జ్ఞాపకాల సందడి-8
-డి.కామేశ్వరి
సాధారణంగా అరవైయై డెబ్బయి ఏళ్ళువచ్చేసరికి ఆధ్యాత్మిక చింత మొదలవుతుందంటారు. చాలామంది ఆధ్యాత్మిక పుస్తకాలూ, లలితా పారాయణాలు, ప్రవచనాలు గుళ్లూ గోపురాలచుట్టూ ప్రదక్షిణలు, హనుమంచాలీసాలు చదువుకుంటూ నా వయసువాళ్ళందరూ కాలక్షేపం చేయడం చూసా. మరి నాకెందుకో ఆ వైపుకే బుద్ధి మళ్లడం లేదు. ఒకటి రెండుసార్లు. చూద్దాం దానివల్ల ఎమన్నామార్పు, మంచి జరుగుతుందేమో అని బుద్ధి మళ్లించడానికి ఎంత ప్రయత్నించినా కాన్సెన్ట్రేషన్ కుదరలేదు.
ఎవరన్నా పూజలకు పిలిచి లలితా పారాయణ చేద్దాం అంటే సరే గుంపులో గోవిందా అన్నట్టు చక చక చదివేసేదాన్ని అంతే తప్ప భక్తి భావం కలగలేదు. అలా అని నేనేం నాస్తికురాలినికాదు. మనందరినీ కంట్రోల్ చేసే ఒక సూపర్ పవర్ ఉందని అదేదేముడనుకుందాం, ఎన్నిపేర్లతో పిలిచినా దేముడొక్కడే అని నమ్ముతా. కర్మ ఫల సిద్ధాంతాన్ని , పాపపుణ్యాలని, మనం చేసిందే మనకు దక్కుతుంది అన్న నమ్మకాన్ని బలంగా నమ్ముతా. భజనలు, పరాయణాలవల్ల సైన్టిఫిక్ గ ఎన్నోప్రయోజనాలున్నాయని అంటుంటే అంగీకరిస్తున్నా. కానీ నా మనసు వాటి వైపు మళ్లడంలేదు.
ఈజ్ సమ్థింగ్ రాంగ్ విత్ మీ అనిపిస్తుంటుంది అపుడపుడు.
నాకు నచ్చిన సూక్తులు-
“దండం పెట్టే రెండుచేతులకంటే దానం ఇచ్చే ఒకచేయి గొప్పది”.
“ఇచ్చిందే మనకు దక్కుడు”
“పుచ్చుకున్నపుడు కంటే ఇచ్చినపుడు కలిగే ఆనందం గొప్పది”
“దేహానికి స్నానం మనసుకి ధ్యానం అవసరం”
అన్న మాటలు నాకు నచ్చినవి.
వీలయినంతవరకు అవి పాటించగలిగితే అదే పుణ్యం పురుషార్థం అనుకుంట.
మీరేమంటారు!?
*****