కథా మధురం  

స్వాతి శ్రీపాద

-ఆర్.దమయంతి

 రచయిత్రి గురించి :

స్వాతి శ్రీపాదగారు  40 యేళ్ళు గా ఇటు కథా సాహిత్యం లో, అటు నవలా సాహిత్యం లో ఎనలేని కృషి సలుపుతూ, ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టిస్తూ సాహితీ పథం లో ముందుకు సాగుతున్నారు.

తెలుగు సాహిత్య ప్రపంచం లో పేరెన్నిక గల రచయిత్రులలో స్వాతి శ్రీపాద  గారి పేరు స్ఫుటం గా వినిపిస్తుంది. కథల పోటీలలో అనేక ప్రతిష్టాత్మకమైన బహుమతులను గెలుచుకున్నారు.  అవార్డ్స్ ని కైవసం చేసుకున్నరు. అత్యున్నత రీతిలో సన్మానాలను పొందారు.

కవయిత్రి గా ‘స్వాతి  ధృవ తార..’ అనే పలువురి ప్రముఖుల ప్రశంసలను సొంతంచేసుకున్నారు.   వందల సంఖ్యలో కథలు రాసారు. విమర్శనాత్మక, విశ్లేష్నాత్మక వ్యాసాలను గుప్పించారు. అంతే కాదు, తెలుగు ఆంగ్ల భాషలలో సరి సమాన ప్రతిభా పాటవాలు గల  ఈ రచయిత్రి ఎన్నో అత్యున్నత విలువలు గల తెలుగు రచనలను ఆంగ్లం లో కి అనువదిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యానికి అత్యున్నత స్థాన్నాన్ని కలగచేస్తున్న స్వతి గారి కృషి ఎంతైనా ప్రసంసనీయం. 

శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి ‘నా జ్ఞాపకాలు నా అనుభవాలూ ఆటొబయోగ్రఫీని తాజా గా ఆంగల్మ్ లోకి అనువదించారు. ఈ అనువాదానుభవం తనకెంతో ఆత్మతృప్తినిచ్చిందంటూ తన అభిప్రాయాన్ని ఎంతో సంతోషం గా పంచుకున్నారు. 

అడిగిన వెంటనే, ఈ ‘దారి ఎటు?’  కథని నెచ్చెలి కోసం ప్రత్యేకం గా రాసి ఇవ్వడం ఎంతైనా ముదావహం. అభినందనీయం.  

పాఠకుల ప్రశంసలే తనకు ఎనలేని విలువైన అవార్డ్స్ అంటూ ప్రకటించే బహుముఖ ప్రజ్ఞా శాలి అయిన స్వాతీ శ్రీపాద –  నిగర్వి. నిరాడంబురాలు. 

*******************

 ‘చేసిన తప్పుని దిద్దుకోవడమొకటే  జీవన మార్గం’ అని చెప్పిన ‘దారి ఎటు?’ కథ!  రచన : స్వాతీ శ్రీపాద.  

*****

కథ ఏమిటంటే : 

అతని అంతరంగ మధనం!

చిన్నప్పట్నించీ తన చూపునీ, మనసునీ, బ్రతుకునీ, పంచుకుని, మనసుని ఆక్రమించుకున్న స్త్రీల మనో భావాల నెమరువేత – ఈ  కథాకథనం.

స్త్రీ ని చదవలేని తనమో, చదివినా అర్ధం చేసుకోలేని అసహాయతనమో, ఏదో తెలీదు. కానీ తెలీని,  అశాంతి మయం చేస్తుంది అతన్ని. 

ఒకసారి, స్నేహితుని ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడి కుటుంబ వాతావరణం అతన్ని చైతన్య పరచడంతో..అతనికి దారి దొరికినట్టు అవుతుంది.

అసలు అతని అశాంతికి కారణం ఏమిటన్నది కథ చదివి తెలుసుకోవాల్సిందే.

కథలోని స్త్రీ పాత్రలు :

 అమ్మ పాత్ర :

ఈ పాత్రలో ఒకప్పటి చాదస్తపు తల్లి మనస్తత్వాన్ని మనం కళ్ళా రా చూస్తాం. మొగుడి మాట వినడం అంటే, – ‘ రెండేళ్ళకో సారి పిల్లల్ని కనడమే..’ అనే నిర్వచనానికి నిలువెత్తు సాక్షం గా నిలుస్తుంది – ఈ స్త్రీ.

ఈ తల్లికి పెళ్ళి కాని కూతురితో రోజూ జగడమే. ఇంటి పని విష యం లో వాగ్యుధ్హాలు, అవి చిలి కి చిలికీ తుఫానులవడాలు జరుగుతుంటాయి. ఇవన్నీ అతని మస్తిష్కం లోంచి చెరిగిపోని చేదు జ్ఞాపకాలు గా నిలిచిపోతాయి. 

అయితే,  ఆ తల్లి చికాకులకీ, గొడవలకీ కారణం ఆరోగ్య పరమైనవని తోస్తుంది. రెండేళ్ళకో బిడ్డ చొప్పున కలిగిన సంతానం, పుట్టిన వాళ్ళల్లో కొందరు మరణించడం వల్ల కలిగే నిరాశ, శారీరక, మానసిక అనారోగాలకు దారి తీస్తుంది.  ఇంటి పని చేసుకోలేక పెద్ద కూతురి మీద ఆధారపడటం, కూతురు మాట వినక ఎదురు తిరగడం వల్ల ఆవిడలో ఉప్పొంగే కోపం – కట్ట తెంచుకున్న వరదౌతుంటుంది. అలా 

 కుటుంబం లో రోజూ  జగడాలే.. అవుతుంటాయి.

‘ఇదీ కారణం..’  అని తెలీదు కాబట్టి,    ‘ఆ ఇంట్లో తల్లీ కూతుళ్ళెప్పుడూ కొట్టుకుంటుంటారు’ అనే  చుట్టుపక్కల వారి ముద్ర మాత్రం పడిపోతుంటుంది.

ఒకానొక  అసహన క్షణం లో  ఆ తల్లి ఆక్రోశం లో ‘ నే చచ్చి పోతానంటూ ‘ ఉరకడం, బెదిరిపోయిన  పిల్లలందరూ గగ్గోలు పెట్టడం జరుగుతుంది.

తల్లి అంటే కేవలం సహన మూర్తి గానే వుండాలనే అనేకానేక పాత్రలకు భిన్నమైన మనస్తత్వాన్ని ఈ పాత్రలో గుప్పించడం జరిగింది.  ఏతా వాతా, ఆమెకీ ఫ్రస్ట్రెషన్స్ వుంటాయని అని తేల్చి చెప్పిన పాత్ర ఈ కథలోని అమ్మ పాత్ర!

మనం మన చుట్టూ వున్న అనేక కుటుంబాలలో చూస్తున్న పాత్రకి ప్రతిరూపం గా   ఎంతో సహజం గా ఈ అమ్మ పాత్రని చిత్రీకరించారు.

ఈ కథలోని కథా నాయకుడు తన చివరి మజిలీ లో ఇదంతా గుర్తు చేసుకుంటూ తల్లి గురించి ఒక మాట అంటాడు. 

మొగుడి మాటని వేద వాక్కు గా శిరసావహించే అమ్మ, గడప దాటకున్నా, కనీసం గడప లోపలైనా అధికారాన్ని చేజిక్కుంచుకోలేకపోయింది ఎందుకూ? అని సంశయాన్ని వెలిబుచ్చుతాడు. 

రచ్చ అయినా గెలవొచ్చు కానీ, ఆడది ఇంట గెలవలేదన్న సత్యం అతనికి ఇప్పట్లో అర్ధం కాదు. ఇతనికే కాదు, అసలు ఏ మగానికి కూడా అవగతం కాదేమో!

ఇక్కడొక సత్యం కూడా దాగుంది. ఇదంతా తల్లి వెర్షన్ చెపుతూ ఒక్క వాక్యం తండ్రి గురించి చెప్పడం తో ముగిస్తాడు.

అదేమిటంటె, – అతనొక దుర్వ్య సన పరుడు అని. 

ఆ ఒక్క కారణం చాలు, ఇల్లాలు సునామీ అవడానికి, కుటుంబ వాతావరణం అల్లకల్లోలం గా మారడానికీ! 

తల్లి చెట్టు వంటిదే. తండ్రి వేరు వంటి వాడు మరి.

ఇప్పటికీ, ఎప్పటికీనూ –  ఇల్లాలి జీవన ప్రశాంతత – భర్త ప్రవర్తన మీదే ఆధారపడి వుంటోందని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం గా నిలుస్తుంది ఈ కథలోని అమ్మ పాత్ర.

***

పెద్దక్క :

అందగత్తె. కలల రాణి. రాజకుమారుడు వంటి వాడొస్తాడు, వరించి పూమాల వేస్తాడని ఆశల ఊయలలో ఊగుతుంటుంది. 

తెచ్చిన సంబంధలన్నీ ససేమిరా వొద్దు ఫో అంటుంది. మరో వైపు తల్లి  సతాయింపులు. పని చేయమనీ, మరో వైపు – యవ్వనపు ఊహలు. ఊసులు. కలల సామ్రాజ్యాలలో అగుపించే రాజకుమారుడు..ఎందుకు కానరాడో అర్ధంకాదు.  అపురూప స్వప్నాలకీ, కటిక వాస్తవాలకీ ఎక్కడా సమన్వయం కుదరక ఒక మానసికావస్థకి గురి అవుతుంది. 

  అలా, వచ్చిన ప్రతి సంబంధమూ వొద్దంటూ తిప్పి కొడుతూ వెళ్తుంది. చివరికి వయసు ముదిరిపోతుంది. 

 చివరికి, ఓడిపోవాల్సి వస్తుంది.

లేచిపోతుందేమో అనే తన వారి భయాలకి ఫుల్ స్టాప్  పెడుతూ, ఇష్టం లేని వానితో పెళ్ళికి ఒప్పుకుంటుంది. పెళ్లయిపోతుంది.

అతను –  తన పెద్దక్క వివాహాన్ని ప్రస్తావిస్తూ బాధ గా అంటాడూ, ‘గులాబీ రంగులో ఉన్న అక్క పక్కన నీలం తిరిగిన నలుపులో బావ దిష్టి బొమ్మే. అయినా అక్క గత్యంతరం లేకే చేసుకుంది.’ అంటూ నిట్టొర్చుతాడు.

నిజానికి పెద్దక్క అందగత్తె. పైగా కొద్దో గొప్పో చదువుకున్నది.  తన అందానికి, చదువుకీ, తగిన వాడే వస్తాడు అనే ఆశతో యవ్వనమంతా వేచి వేచి చివరికి వేసారి, ఆకాశాన తిరగాడు చందమామ వంటి పెద్దక్క నేల మీదకి దిగొచ్చి బలవంతం గా  నడవడం మొదలుపెట్టింది.

 ఈ కాలంలో కూడా చాలా మంది స్త్రీలు అవివాహితులుగా మిగిలిపోడానికి గల కారణాలలో పెద్దక్క కున్న ఆశ కూడా ఒక కారణం గా గుర్తించవచ్చు.

ఇదీ పెద్దక్క పాత్ర!

ఇక రెండో అక్క : చదువుతో బాటు ఉద్యోగం కూడా చేస్తూ, ఇంట్లో వాళ్ల మీద అధికరాన్ని చలాయిస్తూ వుంటుంది.

మూడు, నాలుగో అక్కలు : వీళ్ళు చివరి వారు కాబట్టి, చురుకైన ఆలోచనలతో స్త్రీ విప్లవాన్ని లేవనెత్తుతారు. చివర పుట్టిన తమ్ముడికేమిటి అంత విలువ, మాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమేమిటీ అంటూ ప్రశ్నిస్తుంటారు.

ఎవరో ఒకరు ఎపుడో అపుడు ఇలా ప్రశ్నించడం వల్లే, కొత్త జీవన విధానానికి నాంది పలుకుతుంది. 

జానకి : అతన్ని ప్రేమించిన అమ్మాయి. ఆమె తనని  ప్రేమిస్తోందని అతనికి తెలీక కాదు. అయినా ఆమే ధైర్యం గా చొరవ చేసి అడుగుతుంది…పెళ్ళి చేసుకోమని.. అతని నించి వచ్చిన జవాబు విన్నాక కూడా ఆమెలో నిరుత్సాహ పడదు.  అప్పుడు ఆమె ఆశగా అడిగే మాటలకి – చదువరికి జాలి కలుగుతుంది.

ప్రేమికులలో అధిక శాతం అబ్బయిలే అమ్మాయిల్ని ప్రపోజ్ చేయడం సహజం. కానీ ఈ కథలో జానకి అతన్ని ప్రొపోజ్ చేయడం…వినూత్నం తో బాటు ఎంతో సహజం గానూ అనిపిస్తుంది.

ధనలక్ష్మి : అతని తో కలిసి పనిచేస్తున్న ఈ  ప్రొఫెసర్ – అతన్ని వివాహమాడి భార్య స్థానాన్ని పొందుతుంది.

 పిల్లలు పుట్టాక,  ‘ఇంటి బాధ్యతలే తనకెంతో ముఖ్యం’ అంటూ ఉద్యోగాన్ని వదిలేస్తుంది. పిల్లల పెంపకంలో మునిగి తేలుతుంటుంది. ఒక స్త్రీ కన్య నించి భార్య గా, భార్య స్థానం నించి తల్లి గా మారుతున్నప్పుడు మెట్టు మెట్టున స్త్రీ ఆలోచనా విధానం లో ఎన్నెన్ని మార్పులు  చోటు చేసుకుంటాయో ఈ పాత్ర స్వభావం ద్వారా మనకు ద్యోతకమౌతుంది.

మొన్నటి ఫాన్సీ డ్రెస్సులు పట్ల మోజు పోయి, నిన్నటి నగల మీద క్రేజ్ నేడు ఎటో కొట్టుకుపోయి, చివరికి  తనని తాను మరచిపోయి, పిల్లల రేపటి భవిష్యత్తు కోసం పునాదులు తవ్వే పనిలో ఆ స్త్రీ మూర్తి నిమగ్నమైపోతుంది.

ఆ క్షణం లో ఆమెకి ఎవరూ కనిపించరు. పిల్లలు..పిల్లలు..పిల్లలు తప్ప.

నిజానికి సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే  భర్తకీ తనకీ దూరం పెరుగుతోందని, అది తన బ్రతుకుని ఊహించని అగాధం లోకి తోస్తుందని ఏ మాత్రం అంచనా లేని  అనేకానేక మంది ఇల్లాలకి మల్లేనే ప్రొఫెసర్ ధనలక్ష్మి కూడా అంటే ఆశ్చర్యమేస్తుంది కదూ? కానీ ఈ ప్రొఫెసర్ లో దాగున్నది స్త్రీ సహజమైన మాతృ ప్రేమే అనే కీలకమైన అంశాన్ని మరచిపోకూడదు. అతనిలా!   

చివరికి  జీవితమలో ఆమె  తను అనుకోనిది, మనం అనుకున్నదే జరుగుతుంది.

తెలిసాక,  ఆమె ఊరుకోలేదు. అలిగింది. ఓడింది. మాటలతో చేతలతో అతన్ని సాధించింది. ఇంకా దూరమైంది. చివరికి తన బిజీలో తాను మునిగి తేలడం నేర్చుకుని మదిని మరో త్రోవలోకి మళ్ళించుకుంది.

ఆ ప్రవర్తన కూడా  అతనికి అశాంతినే మిగిల్చింది. 

నయన : అతని కి పి ఏ గా మనకు పరిచయమౌతుంది. అతనికి ఆమె చాలా క్లోజ్..అని అతనే స్వయం గా చెప్పడం తో మనకి అసలు కథ అర్ధమౌతుంది.  

ఏ మగాడికైనా, ఇంట్లో పట్టించుకునే ఇల్లాలు లేనప్పుడు ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ అతన్ని  ఆవహిస్తుంది.

అది పనిలో పడి మరచిపోదామనుకుని వర్క్ హాలిక్ గా మారినప్పుడు, చేదోడు వాదోడు గా పక్క పక్కనే నిలిచే స్త్రీ మూర్తి పట్ల ఆ మగానికి  అనురాగం పుడుతుంది. అప్రయత్నం గానే ఆమె పట్ల ఆకర్షింపబడతాడు.. అదెంత బలమైన ఆకర్షణ గా మారుతుందంటే, ఆమె ఆఫీసులో లేకపోతే ఫైల్ మీద సంతకం కూడా చేయలేనంత బలహీనుడైపోతాడు.

 అంత గొప్ప అధికారి, అత్యున్నత విద్యావేత్త అయిన అంత ఎతూ వాడు తన ముందు మోకరిల్లుతున్నప్పుడు ఆ స్త్రీ విజయగర్వాన్ని పొందుతుంది. 

నయన వంటి చదువుకున్న స్త్రీలకు – ఇది అనైతికం అనిపించదు. అతను తనని కోరుకోవడమే ఒక విజయం గా భావిస్తారు. విజాయానికి ఆఖరి మెట్టు ఏదంటే బహుశా వారికి ఇదే కావొచ్చు.

ఆకాశాన చందమామ నీటి మీద కూడా తేల్తాడు. అయితే  తెల్లారాక మాటెమిటీ?

అతనికి ఆమె ఫ్లాట్ కి వెళ్ళలనిపించనప్పుడు నయన మనోగతి ఎలా వుంటుంది?

తెలీదు. నయనవంటి స్త్రీలకి ఈ ప్రశ్న చాలా అనవసరమైనది కావొచ్చు!

కాని ఇప్పుడు ఆ ప్రశ్నే అతన్ని తొలిచేస్తోంది. నయన దగ్గరకి ఎందుకు వెళ్లడం అని? 

ముగింపు : కథ చదివాక అనిపిస్తుంది – ఒక మగవానికి జీవితం  అశాంతి పాలు కావడానికో, లేదా అతను దారి తప్పి పోడానికో, కొన్ని బలహీనతలకు లొంగిపోడానికో కారణం? – అతని జీవితంలో ఎదురయ్యే స్త్రీలని అర్ధం చేసుకోలేకపోవడం వల్ల, వారికి చేయూత నివ్వలేకపోవడం వల్ల, ద్వేషించడం వల్ల మాత్రమే అశాంతికి గురవుతాడు అని పరోక్షం గా చెబుతుంది ఈ కథ. 

జీవితం లో ఎన్ని పెద్ద  పెద్ద తప్పిదాలు చేసినా, ఒకోసారి ఎదురయ్యే  అతి చిన్న సంఘటనే మనసుని కదిలించేస్తుంది. చేసిన తప్పు ని సరిదిద్దుకోమంటూ ఆత్మ  పోరుతుంది. సరిగ్గా ఈ కథలోనే అదే జరిగింది.

అదేమిటన్నది చదివి తెలుసుకోవాల్సిందే!

చదివి, మీ మీ విలువైన అభిప్రాయాలను రచయిత్రికి తెలియచేయవలసిందిగా నెచ్చెలి పాఠకులకు నా మనవి.

మీ అందరకీ వందనములతో, వచ్చే నెల మరో మంచి కథతో కలుసుకుందాం!

******

  దారి ఎటు?

 – స్వాతీ శ్రీపాద  

వీధి లైట్ల వెలుగు మిరుమిట్లు గొలిపే  కొండచిలువ లా వెన్నెలను మింగేస్తున్న క్షణం. సావధానంగా నడిచి నడిచి సిమెంట్ బెంచీ మీద కూచున్నాను . పూర్ణ చంద్రుడు సరిగ్గా నడినెత్తిన ఉన్నాడు. 

అసలు ఎన్నాళ్లైందో ఇలా సావకాశంగా రెండడుగులు నడిచి! కుడి చేతి చూపుడు వేలు బొటన వేలితో కనురెప్పలపై సుతారంగా వత్తుకున్నాను . 

ఎందుకో ఉన్నట్టుండి మనసులో దుఃఖం పొ౦గి వచ్చింది. ఈ నిశ్శబ్దపు నడి  రాత్రి నగరం రోడ్ల మీద నదిలా పారుతున్న వెలుగు వెల్లువలో దిగులు మేఘం ఒకటి చటుక్కున మొలిచి, అ౦తై ఇంతై నిలువెల్లా ఆక్రమించుకుంది. ఎందుకో తలుచుకోకుండానే చిన్నతనం గుర్తుకు వచ్చింది. అమ్మ గుర్తుకు వచ్చింది. జానకి గుర్తుకు వచ్చింది. 

అప్రయత్నంగానే కళ్ళ నుండి  రెండు వెచ్చని నదులు ధారలై ప్రవహించాయి. వాటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. 

నలుగురి తరువాత పుట్టిన వాడని అమ్మ అపురూపంగా చూసేది. అమ్మ బాగా చూస్తుందని అక్కలందరికీ కినుకుగా, కుళ్ళుగా ఉండేది. తను మాత్రం, వారినేం మర్యాదగా చూసాడు గనక. తన చిన్నప్పుడే పెద్దక్క పెళ్లై పోయింది. తూ తూ మంత్రంగా జరిగిన పెళ్లి అది. 

అదిలేదని ఇది లేదని పిల్లాడు నచ్చలేదని, వచ్చిన సంబంధాలన్నీ ఎత్తగొట్టి  జంపు నడిపి చివరికి పెళ్లి ఈడు దాటిపోయాక, ఒక పదేళ్ళపాటు ఇంట్లో అమ్మకూ అక్కకూ హోరా హరీ యుద్ధాలు నడిచాక ఎవ్వరితో నైనా లేచి పోతుందేమో ఇహ అన్న భయంతో వదిలించుకు౦దుకు చేసిన పెళ్లి అది. 

ఆ యుద్దాలకి ఒక కారణం అంటూ ఉండేది కాదు. వాకిలి ఊడవటం దగ్గరనుండి ఎవరెక్కువ సార్లు కాఫీ తాగారు అనే వరకూ వేలాది కారణాలు. 

అమ్మ గెలవలేకపోతే తల గోడకేసి కొట్టుకుని నేను ఉరి పెట్టుకు చస్తా అంటూ పరుగెత్తుకు వెళ్లి తలుపులు వేసుకునేది. వెనకాలా అమ్మా వద్దే అమ్మా వద్దే అని ఏడుస్తూ పిల్లలందరి పరుగులు. అది నాన్న లేనప్పుడు. నాన్న ఇంట్లో ఉంటే ఆ స్థాయి రాకముందే ఇప్పుడు ఆలోచిస్తే అర్ధం అవుతుంది. 

ఆడపిల్ల తండ్రిగా నాన్న చేసిన పెద్ద పొరబాటు. ఎంతసేపూ తన జల్సాలు తన తిరుగుళ్ళు అంటే తప్ప బాద్యత అనేది పడితే కదా? 

గడప దాటని అమ్మకు మొగుడి మాట వేదవాక్కు. గడప దాటకుండానే  ఇంటి అధికారమైనా దక్కించుకోలేదు. మెట్రిక్ ఫెయిలయి, ఇహ చదవను అని మొ౦డికేసిన అక్కకు పెళ్లి చెయ్యాలని నాన్నను ఎందుకు పోరలేదు? 

మొగుడి మాటకు తలవంచి రెండేళ్ళకు  ఒకరిని కనడమే బాధ్యతగా పెట్టుకున్నట్టు, అన్నట్టు పోయిన వారుపోగా మిగిలినది నలుగురు అక్కలు. ఒక్కొక్కరి  మధ్య ఒకరిద్దరు పుట్టి పోయారట. పెద్దక్కకూ నాకూ పదహారేళ్ళ తేడా. 

ఎరుపుతిరిగిన గులాబీ రంగులో ఉన్న అక్క పక్కన నీలం తిరిగిన నలుపులో బావ దిష్టి బొమ్మే. అయినా అక్క గత్యంతరం లేకే చేసుకుంది. 

ఇహ రెండో అక్క అదో రకం, తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చూసుకుని అందరి మీదా అజమాయిషీ చలాయి౦చేది. చాలా సీక్రేటివ్. 

మిగతా ఇద్దరూ కొంచం రివల్యూషనరీ. కొడుకే ఎందుకు ఎక్కువ మేమెందుకు తక్కువ అనేవారు. 

“ పొండి మహా అడగొచ్చారు, ఏం  చేసినా చెయ్యకున్నా చచ్చాక కొరివిపెడతాడు” అనేది అమ్మ. 

“ చచ్చాక ఎందుకు ఇప్పుడు పెట్టామన్నా పెడతాడు “అనేవారు. 

ఆ రోజుల్లోనే ఇంట్లో కష్ట సుఖాలు నాకు అ౦టరాదన్న ఉద్దేశ్యంతో నాన్న నన్ను హాస్టల్ లో చేర్పించాడు. అమ్మ అపురూపానికి దూరమైనా నాకూ హాస్టల్ బాగానే ఉండేది.  ఎప్పుడో ఒకసారి సెలవలకు వెళ్ళినా ఇంటి విషయాలు నా వరకూ పెద్దగా వచ్చేవి కాదు. అమ్మానాన్నా నా మీద ఈగనైనా వాలనిచ్చేవారు కాదు. 

మొత్తానికి ఎవరి దార్రిన వారు ఎవరి కుటుంబం వారిది. చాలా జ్ఞాపకాలు మరుపులోకి జారిపోయాయి. 

మంచి ఉద్యోగం… 

అన్నట్టు జానకి గురించి చెప్పలేదు కదూ … 

జానకి నా చిన్ననాటి దోస్త్. 

ఎంత ప్రేమగా ఉండేది. చిన్నపిల్ల కదా అని ఎవరేం ఇచ్చిన దాచి మరీ నాకు పెట్టేది. హాస్టల్ కి వెళ్ళినా వచ్చినప్పుడల్లా మా స్నేహానికేం అడ్డం ఉండేది కాదు.

ఎం ఎస్ సి చదివే రోజుల్లో కాబోలు ఒకసారి మాట్లాడాలి అంటే ఊరవతల ఆంజనేయ స్వామీ గుళ్ళో కలుసుకున్నాం. 

చాలా సేపు నిశ్శబ్దంగా కూచుంది జానకి.

పొడవాటి జడ చివరలు అల్లుతూ విప్పుతూ …

నేను ఎప్పటిలా మా హాస్టల్ గురించీ నా చదువు గురించీ కాజువల్ గా మాట్లాడుతున్నాను. 

“శివా … ఇదివరకులా ఇహ మనం కలవలేకపోవచ్చు …”

“అదే౦ జానకీ మనం ఎప్పటికీ ఇలాగే కలుసుకుందాం … “

“కాదు శివా విను, మన గురించి ఏమైనా ఆలోచించావా?” 

“ఆలోచనా… దేనికి …” 

“శివా నా పెళ్లి నిశ్చయం చెయ్యాలని చూస్తున్నారు … రెండు మూడు సంబంధాలు చూసారు …”

అప్పుడు నాకు తట్టింది. 

“సారీ జానకీ ఇంకా నా చదువు పూర్తి కాలేదు. ఆపైన పీహెచ్ డి చేయ్యాలి. నేను స్థిరపడే వరకూ ఏమీ ఆలోచి౦చలేను.”

“పోనీ స్థిరపడే వరకూ ఎదురు చూడనా?” ఎంత ఆశ ఆమె ప్రశ్నలో 

“ అప్పటి సంగతి ఇప్పుడు ఎలా చెప్పను జానకీ…” 

చాలా సేపు తల వంచుకుని కూచున్న జానకి ఉన్నట్టుండి లేచి పిలుస్తున్నా వినిపించుకోకు౦డా గబగబా వెళ్ళిపోయింది. 

అప్పట్లో ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు కూడా. 

నాతో పాటు పీహెచ్ డీ చేసి కాలేజి ప్రొఫెసర్ గా చేరిన ధనలక్ష్మి  తో పెళ్లి నా ఇష్టం తోనే జరిగింది. 

కాని పట్టుమని అయిదారేళ్ళు కూడా పనిచెయ్యలేదు ధనలక్ష్మి.  ఇద్దరు అబ్బాయిలు. పిల్లలకు అమ్మ ప్రేమ అవసరం అంటూ …. 

పాతికేళ్ళ తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే……

ఉదయం లేచినది మొదలు అర్ధరాత్రి వరకు నా సైన్స్ కౌన్సిల్ మీటి౦గ్స్ …. అభినందనలు, అవార్డ్ లు 

విదేశీ గౌరవాలు… అర్ధరాత్రి ఇల్లు చేరే సరికి ధనలక్ష్మి పిల్లలు సగం నిద్రలో ఉంటారు. ఉదయం లేచేసరికి నా డైలీ ప్లానర్ ఎదురుగా ఉంటుంది. 

ఈ ఉదయం శంకర్ ఫోన్ వచ్చే వరకూ  నాదైన ఒక మిధ్యా లోకంలోనే గడిపాను.

శంకర్ కూడా చిన్నాప్పుడు నాతో చదువుకున్న మిత్రుడు. నిజానికి మా ఇద్దరికీ గోల్డ్ మెడల్ వచ్చింది ఎమ్ ఎస్ సి లో అయితే అక్కడితో చదువాపి కాలేజిలో లెక్చరర్ గా స్థిరపడ్డాడు.

అడపా దడపా పలకరింపులే గాని నా హోదా… వల్ల తీరిక లేక …

కాదు ఉన్న తీరిక సమయం నయనతో గడపడానికే చాలదు.  

నయన నా పీయే. 

అలసిపోయిన ఏ క్షణాల్లోనో నాకు దగ్గరైంది.  పది పదిహేనేళ్ళుగా తనే నా ఓదార్పు నా రిలాక్సేషన్. 

ఉదయం శంకర్ ఫోన్ …

సాయంత్రం హోటల్ తాజ్ బంజారాలో ఒక సర్ప్రైజ్ పార్టీ అనీ తప్పక రమ్మనీ… 

ముందు ఎదో వంక చెప్పి తప్పించుకోవాలని చూసాను. 

“ నయనకు మాట ఇచ్చావా? ఈ ఒక్కసారికీ  తప్పినా సరే రావాలి … రాకపోతే తరువాత బాధపడతావు…” 

నయన సంగతి తనకు తెలుసా ? ఆశ్చర్యపోయాను.. 

రోజంతా అదే ఆలోచన 

వాట్స్ అప్ లో ఇన్విటేషన్ పంపాడు 

తన పేరెంట్స్ యాభై ఏళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ … వారికి సర్ప్రైజ్ పార్టీ… 

ధనలక్ష్మి కి ఫోన్ చేసాను. వీలుకాదట. ఏదో వంక. 

ఈ మధ్య కావాలనే నన్ను అవాయిడ్ చేస్తోందా..  

ఏమో … 

అవును. మొదట్లో దెబ్బలాడేది. తనను పిల్లలను పట్టించుకోడం లేదని. 

ఆపైన అలగట౦ అప్పట్లో అలసి సొలసి ఇంటికి వస్తే ఆమె అలకలు చిరాకనిపి౦చేవి. 

ఆ సమయంలోనే నయన దగ్గరవుత. 

తొలి సారిగా నా మైండ్ బ్లాంక్ అయింది. పనులన్నీ వాయిదా వేసి ఇంటికి వెళ్దామనుకున్నాను. 

ఈ లోగా ధనలక్ష్మే కాల్ చేసింది. పిల్లలు కాలేజి పిక్నిక్ కి నాలుగు రోజులు వెళ్లారట. తను తలిదండ్రులను చూడటానికి వరంగల్ వెళ్తున్నానని. 

సాయంత్రం ఐదున్నరకే. కాల్ చేసి శంకర్ దగ్గరకు వెళ్లాను. ఏమైనా హెల్ప్ చెయ్యాలా అని. 

అప్పటికే , తాజ్ బంజారాలో హాల్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు శంకర్. 

కారు అతని భార్య కూతుళ్ళను తీసుకుని వెళ్లి౦దట , నా కారులో ఇద్దరం బయలు దేరాం. 

పార్టీ హాల్ లో కాదు. ఓపెన్  ఏరియా లో. 

మధ్యన పెద్ద వేదిక ఒకవైపు.  దాని ఎదురుగా మరొక వేదిక అప్పటికే పూలతో అలంకరించారు. 

“ఇక్కడ ఆరున్నర నుండి సంగీత కార్యక్రమం  ఏర్పాటు చేసాము. అక్కడ అమ్మా నాన్న దండలు. మార్చుకుంటారు.”  చుట్టూ రౌండ్ టేబుల్స్ చేయిర్స్ అప్పటికే ఏర్పాటు చేసారు. 

శంకర్ తనతో తెచ్చిన ఫోటో ప్రి౦టవుట్స్ స్టేజి వెనకాల వైట్ షీట్ మీద పిన్ చేసాడు. అవి అతని పేరెంట్స్ పెళ్లి రోజునుండీ ఈ ఉదయం వరకూ ముఖ్య ఘట్టాలు. 

మధ్య మధ్య విరిసీ విరియని ఎర్ర గులాబీలు. 

ఆ పూలమధ్య అత్తరులో ముంచిన వెల్వెట్ పూలు అరగంటలో అలంకరణ ముగించి శైల, అదే అతని భార్య పిల్లలు ఇంటికి వెళ్ళారు. 

కొసమెరుపు అలంకరణ చూస్తూ శంకర్ మాట్లాడుతున్నాడు. 

“పిల్లలు చూసావుగా , పెద్దది రమ్య కు సాహిత్యం అంటే ఆసక్తి. ఎం ఏ తెలుగు చదువుతు౦దట. చిన్నది ఇంకా చురుకు అది వాళ్ళమ్మలా వీణ విద్వాంసురాలు కావాలని…” 

విస్మయంగా చూసాను.

“సారీ ఎప్పుడూ చెప్పలేదు కదూ శైల వీణ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ …”

“శంకర్ గోల్డ్ మెడల్ వచ్చి పీహెచ్ డీ కి వెళ్లనందుకు ఎప్పుడూ రిగ్రేట్ అవలేదా …”

ఒక్క క్షణం ఆగాడు శంకర్ 

“లేదు శివా … నన్ను అంతవరకూ చదివి౦చటమే ఎక్కువ. నాన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి. నేను అనుకున్నది చేసాను.  

అమ్మా నాన్నకు కొడుకుగా ఇవ్వగలిగినంత ఇవ్వాలి ఎప్పుడో సంగతి ఎలా చెప్పగలను, ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా నా బాధ్యతలు నిర్వహించటం, నా వృత్తికి న్యాయం చేకూర్చటం ఇవే కదా … ఇదే కదా భగవద్గీత అయినా మరొకటైనా మరొకటైనా…

ఇద్దరం వాళ్ళింటికి వెళ్లి ఫ్రెష్ అయి శంకర్ అమ్మ గారు ఇచ్చిన కాఫీ తాగాం. 

అప్పటికే అతని తల్లీ తండ్రీ రెడీ అయి ఉన్నారు. 

“ఎందుకురా  ప్రతి పార్టీకీ మమ్మల్ని రమ్మని ..” నసిగింది ఆవిడ. 

“ నానమ్మా పార్టీలు సకుటుంబ సమేతంగా మా ఒక్కరికీ కాదు” 

జవాబు ఇచ్చినది శంకర్ పెద్ద కూతురు 

వాళ్ళంతా ఒక కారులో నేను శంకర్ మరో కారులో వెళ్లాం. 

లౌ౦జ్ లో  అడుగుపెడుతూనే ఇద్దరి మీద మల్లెల జల్లు సర్ప్రైజ్ వెడ్డింగ్ ఆనివర్సరీ అంటూ శుభాకాంక్షలు . 

లోపల పార్టీ ఏరియా చేరకముందే చెవులకు చేరిన సంగీతం. 

ఆ తరువాత అయిదారు గంటలు ఎలా గడిచిపోయాయో. శైల కుడా వీణ వాయించింది. శంకర్ వీలైనంత వరకూ నాతోనే ఉన్నాడు. 

ఇద్దరం మరికొందరు మిత్రులు. 

మాటల  మధ్యలో శంకర్ అడిగాడు. 

“అసలు నువ్వు నీ జీవితాశయం ఏమిటని అనుకుంటున్నావు?”

జవాబు లేక వెర్రి నవ్వు నవ్వాను. 

ఆ ప్రశ్న నన్ను ఒక పులిలా వెన్నాడుతూనే ఉంది. 

అందుకే వాడిదగ్గర సెలవుతీసుకుని బయటపడ్డాను.  ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఇది వరకు ఇలాటి సమయాల్లో నయన ఫ్లాట్ కి వెళ్ళే వాడిని. ఇప్పడు మాత్రం ఎదో ఒక ప్రశ్న నాలో ఒక అంతర్దహనాన్ని రగిల్చింది. 

ఏం సాధించాను? 

నా హోదా నా పేరు ప్రఖ్యాతులు ఏ మాత్రం ఆనందాన్నిచ్చాయి? నా పిల్లలకు, నా భార్యకు అవి అవసరం లేదు. అమ్మా నాన్న ఎక్కడో ఊర్లో ఉన్నారు. 

అక్కలతో అంత సఖ్యత లేదు. 

ఇందాక శంకర్ పార్టీలో అతని చెల్లెళ్ళు అతనితో ఎంత ప్రేమగా ఉన్నారు. 

ఎంత సరదాగా ఉన్నారు? 

ఎక్కడపోగొట్టుకున్నాను ఈ జీవితాన్ని ఇంతదూరం నడిచి వచ్చాక వెనక్కు వెళ్ళగలనా? 

పాలుపోని అయోమయంలో ఎంత సేపలా కూర్చున్నానో …

బీట్ పోలీస్ లావు౦ది , వచ్చి తట్టి లేపాడు.  

“రాత్రి రెండు దాటింది. ఎందుకిలా కూచున్నారు?” అనుమానంగా చూసారు. 

నా విజిటింగ్ కార్డ్ ఇచ్చాను. 

“కారు ఎక్కడ? ఈఫ్ యు డోంట్ మైండ్ తాగారా? “ ‘

లేదన్నట్టు తలూపి కారు పార్క్ చేసిన చోటు చూపించాను. 

“ఇంటికి వెళ్ళండి “ ముందుకు నడిచి అక్కడ ఆగారు 

వాళ్లకి అనుమానం లా వుంది ఎక్కడ సూసైడ్ చేసుకు౦టానో అని… 

నవ్వొచ్చింది. 

అశోకుడికి ఇలాగే బోధి వృక్షం కింద జ్ఞానో దయమై  …

ఓటమి అంగీకరించి వెనక్కు నడవాలనే మనో నిశ్చయం కలిగింది.

 ‘ఇప్పుడు నా దారి ఎటు ?’ అనే ప్రశ్నకి జవాబు దొరికింది.

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.