తెలుగు సాహిత్యంలో మహిళలు
-వసుధారాణి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు పాఠకులను ప్రభావితం చేసిన మహిళా కవయిత్రులు, రచయిత్రుల గురించి పాఠకులకు తెలిపే ప్రయత్నమే ఈ వ్యాసం.
ప్రాచీన సాహిత్యం
తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క 1423-1503 మధ్యకాలంలో జీవించిన తాళ్ళపాక అన్నమాచార్యుని పెద్ద భార్య ఈవిడ పేరు తిరుమలాంబ.తిమ్మక్క ‘సుభద్రా కల్యాణం’అనే కావ్యాన్ని మంజరీ ద్విపదలో రచించింది.ప్రాస నియమం మాత్రమే ఉండి యతి నియమం లేని దేశీయమైన ఛందస్సు మంజరీ ద్విపద.ఇందులో1170 మంజరీ ద్విపదలున్నాయి.ఈమె కుమారుడు తాళ్ళపాక నృసింహాచార్యుడు కూడా గొప్ప కవి.
తొలి తెలుగు రామాయణ కవయిత్రి మొల్ల.మొల్ల జీవిత విశేషాలు ఆవిడ కావ్యంలో లభ్యం కాలేదు.15 వ శతాబ్దం ఆఖరు నుంచి 16 వ శతాబ్దం మొదటి వరకూ ఉండవచ్చు.ఈవిడ కుమ్మరి కులజ అని అంటారు .తండ్రి ఆతుకూరి కేసన. మొల్ల869 గద్య పద్యాల్లో తెలుగులో రామాయణం రాసింది.మొల్ల ప్రకృతి సౌందర్యారాధకురాలు.
‘ కారుమొగులురీతి
కాటుక చందన నీటిబావి
ఇంద్రనీల మహిమ’ చీకటిని నీటితో పోల్చటం ఆమె నవ్య భావుకతకు తార్కాణం.
కనకాభిషేకం పొందిన తొలి కవయిత్రి మధురవాణి.రఘునాధ రాయల ఆస్థానంలోని కవయిత్రి ఈవిడ.1600 నుంచి 1631 .శుకవాణి ఈమె అసలు నామధేయం ఐతే ఈమె వాగ్మాధుర్యానికి ఇచ్చిన మధురవాణి బిరుదనామమే వ్యవహారనామంగా మారిపోయింది. రఘునాథ రాయలు తెలుగులో రచించిన రఘునాథ రామాయణాన్ని ఈమె సంస్కృతీకరించింది.ఈ రకంగా ఈవిడ తెలుగు నుంచి ఇతర భాషకి మొదటి అనువాదకురాలు కూడా.
బహుభాషా విశారద రంగాజమ్మ.నాయకరాజుల కాలం 1550.తంజావూరులో విజయ రాఘవనాయకుని సభలో ఈమె రచించిన మన్నారు దాస విలాస ప్రబంధం వినిపించగా రంగాజమ్మకు కనకాభిషేకం చేసి భార్యగా చేసుకున్నాడు.రంగాజమ్మ కవిత్వంలో పాటలు,పదాలు,దరువులు కూడా ఉన్నాయి. ఈమె సంభాషణలు హాస్యరస చమత్కారాలతో సహజంగా ఉంటాయి.దాస విలాసమనే యక్ష గానంలో సంస్కృత శ్లోకాలు,చూర్ణికలు, పైశాచి, మాగథి ,సౌరసేని,అపభ్రంశ,భాషావాక్యాలు న్నాయి.
రంగాజమ్మ పెళ్లి బోజనాలను ఒక వచనంలో వివరించింది.అందులో ఆ కాలంనాటి 67 వంటకాలను పేర్కొంది.ఈవిడ ఉషాపరిణయం కూడా రచించింది.
తరిగొండ వెంగమాంబ 1730 నుంచి 1817 వరకూ ఈవిడ జీవితకాలం.శ్రీ వేంకటాచల మహత్యం అనే కావ్యాన్ని రచించింది.పుష్పగిరి పీఠాధిపతి చేత ప్రహ్లాదుని అవతారంగా కొనియాడబడిన బాల వితంతువైన కవయిత్రి .
“నాల్గు త్రోవలకును నట్ట నడిమి కొండ
పాము తనలోనుండగా ప్రబలు కొండ
కురువలిని తనలో నిల్పి మెరయు కొండ
తొంటె మా పెద్దలున్నట్టి దొడ్డ కొండ”. అంటూ ఒక్క సంస్కృత సమాసం లేకుండా శేషాద్రిని వర్ణించిన గొప్ప కవయిత్రీ తిలకం తరిగొండ వెంగమాంబ.
ఆధునిక సాహిత్యం
బండారు అచ్చమాంబ 1874 నుంచి 1905 .ఈవిడను మహిళాభ్యుదయ వైతాళికురాలిగా పేర్కొనవచ్చు.తెలుగులో మొట్ట మొదట స్త్రీల చరిత్రను రాసిన మహిళగా ,స్త్రీ సమాజ స్థాపకురాలిగా ,సంఘసేవకురాలిగా విశేష సేవలను సమాజానికి అందించారు బండారు అచ్చమాంబ.’అబలా సచ్చరిత్ర రత్నమాల’అనే ఈవిడ రచించిన గ్రంథం కందుకూరి వీరేశలింగం గారి ‘చింతామణి’ పత్రికలో ప్రచురించారు.అచ్చమాంబ మంచి కథకురాలు కూడా ఈమె వ్రాసిన ‘ధనత్రయోదశి’ కథ 1902లో ‘హిందూ సుందరి’ పత్రికలో అచ్చయింది.ఈవిడ కేవలం 31 సంవత్సరాలు జీవించారు.
దేశభక్తి కవిత్వంలో మొదట చెప్పుకోదగ్గ తెలుగు కవయిత్రి కొటికలపూడి రమణమ్మ.1874 నుండి 1936 ఈవిడ జీవితకాలం.వీరేశలింగం గారి అభిమాన శిష్యురాలు.’అహల్యాబాయి చరితము’,’సాధురక్షక శతకము’, ‘గీతాసారం’వీరి రచనలు.’ఒకమహ్మదీయ వనిత’అనే శీర్షికతో కరుణ రసభరితమైన పద్యాలు వ్రాసారు.వితంతు వివాహాలను ప్రోత్సాహిస్తూ కందుకూరి వారి తో కలిసి ఎన్నో ఉపన్యాసాలను చేశారు.అవి ‘ఉపన్యాసమాలిక’ పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి.
“మా చెట్టునీడ ముచ్చట్లు”1922లో ఆంధ్రపత్రికలో , రాసిన వారు లీలావతి.1928 లో గృహాలక్ష్మి మాస పత్రిక ప్రథమ సంచిక నుంచి వరుసగా ఆరేళ్ళు’ శారద లేఖలు’ప్రచురితమై సంచలనం కలిగించాయి.ఆ లీలావతి,ఈ శారద ఒక్కరే ఐదవతరగతి ఐనా దాటని కనుపర్తి వరలక్ష్మమ్మ.1896 నుండి 1978 వీరి జీవితకాలం.తెలుగులో లేఖాసాహిత్యానికి ఆద్యురాలు ఈవిడ.ఓటు విలువను తెలియజెపుతూ ‘ ఓటుపురాణం’ రాసి టంగుటూరి ప్రకాశం పంతులుగారికి అంకితం ఇచ్చారు.గృహాలక్ష్మి పత్రికాధిపతి కేసరి గారు 1934 లో నెల్లూరులో గృహాలక్ష్మీ ప్రథమ స్వర్ణ కంకణం బహుకరించారు.1968లో అఖిల భారత తెలుగు రచయితల సభలో సన్మానం,1975 లో ప్రపంచ తెలుగు మహాసభలలో స్వర్ణ ఫలకం,తామ్రపత్ర బహుకృతి లాంటి సన్మానాలు ఎన్నో పొందారు.
సాహితీ రుద్రమ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ .’కృష్ణకుమారి’ పేరుతో భారతి మాస పత్రికకు రచనలు పంపేవారు.వ్యాసాలు,గేయాలు,పద్యా లు,చారిత్రక పరిశోధనలు,వచనకవితలు,ఖండకావ్యా లు ఇలా విభిన్న సాహిత్య ప్రక్రియలు వీరిది అందేవేసినచేయి స్వాతంత్రోద్యమ కాలంలో వేలాది సభల్లో తన మహోన్నత ఉపన్యాసాల ద్వారా జాతిని ఉత్తేజపరిచిన విదుషీమణి.’మహిళా విక్రమ సూక్తం’,’కన్యకమ్మనివాళి’,వీరి రచనలు .’నా తెలుగు మాంచాల’ వీరి రచనలలో విలక్షణమైనది.1953 లో గృహాలక్ష్మి స్వర్ణ కంకణం ,1971లో ఆంధ్ర విశ్వవిద్యాలయం చేత కళా ప్రపూర్ణ బిరుదు పొందారు. రంగాజమ్మ తరువాత కనకాభిషేకం పొందిన ఏకైక కవయిత్రి లక్ష్మీకాంతమ్మ.1917 నుండి 1996 వీరి జీవితకాలం.
1918 నుండి 1998 వరకూ జీవించిన ఇల్లిందుల సరస్వతీదేవి హెద్రబాదు నగర మహిళా చైతన్యం కోసం ఆంధ్ర యువతీ మండలిని నడిపించారు.యేవాదాలకు లోను కాకుండా సార్వజనీనమైన మానవతా విలువలు పెంచే కథలు వ్రాసారు.ఇతి వృత్త వైవిధ్యంతో 250 కథలు రాశారు. నూరు కథల సంపుటి ‘స్వర్ణ కమలాలు’కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందింది.వీరి మరో 108 కథల సంపుటి ‘ తులసీదళాలు’ .
తొలినాటి మహిళా కాలమిస్ట్,తెలుగు వారి పఠనా స్థాయిని పెంచిన రచయిత్రి మాలతి చందూర్.1950లో ఆనందవాణిలో ‘రవ్వలదుద్దులు’మాలతీ చందూర్ తొలికథ ప్రచురితం అయ్యింది.1952 నుంచి నిరాటంకంగా అర్ధ శతాబ్ది పాటు’ ప్రమదావనం’అనే జవాబుల శీర్షిక ఆంధ్రప్రభ వారపత్రికలో నడిపిన ఘనత మాలతీ చందూర్ ది. స్వాతి మాసపత్రికలో పాతకెరటాలు పేరుతో 300 కి పైగా ఆంగ్ల నవలలని సంక్షిప్తంగా తెలుగులోకి కుదించి అందించారు.’పాప’ పేరుతొ కథా సంపుటి శతాబ్ది సూరీడు,హృదయనేత్రి,కాంచనమృగం లాంటి26నవలలు ఈవిడ రచనలు.1928 నుండి 2013 ఈవిడ జీవితకాలం.వంటలు-పిండివంటలు అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం 30 మార్లు ముద్రణ అయినది.1993 లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు,1987 ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు,లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం,రాజాలక్ష్మీ సాహిత్య పురస్కారం ఇలా ఎన్నో అవార్డులను పొందటం ఈమె ప్రతిభకు తార్కాణం.
తెన్నేటి హేమలత (1931-1997)1960 లలో అబ్బాయిలు,అమ్మాయిలు ఎవరి చేతిలో చూసినా లత పుస్తకం ఉండేది.సంచలన రచయిత్రి.1958-69 మధ్య ఆంధ్రప్రభ వారపత్రికలో ఊహాగానం శీర్షిక లత నడిపేవారు.ఈవిడ భావకురాలు, ఉద్విగ్న మనస్కురాలు అని ఈవిడ రచనలు మోహనవంశీ వంటి వాటి ద్వారా పాఠకులు అనుకునేవారు.లత ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 20 ఏళ్ల పాటు సభ్యురాలిగా ఉన్నారు.విషవృక్ష ఖండన పేరుతో రెండు సంపుటాలు,స్వర్ణసీత,లతవ్యాసాలు,
చరిత్ర కందని చిత్ర కథలు మొదలైనవి వ్రాసారు.గృహాలక్ష్మీ స్వర్ణ కంకణం,కళాప్రపూర్ణ, సుశీలానారాయణ రెడ్డి అవార్డు,తెలుగు విశ్వవిద్యాలయంవారి ఉత్తమ రచయిత్రి అవార్డు పొందారు.
అబ్బూరి ఛాయాదేవి(1933-2019).ఛాయాదేవి గొప్పకధకురాలు స్త్రీల కథలను స్త్రీవాద కథగా పరిణమింప చేయటంలో ఛాయాదేవి చెప్పుకోదగ్గ కృషి చేశారు.1956లో హైదరాబాద్ ఆంధ్ర యువతీ మండలి వారి వనిత పత్రికకు సంపాదకీయం వహించారు.3 స్వీయ కథా సంకలనాలు ప్రచురించారు.పిల్లల కథలు, జానపద కథల అనువాదం,యాత్రా చరిత్రలు 16 రచించారు.P V నరిసింహారావు స్మారక పురస్కారంగా స్వర్ణ కంకణం,పులికంటి సాహితీ సత్కృతి,సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం ఇలా ఎన్నోపురస్కారాలు వీరిని వరించాయి. ఈమె సహాయ సంపాదకత్వంలో కథాకోశం ప్రచురితం అయ్యింది.
1939 లో జన్మించిన రంగనాయకమ్మ తెలుగు సాహిత్యంలో సాహసానికి,సంచలనాలకు మారు పేరు.గృహిణిగా ఉంటూ కథలు, నవలలు రాసే స్థాయి నుండి సమాజాన్ని,మర్క్సిజాన్ని అధ్యయనం చేసి విమర్శకురాలిగా పరిణితి చెందారు.1955 లో తన 16 వ ఏటనే పార్వతమ్మ కథ అనే కథ తెలుగు స్వతంత్ర లో ప్రచురింప బడింది.జానకి విముక్తి,స్వీట్ హోమ్,పేకమేడలు,బలిపీఠం వీరి పాపులర్ రచనలు.రామాయణ విష వృక్షం సంచలనాన్ని రేపిన పుస్తకం.
వాసిరెడ్డి సీతాదేవి,మాదిరెడ్డి సులోచన,కోడూరు(ఆరెకపూడి)కౌసల్యా దేవి,ఆంధ్రులఆరాధ్య రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి వీరంతా 1965 కు ముంద తమ రచనల ద్వారా తెలుగు పాఠకుల సాహిత్యాభిలాషను,తెలుగు భాషను నిలబెట్టారు.
నిడదవోలు మాలతి అమెరికా,తెలుగు రాష్ట్రాల మధ్య వారధిలా చాలా కథలను ,వ్యాసాలను అందించారు.డయాస్పోరా కథలు, కథా మాలతి ఈవిడ కొన్ని రచనలు.
తరువాతి సంచలనాలు ఓల్గా,కాత్యాయనీ విద్మహే,వాడ్రేవు వీరలక్ష్మీదేవి,సత్యవతి ,కుప్పలి పద్మ వంటి వారు తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎంతో మంది యువ రచయిత్రులు తమ విభిన్నతను చాటుకున్నారు. కె ఎన్ మల్లీశ్వరి,కల్పనా రెంటాల, సుజాత వేల్పూరి ఇలా వీరంతా కొత్త కొత్త కోణాలలో సామాజిక అధ్యయనాన్ని, సమస్యలను తమ రచనల ద్వారా పాఠకుల ముందుకు తెస్తున్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతమంది తెలుగు కవయిత్రులలను,రచయిత్రులను గూర్చి కొంతయినా వివరాలను అందించే ప్రయత్నం ఇది.సాహిత్యం భాషను ,అనుభవాలను,విజ్ఞానాన్ని,చరిత్ రని సజీవంగా ఉంచే గొప్ప ప్రక్రియ.తెలుగు వారంతా మంచి సాహిత్యాన్ని మరింతగా ఆదరించే దిశగా అడుగు వేయాలని కోరుకుంటూ. మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఈవ్యాసం కోసం పరిశీలించిన పుస్తకాలు:
1.విశిష్ట తెలుగు మహిళలు :డాక్టర్ దామెర వేంకట సూర్యారావు.
2.మహిళల నవలలు మానవీయ విలువలు: కాత్యాయనీ విద్మహే.
3.సాహిత్యాకాశంలో సగం :కాత్యాయనీ విద్మహే
4.ఆంధ్ర రచయిత్రులు సమాచార సూచిక: కె . రామలక్ష్మి
****
“మిర్రర్ టు డే” సౌజన్యంతో –
(ఫోటో కర్టెసీ : భోనగిరి ప్రభాకర్ )
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన అనేకమంది రచయిత్రులని..విహంగ వీక్షణంగా పరుచయం చేసిన వసుధారాణి గారికి ధన్యవాదాలు