“నెచ్చెలి”మాట 

“అందానికి నిర్వచనం”

-డా|| కె.గీత 

 

అందానికి మగవారి నిర్వచనం “స్త్రీ” (ఠక్కున చెప్తారు!) 

నిజమా! అందం చూసే వారి కళ్ళని బట్టి ఉంటుంది  మరి మగవారి సంగతి ఏవిటి అంటారా?!

అన్నట్టు పాపం  ఈ మధ్య ఓ హీరోయిన్ మగవాడి అందమ్మీద ఒక్క పాటా లేదేవిటి అని ఒక పాటలో వాపోతుంది! 

సర్లేవమ్మా ! అది ఆ పాట రచయితకి, దర్శకుడికి ఉన్న బాధన్నమాట అంటారా?! 

ముఖారవింద సొగసుదనమే అందమైతే-

 అసలు అందంగా ఉండడానికి  ఏం చెయ్యాలి?!

నిరంతరం అద్దం ముందు గంటల తరబడి కూచోవడం కోసం ఉన్న డబ్బంతా  డ్రెస్సింగు టేబులు ముందు మాంఛి మహారాజా కుషను కుర్చీ కోసం తగలేయడం- 

రాసినవి మళ్ళీ రాయకుండా , పూసినవి మళ్ళీ పూయకుండా వచ్చిన ప్రతీ కొత్త ప్రోడక్టుని “కొని” పారేయడం-

తమని తాము సౌందర్యాధిదేవతలుగా మలచుకోవడం కోసం ముక్కులు, మూతులు ఆపరేషన్లతో కోయించి మరీ కుట్టించుకోవడం-

కీటోలతోనే సరిపెట్టుకున్నా కిలో కండ పెరిగే సరికి బెంబేలెత్తి లైపోసక్షన్లకి ప్రాణాలు బలివ్వడం-

అయ్యబాబోయ్! 

ఇంత “సౌందర్యాత్మక హింస” అవసరమా!?

అసలు కొంచెం సీరియస్ గా ఆలోచిస్తే “మగవాడి అందమ్మీద ఒక్క పాటా లేని” గ్రేట్ రీజన్స్ ఏవిటో?!

“మగవాళ్ళు కేవలం సౌందర్యారాధికులు మాత్రమే”

“వాళ్లకి అద్దం ముందు కూచునే తీరిక లేదు”

“అబ్బే! మగవాళ్లెవ్వరూ ఇలాంటి వాటిమీద సమయం వృథా చెయ్యరు!”

“అయ్యో రామ! అసలు మగవారికి అందం ఉండి ఏడిస్తేగా” 

అని అంటారా?! 

 “అయినా మగా ఆడా తారతమ్యం లేకుండా  కించిత్ కరుణ కూడా లేని “కరోనా” ముందు ఎంత సౌందర్యమైనా నేలరాలాల్సిందే కదా”

అని పెదవి విరుస్తారా?!

అంతొద్దు గానీ 

ఒక్క మాట చెప్తాను వింటారా?!

“సహజత్వం అని ఒకటుంటుంది ప్రతీ ఒక్కరిలో” దాన్ని కాపాడుకోవడమే నిజమైన అందం! 

సరే-

విన్నాను. మరి సహజత్వాన్ని కనిపెట్టడం ఎలా?

సింపుల్ ! అద్దం ముందు కూచుని ఆలోచించుకోవడమే అనకండి-

అప్పుడే పుట్టిన శిశువు నూనూగు చర్మపు మెత్తదనం

తుమ్మెద రెక్కలనంటిన పుప్పొడి మృదువుదనం 

ఎపుడైనా గమనించేరా?!

వీచే గాలిలో, పారే సెలయేటిలో మమేకమై ఒక్కసారి ఎప్పుడయినా అవలోకించేరా!?

మనల్ని మనం తెలుసుకున్నప్పటి అందం!

మధురానందం కాదూ?!

*****

నెచ్చెలి రచయిత్రులతో బాటూ ప్రపంచ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు-

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం- మార్చి , 2020”

  1. Kluptham gaa manchi amsaalu sampaadakeeyam cheputhunnaavu.abhnandanalu.pathrikalo seershikalu anni chaalaa vuluvainavi empika chesthunnaavu.goppa,goppa rachaithalanu malli ennaallako chusina anubhootn.

    1. తీరిక చేసుకుని చదివి కామెంట్ పెట్టినందుకు కృతజ్ఞతలు ఆంటీ! మీకు నెచ్చెలి నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published.