ఇట్లు మీ వసుధారాణి

 ఆ మందిరం

-వసుధారాణి 

కరకరా ఆకలివేస్తుండగా బడి నుంచి మధ్యాన్నం 12 గంటలప్పుడు హిండాలియం స్కూల్ బాక్స్ చేత్తో పట్టుకునే ఓపిక కూడా లేక ఇంటిదగ్గరికి వచ్చేసరికి నెత్తిమీద పెట్టుకుని నడిచి వచ్చేవాళ్ళం.బడికి వెళ్లి వచ్చిన దుస్తులతో అన్నం తినకూడదు కనుక కాళ్ళూ చేతులు కడుక్కుని  వేరేవి మార్చుకుని చక చకా వంటింట్లోకి చేరే సరికి ప్రతిరోజూ ఒకటే దృశ్యం. వండిన పదార్ధాలు అన్నీ ఘుమ ఘుమ లాడుతూ దేవుడి మందిరం ముందు మూతలు తెరిచిపెట్టి ,పెరుగు,మంచినీళ్ళు నింపిన గ్లాసుతో సహా అమ్మమ్మ వాటి చుట్టూ నీటిని చిలకరిస్తూ ఓం భూర్భువః స్వః  అంటూ మంత్రం చదువుతూ ఉండటం. నైవేద్యం పెడుతూ వుండటమో ,నైవేద్యం అయిపోయినాక హారతి ఇస్తూ ఉండటమో ప్రతి రోజూ మేము మధ్యాన్నం భోజనం వేళకు వెళ్లే సరికి సాధారణంగా జరుగుతూ ఉండే ప్రక్రియ.అప్పుడు గబ గబా కంచాలు మంచినీళ్ళు పెట్టేసుకుంటే అమ్మమ్మ అందరికీ వడ్డిస్తూ ,కబుర్లు చెపుతూ మాతోపాటు ఆవిడ కూడా భోజనం చేసేది.
 
ఐతే నాకు చిక్కు ఎక్కడ వచ్చేది అంటే అప్పుడప్పుడు వంట కానీ ,పూజ కానీ కాస్త ఆలస్యం అయితే కంచాలు పెట్టుకుని నైవేద్యం ,హారతి అయ్యేదాకా ఎదురు చూడాల్సి రావటం.నాకు చిన్నప్పుడు ఓ బలహీనత(ఇప్పుడు కూడా ఉందేమో మరి)ఉండేది ఎంత సేపైనా అన్నం తినకుండా ఉండగలను కానీ ఆకలి అనుకుంటే ఇంక ఆగలేను. ఆలస్యం అయినప్పుడు నేను దేవుళ్ళూ తొందరగా తినండి,అమ్మమ్మా తొందరగా నైవేద్యం పెట్టు అన్నట్లు మా దేవుడిమందిరం కేసి చూస్తుండేదాన్ని.
 
ఇక్కడ మా వంటిల్లు గురించి చెప్పుకోవాలి తూర్పుపడమరలు కిటికీలు ,ఉత్తరం వాకిలి ఉన్న పెద్ద పెద్ద ఎఱ్ఱని పెంకులు కప్పు, గుల్లగా వుండే బొంతరాళ్ళు ,గచ్చుతో కట్టిన గోడలు,అమ్మ కడిగి కడిగి ,తుడిచి తుడిచి పాలిష్ రాళ్ళలా మారిపోయిన మాచర్ల నల్ల రాళ్ల నేల పరుపు.తూర్పు వైపు వంట గట్టు ,ఈశాన్యం మూల ఓ పెద్ద గూడు అరమర,పడమటి వైపు వాయువ్యంలో ఓ పెద్ద చెక్కతెలుపులు మూత ఉన్న అలమర, దాన్ని  ఆనుకుని నాలుగు అడుగులు ఎత్తు ,రెండు అడుగుల వెడల్పు నాలుగు పొడవు మందిరంకోళ్ళు గల టేకు చెక్క మందిరం.మందిరం పక్కన నాలుగు చెక్కరెక్కల కిటికీ.మందిరం ముందు కాస్త దూరంలో వంటింటి మధ్యలో  అన్నం,కూరల గిన్నెలు మధ్యలో పెట్టుకుని గుండ్రంగా అందరం కూర్చుని భోజనం చేసేవాళ్ళం.
 
వంటింటి బయట పరిచిన బండపరుపులో గడప పక్కనే ఎడమ పక్కాగా చిన్న రోలు బిగించి ఉండేది.అమ్మ అలా రోటీ పచ్చడినూరి  ఇలా తెచ్చి కంచాలలో వేసేది.నైవేద్యం ఆలస్యం అయినప్పుడు చేసే పనేమీ లేక కంచం పెట్టుకుని కూర్చుని దేవుడి మందిరాన్ని ,అమ్మమ్మ చేసే పూజని గమనిస్తుండే దాన్ని.హారతిగంట బడిలో కొట్టే ఇంటిబెల్లు కన్నా ఆనందం ఇచ్చేది నాకు.అమ్మమ్మ రోజూ లలితా,లక్ష్మీ సహస్రనామాలు పారాయణ చేసేది.మందిరంలో కింది వరుసలో చిన్న గోపాలకృష్ణుని నల్లని రాతి విగ్రహం,చిన్న జల్లీ ఇత్తడి పెట్టెలో రామ పట్టాభిషేక  ఇత్తడి విగ్రహాల సెట్టు, చిన్న ఇత్తడి శివలింగం.తరువాత కొంచెం పై వరుసలో చక్కటి లక్ష్మీదేవి పటం, ఆవిడ పక్కన సరస్వతి, అలమర వైపుగా శివపార్వతుల పటాలు ఉండేవి . 
 
వీళ్ళెవ్వరితోనూ నాకు ఇబ్బంది లేదు గానీ,లక్ష్మీ, సరస్వతుల వెనుక మందిరం కింద నుంచి దాదాపు పై వరకు కింద కూర్చుంటే కానీ పటంలో ముఖం ఎవరిదో కనపడనట్లుగా ఓ పెద్దాయన తెల్లటి పొడవాటి గడ్డం,కనుగుడ్లు లోపలికి పోయినా తీక్షణంగా ఉన్న కంటి చూపు,పొట్ట ఎముకలకు అంటుకు పోయిన చర్మం,శరీరం పై భాగంలో ఓ జంధ్యం,కింద ఓ చిన్న గోచీ మాత్రమే పెట్టుకుని జింక చర్మం పై పద్మాసనం వేసుకుని రెండు చేతులూ జోడించి నమస్కారం పెడుతున్న ఆయనతోనే నా ఇబ్బంది అంతా.
 
దేవుళ్ళకు నైవేద్యం పెడుతుంది అమ్మమ్మ అన్న స్పృహ లేకుండా ఆ ఆకలి వేసే సమయంలో ఆయన్ని మాత్రమే చూస్తూ ఈయనకి పెడితేగాని మనకి అన్నం పెట్టరు కదా అనుకునే దాన్ని.
 
అమ్మమ్మా ఆయన ఎవరు ? అని అడిగితే
 వాసుదాసు గారు మా గురువు గారు నాకు , మా అక్కయ్యకి తారకమంత్రం ఉపదేశించారు అని చెప్పేది అమ్మమ్మ.
 
మా ఇద్దరు అమ్మమ్మలకి ఆయన ఇచ్చిన ఆ ఉపదేశం ఏమిటో,అంత మాత్రానికే మందిరంలో ఆయన పటం పెట్టుకుని రోజూ ఆయనకి అన్నం పెట్టటం పైగా మాకన్నా ముందు నాకు ఆ చిన్ని వయసులో అర్ధం కాలేదు.
అలా ఆ మందిరం,అందులోని వాసుదాసు గారు ప్రతిరోజూ మాకు దర్శనం ఇచ్చేవాళ్ళు.
 
క్రమంగా కొంచెం పెరుగుతున్న కొద్దీ స్నానం చేశాక మందిరం ముందు కూర్చుని చిన్న చిన్న స్తోత్రాలు చదువుకోవటం, అమ్మ దసరా పూజల్లో మందిరాన్ని చక్కగా అలంకరించడం ,పరీక్షలప్పుడు హాల్ టిక్కెట్లు మందిరంలో చోటు చేసుకోవడం చాలా మామూలు అయిపోయాయి.ఇంట్లో ముఖ్యమైన చిన్న చిన్న వస్తువులు మందిరంపై కప్పు చెక్క మీద చోటు చేసుకుని ఉండేవి.పూలు కట్టుకునే దారపు ఉండలు, విభూతి గడ్డ,చిల్లర వేసి పెట్టుకునే డబ్బా,అమ్మమ్మ కళ్ళజోడు బాక్స్ ఇలా .ఏమైనా కావాలి అని అడిగినప్పుడు అమ్మ ఆ దేవుడి మందిరం మీద ఉంది చూడు అనేది.
 
పెళ్లికి ముందు రోజు పెళ్లి కూతుర్ని చేసిన రోజున మందిరం ముందు కూర్చుని లలితాసహస్రనామం  చదువుకుంటుంటే ఒకటే కన్నీళ్లు కారిపోవటం కళ్లనుంచి.ఒక దేవుని మందిరం ,ఒక వస్తువు దానిపట్ల తెలియకుండా ఏర్పడ్డ అనుబంధం అప్పుడు అర్ధం అయ్యింది నాకు.
 
తర్వాత మావారి ఉద్యోగరీత్యా మేము ప్రొద్దుటూరు వెళ్ళాము అలా చాలా ఊళ్ళు తిరిగి కడపకి చేరాము.కడప జిల్లా బోలెడు చారిత్రక నేపథ్యం కల దేవాలయాలున్న  జిల్లా .ఒకరోజు ఒంటిమిట్ట కోదండరామాలయానికి వెళ్ళాము.పెద్ద రామాలయం ,చక్కటి శిల్పకళ ,చక్కని మూలవిరాట్ మూర్తులు చూసుకుని ఎదురుగా వుండే ఆంజనేయస్వామిని కూడా దర్శించుకున్నాము.
 
పూజారి పక్కనున్న మందిరం కూడా చూసి వెళ్ళండి అన్నాడు సరే అని ఆంజనేయస్వామిగుడి  పక్కన మిద్దె లాంటి మందిరం లోకి అడుగు పెట్టిన నేను ఒక్కసారి ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. అచ్చు మా మందిరంలో ఉండే వాసుదాసుగారి పటం అదే కొలతలతో ,అదే పోజులో .
 
ఆయన పేరు వావిలికొలను సుబ్బారావు గారిని,ఆ ఆలయం జీర్ణోద్ధరణ చేయటానికి ఆంధ్రదేశం అంతా తిరిగి తారకమంత్రాన్ని అందరికీ ఉపదేశిస్తూ నిధులు సేకరించారనీ,ఆయనను ఆంధ్రావాల్మీకి అంటారనీ,ఆయన శిష్యగణం ఆయన్ని గొప్పగా కొలుస్తారని,రామాయణం, టెంకాయ చిప్ప శతకం ఇలా బోలెడు రచనలు చేశారనీ ,ముఖ్యంగా రామదాసు తర్వాత శ్రీరామ తత్వాన్ని ఆయనే మళ్లీ ప్రజల్లోకి తీసుకొచ్చారనీ చెప్పారు.
 
ఇంకా నన్ను కదిలించిన విషయం ఆయన ప్రొద్దుటూరులో పుట్టారని తెలియటం.నాకు తెలియకుండా నేను ఆయనతో ఎంత ప్రయాణం చేసాను,ఆయన జన్మస్థలం దాకా వెనక్కి వెళ్ళాను.ఒక్కసారిగా వెన్నులోనుంచి చిన్న జలదరింత.
 
నిశ్శబ్దంగా నాలో నేను మౌనంగా ఆ మందిరంలో కాసేపు కూర్చుండి పోయాను.చిన్నప్పుడు మా మందిరంలో కొలువై నాతో అన్నానికి పోటీ పడిన ఈయన ఇంత గొప్ప వ్యక్తా ? గొప్ప సంతోషం తోడవ్వగా ఆయన ముందు భక్తిగా మోకరిల్లి వెనక్కి వచ్చేసాను.
 
మందిరం అంటే ఓ వస్తువు కాదు ఓ సంసృతి,ఓ చరిత్ర ,వాటి నీడన మన ఎదుగుదల వుంటాయని అర్దం అయినాక మనస్సు మందిరం అయిపోయిన భావన.
మరో కథతో వచ్చే నెచ్చలిలో కలుసుకుందాం .అందాకా ఇట్లు మీ వసుధారాణి.
 

*****

Please follow and like us:

One thought on “ఇట్లు  మీ వసుధా రాణి- ఆ మందిరం”

  1. వసుధా,
    నీదైన శైలి లో చక్కగా వ్రాసావు..మన జీవితంలో ఇలాగే ఎన్నో అప్పుడు అర్ధం తెలియక పోయినా , ముందు కాలంలో ఆ సంఘటనల అంతరార్ధం గోచరిస్తుంది.
    నీ మందిరం కథ నాకు చాలా నచ్చింది.
    వసంత.

Leave a Reply

Your email address will not be published.