1. మీ రచనా నేపథ్యం గురించి చెప్పండి.
మా ఇంట్లో అందరికీ పుస్తకాలు చదివే అలవాటు. మా అమ్మ బాగా నవలలు చదివేది. ఎక్కువగా శరత్ నవలలు, అడవి బాపిరాజు నవలలు, మరికొన్ని తెలుగులోకి అనువాదమైన రష్యన్ నవలలు చదువుతూ ఉండేది. తనకి మేము లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చి ఇస్తూ ఉండేవాళ్ళం. అట్లా మాక్కూడా అంటే నాకు, మా పెద్ద చెల్లెలికి బాగా చదవడం అలవాటు. చిన్నప్పటినుంచి అట్లా సాహిత్యం పట్ల అభిరుచి కలిగింది. కనిపించిన ప్రతి పుస్తకం చదవడం దగ్గర్నుంచి ఎంపిక చేసుకొని చదివే వరకు వచ్చాం. ఆ నేపథ్యంలో నాకు కూడా రాయాలని అనిపించేది. నేను రాయడం మొదలు పెట్టిన రోజుల్లో ఎక్కువగా రచయిత్రులు నవలలు రాసేవారు. ముందు ఏమి రాయకూడదో తెలుసుకుని, తర్వాత ఏమి రాయాలో, ఎలా రాయాలో నేర్చుకున్నాను. నేర్చుకుంటూనే ఉన్నాను.
2.రాయాలనే ఆసక్తి ఎప్పుడు, ఎలా మొదలయ్యింది?
దీనికి సమాధానం కూడా మొదటి జవాబు లోనే ఉంది.
3. తొలికథ నుండి తొలి కథా సంపుటి వరకు మీ ప్రస్థానం చెప్తారా?
నేను చాలా స్లో రైటర్ ని. రాయడం మొదలు పెట్టిన 50 ఏళ్లలో 50 కథలు మాత్రమే రాశాను. ఆ వయసులో ఉండే భావుకత, కొంత అమాయకత్వం, రచనా నేర్పు లేకపోవడం క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయి. అయితే భావుకత లేకపోకవడం రచనను చాలా పొడిగా చేస్తుంది కనుక చెప్పదలచిన విషయానికి కొంచెం భావుకత అద్దాలి. ఆ ప్రయాణంలో కొంత అమాయకత్వం కోల్పోయినప్పటికీ చాలా విషయాలు తెలుసుకున్నాను. మొదటిది కథా సంపుటికి పాఠకుల, విమర్శకుల ప్రశంస లభించింది. అందులోని కొన్ని కథలతో నేను చాలామందికి తెలిసాను.
4.మీ కథలలో మీకు ఇష్టమైనదేవిటి?
అన్ని కథలు ఇష్టంగానే రాస్తాము. కొన్నింటిని ఎక్కువమంది ప్రశంసిస్తారు. అట్లా కొన్ని కథలు ఉన్నాయి. ఇల్లలకగానే, సూపర్ మామ్ సిండ్రోమ్, దమయంతి కూతురు, ఇట్లు మీ స్వర్ణ వంటి కథలు. నా కథలన్నీ స్త్రీ కేంద్రకంగా ఉంటాయి. స్త్రీల సంవేదనే చాలా కథలకి వస్తువు. ఒకప్పుడు మధ్యతరగతి స్త్రీల గురించి ఎక్కువ రాశాను. ఇప్పుడు నాకు వాళ్ల గురించి రాయడం అనవసరం అనిపిస్తుంది. కింది తరగతి ఆడపిల్లలు చదువుకోడానికి తగినన్ని అవకాశాలు లేవు. సమాజం నుంచి కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నుంచి కానీ వాళ్లను తెలివి గల పౌరులుగా తయారుచేసే శిక్షణ దొరకడం లేదు. ఆధునిక సాంకేతికత కూడా వాళ్లకి సరైన దారి చూపించడం లేదు. ఇప్పుడు వాళ్ల గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను రాసే కథలు వాళ్లు చదవకపోయినా, చదివేవాళ్ళకైనా వాళ్ళ పరిస్థితి అర్థమవుతుందని ఆశ. అందుకే స్వర్ణ అనే పాత్రతో రెండు మూడు కథలు రాశాను. అందులో “ఇట్లు మీ స్వర్ణ” అనే కథ నాకు ఇష్టం. “దమయంతి కూతురు” కూడా అంతే ఇష్టం.
5.మీ కథలలో “ఈ కథ ఎందుకు రాశానా” అని మథన పడినది, “గొప్ప కథ” అని సంతృప్తి పడినది ఉన్నాయా? ఉంటే వివరాలు చెప్పగలరా?
ఈ కథ ఎందుకు రాశాను? అని అనుకోలేదు కానీ, ఇంకొంచెం బాగా రాసి వుండచ్చేమో అని చాలా కథలకి అనుకుంటాను. గొప్ప కథ అనుకోను కానీ నేను సంతృప్తి పడిన కథ “ఇట్లు మీ స్వర్ణ”.
6.స్త్రీ సమస్యల మీదే రచనలు చెయ్యడానికి కారణం ఏవిటి?
చుట్టూ వున్న స్త్రీ లను పరిశీలించడం. స్త్రీగా ఈ సమాజంలో ఉనికీ, మనుగడా, సంవేదన అర్థం చేసుకోవడం మొదలు పెట్టాక స్త్రీ కేంద్రక రచనలే వచ్చాయి.
7.ఎటువంటి స్త్రీ సమస్యల మీద రచనలు చేశారు?
మొదట్లో ఎక్కువ మధ్య తరగతి స్త్రీల ఆర్థిక, మానసిక, పురుషస్వామ్య భావజాల అణిచివేత గురించి వ్రాసాను. తరువాత ప్రపంచీకరణ ప్రభావం గురించి వ్రాసాను.
8.స్త్రీవాద ఉద్యమంలో మీ కథల పాత్ర ఏవిటి?
కథలలోని పాత్రలతో ఎక్కువ మంది స్త్రీ పాఠకులు ఐడెంటిఫై అవడమే .
9.మారుతున్న సమాజంలో అత్యధికంగా సమస్యల్ని ఎదుర్కొంటున్న స్త్రీలకి మీ కథలు ఉపయోగపడతాయని భావిస్తున్నారా?
చదివితే తప్పకుండా ఉపయోగపడతాయి.
10.స్త్రీలు తమకు తాము సమస్యలు సృష్టించుకుంటారనేది సరైన దృక్పథమేనా?
కానేకాదు.
11.కుటుంబం, సమాజం స్త్రీ మీద రుద్దుతున్న వత్తిడికి, బలవంతపు పీడనకి పరిష్కారం ఉందా?
సమాజం పురుషులకు కూడా వత్తిడి సృష్టిస్తుంది. పరిష్కారాలు సాధించడంలో వాళ్ళకి కొన్ని వెసులు బాట్లు వుండొచ్చు. కొంత పోరాటం చెయ్యనిదే పరిష్కారం దానంతట అది రాదు. కంఫర్ట్ జోన్ వదులుకుని రావాలి.
12.మీ భూపాల రాగం కథానేపథ్యం చెప్పండి.
చాలా పాతకథ . ఒక్కొక్క నేపథ్యంలో ఒక్కొక్కరికి ఉదయం ఎలా ప్రారంభం అవుతుందో రాసినట్లు గుర్తు.
13.స్త్రీల సమస్యల్లో వర్గాల పాత్ర గురించి మీరేమంటారు?
అన్ని వర్గాల స్త్రీల సమస్యలు ఒకటి కావు. ఆర్థికంగా, కులపరంగా దిగువ మెట్టు మీద వున్న స్త్రీలకు అనేక సమస్యలు.
14.తెలుగు సాహిత్యంలో మీ కృషికి ఇంతవరకు లభించిన ఎన్నో పురస్కారాలకు, ఇప్పుడు అనువాదంలో వచ్చిన సాహిత్య అకాడెమీ పురస్కారానికి ఎంతో తేడా ఉంది కదా! మీరు ఏవిధంగా భావిస్తున్నారు?
“ఒక హిజ్రా ఆత్మకథ” కు పురస్కారం రావడం వల్ల ఆ పుస్తకం పట్ల ఎక్కువ మందికి ఆసక్తి కలుగుతుందని, ఆ వ్యక్తులను దగ్గరకు తీసుకుంటారని ఆశ కలిగింది.
15.మైనారిటీల పట్ల కేంద్రం వహిస్తున్న క్లిష్ట వైఖరి సందర్భంలో అకాడెమీ అవార్డుకు మీరు ఏవిధంగా స్పందించాలనుకుంటున్నారు?
చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ పురస్కారం గురించి గొప్ప సంతోషమూ లేదు. తిరస్కారమూ లేదు.
16.“ఒక హిజ్రా ఆత్మకథ” నవల అనువాద అనుభవాల గురించి చెప్పండి.
నవల నేరుగా తమిళం నుంచి చెయ్యలేదు.ఇంగ్లీష్ నుంచి చేశాను. తమిళ పేర్లు వచ్చినప్పుడు గౌరీ కృపానందన్ అనే స్నేహితురాలి సహాయం తీసుకున్నాను. రేవతి కథ నన్ను బాగా కదిలించింది. ఇష్టంగా చేసాను.
17.ఈ తరం రచయిత్రుల రచనల్లో మీకు నచ్చిన ఒకట్రెండు కథలు ఏవి? ఎందుకు నచ్చాయో చెప్పండి.
ఒకటి రెండు అంటే కష్టం. నచ్చిన కథలు చాలా వున్నాయి
18.కొత్తగా కథలు రాసే యువతులకు మీరు ఇచ్చే సూచనలు.
అధ్యయనం,పరిశీలన వుండాలి. వాక్యనిర్మాణం చదివించేలా వుండాలి. ప్రపంచ సాహిత్యం చదవాలి. ఒక జీవిత దృక్పథం వుండాలి.
*****