జానకి జలధితరంగం-6
-జానకి చామర్తి
స్వీయనియంత్రణ చేసుకున్న సీత చెల్లి..
నలుగురితో కలవకుండా ఏకాంతంగా జీవితం గడపడం . కరోనా మహమ్మారి వచ్చింతరువాత ఇదొక మంత్రం అయింది. కొంతకాలం ఏకాంతంలో ఉండు , తరువాత ఎల్లకాలమూ సుఖసంతోషమే.
బాహ్యంగా ఏర్పడిన కల్లోలం ఇది..ఒక్కరమే ఉండకపోతే మహమ్మారి వ్యాధికి ఆహుతి అవడమే కాక వ్యాపింపచేస్తాము అన్న భయంతో స్వీయ నియంత్రణం చేసుకుంటున్నాము. చెప్పకపోయినా మనకందరకూ తెలుసు అది ఎంత కష్టమైయినదో.. అనుభవించి గ్రహిస్తున్నాము. ఒక్కక్షణం ఆలోచించండి..తప్పనిది ఇది మనకి. ..
కాని మరి ఆమెకో..
అంతరంగిక కల్లోలాన్ని అణచిపెట్టుకోవడానికి, పతి ఎడబాటును సహించడానికి, ఏ తప్పు చేయకుండానే ఏకాంతవాసశిక్ష అనుభవించడానికి, అన్నీ ప్రశ్నలే చుట్టుముట్టి.. వాటికి జవాబులు వెతకడానికి , తనని తాను సరిపుచ్చుకోవడానికి, తనని తాను సంబాళించుకోవడానికి , తనని తాను వెతుక్కోవడానికి.. స్వీయనియంత్రణలో ఏకాంతవాసాము విధించుకుంది
ఆమె సీత చెల్లెలు ఊర్మిళ.
లక్ష్మణ స్వామి అర్ధాంగి. ఆమె మీద వచ్చిన కధలెన్నో.. ఊర్మిళా దేవి నిద్రగా ప్రసిద్ధి.
నిజంగా నిద్రే పోయిందా , తపస్సే చేసిందా.. పదునాలుగేళ్ళు , తన పతి సౌమిత్రి, సీతా రాములకు సేవ చేయ , వారితో కూడా అడవుల పట్టిపోతే.. తాను తన మనసు అడవులు పట్టి పోకుండా కట్టడి చేసుకుంది. బాధ్యతలు విధులు నిర్వర్తించడానికి భర్త తన మాట కూడా మరచి ఉరుకులెత్తుకుపోతే , ఉడుక్కోలేదు . ఆలోచించింది లోతుగా మర్మము తెలుసుకో ప్రయత్నించింది. తన గది లోనే తానుండి పోయింది బయటప్రపంచం చూడకుండా. తనకి తాను వేసుకున్న శిక్ష కాదది , తనని తాను చేసుకున్న విడుదల.
ఎన్నో శుభకార్యాలు పండుగలూ సంబరాలు మంచివీ చెడ్డవీ విషయాలు విందులూ వినోదాలు .. అయోధ్యలో జరిగే మంచీ చెడ్డా ఏ విశేషాలు వేటిలో.. పాల్గొంది ఊర్మిళ..? లేదు. వంటరిగా తన లో తనే తనతో తనే హృదయంలో సంతోషాలు వెతుక్కుంది.
ఒక విషయం గమనించారా.. సీతకు రాముడున్నాడు, రాముడికి సీత ఉంది, లక్షమణుడికి రాముడూ సీతా ఇద్దరూ ఉన్నారు.. మరి ఊర్మిళకు ఎవరున్నారు? .
సర్వమూ మరచి నిదురపోయిందన్నారు ఊర్మిళను, బాధను మరువడానికి .కానీ కాదు, తన బాధ్యత నిర్వర్తించింది పూర్తి మెలకువ సాధించింది, బాధించే పరిస్ధితులను జయించింది, తను ఒకరికి భారమవలేదు, తన మనసును తేలిక చేసుకుంది. తెరిపిన పడింది,
అయోధ్య పౌరులకు వేలెత్తి చూపే సందివ్వలేదు, అపవాదులు వేసేందుకు అవకాశమే ఇవ్వలేదు. ఇక్ష్వాకు వంశానికీ పేరు తెచ్చింది, నిశబ్దాన్ని, దూరాన్ని, స్వీయ నియంత్రణనిపాటించి.
సీత పతితో అడవికి వెళ్ళి సతిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే, ఊర్మిళ ఇంటనే ఉండి భర్తకి , రాజుకూ, రాణీకీ , వంశప్రతిష్ట కు, పౌరులకీ , ప్రభుత్వానికీ , దేశానికీ పట్ల ఉన్న తన బాధ్యత ను ఎంతో పట్టుదలతో చిత్తశుద్ధి తో నిబద్ధతతో కట్టుబడి నిర్వర్తించింది.
ఎంత మహత్తరమైన కొండవంటి కార్యము అది , తనకోసమూ తనవారికోసమూ అందరి మంచి కోసమూ చేసింది ఆ చెల్లి చిన్న ఊర్మిళ.
ఎందరో ఎన్నో వర్ణించవచ్చు, వివరించవచ్చు, విశ్లేషించవచ్చు కాని ఎవరూ కాదనలేని సత్యం ఊర్మిళ ఒంటరిగా సాధించింది, ఒంటరిగా మనసులో అరణ్యవాసము చేసింది, క్రోధము ఉక్రోషముల ముక్కు చెవులు కోసింది, దుఃఖ సముద్రాన్ని దాటింది, కోరికల మాయాజాలాన్ని జయించింది, తపస్సాగ్నిలో పునీత అయింది,
అన్నిటినీ మించి సర్వకాల సర్వావస్ధల యందూ మనసా లక్ష్మణుడితోనే జీవించింది ఆ పదునాలుగేళ్ళు.
స్వీయనియంత్రణ చేసుకున్న సీత చెల్లి..!
ఉన్నారు ఊర్మిళలు .. ఇప్పుడు కూడా..
ముందుగా గుర్తు వచ్చేది యుద్ధవీరుల పత్నులు. దేశాన్నికాపాడటానికి , సరిహద్దులలో రాత్రింబవళ్ళు శ్రమపడి శత్రువుల నుండి మాతృభూమిని రక్షించు సైనికుల భార్యలు. కళ్ళలో వత్తులు వేసుకుని మగని రాక కొరకు ఎదురు చూస్తూ.. ఆదమరచి నిద్రపోరు, జాగురూకత తో తమ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు వీరపత్నులుగా.
ఎంత బాధ్యత తీసుకుంటారు.. తననూ కుటుంబాన్ని పిల్లలను కాపాడుకంటారు, పిల్లలకు తండ్రి లేని లోటు రానీయకపోవడమే కాదు, అతని తల్లితండ్రులకు కూడా తామే కొడుకువలె అవసరాలు తీరుస్తారు. ధైర్యం చెపుతారు , ధైర్యముగా జీవిస్తారు. సామాజిక బాధ్యతలు నెరవేరుస్తున్నారు.
ఊర్మిళాదేవి నిద్ర ఏమి సందేశం ఇచ్చిందంటే, అవరమైప్పుడు నీలో నీవు ఒదిగి , బాహ్యంగా బయటకు తిరగకు గాని, మనసుగది లోకి వెళ్ళి తలుపేసుకో, కాని ఆలోచనా తాళంచెవితో కొత్త ద్వారాలు తెరు , ఒంటరిగా ఉన్నా నిను నువ్వు సంతోష పరచుకో. నలుగురినీ సంతోషం పొందనీయనీ.
మనలని మనం రక్షించుకుంటూ ..తతిమ్మా ప్రపంచాన్ని రక్షింపబడనీయమని.
*****
జానకి చామర్తి ( వరిగొండ)
మనసులో భావాలు మనసులోనే కధలల్లి పెట్టుకోవడం ఎప్పటినుంచో చేస్తున్నా ,
అక్షరాలలో పెట్టడం ముఖపుస్తకంలో మొదలయ్యింది. సుందరమైన తెలుగునే నమ్ముకున్నా.
అందంగా కవితలా రాయాలని , రోజూవారీ జీవితాన్నైనా
ప్రకృతి యే ఆనందం , ఇప్పటికీ చదువు చెప్పే గురువు అదే.
నిజం చదువు MA Bed, ఉపయోగపడే విద్య yoga లో చేసిన PG Diploma,.
నివాసం విశాఖపట్టణం , ఎక్కువకాలం ప్రవాసం.
ప్రస్తుత నివాసం కౌలాలంపూరు.