షర్మిలాం”తరంగం”

-షర్మిల కోనేరు 

చిరాయురస్తు 

అమ్మా నాకు బతకాలనుంది …కానీ నేను చచ్చిపోతున్నాను .

” నన్ను ఒకడు వాడి గదికి రమ్మంటున్నాడు , లేకపోతే నా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటున్నాడు అందుకే చచ్చి పోతున్నాను “

అని ఉరి తాడుకు వేలాడిందో ఇంటర్ చదివే పిల్ల .

ఆ తల్లికి అంతులేని దుఖ్ఖం మిగిల్చింది .

” డాడీ లేకపోయినా నన్ను కష్టపడి పెంచావ్ .

కానీ నీ మొఖంలోకి చూసి మాట్లాడే ధైర్యం లేక చచ్చిపోతున్నా ” అని రాసింది .

ఇంతకన్నా ఆ తల్లికి గుండెకోత ఇంకేముంటుంది .

పిల్ల మనసు విప్పి తన బాధ ఇది అని చెప్తే ఎవరి కాళ్లు పట్టుకునో వాడ్ని బెదిరించో లేదా పోలీసులకు ఫిర్యాదో చేసి వాడి బారి నుంచి తప్పించేదాన్ని కదా అని ఆ తల్లి అనుక్షణం కుమిలిపోదా ?

వయసులో ఆకర్షణలు అత్యంత సహజం .

అవి ఏ పిల్లలకైనా లేవంటే వాళ్లలో ఏదో తేడా వున్నట్టేనని

నా అభిప్రాయం .

అందరం ఆ దశ దాటుకుని వచ్చిన వాళ్లమే .

ప్రేమో ఆకర్షణో ఒక కుర్రాడితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది .

అవతలి వాడు దుర్మార్గుడైతే ఆ పిల్లతో సన్నిహితంగా వుండగా తీసిన ఫొటోలు చూపించి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెడతాడు .

ఇది మొదటి సంఘటనా కాదు ఆఖరిదీ కాదు .

ప్రపంచం వున్నన్నాళ్లూ వుంటుంది .

ఒక్కోసారి మోసపోయేది మొగపిల్లలు కావొచ్చు .

నాకు ఒకటి గుర్తొస్తోంది .

మా అమ్మాయి స్నేహితురాలికి ఇలాగే జరిగితే మేం వాడు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వెంటనే చూశాం .

మా అమ్మాయి నాకు చెప్పగానే వాడి ఫోన్ నంబర్ కి ఫోన్ చేది తక్షణం ఆ పోస్ట్ డిలిట్ చేయమని చెప్పా !

పోలీస్ ని తీసుకుని ఇంటికి వస్తున్నానని చెప్పగానే వెంటనే పోస్ట్ తీసేశాడు .

తరవాత ఇంటికి పిలిపించి మాట్లాడి బాగా మందలించి పంపాను .

నేను జర్నలిస్ట్ అవ్వడం వల్లేమో పోలీస్ ని నిజంగానే తీసుకు వస్తున్నానని అనుకున్నాడు .

నిజానికి అటువంటి సమస్యలు ఎదుర్కునే పిల్లలికి ఇది ప్రాణం మీదకి వచ్చే సమస్యలాగే వుంటుంది .

పెద్దలు భరోసా కల్పించాలి .

వాళ్ల సమస్య ఏదైనా తల్లి తండ్రుల దగ్గర చెప్పుకోగల వాతావరణం వుండాలి .

ఎంత కఠినమైన సమస్యలైనా కుటుంబసభ్యుల సాయంతో ఎలా గట్టెక్కొచ్చో కొన్ని ఉదాహరణల రూపంలో చెప్తూ వుండాలి .

ముఖ్యంగా అర్ధతరంగా తనువుచాలిస్తే కోల్పోయే జీవితం విలువ గురించి కూడా సందర్భానుసారం పిల్లలతో చర్చించాలి .

ఈమధ్య చిన్న చిన్న కారణాలతో అంటే మార్కులు తక్కువ వచ్చాయనో చదవలేకపోతున్నానో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు . తల్లకిందులవుతుందనేంత వత్తిడి సృష్టించడం కూడా ఒక కారణం .

ఇక అత్తింటి వేధింపులతో ,భర్త హింసతో చావుల్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్యకూడా తక్కువేమీ లేదు .

అప్పులపాలై కుటుంబాలకు కుటుంబాలే విషం తాగి చనిపోతున్న వార్తలతో పేపర్ రాని రోజు లేదు .

బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు లేదా ఏ రంగంలో రాణిస్తారో ఎంత గొప్పవాళ్లవుతారో !

ఈ విశాల విశ్వంలో మనకు చోటు కరువా .

ప్రపంచమంతా మోసం ,ద్వేషం , పగ , కామం వున్నట్టే నిజాయితీ , త్యాగం , ప్రేమ , ఔన్నత్యం కూడా వున్నాయి .

మనం బతకడానికి, మనుగడ సాగించడానికి , ఉనికి చాటుకోవడానికి కారణాలు వెతుక్కోవాలి .

అంతే కానీ అత్మహననానికి కారణాలు వెతుక్కోకూడదు .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.