అహంకారం తెచ్చిన ముప్పు
-అనసూయ కన్నెగంటి
పూలలో తేనె కోసమని తోటంతా కలయ తిరగసాగింది తేనెటీగ. అలా తిరుగుతూ తిరుగుతూ అక్కడే ఉన్న గులాబి పూవు దగ్గరకు వచ్చింది. ఆ పూవు మీద వాలబోయేదల్లా పూవు చుట్టూ ఉన్న ఆకులను తింటున్న పచ్చని పురుగును చూసి ఆగిపోయింది. ఆ పురుగు అక్కడ్నించి వెళ్ళిపోయాకా అప్పుడే తేనె తాగుదాంలే అని అంతవరకూ అక్కడే చక్కర్లు కొట్టసాగింది తేనెటీగ.
అటుగా వెళుతున్న మరో తేనెటీగ అది గమనించి “ఎందుకలా ఒక్క చోటే గిర గిరా తిరుగుతున్నావ్ ?” అని అడిగింది. అది విని మొదటి తేనెటీగ ..
“గులాబి పూసింది. అందులో తేనె కోసమని వస్తే ఆకులు తింటూ పురుగు కనిపించింది. అది వెళ్ళాకా తాగుదామని ఇలా తిరుగుతున్నాను “ అంది.
“ పిచ్చిదానా ! అంతవరకూ ఇక్కడే తిరగటం ఎందుకు తోటలో మరే పూలూ లేనట్టు! “ అంది రెండవ తేనెటీగ.
“ నాకు గులాబి పూవన్నా..అందులోని తేనె అన్నా చాల ఇష్టం. గులాబి పూవు బోలెడన్ని పూరేకులతో వెడల్పుగా ఉంటుంది కదా! తేనె త్రాగేటప్పుడు..మెత్తని పూరేకులపై శరీరం మొత్తం ఆన్చి తేనె త్రాగుతుంటే ఆ హాయే వేరు. నేనలా వెళితే మరెవరైనా వచ్చి ఈ గులాబి పూవులోని తేనె త్రాగేస్తేనో! అమ్మో! నేను వెళ్ళను. “ అంది మొదటి తేనెటీగ.
“ ఓహో ! అదా విషయం. అంత ఇష్టమా నీకు గులాబీ పూవుల్లో తేనె అంటే. ఈ తోటలో కొన్ని గులాబిలే ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల మొత్తం గులాబి తోటే ఉంటుంది. అక్కడ ప్రతి పూవూ గులాబియే. నీలాంటి వాళ్ళు అలాంటి తోటలను చూస్తే వదలరు. ఈసారి నాకు ఎక్కడైనా గులాబి పూల తోట కనిపిస్తే నీకు చెబుతాలే. “ అంది రెండవ తేనెటీగ రయ్యున ఎగిరిపోతూ.
ఆ తేనెటీగ అటు వెళ్ళాకా ఇది పురుగు వంక చూసింది . అది ఇంకా గులాబికి దగ్గరలోనే ఉండి పువ్వు చుట్టూ ఉన్న ఆకులను తింటూ కొన్నింటిని కొరికి కిందకి పడేస్తుంది. అది చూసి బాధేసింది తేనెటీగకు.
“ గులాబి పూవుకు రక్షణగా దాని చుట్టూ ముళ్ళే కాక కొన్ని ఆకులు కూడా ఉంటాయి. ఈ పురుగేమో..తిన్నంతా తిని మిగతా వాటిని కొరికి పడేస్తుంది. దీనికి పిచ్చి పట్టిందో ఏమో..” అని మనసులో అనుకుంటూ మెల్లగా కిందకి వచ్చి పురుగు పైన ఎగురుతూ..
“ నీకు కావలసినంత తిను. అంతే కానీ అనవసరంగా ఆకులను ఎందుకు కొరికి కింద పడేస్తున్నావ్?” అని అడిగింది పురుగుని తేనెటీగ.
“ నువ్వెవరవు చెప్పటానికి? ఇందాకట్నుంచీ గమనిస్తున్నా. ఇక్కడే తిరుగుతున్నావ్. పైగా అటూ ఇటూ వెళ్లే వాళ్లకు నన్ను చూపించి నామీద ఏవేవో చాడీలు చెబుతున్నావ్. పూలల్లో ఉండే తేనె నీకెలా అహారమో..ఆకులు నాకూ అంతే.. అది అర్ధం చేసుకుని నోరు మూసుకో..” అంది కోపంగా పచ్చపురుగు.
“ నువ్వు అన్నది నిజమే. ఆకులు నీకు ఆహారమైతే, తేనె నాకు ఆహారం. నేను కాదనలేదు. అనవసరంగా ఆకులు ఎందుకు కొరికి పడేస్తున్నావ్ అని నా బాధ. పైగా నేను తేనెను తాగినా రైతు పట్టించుకోడు. ఎందుకంటే నేను తాగానో లేదో కూడా అతనికి తెలియదు. పైగా నేను తేనె తాగటం వల్ల అతనికి ఏమీ నష్టం కూడా లేదు. కానీ ఆకులు ఎంత నీ ఆహారమైనా కొరికితే రైతు ..నిన్ను చంపేయ్యాలని చూస్తాడు. దానికి తోడు ఆకులు తెంపి కింద పడేస్తే అస్సలు ఊరుకోడు. నీ మీద మందులు చల్లుతాడు..ఎంతైనా మొక్కల మీద ,పూల మీద బతికే వాళ్లం. జాతి వేరైనా నీ మేలుకోరి సలహా ఇచ్చాను. “ అంది తేనెటీగ కింద పడి ఉన్న ఆకులకేసి బాధగా చూస్తూ…
“ పెద్ద చెప్పొచ్చావ్ లే. వెళ్ళు వెళ్ళు. నాకు తెలుసులే. “ అని ఎద్దేవాగా అంటూ తేనెటీగను మరింతగా రెచ్చగొట్తాలనే ఉద్దేశ్యంతో..మరో ఆకును పుటుక్కున కొరికి కింద పడేసింది.
అంతే కాదు తేనెటీగ మీద కసికొద్దీ మరిన్ని ఆకులను కూడా అదేపనిగా కొరికి కింద పడెయ్యటం చెయ్యసాగింది. అది గమనించిన తేనెటీగ ..
“ మూర్ఖులకు ఎంత చెప్పినా అర్ధం కాదు. “ అనుకుంటూ అక్కడ్నించి మరో పూవు మీదకు వెళ్ళిపోయింది తేనెటీగ.
కాసేపటికి.. అటుగా ఇంటికి వెళ్ళిపోతున్న తేనెటీగ పురుగు ఇంకా గులాబి దగ్గరే ఉందో లేదో చూద్దామని అక్కడికి వచ్చి , ఎవరివో మూలుగులు వినిపించి కిందకి చూసిందేమో నేల మీద పడి బాధతో మెలికలు తిరిగిపోతూ పురుగు కనిపించింది. అది చూసిన తేనెటీగ..
“ తగిన శాస్తి జరిగింది. చాలినంత తినటం ధర్మం. అత్యాశకు పోవటంలో కూడా ఒక అర్ధం ఉంది. అంతేకానీ అనవసరపు వృధా ఎవరికీ మంచిది కాదు. అహంకారానికి పోయి ప్రాణానికే ప్రమాదం తెచ్చుకుంది..”
అని మనసులో అనుకుంటూ రయ్యున ఇంటి వైపు దూసుకుపోయింది తేనెటీగ.
నీతిః చూశారా పిల్లలు. మంచి ఎవరు చెప్పినా పాటించాలి. నేను, నాది, నా ఇష్టం అని మూర్ఖంగా, అహంకారంగా ప్రవర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం. అర్ధమయ్యిందా!
*****