వెనుతిరగని వెన్నెల(భాగం-9)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-9)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)

——-

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని  చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికీ పరిచయమవుతుంది. ఇరు వైపులా పెద్ద వాళ్లు  ఒప్పుకుని ఇద్దరికీ పెళ్లి చేస్తారు. తన్మయి అత్తవారింట్లో అడుగుపెడ్తుంది.

***

ఉదయానే నిద్ర లేపింది  తన్మయిని పక్కనే పడుకున్న పిన్ని.

లేమ్మాత్వరగా లేచి స్నానమదీ పూర్తి చెయ్యి. అత్తవారిల్లు కదాఅంది.

ముందు రోజు పెళ్లి తాలూకు బడలిక ఇంకా తీరనట్టే ఉంది తన్మయికి. నిద్రలో అసలు తను శేఖర్ వాళ్లింట్లో ఉన్న సంగతే మర్చిపోయింది

కలలో అంతా వనజా, తనూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. తనకు పెళ్లయ్యినట్లు గానీ, శేఖర్ గానీ తన కలలోకి రాలేదు. ఇదేం విచిత్రమో”  అనుకుంది.  

అదే విషయం పిన్నితో అంది. పిన్ని నవ్వుతూమొన్నటి వరకూ నీకు పెళ్లి కాలేదు గాబట్టి అతని గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటావు. ఇక ఇప్పుడు పెళ్లయ్యాక అతనిక నీ పక్కనే ఉన్నాడన్న ధీమా వచ్చింది కదా.” అంది చాలా తేలిగ్గా.

తను పడుకున్న గదిని ఆనుకుని మరో గది, పక్కన రేకుల కప్పుతో ఉన్న బాత్రూము. పెళ్లి వారిల్లు కాబట్టో ఏమో బాత్రూమంతా చిత్తడిగా ఉంది. బట్టలు మార్చుకోవడం కష్టమే అక్కడ. ఎలాగోలా మొత్తానికి కానిచ్చి త్వరగా తయారైంది తన్మయి.

మెడలో తడిసి ఒంటికి అంటుకుంటున్న పసుపు తాడు, కాళ్లకి ఆరని పారాణి. కొత్తగా అలవాటైన చీర.

అద్దంలో తన రూపం తనకే అపురూపంగా కనిపించింది. ఇలాంటి రూపం కోసం ఎన్ని నాళ్ళుగా కలలు కంది!!

తనంటే ఇష్టమని మరీ పెళ్ళి చేసుకున్న శేఖర్. అతన్ని తన జీవితాంతం ఎంతో ప్రేమగా చూసుకోవాలి తను

అజ్ఞాత మిత్రమా! నీకిక సెలవు. నా ప్రేమానురాగాలతో శేఖర్నే నిన్నుగా మార్చుకుంటాను.” అప్రయత్నంగా నవ్వు వెలిసింది తన్మయి పెదవుల మీద.

మెల్లగా గదిలోంచి బయటకు వచ్చింది. అత్త వారింట్లో అంతా కొత్తగా ఉంది.

శేఖర్ ఎక్కడ ఉన్నాడో చూసే సాహసం చెయ్యాలనిపించలేదు

బిడియంగా వంట గదిలో అడుగు పెట్టింది. అప్పటికే లేచి అందరికీ కాఫీలు పురమాయిస్తున్న దేవి తనను చూస్తూనే పలరింపుగా నవ్విఏమ్మా, సరిగా నిద్ర పట్టిందా? స్నానం కూడా చేసినట్లున్నావు.” అంది.

అవును అత్తయ్యా, నేనేదైనా సాయం చెయ్యనా?” అంది తన్మయి గొంతు పెగుల్చుకుని.

ఇవేళ అప్పుడే ఏం చేస్తావులే. నాలుగు రోజులు కానీ. సాయంత్రం మీ రిసెప్షన్ కదా. వంట వాళ్లతో పని చేయించడమే ఇవేళ పని

శేఖర్ లేచేడేమో చూడమ్మా. కాఫీ ఇస్తాను. పట్టుకెళ్దువుగానీ..” అంది.

తన్మయి ముఖంలోకి ఒక్క సారిగా గొప్ప సంతోషం ముంచుకు వచ్చింది

తన పక్క గదిలో శేఖర్ ఉన్నాడన్న స్పృహ కూడా లేకుండా మొద్దు నిద్దర పోయినందుకు తనలో తను తిట్టుకుంటూ మెల్లగా తలుపు తోసింది.  

తల దగ్గర టేబుల్ ఫాను చప్పుడు చేస్తూ తిరుగుతూన్నా మెలకువ లేనంత గాఢంగా మొద్దు నిద్దర పోతున్నాడు శేఖర్. పక్కనే పది పన్నెండేళ్ల  పిల్లవాడెవరో నిద్రపోతున్నాడు. పెళ్లికి వచ్చిన చుట్టాల పిల్లాడనుకుంటానిద్రపోతున్న  శేఖర్  అందమైన ముఖాన్ని తనివితీరా చూస్తూ నిలుచున్న తన్మయికి వెనక నించి ఎవరో లేచి బాత్రూముకి వెళ్తున్న చప్పుడు  వినిపించి, చప్పున వెనక్కి వచ్చేసింది.

ఇంట్లోని నాలుగు గదులు దాటుకుని పెరట్లోకి వచ్చింది. పెద్దగా పోషణ లేని పెరడు. ఏవేవో చెత్త సామాన్లతో నిండి ఉంది. ఒక పక్కగా కనకాంబరాల్లాంటి కాసిన్ని పూల మొక్కలున్నా ఒక్క పూవు లేదు చెట్టుకీ

పిన్ని వెనకే ఎప్పుడు వచ్చిందో ఏమో. “మీ అత్తయ్యకి పూలంటే ఇష్టమంట. ఎక్కడ లేని పూలన్నీ తురిమి మాలలు కట్టి ఇంటినలంకరిస్తుంది. చూసేవుగా చెట్లకి ఒక్క పువ్వు లేదు.” అని నవ్వింది

దేవి తలలో ఎప్పుడూ గజం పూలు తురుముకుని ఉండడం గమనించింది తన్మయి.

ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వరండాలలో, బయట వాకిట్లో మడత మంచాలు వేసుకుని పెళ్లి చుట్టాలు నిద్రపోతున్నారు.

అటు పల్లెటూరు, ఇటు  పట్టణమూ కాని ఊరది. పెరటి గుమ్మం బయట మురుగు కాలువ రోడ్డు మీదికి వచ్చి పారుతూ పెరట్లోకి వస్తే చాలు దుర్గంధం ముక్కులు పగలగొడుతూ ఉంది

ఇంట్లో తనకి నచ్చనివెన్నో కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్లింటికి తనకెంతో ఇష్టమైన డాబా లేదు. తన్మయికి తమ ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఇంటి మీద బెంగ పట్టుకుంది

అలా బెంగగా కూచోకమ్మా, సాయంత్రం రిసెప్షన్ కి అమ్మా, నాన్నా, మన బంధువులూ వస్తారుఅంది పిన్ని గదిలోకి వచ్చి.

 తన్మయి మనసు ఆనందతాండవం చేసింది

ఎప్పుడు లేచేడో ఏమో శేఖర్ గది గుమ్మం దగ్గిరికి వచ్చికొత్త పెళ్ళికూతురు లేచిందేఅన్నాడు కనుబొమ్మలెగరేస్తూ.

పిన్ని ఏదో పనున్నట్టు బయటికెళ్లి తమకు కనబడేట్టు వరండాలో కూచుంది.

శేఖర్ గదిలోకి ఒక్క అడుగు మాత్రం వేసిమంచి చీర కట్టుకుని త్వరగా తయారవ్వు. మా పెద్దమ్మ వాళ్లు నిన్ను గుడికి తీసుకెళ్లాలంటున్నారు.” అన్నాడు.

తను కట్టుకున్న చీర వైపు చూసుకుంది.” ఇది మంచి చీరే కదాఅనుకుంది.

ఇంతలో దేవి వచ్చిపాపం మీ ఆవిడకి కొత్త చీరలు కొననట్లుంది. పాత పట్టు చీర ఇచ్చి పంపింది వాళ్లమ్మ.” అంది.

పిన్ని ఇదంతా రాద్ధాంతం కావడం ఇష్టం లేనట్లుఅదేం లేదు వదినా, మా అక్క హడావిడిలో తన కొత్త చీర నా పెట్టెలో పెట్టింది. అని పెళ్లిలో తనకి వాళ్లక్క పెట్టిన చీర చూపించింది.”  

తన్మయికి అక్కడ జరుగుతున్నది అర్థమయీ కాకుండా ఉంది.

అమ్మనడిగి తనకి ఇష్టమైన పట్టుచీరలు రెండు తన్మయి కావాలని  తెచ్చుకుంది. పాతవే అయినా తనకి ఇష్టమైన అమ్మ చీరలవి.

లోపలికి రాగానేమీ అత్తగారు ఇలా మాట్లాడుతుందని  మీ అమ్మకి తెలియదు. లేకపోతే నువ్వు అడిగినా పాత చీరలు ఇచ్చేది కాదు.” అని నిష్టూర పోయింది పిన్ని

తన్మయికి ఏడుపు తన్నుకు వచ్చింది.

ఊరుకోమ్మా, కొత్త పెళ్ళికూతురివి, నీ కళ్లలో నీళ్లు ఎవరైనా చూసేరంటే బాగోదు, అయినా ఇవన్నీ సహజంలే.” అంది తేలికగా పిన్ని.

బయలుదేరేటప్పుడుటిఫిన్లు తినేసి  గుడికేవిటీ, వ్రతాలేవిటీ…” అని సణిగింది పిన్ని.

తన్మయి అవన్నీ పట్టించుకునేలోగానేఆటో రెడీఅన్నాడు శేఖర్

గుడి పేరుతో ఆటోలో కిక్కిరిసి కూచున్న పిల్లలూ, పెద్దల మధ్య ఆరు కిలోమీటర్లు తీసుకు వెళ్ళేరు.

కళ్ల ఎదురుగా చిన్న సైజు గుట్ట మీద కనిపిస్తున్న దాదాపు 200 మెట్లని, అక్కడెక్కడో కనిపిస్తున్న ఆలయాన్ని అబ్బురంగా చూసింది తన్మయి

మీ ఊళ్లో ఇంత అందమైన ఆలయం ఉందని ఎప్పుడూ చెప్పలేదేం?” అంది తన ముందే మెట్లు ఎక్కుతున్న శేఖర్ తో.

.. మెట్లన్నీ ఎక్కి దిగేసరికి అందమేంటో తెలిసి పోతుందిలేఅన్నాడు.

వెనకే పకపకా నవ్వులు. తన్మయి మారు మాట్లాడకుండా చకచకా ఎక్కింది మెట్లన్నీ.

పెద్దమ్మా, ఇంకా అక్కడే ఉన్నావా..” అన్నాడు శేఖర్ పది మెట్ల కిందికి చూస్తూ.

మీ ఆవిడ సన్నగా పుల్లముక్క లా ఉంది కాబట్టి నీతో బాటూ చకచకా ఎక్కేసిందిరా. నా వల్ల కాదు నాయినా మిమ్మల్ని అందుకోవడం.. నేను పెదనాన్నా వస్తాము గానీ ముందు వెళ్లి గుళ్లో వ్రతానికి  టిక్కెట్లు తీసుకోండి.” అంది రొప్పుతూ.

మీ పిన్ని కంటే మా పెద్దమ్మే నయం. ఆవిడింకా వెనక ఎక్కుతూంది.” అని తన్మయి చేతిని తన చేతిలోకి తీసుకుని మెట్ల మీద ముందుకి నడిచేడు

తన్మయికి నిజమైన సప్తపది ఇదే అనిపించి ఒళ్ళు పులకించింది.

శేఖర్ చేతిని గట్టిగా పట్టుకుని మనసులోశక్కూ, నన్నెప్పుడూ ఇలాగే నడిపించవూఅనుకుంది.

మెట్ల పక్కన విరగబూసిన దేవ గన్నేరు  వృక్షాల్ని, మెట్ల పైన  రాలి పడి సువాసనల్ని వెదజల్లుతున్న దేవ గన్నేరు పూలని  అమితానందంతో చూస్తూ శేఖర్ తో నడుస్తున్నదల్లా  ఆగి ఒక్క పూవుని వంగి అందుకుని తలలో తురుముకుంది

కలల్లో ఎన్నో సార్లు తనకి కనిపించిన దేవగన్నేరు చెట్ల గుబుర్లివేనన్న సృహ వచ్చి ఆశ్చర్యపోయింది.

నేస్తం! నా కోసం నీ దోసిలి నిండా బంగారు దేవగన్నేరు  పుష్పాల్ని బహూకరించవూతనలో తను కలవరిస్తూ మెట్లు సునాయాసంగా ఎక్కింది తన్మయి.

ఇంటికి తిరిగి రాగానే హాలులో జ్యోతిని చూస్తూనే గాఢంగా కౌగిలించుకుంది తన్మయి.

చెల్లెలికి పెట్టిన చీర కూతురు కట్టుకుని ఉండడం గమనించిఇదేవిటీ, తెచ్చుకున్న పట్టుచీరఅనబోతున్న జ్యోతిని చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కు వచ్చింది తన్మయి.

గుడికి వెళ్ళిన అలసట కంటే అక్కడ తనకి కలిగిన అనుభూతి వల్ల తన్మయి మంచి హుషారుగాఅవన్నీ సరేలే అమ్మా, మేం గుడికెళ్లొచ్చాం. ఎంత బావుందో తెలుసా?” అంది.’

కూతురి ముఖంలో ఆనందం చూసి స్థిమిత పడింది జ్యోతి.

రాత్రికి మనం మన ఊరు వెళ్ళిపోతామా?”  అమాయకంగా అడుగుతున్న తన్మయి వైపు నవ్వుతూ చూస్తూ  “మేం ఇవేళ రిసెప్షను కాగానే వెళ్లిపోతాం. నువ్వూ, అబ్బాయీ, మీరంతా  రేపు ఉదయం వస్తారు.” అంది జ్యోతి

సాయంత్రం  శేఖర్, తన్మయి పెళ్లి రిసెప్షన్ లో పక్కపక్కన కూచున్నారన్నమాటే గానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి లేదు.   

ఇదంతా విసుగ్గా ఉంది.”  అనుకుంది తన్మయి.

అప్పుడప్పుడే  శేఖర్ కుటుంబీకులు పరిచయమవుతున్నారు. ఇక రిసెప్షన్ లో బొత్తిగా తనకు తెలియని మనుషులే అంతా. శేఖర్ నవ్వుతూ నమస్కరిస్తూ పక్కన ఉన్న తనతో ప్రమేయం లేనట్లు అంతా సవ్యంగా చేసుకెళ్లిపోతున్నాడు. కనీసం వాళ్లెవరో తనతో చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. తన పని నిలబడి నవ్వుతూ నమస్కరించడం. అంతే

పక్కగా నిలబడ్డ శేఖర్ తండ్రి  అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూనూ, శేఖర్ తల్లి నవ్వుతూ నిలబడి కనిపించింది.

“తనంటే ఎవరూ తెలియదు కాబట్టి అలా నిలుచుంది. ఆవిడకు అంతా తెలిసిన వాళ్లేగాఅనుకుని

అదేవిటీ మీ అమ్మగారు ఎవరితోనూ మాట్లాడకుండా అలా నవ్వుతూ నిలుచున్నారు నాలాగేఅంది మధ్యలో తన్మయి.

బయటికి నవ్వుతూఆడవాళ్లు ఎలా నడుచుకోవాలో మా అమ్మని చూసి నేర్చుకోఅన్నాడు శేఖర్.

తన్మయి చప్పున తలెత్తి శేఖర్ వైపు చూసింది. ఇంకా అతను ఎటో చూస్తూ చిర్నవ్వు నవ్వుతూనే ఉన్నాడు

చక్కగా నవ్వుతూ నిలబడు. రేప్రొద్దున్న వీడియోలో బాగా ఉండాలి. గుర్తుంచుకో. అసలే వీడియోని మా చుట్టాలందరూ చూస్తారుఅన్నాడు.

రాత్రి పదకొండింటి వరకూ  ఇంటి ముందు కట్టిన షామియానాలో  రిసెప్షను జరిగింది. కాస్సేపు నిలబడి, కాస్సేపు కూచునీ  ఆశీస్సులు అందుకుంటున్నారు  శేఖర్, తన్మయి. అప్పటికీ ఒకటి అరా వస్తూనే ఉన్నారు ఊళ్లో జనం . “చూసేవా, మా బలగం..” అని గొప్పగా తన్మయి వైపు చూసి  నవ్వేడు శేఖర్“. 

పక్కనే కూచుని పద్దులు రాస్తున్న శేఖర్ చిన్నాన్నకాస్త వీళ్లకేవైనా పెట్టండర్రాఅనే వరకూవాళ్లకి భోజనాలు తినడానికి కుదరలేదు.

సాయంత్రమంతా రిసెప్షన్ పేరుతో అలిసిపోయినా ఉదయపు గుడి ప్రయాణపు ఆహ్లాదం, మర్నాడు ఇంటికి వెళతామన్న సంతోషం తన్మయి కళ్లల్లో  కదలాడాయి.

***

మూడో రోజు ఉదయానికి ఇంటికి చేరుకున్నారు. వాకిట్లో నిలబెట్టి ఎర్ర నీళ్ళ తో దిష్టి తీసేరు అమ్మలక్కలు

నరసమ్మ మనవరాలిని  కౌగిలించుకుంది

పాదాలకి నమస్కరించిన నూతన దంపతుల్ని ఆశీర్వదిస్తూచల్లగా నూరేళ్ళు ఉండండిఅంది  ఆనందంగా.

మధ్యాహ్నం వనజ, సుధాకర్ వచ్చారు.  

వనజని వాకిట్లో చూస్తూనే పరుగెత్తుకు వచ్చింది తన్మయి.

తనలాగే మెడలో పసుపు తాడు, కుంకుమ బొట్టు, చేతులకు నిండుగా గాజులు, పొందికైన చీరతో నడిచి వస్తున్న వనజ కొత్తగా కనిపించింది.

పక్కన సుధాకర్ వనజకి తగినంత ఎత్తుగా  ఉన్నాడు. వనజ కంటే ఛాయ తక్కువగా ఉన్నా కళైన ముఖం. మొత్తానికి ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది.

అదే చెప్పింది వనజతో తన్మయి. “మీరిద్దరూఎంత బావున్నారో  తెలుసా

“నీకు సరిగ్గా అదే చెబుదామనుకుంటున్నానునీ కలలు పండి శేఖర్ తో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.” అంది వనజ.

కొత్తగా తమ జీవితాల్లోకి వచ్చిన శేఖర్, సుధాకర్ లని ఒకరికొకరు పరిచయం చేసారు తన్మయి, వనజ.

స్నేహితురాలితో కలిసి ఎక్కువ సేపు కబుర్లు చెప్పుకునే ఏకాంతం లేకపోయినా, మాట్లాడిన కాస్సేపు తన్మయికి గొప్ప బలం వచ్చినట్లయ్యింది.

రేపే వెళుతున్నాము రాయచూర్ కి. ఆయనకు సెలవు లేదు.” అంది లేస్తూ వనజ.

తన్మయి సంతోషంగా స్నేహితురాలిని కౌగిలించుకుని విష్ యూ ఆల్ ది బెస్ట్అంది.

నీకు కూడా. ఉత్తరాలు రాయి. ఎప్పుడూ నీ ముఖంలో ఆనందం ఇలాగే ఉండనివ్వు. ఎంత కళగా ఉందో తెలుసా నీ ముఖం.” అంది వనజ.

సమయానికి వచ్చాడు ఫోటో గ్రాఫర్, ఒక్క నిమిషం ఉండు వనజా, నలుగురం ఫోటో తీసుకుందాంఅంది తన్మయి.

శేఖర్, సుధాకర్ బానే మాట్లాడుకోవడం గమనించి సంతోషించింది తన్మయి వాకిట్లోకి వెళుతూ

***

రోజు సాయంత్రం తలారా స్నానం చేయించేరు ఇద్దరినీ.

శేఖర తల్లి పట్టుకొచ్చిన శోభనపు చీర చూసి ఆశ్చర్యపోయింది తన్మయి.

కోరా రంగు మీద పచ్చ చుక్కలు, పచ్చ అంచు ఉన్న పోలియెస్టర్ మిక్స్మామూలు ఇంట్లో 

కట్టుకునేచీర అది.

తనెంత బాగా ఊహించుకుంది చీరని!!

బంగారు అంచు తెల్లని  పట్టు చీర ఉండాల్సిన చోట చీర ఏవిటి?

అందునా తన దగ్గర మేచింగు పచ్చ రంగు జాకెట్టు కూడా లేదు

అంత వరకూ కట్టుకున్న గులాబీ రంగు చీర మీద వేసుకున్న గులాబీ రంగు జాకెట్టు, తలలో రెండు మూరల మల్లె పూలు, నుదుటున అంతా కలిసి ఆశీర్వాదాల పేరుతో అద్దిన పెద్ద కుంకుమ బొట్టు.

తన్మయికి అద్దంలో తనను తను చూసుకుంటే అస్సలు నచ్చలేదు.

శేఖర్ తో తను గడపబోతున్న మధురమైన మొదటి రాత్రి తను ఇలా అడుగు పెట్టబోతూంది.

అలాగని నోరు తెరిచి ఏం మాట్లాడడానికి లేదు. “పెళ్లి కూతురుగా అన్నిటికీ తల వంచుకుని ఉండాలి, తక్కువగా మాట్లాడాలి, అన్నిటికీ నవ్వుతూ ఉండాలి.. ఇలాంటివన్నీ తప్పని సరిగా నేర్చుకుంది మూడు రోజుల్లో.  

అటు శేఖర్ చక్కగా పూర్తి తెల్ల బట్టల్లో మరింత అందంగా కనిపిస్తూ ఉన్నాడు.

తొమ్మిది గంటల ప్రాంతంలో ఇద్దరినీ గది లోపల మంచమ్మీద కూచోబెట్టి చుట్టూ పెద్ద వాళ్లు నిలబడి బొమ్మలతో ఆడించినట్లు బంతులాట మొదలు పెట్టేరు. 

దంపతులకు తాంబూలాల పేరుతో  కొబ్బరి బొండాలని మంచం కిందికి దొర్లించడం వగైరా అన్నీ చాలా ఎబ్బెట్టుగా అనిపించసాగాయి తన్మయికి.

మొత్తానికి పదిన్నర సమయంలో  తమని ఏకాంతంగా వదిలి అంతా బయటికి వెళ్లేరు.

తన్మయి తడబడే కాళ్లతో తలుపు గడియ వేసి వచ్చింది.

శేఖర్ తన చేతిని అందుకోగానే ఎక్కడ లేని నిస్సత్తువ ముంచుకు వచ్చి అతని చేతుల్లోకి అలాగే ఒదిగి పోయింది.

అప్పటి వరకూ తనను ముట్టుకోవడానికి ఎంతో సంశయిస్తున్నట్లు ఎప్పుడూ ప్రవర్తించే శేఖర్ చాలా మొరటుగా తనని తోసి మీదికి వచ్చేడు.

హఠాత్తుగా శేఖర్ ని అలా చూసి నిర్ఘాంతపోతూ ఏదో చెప్పబోతున్న తన్మయి ముఖాన్ని తన ముఖంతో మూసివేసాడు.

తనకు ఏం జరుగుతుందో తెలిసే లోపల తన దారిన తను ఏవేవో చేసుకెళ్ళిపోతున్నాడు.

సుకుమారంగా అతని చేతుల్లో ఒదిగి పోయి, ఏవేవో తియ్యని కబుర్లు చెప్పుకుని, ప్రేమగా…. అంటూ…..ఏవేవో అనుకుని ఇన్నాళ్లూ కలలు కన్న మొదటి రాత్రి బాధ సుళ్ళు తిరగడం మొదలు పెట్టింది తన్మయికి. 

మనసు అతని చేష్టలని వద్దని మొరాయిస్తూంది. అసలతన్ని నగ్నంగా చూడడానికి మనసు ఇష్టపడడం లేదెందుకో. కళ్ళు గట్టిగా మూసుకుని నిశ్శబ్దంగా భరించడం మొదలు పెట్టింది.

అప్పటిదాకా శరీరపు కలయికల గురించి ఏవేవో ఊహించుకున్నవన్నీ పటాపంచలు చేస్తూ శేఖర్ భయానక రూపం దాల్చాడు రాత్రి.

తొలిసారి కలయిక తో దారుణమైన బాధ మొదలయ్యింది

పది నిమిషాలు గదిలో ఏదో తినడానికి అటూ ఇటూ తిరగడం, మళ్లీ మీద పడడం. తెల్లవారే లోగా శేఖర్ ఏడు సార్లు తన్మయికి నరకం చూపించాడు. తనెంత ప్రాధేయ పడ్తున్నా అర్థం చేసుకోకుండా బలవంతం చేస్తూనే ఉన్నాడు.

తన్మయికి మనసూ, శరీరం దారుణంగా గాయపడ్డాయి.

మొదటి రాత్రి  ఇంత భయానకంగా ఉంటుందని ఎవరూ చెప్పలేదేవిటి?

అతని ముఖం చూడడానికి కూడా భయం పట్టుకుంది. 

తెల్లవారు ఝామున అతను నిద్ర పోయేడన్నాక శరీరం చచ్చిన భావనతో ముందు తలారా స్నానం చేసింది.

పెరట్లోకి వచ్చి ఆకాశంలోకి చూస్తూ పిచ్చి దానిలా దిక్కులు చూసింది.

ఇంతలో జ్యోతి లేచి వచ్చి “తన్మయీ! ఇక్కడేం చేస్తున్నావు?”  అనడిగింది.

తల్లిని చూడగానే  దు:ఖం ఆపుకోలేక పోయింది

ఉష్... చుట్టాలంతా చూస్తారు అని గదిలోకి లాక్కు వెళ్లింది జ్యోతి.”

నేనిక గదిలోకి వెళ్లనమ్మాదీనంగా అంది తన్మయి.

బాగా డీలా పడి వేళ్ళాడిపోతూన్న తన్మయితో ముందు కాస్త పాలు తాగి, ఏదైనా తిని శుభ్రంగా నిద్రపో. కొత్తలో ఇలాగే ఉంటుంది.” అని వెళ్లిపోయింది జ్యోతి.

తన ముఖం చూసి పిన్నిలు, అత్తయ్యలు ఆట పట్టించడం మొదలు పెట్టేరు.

ఇదంతా అతని భార్యగా తన బాధ్యత అని నమ్మలేక పోతూంది.

శేఖర్ పగటి వేళ చాలా మామూలుగా అందరితో హుషారుగా మాట్లాడుతూన్నాడు.

కొత్తల్లుడి హోదాలో అత్తవారింట అతనికి ఎక్కడలేని మర్యాద జరుగుతూంది.

చుట్టూ చుట్టాలంతా ఉన్నా తన వరకూ తను మధ్యాహ్నం భోజనాల సమయం వరకూ  పడి నిద్రపోయింది తన్మయి

శేఖర్ పక్కన కూచుని భోజనం చేస్తూ అతని వైపు చూసింది. అసలేమీ జరగనట్లు చిర్నవ్వు నవ్వేడు.

అందరి ఎదురుగా ఇంత మర్యాద గా ఉన్న ఇతను రాత్రి తనతో అలా ఎందుకు ప్రవర్తించాడు?

తన్మయికి ఏదీ అర్థం కావడం లేదు.

అతనితో రాత్రి గడపకుండా ఉండేదెలా అని కాసేపు ఆలోచించింది

కాస్సేపటి తర్వాతలాభంలేదు ఈ రాత్రి అతనితో గట్టిగా మాట్లాడాల్సిందే” అని నిర్ణయించుకుంది.

 

*****

(ఇంకా ఉంది)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.