ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత)

-డా|| మీసాల అప్పలయ్య

ఇది జీవన వనం 

వర్ణాల 

పరిమళాల 

రుచుల  

తాదాత్మ్యాల 

శిబిరం 

ఈ రంగుల బొకేలు  

నాజూకుని తొడుక్కొని  మృదుత్వాన్ని 

ఊ రేగించుకొంటున్న సీతాకోక చిలుకలు 

నీ పేలవ బ్రతుక్కి రంగవల్లులు , కానీ 

ఇవి నీ  కర్కశత్వంలో  

చెరిగి నలిగిన కళేబరాలు కావచ్చు ! 

ఆర్ద్రత చిమ్మే ఈ మల్లెలు 

పరిమళాల తెమ్మెరలు 

పరామర్శల పరవశాలు, కానీ 

ఇవి నీ కళింకిత 

బూటు కాళ్ల పాశవికత కింద 

మాంసపు ముద్దల 

శాపాల విస్ఫోటనం కావచ్చు ! 

 నిశ్శబ్దం లో శుచి అయిన  కోమలలు 

నీళ్ల మేడపై పై నిలబడ్డ 

ఈ కలువలు 

శాంత జీవన దిక్సూచులు, కానీ 

అవి నీ భ్రష్టత్వ ఖడ్గానికి 

వివస్త్ర గా నేలకొదిగిన

నమ్రతా భిమానాలు కావచ్ఛు  

హరివిల్లు 

అందాల గురించిన  ముచ్చ్చట్లలో 

ఈ చిన్నిపిచ్చుకలు

అతిసున్నిత ఊపిరుల 

మధుర స్వరాలు, కానీ 

నీ కీచక చూపుల బుల్లెట్ల

సునామీలో 

బ్రతుకు మిగలని 

దైన్యాలు కావచ్ఛు 

ఏ అమానవీయం ఎరుగని 

ఈ అమాయకపు లేళ్ళు, కుందేళ్లు 

ముద్దు గారే సోయగాల పొదరిల్లు, కానీ 

నీ దౌష్ట్యపు దౌర్జన్యపు దండయాత్రలో 

జ్ఞాపకానికి కూడా మిగలని 

సౌశీల్య చిహ్నాలు కావచ్చు 

నిన్నటి దాకా  

కరుణను చెమర్చిన  

ఈ మాతృత్వ నయనాలు 

ఇప్పుడు ఒక యుగాంతాన్ని 

వర్షిస్తున్నాయ్ 

ఒకరి  కన్నీరు  వల్ల 

నీకు కన్నీరు రాకుంటే, ఇంక 

ఈ వనము లో నీకు చోటెందుకు?

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.