కొత్త అడుగులు – 8

శైలజ బండారి

– శిలాలోలిత

శైలజ బండారి కరీంనగర్ జిల్లా గోదావరి ఖని, 8 ఇంక్లైవ్ కాలనీలో జననం. తండ్రి అక్కపల్లి కొమురయ్య. తల్లి అక్కపల్లి లక్ష్మీకాంత. గోదావరి ఖని, వరంగల్, హైదరాబాద్ లలో  విద్యాభ్యాసం. బిఎస్సీ, బి.యిడి విద్యార్హత. కొన్నాళ్ళు ప్రభుత్వ టీచర్ గా  మెట్ పల్లిలో పనిచేసారు. జీవన సహచరుడు బండారి రాజ్ కుమార్, జనీర్, నిష్ణాత్, విఖ్యాత్ పిల్లలు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా యు.ఎ.ఇ లో నివాసం. సోషల్ మీడియాలో కవయిత్రిగా పలు బహుమతులు అందుకున్నారు.

2015 లో ‘చేతిచివర ఆకాశంఅనే కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 55 కవితలున్నాయి. అన్ని పుస్తక కేంద్రాల్లో దొరుకుతుంది.

‘‘మానసిక స్వాంతన కోసం నేను ఎంచుకున్న మార్గం కవిత్వం. పుప్పొడి వర్ణాలన్నీ రంగరించి, గాజుస్మృతులను ఏరుకుని చేతుల చివరి ఆకాశాన్ని  స్పృశిస్తూ , నీలవర్షపు నీ డన వేణువునై నేను ఆలపించిన గుండెపాట నా కవిత్వం. ఇది నా తొలి అడుగు’’ అని ప్రకటించుకున్న ఆమె కవిత్వంలోకి అడుగిడదాం.

తానే ఒక ఆకాశం!

మనిషి నరాల్లో చలించే జలగీతం కవిత్వం.

కవిత్వ పిపాసకుల దాహమెన్నడూ తీరదు. కవిత్వమే మనిషిని సజీవంగా నిలబెట్టి, రూపురేఖలు తొడిగి కవిత్వ వ్యక్తిత్వాన్ని

ఇస్తుంది. మానవ జీవితం పగిలిన, బీడుపడిన మట్టి దొంతరలనుకుంటే, ఆ చెమ్మగిల్లిన నయనాల్లాంటి కవితాక్షరాలే

తొలకరి చినుకుల్లా వాలి, సేదతీరుస్తాయి.

కవిత్వాన్ని బట్టి కవి అంతరంగ ఛాయల్ని, గమన పాదముద్రల్ని తెల్సుకోవచ్చు

కొంతమేరకు. ఆ కవిత్వం కీర్తి కోసం రాస్తున్నారా? పేరునే ఆశిస్తున్నారా? సామాజిక స్థితి మెరుగుపడాలని

భావిస్తున్నారా? స్త్రీల అభ్యున్నతి కోసం వివక్షను ప్రశ్నిస్తూ రాస్తున్నారా? ఆనందం కోసం రాస్తున్నారా ? మదిలో దాగున్న ప్రేమామృతాన్ని కవిత్వ

పలకమీద ఒలకబోస్తున్నారా? వేదాంత ధోరణిలో రాస్తున్నారా? మానవ జీవిత రహస్యాల పేటికను తెరుస్తూ

రాస్తున్నారా? సమసమాజ నిర్మాణం కోసం రాస్తున్నారా? కుల, లింగ వివక్షల కోసం పోరాడుతూ రాస్తున్నారా? ఏసీ రూముల్లో హాయి లొలుకుతూ శృంగార

కవిత్వాన్ని గుప్పిస్తున్నారా? స్వీయానందం కోసం మాత్రమే రాస్తున్నారా? తమకొచ్చిన భాషా పాండిత్యాన్నంతా

ప్రదర్శించడానికి జీవంలేని, బొమ్మరూపులో రాస్తున్నారా? కవిత్వ ప్రేమికులే కవిత్వం కోసమే బతుకుతూ, కవిత్వస్పర్శ ఊహలేని కాలంలో జీవించలేక, కవిత్వజీవనం గడుపుతూ రాస్తున్నారా? – అనే విషయాలన్నింటినీ వారి వారి కవితల్ని చదవగానే మనకు పట్టించేస్తాయి.

కవిత్వసారాన్ని బట్టి వారి వారి జీవన తాత్వికతను కొంతమేరకు అంచనా వెయ్యొచ్చు.

శైలజ కవిత్వాన్ని చూసినప్పుడు ఒక స్వచ్ఛత, సహజత్వం కన్పించాయి. పై వాటిల్లో సగానికి పైగా ఆమె కవిత్వానికి వర్తిస్తాయి. పోలికలు కొత్తవి. ఎక్స్ ప్రెషన్స్ కొత్తవి. భావాలు కొత్తవి. అనుభూతులు కొత్తవి. జీవితాన్ని ముక్కలు ముక్కలుగా కాక, ఒక దీర్ఘదృష్టి, సంయమనదృష్టితో రాసిన కవితలెక్కువ.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరిఖని వాస్తవ్యురాలు. ఇందులో తెలంగాణ జీవితాన్ని, వెతలను చూపే కవితలున్నాయి. తెలంగాణ పట్ల వున్న అపారమైన అభిమానం, కన్నతల్లి పట్ల వుండే అపురూపమైన అభిమానం. ఆ అభిమానం ఆయా కవితల్లో కొట్టొచ్చినట్లు కన్పడుతుంది. తను పుట్టి పెరిగిన గోదావరిఖని బొగ్గుగనులు ఆమె తలపుల్లో వెన్నంటి వుంటాయి. దేశం దాటిపోయినా, దుబాయి దేశంలో ప్రస్తుతం నివసిస్తున్నా తెలంగాణ చిత్రపటాన్ని తన మనోవీధుల్లో చెరిపి వేయకుండా కవిత్వ రూపాన్ని ఇచ్చింది. దోపిడీకి గురైన తొలి తెలంగాణ వనరు సింగరేణి బొగ్గుగనులనే నిజాన్ని విప్పింది. ‘సింగరేణి’ కవితలో

తెలంగాణ వాకిట ఆర్థిక నేత్రమవుతూ

ఏళ్ల చరిత్రను సింగారించుకుని ‘సింగరేణి’

తెలంగాణ నుదుట సింధూరమై వెలుగుతూ

నల్ల బంగారపు ధగధగల సంతకం

దగాపడిన సింగరేణిని

తెలంగాణ కొంగు బంగారం చేద్దాం….

ఇలా సింగరేణి ప్రజల జీవితాన్ని ప్రస్ఫుటిస్తూ ఈ కవిత సాగుతుంది. వలసపోయిన, దేశాలబాట పట్టిన కొడుకు కోసం పొద్దుతిరుగుడు పువ్వురీతి ఎదురుచూస్తున్న తల్లినిలా అక్షరీకరించింది.

‘కొమురన్నా..

దినదినానికి బరువైతంది దిగులుకుండ

రంగులు ఎలిసిన గోడలతోని

ఒంటిగ నిలబడ్డ ఇల్లునైతిని

పొద్దు పొద్దుకు గుమ్మానికి కండ్లు అతికించి

పొద్దుతిరుగుడు పువ్వునైతిని…”

స్త్రీల జీవితాల్లోని ఖాళీతనాల్ని, మనిషిగా గుర్తింపబడాలనుకునే ఆమె తపననీ, గడ్డకట్టిన పురుషుడి క్రౌర్యం ముందు చితికిన ఆమె రంగుల కలలన్నీ ఇలా ‘ఖాళీతనం’ కవితలో

నువ్వు పరిచి వెళ్లిన చీకటిని తరిమేందుకు

నన్ను నేను ఎన్నిసార్లు వెలిగించుకున్నానో…

ఒక మాటకి అటు చివర నువ్వు, ఇటు చివర నేను

కలిసి ఉన్నామనుకుంటూ ఒంటరితనానికి చేరువవుతూ

పసుపుతాడు ముడులకి, ఇగోయిజపు ఉరితాడుకి

నడుమ వారధి కడూ…

నీకూ నాకు నడుమ నిండిపోయిన ఖాళీతనం తప్ప

నువ్వు నేను కలిసి నడిచిన అడుగుల గుర్తులే లేవు

లోకానికి అన్నీ ఉన్నట్లనిపించే ఏమీ లేనితనం

సంపద ఉన్న ఒక బికారితనం

తలెత్తి చూస్తే ఇల్లంతా నిండిపోయిన చీకటి –

ఈ కవిత ఆసాంతం స్త్రీల జీవితాల్లోని పరుచుకొని పోయివున్న ఎడ్లీనెస్ ఛాయలను చాలా సజీవంగా చిత్రించింది.

శైలజ రాసిన మా ‘8 ఇంక్లైన్ కాలనీ’ కవితను ‘కవిసంగమం’ (ఫేస్ బుక్)లో మొదటిసారిగా చదివినప్పుడు, కవిత బాగుందనుకున్నాను. సింగరేణి బతుకు చిత్రాన్ని దృశ్యచిత్రంగా అద్భుతంగా మలిచింది అనుకున్నాను. బహుశా కామెంటు కూడా పెట్టుంటానేమో, సరిగ్గా గుర్తులేదు.

భావకవిత్వ ఛాయలున్న కవిత ‘మేఘసందేశం’. ప్రేమోన్మత్తత చినుకులు కురిసి కురిసి వర్షధారలై నిలిచిన తీరు. కొన్ని కవితల్లో స్త్రీలు సంఘటితమే. సమరోత్సాహంతో ముందుకుసాగి, ఎదుర్కొనే, శిక్షించే స్థితికి చేరుకోవాలనే ఆకాంక్షను వ్యక్తీకరిస్తుంది.

జననమెంత కఠినమో, ప్రసవమెంత వేదనాభరితమో స్వీయానుభవ ప్రకటన చేసిన కవిత – ‘రాత్రి ఒడిలో ఒక ఉదయం ‘.

చెరువుల పూడిక, నీటి రాకడ, కాకతీయ మిషన్ గురించి ‘నిండుకుండి కవితలో విడమరుస్తుంది.

స్త్రీలపై నానాటికీ పెరుగుతున్న హింస భరించలేని స్థితికి చేరాక, వ్యసనాల హింసను తట్టుకోలేక, బతుకు నావలోంచి తోసేసి హత్య చేయబడుతున్న ఎందరెందరి గురించో రాసిన కవిత – ‘చితి’

‘మత్తుని తన ఒంట్లో నింపుతూ

విషాన్ని ఆమె గొంతులో పోసాడు

వ్యసనమై తాను దగ్ధమవుతూ…

ఆమెకు చితి పేర్చాడు’

ఇంకొకచోట స్త్రీల జీవితాలే కాదు పసిపిల్లల జీవితాలు కూడా ఎలా ఛిద్రమైపోతున్నాయో చెప్పిన సందర్భంలో…

‘పంచాయితీల కెక్కే కుటుంబాలు

నడి సంద్రంలో చిల్లులు పడుతున్న నావలు

మునిగిపోతున్న పడవలో బిక్కు బిక్కు మంటున్నాయి

రెక్కలల్లార్చడం చేతకాని కొన్ని పసికూనలు’

చాలా లోతైన, విషాదకరమైన, సుదీర్ఘమైన గాఢమైన విషయాల్ని, చాలా సూటిగా, క్లుప్తంగా గుప్తంగా చెప్పడం ఈమె కవిత్వ ప్రత్యేకత.

‘అంతరాల తెరలు’ – కవితలో

‘మనల్ని మనం

ఒంటరితనపు లోయల్లోకి విసిరేసుకుంటూ..

అణువణువునా నిశ్శబ్దం

అంతర్జాల పిలుపులే కానీ

అంతరంగాల ఊసులు లేవు

అంతర్మథనం జరగాలి ఇప్పుడు

అంతరాల గోడలు కూల్చేయడానికి

అంతరంగాల లోతులను అన్వేషించడానికి’ – అంటుంది.

వరకట్నం మీద ఒక కవిత రాసిందిలా..

‘కొన్నవాడే, అమ్మినవాడికి బానిసగా మారిన చిత్రమైన అంగడి

కన్యాశుల్కం కన్యకు వైధవ్యపు ముసుగేస్తే

వరశుల్కం వధువుకు శవం ముసుగేస్తోంది

….

నూరేళ్ల తోడుకి చెల్లుచీటీ పాడేసి

పలుమార్లు గెంటివేతలు

నీలో తెగువను రగిలించి దాస్య శృంఖలాల చెరవీడి

మనసుల కలయిక మనువుకు నాందిగా చాటించి

వరకట్నానికి సమాధి కట్టెయ్…..

నీవే ఒక ఆయుధమై

వివక్షపై బ్రహ్మాస్త్రం సంధించెయ్’ – స్త్రీలు మెలగాల్సిన తీరును, ఆయుధంగా మారాల్సిన స్థితినీ స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగి, దూర ప్రాంతాలలో రోజూ ప్రయాణిస్తూ ఇంటికీ, పనిస్థలానికీ మధ్య ఎలా నలిగిపోతుందో, కుటుంబం బాధ్యతలు, భర్త ఒత్తిడి ఆమెను ఎంత క్షోభకు గురిచేస్తాయో, ఆమె జీవితంలో ఒక్కరోజే ఎంత కఠిన శిక్షగా ఉంటుందో, కరుణతో కథనాత్మక శైలిలో రాసిన కవిత దినచర్య

‘కొన్నెందుకో…

అర్థం కావు…?” వ్యంగ్య ధోరణిలో రాసిన కవిత, భార్యాభర్తల అన్యోన్యత ముసుగుపై చురకలాంటిదిది.

‘ఆ బంధం పెళుసు బారిందో..?

సమాజం కోసం గట్టిగా పెనవేసుకుందో’

– అని సూటిగా ప్రశ్నవేస్తుంది.

గతంలో ‘మధుమేహ’ వ్యాధి గురించి రెండు మూడు కవితలొచ్చాయి.

ఆలనా పాలన కోల్పోయిన వారికి ఈ వ్యాధి సంక్రమిస్తే ఎంత మరణయాతనో, ఎంతటి తియ్యటి కత్తో, నరనరాన దాని ప్రభావం ఎంత తీవ్రంగా

ఉంటుందో, ‘కన్నీటి అంచున’ కవితలో

‘ఒకనాటి ఉదయం

పిడికిలి ఖాళీ అయ్యింది

ఒళ్లంతా అల్లుకొన్న తీగ

ఉరితాడై బిగిసింది’ – అంటుంది.

భరించలేని నిస్సహాయ స్థితిలో శవమై మెలగాల్సిన రీతిని విమర్శిస్తూ, ఇలాంటి బలవన్మరణాల నిద్రలు లేని స్థితిని కోరుకుంది. ఆమె మరణం కూడా అతడిని మార్చలేక పోతోందని, అప్పటి వరకూ పెత్తనం చెలాయించి బతికినవాడు, తప్పు చేశానన్న భావన లేకపోగా, పశ్చాత్తాపం లేకుండా ఎందుకు చచ్చిందది, నాకు ఇంకో బానిస ఎప్పుడు దొరుకుతుంది. నన్నెవరు చూసుకుంటారు. ఎవరు వండి పెడ్తారు. ఉద్యోగం వెతుక్కోవాల్సి స్థితిని కల్పించింది. చచ్చికూడా నన్ను సాధిస్తోంది’ అంటూ చిందులేసే మనుషులు ఎప్పటికీ మారరింక అంటుంది, ముగింపు వాక్యం’ కవితలో.

‘గోడపై మరకను తుడవగలదే కానీ

జీవితానికి అంటిన మసిని

ఏ వెలుగు వస్త్రంతోని తుడవలేని అసహాయత

ఆమెది. ఇలాగే కొనసాగితే ఈ లోకంలో మనుషులెవరూ మిగలరింక అని నిరాశను

వ్యక్తీకరిస్తుంది.

 అలాగే మెరుపుల్లాంటి కవిత్వపు తునకలెక్కువగా ఉన్నాయిందులో. మచ్చుకు కొన్ని…

చైతన్యాన్ని నింపడానికి

మిణుగురుల నడిగి

కొన్ని వెలుగు రేఖలద్దాను.

. . .

నా మది గోడకు వేలాడే ప్రతి కవిత

నా మనసు పుస్తకానికి ముఖచిత్రం

అచ్చుగుద్దినట్టు నా ప్రతిబింబం

పోతపోసిన నా అంతరంగం

. . .

ఒక్కసారిగా-

గతం బతికితే బావుండు…

. . .

నువ్వు జీవితాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతూ…

నన్ను నీ జ్ఞాపకాలలో నింపేశావు

. . .

ఒక్కసారి నిశ్శబ్దం రెక్కలు తగిలించుకుని

తలపుల తలుపుల చాటుకి వెళ్లివస్తా

నన్ను నేను వెతుకుతూ…

. . .

నిదురించిన కలనై సేద తీరుతున్న నేను

కొన్ని పుప్పొడి వర్ణాలను

వేకువకు అద్దుతాను

. . .

మనసుని కొంత నిశ్శబ్దంలోకి విసిరేసినప్పుడు

నీటిలో పడ్డ గులకరాయిలాంటి శబ్దం

. . .

ఒక్కో నీటిబొట్టు చేరి

దూదికుంట బరువెక్కినట్లు

. . .

రెప్పల వంతెనపై కొన్ని స్వప్నాలు

గుండెగూటిలోకి చేరి దీపాలై వెలుగుతాయి.

ఐతే ఎక్కడో ఒక చోట చిన్న మచ్చలేకుండా జరగదు అన్నట్లుగా, ఆసాంతం కవిత్వం అద్భుతంగా కన్పించినా ‘కభీ సాఫ్ భీ’ కవిత ఒక్కటే ఇందులో ఉండకూడనిది. ఎందుకంటే అవగాహన లోపాన్ని వ్యక్తీకరించిన కవిత ఇది.

‘ఆడదానికి ఆడదే శత్రువని, పలుమార్లు రుజువు చేసింది

ఒకనాటి కోడలే నేటి కోడలికి శాపమని

రుధిరాక్షరాలతో లిఖించింది. –

అత్తని దుర్మార్గురాలుగా చిత్రించడం వెనకున్నది పితృస్వామ్య వ్యవస్థీ. ఆమె ఆమెకాదు, సమాజం పెంచి పోషిస్తున్న దానికి నకలు. వారికి ఆ స్పృహను కల్పించాలి. వారిలో మార్పును తీసుకు రావడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఒక మనిషిగా ఆలోచించే ప్రవర్తించే మనం, తోటి స్త్రీని అర్థం చేసుకోవడంలో పొరపాటు చేయకూడదు. మానవ మనస్తత్వాల్లో మనిషితనాన్ని, మానవత్వాన్ని నింపడానికి ప్రయత్నించాలి.

జీవితం, జీవనం పట్ల ఒ స్పష్టమైన అవగాహన, ఆర్తి, తపన, జ్ఞానం ఉన్నది శైలజకు, కవిత్వ నిర్మాణం, శైలి, అభివ్యక్తి వంటి విషయాల పట్ల ఇంకా మెరుగైన స్థితికి మునుముందు చేరుకుంటుందని, కవిత్వం పట్ల తనకున్న ఆసక్తిని బట్టి చూస్తే అర్ధమవుతుంది. శైలజ అంటే శిలనుంచి పుట్టింది అని అర్థం. బతుకు శిలను కవిత్వపు ఉలితో చెక్కుకుని కవయిత్రిగా పుట్టిన శైలజకు అభినందనలు.

*****

Please follow and like us:

2 thoughts on “కొత్త అడుగులు-8 (శైలజ బండారి)”

    1. నెచ్చెలికి రాస్తున్నందుకు, ఓపికగా, ఇష్టంగా ఎందరో కొత్త కవయిత్రులని నెచ్చెలి పాఠకులకు పరిచయం చేస్తున్నందుకు మీకు అనేక నెనర్లు శిలాలోలితగారూ!

Leave a Reply

Your email address will not be published.