అబ్బూరి ఛాయాదేవి గారి సాహిత్య అంతస్సూత్రం

లక్ష్మీ కందిమళ్ల

అక్షరాస్యతే అరుదయిన  కాలంలో ఎం.ఎ పొలిటికల్ సైన్స్ చదివి, లైబ్రరీ సైన్సెస్ లో డిప్లొమా తీసుకుని సమాజాన్నీ, సాహిత్యాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసిన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. అదే క్రమంలో ఆంగ్లసాహిత్యాన్ని కూడా ఔపోసన పట్టారు. 
 
‘చాయ’అంటే నీడ అని అర్థం. 
అయితే ఛాయాదేవి మాత్రం స్త్రీని వంటయిల్లు అనే చీకటి చాయనుండి తప్పించింది. ఆరు బయట విశాల ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడమన్నారు. స్త్రీ చుట్టూ విస్తరించుకు పోయిన ఈ ఛాయా ప్రపంచంలో అనునిత్యం సాగే జీవన సంఘర్షణలో స్త్రీ యొక్క ఉనికి భాగస్వామ్యం, ఆమె నిర్వహించవలసిన పాత్ర గురించి సూటిగానూ, వ్యంగంగానూ, హాస్యస్పోదకంగానూ తన రచనల ద్వారా పాఠకులకు అందించి చైతన్య పరచిన రచయిత్రి. 
 
స్త్రీల రచనా ప్రపంచంలో ఛాయాదేవి గారు గొప్ప ఉద్వేగభరితమైన ఒక వెలుగు. 
 
స్త్రీలకు సమాన హక్కులు కావాలని పోరాటం చేసిన కలం “యోధురాలు” అబ్బూరి ఛాయాదేవి గారు. 
 
తండ్రి ఆధిపత్య ధోరణి కింద.. పెద్దగా నవ్వటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో.. ఇష్టాలను, ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ.. తన ప్రతిభకు తానే పదును పెట్టుకుంటూ తనకు తానుగా కృషి చేసి సాహిత్య లోకంలో ఆకాశమంత ఎత్తున నిలబడిన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. 
 
ఆమె రాసిన మొదటి నాటకం “పెంపకం” కూడా తండ్రి నియంత్రత్వాన్ని గురించే.. తండ్రి పట్ల భయం తప్ప ప్రేమ లేకపోవడమన్నది ఆ కౌమార దశలో చాలా బాధించేది. అందుకే తొలిరోజుల్లో అదే ఆమె సాహిత్య వస్తువు అయింది.అయితే ఆధునిక భావాలు కలిగి, మార్క్సిస్టు భావాజాలంతో ప్రభావితుడు అయిన తన అన్న గోపాలకృష్ణ మూలంగా ఆమె చదువు కొనసాగింది. 
 
“బాల్యంలో  అనివార్యమైన పితృసామ్య నియంత్రణ,  ప్రజాస్వామిక భావాలు గల సాహితీవేత్త అబ్బూరి వరద రాజేశ్వరరావు భర్తగా లభించినప్పటికీ పరంపరగా కలసిపోయిన తప్పనిసరి పురుషస్వామ్య రాజకీయాలూ ఆమెని మరింతగా నేర్చుకునేలా చేశాయి. అయినప్పటికీ ఆమె కథల్లోని వ్యంగ్యం, నిరసన అంతా కూడా పురుషులమీద కాదు. ఈ పురుషున్ని, ఈ భర్తల్ని ఇలా వుండమని ప్రేరేపించిన పితృసామ్య సమాజం పట్లే ఆమె నిరసనంతా “…
 
మానవ సంబంధాల్లో పరస్పర స్నేహం, ప్రేమ, గౌరవం వుండాలని అటువంటి లక్షణాలు లోపించడం వల్లనే మన సమాజంలో దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. ఇంకొకరిపట్ల అసూయ, క్రోధం, ద్వేషం వున్నంత కాలం మనసుకి స్వేచ్ఛ వుండదు.” అంటూ స్వేచ్ఛకు చక్కని నిర్వచనాన్నిచ్చారు. 
 
“మనిషి యొక్క స్వేచ్ఛ గురించీ, మానవ సంబంధాల గురించీ,  మనలోపలా, బయటి ప్రపంచంలోనూ వుండాల్సిన శాంతి గురించీ అనేక అంశాలు అత్యంత సరళంగా బోధించిన ప్రపంచ తాత్వికుడు జిడ్డుకృష్ణమూర్తి భావనలంటే ఛాయాదేవి గారికి ఇష్టం. అందుకే స్వేచ్ఛకుసంబంధించిన అనేక కోణాలను సున్నితంగా చర్చకు పెడతాయి ఆమె కథలు. 
 
అనుభవాలను, అనుభూతులనే కథలుగా చెప్పాలనే తపన అబ్బూరి ఛాయాదేవికి విధ్యార్థిదశనుంచే మొదలైంది. కుటుంబాలలోనూ, సమాజంలోనూ తను చూసిన స్త్రీల స్థితిగతుల గురించీ, స్త్రీ పురుష వివక్ష గురించీ అలాగే తోటి స్త్రీలకు జరిగిన అనుభవాలను కూడా తనకు జరిగినట్లు స్పందించి రాశానని చెప్పారు ఛాయాదేవి గారు. సమాజంలో ఇతర అంశాలను కూడా తీసుకొని రాసిన కథలు కూడా కొన్ని పాఠకుల మన్ననను పొందాయి. 
 
స్త్రీ తమ లోలోపలి పరాధీనతను తిరస్కరించగలిగి స్వేచ్ఛగా జీవించాలన్నదే అబ్బూరి ఛాయాదేవి గారి సాహిత్య అంతసూత్రం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.