జ్ఞాపకాల సందడి-9

-డి.కామేశ్వరి 

నవ్యలో  నా కథ ‘తానొకటితలచిన ‘ చదివి  చాలామంది ఫోన్ చేసారు. ఎక్కువమంది సీనియర్ సిటిజన్స్ . మా ఇంటికథే అని మెచ్చుకున్నారు . సగం మంది  యూత్ కథ చాలాబావుంది, మీ మొదటి కథా అని కొందరు, ఇంకేమన్నా వచ్చాయా, అని మరి కొందరు , పుస్తకాలువుంటే చెప్పండి అని కొందరు అడుగుతుంటే నాహిస్టరీ అంతా ఎంతకని చెప్పడం, అలాని చెప్పకపోతే అయ్యో ఇదే నా మొదటికథ అనేసుకుంటే ఎలా.

ప్రలోభాన్ని  వదులు కోవడం అంత ఈజీ కాదు కదా . 62 నించి రాస్తున్న లెండి అని నాలుగు మాటలు చెప్పి వదుల్చుకోవడం. యూతే కాదు పెద్దలుకూడా చాలామంది ఆ… మీపేరు విన్నట్టే వుంది. అవును మా అమ్మ వాళ్ళు చెప్పేవారు, అవునవును కథలు చదివినట్టే గుర్తు, ఏమిటో ఈ మధ్య మ్యాగజైన్స్ చదవడంలేదు అని కొందరు అంటే మొత్తం మీద 70 పైబడినవారికి తప్ప  నేనెవరో ఏం రాసానో తెలియదని అర్ధం అయి ఒక విధమైన నైరాశ్యం, సాహిత్యానికి మంచి రోజులు అంతరించి పోయాయా అనిపించింది.

పోనీ పాత పేర్లు తెలియకపోయిన కొత్తవైనా  చదువుతున్నారా అంటే ఏదో ఓ పత్రిక తిరగేయడం,  ఎప్పుడైనా ఒక కథ చదవడం తప్ప ఏది సీరియస్ గా ఎవరూ  చదవడం లేదు మా రోజుల మాదిరి అనిపించింది.

మా ఎదురింటావిడ ఈనాడు ఒకటే కొంటాం, పత్రికలూ ఇంటరెస్ట్ లేదు అంది. పుస్తకాలు  బోలెడున్నాయి తీసుకుని చదువుకో అంటే, టైంలేదు అంది.  మళ్లీ ఉద్యోగస్తురాలుకూడా  కాదు. మిమ్మల్నీ ఎక్కడోచూశాం అని కొందరు కొత్తలో అని నేను ఎవరో తెలిసిన తర్వాత, మా అమ్మ వాళ్ళు చదివేవారు అనడం తప్ప ఒక్కరు ఏది చదివిన రకం కాదు అని అర్ధం అయ్యాక నైరాశ్యం కాక ఏముంటుంది.

కొంతమందికి మాలతి పిండివంటలు పుస్తకం, సులోచన అవునవును ఆవిడ సినిమాలు చూసాం అనో,  న్యాయంకావాలి మీరు రాశారా. యండమూరి తెలుసు లాటి మాటలు తప్ప ఒక పుస్తకం గురించి చెప్పలేకపోయారు. అంటే ఈ నాడు సాహిత్యానికి స్థానం ఏ స్థాయి లో ఉందో అర్ధం కాలేదు.

అయితే  మన రచనలు చదువుతున్నది  ఎవరు అని ప్రశ్నించుకుంటే  పాతతరం పాఠకులు, ఏభయిఏళ్లు  పైబడినవారు కాస్త సాహిత్య పరిజ్ఞానం  వున్న వారు సాహితీకారులు మొత్తం జనాభాలో  ఓ పది శాతం చదువుతున్నారేమో.

ఇప్పటి ఈ పరిస్థితుల్లో  భాషని, సాహిత్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వం దిక్కూదివాణం లేకుండా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో  రచయితలని ఒక విధమైన నైరాశ్యం అలుముకుంటుంది.

ఏం రాస్తే ఏముంది ఎవరు చదువుతారు, ఐదొందల కాపీలు అమ్ముకోలేని దుస్థితిలో ఎంతకని డబ్బు ఖర్చుపెట్టి  పుస్తకాలూ వేయిచుకోవాలి? ఇదీ అందరి మదిలో మెదిలే ప్రశ్నలు.

సరే పుస్తకాలు ఊరికే ఇచ్చినా  చదివేవారు, చదివి మంచి విమర్శా చేసేవారు అసలులేరు. ఈ  పరిస్థితుల్లో ఎవరి ఇష్టులకి వారు సన్మానాలు, శాలువాలు కప్పి కాస్త గుర్తింపు తెచ్చేప్రయత్నాలు సాహితీ సంస్కృతి సంస్థలు కాస్త చేస్తూ  సాహితీ సంస్కృతులు నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి.

ఇంకా ప్రభుత్వాలు,  అందులో తెలంగాణ ప్రభుత్వం అన్నీ అమరిన రాష్ట్రం. వారి సాహిత్యానికి గుర్తింపుకు బాగానే అవార్డులు, సన్మానాలు, సభలు, పుస్తక ప్రచురణ, ప్రదర్శన లాటి వాటి మీద దృష్టి పెట్టి తెలంగాణ రచయితలకి తగిన గుర్తింపు గౌరవం  ఇవ్వడం ముదావహం.

ఇటు అటు చెందని మాలాటివారం ఆంధ్రప్రదేశ్ ఎప్పటికి స్థిరపడి సాహిత్యం వైపు దృష్టిపెడుతుందా అని ఎదురుచూసే పరిస్థితిలో ఆ ఇస్తున్న ఉగాది పురస్కారాలయిన అర్హులను గుర్తించి సరిగా ఇస్తారన్న  ఆశ కూడా ఆవిరవుతుంది.

ప్రతిభ ,సీనియారిటీ ఏం చూసి ఏ ప్రమాణాలతో ఎంపిక చేస్తున్నారో దేముడికెరుక. సాహిత్యంలో సిఫార్సులు, కులాలు, ప్రాంతాలు, ఇజాలు, జిల్లాలు అన్నిరకాల జాడ్యాలు ప్రవేశించి ఎవరికి ఎందుకు ఇచ్చారో  తెలియకుండా పంపకాలు చేసేస్తున్నారు. అడిగే నాధుడులేడు. రాజకీయాల్లో ప్రాంతాలవారీగా పదవులు పంచేధోరణి అవార్డులలో ప్రవేశించాక మాలాటి వాళ్ళం ఎంత సీనియరిటి వున్నా, మెరిట్ వున్నా నిస్సహాయంగా నోరుమూసుకుని జరిగేది చూస్తూ  బాధపడడం.

అందుకే ఒకరకం నిస్పృహ, నిరాశ వచ్చి ఏంరాస్తే ఏంలాభం, చదివేవారులేరు, గుర్తింపు లేదు ఎవరి కోసం రాయాలి అనిపిస్తుంది. కాస్తోకూస్తో ఇన్నాళ్లుగా రాసి ఆనాటి వచ్చినపేరు కాపాడుకోవాలని అనిపింస్తుంటే,  ఇపుడు రాసే వారి పరిస్థితి  ఎలావుందో రేపు. అందుకే మంచి ముహుర్తం చూసి ఫుల్ల్స్టాప్ పెట్టేస్తే మంచిది ఈ రాతలకి. నుదిటిరాత మనచేతిలో లేకపోయినా ఇది నా చేతిలో పనిగదా. ఏమంటారు?

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.