ఉత్తరాలు-ఉపన్యాసాలు-2

ఉత్తరం-2: నా పుట్టుకయే నాకు మరణశాసనం

ఆంగ్ల మూలం: రోహిత్ వేముల

స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి

నేపథ్యం

రోహిత్ వేముల 

పూర్తి పేరు- రోహిత్ చక్రవర్తి వేముల

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్!

అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యునిగా చురుకైన పాత్ర వహించాడు!

సుమారు నాలుగు సంవత్సరాల క్రితం …..

జనవరి 17, 2016 రోజున రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు!

=======

అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్-అఖిల భారత విద్యార్థి పరిషత్ ల మధ్య జరిగిన ఘర్షణల నేపధ్యంలో ….. యూనివర్సిటీ యాజమాన్యం రోహిత్ తో సహా మరికొంతమంది విద్యార్థుల్ని డిబార్ చేసి, హాస్టల్ నుండి బయటకు పంపించింది. 

జనవరి 3, 2016 రోజు నుండి డిబార్ చేయబడిన విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలోనే టెంటు వేసుకుని ‘రిలే నిరాహార దీక్ష’ నిర్వహించారు. 

జనవరి 17 నాడు ….. రోహిత్ ASA బ్యానర్ ను ఫ్యాన్ కు వేలాడదీసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు! 

అతను ఉరివేసుకున్న స్నేహితుని గదిలో ఈ ఉత్తరం దొరికింది.

***

గుడ్ మార్నింగ్,

 మీరు ఈ ఉత్తరం చదివే సమయానికి నేను ఉండను. దయచేసి నా మీద కోపగించుకోకండి.  మీరు కొందరు నాపై శ్రద్ధ చూపారు, నన్ను ప్రేమించారు, నన్ను ఆప్యాయంగా చూసుకున్నారు.  నాకు ఎవరి మీద ఆరోపణలు లేవు.  అదంతా నా పైననే. నాకు నేనే ఒంటరిని. నాకు సమస్యలు ఉండేవి.  నా ఆత్మ, నా శరీరముల మధ్య అంతరం పెరిగిందని నేను అనుకుంటున్నాను.  నేను ఒక రాక్షసునిగా మారిపోయాను.  నేను ఒక రచయితను కావాలని అనుకున్నాను. కార్ల్ సాగన్ లాగ, విజ్ఞానశాస్త్ర రచయితను కావాలి అనుకున్నాను. చివరకు,  ఈ ఒక్క ఉత్తరాన్ని మాత్రమే రాయగలుగుతున్నాను.

కార్ల్ సాగన్ లాగ, నేనొక విజ్ఞానశాస్త్ర రచయితను కావాలనుకున్నాను. నేను విజ్ఞానశాస్త్రాన్ని,  నక్షత్రాల్ని,  ప్రకృతిని ప్రేమించాను.  కానీ, ఆ తర్వాత, చాలాకాలంగా మానవులు ప్రకృతికి విడాకులు ఇచ్చారని అని తెలియక వారిని కూడా ప్రేమించాను.  మన అనుభూతులు అబద్దం. మన ప్రేమ కల్పితం. మన విశ్వాసాలు రంగు పులిమి ఉన్నాయి. మన సహజత్వం కృత్రిమమైన కళారూపం దాల్చింది.  బాధను అనుభవించకుండా ప్రేమించగలగడం నిజంగా కష్టమైపోయింది.  

ఓ ఓటు లాగ, ఓ సంఖ్య లాగ, ఓ వస్తువు లాగ, అప్పటికప్పుడు అవసరమైన ఓ క్షణికమైన గుర్తింపు లాగ మనిషి విలువ పడిపోయింది.  అన్ని రంగాల్లో ….. చదువులో, వీధుల్లో, రాజకీయంలో, చావులో, బ్రతుకులో….. నక్షత్రపు  ధూళితో తయారైన ఓ అపూర్వ వస్తువులాగ వ్యక్తి అతని మేధస్సును బట్టి గుర్తించబడడంలేదు. 

 ఈ విధమైన ఉత్తరం నేను మొదటిసారి రాస్తున్నాను. మొదటిసారిగా నా చివరి ఉత్తరాన్ని రాస్తున్నాను. ఒకవేళ ఇది అర్ధంపర్ధం లేనట్టుగా అనిపిస్తే నన్ను క్షమించండి.

నా పుట్టుకయే నాకు మరణశాసనం.

పుట్టుకతోనే నేను చావుకు దగ్గరయ్యాను. నిరసనలకు గురైన నా బాల్యంలోని ఒంటరితనం నుండి నేనెన్నడూ కోలుకోలేను.

ఇన్నాళ్లుగా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో బహుశా నేను పొరపాటుపడి ఉండవచ్చు. ప్రేమను, బాధను, బ్రతుకును, చావును కూడా అర్థం చేసుకోవడంలో నేను పొరపాటుపడి ఉండవచ్చు. తొందర అవసరం లేకున్నప్పటికీ, నా జీవితాన్ని ప్రారంభించడానికి నేను అన్ని వేళలా హతాశున్నై పరుగులు తీసేవాణ్ని. కొంతమందికి బ్రతుకే ఒక శాపం.

ఈ క్షణంలో నాకు బాధ లేదు. నేను విచారంగా లేను. నాలో శూన్యంగా నిండివున్నది. నా గురించి పట్టించుకునే ఓపిక నాకు లేదు. అది చాల బాధాకరమైన విషయం. అందుకని నేను ఈ పని చేస్తున్నాను.

లోకులు నన్ను పిరికివాడిగా ముద్ర వేయవచ్చు. నేను వెళ్లి పోయినాక నన్ను స్వార్థపరుడు, బుద్ధిహీనుడు అనవచ్చు నన్ను వాళ్ళు ఏమంటారో అనేది నేను పట్టించుకోను. చనిపోయిన తర్వాత ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది ….. దయ్యాలు, ఆత్మలు అనేవి నేను నమ్మను. ఒకవేళ నేను నమ్మే విషయం ఏదైనా ఉంటే, నక్షత్ర మండలానికి ప్రయాణించి మిగతా ప్రపంచం గురించి నేను తెలుసుకోగలుగుతాను అని నమ్ముతాను.

 మీరు ….. ఈ ఉత్తరం చదివేవాళ్ళు నా కోసం ఏమైనా చేయదలుచుకుంటే, ఏడు నెలలకు గాను నాకు 1.75 లక్షల రూపాయల ఫెలోషిప్ రావాల్సి వున్నది. దాన్ని నా కుటుంబానికి చెల్లించే ఏర్పాటు చేయండి. రాంజీకి 40 వేల రూపాయలు ఇవ్వాలి. అతను తిరిగి ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు. కానీ, దయచేసి అందులోనుండి ఆ డబ్బులు ఆయనకు ఇవ్వండి.

 నా అంత్యక్రియలు నిశ్శబ్దంగా, సాఫీగా జరగనివ్వండి. నేను అప్పుడే ప్రత్యక్షమై, వెంటనే అదృశ్యం అయినట్లు భావించండి. నా కోసం కన్నీళ్లు కార్చకండి. జీవించి ఉన్నప్పటికంటే చనిపోయినప్పుడే నేను సంతోషంగా ఉంటానని తెలుసుకోండి.

 “నీడలోనుండి నక్షత్రాలకు.”

 ఉమా అన్నా, దీనికోసం నీ గదిని వాడుకున్నందుకు క్షమించు. 

ASA (అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్) కుటుంబానికి, మిమ్మల్నందరినీ నిరాశపరుస్తున్నందుకు నన్ను క్షమించండి. మీరంతా నన్ను ఎంతగానో ప్రేమించారు. భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను.

చివరిగా, ఒక్కసారి ….. 

జై భీమ్

మర్యాదలు రాయడం మరిచిపోయాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. వాళ్ళ మాటల ద్వారా గాని, చర్యల వల్ల గాని నన్ను ఎవరూ ప్రేరేపించలేదు. ఇది నా నిర్ణయం. దీనికి నేనే బాధ్యుణ్ణి. నేను వెళ్లిపోయిన తర్వాత నా స్నేహితులను గాని, శత్రువులను గాని ఇబ్బంది పెట్టకండి.

***

ముగింపు:

ఒక యువకుడు ….. ఒక స్కాలర్ ….. ఒక నిజమైన స్కాలర్ జీవితం అర్థాంతరంగా ముగిసింది.

లేఖను పరిశీలిస్తేనే అతని విజ్ఞాన ప్రతిభ కొంతవరకు అవగాహనకొస్తుంది. 

జీవితంలో బలహీన క్షణాలు ఆత్మహత్యలను ప్రేరేపిస్తాయి ….. 

కానీ ఈ ఉత్తరంలోని ప్రస్తావనను బట్టి ….. రోహిత్ సంఘర్షణలు బాల్యంలోనే మొదలయినట్టు భావించవలసి వుంటుంది. నిజానికి అట్లాంటి వాడు ….. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోగలిగే ఒక వ్యక్తిగా మారతాడు. కానీ ….. ఈ అబ్బాయిని అతని జీవితంలోని అన్ని అంశాలు తరిమి తరిమి చంపివేసినాయి. 

సాంఘిక, ఆర్ధిక అంశాలే గాక అతని జీవితంలోకి ….. రాజకీయ అంశాలు కూడా అనివార్యంగా చొచ్చుకువచ్చినాయి. 

అతని ఆత్మహత్య ….. అట్లాంటి మరిన్ని ఆత్మహత్యలను ఆపగలిగితే ….. మరెవ్వరూ “నా బ్రతుకే ఒక శాపం” అని అనుకోకుండా బ్రతగగలిగే అవకాశాలను సమాజం కల్పించగలిగితే ….. శాపగ్రస్తులు కానివారు కేవలం నిట్టూర్పులు విడవకుండా వారి జీవితపు జట్కా బండిని వారే లాగగలుగుతారు.        

***** 

ఉపన్యాసం: 2

మానవుల హృదయాల్లో ధైర్యం నింపండి 

– ఆంగ్ల మూలం: విలియం ఫాల్కనర్

స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి

నేపథ్యం

విలియం ఫాల్కనర్ అమెరికన్ రచయిత!

ఆయన ఎన్నో నవలలు, నాటకాలు, చిన్న కథలు, స్క్రీన్ ప్లేలు, నాటకాలు, కవిత్వం రాశాడు. 

1949 లో “ఆధునిక అమెరికన్ నవలకు శక్తివంతమైన, కళాత్మకంగా అసామాన్యమైన రచనలను అందించినందుకుగాను” ఆయనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి ఇవ్వబడింది. కానీ, రెండవ ప్రపంచయుద్ధం కారణంగా ఆ అవార్డు 1950 డిసెంబర్లో ప్రదానం చేయబడింది.

1955 లో ఒకటి “A Fable” అనే నవలకు, 1962 లో మరొకటి  “The Reivers” అనే నవలకు ´ “పులిట్జర్” ప్రైజ్ లు కూడా ఆయనకు ఇవ్వబడినాయి. 1962 లో ఇవ్వబడిన ఆ సత్కారం ఆయన మరణానంతరం ఇవ్వబడింది. ఇవికాకుండా మరెన్నో అవార్డులు, సత్కారాలు అమెరికాలోనే గాక ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో ఆయనకు లభించాయి.

“చైతన్య స్రవంతి” శైలిని ఫాల్కనర్ పాత్రోచితంగా మారుస్తూ రాసేవాడట!

డిసెంబర్ 10, 1950 రోజున నోబెల్ బహుమతి స్వీకార సమయంలో ఆయన చేసిన ప్రసంగం చదవండి.

***

(ప్రసంగ పాఠం)

ఈ అవార్డు నాకు ఒక వ్యక్తిగా కాకుండా నా రచనలకు ఇవ్వబడుతుంది అని నేను భావిస్తున్నాను ….. నా జీవితకాలపు రచనలు ….. ఆత్మచైతన్యం, స్వేదం నుండి ఉద్బవించినవి. పేరు ప్రతిష్టల కోసమో లేక లాభార్జన కోసమో కాకుండా ….. మానవుడి ఆత్మచైతన్యపు మూలవస్తువుల నుండి అవి సృష్టించబడినవి. వాటి ఉనికి అంతకు ముందెన్నడూ లేదు. అందువల్ల ఈ అవార్డుకు నేను సంరక్షకుణ్ణి మాత్రమే. అవార్డు యొక్క ఉద్దేశ్యం, దాని మూలాల ప్రాముఖ్యత తదనుగుణంగా అవార్డువల్ల వచ్చే డబ్బు పట్ల అంకితభావంను కనుగోవడం కష్టం కాకపోవచ్చు.  కానీ, ఇలాంటి వేదన, ప్రయాసలకు లోనై ….. ప్రస్తుతం నేను చెప్పేది వింటున్న యువతీయువకులకు ఈ క్షణాన్ని ఒక వేదికలాగ భావించుకొని నేను ఒక ప్రకటన కూడా చేయాలనుకుంటున్నాను. వారిలో ఒకరు ఏదో ఒకనాడు నేను ఇప్పుడు నిలబడినచోట నిలబడగలరని విశ్వసిస్తున్నాను.  

 ఈరోజు మనం విచారించ వలసిన విషయం ఏమిటంటే ….. విశ్వవ్యాప్తంగా ఉన్న భౌతికమైన భయాన్ని ఇన్నాళ్లు  మనం భరిస్తూవచ్చాము. ఇంకా కూడా మనం దాన్ని భరించవచ్చు. ఆత్మశక్తిని గురించి సమస్యలు ఇక లేవు. ఒకే ఒక ప్రశ్న వున్నది: నేనెప్పుడూ అంతమవుతాను? ఈ కారణం చేత, ఇప్పుడు రాస్తున్న యువతీ యువకులు మానవ హృదయం తనలో తానే సంఘర్షణకు గురవుతూ ఉంటుందని మర్చిపోయారు. ఆ సంఘర్షణ గురించి రాయడమే మంచి రాతలు అవుతాయి. అందుకు తగిన విషయాలు అవే. మానవ వేదనకు, స్వేదనకు తగిన విషయాలు అవే.

రచయిత వాటిని తిరిగి నేర్చుకోవాలి. భయాందోళనకు లోనుకావడమే అన్నిటికన్నా ప్రధానం అనే విషయం అతను తనకు తానుగా బోధించుకోవాలి. ఆ తర్వాత దాన్ని సంపూర్ణంగా మరచిపోవాలి. తన కార్యస్థానంలో ప్రాచీన విశ్వాసాలు, హృదయంలోని యదార్థాలు తప్ప వేరేవాటికి చోటు ఇవ్వకుండా………. ప్రేమ, గౌరవం, దయ, గర్వం, జాలి, బలిదానం లాంటి సార్వత్రిక నిజాలు లేని ఏ కథ అయినా అశాశ్వతం మరియు మృత్యుసమానము అనే విషయం అతను గ్రహించాలి. ఆ పని చేయనంతవరకు అతను శాపగ్రస్తుడై శ్రమిస్తూనే ఉంటాడు. అతను ప్రేమతో  కాకుండా మోహంతో రాస్తాడు. ఎవరూ ఎట్టి విలువలను కోల్పోని అపజయాల గురించి, ఆశలు లేని విషయాల గురించి రాస్తాడు, అన్నిటికన్నా ఘోరంగా దయ, జాలి గురించి అసలే రాయడు. అతని వేదనలు, కన్నీళ్లు ఎవరిని కదిలించవు: ఎవరిమీద చెరగని ముద్రవేయవు. అవి మాంసపు గ్రంధులను తప్ప హృదయాలను తాకలేవు.

 ఈ విషయాలు తిరిగి నేర్చుకునేంతవరకు, ఇతరులతో పాటు నిలబడి మనిషి అంతం కావడాన్ని తాను కూడా చూశాను అన్నట్లు రాస్తాడు. మనిషి అంతం అవుతాడు అనే విషయం ఒప్పుకోవడానికి నేను నిరాకరిస్తాను. మానవుడు కేవలం నిలబడి తట్టుకోవడం కాదు: అతను జయిస్తాడు. అతనికి ఆత్మ ఉన్నది కాబట్టే అతను అజరామరుడు అయ్యాడు, అంతేగాని సమస్త ప్రాణుల్లో కెల్లా అతనొక్కడే అలుపెరుగక మాట్లాడడం వల్ల కాదు; అతనికి కరుణ, త్యాగగుణం, ఆత్మస్థైర్యంలను వితరణచేసే శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. వీటిని గురించి రాయడమే కవులు రచయితల బాధ్యత. అతని పూర్వ వైభవాలైన ధైర్యం, గౌరవం, ఆశ, గర్వం, త్యాగనిరతి, జాలి, సహానుభూతిని మానవుడికి గుర్తుచేసి అతని హృదయంలో ధైర్యం నింపడం వారి ధర్మం. మనిషి తన కష్టాలను తట్టుకుని తాను చేసే ప్రయాణంలో కాసేపు చేరగిలబడి నిలబడడానికి కవి గొంతుక స్తంభం లాంటి ఒక ఆధారం లాగ ఉండాలి గాని ….. మానవుడి ప్రయాణాన్ని కీర్తించడానికి కాదు, 

***

ముగింపు

విలియం ఫాల్కనర్ కు తనకు వచ్చిన గుర్తింపు పట్ల ఆసక్తి లేదట!

అందువల్ల అతని కూతురుకు కూడా ఆయనకు వచ్చిన నోబెల్ బహుమతి గురించి ఆయన కూతురుకు స్కూల్లో ప్రిన్సిపాల్ పిలిచి చెప్పేదాకా తెలియదట!

ఈ ప్రసంగం ద్వారా రచనలు ఎలా చేయాలో చెప్పి  ఊరుకోకుండా ….. నోబెల్ బహుమానం ద్వారా తనకు వచ్చిన డబ్బులో కొంతభాగం కొత్తగా రచనలు చేసే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు గాను ఓ ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. ఆ తర్వాత అదే డబ్బుతో ఏర్పాటుచేసిన  “PEN/Faulkner Award for Fiction” అనే అవార్డు ఔత్సాహికులకు ఇవ్వబడుతున్నది. 

మిగతా డబ్బును ఆఫ్రికన్-అమెరికన్లకు ఉపాధ్యాయ శిక్షణకోసం విరాళంగా ఇచ్చాడు!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.