నారిసారించిన నవల
-కాత్యాయనీ విద్మహే
9
ఇంతవరకు ఈ నవలలు ప్రధానంగా వ్యక్తి సమస్యలను, వ్యక్తికి కుటుంబానికి మధ్య సంఘర్షణలను భిన్నకోణాలనుండి వస్తువుగా చేసుకున్నవి. మాలతీ చందూర్ నవలారచనా మార్గంలో ఒక మలుపు 1976 లో వచ్చిన కృష్ణవేణి నవల. కృష్ణవేణి ఒక వ్యక్తే. కాని వ్యక్తి గా ఆమె జీవితంలోని ఒడి దుడుకుల సమస్య కాదు ఈ నవలా వస్తువు. ఒక మహిళావిజిలెన్స్ హోమ్ సూపరెండెంట్ గా కృష్ణవేణి అనేక మంది మహిళల జీవితానుభవాలను తనవిగా చేసుకొని అభివృద్ధిచేసుకొన్న ఒక మానవీయ సమాజ నిర్మాణ ఆశయం ఈ నవలకు ఇతివృత్తం. స్త్రీలు ఏ సామాజిక ఆర్ధిక వర్గానికి చెందినవాళ్ళైనా జీవితంలో ఎన్నెన్ని స్థాయిలలో ఎంతెంత హింసను ఎదుర్కొనవలసి వస్తున్నదో చూపింది ఈ నవల. హింసకు లోనవుతున్నవాళ్లనే అంటే బాధితులనే నేరస్థులుగా చూసి శిక్షించబూనుకొనే సామాజిక నీతి విధానాన్ని, చట్టాన్నివిమర్శకు పెట్టింది.
పేకాటకు తాగుడుకు సర్వం తగలేస్తూ భార్యాపిల్లల ఆకలి పట్టించుకోని భర్తను వదిలేసి పిల్లల పోషణకు బతుకుతెరువు మార్గం వెతుక్కొంటూ ఇల్లువదిలిన సుశీల నేరస్థురాలైంది. భార్యాపిల్లల పట్ల బాధ్యత వదిలేసి, వాళ్ళ తిండీ బట్టా మందూమాకు అవసరాలు పట్టించుకొనటం మానేసిఇంకొక స్త్రీ తో సంబంధాలు పెట్టుకొనటానికి సిద్ధంగా ఉన్న ఆమె భర్త సామాజిక హోదాకు ఏ ఇబ్బందీ లేదు. పైగా అతనికి పిల్లనిచ్చి పెళ్ళిచేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రభుత్వం రెండోపెళ్లి చేసుకోకూడదని చట్టమైతే పెట్టింది కానీ మరొక ఆడదానితో సంబంధం పెట్టుకోకుండా ఆపలేకపోతున్నది. భార్యాపిల్లలను తిండిపెట్టకుండా హింసించటం వ్యక్తిగతమైన విషయం అయి కూర్చుందే కానీ నేరంగా పరిగణించబడే సామాజిక నీతి లేదు. పిల్లలకు తిండిపెట్టకుండా వదిలేసే మగవాడి కర్కశత్వం నేరం కాదుకానీ వాళ్ళ ఆకలి తీర్చటానికి రెక్కలైనా ,ఒళ్లయినా, ఒంట్లో రక్తమైనా అమ్ముకొనటానికి సిద్ధపడే మాతృప్రేమ మాత్రం నేరమై శిక్షకు కూడా కారణం అవుతుంటుంది.
జైలుజీవితం వంటి కుటుంబజీవితం, కులకట్టుబాట్లు, ఆడది కావటం వల్ల ఆంక్షలు … వీటిమధ్య ఊపిరాడక స్వేచ్ఛకోసం బయటకు వచ్చి వ్యభిచారం చేసిన గీత నేరస్థురాలు అయింది. ఆమె దగ్గరికి వచ్చిపోతూ ఆనందించిన జడ్జీ వంటి పురుషుల హోదా కాస్తయినా తగ్గలేదు. ఏ నేరానికైతే విజిలెన్స్ హోమ్ లో గీత శిక్ష అనుభవిస్తున్నదో ఆ నేరంలో భాగస్వామి అయిన జడ్జీది ఆ విజిలెన్స్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాగలిగిన స్థితి. బిడ్డ తల్లి అయిన ఒంటరి స్త్రీని పెళ్ళాడి ఆమె చాటున వావి వరుసలతో సంబంధం లేకుండా సవతి కూతురిని కూడా లొంగదీసుకుని అనుభవించగల నీచమానవులకు సమాజంలో చలామణి ఉంటూనే ఉంటుంది. కానీ ఆ మగవాడి దుశ్ఛర్యకు బలిఅయిన ఆరోగ్యం వంటి అమ్మాయిలు ఒంటరులుగా చేయబడి అనివార్యంగా వ్యభిచారంలోకి దిగి నేరస్థులన్న ముద్రను పొందాల్సి వస్తుంటుంది. నిస్సహాయురాలైన అత్యాచారానికి గురయిన ఆడపిల్లకు ఓదార్పు, చేయూత ఇయ్యక పోగా ఒంటరి రహస్య జీవిత శిక్షను విధించగల పరువు ప్రతిష్టల కుటుంబాల అమానవీయత ఒక వైపు. రోడ్డుపక్కన కూరలమ్ముకొనే వాళ్ళను నేరస్థులుగా నిలబెట్టే నెలసరిమామూళ్లు వసూలుచేసే పోలీసు వ్యవస్థ రక్షణలక్షణం మరొకవైపు. ఇలాంటివి ఎన్నో ఇందులో దృశ్యం చేయబడ్డాయి.
ఒకరిని నేరస్థులుగా నిలబెట్టి శిక్షించే వ్యవస్థలో వాళ్ళనలా చేస్తున్న నేర సమాజ మూలాన్ని చూడమంటుంది ఈ నవల. ఆడదానిని అనేకరకాలుగా నిస్సహాయురాలిని చేసి ఆమెను దోచుకొనటానికి, పీడించటానికి అన్ని అవకాశాలు మగవాళ్లకు ఇచ్చిన సమాజంలో అసలు నేరస్థులు ఆ మగవాళ్ళు. వాళ్లకు విశేషాధికారాలు ఇచ్చిన వ్యవస్థ అని రచయిత్రి చెప్పకనే చెప్పింది. జయ-లక్ష్మి అనే నవల ఇదే మహిళా విజిలెన్స్ హోమ్ కేంద్రంగా నడచిన కృష్ణవేణి కొనసాగింపు నవల. ఈ రెండు నవలలు కలిపి చూస్తే స్త్రీల సమస్యల పరిష్కారానికి అమలవుతున్న చట్టాలు, బాధిత స్త్రీల రక్షణకు ఏర్పాటుచేయబడే ప్రభుత్వ సంస్థలు, కృష్ణవేణి వంటి నిబద్ధ ఉద్యోగుల కృషి – ఏవీ సరిపోని ఒక పరిస్థితి గురించి తెలిసి ఆందోళన కలుగుతుంది. అయితే అదే సమయంలో పితృస్వామిక అధికార సమాజ సంస్కృతీ నిర్మాణాలలో సమూలమైన మార్పు గురించిన సమాజంలోనే కాక ప్రభుత్వవిధానాలలోకి చొచ్చుకుపోయిన ద్వంద్వనైతిక విలువల సంస్కృతిని గురించిన ప్రశ్నలు రేకెత్తించిన నవలలు గా వీటికి అనితర ప్రాధాన్యత ఉంది.
మాలతీ చందూర్ నవలలో ‘సద్యోగం’ చెప్పుకోదగ్గ మరొక మంచి నవల. కృష్ణవేణి, జయ-లక్ష్మి నవలలో కృష్ణవేణిని ఉత్సాహవంతురాలు, సమర్ధురాలు అయిన ఒక ఉద్యోగిగా చిత్రించి అంతర్జాతీయ మహిళా దశాబ్దిలో పురుషుడితో సమానంగా తన శక్తిసామర్ధ్యాలను వినియోగంలోకి తీసుకురాగలిగిన వ్యక్తిత్వ చేతన కలిగిన స్త్రీ నమూనాను చూపించిన మాలతీ చందూర్ అదే సంవత్సరం వృత్తిపరంగా ఒక స్త్రీ తనను తాను నిలబెట్టుకొనటానికి, నిరూపించుకొనటానికి చేసిన విజయవంతమైన ప్రయత్నం వస్తువుగా సద్యోగం నవల వ్రాసింది. తండ్రి చాటు బిడ్దగా, అన్నచెట్టు చెల్లెలిగా వాళ్ళు చదవమన్న న్యాయశాస్త్ర విద్య చదివి, వాళ్ళు చేరమన్న లాయర్ దగ్గర జూనియర్ గా చేరిన సుమిత్ర తనకంటూ ఒక వృత్తిపర జీవితాన్ని అభివృద్ధి చేసుకొనాలన్న తపనతో మూడేళ్ళ అనుభవంలో ఎన్ని విషయాలు నేర్చుకొని ఏ స్థాయికి ఎదిగిందో చూపటమే ఈ నవల ఇతివృత్తం. ఆక్రమంలో కోర్టు, నమూనా కేసులు, కేసులవిచారణ, సాక్ష్యాధారాల సేకరణ, లాయర్ ఆఫీస్ వంటి అనేక వివరాలు ఇందులో భాగం అయ్యాయి. గతంలో తనపట్ల పెద్ద నేరం చేసి,అతని బారినుండి బయటపడి తనబతుకు తాను బతకటానికి ప్రయతిస్తున్న తనను వెంటాడి వేధించిన మనిషి ఒకదొంగతనం కేసులో ముద్దాయిగా వచ్చినప్పుడు అతనిని ఎదుర్కొనటానికి ముందు జంకినా వ్యక్తిగత రాగద్వేషాలు వదిలి నిష్పాక్షిక దృష్టితో కేసును పరిశీలించి వాదించగలిగిన స్థిత ప్రజ్ఞతను అలవరచుకొనటం లాయర్ కు ఎంతఅవసరమో సీనియర్ చెప్పిన తరువాత ఆ దిశగా తన వ్యక్తిత్వాన్ని మలచుకొనటంలో ఆమె సాధించిన విజయమే ఆ కేసు గెలవటం. అది ఆమెను సీనియర్ లాయర్ వెంకట్రామన్ షేక్ హ్యాండ్ ఇచ్చి తన వృత్తిపర భాగస్వామిగా సమగౌరవం ఇచ్చే స్థాయికి తీసుకువెళ్తుంది.
ఈ నవలలో మరొక ముఖ్యాంశం కోర్టులో సహోద్యోగులుగా ఉన్న స్త్రీపురుషుల మధ్య స్నేహాలు, సంబంధాలు. స్త్రీలను లైంగిక వస్తువుగా మాత్రమే చూడటానికి అలవాటుపడ్డ సమాజంలో పని స్థలంలో వాళ్ళను సహోద్యోగులు అయిన మనుషులుగా, స్నేహితులుగా చూచే సంస్కారం పురుషులకు అలవడదు. చదువుకొని ఉద్యోగాలకు బయటకువచ్చిన స్త్రీలు కూడా తరచు ఈ విధమైన సంప్రదాయ భావజాలం నిండిన మెదళ్లతోనే ఉంటారు. ఫలితం స్త్రీలను జూనియర్లుగా పెట్టుకొన్న పురుషులాయర్ల అదృష్టం గురించిన ఈర్ష్యలు, వాళ్ళ మధ్య సంబంధాల గురించిన ఊహాపోహలు కోర్టు ఆవరణలో చక్కర్లు కొడుతుంటాయి. ఈ పరిస్థితి మారాలన్నది రచయితగా మాలతీ చందూర్ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా సందర్భాలను , సంభాషణలను నవలేతివృత్తంలో భాగం చేసింది ఆమె. బార్ రూమ్ లో మేరీకి సుభద్రకు మధ్య జరిగిన సంభాషణ అటువంటిదే.వృత్తి పరంగా సుమిత్ర అస్తిత్వం జూనియర్ లాయర్. సీనియర్ వెంకట్రామన్ దగ్గర వృత్తి మెళుకువలు నేర్చుకొని సమర్ధవంతమైన లాయర్ గా ఎదగటం. కానీ కాంతామణి సీనియర్ లాయర్, జూనియర్ లాయర్ అన్న అస్తిత్వాలకు భిన్నంగా పురుషుడు, స్త్రీ అన్న లైంగిక అస్తిత్వాల నుండే తమను చూస్తున్నది అని మేరీ మాటల ద్వారా అర్ధం అయినపుడు సుమిత్రకు కంపరం కలుగుతుంది. అలా సహోద్యోగులను స్త్రీపురుషలని తెలియచెప్పే పద్ధతిని మేరీ శుభ్రంగా ఉన్న మెదళ్లను మురికి చేయటం అంటుంది. పని ప్రదేశంలో స్త్రీ పుషులు ఇద్దరూ ఆ పనికి అవసరమైన శారీరక మేధో సృజన శక్తులను వ్యక్తీకరించగల ఇద్దరు మనుషులుగానే అస్తిత్వంలో ఉంటారుతప్ప, ఉండాలి తప్ప, వాళ్ళ స్త్రీత్వ పురుషత్వాలతో అక్కడ ప్రమేయమే లేదని మాలతీ చందూర్ స్పష్టంగా చెప్పినట్లయింది. పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా విశాఖ కేసు పై సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే కాలానికి (1997) రెండు దశాబ్దాలకు ముందే పని ప్రదేశాలలో స్త్రీ పురుష సంబంధాలను పునర్నిర్వచించుకొనవలసిన అవసరాన్ని గుర్తించి చూపటం ఈ నవలలోని విశిష్టత.
లైంగికత గురించి అభివృద్ధిచేసుకోవలసిన ప్రజాస్వామిక దృక్పథాన్ని ఇతివృత్తంలో విడదీయరాని భాగం చేయటం సద్యోగం నవల మరొక ప్రత్యేకత. ఈ నవలలో లాయర్ సుమిత్ర పదహారు పదిహేడేళ్ల వయసులో అజ్ఞానం తో అవగాహనారాహిత్యం తో ఒక యువకుడిని హీరోగా భ్రమించి అతనితో వెళ్ళిపోయి ఒకటిరెండు నెలల్లో తాను ఊబిలోకి దిగబడుతున్నానని గ్రహించి తప్పించుకొని ఇల్లుచేరిన ఆడపిల్ల. సంప్రదాయ సామాజిక విలువల ప్రకారం శీలం కోల్పోయిన ఆడదిగా సుమిత్ర నిందను,అవమానాన్ని మోస్తూ జీవితకాలం క్రుంగి కృశించాలి. కానీ మాలతీచందూర్ ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో కాలం చెల్లిన ఆ విలువలను త్రోసిరాజని కొత్త విలువల నిర్మాణానికి వీలుగా మనుషుల సంస్కారాలను పునర్నిర్వచించే పనికి పూనుకొన్నది. శీలం, పవిత్రత, శీల రాహిత్యం, శీలంలేని స్త్రీల జీవిత వ్యర్థత్వం మొదలైన అంశాలమీద ఆవేశ పూరిత చర్చలు, సంభాషణలు లేకుండా తల్లిదండ్రులు ఆమెను ఏ ప్రశ్నలు, సందేహాలు లేకుండా ఆదరించి కాపాడుకొనటంలో, చదువు చెప్పించటమే కాక ఆస్తిలో మగపిల్లవాడితో సమానంగా వాటా పెట్టటంలో ఆ సంస్కారమే కనబడుతుంది. అన్న వదిన కూడా ఆమె పట్ల అంత సున్నితంగానే వ్యవహరించగలిగారు. అది సుమిత్ర వ్యక్తిగత, వృత్తిగత అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. కుటుంబాలలో, సమాజంలో ఇది ఆశించదగిన పరిణామం అన్నది రచయిత అభిప్రాయం.
సుమిత్ర గతం తెలిసాక ఆమె పట్ల వెంకట్రామన్ కు ఉన్న గౌరవాభిమానాలు , వాత్సల్యం ఏ మాత్రం తగ్గకపోవడం గమనించదగినది. ఒక స్త్రీ గౌరవాగౌరవాలు, మేధో సృజన సామర్ధ్యాలు లైంగికతను బట్టి నిర్ణయించబడటం అన్యాయం అని తెలిసిన న్యాయవాది అతను. తాను తప్పుచేసిన, వంచనకు గురయిన ఆ కాలాన్ని, మానసిక స్థాయిని, అజ్ఞాన స్థితిని దాటి ఎంతో ఎదిగిన సుమిత్ర ఒకప్పటి తనపొరపాటుకు ప్రేరకుడు, కారకుడు అయినా మనిషి దొంగగా ఎదురుపడితే ఆందోళన పడటం అర్ధం లేని వ్యవహారం అని ఆమెకు సర్దిచెప్పి సమస్యను ఎదిరించి పరిష్కరించుకొనే జీవలక్షణం ఆమెలో పెరగటానికి సహాయపడ్డాడు. ఆ విధంగా స్త్రీ శీలాన్ని గురించిన సంప్రదాయభావనలను త్రోసిరాజని అభివృద్ధిచేసుకోవలసిన ఒక కొత్త చైతన్యాన్ని గురించిన స్పృహను కలిగిస్తుంది సద్యోగం నవల.
1986 లో ప్రచురించబడిన కాంచనమృగం నవలలోనూ లైంగికతకు సంబంధించిన నూతన విలువల ప్రతిపాదనే ప్రధానం అయినా ఇతివృత్తం ఒక డిటెక్టివ్ నవల ధోరణి నిర్మాణంలో ,గతాన్ని పొరలుపొరలుగా ఆవిష్కరిస్తూ ఒక సంపన్నవర్గపు గృహిణి తనకూతురిని అస్తిత్వంలో ఉన్న పితృ స్వామిక లైంగిక నీతికి బలికాకుండా ఎట్లా కాపాడుకున్నదో నిరూపించటంగా విస్తరించింది. స్త్రీపురుషుల మధ్య లైంగిక సంబంధాలు, వాటి పరిణామాలు, ప్రభావాల గురించి సరైన జ్ఞానంలేని సమాజం మీద, అలాంటి జ్ఞానాన్ని ఇయ్యలేని ప్రభుత్వ విధానాలమీద మాలతీ చందూర్ కు ఒక అసంతృప్తి ఉంది. కృష్ణవేణి నవలలో అది కనబడుతుంది. సద్యోగం నవలలో స్త్రీపురుష సంబంధాలను ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా చిత్రించే పత్రికలు, నవలలు మొదలైనవి నవ యవ్వనంలోకి అడుగుపెడుతున్న పిల్లలను ప్రేమ మైకంలోకి ఎలా తీసుకువెళతాయో సూచించిన మాలతీ చందూర్ కాంచనమృగం నవలలో తెలిసీ తెలియని వయస్సులో కుతూహలం కొద్దీ ఏర్పడే లైంగిక సంబంధాల పరిణామాలను- అనూహ్య అవాంఛనీయ గర్భాలు, ఆ విషయం బయటకు పొక్కితే యాగీ అయ్యే జీవితాలు, వాటిని వివేకవంతంగా పరిష్కరించుకొనటానికి ఎవరికీ వాళ్ళు వాళ్ళ పరిధులలో చేసే ప్రయత్నాలు , పరిణామాలు చిత్రించింది. ఇందులో అమ్మాయిని మోసగించాడన్న ఆరోపణ అబ్బాయి మీదగానీ, శీలం కోల్పోయిందన్న అవమానభారం అమ్మాయి మీదకానీ లేకపోవటం విశేషం.
సద్యోగం నవలలో సుమిత్రకు లేని పెళ్లి ఈ నవలలో పంకజానికి వుంది. పరిణామాలు తెలియని ప్రయోగం వాళ్ళ జరిగిన ప్రమాదంగా మాత్రమే గర్భాన్ని చూడాలని, అది ఆమె జీవిత వికాసానికి అవరోధం కాదని నచ్చచెప్పి కూతురిని మామూలు మనిషిని చేసిన తల్లి పెంపకంలో ఆ ప్రమాదాన్ని గురించి చెప్పి అభ్యంతరం లేనివాడినే పెళ్లిచేసుకోవాలన్న సంస్కారం పంకజంలో వికసించటం.. ఆక్రమంలోనే ఆనందకరమైన వైవాహిక జీవితం ఆమెకు లభించటం చూస్తాం. అంతే కాదు, ఈ నవల మాతృత్వానికి సంబంధించి స్త్రీలకు సంకెళ్లుగా తయారైన మూసభావనలను కూడా బద్దలు కొట్టింది. అవాంఛిత గర్భం కారణంగా ఆనాడెప్పుడో పుట్టిన పిల్లవాడు, చచ్చిపోయాడని చెప్పబడ్డ పిల్లవాడు బతికే ఉన్నాడని తెలిసినప్పుడు ‘ఇరవైఏళ్లుగా లేని స్పందన, నేను కళ్ళతో కూడా చూడని ఒక ప్రాణి గురించి ఈ క్షణంలో ఎలావస్తుంది? రాదు’ అని చెప్పింది పంకజం. పంకజం తల్లి తన చంద్రహారాన్ని కానుకగా ఇచ్చిన కుర్రవాడి పుట్టుపూర్వోత్తరాలు అన్వేషిస్తూ వెళ్లి ,అసలు విషయం తెలుసుకున్న ప్రసాద్ కు ఆమె ప్రవర్తన అసహజం గా కనిపించింది. బలవంతపు గర్భం, అవాంఛిత గర్భం అయినా స్త్రీలకు పుట్టిన బిడ్డలపై మమకారం, ప్రేమ ఉండకుండాఉండదు అన్నది అతని నమ్మకం. బిడ్డబ్రతికే ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆమె హిస్టీరికల్ గా అవుతుంది అనుకున్న అతనికి ఆమె ప్రవర్తన అసహజంగా అనిపించటం సహజం. ఇక్కడ ప్రసాద్ దృష్టి లోకానికి ప్రాతినిధ్యం వహించే సగటు మానవదృష్టి. అది మగవాడి దృష్టి అని మాలతీచందూర్ కు తెలుసు.దానికి భిన్నంగా స్త్రీలు ప్రవర్తిస్తే పురుషాహంకారం దెబ్బతింటుంది అని కూడా ఆమెకు తెలుసు. దానిని ఆమె ప్రసాద్ ముఖంగానే విమర్శ, ఆత్మవిమర్శల రూపంలో సాగిన మూర్తితోటి సంభాషణలో భాగం చేసి చూపింది. శీలం, మాతృత్వం మాయపొరలను చీల్చుకొని స్త్రీలు చైతన్యవంతులవుతున్న కాలానికి అనుగుణంగా పురుషులు తమ అధికార అహంకార భావజాలాన్ని వదిలించుకోక తప్పదన్న హెచ్చరిక అందులో ఉంది.
రాగరక్తిమ నవల చిన్నతనంలోనే మేనత్తకు పెంపకం వెళ్లి, పుట్టినింట దౌర్భాగ్యానికి వగచి తోబుట్టువులను వృద్ధిలోకి తీసుకురావటానికి- పెళ్లిని కూడా వాయిదావేసి ఉద్యోగంలో చేరి, బాధ్యత లు నెత్తికెత్తుకుని విజయవంతంగా నెరవేర్చుకున్న అమ్మాయి కథ. జీవితాలను సుఖవంతం చేసుకొనటంలో చదువుకు సంస్కారానికి, వివేకానికి ఉండే ప్రాధాన్యతను, ఆత్మవిశ్వాసం, స్వయంనిర్ణాయకశక్తి ఆడపిల్లల జీవితాలను వెలిగించే తీరును ఈ నవల చిత్రించింది. (అబ్బూరి ఛాయాదేవి, నవలామాలతీయం)
1977 లో ప్రచురించబడిన ఎన్నిమెట్లెక్కినా … నవల ఈ అన్నిటికీ భిన్నంగా మగవాడి జీవితంలోని అసంతృప్తులు, వివాహానికి అవతల ఏర్పరచుకొన్న లైంగిక సంబంధాలు, సంఘర్షణలు, పరిణామాల చుట్టూ అల్లబడింది.
1977 నుండి 1979 వరకు ఆ రెండేళ్లకాలంలో వచ్చిన నవలలో ఏమిటీజీవితాలు? నవల లో అయినా, రెక్కలు – చుక్కలు నవలలో అయినా వస్తువు ప్రేమ లేని పెళ్లిళ్లు, కట్నంకోసం చేసుకొనే పెళ్లిళ్లు. మానసిక సాన్నిహిత్యం లేని దాంపత్యాలు, మనస్సు పనిచేసిన చోట సంబంధాల మాధుర్యాన్ని, మహోన్నతిని అనుభవించాక పూర్వసంబంధాలలో ఇమడలేకపోవటం– ఇవన్నీ మగవాడి వైపు సమస్యలు. అటువంటి భర్తలకు భార్యలుగా స్త్రీలు పడే సంఘర్షణ, చేసుకొనే సర్దుబాట్లు కూడా ఇందులో భాగమే. మొత్తానికి స్త్రీపురుష సంబంధాలలో ఆకర్షణకు, అలవాటుకు మధ్య వ్యక్తి వాంఛకు, వ్యవస్థా ధర్మానికి మధ్య సంఘర్షణను మగవాడి వైపు నుండి చిత్రించిన నవలలు ఇవి. మనసులోని మనసు సినిమా కు సరిపోయే కథ. పెద్దింటి కుటుంబంలో మనుమడికోసం బామ్మ ఎంపికచేసిన వధువు మధ్యతరగతి అభిమానవతి అయిన యువతి అరుణ కేంద్రంగా నడిచే నవల మనసులోనిమనసు. స్వయం వ్యక్తిత్వం లేని వాడితో పెళ్ళిలో తన వ్యక్తిత్వం ఏమైపోతున్నదన్న దిగులు, వంశానికి వారసులను కనిచ్చే జీవిగా తప్ప స్త్రీని మనసు, ఆత్మగౌరవం కల తోటిమనిషిగా చూడలేని బామ్మగారి అధికారం పై అంతరంగ చింతన- ఈ పాత్రలో ప్రధానంగా కనబడతాయి. వాళ్ళెంతటి సంపన్నులైనా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతున్నదంటే ధిక్కరించగల లక్షణం వల్ల పాఠకులను ఆకట్టుకుంటుంది. ఐదారేళ్ళ క్రితం జీ టివి లో సీరియల్ గా వచ్చిన మంగమ్మగారి మనుమరాలు కథకు మూలం ఈ నవలే అనిపిస్తుంది.
*****
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.