ట్రావెల్ డైరీస్ -1
తూరుపు కనుమ
-నందకిషోర్
2014 ఒక ఎండాకాలం- జీవితమంటే ఎందుకో నిరాశపుట్టింది. ఒక సంచారిగా నన్ను నేను తెలుసుకుంటున్న కాలమే అది. పోయిన సంవత్సరం అరుణాచలంలో ఇట్లాగే తిరిగాను. కావాల్సిన మనుషులు వొదిలిపోయిన దుఖం కాళ్ళు నిలవనిచ్చేది కాదు. ఇప్పుడది రెండింతలు. అప్పుడేదో వెతుకుతూ తిరిగానుగానీ ఇప్పుడేమి వెతికేది లేదు. ఇది ఉన్నవాళ్ళతో ఉండలేనితనం. పారిపోవాల్సిన అవసరం ఒకటే ఉంది.
తూర్పుకనుమలో నేను చూడాలనుకున్నది నా బాల్యం. అది నాకెంత జ్ఞాపకముందో తెలీదు. చిన్నప్పుడెప్పుడో ఓ విహారయాత్రకి వొచ్చి ఈ ప్రదేశాలన్నీ తిరిగాను. అరకు లోయ నాలోపల అప్పుడప్పుడూ కమ్ముకునే పొగమంచు. తూరుపు కనుమ నా భూగోళంలో చిన్నప్పటి స్నేహం. నా బాల్యమంతా నేను మా ఊరు దాటి ఎటూ దూరం పోయింది లేదు. ఆ యాత్రలో చూసిన ప్రదేశాలన్నీ మళ్లీ ఒకసారి చూడాలని పద్నాలుగేళ్లుగా అనుకుంటేనే ఉన్నాను. అన్నిటికంటే సముద్రం చూడాలనే ఆశ కొద్దీ ఈ ప్రయాణం చేద్దామనుకున్నాను. సముద్రం దాకా వొస్తే అరకులోయ అంత దూరమేం కాదని తెలుసు.
***
హైదరాబాద్లో బస్సెక్కి తునిలో ఒకరోజు ఆగాను. తాండవ నదిలో నీటి చుక్కైనా లేదు. అక్కడ ఉక్కపోతగా ఉండింది. అక్కన్నుంచే విశాఖపట్నం పోయాను. అక్కడ ఇంకా ఎక్కువ ఉక్కపోత. సముద్రం చూసి అప్పటికి ఎన్నేళ్లో. అప్పటికీ సాహిత్య ప్రపంచంలో కాస్తో కూస్తో పరిచయాలున్నాయ్. కాకపోతే నేననుకున్న స్నేహితులెవరూ నన్ను ఇంట్లో ఉండమనలేదు. నాకు పరిచయమున్న నలుగుర్నీ కలిసేసాను. ఆ రాత్రి ఎలా గడపాలో, ఎక్కడ గడపాలో అంతుచిక్కని ప్రశ్న. నా దగ్గర ఉన్న డబ్బు అంతంతమాత్రం.
నా కవిత పత్రికలో చదివి ఫోన్ చేసిన ఒకమ్మాయికి నంబరు కలిపాను. అసలెప్పుడూ చూడని మనిషి. ఆమె నన్ను ఇంటికి తీసుకుపోయింది. తన భర్తకి ఓ తమ్ముడిగాకాక మిత్రుడిగా నన్ను పరిచయం చేసింది. A.C ఒకటే గదిలో ఉన్నందుకు, ఈరాత్రికి మనగదిలో ఉంటాడని చెప్పింది. అప్పటికి ఈ ప్రపంచపు మానవసంబంధాల పట్ల నాకున్న అవగాహన, సాహిత్యం వల్ల కలిగిన అవగాహన వేరువేరుగా ఉండేవి. అవి ఒకేలా ఉన్న ప్రతీ సందర్భం నాకు జీవితమంటే, కవిత్వమంటే ఇష్టం పెంచిందనే అనుకుంటాను. ఆ రాత్రి ఎంత ఆకలేసినా నేనేం చెప్పలేదు. ఆమె నువ్వన్నం సరిగా తిని ఎన్నిరోజులైందని అడిగింది. తన భర్త ఎదురుగానే ముద్దలు కలిపి పెట్టింది. అతడి చూపుకి నా దగ్గరేం సమాధానం లేదు. పొద్దునే లేపి సింహాచలం బస్సు ఆగే చోట నన్ను వొదిలిపోయింది. ఆ బస్సు కొండమీదకి తీసుకుపోయింది.
చందనపు గంధాల దేవుడు అప్పడు. ఎత్తైన గాలిగోపురంమీద ఆకాశం మబ్బుపట్టింది. సంపెంగ పూలు కుప్పగా పోసి అమ్ముతున్నారు. దర్శనం చేసుకుని, ప్రసాదం తిని కొంత చల్లబడ్డాను. కాలి నడకన కిందికి దిగాను. అడవిలోంచి ఆ మెట్లదారిలో దొరికిన సంపెంగపూలు నిజానికి కృతజ్ఞతగా ఆమెకి దక్కాల్సినవి. అవి నా నోట్సులోనే ఉండిపోయాయ్. .
***
అరకు చూడాలన్నది చాన్నాళ్ళ కింది ఆలోచన. మధ్యాహ్నం బస్ కాంప్లెక్స్‌కి వొచ్చి అరకు బస్సెక్కాను. బస్సంతా గిరిజనుల్తో కిక్కిరిసి పోయి ఉంది. అమ్మల ముక్కు పుడకలు, చెవి కమ్మలు నా కళ్ళలో మెరుస్తున్నాయ్. ప్రపంచంలోనే అందమైన అమ్మాయి నా పక్కన కూర్చున్నా నేనంత పట్టించుకోపోదును. ఆ సవరల భాషలోనూ, మొహంలోనూ ఉన్నది అనాదికాలాన దేవుడు మనిషికిచ్చిన హృదయ సౌందర్యం.
ఘాటీ అంతగా అలవాటు లేదు నాకు. పక్కన కూర్చున్నవాళ్ళ భాషని కాసేపు గమనిస్తూ ఉన్నాను. ఘాటీ మొదలయ్యాక కన్నార్పకుండా అటూ ఇటూ చూస్తూ ఉన్నాను. ఇంకాసేపటికే వాంతి చేసుకున్నాను. తిరుగు తిరుగు తిమ్మప్ప ఆడినట్టు సిల్వర్ ఓక్ చెట్లన్నీ గుండ్రంగా తిరుగుతున్నాయ్. వాటిమీదికి పాకిన తీగలు వేటివో అప్పటికి తెలీదు. ఈ చెట్ల పేరు అడిగితే సిలువ చెట్లన్నాడు నా పక్కనున్న తాత. ఆ పేరు నిజంగా ఉన్నదీ లేనిదీ తెలీదు. ఆపై మళ్లీ అరకు చేరేదాక నిద్రపోయాను.
అరకులో గుడిసెల్లాంటి కాటేజీలో ఉండాలని కోరికగా ఉండింది. అయిదు వందలన్నారు. అక్కణ్ణుంచి అరకు హరితా హోటల్ దగ్గరే చిన్న హోటల్లో ఉన్నాను. సిగ్నల్ అసలే లేదు. దూరంగా కొండమీద లైట్లు వెలుగుతున్న గూడెం, నేనున్న చోట నుండి వెన్నెల రాసిగా పడ్డట్టు కనిపిస్తోంది. తదేకంగా చూస్తూనే ఉన్నాను. ఆ రాత్రికి హరితాలో అక్కడి పర్యాటకులెవరికోసమో థింసా ఆడించారు. నేనది వినడమే తప్ప చూస్తా అని ఊహించలేదు. అగ్గిరవ్వల్లేసే మంట చుట్టూ ఆనంద పరవశులై వాళ్ళడటం నేను చూసాను. గోడచాటుగా నిక్కి నిక్కి చూసాను. ఆ కంఠాలా, వాయిద్యాలా మూలధ్వని నాకిప్పటికీ గుర్తుంది. ఆ రాత్రికి, నిప్పుకీ కూడా రవికలేదనిపించింది.
***
మరుసటిరోజు ఉదయం సూర్యోదయానికి ముందేలేసాను. చనుకట్టులా ఉన్న కొండలమధ్యలో సూర్యుడు పసిపాపడిలా పాకుతున్నాడు. ఈ ఉదయం నేను చూసి ఉండాల్సింది కాదు. నిన్న సముద్రం దగ్గరే చచ్చిపోవాలనిపించిందుకు అప్రయత్నంగా నవ్వొచ్చింది. ఎదురుచూస్తే దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ఓ కొత్తరోజుని వాగ్ధానం చేయకపోడు.
అరకులో అటూ ఇటూ నడిచాను. అదంతా చిన్న టౌన్ లాగే ఉంది. నేను ఊహించుకున్న సౌందర్యమేదీ ఆ దరిదాపుల్లో లేదు. నిన్న వొచ్చిన దారే ఇంతకంటే బాగుండింది. అలాంటివి చూడాలంటే కాస్త దూరం ప్రయాణించాలని అర్ధమైంది. అరకు మ్యూజియం చూసేందుకు అట్టే సమయం పట్టలేదు. తృప్తిగా లేదు. వొలిసెపూవులుండే కాలమూ కాదు. అప్పటికి చాపరాయి అనే పేరు బాగా పరిచయం. ఎవరినుండి దూరంగా పారిపోయి వొచ్చానో, ఎవరు నన్నిట్లా గది వొదిలి బయట తిరగమన్నారో ఆ అమ్మాయికి చాపరాయి చాలా ఇష్టం. నేనెప్పుడూ పోలేదు. అక్కడికి పోయేందుకని బస్ ఎక్కాను. నిన్న చూసినట్టే ఆ దారి ఆకుపచ్చభూతమై నా వెంటపడుతోంది. నన్ను తరుముకొస్తోంది.
చాపరాయి దగ్గర జనాలెక్కువలేరు. పల్లె వెలుగు వెళ్ళిపోయింది. ఒకరిద్దరు వెదురుకర్రల్లో మాంసం కాల్చేది కనపడింది. ఇంకెవరో కట్టెల మోపు ఎత్తుకుని బీడీ చుట్ట తాగేదీ చూసాను. పొగ నిండి పొగమంచు రోజులుంటే బాగుండనిపించింది. కిందకి దిగిపోతే గోస్తనీ ప్రవాహమూ అంతేం లేదు. అది ఇష్టమైన పక్షి వొదిలేసిపోతే అడవి ఏడ్చే ఏడుపులా ఉంది. అక్కడ కాసేపు తడిసి మనసులోనే ఓ పద్యం రాసుకున్నాను.
ఉండబుద్దికాక నీళ్ళు పారే చోటు నుండి ఎగువకి చాలాదూరం నడిచిపోయాను. ఆ కొత్త ప్రదేశంలో ఇసుకా, నదీ, రాళ్ళు, చెట్ల నీడలు పసిపిల్లల్లా ఆడుకోవడం గమ్మత్తు. కనీసం ఒక్క మనిషీ అటుపక్కగా రాలేదు. ఆ నది నా ఒక్కనికోసమే పారుతున్నట్టు, ఆ ఆడవి నా ఒక్కనికోసమే ఎదురుచూసినట్టు, ఆ పక్షులు నా ఒక్కనికోసమే పాడుతున్నట్టు ఒక ఫీలింగ్. ఆమె పక్కన వొచ్చి కూర్చున్నట్టు ఒక ఊహ ఎన్ని రోజులు వెంటాడిందో చెప్పలేను.
ఆ ప్రయాణంలో రాసిన పద్యాలివి..
*
కనురెప్పవేసాడు కొండపై సూరీడు
చనుబాల ముద్దులో మురిసిపోతూ
కునుకొకటితీసాడు లోయలో సూరీడు
సంపెంగపూవులో ఒదిగిపోతూ
నిదురమానేసాడు ఏటవాలు దారి
ఎక్కడికిపోవాలో తెలియదంటూ
చక్కిలీగింతల్లొ
నవ్వుకుంటూ
ప్రియసఖీ!
ఒడిలోకి తీసుకొనిపో..
*
బుట్టబొమ్మవి నువ్వు ఆడించుతా నిన్ను
వెదురుకొమ్మవి నిన్ను వంచుతాను
సవరపిల్లవి నువ్వు సాధించుతా నిన్ను
నీలగిరి నీ శిఖను మించుతాను
డప్పుకొట్టి నేను వలయాలవలయాల
నిప్పుతునకలు నీలొ రేపుతాను
నిప్పులో నీ రూపు
మాపుతాను
ప్రియసఖీ!
నిదురని వోపుతాను
*
కొసరికొసరీ పూసె వలిసెపూవుల్లేని
కొండలన్నీ తిరిగిచూసినాను.
చేపలాగా తుళ్ళె చాపరాయిజల్లు
ఎండిపోతే యెదని వొంపినాను.
సిలువచెట్టూమీది సినుకుపూలుకోసి
అరకునిండా విసిరి అలసినాను.
సందురుడు కొండపై
యెలిగినాడు.
ప్రియసఖీ!
రాతిరికి రవికలేదు
****
పేరు నందకిషోర్. బి.టెక్ చదివి, తర్వాత రూరల్ డెవలప్మెంట్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాను. గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్ లోని వెనుకబడిన జిల్లాల్లో గ్రామీణాభివృద్ధికి పాటుపడే ఒక స్వచ్చంద సంస్థలో ఉద్యోగం చేసేవాన్ని. ప్రస్తుతం అంధ్రప్రదేశ్‌లో మరొక స్వచ్చంద సంస్థతో కలిసి ప్రభుత్వ విద్యాశాఖలో పనిచేస్తున్నాను. సాహిత్యం అంతగా చదువుకోలేదు. ఏమీ తోచనప్పుడు ఏదన్నా రాసుకుంటాను.
ఒక సంజీవ దేవ్ మళ్లీ జీవం పోసుకున్నారు మీ ట్రావైల్ డైరీస్ లో. వచ్చే సంచిక కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తూ-
ధన్యవాదాలు 🙂
మీ అరకు వేలీ జర్నీయే కాదు, మీరు చెప్పిన విధానం చాలా బావుంది నందకిషోర్ !