస్థపట్ల సదభిప్రాయం ఉంది. అందుకే ఈమె కథలలో మనకు తాగుబోతు భర్తలు కాని భార్యలను హింసించే శాడిస్ట్ భర్తలు కానీ కనిపించరు. నేడు సమాజంలో ఊడలు వేసి విస్తరిస్తున్న వరకట్న సమస్య ఆ రాక్షస చట్రంలో నలిగిపోతున్న తల్లి దండ్రులూ, ఎంత కట్నమిచ్చినా ఇంకా తెమ్మనే డబ్బు కక్కుర్తిగల అత్తమామలూ, ఆడపడుచుల ఆరళ్ళు, డబ్బులేని అమ్మయిని కిరసనాయిలు పోసి తగులబెట్టి కొడుకులను రెండో పెళ్ళికి సిద్ధపరిచే కిరాతక అత్తమామలూ కనిపించరు. అదీగాక ఛాయదేవి అన్ని కథలలో అంత సీరియస్ కథనం సాగదు. దాదాపుగా అబ్బూరి ఛాయదేవి అన్ని కథలు స్త్రీ సమస్యలకు సంబంధించినవే. మరి స్త్రీల సమస్యలు స్పృశించడంలో రచయిత ఆర్తి ఏమిటి? అంటే కుటుంబంలో తీరికలేకుండా స్త్రీలు చేసే శ్రమపట్ల “సానుభూతి” అని చెప్పవచ్చు. ఈమె కథలకు ముడుసరుకులు తన జీవితానుభవాలే. తన జీవితంలో ఎదురైనా అనుభూతులనూ కథలుగా మలచారు. తనకు తెలియని జీవితాన్ని చెప్పడానికి ఏ కథలోనూ ప్రయత్నించలేదు. ఇది రచయిత నిజాయితీకి సంబంధించిన విషయం.
స్త్రీవాద ఉద్యమం పాశ్చాత్యదేశాలనుండి దిగుమతి చేసుకున్న ఉద్యమంగా, ధోరణిగా, చెప్పేవారికి అబ్బూరి ఛాయదేవి కథలు చక్కని సమాదానాలు. స్త్రీవాద ఉద్యమ సాహిత్యం తెలుగు నేలలో కాలూనకముందే, తెలుగువారి సామాజిక భూమిక నుండి పొటమరించిన అసలుసిసలైన స్త్రీవాద తెలుగు కథలని ఢంకా బజాయించి మరీ చెప్పవచ్చు.
*****
కె.శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. స్వస్థలం కడప. 12 పుస్తకాలు రాశారు. మూడు పుస్తకాలు ఎడిట్ చేశారు. ఆరు అవార్డులు అందుకున్నారు. 112 ఆర్టికల్స్ రాశారు.